09-03-1981 అవ్యక్త మురళి

09-03-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

శ్రమను సమాప్తం చేసి నిరంతర యోగులు కండి.

ఈరోజు హృదయాభిరాముడైన(దిల్ వాలా) తండ్రి తన పిల్లల హృదయపూర్వక లగన్ ని చూసి హర్షిస్తున్నారు. ఈ రోజు హృదయాభిరాముడైన తండ్రి మరియు ప్రియమైన పిల్లల కలయిక. పిల్లలు సన్ముఖంలో ఉన్నా, శరీరముతో దూరంగా ఉన్నా హృదయానికి సమీపంగానే ఉన్నారు. దూరంగా ఉన్న పిల్లలు కూడా తమ హృదయపూర్వక లగ్నము ద్వారా హృదయాభిరాముడైన తండ్రికి సన్ముఖంలోనే ఉన్నారు. ఇటువంటి మనోహరమైన పిల్లలు ఎవరి మనసులో అయితే "బాబా, బాబా" అనే పాటే మ్రోగుతూ ఉంటుందో - అంతము లేని పాట(నాన్ స్టాప్), ఆగిపోయే పాట కాదు - ఇటువంటి పిల్లలు ఇప్పుడు కూడా తండ్రి నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు. వారికి కూడా బాప్ దాదా విశేషంగా ప్రియమైన స్మృతులను బదులుగా తెలుపుతున్నారు. పిల్లలందరూ హృదయాభిరాముడైన తండ్రి హృదయ సింహాసనాధికారులే. అయినా నంబరు వారుగా అని అంటారు కదా. ఉదాహరణానికి అందరూ మాలలోని మణులే అయినా మొదటి 8 మణులెక్కడ, పదహారు వేలలోని చివరి మణి ఎక్కడ? రెండిటిని మణులే అని అంటారు కాని రెండిటికి చాలా తేడా ఉంది. ఈ నంబరుకు ఆధారమైన ముఖ్య స్లోగన్ - "పవిత్రులు కండి, యోగులు కండి.” మొదటి రకము సదా యోగములో ఉండే యోగులు. రెండవ రకము - యోగము జోడించే యోగులు. మూడవ రకము - యోగము ద్వారా విఘ్నాలను తరిమేయుటకు, పాపాలను నిర్మూలించుకునే శ్రమలో ఉండేవారు. ఎంత శ్రమ చేస్తే అంత ఫలము పొందేవారు.

ఈ రోజులలో రాజులే లేరు. ద్వాపర యుగము ప్రారంభములో సతోగుణీ భక్తి చేసే సమయంలోని మాట. ఇలా మొదటి రకము పిల్లలు స్వతహాగా యోగీ జీవితములో ఉంటారు. వారి ప్రాప్తుల భండారము వారసత్వం ఆధారంతో సదా నిండుగా ఉంటుంది. ఈ రోజు సుఖమివ్వండి, ఈ రోజు శాంతినివ్వండి అని శ్రమ చేయరు. సంకల్పమనే బటన్ వత్తిన వెంటనే ఖజానా తెరచుకుంటుంది. సదా సంపన్నంగా ఉంటారు అనగా యోగయుక్తంగా ఉంటారు అనగా యోగము జోడింపబడే ఉంటుంది.

రెండవ నంబరు - యోగము జోడించేవారు. వీరు ఈనాటి వ్యాపారుల వలె ఉంటారు. ఒకప్పుడు చాలా సంపాదిస్తారు, ఒకప్పుడు తక్కువగా సంపాదిస్తారు. అయినా ఖజానాలేమో ఉంటాయి. సంపాదిస్తున్నాననే నషా ఉంటుంది, సంతోషము కూడా ఉంటుంది. కాని నిరంతరం ఏకరసంగా ఉండదు. ఒకసారి చూస్తే చాలా సంపన్న స్వరూపంగా ఉంటారు, ఒకసారి ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే సంకల్పము శ్రమలోకి తెస్తుంది. సదా సంపన్నంగా, సదా ఏకరసంగా ఉండరు. సదా స్వయంతో సంతుష్టంగా ఉండరు. వీరు యోగం జోడించేవారు అనగా తెగిపోతూ ఉంటే జోడిస్తూ ఉంటారు.

మూడవ రకము - ఈ రోజులలోని ఉద్యోగస్తుల వలె ఉండేవారు. సంపాదించడం, తినేయడం. ఎంత సంపాదిస్తే అంత సుఖంగా తినేవారు. వీరికి స్టాకు జమ కాదు. అందువలన సదా సంతోషంగా నాట్యము చేయువారుగా ఉండరు. శ్రమ చేయుట వలన అప్పుడప్పుడు వ్యాకులపడుతూ, అప్పుడప్పుడు సంతోషిస్తూ ఉంటారు. ఈ విధంగా పిల్లలు మూడు రకాలుగా ఉన్నారు. 

తండ్రి చెప్తున్నారు - అందరికీ వారసత్వంగా సర్వ ప్రాప్తుల ఖజానా లభించింది. అధికారులు న్యాచురల్ యోగులు, న్యాచురల్ స్వరాజ్య అధికారులు. తండ్రి ఖజానాకు బాలక్ సో మాలిక్ అనగా పిల్లలైనందున యజమానులు. అందువలన ఇంతగా ఎందుకు శ్రమ చేస్తున్నారు? మాస్టర్ రచయితలు నౌకర్ల వలె శ్రమ చేయడం ఎందుకు? ఎలాగైతే వారు 200 సంపాదిస్తే 200 తినేస్తారో, 2 వేలు సంపాదిస్తే 2 వేలు తినేస్తారో, అలా 2 గంటలు యోగం జోడించి, రెండు గంటలు దాని ఫలం తీసుకుంటారు. ఈ రోజు 6 గంటలు యోగం చేశాను, ఈ రోజు 4 గంటలు యోగం చేశాను - ఇలా ఎందుకంటారు? వారసులెప్పుడూ రెండు రోజుల రాజును, 4 రోజుల రాజును అని అనరు. సదా తండ్రి పిల్లలు కనుక సదా ఖజానాలకు యజమానులే. ఒకవైపు బాబా అని అంటున్నారు, రెండవ వైపు స్మృతి చేయుటకు కష్టపడుతూ ఉన్నారు. ఈ రెండు విషయాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక సదా ఈ స్లోగన్ గుర్తుంచుకోండి - “నేను ఒక శ్రేష్ఠమైన ఆత్మను, బాలక్ సో మాలిక్” ను(బాలకుని నుండి యజమానిని). అన్ని ఖజానాలకు అధికారిని, పోగొట్టుకోవడం - పొందుకోవడం, పోగొట్టుకోవడం - పొందుకోవడం ఈ ఆట ఆడకండి ఏదైతే పొందాలో అది పొందారు. మరలా పోగొట్టుకోవడం, పొందుకోవడం ఎందుకు? లేకుంటే ఈ పాటను పొందుకుంటున్నాను, పొందుకుంటున్నాను................ అని మార్చేయండి. అనగా ఇవి అధికారుల మాటలు కావు. మీరు సంపన్న తండ్రి పిల్లలు, సాగరుని పిల్లలు. ఇప్పుడేం చేస్తారు? నిరంతర యోగులుగా కండి. మనమెవ్వరిమి? మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతామా? లేక క్షత్రియుల నుండి దేవతలుగా అవుతామా? పిల్లల కష్టము చూసి బాప్ దాదాకు జాలి కలుగుతుంది. రాజా పిల్లలు, నౌకరీ చేయడం! ఇదేమైనా శోభిస్తుందా? అందరూ యజమానులుగా అవ్వండి.

ఈ రోజు కేవలం పార్టీలనే కలుసుకోవాల్సి ఉంది. కాని మురళి ఎందుకు నడిపించారు? దీనికి కూడా రహస్యం ఉంది. ఈ రోజు చాలామంది మహావీర పిల్లలు బాబాను ఆకర్షిస్తున్నారు. బాప్ దాదా ఈ రోజు వారిని సన్ముఖంగా ఉంచుకొని మురళి నడిపిస్తున్నారు. దేశ విదేశాలలోని మహావీర పిల్లలు చాలా మంది స్మృతి చేస్తున్నారు. బాప్ దాదా కూడా ఇటువంటి సేవాధారీ, ఆజ్ఞాకారీ, స్వతహా యోగీ పిల్లలకు విశేష స్మృతులు తెలుపుతున్నారు.

మధువన నివాసులు మరియు విదేశీ పిల్లలు ఎవరైతే చాలా స్నేహముతో ఛాత్రకులై మురళి వినుటకు సదా అభిలాషతో ఉంటారో, అటువంటి సేవాధారీ, ప్రేమ భరిత లవ్లీన్ పిల్లలకు కూడా బాప్ దాదా విశేషంగా యాద్ ప్యార్ ఇస్తున్నారు. మధువన నివాసులు కొంతమంది క్రింద కూర్చున్నారు, కాని బాప్ దాదా కనుల ముందే ఉన్నారు. ఇటువంటి అథక్ సేవాధారి పిల్లలకు విశేషమైన ప్రియస్మృతులు. జత జతలో ఎదురుగా కూర్చొని ఉన్న లక్కీ సితారాలకు కూడా విశేష యాద్ ప్యార్ మరియు నమస్తే. 

బెంగాల్, బీహార్, నేపాల్ జోన్ సోదరీ - సోదరులతో వ్యక్తిగత మిలనము - మురళీనైతే విన్నారు. ఇప్పుడు విన్న దానిని స్వరూపంలోకి తెచ్చుకోవాలి. ఒకటేమో స్మృతిలోకి తెచ్చుకోవడం, రెండవది స్వరూపంలోకి తెచ్చుకోవడం. విన్నదానిని స్మృతిలోకైతే అందరూ తెచ్చుకుంటారు. అజ్ఞానులు కూడా విన్నదానిని గుర్తుంచుకుంటారు. కాని జ్ఞానానికి అర్థమే స్వరూపంలోకి తెచ్చుకొనుట. కనుక ఏ విషయాన్ని స్వరూపంలోకి తెచ్చుకుంటారు? బాలకుని నుండి మాలికులు. దీనిని స్వరూపంలోకి తెచ్చుకోండి. పురుషార్థముతో పాటు ప్రాలబ్దము అనుభవమవ్వాలి. అంతేగాని ఇప్పుడు పురుషార్థులం, ప్రాలబ్దము భవిష్యత్తులో లభిస్తుందని కాదు. సంగమయుగం విశేషతే - ఇప్పుడే పురుషార్థము, ఇప్పుడే ప్రత్యక్ష ఫలము. ఇప్పుడే స్మృతి స్వరూపము, ఇప్పుడే ప్రాప్తిని అనుభవం చేయడం. భవిష్యత్తులో లభిస్తుందని గ్యారంటీ ఏమో ఉంది, కాని ఇప్పటి భాగ్యము భవిష్యత్తు కంటే శ్రేష్ఠమైనది. ఇప్పటి వారసత్వమైతే ప్రాప్తించింది కదా. పొందుకున్నారా లేక ఇంకా పొందాలా? పొందుకొని ఉంటే అమృతవేళలో ఫిర్యాదు చేయరు కదా? స్మృతి అయినా ఉంటుంది, ఫిర్యాదు అయినా ఉంటుంది. ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ ఫిర్యాదు ఉండదు. ఎక్కడ ఫిర్యాదు ఉంటే అక్కడ స్మృతి ఉండదు. కనుక ఫిర్యాదులు సమాప్తమైపోయాయా? ప్రశ్నార్థకాలు సమాప్తమయ్యాయా? ఫిర్యాదులలో ప్రశ్నార్థకాలుంటాయి. స్మృతిలో ఫుల్‌స్టాప్ అనగా బిందువు ఉంటుంది. బిందు స్వరూపమై బిందువును స్మృతి చేయండి. తండ్రి బిందువే, మీరు కూడా బిందువే. కనుక పరివర్తన భూమిలోకి వచ్చి ఏదో ఒక విశేషమైన పరివర్తన తప్పక చేసుకోవాలి. ఇప్పుడు ఫిర్యాదులను వదిలి స్వతహా యోగులై వెళ్లాలి. ఫిర్యాదులలో సమస్యలుంటాయి, సంతోషముండదు. కనుక తండ్రి నుండి సంతోషపు ఖజానాలు తీసుకోండి, చిక్కులు కాదు. లౌకిక తండ్రి ఖజానాలు చిక్కులు, సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ సమాప్తమైపోయాయి. లౌకిక సంబంధాలు సమాప్తమైపోయాయంటే ఫిర్యాదులు కూడా సమాప్తం. అలౌకిక తండ్రి నుండి అలౌకిక వారసత్వం లభించింది. కనుక ఫిర్యాదుల లిస్టు సమాప్తమైపోయింది కదా. ఆ లిస్టును చించేశారు కదా! చెరిపేసి ఉండినా వ్రాసి ఉండినానని అంటారు అందుకే చించేసి సమాప్తం చెయ్యండి. సేవకు సమయమివ్వండి. ఎంతవరకు తయారు కారో అంతవరకు రాజ్యము రాదు. సేవకు ఏదైనా కొత్త ప్లాను తయారు చేశారా? మహాయజ్ఞంలో అందరూ సేవ చేశారు కదా! బ్రాహ్మణులు కలిసి సంఘటనగా అవ్వడమే, హాజరు కావడమే సేవ. ఇదేమీ తక్కువ మాట కాదు. సమయానికి హాజరగుట, సదా సిద్ధముగా (ఎవర్‌ రెడీగా) అగుట, సహనశక్తిని లక్ష్యంగా ఉంచుకొనుట, ఇది కూడా రిజిస్టరులో జమ అవుతుంది. ఇలా ఏదైతే జమ అయ్యిందో అది చివరి రిజల్టుకు ఉపయోగపడ్తుంది. ఈ రోజులలో కూడా 3 మాసాలు, 6 మాసాల పరీక్షలలో వచ్చిన మార్కులు ఫైనల్ పరీక్ష మార్కులతో కలుపుతారో అలా బ్రాహ్మణుల శ్రేష్ఠ కార్యాలలో సహయోగులుగా అయినందుకు కూడా మార్కులుంటాయి. ఆ మార్కులు చివరి రిజల్టు కొరకు జమ అయిపోతాయి. సహించారు, తనువు, మనసు, ధనములను ఉపయోగించారు, ఉపయోగించుట అనగా పొందుట. డైరక్షన్ అనుసారము చేశారు - ఇందుకు కూడా మార్కులు జమ అయ్యాయి. మహాయజ్ఞంలోకి కేవలం రావడమే కాదు, ఫైనల్ రిజల్టు కొరకు మార్కులు కూడా జమ అయ్యాయి. కనుక సేవ జరిగింది కదా. శబ్దమును వ్యాపింపజేయుట కూడా సేవలో ఒక సబ్జక్టు. సేవ స్వరూపాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సంఘటిత రూపంలో శబ్దాన్ని వ్యాపింపజేయడం కూడా ఒక సేవయే. పరివారాన్ని చూచి సంతోషము కలిగింది కదా. సోదరీ సోదరులెంత మంది ఉన్నారో చూడండి. ఇంత పెద్ద పరివారము ఏ యుగములోనూ ఎవ్వరికీ ఉండదు. ఇది కూడా ఒక స్యాంపులే. మొత్తం పరివారమంతా రాలేదు కదా. మొత్తం పరివారమంతా కలుస్తే పూర్తి ఢిల్లీ అంతా మనదిగా చేసుకోవాల్సి వస్తుంది. ఆబూలో కలుస్తే ఆబూ రోడ్ వరకు(మౌంట్ నుండి) మనదిగా చేసుకోవాల్సి వస్తుంది. ఇంటికి రండి అని వారంతకు వారే ఆఫర్ చేసే రోజు కూడా వస్తుంది. కలకత్తాలోని విక్టోరియా మైదానాన్ని తయారు చేసి మీకిస్తారు. రండి, విచ్చేయండి, అని మర్యాద పూర్వకంగా ఆహ్వానిస్తారు. మెల మెల్లగా శబ్దము వ్యాపిస్తుంది. వీరు తక్కువైనవారు కాదని అందరికీ అర్థమయ్యింది కదా.  బ్రహ్మాబాబా అవ్యక్తమైన తర్వాత ఇంత పెద్ద సంఘటన ఉండం చూచి బలిహారమౌతారు. ఇతర చోట్ల సంస్థ తెగిపోతూ ఉంటుంది. కాని ఇక్కడ పెరుగుతూ ఉంది. ఈ అద్భుతాన్ని అందరూ చూస్తారు. అందరూ తమ తమ శుద్ద సంకల్పాలతో, సహయోగ శక్తితో, సంఘటన శక్తితో సేవ చేశారు. ఇప్పుడిక అన్ని చోట్ల నుండి ఆహ్వానము లభిస్తుంది. ఈ రాష్ట్రపతి భవనం మీ ఇల్లై పోతుంది. 

2) స్వయాన్ని సదా హృదయ సింహాసనాధికారులుగా భావిస్తున్నారా? ఈ హృదయ సింహాసనము మొత్తం కల్పమంతటిలో ఈ సంగమ యుగములో తప్ప ఇంకెప్పుడూ ప్రాప్తించదు. హృదయ సింహాసనంపై ఎవరు కూర్చోగలరు? ఎవరి హృదయము సదా హృదయాభిరాముడైన తండ్రి జతలో ఉంటుందో వారు కూర్చోగలరు. కనుక మీరు ఏ స్థానములో ఉంటారు? సింహాసనాన్ని వదిలేస్తే ఉరికంబపు పలక పైకి వెళ్లిపోతారు. జన్మ-జన్మాంతరాలకు మాయ ఉరితాటిలో చిక్కుకొని పోతారు. తండ్రి హృదయ సింహాసనమైనా ఉంటుంది, మాయ ఉరితాటి పలకైనా ఉంటుంది. కనుక ఎక్కడుండాలి? ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. మీ శరీరము కూడా గుర్తు రాకూడదు. దేహము గుర్తొచ్చిందంటే దేహముతో పాటు దేహ సంబంధాలు, పదార్థాలు, దేహ ప్రపంచము మొదలైనవన్నీ ఒకదాని వెనుక మరొకటి గుర్తొచ్చేస్తాయి. సంకల్ప రూపములో కూడా ఏ కొంచెమైనా దారము జోడింపబడి ఉంటే అది తన వైపు లాక్కుంటుంది. అందువలన మనసా, వాచా, కర్మణాలో సూక్ష్మంగానైనా బంధనము, మోహము ఉండరాదు. సదా ముక్తులుగా ఉండండి. అప్పుడు ఇతరులను కూడా ముక్తులుగా చేయగలరు. ఈ రోజులలో ప్రపంచమంతా మాయా జాలము(వల)లో చిక్కుకొని పరితపిస్తున్నారు. వారిని ఈ వల నుండి ముక్తులుగా చేయుటకు ముందు స్వయం ముక్తులుగా అవ్వవలసి వస్తుంది. సూక్ష్మ సంకల్పములో కూడా బంధనముండరాదు. ఎంత నిర్బంధనులుగా ఉంటారో అంత ఉన్నతమైన స్థితిలో స్థితము కాగలరు. బంధనాలుంటే పైకి వెళ్లాలనుకున్నా క్రిందకే వచ్చేస్తారు. 

3) అందరూ స్వయాన్ని విశ్వములోని సర్వ ఆత్మల నుండి ఎన్నుకోబడిన శ్రేష్ఠ ఆత్మలమని భావిస్తున్నారా? స్వయం తండ్రియే మిమ్ములను తనవారిగా చేసుకున్నారని భావిస్తున్నారా? తండ్రి విశ్వమంతటిలో ఇంత కొంతమంది ఆత్మలనే ఎన్నుకున్నారు. అందులో మేము శ్రేష్ఠ ఆత్మలమనే సంకల్పము చేస్తూనే ఏమనుభవం అవుతుంది? అతీంద్రియ సుఖము ప్రాప్తిస్తుంది. ఇలా అనుభవం చేస్తున్నారా? అతీంద్రియ సుఖము అనుభవమవుతుందా లేక విన్నారా? ప్రాక్టికల్ గా అనుభవం చేస్తున్నారా? లేక కేవలం జ్ఞానము మాత్రమే ఉందా? ఎందుకంటే జ్ఞానమనగా తెలివి. తెలివికి అర్థమే అనుభవంలోకి తీసుకొచ్చుట. వినడం, వినిపించడం వేరే విషయం. అనుభవం చేయుట వేరే విషయం . అనుభవీలుగా అయ్యేందు కొరకే ఈ శ్రేష్ఠమైన జ్ఞానముంది. ఇతరుల నుండి అనేక విధములైన జ్ఞానాన్ని విన్నారు, వినిపించారు. ఏదైతే అర్ధకల్పము చేశారో, అదే ఇప్పుడు కూడా చేస్తూ ఉంటే అదేమంత గొప్ప విషయం? ఇది నూతన జీవితము, నూతన యుగము, నూతన ప్రపంచము కొరకు నూతన జ్ఞానము. కనుక దీనిని అనుభవంలోకి తెచ్చుటే దీని నవీనత. ఒక్కొక్క శబ్దము ఆత్మ, పరమాత్మ, చక్రము ఏ జ్ఞాన శబ్దమైనా అనుభవంలోకి రావాలి. ఆత్మ అని అనుభవం కావాలి. ఈ అనుభూతి జరగాలి. పరమాత్మ అనుభవమవ్వాలి. దీనినే నవీనత అని అంటారు. కొత్త పగలు, కొత్త రాత్రి, కొత్త పరివారము అంతా కొత్తదేనని అనుభవమవుతూ ఉందా? భక్తికి ఫలంగా ఇప్పుడు జ్ఞానము లభిస్తూ ఉంటే ఇటువంటి జ్ఞానములో అనుభవీలుగా కండి. అనగా స్వరూపంలోకి తీసుకు రండి. 

4) అందరూ విజయీ రత్నాలే కదా. విజయ జండా పక్కాగా ఉంది కదా. విజయం మన జన్మ సిద్ధ అధికారము. ఇది కేవలం నోటి నుండి చేసే నినాదం కాదు, ప్రాక్టికల్ జీవితంలోని స్లోగన్. కల్పకల్పము విజయులే. ఇప్పుడు మాత్రమే కాదు, ప్రతి సంకల్పములోనూ విజయులే. లెక్కలేనన్ని సార్లు విజయం పొందినవారు. ఇటువంటి విజయులు సదా హర్షితంగా ఉంటారు. ఓటమిలో దు:ఖపుటల ఉంటుంది. ఎవరైతే సదా విజయులుగా ఉంటారో, వారు సదా సంతోషంలో ఉంటారు. ఇప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులలోనూ దు:ఖపుటల రాకూడదు. దు:ఖ ప్రపంచము నుండి దూరమైపోయారు. రాత్రి సమాప్తమైపోయి ప్రభాతంలోకి వచ్చేశారు. కనుక దు:ఖపుటల రాజాలదు. విజయ పతాకము సదా ఎగురుతూ ఉండాలి. జండా ఎగురకుండా క్రిందికి వాలిపోరాదు. 

వీడ్కోలు సమయంలో దాదీలతో- బాప్ దాదా కూడా ప్రేమ బంధనంలో బంధింపబడి ఉన్నారు. విడిపించుకోవాలన్నా విడిపోలేరు. అందుకే భక్తిమార్గములో కూడా బంధింపబడిన చిత్రాన్ని(కృష్ణుడు, రోలు) చూపించారు. ప్రాక్టికల్ గా అవ్యక్తమైనా, ప్రేమ బంధనంలో బంధింపబడాల్సి వస్తుంది. వ్యక్తము నుండి విడిపించుకున్నారు, అయినా విడిపోలేదు. అందుకే మీరు కూడా బంధనంలో ఉన్నారు, తండ్రి కూడా బంధనంలో ఉన్నారు.(విదేశీయుల వైపు సూచించారు) మీరు కూడా తపుస్స చేస్తున్నారు. పగలా, రాత్రా? అందుకే గారడీ చేశారని అంటారు.

Comments