30-05-1973 అవ్యక్త మురళి

* 30-05-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "84 జన్మల రికార్డును నింపుకునే సమయము- పురుషోత్తమ సంగమ యుగము."

          అందరూ స్వయమును పాండవ సైన్యం యొక్క మహావీరులుగా లేక మహావీరిణులుగా భావిస్తున్నారా? మహావీరులు అనగా స్వయమును శక్తిశాలీగా భావిస్తున్నారా? ఎవరైనా నిర్బల ఆత్మ మీ ముందుకు వస్తే నిర్బలులైన వారికి శక్తిని ఇచ్చేవారిగా అయ్యారా లేక ఇప్పటివరకు స్వయంలోనే శక్తిని నింపుకుంటున్నారా? దాతగా ఉన్నారా లేక తీసుకునేవారిగా అయ్యారా? సర్వశక్తుల వారసత్వాన్ని ప్రాప్తించుకున్నారా లేక ఇప్పటికీ ఇంకా ప్రాప్తించుకోవాలా? ఇప్పటివరకు ఇది ప్రాప్తించుకునే సమయమా లేక ప్రాప్తింపజేసే సమయమా? మహాన్ గా అయ్యేందుకు శ్రమను తీసుకునే సమయమా? అంతిమం వరకు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధమైన సేవను తీసుకుంటూ ఉన్నట్లయితే మరి ఆ సేవకు ప్రతిఫలాన్ని భవిష్యత్తులో ఇస్తారా? భవిష్యత్తు ప్రాలబ్ధమును అనుభవించే సమయమా లేక ప్రతిఫలమును ఇచ్చే సమయమా? ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో ఉంచుకుంటూ మా అంతిమ పాత్ర లేక భవిష్యత్తు ఎలా ఉంటుంది అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎప్పుడైతే ఇప్పటినుండే సర్వఆత్మలకు బాబా ఖజానాలను ఇచ్చే దాతలుగా అవుతారో, తమ శక్తుల ద్వారా దాహార్తితో ఉన్న తపిస్తున్న ఆత్మలకు ప్రాణదానమును ఇస్తారో, వరదాతగా అయి ప్రాప్తించిన వరదానాల ద్వారా వారిని కూడా బాబాకు సమీపంగా తీసుకువస్తారో మరియు ఎప్పుడైతే బాబా సంబంధంలోకి తీసుకువస్తారో అప్పుడు ఇక్కడి దాతా స్వరూపపు సంస్కారాలు భవిష్యత్తులో 21 జన్మల వరకు రాజ్యపదవిని అనగా దాతా స్వరూపపు సంస్కారాలను నింపగలుగుతారు. ఈ సంగమ యుగమును పురుషోత్తమ సంగమ యుగము లేక సర్వశ్రేష్ఠ యుగము అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఆత్మలో ప్రతి ఒక్క రకమైన ధర్మం యొక్క, తమ రాజ్యం యొక్క శ్రేష్ఠ సంస్కారాల యొక్క, శ్రేష్ఠ సంబంధాల యొక్క మరియు శ్రేష్ఠ గుణాల యొక్క సర్వశ్రేష్ఠతలు ఇప్పుడు రికార్డువలే నిండుతూ ఉంటాయి. 84 జన్మల పైకి ఎక్కే కళ మరియు దిగే కళ ఆ రెండు సంస్కారాలను ఈ సమయంలో ఆత్మలో నింపుకుంటారు. ఇప్పుడు రికార్డును నింపుకునే సమయము కొనసాగుతోంది.

           ఎప్పుడైతే హద్దులోని రికార్డులను నింపుకుంటారో అప్పుడు ఎంతటి అటెన్షన్ ను ఉంచుతారు! హద్దులోని రికార్డులను నింపుకునేవారు కూడా మూడు విషయాలను ధ్యానమును ఉంచుతారు. అవి ఏమిటి? వారు వాయుమండలము. తమ వృత్తి మరియు వాణి ఈ మూడింటిపైనా అటెన్షన్ ను  ఉంచుతారు. వృత్తి చంచలంగా ఉంటే, అది ఏకాగ్రమవ్వకపోయినా కూడా వాడిలో ఆకర్షించే రసము ఉండదు. ఏ విధమైన గీతమును గానం చేస్తారో అదే రూపంలో స్థితులై గానం చేస్తారు. ఏదైనా దు:ఖపు గీతము ఉన్నట్లయితే దుఃఖపు రూపమును ధారణ చేసి ఆ గీతమును గానం చేయకపోతే దానిని వినేవారికి ఆ గీతములో ఎటువంటి రసమూ అనుభవమవ్వదు. హద్దులోని గీతాలను గానం చేసేవారు లేక రికార్డులను నింపేవారు కూడా ఈ విషయాలన్నింటిపైనా ధ్యానమును ఉంచుతారు. మరి బేహద్ రికార్డును నింపుకునేవారు మరియు మొత్తం కల్పం యొక్క రికార్డును నింపుకునేవారైన మీరు అన్నివేళలా ఈ విషయాలన్నింటిపైనా ధ్యానమును ఉంచుతున్నారా? ప్రతిక్షణము రికార్డును నింపుకుంటున్నాను అనే అటెన్షన్ ఉంటోందా? ఇంతటి అటెన్షన్ ఉంటోందా? రికార్డులను నింపుకుంటూ నింపుకుంటూ ఉల్లాసానికి బదులుగా బద్ధకము వచ్చినట్లయితే మరి రికార్డులను ఎలా నింపుకుంటారు? రికార్డును నింపుకునే సమయంలో ఎవరైనా బద్ధకిస్తారా? అలాగే మీరు కూడా ఎపుడైతే రికార్డును నింపుకుంటున్నారో అప్పుడు దానిని నింపుకుంటూ నింపుకుంటూ బద్ధకం వస్తుందా లేక ఎల్లప్పుడూ ఉత్సాహంలో ఉంటారా? ఇప్పుడు ఈ నిండి ఉన్న రోజంతటి యొక్క రికార్డును ఈరోజు రికార్డు ఎలా నిండింది అని సాక్షిగా అయి చూస్తూ ఉంటారా?

          చిన్న టేపులో కూడా మొదట నింపి ఆ తర్వాత చూస్తారు మరియు ఎలా నిండిందో చూద్దాము అని వింటారు. సరిగ్గా ఉందో లేదో పరిశీలిస్తారు. అలాగే మీరు కూడా సాక్షిగా అయి చూస్తున్నారా? చూడడం ద్వారా ఏమనిపిస్తుంది. నేను సరిగ్గా నింపుకున్నాను అని అనిపిస్తుందా లేక మిమ్మల్ని మీరు చూస్తూ దీని కన్నా బాగా నింపుకుంటే బాగుండేది అని భావిస్తున్నారా? రిజల్టునైతే చూస్తారు కదా! ఎల్లప్పుడూ మమ్మల్ని మేము సాక్షిగా అయి ప్రతిరోజూ పరిశీలించుకుంటున్నాము, చెక్ చేసుకోవడము ఎప్పుడూ మిస్ అవ్వకూడదు అని భావించేవారు చేతులెత్తండి. (కొద్దిమంది చేతులెత్తారు) ఇప్పటికీ ఇంకా చెక్కర్(పరిశీలించుకునేవారి)గానే అవ్వలేదా? ఎవరైతే చెక్కర్ గా అవ్వలేదో వారు మేకర్ గా ఎలా అవుతారు? మర్చిపోతున్నారా? సమయము పైకీ క్రిందికీ జరగడం జరుగవచ్చు కాని మరిచిపోవడమన్నది జరుగజాలదు. కావున అమృతవేళ ఆత్మ యొక్క దినచర్యనేదైతే తయారుచేస్తారో, ఫిక్స్ చేస్తారో దానిని పరిశీలించుకోండి. ఎందుకు మర్చిపోతున్నారు? లేక ఫిక్స్ చేయడమే రావడం లేదా? ఆత్మ యొక్క దినచర్యను ఫిక్స్ చేయడం వస్తుందా? ఇదైతే చాలా సాధారణమైన విషయమే. ఈ కామన్ నియమం పైన కూడా విస్మృతులై ఉన్నట్లయితే దీని ద్వారా ఆత్మ ఇప్పటివరకు కూడా నిర్బలముగా ఉంది అన్నది నిరూపణ అవుతుంది. ఎవరైతే స్వయమును ఈశ్వరీయ నియమాలు, ఈశ్వరీయ మర్యాదలలో నడిపించలేరో వారు విశ్వమును మర్యాదాపూర్వకంగా, లాఫుల్ గా రాజ్యమును నడిపించగలరా? ఎవరైతే సంగమయుగపు రాజ్యపదవి యొక్క అధికారులుగా అవ్వరో వారు భవిష్య రాజ్యపదవిని ఎలా పొందగలరు?

          ఈ సంగఠనలోని టీచర్లు ఎవరు? ఇంతటి తక్కువ రిజల్టుకు భాద్యులు ఎవరు? ఇక్కడకు వచ్చిన టీచర్లు వారు స్వయం చెక్కర్లుగా ఉన్నారా? ఎవరూ ధైర్యంతో చేతులెత్తడం లేదు. ఇప్పుడిప్పుడే విశ్వయుద్ధము ప్రారంభమవుతే? (అదే సమయంలో లేచి నిలుచుంటాము అని ఎవరో అన్నారు). సమయానికి లేచి నిలుచుంటే దానిని ఏమంటారు? ప్రకృతి ఆధారంపై పురుషులు నడిచినట్లయితే ఆ పురుషులను ఏమంటారు? సమయం కూడా ప్రకృతే కదా! పురుషుడు ప్రకృతి ఆధారంపై నడుస్తున్నట్లయితే మరి వారిని పాస్ విత్ హానర్ అని అంటారా? సమయపు దెబ్బ తగిలినప్పుడు ఎవరైతే నడుస్తారో వారిని ఏమంటారు? తోస్తే నడిచేవారిగా అవుతాము అని భావిస్తున్నారా? వర్తమాన సంగఠన చాలా బలహీనంగా ఉంది, మెజారిటీ బలహీనంగా ఉన్నారు. అచ్ఛా! అయినా గతించిందేదో గతించిపోయింది కాని ఇప్పటినుండీ మీరు పరివర్తన చేసుకోండి. ఇప్పుడు ఇంకా చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఇప్పుడైతే బాప్ దాదా మరియు సహయోగీ శ్రేష్ఠ ఆత్మలు పురుషార్ధీ ఆత్మలైన మీకు ఒక్కటికి వేలాదిరెట్ల సహయోగమునిచ్చి, ఆధారమునిచ్చి, స్నేహమును ఇచ్చి, సంబంధాల రూపంలో శక్తిని ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళగలరు. కాని కొద్ది సమయం తర్వాత ఈ విషయాలు అనగా లిఫ్టు లభించడం కూడా ఆగిపోతుంది కావున ఇప్పుడు ఏదైతే తీసుకోవాలనుకుంటారో దానిని తీసేసుకోండి, ఆ తర్వాత తండ్రి రూపంలో లభించే సహయోగము మారి సుప్రీం జస్టిస్ రూపము ఏర్పడుతుంది.

           జస్టిస్ ముందు ఎంతటి స్నేహీ సంబంధీకులు ఉన్నా కాని లా ఈస్ లా (న్యాయము న్యాయమే). ఇప్పుడు లవ్ తో ఉండే సమయము ఆ తర్వాత అది లా తో ఉండే సమయంగా ఉంటుంది, ఆ సమయంలో లిఫ్ట్ లభించజాలదు. ఇప్పుడు ఇది ప్రాప్తి యొక్క సమయము. ఆ తర్వాత కొద్దికాలం తర్వాత ప్రాప్తి యొక్క సమయం మారి పశ్చాత్తాప సమయం వస్తుంది. మరి మీరు ఆ సమయంలో మేలుకొంటారా? బాప్ దాదా ఇప్పుడు పిల్లలందరితో కొద్ది సమయంలో ఎంతో ప్రాప్తిని తయారుచేసుకోండి అని చెబుతున్నారు, సమయమును గూర్చి ఎదురుచూస్తూ నిర్లక్ష్యులుగా అవ్వకండి, మా ప్రతి కర్మ 84 జన్మల రికార్డును నింపుకునే ఆధారము అని భావించండి. మీ వృత్తి, మీ వాయుమండలము మరియు వాణిని యథార్థ రూపంలో సెట్ చేసుకోండి. ఏ విధంగా వారు కూడా వాతావరణమును తయారుచేస్తారో, అలాగే మీరు కూడా మీ వాతావరణమును మీ అంతర్ముఖత యొక్క శక్తితో శ్రేష్ఠంగా తయారుచేసుకోండి. వృత్తిని కూడా శ్రేష్ఠంగా మరియు వాణిని కూడా రహస్యయుక్తంగా మరియు యుక్తియుక్తంగా తయారుచేసుకోండి అప్పుడే ఈ రిజల్టు మారగలదు. మారడమైతే మారాలి కదా! లేక అలాగే స్వీకరిస్తారా? మేము పంచతత్వాలను కూడా మార్చివేస్తాము అని ఛాలెంజ్ నైతే బాగా చేస్తారు. మరి పరిశీలించకుండా తయారుచేసుకునేవారిలా ఎలా అవుతారు? ఇప్పటినుండే కంప్లేంటులు కంప్లీటైపోవాలి. ఇప్పటినుండి ఈ బలహీనతలు విముక్తమై, మళ్ళీ అంతిమం వరకు ఇవి ఎప్పుడూ ఉండవు అని భావించేవారు చేతులెత్తండి. దీని బాధ్యత ఎవరిపైన ఉంచాలి? (కొందరు దీదీపై అన్నారు, మరికొందరు బాప్ దాదాలపై అని అన్నారు). బాప్ దాదా చేస్తే బాప్ దాదా పొందుతారు. చేసే సమయంలో బాప్ దాదా మరియు పొందే సమయంలో? భవిష్య పదవిని పొందడమును త్యాగం చేస్తే మరి చేయడమును కూడా త్యాగం చేయండి పరవాలేదు. కాని అలా చేయలేరు ఎందుకంటే ముక్తిధామానికి చెందినవారు కాదు. ప్రతిఒక్కరూ తమ బాధ్యతను తామే చేపట్టాలి. దీదీ, దాదీ లేక టీచర్లు బాధ్యులు అని భావిస్తున్నట్లయితే దీని ద్వారా మీరు భవిష్యత్తులో వారి ప్రజలుగా అవ్వాలి, రాజులుగా కాదు అన్నది నిరూపణ అవుతుంది. ఇవి కూడా ఆధీనంగా ఉండే సంస్కారాలే కదా! ఎవరైతే ఆధీనులుగా ఉంటారో వారు అధికారులుగా అవ్వలేరు, విశ్వరాజ్య భాగ్యాన్ని పొందలేరు. కావున స్వయం యొక్క బాధ్యతను, మొత్తం విశ్వం యొక్క బాధ్యతను తీసుకునేవారే విశ్వమహారాజులుగా అవ్వగల్గుతారు. విశ్వకళ్యాణకారి అయిన బాబా సంతానంగా అయి మీ కళ్యాణమును చేసుకోలేరా? ఇదేమైనా శోభిస్తుందా? ఎవరైనా లక్షాధికారులుగా ఉన్నా ఒక్క రూపాయి సుఖమును కూడా వారు స్వయం తీసుకోలేరు. ఇది కలియుగపు కర్మభోగపు గుర్తు అని తెలియజేస్తారు కదా! కావున మీరు సర్వశక్తివంతుని ఖజానాకు అధిపతులు. కాని, స్వయం కొరకు ఒక చిన్న శక్తిని కూడా ఉపయోగించుకోలేరు! దీనిని ఏమంటారు? సంగమ యుగంలో ఇది ఏమైనా బ్రాహ్మణుల గుర్తా? ఇప్పుడు సంగమయుగ వాసులుగా ఉన్నారా లేక సంగమ యుగంలో నిలువలేకపోతే ఎక్కడకు వెళ్ళగలము అని ఒక పాదమును కలియుగంలో పెట్టేసారా? ఇది సంగమ యుగపు గుర్తు కాదు కావున ఇప్పటినుండే తీవ్ర పురుషార్థిగా అయి మేము చేయవలసిందే అన్న దృఢసంకల్పాన్ని చేపట్టండి. చేస్తాము మరియు ప్లాను తయారుచేస్తాము... దీనిని కూడా తీవ్ర పురుషార్థము అని అనరు. ఏం ప్లానును తయారుచేస్తారు? ప్లాను తయారై లేదా? త్రికాలదర్శులకు ప్లానును తయారుచేసుకోవడంలో సమయం పట్టదు ఎందుకంటే వారికి మూడు కాలాలు స్పష్టంగా ఉంటాయి. అన్ని కార్యాలు క్షణంలో అయిపోయే ఇటువంటి మీ తీవ్రగతిని తయారుచేసుకోండి. ఇలా తీవ్రగతి కలవారే సద్గతిని పొందుతారు. అచ్ఛా!

          ఈ విధంగా ఆశావాదులుగా బాప్ దాదాల శ్రేష్ఠ సంకల్పమును సాకారము చేసే, ప్రతి సంకల్పమును, కర్మను, వాక్కును పరిశీలించుకునేవారికి, ప్రతి క్షణంలో, ప్రతి సంకల్పంలో స్వకళ్యాణమును మరియు విశ్వకళ్యాణమును చేసేవారికి, విశ్వకళ్యాణకారులు, విశ్వపరివర్తక ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments