* 31-05-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“భవిష్యత్తులో అష్టదేవతలుగా మరియు భక్తిలో ఇష్టులుగా అయ్యేందుకు పురుషార్థం."
స్వయమును సదా శివశక్తులుగా భావిస్తూ ప్రతికర్మనూ చేస్తున్నారా? మీ అలంకారీ లేక అష్టభుజధారీ మూర్తి సదా మీముందు ఉంటోందా! అష్టభుజధారులు అనగా అష్ట శక్తివంతులు. కావున సదా మీ అష్టశక్తీ స్వరూపము స్పష్టముగా కనిపిస్తోందా? శక్తులకు శివమయీ శక్తులు అన్న గాయనము ఉంది కదా! మరి శివబాబా స్మృతిలో సదా ఉంటున్నారా? శివుడికి మరియు శక్తులకు ఇరువురికీ గాయనము ఉంది. ఏ విధంగా ఆత్మ మరియు శరీరము రెండూ తోడుగా ఉన్నాయో, ఎప్పటివరకైతే ఈ సృష్టిపై పాత్ర ఉందో అప్పటివరకు వేరుగా అవ్వలేరో, అలాగే శివునికి మరియు శక్తులకు ఇరువురికీ అంతటి లోతైన సంబంధం ఉంది. శివశక్తి స్వరూపానికి అంతటి గాయనం ఉంది. కావున ఇదేవిధంగా సదా తోడును అనుభవం చేసుకుంటున్నారా లేక కేవలం గాయనం ఉందా? సదా ఎటువంటి తోడు ఉండాలంటే, ఎటువంటి లోపము ఈ తోడును వదలజాలకూడదు, చెరిపివేయజాలకూడదు. ఈ విధంగా అనుభవం చేసుకుంటూ సదా శివమయీ శక్తి స్వరూపంలో స్థితులై నడుచుకున్నట్లయితే ఎప్పుడూ ఇరువురి లగనంలో మాయ విఘ్నాలను కలిగించజాలదు. ఇద్దరు పదిమందితో సమానము అన్న నానుడి కూడా ఉంది. కావున ఎప్పుడైతే శివుడు మరియు శక్తి ఇరువురూ తోడవుతారో అటువంటి ఈ శక్తి ముందు ఎవరైనా ఏమైనా చేయగలరా? ఈ డబుల్ శక్తుల ముందు ఇంకే శక్తీ తన యుద్ధాన్ని చేయలేదు లేక ఓటమిని కలిగించజాలదు. ఓటమి కలుగుతున్నట్లయితే లేక యుద్ధము జరుగుతున్నట్లయితే ఆ సమయంలో శివశక్తి స్వరూపంలో స్థితులై ఉన్నారా? మీ అష్టశక్తీి సంపన్నమైన సంపూర్ణ స్వరూపంలో స్థితులై ఉన్నారా?
అష్ట శక్తులలో ఏ ఒక్క శక్తిలో లోపము ఉన్నా అష్టభుజధారీ శక్తుల గాయనమేదైతే ఉందో అది జరుగగలదా? మేము అష్ట శక్తి ధారులమైన శివశక్తులుగా అయి నడుచుకుంటున్నామా అని ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎవరైతే సదా అష్టశక్తులను ధారణ చేస్తారో వారే అష్టదేవతలలోకి రాగలరు. స్వయములో ఏదైనా శక్తి యొక్క లోపమును అనుభవం చేసుకుంటున్నట్లయితే అష్టదేవతలలోకి రావడము కష్టము మరియు అష్టదేవతలు మొత్తం సృష్టి కొరకు ఇష్టరూపాలుగా గానం చేయబడతారు మరియు పూజింపబడతారు. కావున భక్తి మార్గంలో ఇష్టులుగా లేక భవిష్యత్తులో అష్టదేవులుగా అవ్వాలనుకుంటే సదా అష్టశక్తుల ధారణను ఎల్లప్పుడూ స్వయములో చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ శక్తుల ధారణ ద్వారా సహజంగానే రెండు విషయాలను అనుభవం చేసుకుంటారు. అవి ఏ రెండు విషయాలు? సదా స్వయమును శివ శక్తులుగా లేక అష్టభుజధారులుగా లేక అష్ట శక్తిధారులుగా భావించడం ద్వారా ఒకటేమో సదా తోడును అనుభవం చేసుకుంటారు మరియు ఇంకొకటి సదా మీ స్థితిని సాక్షీ స్థితిగా అనుభవం చేసుకుంటారు. ఒకరేమో తోడుగా ఉన్నవారు, ఇంకొకరు సాక్షి, ఈ రెండూ అనుభవమవుతాయి. దీనినే వేరే పదాలలో సాక్షిస్థితి అనగా బిందురూప స్థితి అని అంటారు మరియు తోడు యొక్క అనుభవము అనగా అవ్యక్త స్థితి యొక్క అనుభవము అని అంటారు. అష్టశక్తుల ధారణ జరగడం ద్వారా ఈ రెండు స్థితులను సదా సహజంగా మరియు స్వతహాగా అనుభవం చేసుకుంటారు. ఎలా అనుభవం చేసుకుంటారంటే, సాకారంలో(బ్రహ్మాబాబా) తోడుగా ఉన్నప్పుడు, ఎప్పుడూ స్వయములో ఒంటరితనాన్ని లేక బలహీనతను అనుభవం చేసుకోలేదో అదేవిధంగా ఎప్పుడైతే సర్వశక్తివంతుడైన శివుడు మరియు శక్తి ఇరువురి స్మృతి ఉంటుందో అప్పుడు నడుస్తూ తిరుగుతూ సాకారంలో తోడుగా ఉన్నట్లుగా, చేతిలో చేయి ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు. తోడు మరియు చేతిలో చేయి అని అంటారు కదా! కావున బుద్ధి యొక్క లగనమురూపీ తోడును మరియు సదా మీతోడుగా శ్రీమతమురూపీ చేయిని అనుభవం చేసుకుంటారు. ఏ విధంగా ఎవరిపైనైనా ఇంకెవరి చేయి అయినా ఉన్నప్పుడు వారు నిర్భయులుగా మరియు శక్తిరూపులుగా అయి ఏ కష్టమైన కార్యమునైనా చేసేందుకు సిద్ధమైపోతారో, అదేవిధంగా ఎప్పుడైతే శ్రీమతమురూపీ చేయిని తమపై సదా అనుభవం చేసుకుంటారో అప్పుడు ఏ కష్టమైన పరిస్థితి నుండైనా లేక మాయ యొక్క విఘ్నాల నుండైనా వ్యాకులత చెందరు. ఆ చేయి యొక్క సహాయంతో, ధైర్యంతో ఎదుర్కోవడమును సహజంగా అనుభవం చేసుకుంటారు. అందుకొరకు చిత్రాలలో భక్తులు మరియు భగవంతుని రూపమును ఎలా చూపిస్తారు? శక్తుల చిత్రాలను చూసినప్పుడు కూడా భక్తులపై వరదాన హస్తమును చూపిస్తారు, మస్తకముపై చేతిని చూపిస్తారు. దీని అర్థం ఏమిటంటే మస్తకము అనగా బుద్ధిలో ఎల్లప్పుడూ శ్రీమతమురూపీ హస్తము ఉన్నట్లయితే తోడు మరియు చేదోడు ఉన్న కారణంగా సదా విజయులుగా ఉంటారు. ఈ విధంగా ఎల్లప్పుడూ తోడును, చేదోడును అనుభవం చేసుకుంటున్నారా? ఎంత బలహీన ఆత్మ అయినా సర్వశక్తివంతుడు తోడుగా ఉన్నప్పుడు బలహీన ఆత్మలో కూడా స్వతహాగానే శక్తి నిండుతుంది. ఎంత భయంకరమైన స్థానంలో ఉన్నా, తోడుగా ఉన్నావారు శూరవీరులుగా ఉన్నట్లయితే ఎటువంటి బలహీనులైనా శూరవీరులుగా అయిపోతారు. మళ్ళీ ఎప్పుడూ మాయతో భయపడరు. మాయను చూసి భయపడడానికి లేక మాయను ఎదుర్కోలేకపోవడానికి కారణము తోడును మరియు చేయిని అనుభవం చేసుకోకపోవడమే. బాబా తమ తోడును అందిస్తున్నారు. కాని, తీసుకునేవారు తీసుకోకపోతే ఏంచేస్తారు? తండ్రి తన పిల్లల చేయి పట్టుకొని వారిని సరైన మార్గంవైపుకు తీసుకురావాలనుకుంటాడు, కాని పిల్లలు పదే పదే చేయి వదిలించుకొని తమ మతంపై నడుస్తున్నట్లయితే ఏమౌతుంది? తికమకపడతారు. అదేవిధంగా ఒకటేమో ಬುದ್ಧಿ సాంగత్యము మరియు తోడును మరిచిపోయినప్పుడు, శ్రీమతమురూపీ చేయిని వదిలివేసినప్పుడు తికమకపడతారు మరియు శ్రీమతమురూపీ చేయిని వదిలివేసినప్పుడు చిక్కులలో పడతారు లేక బలహీనులుగా అయిపోతారు. మాయ కూడా చాలా చతురమైనది. ఎప్పుడైనా యుద్ధం చేసేందుకు మొదట తోడును మరియు చేయిని వదిలించి ఒంటరిగా చేసేస్తుంది. ఎప్పుడైతే ఒంటరిగా, బలహీనులుగా అయిపోతారో అప్పుడు మాయ యుద్ధం చేస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా శత్రువు యుద్ధం చేసినప్పుడు మొదట తనను సాంగత్యం నుండి మరియు తోడు నుండి విడిపిస్తారు. ఏదో ఒక యుక్తితో తనను ఒంటరిగా చేసి ఆ తర్వాత ఎదుర్కొంటారు. అలాగే మాయ కూడా మొదట తోడును మరియు చేయిని వదిలింపజేసి ఆ తర్వాత యుద్ధం చేస్తుంది. తోడును మరియు చేయిని వదలకపోతే, సర్వశక్తివంతుడు మీ తోడుగా ఉన్నట్లయితే మాయ ఏం చేయగలదు? మాయాజీతులుగా అయిపోతారు కావున తోడును మరియు చేయిని ఎప్పుడూ వదలకండి. ఈ విధంగా సదా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి నడుచుకోండి. భక్తిలో కూడా పిలుస్తారు కదా! ఒక్కసారి నా చేయి పట్టుకోండి అని అంటారు, బాబా చేయి పట్టుకుంటారు. చేయిలో చేయి వేసి నడిపించాలనుకుంటారు, అయినా కాని చేయి వదిలివేస్తారు. మరి అప్పుడు తప్పిపోక ఏమౌతారు? కావున మీరు భ్రమించేందుకు నిమిత్తులుగా కూడా స్వయమే అవుతారు. ఎవరైనా యోద్ధులు యుద్ధమైదానానికి వెళ్ళకముందు తమ శస్త్రాలను, తమ సామాగ్రిని తోడుగా ఉంచుకొని ఆ తర్వాత మైదానంలోకి వెళతారు. అలాగే ఈ కర్మక్షేత్రమురూపీ మైదానం పైకి ఏదైనా కర్మ చేసేందుకు లేక యోధులుగా అయి యుద్ధం చేసేందుకు వచ్చేటప్పుడు కర్మ చేసేందుకు ముందే మీ శస్త్రాలను అనగా ఈ అష్ట శక్తుల సామాగ్రిని మీ తోడుగా ఉంచుకొని కర్మ చేస్తారా లేక ఏ సమయంలోనైతే శత్రువు వచ్చేస్తాడో ఆ సమయంలో సామాగ్రి గుర్తుకు వస్తుందా? అప్పుడిక ఏమౌతుంది? ఓటమి పాలవుతారు. సదా స్వయమును కర్మక్షేత్రంపై కర్మ చేసే యోధులుగా అనగా మహారధులుగా భావించండి. ఎవరైతే యుద్ధమైదానంలో ఎదుర్కొనేవారిగా ఉంటారో వారు ఎప్పుడూ శస్త్రాలను వదలరు. నిదురించే సమయంలో కూడా తమ శస్త్రాలను వదలరు. అలాగే నిదురించే సమయంలో కూడా మీ అష్ట శక్తులను విస్మృతిలోకి తెచ్చుకోకండి అనగా మీ శస్త్రాలను తోడుగా ఉంచుకోవాలి. మాయ యుద్ధం జరిగే సమయంలో నేను ఏ యుక్తిని ఉపయోగించాలి అని ఆలోచించడం కాదు. అలా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ సమయం గడిచిపోతుంది. కావున ఎల్లప్పుడూ ఎవర్రడీగా ఉండాలి. సదా ఎలర్ట్ గా మరియు ఎవర్రడీగా ఉండకపోతే మాయ ఎక్కడో అక్కడ మోసం చేసేస్తుంది మరియు ఆ మోసపు రిజల్టు ఎలా ఉంటుంది? తమను తాము చూసుకుంటూ దు:ఖపు అల ఉత్పన్నమవుతుంది. తమ లోపమే ఆ లోపాన్ని తీసుకువస్తుంది. స్వయంలో లోపము లేనట్లయితే ఎప్పుడూ ఏ లోపమూ రాజాలదు.
అందరూ స్వయమును దుఃఖరహిత పురము మహారాజులుగా పిలుచుకుంటూ ఉంటారు కదా! అది ఈ సమయపు స్థితి. ఇప్పుడు దు:ఖాల ప్రపంచము మీముందు ఉంది. ఇప్పుడు దు:ఖము మరియు దు:ఖములేని స్థితి యొక్క జ్ఞానము ఉంది, దీనికి చెంది ఉంటూ కూడా ఆ స్థితిలో సదా నివాసముంటారు. కావుననే దు:ఖరహితపురపు మహారాజులు అని అంటారు. పేదలుగా ఉంటూ కూడా దు:ఖరహితపురపు మహారాజులుగా ఉన్నారు. మేము దు:ఖరహితపురపు మహారాజులము అన్న నషాలో సదా ఉంటున్నారా? రాజులలో రాజ్యమును కొనసాగించే శక్తి దానంతట అదే ఉంటుంది. కాని, ఆ శక్తిని సరైన రీతితో ఉపయోగించకపోతే ఏవోఒక తప్పుడు కార్యాలలో చిక్కుకుపోతే రాజ్యంచేసే శక్తిని పోగొట్టుకుంటారు మరియు రాజ్యపదవిని పోగొట్టుకుంటారు. అలాగే ఇక్కడ కూడా మీరు దుఃఖరహితపురపు మహారాజులు మరియు మీకు సర్వశక్తుల ప్రాప్తి ఉంది. కాని, ఏదో ఒక సాంగత్యపు దోషము లేక ఏదైనా కర్మేంద్రియానికి వశీభూతమై మీ శక్తిని పోగొట్టుకున్నట్లయితే దుఃఖరహితపురపు నషా లేక సంతోషమేదైతే లభించిందో అది స్వతహాగానే పోతుంది. ఏ విధంగా ఆ మహారాజులు కూడా దివాలా తీస్తారో, అలాగే ఇక్కడ కూడా మాయకు ఆధీనమైపోయిన కారణంగా దివాలా తీసేస్తారు. కావుననే ఏమి చేయాలి, ఎలా అవుతుంది, ఎప్పుడవుతుంది అని అంటారు. ఇవన్నీ దివాలా తీయడానికి, ఆధీనులుగా అవ్వడానికి గుర్తులు. ఎక్కడో అక్కడ ఏదో ఒక కర్మేంద్రియానికి వశమై తమ శక్తులను పోగొట్టుకుంటారు. అర్థమైందా? కావున అష్టశక్తి స్వరూపులము, దుఃఖరహితపురపు మహారాజులము అన్న ఈ స్మృతిని ఎప్పుడూ మరవకండి, భక్తిలో కూడా మేము సదా మీ ఛత్రఛాయలో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కావున ఈ తోడు మరియు చేయి యొక్క ఛత్రఛాయ నుండి బయటకు ఎందుకు వెళతారు? ఈనాటి పాత ప్రపంచంలో ఎవరైనా చిన్న, చిన్న పదవులవారి తోడు మంచిగా ఉంటే, తమ నషాలో మరియు సంతోషంలో ఉంటారు. మా వెన్నెముక శక్తివంతంగా ఉంది అని భావిస్తారు, కావుననే నషాలో, సంతోషంలో ఉంటారు. మరి మీ వెన్నెముక ఎవరు? ఎవరికైతే సర్వశక్తిమంతుడే వెన్నెముకగా ఉన్నారో వారికి ఎంతటి నషా మరియు సంతోషము ఉండాలి! ఎప్పుడైనా ఈ సంతోషపు నషా తక్కువవ్వగలదా? సాగరంలో అలలు ఎప్పుడైనా ఆగిపోతాయా? నదులలో అలలు ఉత్పన్నమవ్వవు. కాని, సాగరంలో అలలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. మరి మీరు మాస్టర్ సాగరులే కదా! మరి ఈశ్వరీయ నషా మరియు సంతోషపు అల ఎప్పుడు సమాప్తమవుతుంది? ఎప్పుడైతే సాగరంతో సంబంధము తెగిపోతుందో అనగా తోడును మరియు చేయిని ఎప్పుడైతే వదిలివేస్తారో అప్పుడు సంతోషపు అల ఇమిడిపోతుంది. సదా తోడును అనుభవం చేసుకున్నట్లయితే పాప కర్మల నుండి కూడా సదా సహజంగా సురక్షితంగా ఉంటారు. ఎందుకంటే పాప కర్మలు ఏకాంతంలోనే జరుగుతాయి. ఎవరైనా దొంగతనం చేస్తున్నా, అబద్ధం మాట్లాడుతున్నా లేక ఏదైనా వికారానికి వశమైనట్లయితే, వేటినైతే అపవిత్రతతో కూడుకున్న సంకల్పాలు లేక కర్మలు అని అంటారో అవన్నీ ఒంటరితనంలోనే జరుగుతాయి. సదా స్వయమును బాబాకు తోడుగా అనుభవం చేసుకున్నట్లయితే ఈ కర్మలు జరగనే జరగవు. ఎవరైనా చూస్తున్నట్లయితే దొంగతనం చేస్తారా? ఎవరైనా ప్రత్యక్షంగా ముందు ఉండి వింటున్నట్లయితే అబద్ధం మాట్లాడతారా? ఏవైనా వికర్మలు లేక వ్యర్థకర్మలు పదే పదే జరుగుతున్నట్లయితే దీనికి కారణము - సదా మీ సహచరుని తోడులో ఉండడం లేదు లేక తోడును అనుభవం చేసుకోవడం లేదు. అప్పుడప్పుడు నడుస్తూ నడుస్తూ ఉదాసీనంగా కూడా ఎందుకు అయిపోతారు! ఎప్పుడైతే ఒంటరితనం ఉంటుందో అప్పుడే ఉదాసీనులుగా అవుతారు. సంఘటన ఉన్నట్లయితే సంఘటన యొక్క ప్రాప్తి ఉన్నట్లయితే ఉదాసీనంగా ఉంటారా? సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉంటే, బీజము తోడుగా ఉంటే బీజముతోపాటు మొత్తం వృక్షమంతా తోడుగా ఉంటుంది. మరి అప్పుడు ఉదాసీన స్థితి ఎలా ఉండగలదు? ఒంటరితనమే లేకపోతే ఉదాసీనంగా ఎందుకు ఉంటారు? అప్పుడప్పుడూ మాయ విఘ్నాల యుద్ధము జరుగుతున్న కారణంగా స్వయమును నిర్బలముగా అనుభవం చేసుకున్న కారణంగా వ్యాకుల స్థితిలోకి చేరుకుంటారు, శక్తివంతుల తోడును మరిచిపోతారు అప్పుడే బలహీనంగా అవుతారు మరియు బలహీనంగా అయిన కారణంగా తమ నషాను మరిచిపోయి అలజడి చెందుతారు. కావున ఏ బలహీనతలను లేక లోపాలనైతే అనుభవం చేసుకుంటారో వాటన్నింటికీ కారణం ఏమిటి? తోడు మరియు చేయి ఆధారము లభిస్తూ కూడా వాటిని వదిలివేయడమే. అర్థమైందా?
మొత్తం కల్పమంతటిలో ఒకేసారి ఇలా తోడు లభిస్తుంది అని కూడా అంటారు, అయినా దానిని వదిలివేస్తారు! ఎవరైనా ఎవరికైనా చేయి అందించి తీరానికి చేర్చాలనుకున్నా, వారు మునిగిపోయే ప్రయత్నమే చేస్తున్నట్లయితే వారిని ఏమంటారు? తమను తామే వ్యాకులపరుచుకుంటారు కదా! చాలాకాలం నుండి ఈ సృష్టిలో ఉంటూ ఇప్పటికీ కూడా అదే వ్యాకుల స్థితి మంచిగా అనిపిస్తోందా? నచ్చనప్పుడు మరి పదే పదే అటువైపుకే ఎందుకు వెళుతున్నారు. ఇప్పుడు త్వరత్వరగా ముందుకు వెళ్ళాలి, స్పీడును పెంచాలి. సారమును స్వయములో ఇముడ్చుకున్నాక సారయుక్తముగా అయిపోతారు మరియు నిస్సార ప్రపంచం నుండి అనంతమైన వైరాగులుగా అయిపోతారు. అచ్ఛా! సదా తోడును మరియు చేయిని తీసుకునే దుఃఖరహితపురపు మహారాజులకు నమస్తే.
Comments
Post a Comment