30-05-1971 అవ్యక్త మురళి

* 30-05-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“తండ్రి ఆజ్ఞ మరియు ప్రతిజ్ఞ."

             బాప్ దాదా ఆజ్ఞను కూడా ఇస్తారు మరియు ప్రతిజ్ఞను కూడా చేస్తారు. ఆజ్ఞ కూడా ఉండే మరియు ప్రతిజ్ఞ కూడా ఉండే అటువంటి మహావాక్యము ఏది? ఆజ్ఞ మరియు ప్రతిజ్ఞ రెండూ వచ్చే అటువంటి మహావాక్యము గుర్తుకు వస్తుందా! అటువంటి మహావాక్యాలు చాలా ఉన్నాయి, దాని లిస్టు చాలా పెద్దది, అందులో ఆకర్షణ కలిగించే మహావాక్యము - 'ఒక్క అడుగు మీరు వేసినట్లయితే వెయ్యి అడుగులు బాప్ దాదా ముందుకు వేయిస్తారు' 10 అడుగులు కాదు, వెయ్యి అడుగులు. ఈ మహావాక్యములో ఒక్క అడుగు ముందుకు వెయ్యండి అన్న ఆజ్ఞ కూడా ఉంది మరియు వెయ్యి అడుగులు బాప్ దాదా కూడా ముందుకు వేయిస్తారు అన్న ప్రతిజ్ఞ కూడా ఉంది. ఉల్లాసఉత్సాహాలను కలిగించే ఇటువంటి మహావాక్యాలను ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవాలి. ఆజ్ఞను పాలన చెయ్యటం ద్వారా తండ్రి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దాని ద్వారా సహజరీతిలో స్వయమును ముందుకు తీసుకెళ్ళగలరు ఎందుకంటే ప్రతిజ్ఞ సహాయరూపంగా మారుతుంది. ఒకటి మీ ధైర్యము, రెండవది సహాయము - ఎప్పుడైతే ఈ రెండూ కలుస్తాయో అప్పుడు సహజమైపోతుంది. కావున ఇటువంటి మహావాక్యాలను ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవాలి. స్మృతియే సమర్థతను తీసుకువస్తుంది. ఏవిధంగా రాజపుత్రులు యుద్ధమైదానములోకి వెళ్తున్నప్పుడు, వారు ఎటువంటి బలహీనులుగా ఉన్నాకానీ వారికి వారి కులపు స్మృతిని కలిగిస్తారు, రాజపుత్రులు ఇలా ఇలా ఉంటారు, ఇలా ఉండి వెళ్ళారు, ఇలా ఇలా చేసి వెళ్ళారు, అటువంటి కులానికి చెందినవాడివి నువ్వు.. అంటూ ఇలాంటివి గుర్తు చెయ్యటం ద్వారా వారిలో సమర్థత వస్తుంది. కేవలము కుల మహిమను వింటూ వింటూ అటువంటి మహానులుగా తయారౌతారు. ఈ విధంగా, మీరు సూర్యవంశీయులు, ఆ సూర్యవంశపు రాజ్యమును పరిపాలించే వారు ఎలా ఉండేవారు? ఎలా రాజ్యము చేసారు మరియు ఏ శక్తి ఆధారంతో అటువంటి రాజ్యమును పాలించారు? ఆ స్మృతి మరియు తోడుతోడుగా ఇప్పుడు సంగమయుగపు ఈశ్వరీయ కులపు స్మృతి. ఒకవేళ ఈ రెండు సృతులూ బుద్ధిలోకి వచ్చినట్లయితే మళ్ళీ సమర్థత వచ్చేస్తుంది. ఈ సమర్థత ద్వారా మాయను ఎదుర్కోవటము సరళమైపోతుంది, కేవలము స్మృతి ఆధారముతో, కావున ప్రతి కార్యములో సఫలతను పొందేందుకు సాధనము ఏమిటి? స్మృతి ద్వారా మొదట మీలో సమర్థతను తీసుకురండి, పిదప కార్యమును చేసినట్లయితే ఎంత బలహీనురుగా ఉన్నాగానీ స్మృతి ఆధారముతో ఆ సమయమునకు సమర్థత వచ్చేస్తుంది. మొదటైతే వారు ఆ కార్యమునకు యోగ్యులుగా భావించకపోయినా గానీ స్మృతి ద్వారా వారు తమను యోగ్యులుగా గుర్తుంచి, భవిష్యత్తు కొరకు ఉల్లాసఉత్సాహాలలోకి వస్తారు. కావున అన్ని కార్యాలు చేసే ముందు ఈ స్మృతిని కలిగి ఉండండి, ఈశ్వరీయ కులము మరియు భవిష్య కులము, ఈ రెండింటి సృతి రావటం ద్వారా ఎప్పుడూ నిర్బలత రాజాలదు. నిర్బలత లేనట్లయితే అసఫలత కూడా ఉండదు. అసఫలతకు కారణమే ఈ నిర్బలత. ఎప్పుడైతే స్మృతి ద్వారా సమర్థతను తీసుకువస్తారో అప్పుడు నిర్బలత అనగా బలహీనత సమాప్తమౌతుంది, అసఫలత ఉండజాలదు. కావున సదా సఫలతామూర్తులుగా అయ్యేందుకు మీ స్మృతిని శక్తిశాలిగా తయారుచేసుకోండి, పిదప స్వయం కూడా ఆ స్వరూపంగా అయిపోతారు. ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్వరూపముగా స్వయాన్ని అనుభవము చేసుకుంటారు. నేను శక్తిని అన్న స్మృతి ఉన్నట్లయితే శక్తిస్వరూపులుగా అయ్యి ఎదుర్కోగలరు. ఒకవేళ స్మృతిలోనే నేను పురుషార్థిని, ప్రయత్నం చేసి చూస్తాను అన్నవి ఉన్నట్లయితే స్వరూపము కూడా బలహీనమైనదిగా తయారౌతుంది. కావున స్మృతిని శక్తిశాలిగా తయారుచేసుకోవటం ద్వారా స్వరూపము కూడా శక్తివంతమైనదిగా అయిపోతుంది. కావున ఇది సఫలతను పొందేందుకు పద్దతి. అప్పుడిక, అనుకున్నాగానీ ఎందుకని అవ్వదు లాంటి మాటలు మాట్లాడలేరు.

           కోరికతో పాటుగా సమర్థత కూడా కావాలి మరియు స్మృతి ద్వారానే సమర్థత వస్తుంది. ఒకవేళ స్మృతి బలహీనంగా ఉన్నట్లయితే అప్పుడిక ఏ సంకల్పమును చేసినా దాని సిద్ధి జరుగదు. ఏ కర్మనైతే చేస్తారో అది కూడా సఫలతను పొందదు. మరి స్మృతిని ఉంచుకోవటము కష్టమా లేక సహజమా? సహజ విషయమేదైతే ఉంటుందో అది నిరంతరము కూడా ఉండగలదు. స్మృతి అయితే నిరంతరమూ ఉంటుంది కూడా, కానీ ఒకటి సాధారణ స్మృతి అయితే మరొకటి పవర్ ఫుల్ స్మృతి. సాధారణ రూపంలో అయితే స్మృతి ఉంటుంది కానీ పవర్ ఫుల్ స్మృతి ఉండాలి. ఏవిధంగా ఎవరైనా జడ్జి వున్నారనుకోండి, తనకు మొత్తం రోజంతా తను జడ్జిని అన్న స్మృతి  అయితే ఉంటుంది, కానీ ప్రత్యేకంగా కుర్చీలో కూర్చున్నప్పుడు ఆ సమయంలో మొత్తము రోజంతటిలోని స్మృతి కంటే కూడా పవర్‌ఫుల్ స్మృతి ఉంటుంది. కావున డ్యూటీలో అనగా కర్తవ్యంలో ఉండటం ద్వారా పవర్ ఫుల్ స్మృతి ఉంటుంది. మామూలుగా సాధారణ స్మృతి ఉంటుంది. మరి మీరు కూడా సాధారణ స్మృతిలో అయితే ఉంటారు కానీ, పవర్‌ఫుల్ స్మృతి, దానితో పూర్తిగా ఆ స్వరూపంగా తయారవ్వటము మరియు స్వరూపమునకు సిద్ధిగా సఫలత లభించటము..... అది ఎంత సమయము ఉంటుంది? దీని అభ్యాసము చేస్తున్నారు కదా! మేము ఈశ్వరీయ సేవలో ఉన్నాము అని నిరంతరమూ భావించండి. కర్మణా సేవను చేస్తున్నాగానీ నేను ఈశ్వరీయ సేవలో ఉన్నాను అని భావించండి. భోజనము తయారుచేస్తున్నా గానీ, అదైతే స్థూల కార్యము కానీ భోజనములో ఈశ్వరీయ సంస్కారాలను నింపాలి, భోజనమును శక్తిశాలిగా తయారుచేసుకోవాలి, అది ఈశ్వరీయ సేవ అవుతుంది కదా! 'ఎటువంటి అన్నమో అటువంటి మనసు' అని అంటారు. కావున భోజనమును తయారుచేసే సమయంలో ఈశ్వరీయ స్వరూపము ఉన్నట్లయితే అప్పుడు ఆ అన్నము ప్రభావము మనసుపై పడుతుంది. మరి భోజనమును తయారుచేసే స్థూల కార్యమును చేస్తూ కూడా ఈశ్వరీయ సేవలో ఉన్నారు కదా! మేము కేవలము గాడ్లీ సర్వీస్ లో ఉన్నాము అని మీరు వ్రాస్తారు కూడా. మరి దాని భావార్థము ఏమిటి? ఈశ్వరీయ సంతానమైన మేము కేవలము మరియు ఎల్లప్పుడూ ఈ సేవ కొరకే ఉన్నాము. దాని స్వరూపము స్థూల సేవదైనా కానీ అందులో కూడా ఎల్లప్పుడూ ఈశ్వరీయ సేవలో ఉన్నాము. ఎప్పటివరకైతే ఈ ఈశ్వరీయ జన్మ ఉందో అప్పటివరకు ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి కార్యము ఈశ్వరీయ సేవనే. ఆ మనుష్యులైతే కొద్ది సమయము కొరకు కుర్చీపైన కూర్చుని తమ సర్వీసును చేస్తారు, మీకైతే అలా కాదు. ఎల్లప్పుడూ మీ సేవా స్థానములో ఎక్కడ ఉన్నాగానీ, ఆ స్మృతి అయితే ఉండాలి. అప్పుడిక మళ్ళీ బలహీనత రాజాలదు. ఎప్పుడైతే మీ సేవా సీట్ ను వదిలివేస్తారో అప్పుడు సీట్ ను వదలటం ద్వారా స్థితి కూడా సెట్ అవ్వదు. సీటును వదలకూడదు. కుర్చీ పైన కూర్చొవటం ద్వారా నషా ఉంటుంది కదా! ఒకవేళ ఎల్లప్పుడూ మీ పదవి అనే కుర్చీపై కూర్చున్నట్లయితే నషా ఉండదా? కుర్చీ లేక పదవిని ఎందుకు వదుల్తారు? అలసిపోతారా? మొదట ద్వికిరీటధారులు ఉండేవారు, తరువాత రావణుడు వెనక నుండి వారి కిరీటాన్ని తీసేస్తూ ఉంటాడు అనే రాజు చిత్రాన్ని మీరు ఏవిధంగా చూపిస్తారో అలా ఇప్పుడు కూడా జరుగుతుందా? మాయ వెనుక నుండే పదవి నుండి దించేస్తోందా? ఇప్పుడైతే మాయ వీడ్కోలు తీసుకొనేందుకు, సత్కారము చేసేందుకు వస్తుంది, ఆ రూపముతో ఇప్పుడు రాకూడదు. ఇప్పుడైతే వీడ్కోలు తీసుకుంటుంది. కలియుగము వీడ్కోలు తీసుకొని పోతూ ఉంది అని మీరు డ్రామాను చూపిస్తారు. ప్రాక్టికల్ లో మీ అందరి వద్దకు మాయ వీడ్కోలు తీసుకొనేందుకు వస్తుంది, అంతేకానీ యుద్ధము చేసేందుకు కాదు. ఇప్పుడు మాయ యుద్ధమునుండైతే అందరూ బయటపడ్డారు కదా! ఒకవేళ ఇప్పుడు కూడా మాయ యుద్ధము ఉన్నట్లయితే ఇక మీరు అతీంద్రియ సుఖపు అనుభవమును ఎప్పుడు చేస్తారు? దానినైతే ఇప్పుడు చెయ్యాలి కదా! రాజ్యభాగ్యమునైతే భవిష్యత్తులో అనుభవము చేస్తారు, కానీ అతీంద్రియ సుఖపు అనుభవమును ఇప్పుడే చెయ్యాలి కదా! మాయతో యుద్ధము జరగటం ద్వారా ఈ అనుభవమును పొందలేకపోతారు. తండ్రి పిల్లలుగా అయ్యి వర్తమాన అతీంద్రియ సుఖపు పూర్తి అనుభవమును ప్రాప్తి చెయ్యనట్లయితే ఇక ఏం చేస్తారు?

           సంతానము అనగా వారసత్వమునకు అధికారి. కావున ఎల్లప్పుడూ దీనిని ఆలోచించిండి  సంగమయుగపు శ్రేష్ఠ వారసత్వమైన అతీంద్రియ సుఖము సదాకాలమునకు ప్రాప్తించిందా? ఒకవేళ అల్పకాలము కొరకు ప్రాప్తి చేసుకొన్నట్లయితే ఇక తేడా ఏముంది? సదాకాలపు ప్రాప్తి కొరకే తండ్రి పిల్లలుగా అయ్యారు. అయినా కూడా అల్పకాలిక అనుభవము ఎందుకు? నిరంతరమైన, స్థిరమైన అనుభవము ఉండాలి. అప్పుడే స్థిరమైన, అఖండమైన స్వరాజ్యమును ప్రాప్తి చేసుకుంటారు. మరి నిరంతరంగా ఉంటుందా లేక మధ్యమధ్యలో తెగిపోతుందా? విరిగిపోయి మళ్ళీ అతికించబడిన వస్తువు మరియు అస్సలు విరిగిపోని వస్తువు ఉన్నట్లయితే రెండింటిలో ఏది మంచిగా అనిపిస్తుంది? విరిగిపోని వస్తువు మంచిగా అనిపిస్తుంది కదా! కావున ఈ అతీంద్రియ సుఖము కూడా నిరంతరము ఉండాలి. తండ్రి వారసత్వమునకు అధికారిగా అవుతాము అని అప్పుడు భావించండి. ఒకవేళ తెగిపోనిదిగా, స్థిరంగా లేనట్లయితే ఏమని భావించాలి? వారసత్వమునకు అధికారిగా అవ్వలేదు కానీ ఏదో కొంచెము దానపుణ్యాల రీతితో ప్రాప్తి చేసుకొన్నారు, అది అప్పుడప్పుడూ ప్రాప్తిస్తుంది. వారసత్వము ఎల్లప్పుడూ మీ ప్రాప్తిగా ఉంటుంది. దానపుణ్యాల ప్రాప్తి అప్పుడప్పుడు ఉంటుంది. వారసులైనట్లయితే వారసుల గుర్తు - అతీంద్రియ సుఖపు వారసత్వమునకు అధికారి. వారసునికి తండ్రి అన్నింటినీ విల్ చేస్తారు. ఎవరైతే వారసులు కారో వారికి ఏదో కొంచెము ఇచ్చి సంతోషపరుస్తారు. తండ్రి అయితే పూర్తిగా విల్ చేస్తున్నారు. ఎవరికైతే తండ్రి విల్ పైన పూర్తి అధికారము ఉంటుందో, వారి గుర్తుగా ఏం కనిపిస్తుంది? వారు విల్ పవర్ కలవారిగా ఉంటారు. వారి ఒక్కొక్క సంకల్పము విల్ పవర్ కలిగినవారిదిగా ఉంటుంది. ఒకవేళ విల పవర్ ఉన్నట్లయితే ఎప్పుడూ అసఫలత ఉండదు. పూర్తి విల్ కు అధికారిగా అవ్వలేదు కనుకనే విల్ పవర్ రాదు. తండ్రి ప్రాపర్టీ మరియు ప్రాస్పరిటీ(ఆస్తిపాస్తు)లను తమ ప్రాపర్టీగా చేసుకోవటము - ఇందులో చాలా విశాలబుద్ధి అవసరము. తండ్రి ప్రాపర్టీని తమ ప్రాపర్టీగా ఎలా తయారుచేసుకుంటారు? ఎంతగా తమదిగా తయారుచేసుకుంటారో అంతగానే నషా మరియు సంతోషము ఉంటాయి. మరి తండ్రి ప్రాపర్టీని తమ ప్రాపర్టీగా తయారుచేసుకొనేందుకు సాధనము ఏమిటి? లేక తండ్రి ప్రాపర్టీని తండ్రికే ఉంచేస్తారా? (కొందరు తమ ఆలోచనలను వినిపించారు) ఎవరి హృదయమైతే సత్యముగా ఉంటుందో వారితో తండ్రి సంతోషపడతారు, అప్పుడే ప్రాపర్టీని ఇస్తారు. ప్రాపర్టీనైతే  ఇచ్చేసారు, ఇప్పుడు కేవలము దానిని తమదిగా చేసుకొనే విషయము ఉంది. ఎప్పుడైతే ప్రాపర్టీని తమదిగా చేసుకొని ఉంటారో అప్పుడే సేవను మరియు దానమును కూడా చెయ్యగలరు. కానీ విషయమేమిటంటే మొదట దానిని తమదిగా ఎలా చేసుకోవాలి? తమదిగా చేసుకొని పిదప ఇతరులకు ఇవ్వటం ద్వారా పెరుగుతూ ఉంటుంది, ఇది తరువాతి సంగతి. కానీ మొదట తమదిగా ఎలా తయారుచేసుకోవాలి? ఎంతెంతగా ఖజానా లభిస్తుందో, దాని పైన మనన చింతన చెయ్యటం ద్వారా అది లోపల ఇముడుతుంది. ఎవరైతే మననము చేస్తారో వారి మాటలో కూడా విల్ పవర్ ఉంటుంది. కొందరి మాటలలో శక్తి అనుభవమౌతుంది, ఎందుకని? వినటమైతే అందరూ కలిసి వింటారు. ప్రాపర్టీ అయితే అందరికీ ఒకే విధంగా, ఒకే సమయంలో లభిస్తుంది. ఎవరైతే మననము చేసి ఇవ్వబడిన ఆ ప్రాపర్టీని తమదిగా చేసుకుంటారో వారికి ఏం జరుగుతుంది? 'తమలోని విశేషతలను ఎంతగా తలచుకుంటారో అంతగా నషా పెరుగుతుంది' అన్న నానుడి ఉంది కదా! ఇప్పుడు కేవలము రిపీట్ చేసే అభ్యాసము ఉంది, మననము చేసే అభ్యాసము తక్కువగా ఉంది. ఎంతెంతగా మననము చేస్తారో అనగా ప్రాపర్టీని తమదిగా తయారుచేసుకున్నట్లయితే నషా కలుగుతుంది. ఆ నషాతో ఎవరికైనా వినిపించినట్లయితే వారికి కూడా నషా కలుగుతుంది, లేనట్లయితే నషా ఎక్కదు. కేవలము భక్తులుగా అయ్యి మహిమను చేస్తారు, నషా ఎక్కదు. కావున మననము చేసే అభ్యాసమును చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడిక ఎటువంటి దృష్టి వస్తుందంటే - మీ ఆనందములో మీరు పరమానందముగా ఉంటారు. మళ్ళీ ఈ ప్రపంచములోని ఏ వస్తువు గానీ, చిక్కులు గానీ మిమ్మల్ని ఆకర్షితము చెయ్యవు ఎందుకంటే మీరు మీ మననపు ఆనందములో ఆనందిస్తూ ఉంటారు. ఏ రోజైతే మననములో ఆనందముగా ఉంటారో ఆరోజు మాయ కూడా ఎదుర్కోదు ఎందుకంటే మీరు బిజీగా ఉన్నారు కదా! ఒకవేళ ఎవరైనా బిజీగా ఉన్నట్లయితే ఇతరులెవరైనా ఒకవేళ వచ్చినా తిరిగి వెళ్ళిపోతారు. వారు ఏవిధంగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్తారో అలా మీరు కూడా మననము చెయ్యటం ద్వారా లోపలకు అనగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతారు. అండర్ గ్రౌండ్ లో ఉండటం ద్వారా బయటి బాంబులు మొదలగువాటి ప్రభావము ఉండదు. ఈవిధంగా మననములో ఉండటం ద్వారా, అంతర్ముఖిగా ఉండటం ద్వారా బాహ్యర్ముఖత విషయాలు డిస్టర్బ్ చెయ్యవు. దేహ అభిమానము నుండి గైర్ హాజర్ గా ఉంటారు. ఎవరైనా వారి సీట్ లో లేకపోతే మనుష్యులు తిరిగి వెళ్ళిపోతారు కదా, అలాగే మీరు కూడా మననములో అనగా అంతర్ముఖతలో ఉండటం ద్వారా దేహ అభిమానమనే సీటును వదిలివేస్తారు, అప్పుడు మాయ తిరిగి వెళ్ళిపోతుంది ఎందుకంటే మీరు అంతర్ముఖతలో అనగా అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. ఈ రోజుల్లో రక్షణ కోసంగా చాలా అండర్ గ్రౌండ్ లను తయారుచేస్తూ ఉంటారు. మరి మీకు కూడా రక్షణకు సాధనము ఈ అంతర్ముఖతయే అనగా దేహభానము నుండి అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ లో ఉండటము మంచిగా అనిపిస్తుందా? ఎవరికైతే అభ్యాసము ఉండదో వారు కొద్ది సమయము అంతర్ముఖతలో ఉండి మళ్లీ బాహ్యర్ముఖతలోకి వచ్చేస్తారు ఎందుకంటే అనేక జన్మల సంస్కారము బాహ్యర్ముఖతదిగా ఉంది, కావున అంతర్ముఖతలో తక్కువగా ఉండగలుగుతారు, కానీ నిరంతరము అంతర్ముఖులుగా ఉండాలి. అచ్ఛా!

Comments