02-01-1982 అవ్యక్త మురళి

* 02-01-1982        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంగమయుగ బ్రాహ్మణులపై విశ్వపరివర్తన యొక్క బాధ్యత.

బాప్ దాదా తమ బ్రాహ్మణ కులదీపకులను కలుసుకునేందుకు వచ్చారు. చైతన్య దీపాల యొక్క మాలను చూస్తున్నారు. ప్రతి ఒక్క దీపము విశ్వమును ప్రకాశవంతం చేసే చైతన్యదీపము, దీపాలన్నింటి యొక్క సంబంధం ఒక్క జాగృతీజ్యోతితో ఉంది. ప్రతి దీపము యొక్క ప్రకాశము ద్వారా విశ్వము యొక్క అంధకారం సమాప్తమవుతూ ప్రకాశము యొక్క స్వరూపము వస్తోంది. ప్రతి దీపము యొక్క కిరణాలు వ్యాపిస్తూ విశ్వముపై ప్రకాశము యొక్క ఛత్రఛాయగా తయారయ్యింది. ఇటువంటి దీపాల యొక్క దృశ్యాన్ని బాప్ దాదా చూస్తున్నారు. మీరందరూ కూడా దీపాలన్నింటి ద్వారా లభించిన ప్రకాశము యొక్క ఛత్రఛాయను చూస్తున్నారా? లైట్ మైట్ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటున్నారా? స్వస్వరూపములోనూ స్థితులై మరియు దానితో పాటు విశ్వము యొక్క సేవను కూడా చేస్తున్నారు. స్వస్వరూపము మరియు సేవాస్వరూపము రెండింటినీ కలిపి అనుభవం చేసుకుంటున్నారా? ఇదే స్వరూపములో స్థితులై ఉండండి. ఇది ఎంత శక్తిశాలీ స్వరూపము! విశ్వము యొక్క ఆత్మలు జాగృతి చెందియున్న దీపకులైన మీ వైపుకు ఎంత స్నేహముగా చూస్తున్నారు! కాస్తంత ప్రకాశము కొరకు ఎంతమంది ఆత్మలు అంధకారములో భ్రమిస్తూ ప్రకాశం కొరకు తపిస్తున్నారో అనుభవం చేసుకుంటూ ఉండండి. ఆ తపిస్తున్న ఆత్మలు మీకు కనిపిస్తున్నారా? దీపకులైన మీ యొక్క ప్రకాశము మినుకు, మినుకు మంటుంటే ఇప్పుడే వెలుగుతూ, మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆరిపోతూ ఉంటుంటే భ్రమిస్తున్న ఆత్మల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ విధముగా ఇక్కడ కూడా అంధకారమయమైపోయినప్పుడు, ఇప్పుడు ప్రకాశం రావాలి అని అందరికీ అనిపిస్తుంది కదా! ఆరిపోతూ, వెలుగుతూ ఉండే లైట్ ఎవరికీ నచ్చదు కదా! అలాగే వెలుగుతున్న దీపాలైన మీ అందరిపైనా విశ్వము యొక్క అంధకారాన్ని సమాప్తము చేసే బాధ్యత ఉంది. ఇంత పెద్ద బాధ్యతను అనుభవం చేసుకుంటున్నారా?

డ్రామా యొక్క రహస్యము అనుసారముగా బ్రాహ్మణులైన మీరు మేల్కొంటే అందరూ మేల్కొంటారు. బ్రాహ్మణులు మేల్కొంటే పగలు, ప్రకాశము ఏర్పడుతుంది మరియు బ్రాహ్మణుల యొక్క జ్యోతి ఆరిపోతే విశ్వములో అంధకారము, రాత్రి ఏర్పడుతుంది. కావున పగలు నుండి రాత్రిగా, రాత్రి నుండి పగలుగా చేసే చైతన్య దీపాలు మీరు. అంతటి బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది, కావున బాప్ దాదా ప్రతి ఒక్కరి బాధ్యతను అర్ధం చేసుకొనే చార్ట్ ను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమను తాము ఎంతగా బాధ్యులుగా భావిస్తున్నారు! అని గమనిస్తున్నారు. విశ్వ పరివర్తన యొక్క బాధ్యతా కిరీటాన్ని ధరించారా? లేదా? ఇందులోనూ నెంబర్ వారీ కిరీటధారులు కూర్చున్నారు. మీ కిరీటాన్ని చూస్తున్నారా? సదా ధరిస్తున్నారా? లేక అప్పుడప్పుడు మాత్రమే ధరిస్తున్నారా? నిర్లక్ష్యులుగా అయితే అవ్వడం లేదు కదా! బాధ్యత పెద్దవారిది అని భావించడం లేదు కదా! విశ్వము యొక్క కిరీటాన్ని పెద్దవారికి ఇస్తారా? లేక మీరు తీసుకుంటారా? అందరూ తమను విశ్వ రాజ్యాధికారులుగా భావిస్తారు, ఎవరైనా మిమ్మల్ని మీరు ప్రజలుగా అవ్వండి అని అంటే మీరు ఇష్టపడతారా? అందరూ విశ్వమహారాజుగా అయ్యేందుకే వచ్చారా? లేక ప్రజలుగా అవ్వడం కూడా ఇష్టమేనా? ఏమవుతారు? ఎవరైనా ప్రజలుగా అయ్యేందుకు తయారుగా ఉన్నారా? లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు అందరూ చేతులెత్తుతారు. కావున ఎప్పుడైతే ఆ రాజ్య కిరీటాన్ని ధరించాలనుకుంటారో మరి అప్పుడు ఆ కిరీటానికి ఆధారము సేవా బాధ్యత యొక్క కిరీటముపై ఉంది. కావున ఏం చేయవలసి ఉంటుంది? ఇప్పటినుండే కిరీటధారులుగా అయ్యే సంస్కారాన్ని ధారణ చేయవలసి ఉంటుంది. ఏ కిరీటము? బాధ్యత యొక్క కిరీటము.

కావున ఈ రోజు బాప్ దాదా అందరి కిరీటాలనూ చూస్తున్నారు. మరి ఇది ఏ సభా? కిరీటధారుల యొక్క సభను చూస్తున్నారు. అందరూ ఈ పట్టాభిషేక దివసాన్ని జరుపుకున్నారా? జరుపుకున్నారా లేక ఇంకా జరుపుకోవాలా? మీ స్మృతిచిహ్న చిత్రమైన శ్రీకృష్ణుని చిత్రములో బాల్యము నుండే కిరీటాన్ని చూపిస్తారు కదా! పెద్ద పెరిగిన తర్వాత కిరీటమైతే ఉంటుంది, కానీ అతడికైతే చిన్ననాటి నుండే చూపిస్తారు. మీ చిత్రాన్ని చూసారా? డబుల్ విదేశీయులు మీ చిత్రాన్ని చూసుకున్నారా? ఇది ఎవరి చిత్రము? ఒక్క బ్రహ్మ యొక్క చిత్రమా? లేక మీ అందరి యొక్క చిత్రమా? ఏ విధముగా శ్రీకృష్ణుని చిత్రములో అతడిని బాల్యము నుండే కిరీటధారిగా చూపించారో అలాగే శ్రేష్ఠ ఆత్మలైన మీరు కూడా మరజీవాగా అయ్యారు మరియు బాధ్యత యొక్క కిరీటాన్ని ధారణ చేసారు. కావున మీరు జన్మ నుండే కిరీటధారులుగా అవుతారు. అందుకనే స్మృతిచిహ్నములో కూడా జన్మ నుండే కిరీటాన్ని చూపించారు. కావున బ్రాహ్మణులుగా అవ్వడం అనగా పట్టాభిషేక దినాన్ని జరుపుకోవడం. కావున మీరందరూ మీ పట్టాభిషేకాన్ని జరుపుకున్నారా? ఇప్పుడు కేవలం సదా ఈ విశ్వసేవ యొక్క బాధ్యత కిరీటధారులుగా అయి సేవలో నిమగ్నమవుతున్నారా, లేదా? అన్నది గమనించుకోవాలి. మరి ఏం కనిపిస్తోంది? అందరూ కిరీటధారులుగా కనిపిస్తున్నారు, కానీ కొందరి దృఢ సంకల్పం యొక్క ఫిట్టింగ్ సరిగ్గా ఉంది, మరికొందరిది కాస్త వదులుగా ఉంది. వదులుగా ఉన్న కారణముగా కిరీటమును కాసేపు దించేస్తారు, కాసేపు ధారణ చేస్తారు. కావున సదా దృఢసంకల్పం ద్వారా ఈ కిరీటమును సదాకాలికముగా సెట్ చేసుకోండి. ఏం చేయాలో అర్ధమయ్యిందా? బ్రహ్మా బాబా పిల్లలను చూసి ఎంతగా హర్షిస్తారు! బ్రహ్మాబాబా కూడా సదా గీతమును గానంచేస్తారు. అది ఏ గీతము? 'ఓహో, నా పిల్లలూ, ఓహో' మరి పిల్లలు ఏ గీతాన్ని గానం చేస్తారు? (ఓహో బాబా, ఓహో) అని గానంచేస్తారు. ఇది సహజమైన గీతము కావున గానంచేస్తారు. అందరికన్నా ఎక్కువ సంతోషము ఎవరికి ఉంటుంది? అందరికన్నా ఎక్కువగా బ్రహ్మా బాబాకు సంతోషం ఉంటుంది. ఎందుకు? పిల్లలందరూ తమను ఏ విధముగా పిలుచుకుంటారు? బ్రహ్మాకుమారీ, కుమారులు అని అంటారే కానీ శివకుమారీ, కుమారులు అని అనరు. కావున రచయిత అయిన బ్రహ్మా బాబా తమ రచనను చూసి హర్షిస్తారు. మీరు బ్రహ్మముఖవంశావళులు కదా! కావున తమ వంశావళిని చూసి బ్రహ్మాబాబా హర్షిస్తారు.

అవ్యక్తరూపధారులయ్యుండి కూడా మధువనములో వ్యక్తరూపధారిగా అనగా చైతన్య సాకార రూపము యొక్క అనుభూతిని కలిగిస్తూనే ఉంటారు. మధువనములోకి వచ్చి బ్రాహ్మణ పిల్లలు బ్రహ్మద్వారా సాకార రూపము యొక్క, సాకార చరిత్ర యొక్క అనుభూతిని పొందుతూ ఉంటారు కదా! విశేషముగా మధువన భూమికి సాకార రూపము యొక్క అనుభూతిని కలిగించే వరదానము లభించింది. కావున అటువంటి అనుభూతిని పొందుతున్నారు కదా! ఆకారరూపి అయిన బ్రహ్మ ఉన్నారా లేక సాకారముగా ఉన్నారా? ఏం అనుభవం చేసుకుంటారు? ఆత్మిక సంభాషణ చేస్తున్నారా? 

డబుల్ విదేశీయులైన పిల్లలు తమ సమీప సంబంధం యొక్క స్నేహముతో నిరాకారుడిని మరియు ఆకారుడిని సాకారరూపధారిగా చేయడంలో చాలా చురుకుగా ఉన్నారని ఈ రోజు వతనములో బాప్ దాదాల మధ్య ఇదే ఆత్మిక సంభాషణ జరిగింది. పిల్లల స్నేహము యొక్క ఇంద్రజాలముతో ఆకారుడు కూడా సాకారునిగా అయిపోతారు. పిల్లలు ఇటువంటి స్నేహము యొక్క ఇంద్రజాలికులు. స్నేహము స్వరూపాన్ని మార్చేస్తుంది, కావున బ్రహ్మా బాబా కూడా ప్రతి స్నేహీ పిల్లలను సాకార రూపధారిగా అయి కలుసుకుంటారు. అలాగే అనుభవం చేసుకుంటారు అనగా పిల్లల స్నేహానికి బదులు ఇస్తారు. స్నేహము యొక్క తాడుతో బాప్ దాదాను సదా తోడుగా కట్టేసుకుంటారు. ఈ స్నేహము యొక్క తాడు ఎంత దృఢమైనదంటే దానిని అసలు ఎవరూ తెంచలేరు. 21 జన్మల కొరకు బ్రహ్మాబాబాతో భిన్న భిన్న సంబంధాలలో బంధింపబడియుంటారు, వేరవ్వజాలరు. ఇటువంటి తాడును కట్టుకున్నారు కదా! దీనినే అవినాశీ మధురమైన బంధనము అని అంటారు. ఇది 21 జన్మల వరకూ నిశ్చితమైనది, కావున ఇటువంటి బంధనాన్ని బంధించుకున్నారు కదా! పిల్లలైన మీరు ఇంద్రజాలికులే కదా! కావున ఈ రోజు వతనములో ఏ ఆత్మిక సంభాషణ జరిగిందో విన్నారా? బ్రహ్మాబాబా పిల్లల ఒక్కొక్కరి యొక్క విశేషతరూపీ ప్రకాశిస్తున్న మణిని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి యొక్క విశేషత మణి సమానముగా ప్రకాశిస్తోంది. కావున మీ మెరుస్తున్న మణిని చూసారా! అచ్ఛా!

డబుల్ విదేశీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. వాణి వినిపించేందుకు కాదు. బాబా యొక్క అద్భుతమైతే ఉంది కానీ పిల్లల అద్భుతం కూడా తక్కువేమీకాదు. మేము పరస్పరం చర్చించుకుంటూ ఉంటాము అని మీరు భావిస్తారు కానీ బాప్ దాదాలు కూడా ఇలా ఆత్మిక సంభాషణ జరుపుతారు. అచ్ఛా!

ఈ విధంగా సదా విశ్వసేవ యొక్క బాధ్యతా కిరీటధారులకు, సదా స్నేహము యొక్క బంధనములో బాప్ దాదాను తమ తోడుగా చేసుకొనేవారికి, 21 జన్మల కొరకు అవినాశీ సంబంధములోకి వచ్చేవారికి, ఈ విధంగా సదా మేల్కొనియున్న దీపాలకు బాప్ దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

జర్మన్ గ్రూప్:- అందరి మస్తకము పైనా ఏమి మెరుస్తోంది? మీ మస్తకము పైన మెరుస్తున్న తారలను చూస్తున్నారా? బాప్ దాదా అందరి మస్తకము పైనా మెరుస్తున్న మణిని చూస్తున్నారు. స్వయాన్ని సదా పదమాపదమ భాగ్యశాలీ ఆత్మలుగా భావిస్తున్నారా? అన్నివేళల్లో ఎంత సంపాదనను జమా చేసుకుంటున్నారు? అది లెక్కవేయగలరా? మొత్తం కల్పంలో ఇంతటి సంపాదన చేసుకొనే వ్యాపారి ఇంకెవరైనా ఉంటారా? మేమే కల్పకల్పమూ ఈ విధంగా శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యాము అన్న సంతోషము యొక్క స్మృతి సదా ఉంటుందా? కావున సదా మేము ఇంతటి గొప్ప వ్యాపారులము అని భావించండి మరియు అంతటి సంపాదనలో బిజీగా ఉండండి. సదా బిజీగా ఉండడం ద్వారా ఏ విధమైన మాయ ఎదుర్కోజాలదు, ఎందుకంటే బిజీగా ఉన్నట్లయితే మాయ చూసి తిరిగి వెళ్ళిపోతుంది, యుద్ధం చేయదు. సహజముగా మాయాజీతులుగా అయ్యేందుకు సహజసాధనము ఇదే - సంపాదన చేస్తూ ఉండండి మరియు చేయిస్తూ ఉండండి. ఎంతెంతగా మాయ యొక్క అనేకరకాల యొక్క జ్ఞానస్వరూపులుగా అవుతూ ఉంటే అంతగా మాయ పక్కకు తొలగిపోతూ ఉంటుంది. ఇంకొకటి, ఒక్క క్షణము కూడా ఒంటరిగా ఉండకండి. సదా బాబాతో పాటు ఉన్నట్లయితే బాబా తోడుగా ఉండడం చూసి మాయ రాజాలదు. ఎందుకంటే మాయ మొదట తండ్రి నుండి దూరం చేస్తుంది. ఆ తర్వాత వస్తుంది. కావున ఎప్పుడైతే ఒంటరిగా అవ్వనే అవ్వరో అప్పుడు మాయ ఏం చేస్తుంది? తండ్రి అతి ప్రియమైనవారు. ఈ అనుభవమైతే ఉంది కదా! మరి ప్రియమైనవారిని ఎలా మరచిపోగలరు! కావున సదా ప్రియాతి ప్రియమైనవారు ఎవరు అన్నది స్మృతిలో ఉంచుకోండి. ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ తనువు మరియు ధనము స్వతహాగానే ఉంటుంది. కావున మన్మనా భవ అన్న మంత్రమైతే గుర్తుంది కదా! మనస్సు ఎక్కడకు వెళ్ళినా, ఇంతకన్నా శ్రేష్ఠమైనది, ఇంతకన్నా గొప్పది ఇంకేదైనా ఉందా? లేక ఎక్కడికైతే మనస్సు వెళ్ళుతోందో అదే శ్రేష్ఠమైనదా? అని మొట్టమొదట పరిశీలించండి. అదే క్షణములో పరిశీలించినట్లయితే అలా చెక్ చేయడం ద్వారా పరివర్తన చేయగలుగుతారు. ప్రతి కర్మా, ప్రతి సంకల్పం చేసే ముందు పరిశీలించండి, చేసిన తర్వాత కాదు. మొదట చెకింగ్, ఆ తర్వాత ప్రాక్టికల్, అచ్ఛా!

Comments