10-01-1979 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఇప్పుడు వ్యర్థం మరియు భారమును సమాప్తము చేయండి
బాప్ దాదా ఈ రోజు విశేషించి పిల్లల లగ్నాన్ని, స్నేహాన్ని చూసి దీపపు పురుగుల వలె ఎలాంటి లగ్నముతో దీపము(బాప్ దాదా) వద్దకు వచ్చారో చూసి సంతోషిస్తున్నారు. దీపపు పురుగులందరికీ విశేషించి కలుసుకోవాలనే లగన్ ఒక్కటే ఉంది. అందువలన బాప్ దాదా కూడా మిలనము చేసేందుకు సాకార సభలోకి రావాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి పురుషార్థ వేగాన్ని చూసి, ప్రతి ఒక్కరు గమ్యానికి చేరుకునే సంకల్పము చేసి వారి యథాశక్తిగా నడుస్తున్నారని బాప్ దాదాకు తెలుసు. సంకల్పమూ ఒక్కటే, గమ్యము కూడా ఒక్కటే. మార్గదర్శకులు కూడా ఒక్కరే, శ్రీమతము కూడా ఒక్కటే అయినా నంబరు వారుగా ఎందుకున్నారు? మార్గము సహజమైనదే, వర్తమాన స్వరూపం కూడా సహయోగీ స్వరూపమే అయినా వేగములో తేడా ఎందుకు? కొందరేమో నంబరువన్ గా, ఇంకొకరు 16 వేల మాలలో కూడా చివరి మణిగా ఉన్నారు. ఇరువురికి పురుషార్థము చేసేందుకు గల సమయమూ ఒక్కటే, సహచరుడు(తోడుగా ఉన్నవారు) కూడా ఒక్కరే. చివరిలో ఉన్నవారికీ, మొదట్లో ఉన్నవారికీ చదువుకునే స్థానము కూడా ఒక్కటే. శిక్షకుడు కూడా అందరికీ ఒక్కరే, శిక్షణ కూడా ఒక్కటే. ఫస్టులో ఉన్నవారికి స్పెషల్ ట్యూషన్ కూడా ఏదీ లేదు. అయినా ఇంత తేడా ఎందుకు? కారణమేమి? సంగమ యుగంలోని టైటిల్స్ కూడా చాలా గొప్పవి. ఫస్టులో ఉన్నవారికి, చివరిలో ఉన్నవారికి టైటిల్స్ కూడా ఒక్కటే - మాస్టర్ సర్వ శక్తివంతులు, మాస్టర్ జ్ఞాన సాగరులు, త్రికాలదర్శులు మాస్టర్ సర్వజ్ఞులు, అయినా చివరిలో ఎందుకు ఉన్నారు? కులము కూడా అందరిదీ బ్రాహ్మణ కులమే, వంశము కూడా ఒక్క బ్రహ్మకు చెందినవారే, కర్తవ్యం కూడా విశ్వకళ్యాణం చేయడం ఒక్కటే. అయినా తేడా ఎందుకు? అనంతమైన తండ్రి వారసత్వం కూడా ప్రతి ఒక్కరికీ అనంతమైనదే. అనగా ముక్తి-జీవన్ముక్తుల అధికారం అందరికీ సమానంగానే ఉంది. అయినా ఇంత తేడా ఎందుకు? కారణం ఏమిటి?
బాప్ దాదా పిల్లలందరి పురుషార్థాన్ని చూసి ముఖ్యంగా రెండు కారణాలను గమనించారు - ఒకటి - వేస్ట్ అనగా వ్యర్థంగా పోగొట్టుకోవడం, రెండవది అధిక భారము అనగా బరువు. ఎలాగైతే ఈ రోజులలో శారీరిక రోగాలకు కారణం అధిక బరువో, అన్ని రోగాలకు నివారణ బరువును తక్కువ చేసుకోవడమో అలా పురుషార్థ వేగం లాస్ట్(చివరి) మరియు ఫస్ట్(మొదటగా) ఉండటానికి కారణం కూడా బరువు తగ్గించుకోకపోవడం. ఏ విధంగా శరీరం బరువు ఎక్కువగా ఉంటే స్వతహాగానే రోగాలు ఉత్పన్నమవుతాయో అలా ఆత్మలోని భారము వలన ఆత్మిక రోగాలు కూడా స్వతహాగానే ఉత్పన్నమవుతాయి. ఎలాగైతే శరీర భారము పెరగడానికి మొదట కారణం కుళ్లిపోయిన పదార్థాలు అని అంటారో అలా ఇక్కడ కూడా పాడైపోయిన పనికిరాని వస్తువులు అనగా గడిచిపోయిన విషయాలు ఏవైతే ఆలోచించరానివో అనగా తినకూడనివి అలా పనికిరాని విషయాలను బుద్ది ద్వారా స్వీకరిస్తారు అనగా ప్రతీ ఆత్మలోని లోపాలు లేక అవగుణాలను స్వయంలో ధారణ చేయడం. వీటిని కూడా కుళ్లిపోయిన, పాసిపోయిన పదార్థాలని అంటారు. నూనెలో వేయించిన వస్తువులు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. తమవైపు చాలా ఆకర్షిస్తాయి కూడా. వద్దనుకున్నా కొద్దిగా తినేస్తారు. ఎంత ఆకర్షిస్తూ ఉంటాయో, అంత నష్టము కలిగించేవిగా కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ ఆకర్షించే వస్తువులు అనగా ఒకరు ఇంకొకరి ద్వారా వ్యర్ధ సమాచారము వినడం మరియు వినిపించడం. రూపం ఆత్మిక సంభాషణ చేసే విధంగా ఉంటుంది. ఇచ్చి పుచ్చుకునే విధంగా ఉంటుంది. కానీ దాని ఫలితం ఒకరి పట్ల ఒకరికి అసహ్య దృష్టి వస్తుంది. వినోదమని, మనోరంజనమని అనుకుంటారు కానీ అనేకమంది మనసును దు:ఖపెడ్తారు. కావున బాహ్య రూపం ఆకర్షించేదిగా ఉంటుంది కానీ ఫలితం క్రింద పడేయడం. ఇలాంటి విషయాలను బుద్ధి ద్వారా ధారణ చేయడం అనగా స్వీకరించడం. ఈ కారణంగా భారం పెరిగిపోతుంది. ఎలాగైతే శారీరిక బరువు పెరిగితే పరుగెత్తలేరో, పైకి ఎక్కాలంటే ఎక్కలేరో అలా ఇక్కడ కూడా పురుషార్థంలో తీవ్రగతిని ప్రాప్తి చేసుకోలేరు(తీవ్ర పురుషార్థం చేయలేరు). ప్రతి అడుగులో ఉన్నతమయ్యే కళ అనుభవం చేయలేరు. బరువు ఎక్కువగా ఉన్నవారు ప్రతి స్థానంలో ఇమడలేరు(సెట్ కాలేరు). బరువు ఎక్కువగా ఉన్నవారు నడుస్తూ నడుస్తూ ఒకటేమో ఆగిపోవాల్సి ఉంటుంది, రెండవది ఇంకొకరి ఆధారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇదే విధంగా పురుషార్థంలో నడుస్తూ నడుస్తూ అలసిపోతారు అనగా విఘ్నాలకు వశమైపోతారు. వాటిని దాటుకోలేరు. జత జతలో ఎవరో ఒక ఆత్మను తోడు చేసుకొని నడుస్తారు. తండ్రి సహాయమైతే అందరికీ లభించింది కానీ వీరు వేరే ఆత్మలను ఆధారంగా చేసుకొని నడుస్తారు. ఆత్మల తోడు లభించకపోతే అనగా సహకారము లభించకపోతే కొద్దిగా కూడా నడవలేరు.
ప్రతిసారి సహాయం లభిస్తేనే ముందుకు వెళ్తాము, అవకాశం లభిస్తే ఎవరైనా ముందుకు తీసుకెళ్లే వెళ్తాము అని అంటూ ఉంటారు. ఎందుకంటే స్వయం భారంగా ఉన్న కారణంగా, ఇతరుల సహాయము ద్వారా తమ భారాన్ని తేలికగా చేసుకోవాలని అనుకుంటారు. అందువలన బాప్ దాదా కూడా భారాన్ని తగ్గించుకోండి అని చెప్తారు. దీనికి సాధనము - ఎలాగైతే శరీరము బరువు తగ్గడానికి సాధనం వ్యాయామమో అలా ఆత్మిక వ్యాయామము(ఎక్సర్ సైజ్) అనగా యోగభ్యాసం ద్వారా ఇప్పుడిప్పుడే కర్మయోగి అనగా సాకార స్వరూపధారి అయ్యి సాకార సృష్టిలో పాత్రను అభినయించడం. ఇప్పుడిప్పుడే ఆకారి ఫరిస్తాగా అయ్యి ఆకారీ వతనవాసి అవ్యక్త రూపాన్ని అనుభవం చేయడం. ఇప్పుడిప్పుడే నిరాకారిగా అయ్యి మూలవతన వాసిగా అనుభవం చేయడం. ఇప్పుడిప్పుడే తమ రాజ్యము, స్వర్గము అనగా వైకుంఠవాసులుగా అయ్యి దేవతా రూపమును అనుభవం చేయడం. ఇలా బుద్ధి ద్వారా వ్యాయామము చేస్తూ ఉంటే సదా తేలికగా ఉంటారు, భారము సమాప్తమైపోతుంది. పురుషార్థ వేగము తీవ్రమవుతుంది. సహాయం తీసుకునే అవసరముండదు. సదా తండ్రి తోడు అనగా చత్రఛాయలో ఉన్నట్లు అనుభవం చేస్తారు. పరుగులు తీయడానికి బదులుగా హైజంప్ చేసేవారిగా అయిపోతారు. కావున ఒక సాధనము వ్యాయామము (ఎక్సర్ సైజ్). రెండవది ఆహార పానీయాల పథ్యం చేయండి. బుద్ధి ద్వారా ఎలాంటి అశుద్ధమైన వస్తువును స్వీకరించడం అనగా ధారణ చేయడం - వీటి పథ్యం ఉండండి. పాడైపోయినవి, నూనెలో వేయించిన వస్తువులను స్వీకరించకండి అని వినిపించాను. రెండవది - వ్యర్థం చేయకండి. వ్యర్థం ఎందుకు చేస్తారు? ఏ వస్తువు ఎంత విలువ కలిగినదో దానిని అలా ఉపయోగించకపోవడం - దీనిని కూడా వ్యర్థం లేక వృథా అని అంటారు. తండ్రి ద్వారా ఈ సమయంలో సంగమయుగ ఖజానా లభించింది. సంగమయుగములో ఒక్క సెకండు అనేక పదమాల (కోటాను కోట్లతో) విలువ గలది. ఒక్క సెకెండునైనా స్వయం పట్ల గాని, సర్వుల పట్ల గాని పదమాలతో సమానమైన విలువ కలిగినదిగా ఉపయోగించకపోతే ఇది కూడా వ్యక్తం చేసినట్లే అనగా ఎంత విలువైనదో అంత జమ చేసుకోలేదు. ప్రతి సెకండుకు కోటాను కోట్ల సంపాదన చేసుకునే వరదానం డ్రామాలో సంగమయుగ సమయానికి లభించింది. ఇటువంటి వరదానాన్ని స్వయం పట్ల జమ చేసుకోక, ఇతరులకూ దానం చేయకుంటే దీనిని కూడా వ్యర్థమని అంటారు. మేము ఎలాంటి పాపము చేయలేదు కదా! ఎలాంటి తప్పు చేయలేదు కదా! అని భావించకండి కానీ సమయము యొక్క లాభాన్ని తీసుకోకపోవడం కూడా వ్యర్థమే అవుతుంది. లభించిన వరదానాన్ని మీరూ ప్రాప్తి చేసుకోలేదు, ఇతరులతో చేయించలేదు. కనుక దీనిని కూడా వేస్ట్ అనగా వ్యర్థం అని అంటారు. ఇదే విధంగా సంకల్పము కూడా ఒక ఖజానా, జ్ఞానం కూడా ఒక ఖజానా, స్థూల ధనాన్ని కూడా ఈశ్వరార్థము సమర్పణ చేసినట్లయితే ఒక్క పైసా ఒక్క రత్నంతో సమానమైన విలువ కలిగినదిగా అవుతుంది, ఈ ఖజానాలన్నిటిని స్వయం పట్ల లేక సేవ పట్ల కార్యములో ఉపయోగించకున్నా దానిని కూడా వ్యర్థమనే అంటారు. ప్రతి సెకండు స్వ కళ్యాణము లేక విశ్వ కళ్యాణము పట్ల ఉపయోగించాలి. ఇలా అన్ని ఖజానాలను బాబా దేని కొరకు ఇచ్చారో, ఆ కార్యంలో వినియోగిస్తున్నారా! చాలామంది పిల్లలు మేము మంచీ చేయలేదు, చెడూ చేయలేదు అని అంటారు. అది ఏ ఖాతాలోకి వెళ్తుంది? విలువ ఉంచలేకపోవడం కూడా వ్యర్థమనే అంటారు. ఈ కారణంగా పురుషార్థ వేగం తీవ్రం అవ్వడం లేదు. ఈ కారణంగానే నంబర్ వారిగా అయిపోతారు. ఇప్పుడు నంబర్ వారుగా తయారవ్వడానికి కారణం ఏమిటో అర్థమయిందా! భారము మరియు వ్యర్థం. ఈ రెండు విషయాలను సమాప్తి చేసినట్లయితే ఫస్ట్ డివిజన్లోకి వచ్చేస్తారు. లేకుంటే ఎక్కువ భారము కలిగి ఉన్నవారు వేచి ఉండాల్సి వస్తుంది. ఫస్ట్ రాజ్యంలోకి రావడానికి బదులుగా సెకండ్ రాజ్యంలోకి రావలసి వస్తుంది. ఎదురు చూడడం ఇష్టమా.....? లేక సీటు తీసుకోవడం ఇష్టమా....? ఇప్పుడేం చేస్తారు. డబల్ లైట్ గా అయిపోండి. మంచిది.
సదా ఫరిస్తా సమానంగా, తేలికగా ఉండేవారికి, ప్రతి ఖజానాను సదా స్వయం పట్ల లేక సర్వుల పట్ల కార్యంలో వినియోగించేవారికి లేక సదా తండ్రి తోడును అనుభవం చేస్తూ సహజయోగీ జీవితాన్ని తమదిగా చేసుకునేవారికి - ఇటువంటి తీవ్ర పురుషార్థీ పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీ, దీదీలతో- మహారథులు అనగా బరువు లేనివారు అనగా తేలికగా ఉండువారు. ఇలాంటి మహారథులు ఎల్లప్పుడూ ఎగిరే ఫరిస్తాల సమానంగా కనిపిస్తారు. వీరు జ్ఞాన ఫరిస్తాలు. జ్ఞానము మరియు విజ్ఞానమనే రెండు రెక్కలు కలిగిన ఫరిస్తాల స్థానము ఫరిస్తాన్. ఫరిస్తాన్ అని దేనినంటారు? స్వర్గాన్ని కూడా ఫరిస్తాన్..... అని అంటారు. ఇప్పుడు కూడా ఈ స్థూల స్థానానికి అతీతంగా ఉన్న స్థానము ఫరిస్తాన్...... ఏది? హృదయ సింహాసనము. అన్నింటికంటే గొప్పకంటే గొప్పది హృదయ సింహాసనము కావున హృదయ సింహాసనాధికారులు అనగా ఫరిస్తాన్ లో ఉండే ఫరిస్తాలు. వీరినే ఫరిస్తాన్ లోని ఫరిస్తాలని అంటారు. ఎల్లప్పుడూ ఉండే స్థానము హృదయ సింహానమైనప్పుడు సింహాసనము నుండి క్రిందికి దిగి రాలేరు. సింహాసనము నుండి క్రిందికి దిగి రావడం అనగా బాబా సన్ముఖములో ఉండటానికి బదులుగా దూరమగుట. ఎలాగైతే బాబా ఎల్లప్పుడూ పిల్లలకు సన్ముఖంలో ఉంటారో, అలా పిల్లలు కూడా సదా తండ్రి సన్ముఖములో ఉంటారు. తండ్రికి సన్ముఖంలో ఎవరుంటారు? పిల్లలు. భక్తులు దూరంగా ఉంటారు. పిల్లలు సదా ఎదురుగా ఉంటారు కావున వీరిని ఫరిస్తాన్ లోని పరియాలని(దేవ కన్యలని) అంటారు. వీరి సమూహము కూడా ఉంటుంది(సంఘటన). జత జతలో ఎగురుతూ ఉంటారు. ఎక్కడకు కావాలంటే అక్కడకు ఎగురుతూ చేరుకుంటారు. ఏ ఆధారమూ అవసరము లేదు. కనుక ఎప్పుడు కావాలంటే, ఎక్కడకు కావాలంటే అక్కడకు ఎగరగలిగే ఫరిస్తాన్ లోని పరియాలనే మహారథులని అంటారు. మహారథుల స్థితికి స్మృతిచిహ్న చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రతి గోపికతో పాటు గోపీవల్లభుని చిత్రాలు కూడా చూశారు కదా! ప్రతి గోపిక నోటి నుండి నా గోపీవల్లభుడు అనే మాటే వెలువడుంది. కావున ఎల్లప్పుడూ ఇలా తోడుగా ఉన్న చిత్రమే స్థితికి స్మృతిచిహ్న చిత్రము. ఒకరికొకరు వేరుగా ఉండరు. సదా తోడుగానే ఉంటారు. తండ్రిపై ప్రతి ఒక్కరికీ పూర్తిగా అధికారముంది. ఈ చిత్రము ఎటువంటి అధికారులదంటే ఎవరైతే ఎల్లప్పుడూ తండ్రిని తమ సాథీగా చేసుకున్న వారిది. ఇది మహారథుల స్థితిని చూపించే చిత్రము. మహారథులనగా సదా జతలో ఉండేవారు. ఇది తోడును నిభాయించే చిత్రము. మహారథులు తప్ప ఇతర ఆత్మలు అప్పుడప్పుడు సన్ముఖంలో ఉంటారు, అప్పుడప్పుడు దూరమవుతూ ఉంటారు. సదా తోడును అనుభవం చేయలేరు. అప్పుడప్పుడు బాబాను తోడుగా ఉంచుకుంటారు, అప్పుడప్పుడు తోడును వదిలేస్తారు. అందువలన ఈ స్మృతి చిహ్నాలు వారివని అనరు.
మహారథులు పురుషార్థం కొరకు ఏదైనా చాలా రిఫైన్ గా ఉండే కొత్త పద్ధతిని కనుగొన్నారా? సంకల్పం చేస్తూనే జరిగిపోవాలి - దీనినే రిఫైన్ అని అంటారు. సాధన తక్కువ, సిద్ధి ఎక్కువగా లభించే సహజ సాధనాన్ని కనుక్కోండి. ఎలాగైతే ఈ రోజుల్లో సైన్స్ వారు దు:ఖం తక్కువగుటకు ఏ కార్యం చేస్తారో, అది ఎక్కువగా సఫలమయ్యేటట్లు కొత్త సాధనాలు కనుగొంటున్నారో అలా పురుషార్థం చేయుటకు సహజ సాధనాలను తమ అనుభవం ఆధారంతో కనుక్కోండి. ఎలాగైతే సైన్స్ సాధనాలు సెకండులో విధిని నిర్వర్తిస్తాయో అలా ఈ సైలెన్స్ సాధన సెకండులో విధిని ప్రాప్తి చేయించాలి. తండ్రి జ్ఞానమునిస్తారు. కానీ సైన్స్ ప్రయోగశాలలో అన్నీ నూతన సాధనాలను ఎలాగైతే ఆచరణలోకి తెస్తారో అలా పిల్లలైన మీరు కూడా ప్రయోగంలోకి తీసుకురావాలి. ప్రయోగంలోకి తీసుకొచ్చే సాధనాలు అనగా అనుభవంలోకి తెచ్చే సాధనాలు. వాటిలో శ్రమ తక్కువ, అనుభవం ఎక్కువగా అయ్యే ఏదైనా సహజ సాధనాన్ని వినిపించండి. నలువైపులా ఉన్న వాతావరణం, నలువైపులా ఉన్న బలహీన ఆత్మల సమాచారమనుసారము అటువంటి సాధనాన్ని కనుక్కోండి, ఎటువంటి జబ్బో అటువంటి మందు కనుక్కుంటారు. కనుక నలువైపుల నుండి లభిస్తున్న సమాచారమసారము అటువంటి సాధనాన్ని కనుక్కోండి, ప్రాక్టికల్ గా చేసి చూపించండి. ఇప్పుడు మహారథులు ఇలాంటి కొత్త సాధనాన్ని కనుక్కోవాలి. ఇలాంటి పరిశోధించే గ్రూపు అని అనబడే గ్రూపు ఉండాలి. ఇప్పుడు మహారథులు ఏమి చేయాలో అర్థమయ్యిందా. తర్వాత మీ కార్యవ్యవహారాలు కూడా తేలికైపోతాయి.
ఎలాగైతే మొట్టమొదట మౌనవ్రతం పెట్టినపుడు అందరూ ఫ్రీగా అయిపోయారు. సమయము పొదుపయింది(మిగిలిపోయింది). కనుక అలాంటి సాధనాన్ని ఏదైనా కనుక్కోండి. దీనిలో అందరి సమయము పొదుపవ్వాలి. మనసు మౌనంగా ఉండాలి, వ్యర్థ సంకల్పాలు రానే రాకూడదు. ఇది కూడా ఎలాగైతే నోటి ద్వారా శబ్దము రాదో(మాట్లాడరో) అలా వ్యర్థ సంకల్పాలు రాకుండా ఉండాలి. ఇదే మానసిక మౌనము. అప్పుడు వ్యర్థం సమాప్తమైపోతుంది. సమయమంతా మిగిలిపోతుంది. తర్వాత మరలా సేవ ఆరంభమవుతుంది. మానసిక మౌనం ద్వారా కొత్త పరిశోధనలు(సాధనాలు) వెలువడ్డాయి. ఎలాగైతే ఆదిలో మౌనం పెట్టుకోవడం వలన కొత్తగా సేవ జరిగింది. అలాగే ఈ మానసిక మౌనం ద్వారా కొత్త సేవ జరుగుతుంది. కనుక ఇప్పుడు మొదట ఎవరు నిమిత్తమవుతారు? మహారథుల గ్రూపు. తండ్రి ద్వారా ఏవైతే యుక్తులు లభిస్తూ ఉంటాయో వాటిని ప్రయోగం చేయు రూపంలోకి తీసుకురండి. ఆ విధానము అందరికీ రాదు. వర్ణించడం వచ్చు కానీ ఆ సాధనంతో సిద్ధిని ప్రాప్తి చేసుకునే ప్రయోగం చేయడం రాదు. అందువలన యోగం కూడా కుదరదు. కావున సహజంగా విధి ప్రాప్తించే విధంగా ప్లాను తయారు చేయండి. మంచిది.
Comments
Post a Comment