05-02-1979 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మధువన నివాసీలతో బాప్ దాదా యొక్క ఆత్మిక సంభాషణ.
ఈ రోజు విశేష స్మృతి చిహ్న భూమి, ఈనాటికీ కూడా భక్తులు ఏ భూమి యొక్క మహిమ చేస్తూ ఉన్నారో, అటువంటి మహాన్ భూమి లేదా మహాన్ తీర్థ స్థానంలో ఉండేటటువంటి విశేష భాగ్యశాలీ ఆత్మలతో కలుసుకునేందుకు వచ్చారు. ఎలాగైతే ఇది సమర్థ భూమియో, అదే విధంగా ఈ భూమికి వచ్చే అనేక ఆత్మల యొక్క వ్యర్థం సమాప్తి అయిపోతుంది. అందరూ సమర్థంగా అయిపోతారు, అనేక రకాల అనుభవాల ఖజానాను సహజంగా ప్రాప్తించుకుంటారు. ఇది ఎలాంటి భూమి అంటే ఏ వరదానం కావాలంటే ఆ వరదానం స్మృతి మరియు ఈ భూమి ఆధారంగా సహజంగా పొందగలరు. ఇటువంటి భూమిలో నివసించే మీరు ఏమవుతారు? భక్తులు దివ్యభూమి లేదా శ్రేష్ఠ స్థానాన్ని దర్శించేటందుకు ఇప్పటి వరకు కూడా ఎంతో తపిస్తూ ఉన్నారు. ఈ భూమిలో ఉండే మీరు దర్శనీయ మూర్తులేనా? స్థానానికి ఎలాగైతే గొప్పతనముందో స్థితి కూడా ఆ విధంగానే ఉంటుందా? లేక స్థితి కంటే స్థానానికే ఎక్కువ మహిమ ఉంటుందా? దూరంగా ఉండేవారు కూడా మధువనం స్మృతి రావడంతోనే సమర్థంగా అయిపోతారు. మరైతే మధువన నివాసీలు ఇంకేవిధంగా అయిపోతారు. భూమికి ఎలాంటి గొప్పతనముందో... మీరు కూడా అంతటి గొప్పవారేనా? మధువనం స్థూల, సూక్ష్మ ప్రాప్తుల యొక్క భండారా, అయితే మీలో అందరి వేగము మరియు స్థితి శ్రేష్ఠముగా ఉందని భావిస్తున్నారా. మధువన నివాసీలకు సాధన ఉంది.. సాంగత్యం ఉంది.. భూమి గొప్పతనం యొక్క సహయోగం ఉంది. వాయుమండలం యొక్క సహజ సాధన ఉంది. మరి వాటి అనుసారంగా మీరు సిద్ధి స్వరూపులేనా? ఈ సంవత్సరం పోయింది. కొత్త సంవత్సరం మొదలైంది. దానిలో కూడా ఒక నెల పూర్తయిపోయింది. ఈ ఒక్క నెల యొక్క ఫలితంలో కూడా ఏమనుభవం చేసుకున్నారు. వృద్ది కళ అనుభవం అయిందా? ప్రతి అడుగును జమ చేసుకునే వారు అంటే సమర్థంగా ఉన్నారా? స్వయం పట్ల మరియు సర్వుల పట్ల విఘ్న వినాశకులుగా ఉన్నారా? సమయం సమీపంగా వస్తోంది. కనుక నాలుగు సబ్జెక్టులలో మార్కులు కావాలి. మీ సేవ కోసం అందరి నోటి నుంచి ఒక మాట వస్తోంది. సేవాధారులు చాలా మంచివారని, అదే విధంగా ఙ్ఞానము, యోగము, మరియు ధారణా యుక్తులేనా? ఇక్కడి వాయుమండలం అంతటిలో స్వర్గాన్ని అనుభవం చేసుకుంటారు. స్వర్గాన్ని ఏ విధంగా అయితే అనుభవం చేసుకుంటారో అదే విధంగా వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని స్వర్గ నివాసీలుగా అంటే సర్వ ప్రాప్తి స్వరూపులుగా అనుభవం చేసుకోవాలి. నడుస్తూ.. తిరుగుతూ కూడా ఫరిస్తాగా కనిపించాలి. మంచిది.
ఈ సంవత్సరం అన్ని వర్గాల వారిని సంప్రదింపుల్లోకి తీసుకురండి. మీరు అధికారికంగా సైగ చేయగానే అన్ని పనులు వారు చేసేలాగా సంప్రదింపుల్లోకి తీసుకురండి. అవసర సమయంలో సంప్రదింపుల్లోకి వస్తున్నారు తరువాత తేలిక అయిపోతున్నారు. కానీ ఇప్పుడు సంప్రదింపులను పెంచండి. ప్రతి ఒక్కరి భాగ్యం తప్పకుండా తయారుచేయాలని ఆదిలో లక్ష్యం పెట్టుకునేవారు కదా! అదే విధంగా కూడా ఇప్పుడు ప్రతి వర్గంలోని ఆత్మలను సంప్రదింపుల్లోకి తీసుకువచ్చి విశేష సేవార్థం వారిని నిమిత్తం చేసి సహయోగం తీసుకోవాలనే లక్ష్యం పెట్టుకోండి. ఇప్పుడు అన్ని స్థానాల్లో మధ్య వర్గంలోని వాళ్లున్నారు. కానీ ఆఖరికి అందరి వరకు చేరుకోవాలి. ఒక విశేష ఆత్మ రావాలి, వారి ద్వారా అనేకులకు సందేశం లభించాలి. ఉత్సాహ, ఉల్లాసాలు ఉత్పన్నం అవ్వాలి. అప్పుడే క్యూ మొదలవుతుంది. ఈ సంవత్సరం ఈ క్వాలిటీ సేవ చేయాలి. విశ్వపిత అనే బిరుదు ఉన్నప్పుడు విశ్వంలోని విభిన్నమైన వారు కావాలి కదా? నాస్తికులు అయినా కానీ, సంప్రదింపుల్లోకి తప్పకుండా రావాలి. జ్ఞానం వినకపోయినా కానీ పరివర్తన చూసి అయినా కానీ సంప్రదింపుల్లోకి రావాలి. కొత్త ప్రపంచ స్థాపన కోసం అన్ని రకాల బీజాలు అవసరం. అప్పుడే విశ్వ కళ్యాణకారీగా కాగలరు. ధర్మనేతలు, రాజ్యనేతలు కూడా కనీసం వీరి పరివర్తన లేక వీరి పద్ధతి చాలా మంచిదని అంగీకరించాలి. ధర్మనేతలు కూడా ఇలా అనుభవం చేసుకుని సహయోగంలోకి రావాలి.
Comments
Post a Comment