30-06-1973 అవ్యక్త మురళి

* 30-06-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“బాబా మరియు పిల్లలు”

           ఇది ఏ సమూహము? ఈ ఆత్మికమైన చిక్కు ప్రశ్నను గూర్చి మీకు తెలుసా? తెలుసుకున్నారా లేక తెలుసుకుంటున్నారా? తెలుసుకున్నట్లయితే మరి ఏదైతే తెలుసుకున్నారో దానిని అంగీకరించి, దాని అనుసారంగా నడుచుకుంటున్నారా? తెలుసుకోవడము మొదటి స్థితి, రెండవ స్థితి దానిని అంగీకరించడము మరియు మూడవ స్థితి దాని అనుసారంగా నడవడము కావున ఏ స్థితి వరకు చేరుకున్నారు? ఎవరైతే అవును అని అన్నారో వారికి ప్రశ్న ఏమిటంటే - లాస్ట్ స్థితి అనగా మూడవ స్థితి ఎవర్ లాస్టింగ్(సదాకాలికం)గా ఉందా? మూడవ స్థితి వరకు చేరుకోవడం సహజమే మరియు చేరుకున్నారు కూడా. కాని, లాస్ట్ స్థితిని అండర్ లైన్ చేసి ఎవర్ లాస్టింగ్ గా తయారుచేయండి. నేను ఎవరిని? ఈ అమూల్య జీవితం అనగా శ్రేష్ఠ జీవితమునకు ఉన్న భిన్నమైన నామరూపాలను గురించి మీకు తెలుసు కదా! ముఖ్య స్వరూపము మరియు ముఖ్యమైన నామము ఏమిటి? ఏ విధంగా బాబాను అనేక నామాలు, అనేక కర్తవ్యాల ఆధారంపై గాయనము చేస్తారో అయినా ముఖ్యమైన నామము అనైతే అంటారు కదా! అలాగే శ్రేష్ఠ ఆత్మలైన మీరు కూడా అనేక నామాలు, అనేక కర్తవ్యాల ఆధారంపై లేక గుణాల ఆధారంపై బాబా ద్వారా గాయనం చేయబడ్డారు. వాటిలో, ముఖ్యమైన నామం ఏమిటి? బ్రహ్మా ముఖం ద్వారా జన్మ తీసుకున్నాక బాబా ఏ నామంతో పిలిచారు? మొదట ఎప్పటివరకైతే బ్రాహ్మణులుగా అవ్వలేదో అప్పటివరకు ఏ కర్తవ్యానికీ నిమిత్తులుగా అవ్వలేరు. మొదట బ్రహ్మాముఖ వంశావళులుగా బ్రహ్మ యొక్క సంబంధంతో జన్మ తీసుకొని బ్రాహ్మణులుగా అయ్యారు అనగా బ్రహ్మాకుమారులుగా మరియు బ్రహ్మాకుమారీలుగా అయ్యారు. మీ ఇంటిపేరునే ఇలా వ్రాస్తారు. మీ పరిచయమును ఏ పేరుతో ఇస్తారు మరియు జనులు మిమ్మల్ని ఏ పేరుతో పిలుచుకుంటారు? బ్రహ్మాకుమారీ, కుమారులు. ఈ మరజీవా జీవితం యొక్క మొట్టమొదటి ముద్ర - బ్రహ్మాకుమారీ కుమారులు అనగా శ్రేష్ఠ బ్రాహ్మణత్వము.

           మొదట జన్మ తీసుకున్నారు అనగా బ్రాహ్మణులుగా అయ్యారు కావున మొదటి పేరు బ్రాహ్మణులు లేక బ్రహ్మాకుమారీలు అని ఏర్పడింది. అది మూడవ చివరి స్థితి వరకు సదా నిలిచి ఉంటుంది. ఎవర్ లాస్టింగ్ అనగా ప్రతి సంకల్పము, మాట, కర్మ, సంబంధము, సంపర్కము మరియు సేవ అన్నింటిలోను బ్రాహ్మణ స్థితి అనుసారంగా ప్రాక్టికల్ జీవితంలో నడుస్తున్నారా? సంకల్పంలోను లేక మాటలలోను శూద్రత్వము అంశమాత్రంగా కూడా కనిపించకూడదు. బ్రాహ్మణుల సంకల్పములు, మాటలు, సంస్కారాలు, స్వభావాలు మరియు కర్మలు ఎలా ఉంటాయి? ఇవైతే ఇంతకుముందు కూడా వినిపించారు కదా! మరి అదేవిధంగా ఎవర్ లాస్టింగ్ స్థితి ఉందా లేక బ్రాహ్మణ రూపంలో ప్రతి కర్మ లేక ప్రతి సంకల్పము బ్రహ్మా బాబా సమానంగా ఉందా? ఏ విధంగా బాబా ఉన్నారో పిల్లలూ అలాగే ఉన్నారా? ఏ స్వభావ సంస్కారాలు లేక సంకల్పాలు బాబావో అవే పిల్లలవిగా ఉన్నాయా? బాబాకు వ్యర్థ సంకల్పాలు కలుగుతాయా! బలహీన సంకల్పాలు ఉత్పన్నమవుతాయా! బాబాకు కలుగకపోతే మరి బ్రాహ్మణులకు ఎందుకు కలగాలి? బాబా అచలంగా, స్థిరంగా, చలించని స్థితిలో సదా స్థితులై ఉంటారు. మరి బ్రాహ్మణుల లేక పిల్లల కర్తవ్యం ఏమిటి? అర్హులైన పిల్లల బాధ్యత ఏమిటి? బాబాను అనుసరించడమే కదా!

           బాబాను అనుసరించడము అంటే కేవలం ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వడం అని కాదు. బాబాను అనుసరించడం అనగా ప్రతి అడుగు లేక ప్రతి సంకల్పంలో బాబాను అనుసరించడము. ఈ విధంగా మీరు బాబాను అనుసరిస్తున్నారా? ఏ విధంగా బాబాకు ఈశ్వరీయ సంస్కారాలు, దివ్య స్వభావాలు, దివ్య వృత్తి లేక దివ్య దృష్టి సదా ఉంటుందో అదేవిధంగా వృత్తి, దృష్టి, స్వభావాలు, సంస్కారాలు అలా తయారై ఉన్నాయా? ఈ విధంగా ఈశ్వరీయ స్వరూపం యొక్క ముఖం తయారైందా? ఏ ముఖం ద్వారానైతే బాబా గుణాలు, కర్తవ్యాల రూపురేఖలు కనిపిస్తాయో వాటినే బాబాను అనుసరించడం అని అంటారు. ఏ విధంగా బాబా గుణగానమును చేస్తారో లేక చరిత్రను వర్ణన చేస్తారో అదేవిధంగా స్వయంలో ఆ సర్వగుణాలను ధారణ చేశారా? మీ ప్రతి కర్మను చరిత్ర సమానంగా తయారుచేశారా? ప్రతి కర్మను స్మృతిలో స్థితులై చేస్తున్నారా? ఏ కర్మలైతే స్మృతిలో ఉండి చేస్తారో ఆ కర్మలు స్మృతి చిహ్నాలుగా అయిపోతాయి. మరి ఇటువంటి స్మృతిచిహ్నమూర్తులుగా అనగా కర్మయోగులుగా అయ్యారా? కర్మయోగులు అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా, యుక్తియుక్తంగా, శక్తియుక్తంగా చేసేవారుగా ఉండడము. మరి ఇటువంటి కర్మయోగులుగా అయ్యారా లేక కూర్చొనే యోగులుగా అయ్యారా? ఎప్పుడైతే విశేష రూపంగా యోగంలో కూర్చుంటారో ఆ సమయంలో యోగీ జీవితంలో అనగా యోగయుక్తంగా ఉన్నారా లేక అన్నివేళలా యోగయుక్తంగా ఉంటారా? కర్మయోగులు, నిరంతర యోగులు మరియు సహజ యోగులు అన్న వర్ణన ఏదైతే ఉందో అదే ప్రాక్టికల్ లో ఉందా అనగా సదాకాలికంగా ఉందా? కర్మయోగులను కర్మ ఆకర్షితం చేస్తోందా లేక యోగులు తమ యోగశక్తి ద్వారా, కర్మేంద్రియాల ద్వారా కర్మను చేయిస్తున్నారా? కర్మయోగిని కర్మను తన వైపుకు ఆకర్షించినట్లయితే అటువంటివారిని యోగులు అని అంటారా? ఎవరైతే కర్మకు వశమై నడుస్తారో వారిని ఏమంటారు? కర్మభోగులు అని అంటారు కదా! ఎవరైతే కర్మల భోగాలకు వశమైపోతారో వారు కర్మల భోగాలను అనుభవించడంలో మంచి లేక చెడు కర్మలకు వశీభూతులైపోతారు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు కర్మాతీతులు అనగా కర్మలకు అధీనులు కారు, కర్మలకు పరతంత్రులు కారు. స్వతంత్రులుగా ఉంటూ కర్మేంద్రియాల ద్వారా కర్మలను చేయిస్తున్నారా? మీరు ఏమి నేర్చుకుంటున్నారు లేక ఏమి నేర్చుకునేందుకు వెళుతున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఏమి జవాబు చెబుతారు? సహజ జ్ఞానమును మరియు రాజయోగమును నేర్చుకునేందుకు వెళుతున్నాము అని అంటారు కదా! మీరు ఇదే నేర్చుకుంటున్నారు కదా! ఇది పక్కాయే కదా! మీరు సహజ జ్ఞానము అని అంటున్నప్పుడు మరి సహజమైన వస్తువును స్వీకరించడము మరియు ధారణ చేయడము సహజము. కావుననే సహజ జ్ఞానము అని అంటారు కదా? మరి సదా జ్ఞాన స్వరూపులుగా అయిపోయారా? సహజ జ్ఞానమైనప్పుడు మరి సదా జ్ఞానస్వరూపులుగా అవ్వడం ఏమైనా కష్టమా? సదా జ్ఞానస్వరూపులుగా అవ్వడమే బ్రాహ్మణుల వృత్తి.

           ఈ ధర్మములో స్థితులవ్వడం సహజమైనది కదా! అదేవిధంగా రాజయోగపు అర్థమును ఏమని వినిపిస్తారు? సర్వశ్రేష్ఠమైనది అనగా అన్ని యోగాలకు రాజువంటిది అని అంటారు మరియు దీనితో రాజ్యం ప్రాప్తమవుతుంది. ఇది రాజాధిరాజులుగా అయ్యే యోగము. మీరందరూ రాజయోగులేనా లేక రాజ్యమును భవిష్యత్తులో పొందాలా? ఇప్పుడు సంగమయుగంలో కూడా రాజులుగా ఉన్నారా లేక కేవలం భవిష్యత్తులో అలా అవ్వనున్నారా? ఎవరైతే సంగమయుగంలో రాజ్యపదవిని పొందలేరో వారు భవిష్యత్తులో ఏమి పొందగలరు? కావున ఏ విధంగా సర్వశ్రేష్ఠ యోగము అని అంటారో అలా సర్వశ్రేష్ఠమైన యోగీజీవితము కూడా ఉండాలి కదా? మీరు మొదట మీ కర్మేంద్రియాలపై రాజుగా అయ్యారా? ఎవరైతే స్వయముపై రాజులుగా ఉండరో వారు విశ్వముపై రాజులుగా ఎలా అవ్వగలరు? స్థూల కర్మేంద్రియాలు లేక ఆత్మలోని శ్రేష్ఠ శక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారాలు మీ నిగ్రహంలో ఉన్నాయా అనగా వాటిపై రాజుగా అయి రాజ్యం చేస్తున్నారా? రాజయోగులుగా అనగా ఇప్పుడు రాజ్యమును నడిపించేవారిగా అవుతారు. రాజ్యమును చేసే సంస్కారాలు లేక శక్తిని ఇప్పటినుండి ధారణ చేస్తున్నారా. భవిష్య 21 జన్మలలో రాజ్యంచేసే ధారణ ప్రాక్టికల్ రూపంలో ఇప్పుడే వస్తుంది. సహజ జ్ఞానము మరియు రాజయోగము మూడవ స్థితి వరకు వచ్చిందా? సంకల్పాలకు స్టాప్ అని ఆర్డర్ చేయగానే వాటిని ఆపు చేయగలరా? శుద్ధ సంకల్పాలు లేక అవ్యక్త స్థితి లేక బీజరూప స్థితిలో స్థితులైపోండి అని బుద్ధికి డైరెక్షన్ ఇస్తే మరి దానిని అలా స్థిరం చేయగలరా? ఇటువంటి రాజులుగా అయ్యారా? ఇటువంటి రాజయోగులను ఫాలో ఫాదర్ అని అంటారు. ఏ విధంగా రాజుల వద్ద తమ సహయోగులు ఉంటారో వారి ద్వారా ఏ సమయంలో, ఏ కర్తవ్యమును చేయాలనుకుంటే అది చేయించగలరు, అలాగే ఈ సంగమయుగపు విశేష శక్తులే మీకు సహయోగులు. ఏ విధంగా రాజు ఈ కార్యమును ఇంత సమయంలో పూర్తిచేయాలి అని తన సహయోగులకు ఆర్డర్ ఇస్తాడో అలాగే మీ సర్వశక్తుల ద్వారా మీరు కూడా ప్రతి కార్యమును సహజంగానే సంపన్నం చేస్తారా లేక ఎదుర్కొనే శక్తిని రమ్మని ఆర్డర్ ఇస్తే అది ప్రక్కకు తప్పుకుంటుందా? సహజయోగి అనగా సర్వశక్తులు తమ సంపూర్ణరూపంతో సహయోగులుగా ఉన్నాయా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, వేటి ద్వారా కావాలనుకుంటే వాటి ద్వారా కార్యమును చేయించగలరా? ఇటువంటి రాజులుగా ఉన్నారా? ఏ విధంగా పాత రాజుల దర్బారులో అష్ట రత్నాలు లేక నవరత్నాలు ప్రసిద్ధమై ఉండేవారో అనగా సదా సహయోగిగా ఉండేవారో అలాగే మీ అష్ట శక్తులు సదా సహయోగులుగా ఉన్నాయా? దీనిద్వారానే మీ భవిష్య ప్రాలబ్ధమును తెలుసుకోగలరు. ఇదే దర్పణము, ఇందులో మీ ముఖమును, మీ స్వరూపమును చూడడం ద్వారా తెలుసుకోగలరు.

            ఆరు మాసాలు ఏదైతే ఇచ్చారో దానిని వినాశనపు తారీఖుగా ఇవ్వలేదు, ప్రతిఒక్క సంగమయుగపు రాజు తమ రాజ్యకార్య వ్యవహారాలు అనగా సదా సహయోగి శక్తులను ఎవర్రడిగా చేసుకొని సంసిద్ధమయ్యేందుకు ఈ సమయమును ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటినుండీ రాజ్య కార్య వ్యవహారాలను సంభాళించుకునే సంస్కారాలను నింపుకోకపోతే భవిష్యత్తులో కూడా ఎంతోకాలం కొరకు రాజులుగా అయి రాజ్యం చేయలేరు. 6 మాసాల అర్థమును అర్థం చేసుకున్నారా? మీ ప్రతి సహయోగిని మీ ముందు చూడండి మరియు మీ సంకల్పాలను నిలిపి చూడండి, మీ బుద్ధిని డైరెక్షన్ అనుసారంగా నడిపించి చూడండి. ఈ అభ్యాసం కొరకు 6 మాసాలను ఇవ్వడం జరిగింది. అర్థమైందా?

           అచ్ఛా! సదా సహజ జ్ఞానస్వరూపులు, సదా రాజయోగులు, నిరంతర యోగులు, సహజ యోగులు, సర్వశక్తులను తమ సహయోగులుగా చేసుకునేవారికి, బాబా సమానమైన సంకల్పాలను, సంస్కారాలను మరియు కర్మలను ఆచరించేవారికి ఇటువంటి సంగమయుగపు సర్వరాజులకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments