06-02-1980 అవ్యక్త మురళి

06-02-1980         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

అశరీరిగా అయ్యేందుకు సహజ విధి.

ఈ రోజు బాప్ దాదా కల్పక్రితపు అల్లారుముద్దు, స్నేహీ మరియు సహయోగీ శక్తి స్వరూపులైన పిల్లలతో కలుసుకునేందుకు వచ్చారు. బాప్ దాదా సదా తన సహయోగీ పిల్లల జతలోనే ఉంటారు. సహయోగం మరియు స్నేహాల తెగని బంధము సదా అవినాశిగా ఉంటుంది. ఈ రోజు వతనంలో బాప్ దాదా అత్యంత ప్రియమైన పిల్లల స్నేహ మాలను తయారు చేస్తున్నారు. అందరూ స్నేహీలుగానే ఉన్నారు కానీ నెంబరువారుగా అని అంటారు కదా. ఈ రోజు ప్రతీ పుత్రుని విశేషతల ఆధారంతోనే నెంబర్లు తయారు చేస్తున్నారు. కొంతమంది పిల్లలలో ఎంత ఎక్కువ విశేషతలను చూశారంటే వారు పూర్తిగా తండ్రి సమానం తండ్రికి సమీప రత్నాలుగా ఉన్నారు. కొంతమంది పిల్లలు విశేషతలను ధారణ చేయడంలో శ్రమ చేస్తున్నారు. ఆ శ్రమను చూసి తండ్రికి కూడా దయ కలుగుతూ ఉంది. నా పిల్లలకు కష్టమా? ఎందుకు? అన్నింటికంటే అశరీరిగా అవ్వటంలో ఎక్కువగా శ్రమ పడ్తున్నారు.

బాప్ దాదా అశరీరి ఆత్మకు అశరీరిగా అవ్వడంలో కష్టం ఎందుకు? అని పరస్పరం మాట్లాడుకుంటున్నారు. బ్రహ్మాబాబా శివబాబాతో “84 జన్మలు శరీరాన్ని ధారణ చేస్తూ పాత్రను అభినయించిన కారణంగా పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ శరీరధారులుగా అయిపోతున్నారు " అని అన్నారు. అందుకు శివబాబా - పాత్రను అభినయించారు కానీ ఇది ఎలాంటి సమయము? సమయము యొక్క స్మృతి అనుసారము స్వతహాగానే కర్మలు కూడా ఉంటాయి. ఈ అలవాటైతే ఉంది కదా! తండ్రి ఇలా చెప్తూ "ఇప్పుడు పాత్రను అభినయించుట సమాప్తి చేసి ఇంటికి వెళ్లాల్సిన సమయం. పాత్ర డ్రెస్ ను ఎలాగైనా విడిచి పెట్టాల్సిందే కదా? ఇంటికి వెళ్లాలన్నా ఈ పాత శరీరాన్ని విడిచి పెట్టాల్సిందే, రాజ్యంలోకి అనగా స్వర్గానికి వెళ్లాలన్నా ఈ పాత డ్రెస్ విడిచి పెట్టాల్సిందే. వెళ్లే తీరాలి కనుక శరీరాన్ని మర్చిపోవడంలో కష్టమెందుకు? వెళ్లాల్సిందే అనేది మర్చిపోతున్నారా? మీరందరూ వెళ్లడానికి ఎవరెడీగా ఉన్నారు కదా? లేక ఇప్పుడు కూడా కొన్ని తాళ్లు మిమ్మల్ని బంధిస్తున్నాయా? ఎవరెడీగా ఉన్నారు కదా?"

ఈ సమయాన్ని బాప్ దాదా సేవ కొరకు ఇచ్చారు. సేవాధారి పాత్రను అభినయిస్తున్నారు కదా! కనుక శరీర బంధనాలైతే లేవు కదా? అనగా పాత డ్రస్సు(చోలా) టైట్ గా(బిగుతుగా) అయితే లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. బిగుతుగా ఉన్న డ్రెస్ ను ఇష్టపడుట లేదు కదా? డ్రెస్ బిగుతుగా ఉంటే ఎవరెడీగా ఉండరు. బంధనముక్తులు అనగా వదులు(లూజ్/Loose)గా ఉండే డ్రస్సు. బిగుతు(Tight)గా ఉండేది కాదు. ఆర్డర్ లభించిన వెంటనే సెకండులో వెళ్ళిపోవాలి. ఇలాంటి బంధనముక్తులుగా, యోగయుక్తులుగా అయ్యారా? “ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు" అని ప్రతిజ్ఞ చేసినప్పుడు బంధనముక్తులుగా అయినట్లే కదా. అశరీరిగా అగుటకు విశేషించి ఈ నాలుగు విషయాలపై అటెన్షన్ ఇవ్వండి. 

1. ఎప్పుడైనా తమను తాము మరచిపోవాలనుకుంటే ప్రపంచములోనివారు కూడా ఒక సత్యమైన ప్రేమలో లీనమవుతారు. కనుక మర్చిపోయేందుకు సహజమైన సాధనము - సత్యమైన ప్రేమయే. ప్రేమ ప్రపంచాన్ని మర్చిపోవడానికి సాధనము, దేహాన్ని మరపింపజేసే సాధనము. 

2. రెండవది - సత్యమైన మిత్రుడు లేక స్నేహం కూడా ప్రపంచాన్ని మరిపించే సాధనము. ఒకవేళ ఇద్దరు మిత్రులు పరస్పరంలో కలుసుకుంటే వారికి సమయం గురించి, స్వయం గురించి(స్మృతియే)
జ్ఞాపకమే ఉండదు. 

3. మూడవ విషయం - హృదయపూర్వకమైన పాట - మనసుతో పాట పాడుతుంటే ఆ సమయంలో వారు స్వయాన్ని సమయాన్ని మర్చిపోతారు. 

4. నాల్గవ విషయం - యధార్ధమైన పద్ధతి. విధానము యధార్థంగా ఉంటే అశరీరిగా అవ్వడం చాలా సహజం. పద్ధతి రాకుంటే అప్పుడు కష్టమవుతుంది. కావున ఒకటి ప్రేమ, రెండు మిత్రుడు(స్నేహం), మూడవది పాట, నాల్గవది పద్ధతి.

ఈ నాలుగు విషయాలలో మీరందరూ అనుభవీలే కదా? ప్రేమను కూడా అనుభవించినవారే. తండ్రి మరియు మీరు అంతే, ఇక మూడవ వారెవ్వరూ లేరు. తండ్రి లభించారంటే అన్నీ లభించినట్లే. ఇక మిగిలిందేముంది? ప్రభువు ప్రేమను గురించి ఈ రోజు కూడా భక్తులు కీర్తిస్తూ ఉంటారు. కేవలం ప్రేమ పాటలు పాడేవారే లీనమైపోతూ ఉంటే ప్రేమను నిభాయించేవారు ఇంకా ఎంతగా లీనమై ఉండాలో ఆలోచించండి! మీరంతా ప్రేమను అనుభవించిన వారే కదా? విపరీత బుద్ది నుండి ప్రీతి బుద్దిగా అయ్యారు కదా? కావున ఎక్కడ ప్రభు ప్రేమ ఉంటుందో అక్కడ అశరీరిగా అవ్వడం ఏమనిపిస్తుంది? ప్రేమ ముందు అశరీరిగా అవ్వడం ఒక్క సెకండు ఆటతో సమానము. 'బాబా' అని అంటూనే శరీరాన్ని మర్చిపోవాలి. 'బాబా అను శబ్దమే పాత ప్రపంచాన్ని మర్చిపోయేందుకు ఆత్మిక బాంబు. (కరెంటు పోయింది) ఎలాగైతే ఈ స్విచ్ తో మారిపోయే ఆటను చూశారో అలాగే అది స్మృతి అనే స్విచ్. తండ్రి స్మృతి అనే స్విచ్ ఆన్ చేస్తూనే దేహము, దేహ ప్రపంచాల స్మృతి అనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక్క సెకండు ఆటే. నోటితో బాబా అని అనేందుకు కూడా సమయం పడ్తుంది. కానీ స్మృతిలోకి తీసుకురావడంలో ఎంత సమయం పడ్తుంది. కావున ప్రేమలో ఉండటం అనగా సహజంగా అశరీరిగా అవ్వడం.

ఇలాంటి సత్యమైన మిత్రుడు స్మశానం తర్వాత కూడా తోడుగా వస్తాడు. శరీరధారి మిత్రులైతే స్మశానం వరకే వస్తారు. కాని వారు దుఃఖహర్త - సుఖకర్తలుగా కాలేరు. కొద్దో గొప్పో దు:ఖం ఉన్న సమయంలో అయితే సహయోగులుగా కాగలరు. సహయోగం ఇవ్వగలరు కానీ దు:ఖాన్ని హరించలేరు. కనుక సత్యమైన స్నేహితుడు లభించాడు కదా? సదా ఈ అవినాశి మిత్రుని జతలో ఉంటే ఆ ప్రేమలో కష్టం సమాప్తమైపోతుంది. ప్రేమించడం వచ్చినప్పుడు ఎందుకు కష్టపడతారు. బాప్ దాదాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. ఉదాహరణానికి ఎవరైనా భారం ఎత్తుకునే అలవాటు గల వారిని విశ్రాంతిగా కూర్చోబెట్టే వారు కూర్చోలేరు. మాటి మాటికి భారం వైపుకే పరుగు తీస్తారు. అంతేకాక వారికి దిక్కుతోచదు(ఊపిరాడదు). కనుక విడిపించండి అని అరుస్తూ ఉంటారు. అందువలన సదా ప్రేమ మరియు స్నేహంలో ఉన్నారంటే కష్టం సమాప్తమైపోతుంది. మిత్రుని నుండి దూరం కాకండి. సదా తోడుగా (జతలో) నడవండి.

అలాగే బాప్ దాదా ద్వారా ప్రాప్తించిన సర్వప్రాప్తుల పాటలు, గుణాల పాటలు పాడుతూ ఉండండి. తండ్రిని మహిమ చేసే పాటలు, మిమ్ములను మహిమ చేసే పాటలు ఎన్ని ఉన్నాయి! ఈ పాటలకు తగిన వాయిద్యం కూడా స్వతహాగా మోగుతుంది. ఎంతెంత గుణాలను మహిమ చేసే పాటలు పాడుతూ ఉంటారో అంత సంతోష వాయిద్యం పాటకు తగినట్లు స్వతహాగా మోగుతూ ఉంటుంది. పాటలు పాడేవారు కూడా వచ్చారు(భరత్ వ్యాస్ మొదలైన వారు వచ్చారు). మీ వాయిద్యాలు వేరుగా ఉంటాయి. ఇది సంతోష వాయిద్యము. ఇది ఎప్పుడూ చెడిపోదు. రిపేర్ చేయ్యాల్సిన పని ఉండదు. కావున సదా ఈ పాటలు పాడుతూ ఉండండి. ఈ పాటలు పాడటం అందరికీ వస్తుంది కదా! సదా ఈ పాటలు పాడుతూ ఉంటే సహజంగానే అశరీరిగా అయిపోతారు. ఇక మిగిలింది రీతి(పద్ధతి). యథార్థ రీతి ఒక సెకండు రీతే (విధానమే). "నేను అశరీరి ఆత్మను" ఇది అన్నింటికంటే సహజమైన యథార్థమైన పద్ధతి. సహజమే కదా. ఎలాగైతే తండ్రికి కష్టాన్ని సహజంగా చేస్తారనే మహిమ ఉందో అలాగే తండ్రి సమానమైన పిల్లలు కూడా కష్టాన్ని సహజం చేసేవారుగా ఉంటారు. విశ్వంలోని అందరి కష్టాలను సహజం చేసేవారు స్వయం కష్టాన్ని ఎలా అనుభవం చేస్తారు? అందువలన సదా సహజయోగులుగా అవ్వండి.

సంగమయుగ బ్రాహ్మణులు కష్టం లేక శ్రమ అనే మాటలను వారి నోటితోనే కాదు, వారి సంకల్పంలో కూడా రాకూడదు. కావున ఈ సంవత్సరం విశేషించి 'సదా సహజయోగీ' అను మాట పై అటెన్షన్ ఇవ్వండి. ఎలాగైతే తండ్రికి పిల్లలపై దయ కలుగుతుందో అలా మీరు స్వయంపై కూడా దయ చూపించుకోండి. అంతేకాక సర్వుల పట్ల కూడా దయాహృదయులుగా కండి. దయా హృదయులు అనే టైటిల్ మీ అందరిదీ కదా? మీ టైటిల్ జ్ఞాపకముందా? కానీ దయాహృదయులుగా అవ్వడానికి బదులు ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు. దయా భావానికి బదులుగా అహంభావంలోకి వచ్చేస్తారు. అందువలన దయను మర్చిపోతారు. కొందరు అహంభావంలోకి వచ్చేస్తారు కనుక దయా భావనను మర్చిపోతారు. కొందరు అహంభావంలోకి వస్తారు, కొందరు వహంభావం(అనుమానం, సంశయం)లోకి వచ్చేస్తారు. చేరుకోగలమో లేమో, ఇది యథార్థ మార్గమో కాదో - ఇలా అనేక రకాలుగా స్వయం పట్ల వహం భావము, అప్పుడప్పుడు జ్ఞానం పట్ల వహం భావము వస్తూ ఉంది. అందువలన దయాభావము మారిపోతుంది. అర్థమయిందా? బలహీనులుగా కాకండి, సదా హృదయ సింహాసనాధికారులుగా కండి. కనుక ఈ సంవత్సరం ఏమి చెయ్యాలో అర్థమయిందా? ఈ సంవత్సరం హెూమ్ వర్క్ ఇస్తున్నాను. సహజయోగులుగా కండి. దయాహృదయులుగా కండి, హృదయ సింహాసనాధికారులుగా కండి. కనుక భాగ్యవిధాత తండ్రి సదా ఇలాంటి ఆజ్ఞాకారీ పిల్లలకు ప్రతిరోజు అమృతవేళలో సఫలతా తిలకం దిద్దుతూ ఉంటారు. ఈ తిలకానికి కూడా గాయనముంది కదా. భక్తులకు భగవంతుడు తిలకం దిద్దడానికి వచ్చారని అంటారు. కావున ఈ సంవత్సరం ఆజ్ఞాకారీ పిల్లలకు స్వయం తండ్రి తమ సేవాస్థానం అనగా తీర్థస్థానములో సఫలతా తిలకం దిద్దడానికి వస్తారు. తండ్రి అయితే రోజూ చక్రం తిరగడానికి వస్తూనే ఉంటారు. ఒకవేళ పిల్లలు నిద్రపోతూ ఉంటే అది వారి పొరపాటు(అజాగ్రత్త).

దీపావళి రోజున ప్రతీ చోట జ్యోతులను వెలిగించి ఉంచుతారు, శుభ్రం చేస్తారు, ఆహ్వానం కూడా చేస్తారు. స్వచ్ఛత, ప్రకాశము మరియు ఆహ్వానము. వారు లక్ష్మిని ఆహ్వానిస్తారు. ఇక్కడ మీరు లక్ష్మి రచయితను ఆహ్వానిస్తారు. కనుక జ్యోతిని వెలిగించుకొని కూర్చోండి. అప్పుడు తండ్రి వస్తారు. చాలామందిని మేల్కొల్పుతారు కూడా కాని కొందరు మరలా నిద్రపోతారు. ధ్వనిని(పిలుపును) కూడా అనుభవం చేస్తారు. మరలా సోమరితనపు నిద్రలో నిద్రపోతారు. సత్యయుగంలో నిదురించుటే నిదురించుట, బంగారమే బంగారం ఉంటుంది. (హిందీలో సోనా అంటే నిదురించుట, బంగారు అని రెండు అర్థాలున్నాయి) డబల్ సోనా ఉంటుంది. అందువలన ఇప్పుడు జాగ్తో జ్యోతులుగా కండి(వెలిగే జ్యోతులుగా కండి). అలాగని నిద్రపోయే సంస్కారంతో అక్కడ సోనా లభిస్తుందని కాదు. ఎవరు మేల్కొని ఉంటారో వారికే బంగారు లభిస్తుంది. సోమరితనపు నిద్ర వినాశన సమయాన్ని మర్చిపోయినప్పుడే వస్తుంది. భక్తుల పిలుపును వినండి. దు:ఖీ ఆత్మల దు:ఖపు పిలుపు వినండి. దప్పికగొని ఉన్న ఆత్మల ప్రార్థన పిలుపును వినండి. అవి వింటూ ఉంటే ఎప్పుడూ నిద్రే రాదు. కనుక ఈ సంవత్సరం సోమరితనపు నిద్రకు విడాకులివ్వండి. అప్పుడు భక్తులు తమ సాక్షాత్కార మూర్తులను సాక్షాత్కారం చేసుకుంటారు. కావున ఈ సంవత్సరం సాక్షాత్కార మూర్తులుగా అయ్యి భక్తులకు సాక్షాత్కారం చేయంచండి. ఇలాంటి చక్రవర్తులుగా కండి.

ఇలా సదా ప్రేమను నిభాయించే వారికి, సదా సత్యమైన స్నేహితుని జతలో ఉండువారికి, సదా ప్రాప్తులు, గుణాలు, మహిమలను పాటలుగా పాడుకునే వారికి, సదా సెకండ్ యధార్థ పద్ధతి ద్వారా సహజయోగులుగా తయారయ్యేవారికి, సదా దయాహృదయులకు, కష్టాన్ని సహజంగా తయారు చేసుకొనే వారికి, నిద్రాజిత్ చక్రవర్తులైన పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments