04-01-1982 అవ్యక్త మురళి

* 04-01-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సద్గురువు యొక్క ప్రథమ వరదానము - 'మన్మనాభవ

ఈరోజు జ్ఞానసాగరుడైన తండ్రి సాగరతీరంపై జ్ఞానరత్నాలను గ్రోలే హోలీహంసలను కలుసుకునేందుకు వచ్చారు. హోలీహంసలు ప్రతి ఒక్కరూ ఎంతగా జ్ఞానరత్నాలను గ్రోలి సంతోషములో నాట్యమాడుతున్నారో ఆ హంసల యొక్క సంతోషమయమైన నాట్యాన్ని చూస్తున్నాను. ఈ అలౌకిక సంతోషము యొక్క నాట్యము ఎంత ప్రియమైనది మరియు మొత్తం కల్పానికి ఎంత అతీతమైనది! 

సాగరము యొక్క భిన్న భిన్న అలలను చూసి హంసలు ప్రతి ఒక్కరూ ఎంతగా హర్షిస్తున్నారు! కావున ఈరోజు బాప్ దాదా ఏమి చూసేందుకు వచ్చారు? హంసల యొక్క నాట్యము. నాట్యం చేయడంలో అయితే చురుకుగా ఉన్నారు కదా! ప్రతి ఒక్కరి మనస్సు యొక్క సంతోషకరమైన గీతాలను కూడా వింటున్నారు. గీతాలు లేకుండా నాట్యం జరుగదు కదా! కావున వాయిద్యాలు మోగుతున్నాయి. అలాగే నాట్యం కూడా జరుగుతోంది. మీరందరూ ఆ సంతోషమయమైన గీతాలను వింటున్నారా? ఈ గీతాలను చెవులతో వినరు. మనస్సు యొక్క గీతాలను మనస్సుతోనే వింటారు. మన్మనాభవగా అవ్వడంతోనే గీతమును గానం చేయడం లేక వినడం ప్రారంభమవుతుంది.  మన్మనాభవ ఈ మహామంత్రము యొక్క వరదానులుగా అయితే అందరూ అయిపోయారు. సద్గురునికి చెందినవారిగా అయ్యారు కావున సద్గురుని ద్వారా మొట్టమొదట ఏ వరదానము లభించింది? మన్మనాభవ. సద్గురువు యొక్క రూపములో వరదానీ పిల్లలను చూస్తున్నారు. అందరూ మహామంత్రధారులుగా, మహాదానులుగా, వరదానులుగా, సద్గురుని పిల్లలైన మాస్టర్ సద్గురులుగా, గురు మనుమలుగా ఉన్నారా? మనుమలకు ఎక్కువ హక్కు ఉంటుంది. బ్రహ్మ యొక్క పిల్లలు కావున మనుమలు కూడా అవుతారు కదా! అలాగే పిల్లలు మరియు మనుమలు కూడా. ఎంతగా తండ్రి యొక్క సంబంధం ఉందో అంతగా మీ సంబంధమూ ఉంది. మీరు సర్వసంబంధాలలోనూ అధికారీ ఆత్మలు. భోలానాథుడైన తండ్రి నుండి తీసుకోవడంలో చురుకుగా ఉన్నారు. మంచి వ్యాపారులు కూడా. వ్యాపారం చేసుకున్నారు కదా! భగవంతునితో వ్యాపారం చేస్తాము అని ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఆ వ్యాపారంలో ఏమి తీసుకున్నారు? మీకు ఏమి లభించింది? (ముక్తి- జీవన్ముక్తులు). కేవలం ముక్తి, జీవన్ముక్తులే లభించాయా? మీరు వ్యాపారులే కాక ఇంద్రజాలికులు కూడా, ఎంత గొప్ప వ్యాపారం చేసారంటే, దానితో మళ్ళీ ఇంకే వ్యాపారము చేయవలసిన అవసరమే లేదు. వస్తువు యొక్క వ్యాపారమేమీ చేయలేదు, వస్తుదాతతోనే వ్యాపారం చేసుకున్నారు. అందులో అన్నీ వచ్చేసాయి కదా! దాతనే మీ వారిగా చేసేసుకున్నారు. అచ్ఛా - డబుల్ విదేశీ పిల్లలతో ఆత్మిక సంభాషణ చేయాలి కదా!

వేర్వేరు పార్టీలతో మిలనము:- న్యూయార్క్ (అమెరికా): స్వయాన్ని కోట్లాది మందిలో ఏ కొందరో, ఆ కొందరిలోనూ ఏ ఒక్కరో అని పిలువబడే ఆత్మలము మేమే అని అనుభవం చేసుకుంటున్నారా? డ్రామాలో ఆత్మలైన మనకు తండ్రితో నేరుగా సంబంధం ఉంది మరియు పాత్ర ఉంది. అంతటి నషా మరియు సంతోషము ఉంటోందా? సదా సంతోషములో ఉండేందుకు ఎన్ని విషయాలను ధారణ చేసుకున్నారు? బాప్ దాదా చాలాకాలం తర్వాత కలిసిన పిల్లలందరినీ చూసి ఎంతో హర్షిస్తారు. ఎంత సమయం తర్వాత కలుసుకున్నారు! స్మృతి కలుగుతుంది కదా! శ్రేష్ఠ ఆత్మలైన మాకు ఉన్నతోన్నతుడైన తండ్రితో విశేషమైన పాత్ర ఉంది అన్న ఇదే స్మృతిలో ఉండండి. కావున ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్థితి స్వతహాగానే ఏర్పడుతుంది. ఏదైతే వింటారో దానిని ఇముడ్చుకుంటూ ఉండండి. ఎంతగా ఇముడ్చుకుంటూ ఉంటారో అంతగా ప్రత్యక్ష స్వరూపముగా అవుతూ ఉంటారు. ప్రతి గుణము యొక్క అనుభవము ఉండాలి. ఒక్కొక్క గుణము యొక్క అనుభూతి ఎంతవరకూ ఉంది అని సదా మిమ్మల్ని మీరు చూసుకోండి. జ్ఞానస్వరూపులుగా ఉన్నారా లేక అనుభవీ మూర్తులుగా ఉన్నారా? ఇది పరిశీలించండి. ఎందుకంటే సంగమయుగములోనే ప్రతి గుణమునూ అనుభవం చేసుకోగలుగుతారు. ఏ గుణము యొక్క అనుభవమైనా తక్కువగా ఉంటే దాని పైన ఎక్కువ ధ్యానమును ఉంచి తప్పకుండా అనుభవజ్ఞులుగా అవ్వండి. ఎంతగా అనుభవీ మూర్తులుగా ఉంటారో అంతగా పునాది పక్కాగా ఉంటుంది, మాయ కదిలించలేదు. ఎటువంటి విఘ్నము లేక సమస్య అయినా ఇప్పుడొక ఆటగా అనుభవమవ్వాలి. అది యుద్ధము కాదు, ఆట. కావున ఆటగా భావించడం ద్వారా సంతోషముగా దాటి వెళ్ళగలుగుతారు మరియు యుద్ధముగా భావించడం ద్వారా కలత చెందుతారు మరియు అలజడిలోకి కూడా వస్తారు. డ్రామాలో పాత్రధారులుగా ఉన్న కారణముగా ఏ దృశ్యము మీ ముందుకు వచ్చినా డ్రామా యొక్క లెక్కలో అంతా ఒక ఆటయే అన్న స్మృతి ఉన్నట్లయితే ఏకరసముగా ఉంటారు, అలజడి కలుగదు. కావున ఇప్పటినుండే ఈ పరివర్తన చేసి వెళ్ళండి. అలజడిని ఇక్కడే సమాప్తము చేసి వెళ్ళండి. సదా మీ మస్తకముపై విజయము యొక్క తిలకము దిద్దబడినట్లుగా అనుభవం చేసుకోండి. అప్పుడు అలజడి సమాప్తమైపోతుంది. చూడండి. అమెరికా విశ్వములో ఉన్నతమైన స్థానములో ఉంది. మరి బ్రాహ్మణులు ఎంత ఉన్నతముగా ఉంటారు! ఏ విధముగా దేశము యొక్క మహిమ ఉందో దాని కన్నా ఎక్కువగా బ్రాహ్మణ ఆత్మల యొక్క మహిమ ఉంది. కావున మీరు సేవలో నెంబర్ వన్ గా అవ్వాలి. ప్రతి ఒక్కరూ బాబాను ప్రత్యక్షము చేసేందుకు లైట్‌హౌస్ గా అయిపోయినట్లయితే వైట్ హౌస్ మరియు లైట్ హౌస్ యొక్క తేడా కనిపిస్తుంది. వారు వినాశకారీ మరియు వీరు స్థాపన వారు. ఇప్పుడు అద్భుతం చేసి చూపించండి. విశేష ఆత్మలను నిమిత్త ముగా చేసారు. ఇప్పుడు ఇంకా సంపర్కము ద్వారా సంబంధములోకి తీసుకురావాలి. ఎంతగా సమీప సంబంధములోకి తీసుకురావాలంటే, వారి ముఖము ద్వారా బాబా యొక్క మహిమ మొత్తం విశ్వంలో మారు మోగాలి. చూడండి, బాప్ దాదా ఏ పిల్లలైతే ఇతర ఇతర ధర్మాలలో కలిసిపోయారో వారిని కూడా ఎంచుకొని బయటకు తీసారు, మరి మీరు విశేషమైన భాగ్యవంతులయ్యారు కదా! మీరు తండ్రిని వెతికారు. కానీ బాబాయే మిమ్మల్ని వెతికి పట్టుకున్నారు. మీరు వెతికినా పట్టుకోలేకపోయేవారు. ఎందుకంటే మీకు పరిచయమే లేదు కదా! కావున తండ్రి ఆత్మలైన మిమ్మల్ని ఎంచుకొని మీ తోట యొక్క పుష్పాలుగా చేసేసారు. కావున ఇప్పుడు మీరందరూ అల్లా యొక్క పూతోటలోని ఆత్మిక గులాబీ పువ్వులు. స్వయాన్ని ఈ విధంగా భాగ్యవంతులుగా భావిస్తున్నారు కదా!

భాషను అర్ధం చేసుకోకపోయినా ఏవిధంగా స్నేహీ ఆత్మలు తమ అధికారాన్ని తీసుకునేందుకు వచ్చి చేరుకున్నారో చూసి బాబాకు ఎంతో సంతోషము కలుగుతుంది. స్వయాన్ని అధికారీ ఆత్మలుగా భావిస్తున్నారు కదా! మీరు చాలా లగ్నము కల ఆత్మలు, మళ్ళీ మీ అధికారాన్ని తీసుకునేందుకు మహాన్ తీర్ధస్థానానికి వచ్చి చేరుకున్నారు.

జపాన్ గ్రూపుతో:- మీరంతా బాప్ దాదా యొక్క హృదయసింహాసనాధికారీ ఆత్మలు. స్వయాన్ని ఇంత శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? వెరైటీ పుష్పాల యొక్క పూలగుచ్చితము ఎంత గొప్పగా ఉంది! మీరు ఆ పూల తోటలో ఏ స్థానములో ఉన్నారు? చిన్నవారు అల్లాతో సమానముగా ఉంటారు. పిల్లలను ఎంత సమయంగా స్మృతి చేస్తున్నారు? బాప్ దాదా జపాన్ పిల్లలను ఎంతకాలంగా స్మృతిచేసారు! ఎంతో కాలం ముందు పిల్లలైన మిమ్మల్ని గుర్తు చేసాను, ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షముగా బాబా యొక్క వరదాన భూమి పైకి వచ్చి చేరుకున్నారు. కావున స్వయాన్ని ఈ విధముగా భాగ్యవంతులుగా భావిస్తున్నారా? జపాన్ కు విశేషముగా ఏ చిహ్నాన్ని చూపిస్తారు? ఒకటేమో జండా, ఇంకొకటి విసనకర్ర, (గాలి వీచుకునేందుకు అందరికీ విసనకర్రలు ఇస్తారు). కావున బాప్ దాదా కూడా పిల్లలకు సదా ఎగురుతూ ఉండండి అనే స్మృతిని కలిగిస్తారు. కావున విసనకర్రను చూపిస్తారు. మొట్టమొదట విదేశ సేవకు పునాది జపానే, కావున అది మహత్వమే కదా! బాప్ దాదా యొక్క ఆహ్వానముతో మీరు ఇక్కడివరకూ చేరుకున్నారు. బాప్ దాదా పిలిచారు, అప్పుడే వచ్చారు. అందరూ మంచి షోకేస్ యొక్క షో పీసులుగా ఉన్నారు. మొత్తం బ్రాహ్మణ పరివారము కూడా బంగారు బొమ్మలవంటి మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తారు. మేము పరివారానికి ప్రియమైన వారము మరియు బాప్ దాదాకు కూడా ప్రియమైనవారము అని సదా అనుభవం చేసుకుంటున్నారా? 

ఇప్పుడు జపాన్ నుండి ఎవరైనా విశేష ఆత్మను తయారుచేయండి. ఆ ఒక్కరూ రావడంతో అనేకులకు సందేశము లభించాలి. అక్కడ వెరైటీ రకాల యొక్క సేవ వెలువడగలదు. కాస్తంత కృషి చేస్తే ఫలము ఎంతగానో వెలువడుతుంది. అందుకొరకు ఒకటేమో స్థానము యొక్క వాతావరణాన్ని చాలా శక్తిశాలిగా చేయండి. ఒక చైతన్యమందిరములోకి వెళుతున్నట్లుగా అనుభూతి కలగాలి. ఇలా వాతావరణం ఆత్మిక సుగంధమయంగా ఉన్నట్లయితే దూరదూరాల నుండి వాయుమండలం ఆకర్షితం చేస్తుంది. వాతావరణం ఆత్మలను ఎంతగానో ఆకర్షించగలదు. ధరణి చాలా బాగుంది మరియు ఫలము కూడా ఎంతగానో వెలువడగలదు. కేవలం కాస్తంత కృషి మరియు వాయుమండలము కావాలి. సేవ యొక్క సంకల్పం చేయగానే సఫలత మీ ముందుకు వస్తుంది. వాయుమండలం ఎప్పుడైతే ఆత్మికముగా ఉంటుందో అప్పుడు మిగిలిన విషయాలన్నీ స్వతహాగానే సరి అయిపోతాయి. అందరూ ఐకమత్యముగా మరియు ఏకరసముగా అయిపోతారు. ఆ తర్వాత మాయ కూడా రాదు. ఎందుకంటే వాయుమండలం శక్తిశాలిగా ఉంటుంది. వాయుమండలమును శక్తిశాలిగా చేసుకునేందుకు స్మృతి యొక్క ప్రోగ్రామ్ ను ఉంచండి మరియు పరస్పర ఉన్నతి కొరకు ఆత్మిక సంభాషణ యొక్క క్లాసులను  చేయండి, స్నేహ మిలనమును జరపండి. ధారణ యొక్క క్లాసులను ఉంచినట్లయితే సఫలత లభిస్తుంది.

వీడ్కోలు సమయంలో దీదీ, దాదీలతో:- మీరు కూడా మెలుకువగా ఉండవలసి వస్తుంది. రోజంతా కష్టపడతారు మరియు రాత్రి కూడా మేల్కోవలసి వస్తుంది. బాప్ దాదా పిల్లలకు సదా శక్తిని ఇస్తారు. ధైర్యము మరియు ఉల్లాసము రెండింటిపై బలిహారమవుతారు. అవి చూస్తూ ఎంతో హర్షిస్తారు. మహిమ చేస్తే అది ఎంతగా అయిపోతుంది! తండ్రి యొక్క మహిమను గూర్చి సాగరమును సిరాగా చేసినా తరగదు అని అంటారు. మరి పిల్లల యొక్క మహిమను ఎంతగా చేయాలి! బాబా పిల్లల యొక్క మహిమను చూసి సదా పదే పదే బలిహారమవుతారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ తమ స్టేజి పైన హీరో పాత్రను అభినయిస్తున్నారు. ఒక్క తండ్రి యొక్క పిల్లలు హీరో పాత్రధారులుగా ఉన్నారు. మరి బాబాకు ఎంత గర్వంగా ఉంటుంది! మొత్తం కల్పమంతటిలో ఇటువంటి తండ్రీ ఉండజాలరు. అలాగే ఇటువంటి పిల్లలూ ఉండజాలరు. ఒక్కొక్కరి మహిమ యొక్క గీతమును గానం చేస్తూ ఉన్నట్లయితే ఎంత పెద్ద గీతమాల తయారవుతుంది! బ్రహ్మ మరియు శివబాబా కూడా పరస్పరం ఎంతగానో చిట్‌చాట్ చేస్తూ ఉంటారు. ఓహో నా పిల్లలూ అని వారు అంటే, లేదు నా పిల్లలు గొప్పవారు అని వీరు అంటారు (ఏ సమయంలో ఇలా మాట్లాడుకుంటారు?) ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు. బిజీగానూ ఉంటారు మరియు సదా ఫ్రీగానూ ఉంటారు. స్వతంత్రముగానూ ఉన్నారు మరియు తోడుగానూ ఉన్నారు. వారు కంబైన్డ్ గా ఉన్నప్పుడు మరి వేరుగా ఎలా చూపిస్తారు? మీరు వేరు చేయగలరా? మీరు వేరు చేస్తే వారు మళ్ళీ పరస్పరం కలిసిపోతారు. ఏ విధంగా బాప్ దాదాలకు పరస్పరం కంబైన్డ్ రూపం ఉందో అలాగే మీది కూడా ఉంది కదా! మీరు కూడా బాబాతో వేరు కాలేరు, అచ్చా ఓం శాంతి.

Comments