12-06-1977 అవ్యక్త మురళి

* 12-06-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

కమల పుష్ప సమానమైన స్థితియే బ్రాహ్మణ జీవితము యొక్క శ్రేష్ఠ ఆసనము.

సదా బ్రాహ్మణ జీవితము యొక్క శ్రేష్ఠ ఆసనమైన కమల పుష్ప సమానమైన స్థితిలో స్థితులై ఉంటున్నారా? బ్రాహ్మణుల యొక్క ఆసనము సదా తమ తోడుగా ఉంటుంది. కావున బ్రాహ్మణులైన మీరందరూ కూడా సదా ఆసనముపై విరాజమానమై ఉంటున్నారా? కమల పుష్ప సమానమైన స్థితి అనగా సదా ప్రతి కర్మేంద్రియము ద్వారా కర్మ చేస్తూ కూడా ఇంద్రియాల యొక్క ఆకర్షణ నుండి అతీతంగా మరియు ప్రియముగా ఉండేవారు. కేవలం స్మృతిలో అతీతంగా మరియు ప్రియముగా ఉండం కాదు. ప్రతి క్షణము యొక్క ప్రతి కర్మ అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉండాలి. దీని యొక్క స్మృతి చిహ్నమే మీ అందరి యొక్క గాయనములో ఇప్పటివరకు కూడా భక్తులు ప్రతి కర్మేంద్రియము యొక్క మహిమలో నయన కమలాలు, ముఖ కమలము, హస్తకమలము అని అంటూ గాయనం చేస్తారు. కావున ఇది ఏ సమయం యొక్క స్థితి యొక్క ఆసనం? ఈ బ్రాహ్మణ జీవితము యొక్క ఆసనం. ప్రతి కర్మేంద్రియము కమల సమానంగా అయిందా? నయనాలు కమలము వలే అయ్యాయా? హస్తములు కమలము వలే అయ్యాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కమలము అనగా కర్మ చేస్తూ కూడా వికారీ బంధనాల నుండి ముక్తులుగా ఉండడం. దేహమును చూస్తూ కూడా కమలము వంటి నయనాలు కలవారు దేహ ఆకర్షణ యొక్క బంధనములోకి రారు. ఏవిధంగా కమలము జలములో ఉంటూ జలము నుండి అతీతముగా అనగా జలము యొక్క ఆకర్షణా బంధనము నుండి అతీతముగా ఉంటుందో అలా వారు అనేక భిన్న భిన్న సంబంధాల నుండి అతీతముగా ఉంటారు. కమలానికి సంబంధాలు కూడా ఎన్నో ఉంటాయి, అది ఒంటరిగా ఉండదు, అది ప్రవృత్తి మార్గానికి గుర్తు. అలాగే బ్రాహ్మణులు అనగా కమల పుష్ప సమానంగా అయ్యే ఆత్మలు ప్రవృత్తిలో ఉంటూ లౌకికములోనైనా అలౌకికములోనైనా బురదలో అనగా తమోగుణ పతిత వాతావరణంలో ఉన్నా కూడా అతీతంగా ఉంటారు. ఏ గుణములైతే రచయితలో ఉన్నాయో అవే మాస్టర్ రచయితలలో కూడా ఉంటాయి. సదా ఈ ఆసనంలో స్థితులై ఉంటున్నారా? సదా తమ ఈ ఆసనమును ధారణ చేసేవారే సర్వబంధనముక్తులుగా మరియు సదా యోగయుక్తులుగా అవ్వగల్గుతారు. పంచ వికారాలు, ప్రకృతి యొక్క ఐదు తత్వాల యొక్క బంధన నుండి ఎంతగా ముక్తులమయ్యాము అని సదా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. లిప్త ఆత్మగా ఉన్నారా లేక ముక్త ఆత్మగా ఉన్నారా?

మీరందరూ బాప్ దాదాతో, అందర్నీ వదలి మీకు చెందినవారిగా అవుతాము, ఏమి చెబితే అది చేస్తాము, ఎలా చేయిస్తే, ఎలా నడిపిస్తే అలా నడుస్తాము అని వాగ్దానము చేశారు. మరి మీ వాగ్దానమును నిలబెట్టుకుంటున్నారా? రోజంతటిలో ఎంత సమయం వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారు, మరి ఎంత సమయము వాగ్దానాన్ని మర్చిపోతున్నారు. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న గీతమును రోజూ గానము చేస్తూ ఉంటారు. మరి అటువంటి స్థితి ఉందా ? లేక ఇంకే ఇతర సంబంధము, స్నేహము, సహయోగము, ప్రాప్తి, వ్యక్తి లేక వైభవము బాబా నుండి దూరం చేసేవిగా ఉన్నాయా? ఎవరైనా వ్యక్తి లేక వస్తువు బంధనముక్త ఆత్మను తన ఆకర్షణ యొక్క బంధనలో బందించడంలేదు కదా? మరి ఇంకెవరూ లేనప్పుడు నిరంతరము బంధనముక్త మరియు యోగయుక్త ఆత్మగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా లేక నోటితో ఇంకెవరూ లేరు అంటూ లోపల ఇంకెవరినైనా ఉంచుకున్నారా? ఎవరైనా ఉన్నారా లేక అన్నీ నమాప్తమైపోయాయా? మరి ఎవరైనా ఉన్నట్లయితే ఆ గీతమును ఎందుకు గానము చేస్తున్నారు? బాప్ దాదాను సంతోషపెట్టేందుకు పాడుతున్నారా లేక అలా అంటూ మీ స్థితిని తయారుచేసుకునేందుకు పాడుతున్నారా? బ్రాహ్మణ జీవితము యొక్క విశేషతను గూర్చి మీకు తెలుసా? బ్రాహ్మణులు అనగా ఆలోచించడం, మాట్లాడడం మరియు చేయడం అన్నీ ఒకేలా ఉండాలి, తేడా ఉండకూడదు. మరి బ్రాహ్మణ జీవితము యొక్క విశేషతను ఎప్పుడు ధారణ చేస్తారు? ఇప్పుడు చేస్తారా లేక అంతిమంలో చేస్తారా? స్వయం యొక్క పురుషార్థానికి బదులుగా సమయంపై వదిలివేసే పిల్లలు కూడా ఉన్నారు. సమయము వచ్చినప్పుడు ఆత్మ స్వయం బలహీనంగా ఉన్న కారణంగా సమయంపై వదిలివేస్తారు. మీ వద్ద కూడా ఎప్పుడైనా, ఎవరైనా మ్యూజియమును చూసేందుకు వచ్చినప్పుడు వారు ఏమంటారు? సమయం దొరికితే వస్తాము, ఇప్పుడు మాకు సమయం లేదు అని అంటారు. ఇవి అజ్ఞానుల యొక్క మాటలు, ఎందుకంటే వారు సమయము యొక్క జ్ఞానము నుండి అజ్ఞానులుగా ఉన్నారు. కాని మీకు ఇప్పుడు ఎటువంటి సమయం నడుస్తోంది అన్న జ్ఞానము ఉంది కదా! ఈ వర్తమాన సమయమును ఏ సమయము అని అంటారు? కళ్యాణకారీ యుగము అనగా కళ్యాణకారీ సమయము అని అంటారు కదా! మొత్తము కల్పమంతటిలో ఇదే సంపాదన యొక్క సమయము, శ్రేష్ఠకర్మ రూపీ బీజమును నాటే సమయము అని అంటారు కదా! ఇది 5,000 సంవత్సరాల యొక్క సంస్కారాల రికార్డును నింపుకొనే సమయము. దీనిని విశ్వకళ్యాణము యొక్క, విశ్వపరివర్తన యొక్క సమయము అని అంటారు కదా! సమయము యొక్క జ్ఞానము ఉన్నవారు కూడా సమయము వచ్చినప్పుడు చేస్తాము అని సమయంపై వదిలివేస్తే ఇక వారికి ఏమనాలి? సమయము కూడా మీ రచనయే. రచన యొక్క ఆధారముపై రచయిత యొక్క పురుషార్థము ఉన్నట్లయితే అనగా సమయము యొక్క ఆధారముపై స్వయం యొక్క పురుషార్థము ఉన్నట్లయితే ఆ రచయితను ఏమంటారు?

శ్రేష్ఠ ఆత్మలైన మీరు సృష్టి యొక్క ఆధారమూర్తులని, ఇటువంటి ఆధారమూర్తులు సమయము యొక్క లేక ఇంకే విషయము యొక్క ఆధారముపై ఉన్నట్లయితే వారిని ఆధారమూర్తులు అని అంటారా లేక ఆధీనులు అని అంటారా? ఇంతకుముందు కూడా బాప్ దాదా ఇది వినిపించారు. సృష్టి యొక్క ఆధారమూర్త ఆత్మ ఏ రకమైన ఆధారముపై నడవడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒక్క బాబా యొక్క ఆధారముపై తప్ప ఇంకే హద్దులోని ఆధారముపై నడిచే ఆత్మనైతే కాను కదా! నాకు ఒకే ఆధారము అని వాగ్దానము చేశారు, కానీ ప్రాక్టికల్ లో ఎలా ఉంది? ఒకే ఆధారము ఉంటే దానికి ప్రత్యక్ష ప్రమాణముగా ఏమనుభవమవుతుంది? ఒకే అవినాశీ ఆధారమును తీసుకొన్నవారు ఈ కలియుగీ ప్రపంచము నుండి అతీతముగా అనుభవం చేసుకుంటారు. ఇటువంటి ఆత్మ యొక్క జీవన నావ కలియుగ ప్రపంచము యొక్క తీరమును వదిలి వెళ్ళిపోతుంది, సదా స్వయాన్ని కలియుగీ - పతిత వికారీ ఆకర్షణ నుండి అతీతముగా ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు. ఏ విధమైన కలియుగీ ఆకర్షణ తనను ఆకర్షించలేదు. సైన్సు ద్వారా భూమి యొక్క ఆకర్షణ నుండి అతీతమైపోతారు, అంతరిక్షములోకి వెళ్ళిపోతారు, అనగా దూరంగా వెళ్ళిపోతారు. ఏ రకమైన ఆకర్షణ అయినా, లేక దేహ సంబంధములు లేక దేహ పదార్థములు ఆకర్షిస్తున్నాయంటే, ఎవరో ఒకరి ఆధారము యొక్క ప్రత్యక్ష ప్రమాణము, అల్పకాలికమైన వినాశీ ఆధారము ఉన్న కారణంగా ప్రాప్తి కూడా అల్పకాలికంగానే ఉంటుంది అనగా అది నశ్వరంగా కొద్ది సమయం కొరకే ఉంటుంది. కాస్త అనుభవమవుతోంది, స్మృతి ఉంటోంది, శక్తి లభిస్తోంది అని కొందరు అంటూ ఉంటారు కదా! శక్తి స్వరూపము యొక్క అనుభవము కల్గుతుంది కానీ, అది సదా ఉండదు. దానికి కారణమేమిటి? తప్పకుండా ఒకే ఆధారానికి బదులుగా ఏదో ఒక హద్దులోని సహాయము యొక్క ఆధారమును తీసుకొని ఉన్నారు. ఆధారమూ కదులుతూ ఉంటుంది మరియు స్వయమూ కదులుతూ ఉంటారు, అనగా అలజడిలోకి వస్తూ ఉంటారు. కావున మీ ఆధారమును పరిశీలించుకోండి. పరిశీలించుకోవడం వస్తుందా? పరిశీలించుకొనేందుకు దివ్యమైన అనగా సమర్థమైన బుద్ధి కావాలి. అది లేకపోతే వివేకవంతులైన ఆత్మల యొక్క సహయోగముతో స్వయాన్ని పరిశీలించుకోండి. బాప్ దాదా బ్రాహ్మణాత్మలందరికీ జన్మ తీసుకోవడంతోనే దివ్యమైన, సమర్థవంతమైన బుద్ధిని మరియు దివ్య నేత్రమును బ్రాహ్మణ జన్మ యొక్క వరదాన రూపములో ఇచ్చారు. బాబా ద్వారా బ్రాహ్మణులందరికీ ఈ బర్త్ డే గిఫ్ట్ ప్రదానము చేయబడింది అని కూడా అనవచ్చు. మరి మీ జన్మదిన కానుకను సంబాళించుకోవడం మీకు వస్తుందా? ఎల్లప్పుడూ ఈ కానుకను సమర్థవంతముగా ఉపయోగించినట్లయితే సదా కమల పుష్ప సమానంగా ఉంటారు. అనగా సదా కమల పుష్ప సమానమైన స్థితి యొక్క ఆసనముపై స్థితులై ఉంటారు. ఏం పరిశీలించాలో అర్థమైందా! సర్వ కర్మేంద్రియాలు ఎంతవరకు కమలము వలే అయ్యాయి? ఈ విధంగా కమల సమానంగా అయ్యేవారు సదా ఆకర్షణ నుండి అతీతంగా అనగా సదా హర్షితంగా ఉంటారు. సదా హర్షితంగా ఉండకపోవడం అనగా ఎక్కడో అక్కడ ఆకర్షితులవుతున్నట్లే. అప్పుడే హర్షితముగా ఉండలేకపోతారు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ బుద్ధి ద్వారా పక్కకు జరపండి. చెప్పడము మరియు చేయడం ఒక్కటిగా చేయండి. కేవలం వాగ్దానం చేసేవారిగా అవ్వకండి. దానిని నిలబెట్టుకునేవారిగా అవ్వండి.  అచ్చా! ..

సదా సర్వ సంబంధాలతో ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అని సదా స్వయాన్ని ఆధారమూర్తిగా భావించేవారికి, సమయము యొక్క ఆధారము నుండి అతీతముగా స్వయాన్ని సమర్థంగా భావిస్తూ నడిచేవారికి, ఇటువంటి సమర్థ ఆత్మలకు, బంధనముక్త ఆత్మలకు, సదా యోగయుక ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా: - పాండవులు మరియు శక్తులు ఇరువురూ యుద్ధ స్థలంపై ఉపస్థితులై ఉన్నారా? యుద్ధము చేస్తూ, విజయమును పొందుతూ ముందుకు వెళుతున్నారా? విజయీ ఆత్మలకు సదా విజయము యొక్క సంతోషము ఉంటుంది. విజయము పొందేవారికి దుఃఖము యొక్క అల ఉండదు. ఓటమిలోనే దుఃఖము ఉంటుంది. విజయీ రత్నాలు సదా సంతోషంగా అనగా హర్షితంగా ఉంటారు. స్వప్నములో కూడా దు:ఖము యొక్క దృశ్యాము రాకూడదు, అనగా దుఃఖము యొక్క అనుభవము కలుగకూడదు. స్వప్నాలలో కూడా దుఃఖము కలుగుతుంది కదా! ఏదన్నా దృశ్వమును చూసినప్పుడు స్వప్నములో కూడా దుఃఖము కలుగుతుంది కదా! స్వప్నాలు కూడా సుఖవంతంగా ఉన్నప్పుడు మరి తప్పకుండా సాకారములో సుఖ స్వరూపులుగానే ఉంటారు కదా! మీరు మీ గుణాలను మహిమ చేసినపుడు సుఖస్వరూపులు.... అని అంటారు కదా! లేక దు:ఖ స్వరూపులు అని కూడా అంటారా? ఆత్మ యొక్క అనాది స్వరూపమే సుఖము అయినపుడు మరి దుఃఖము ఎక్కడినుండి వస్తుంది? ఎప్పుడైతే అనాది స్వరూపము నుండి క్రిందికి వస్తారో అప్పుడు దుఃఖము కల్గుతుంది. కావున దుఃఖము నుండి అతీతంగా అయిపోయినట్లుగా అనుభవం చేసుకుంటున్నారా? ఇతరుల యొక్క దుఃఖమయమైన విషయాలు వింటూ దుఃఖము యొక్క అల రాకూడదు. ఎందుకంటే అసలు ఈ ప్రపంచమే దుఃఖపు ప్రపంచమని మీకు తెలుసు. కానీ మన కొరకు దుఃఖము యొక్క ప్రపంచము సమాప్తమైపోయింది. మనకొరకు ఇది పైకి ఎక్కే కళ యొక్క కళ్యాణకారీ యుగము. కావున సంకల్పములో కూడా దుఃఖపు ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలి. మీ లంగరు ఎత్తివేయబడింది కదా! దుఃఖమునిచ్చే సంబంధీకులు లేక దుఃఖమయమైన పరిస్థితులు ఇంకా తమవైపుకు లాగుతున్నాయంటే ఇంకా కొన్ని త్రాళ్ళు సూక్ష్మంగా మిగిలిపోయాయని అర్థం చేసుకోండి. సూక్ష్మమైన త్రాళ్ళన్నీ తెగిపోయాయా లేక ఇంకా ఏవైనా మిగిలి ఉన్నాయా? వాటికి గుర్తు లేక చిహ్నము ఆకర్షణ యే బందిస్తున్న త్రాళ్ళు ఇంకా ఏవైనా ఉన్నట్లయితే ముందుకు వెళ్ళలేరు. ఇంకా ఇప్పటివరకూ దుఃఖము యొక్క ప్రపంచపు తీరాన్ని వదలకపోతే సంగమ యుగమువారు కాదన్నట్లే కదా! అప్పుడు కలియుగానికి మరియు సంగమ యుగానికి మధ్యలో ఉన్నవారిగా అవుతారు. ఇక్కడివారూ కాదు, అక్కడివారూ కాదు. అటువంటివారి అవస్థ ఎలా ఉంటుంది? కాసేపు అటూ, కాసేపు ఇటూ. బుద్ధికి ఒక లక్ష్యం అనుభవమవ్వదు. అలా భ్రమించడమంటే మీకు ఇష్టమా? మీకు అది నచ్చనప్పుడు మరి దానిని సమాప్తము చేయండి. సదా మీ సుఖ స్వరూపంలో స్థితులై ఉండండి. మాట్లాడినా సుఖమయమైన మాటలే మాట్లాడండి, ఆలోచించినా సుఖమయమైన విషయాలనీ ఆలోచించండి, చూసినా కూడా సుఖమయమైనవాటినే చూడండి. శరీరమును చూసినట్లయితే అది అంతిమ వికారీ తత్వాలతో తయారుచేయబడ్డదే కదా! కావున సుఖ స్వరూప ఆత్మను చూడండి. ఎటువంటి అభ్యాసము కావాలంటే, సత్యయుగ దేవతలకు ఏ విధంగా దుఃఖము అన్న శబ్దమే తెలియదో అలాగే మీకూ తెలియకూడదు. వారిని అడిగితే, అసలు దుఃఖమనేది ఏదైనా ఉంటుందా! అని అంటారు. కావున ఆ సంస్కారాలను ఇక్కడే నింపుకోవాలి. దుఃఖము అన్న శబ్దము యొక్క జ్ఞానము కూడా ఉండనంతగా మీ సంస్కారాన్ని తయారుచేసుకోండి. ప్రాప్తితో పోల్చి చూస్తే అసలు ఈ శ్రమ చాలా స్వల్పమే. రాజ్యము యొక్క సంస్కారాలు తయారవ్వాలి, దానికొరకు ఒక్క జన్మలోని కొన్ని సంవత్సరాలు కష్టపడవలసి వచ్చినా అది ఏమంత పెద్ద విషయం. 5,000 సంవత్సరాల సంస్కారాలను తయారుచేసుకొనేందుకు కొద్ది సమయం శ్రమిస్తారు.

విఘ్నాలు వస్తాయి కానీ అందులో నష్టమేమీ లేదు. ఎందుకంటే అవి వీడ్కోలు తీసుకొనేందుకు వస్తాయి. కానీ అవి ఆగిపోతేనే నష్టముంది. రావాలి మరియు వెళ్ళిపోవాలి. విఘ్నాలను అతిధులుగా చేసి కూర్చోబెట్టుకోకండి. ఇప్పుడు ఎటువంటి పురుషార్థము ఉండాలంటే అవి రావాలి, వెళ్ళిపోవాలి. విఘ్నాలను ఘడియ ఘడియ అతిధులుగా చేసుకున్నా కానీ, వాటికి అది అలవాటైపోతుంది. దీన్ని ఒక ఆధారంగా చేసుకుంటాయి. కావున రాగానే అవి వెళ్ళిపోవాలి. అర్థకల్పము మాయ అతిధిగా ఉంది కదా అని దానిపై దయకలగడం లేదు కదా! ఇప్పుడు ఇక దయ చూపించకండి.

ఇప్పుడు స్మృతి యాత్ర యొక్క అనుభవమును ఇంకా లోతైన రూపంలో చేసుకోగలరు. అందరూ వర్ణన చేస్తారు, స్మృతిలో కూడా ఉంటారు. కానీ స్మృతిలో ఏ ప్రాప్తులైతే కలగాలో ఆ ప్రాప్తుల యొక్క అనుభూతులను ఇంకా ముందుకు పెంచుతూ వెళ్ళాలి. అందులో సమయమును మరియు అటెన్షన్ ఇవ్వవల్సిన అవసరం ఉంది. తద్వారా నిజంగానే అనుభవం యొక్క సాగరంలో మునిగిపోయారని తెలుస్తుంది. ఏ విధంగా పవిత్రత, శాంతి యొక్క వాతావరణము యొక్క అనుభూతి కలుగుతుందో, అలాగే శ్రేష్ఠ యోగులు, లగ్నములో మగ్నమై ఉండేవారు అన్ని అనుభవము కలగాలి. ఇప్పుడు జ్ఞానము యొక్క ప్రభావము ఉంది, ఇక ఇప్పుడు యోగము యొక్క సిద్ది స్వరూపము యొక్క ప్రభావము పడాలి. ఎప్పుడైతే మీకు అనుభవమవుతుందో అప్పుడే అది సంభవమవుతుంది. ఏవిధంగా ఆ సాగరము యొక్క లోతులలోకి వెళతారో అలాగే అనుభవ సాగరము యొక్క లోతులలోకి వెళ్ళండి. రోజూ క్రొత్త అనుభవాలు కలగాలి, కావున స్మృతి యాత్రపై ధ్యానమును ఇవ్వండి.

అంతర్ముఖులై ముందుకు వెళ్ళడము కూడా ఇప్పుడు తక్కువగా ఉంది. సేవ చేస్తూ కూడా స్మృతిలో మునిగి ఉన్నారు అన్న ప్రభావము ఇప్పుడు కలగడం లేదు. సేవ చేస్తున్నారు అన్న ప్రభావము ఉంది, కానీ ఇక నిరంతర యోగులుగా ఉన్నారు అన్నస్థితిలోకి రండి. దీనిపై ధ్వానమును ఉంచాలి అన్న లగ్నములోకి ఇక రండి. ఏదైతే ఎవరూ చేయలేదో దానిని నేను చేయాలి అన్న రేసును చేయండి. స్మృతి యాత్ర యొక్క అనుభవాల రేసును చేయండి. దీని కొరకు ఎవరైతే యోగ శిబిరం చేయిస్తారో వారికి మంచి అవకాశము ఉంది. వారికి ఇంకే డ్యూటీ లేదు, కేవలం ఈ ఒక్క డ్యూటీయే ఉంది. దీని ద్వారా నిర్విఘ్నులుగా సహజముగా అవుతారు, వాతావరణం మారిపోతుంది. అప్పుడు అందరూ తమలోనే బిజీగా ఉంటారు, ఇతరులను చూసేందుకు, వినేందుకు, విఘ్నాలలో బలహీనంగా అయ్యేందుకు సమయమే ఉండదు . ఎటువంటి ప్లానును తయారుచేయాలంటే దాని ద్వారా ప్రతి ఒక్కరూ తమలో తాము నిమగ్నమై ఉండాలి. సాకార అలౌకిక జీవితము యొక్క నషాలోనైనా లేక ప్రాప్తుల యొక్క నషాలలోనైనా అందులోనే లవలీనమై ఉండండి. అసలు అల వ్యాపించేందుకు మీరు వాతావరణంలోకే రాకండి. అచ్ఛా! 

Comments