30-09-1975 అవ్యక్త మురళి

30-09-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

కల్పమంతటిలో విశేష పాత్ర అభినయించే శేష్ట ఆత్మల యొక్క విశేషతలు. 

               సర్వ శ్రేష్ట పాత్ర అభినయించేవారు, తన జ్ఞాన ప్రకాశంతో చంద్రుడిని (బ్రహ్మ) 16 కళలతో ప్రకాశింపజేసే జ్ఞాన సూర్య శివబాబా మాట్లాడుతున్నారు -
                కల్పమంతటిలో సర్వాత్మల కంటే శ్రేష్ఠ పాత్ర అభినయించే విశేష ఆత్మలుగా స్వయాన్ని భావిస్తున్నారా? ఆది నుండి అంతిమం వరకు విశేష ఆత్మలైన మీ యొక్క విశేషతలు ఏవి? లేదా మీరు ఏ విశేష పాత్ర అభినయించారో తెలుసా? 1) విశేష కర్మ చేసిన కారణంగా విశేష ఆత్మగా పిలవబడతారు. 2) విశేష గుణాల ప్రభావం కారణంగా విశేష ఆత్మగా పిలవబడడం. 3) పదవి లేదా పేరు ప్రతిష్టల కారణంగా విశేష ఆత్మలుగా పిలవబడడం మరియు 4) సంబంధ సంప్రదింపుల ద్వారా అనేకులకు విశేష ప్రాప్తిని ఇచ్చిన కారణంగా విశేష ఆత్మలుగా పిలవబడడం. ఈ అన్ని విశేషతలను ఎదురుగా పెట్టుకుని ఈ నాలుగు విశేషతలు ఎంత వరకు మరియు ఎంత శాతం ఉన్నాయో పరిశీలించుకోండి.
                  సత్యయుగం ఆదిలో విశేషాత్మలైన మీ యొక్క మొదటి స్థితి ఏ విధంగా ఉంటుంది? ఆ యొక్క విశేషతలను ఈనాటికి కూడా భక్తులు పాడుతూ ఉన్నారు. సంపన్నము మరియు సంపూర్ణత యొక్క మహిమ. ఇవైతే అందరికీ స్మృతిలో ఉంది కదా? ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళండి, సత్యయుగం తరువాత ఎక్కడకు వస్తారు (త్రేతాయుగం) అక్కడ విశేషత ఏమిటి, అక్కడ విశేషత ఎంత గొప్పదంటే ఈనాటి కలియుగి నేతలు కూడా ఆ రాజ్యం గురించే కలలు కంటూ ఉంటారు. ఏ ప్లాను ఆలోచిస్తున్నా కానీ మీ యొక్క రెండవ స్థితిని అతి విశేషంగా భావించి దానిని ఎదురుగా పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళండి త్రేతా తరువాత ఏమి వస్తుంది?(ద్వాపరయుగం) ద్వాపరయుగంలో కూడా ఎక్కడ వరకు చేరుకున్నారు? ద్వాపరయుగంలో కూడా రాజ్యశక్తి ఉంటుంది కదా? ద్వాపరయుగంలో ధర్మసత్తా మరియు రాజ్యసత్తా రెండు ముక్కలు పంచబడుతుంది. అందువలనే అది ద్వాపరం అయింది. అనగా రెండు పురాలు అయిపోయాయి కదా! ఒకటి రాజ్య శక్తి, రెండు ధర్మ శక్తి. అయినా కానీ విశేషాత్మలైన మీ యొక్క విశేష సంస్కారం మాయం అవ్వదు. ఇతర ధర్మపితలు ధర్మశక్తి ఆధారంగా ధర్మ స్థాపన చేస్తారు, కానీ మీ విశేషతల యొక్క పూజ మహిమ మరియు వందనం ప్రారంభం అవుతుంది. స్మృతిచిహ్నం కూడా విశేషాత్మలైన మీకే తయారు చేస్తారు. విశేషాత్మలైన మీ గురించే గుణగానం చేస్తారు. రాజ్య శక్తిలో కూడా రాజరికం యొక్క శక్తులన్నీ ఉంటాయి. మీ విశేషతలకు స్మృతి చిహ్నంగానే శాస్త్రాలు తయారవుతాయి. మీ విశేషతలు స్మృతి వస్తున్నాయా? మంచిది. ఇంత కంటే ముందుకు వెళ్ళండి ఎక్కడికి చేరుకున్నారు ( కలియుగం) కలియుగం యొక్క విశేషత ఏమిటి? విశేష ఆత్మలైన మీ పేరుతోనే అన్ని పనులు ప్రారంభం అవుతాయి. ప్రతి కార్యం యొక్క విధిలో మీ విశేషతల యొక్క సిద్దినే స్మరిస్తారు. మీ పేరుతో అనేకాత్మలు శరీర నిర్వహణ చేసుకుంటున్నారు. అనగా కలియుగంలో మీ పేరుకు మహిమ ఉంటుంది. ఇదే విశేషత. మీ పేరు స్థూల, సూక్ష్మ ప్రాప్తులన్నింటికీ ఆధారంగా అవుతుంది. ఈ విశేషత గురించి తెలుసా మంచిది.
                  ఇంకా ముందుకు వెళ్ళండి - ఎక్కడికి చేరుకున్నారు? (సంగమయుగం) అంటే ఎక్కడ ఉన్నారో అక్కడికి చేరుకున్నారు. సంగమయుగం యొక్క విశేషత అయితే స్వయం ఇప్పుడు అనుభవం చేసుకుంటున్నారు. ఇలా కల్పం అంతటి విశేషతలను సదా స్మృతిలో ఉంచుకుంటూ సదా అలౌకిక విచిత్ర నాట్యం చేస్తుండండి. గోప గోపికల నాట్యం చాలా ప్రసిద్ధమైనది కదా! మరి నిరంతరం నాట్యం చేస్తున్నారా లేదా కార్యక్రమం అనుసారంగా నాట్యం చేస్తున్నారా? అది ఉల్లాసం యొక్క నాట్యం. కానీ ఇది సంపూర్ణ పౌర్ణమి యొక్క నృత్యం, ఇది చాలా ప్రసిద్ధమైనది. దీని రహస్యం ఏమిటి? పౌర్ణమి అనగా మీ యొక్క సంపూర్ణతకు గుర్తు. ఈ నాట్యం యొక్క విశేషతలు ఇప్పటి వరకు వర్ణన చేస్తున్నారు. ఆ విశేషతలు ఏమిటి? ఆ సమయం యొక్క గోప గోపికల విశేషత ఏమిటి? మీ విషయాలే కదా? ముఖ్య విశేషత ఏమిటి? మూడు విషయాలు చెప్పండి. ఒక విశేషత - రాత్రిని పగలుగా చేసుకున్నారు. పగలు అనగా ప్రతి ఒక్క గోపగోపికల జీవితంలో సతో ప్రధానత అనే సూర్యుడు ఉదయించాడు. ప్రజల కొరకు కుంభకర్ణ నిద్ర యొక్క రాత్రి అనగా తమో ప్రధానం. రెండవ విశేషత - మొత్తం సమయం జాగృతి జ్యోతిగా ఉన్నారు అనగా మాయ సంకల్ప రూపంలో కూడా రాలేదు. మాయావి ప్రజలు అనగా మాయ మూర్చితం అయిపోయింది. స్పృహ తప్పిపోయింది. ఎందుకంటే జాగృతి జ్యోతులందరూ నిరంతరం బాబా తోడుగా సంలగ్నతలో నిమగ్నమై ఉన్నారు. మూడవ విశేషత - అందరూ చేతిలో చేయి వేసుకుని కలిసి ఉంటారు, తాళం కలుస్తుంది. అనగా సంస్కారాలు కలిసాయి. స్నేహం మరియు సహయోగం యొక్క సంఘటన. ఈ నృత్యంలో చక్రంలా గుండ్రంగా ఉంటారు. అనగా ఇది శక్తి స్వరూపము ప్రకృతి మరియు మాయ యొక్క ప్రభావాన్ని వేయనివ్వకుండా కోట కట్టిన దానికి గుర్తు. ఇవే విశేషతలు. అందువలనే ఈ నృత్యానికి విశేష మహత్యం ఉంది. ఇవి సంగమయుగం యొక్క విశేషతల మహిమ. మరి ఇలాంటి నాట్యం నిరంతరం చేయాలి. ఎన్నిసార్లు ఈ నాట్యం చేశారు, అనేకసార్లు చేశారు. మరలా అప్పుడప్పుడు ఎందుకు మరిచిపోతున్నారు? సంస్కారాలు కలవటం అంటే తాళం కలవటం. ఇలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు ఏమంటారు? ఆ సమయంలో భక్తులుగా అంటే బలహీనులుగా అయిపోతున్నారు. సంస్కారాలను కలుపుకోవలసి ఉంటుంది. చనిపోవలసి ఉంటుంది, వంగవలసి ఉంటుంది, వినవలసి ఉంటుంది మరియు సహించుకోవాలసి ఉంటుంది. ఇది ఎలా అవుతుంది? ఇలా, అలా అంటూ భక్తులు అయిపోతున్నారు. అందువలన ఇప్పుడు ఆ  భక్తి స్థితి యొక్క వంశం యొక్క అంశాన్ని కూడా సమాప్తి చేయండి. అప్పుడే ఈ నృత్య మండలి లోపలికి చేరుకోగలరు లేకుంటే నృత్యాన్ని చూసేవారిగా అయిపోతారు. చేయటంలో ఉన్న ఆనందం, చూడడంలో ఉండదు. అయితే మీ యొక్క విశేషతలన్నీ విన్నారు కదా! ఇలాంటి సర్వ శ్రేష్ట ఆత్మలేనా, ఇలాంటి సర్వ శ్రేష్ట ఆత్మల కొరకు బాప్ దాదా కూడా రావలసి వచ్చింది. మంచిది.
                     ఎలాంటి విశేష ఆత్మలు అంటే బాప్ దాదాని కూడా అతిథిగా చేసుకునేవారు, ఇలాంటి మహాన్ ఆత్మల యొక్క ప్రతి సంకల్పం అనేకులను మహాన్ గా తయారుచేసేదిగా ఉంటుంది. ఇలాంటి అదృష్టవంతుల యొక్క మస్తకంలో సదా అదృష్ట సితార మెరుస్తూ ఉంటుంది. ఇలాంటి పదమాపద భాగ్యశాలి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments