29-08-1971 అవ్యక్త మురళి

 * 29-08-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“అన్నింటికన్నా సూక్ష్మ బంధనము - బుద్ధి యొక్క అభిమానము." 

             యోగయుక్తులుగా మరియు బంధనముక్తులుగా అయ్యారా? ఎంతెంతగా యోగయుక్తులుగా అవుతారో అంతంతగానే సర్వ బంధనముక్తులుగా అవుతూ ఉంటారు. కావున యోగయుక్తమునకు గుర్తే - బంధనముక్తముగా ఉండటము.

           యోగయుక్తముగా అవటంలో అడ్డంకులు వేసే బంధనాలు ఏయే విధాలుగా ఉన్నాయో ఆ బంధనాలన్నింటి గురించి తెలుసు కదా? ఏవిధంగా సర్వ దు:ఖాల లిస్టును తయారుచేసారో అలా భిన్న భిన్న బంధనాల లిస్టును కూడా తయారు చేయండి. ఎన్ని బంధనాల నుండి ముక్తులుగా అయ్యాము మరియు ఎన్ని బంధనాలు ఇప్పటివరకు ఉన్నాయి అన్నదానిని, ఆ లిస్టును ముందు పెట్టుకొని పరిశీలించుకోండి. దీని ద్వారా సంపూర్ణ స్థితికి ఎంత సమీపంగా చేరుకున్నాము అన్న మీ సంపూర్ణ యోగయుక్త స్థితిని అనగా సంపూర్ణ స్థితిని పరిశీలించుకోగలరు. బంధనాల లిస్టును ఎదురుగా తీసుకురండి, ఎన్ని రకాల బంధనాలు ఉంటాయి? వీటి లిస్టును తయారుచేసినట్లయితే వలలాగా కనిపిస్తాయి. ఎంత సూక్ష్మమైన దారాలతో కూడిన వలను తయారుచేసుకుంటారు! కావున ఎన్ని బంధనాలు ఉండిపోయాయి మరియు ఏవేవి ఉండిపోయాయి అన్నదానిని ఇప్పుడు నిర్ణయించుకోండి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద బంధనాలు, కొన్ని చిన్న చిన్న బంధనాలు. ఏ బంధనాలను సమాప్తము చేసుకోవటములో ఎక్కువ కష్టము అనిపిస్తుంది? అన్నింటికన్నా అతి పెద్ద బంధనము ఏది? (దేహ-అభిమానము) ఇదైతే అన్ని బంధనాలకు పునాది. కానీ ప్రత్యక్ష రూపంలో అన్నింటికన్నా కఠినమైన బంధనము ఏది? లోక నిందైతే చాలా చిన్న విషయము, ఇదైతే మొదటి స్టెప్. అన్నింటికన్నా అతి పెద్ద అంతిమ బంధనము - శ్రీమతముతో పాటు మీ జ్ఞానమును బుద్ధిలో మిక్స్ చెయ్యటము అనగా స్వయమును చాలా తెలివైనవారిగా భావించుకొని, శ్రీమతమును మీ బుద్ధి యొక్క అద్భుతముగా భావించి కార్యములో వినియోగించటము. దీనినే జ్ఞాన అభిమానము అనగా బుద్ధి అభిమానము అని అంటారు. ఇది అన్నింటికన్నా సూక్ష్మమైన మరియు పెద్ద బంధనము. ఈ బంధనమును దాటివేసినట్లయితే చాలా పెద్ద జంప్ చేసినట్లుగా అనుకోండి. ఒకవేళ ఏ విషయంలోనైనా ఏవైనా మధురమైన మాటలతో కూడా మీ బలహీనతను గూర్చిన సంకేతమును ఇచ్చినప్పుడు మరియు ఆ సమయములో ఏదైనా సంస్కారము, స్వభావము లేక సేవ విషయంలో ఏదైనా చెడు చేసినట్లయితే రెండు విషయాలనూ ఎదురుగా ఉంచుకొంటూ ఆలోచించండి - చాలా కొంచెమైనా వృత్తిలోగానీ లేక ముఖములోగానీ తేడా వస్తుందా? కొంచెమైనా తేడా రానట్లయితే, కొంచెమైనా ధైర్యము, ఉల్లాసములలో అంతరము రానట్లయితే ఈ బంధనమును క్రాస్ చెయ్యటము అని దానినే అంటారు. ఒకవేళ నోటితో ఏమీ అనకపోయినా గానీ విన్న విషయము యొక్క వ్యర్థ సంకల్పము వచ్చినా గానీ, చాలా పెద్ద బంధనము అని దానిని అంటారు.

           నిందా-స్తుతి, ఓటమి-గెలుపు, పొగడ్త-గ్లాని అన్నింటిలో సమానము అన్న గాయనము ఏదైతే ఉందో అనగా ఇది ఓటమి, ఇది గెలుపు, ఇది మహిమ, ఇది గ్లాని అన్న జ్ఞానము బుద్దిలో ఉంటుంది కానీ ఏకరస అవస్థ లేక స్థితిలో పైకి క్రిందకు అవ్వకుండా ఉండటము - దీనినే సమానత అని అంటారు. జ్ఞానము ఉంటూ కూడా పైకి క్రిందకు అవ్వకుండా ఉండటము - ఇదే విజయము. కావున ఈ కఠినమైన బంధనాన్ని క్రాస్ చేసేసారు అంటే సంపూర్ణ ఫరిస్తాగా అయిపోవటము. దీని కొరకు కావలసిన ముఖ్య ప్రయత్నము ఏది? ఈ బంధనమును కూడా క్రాస్ చేసే ఆ స్థితిని ఎలా ఉంచుకోవాలి? జ్ఞానఅభిమానమును ఎలా క్రాస్ చెయ్యాలి? దీనికి కావలసిన పురుషార్థము ఏమిటి? మీరందరూ ఏ విషయాలనైతే వినిపించారో అవికూడా అటెన్షన్ లో పెట్టుకోవలసినవి. కానీ తోడుతోడుగా ఈ కఠినమైన బంధనమును క్రాస్ చేసేందుకు ఎల్లప్పుడూ ఈ విషయాలను గుర్తు ఉంచుకోవాలి. మేము కల్యాణకారి అయిన తండ్రి సంతానము. ఏది చూసినా, విన్నా అందులో అకల్యాణపు రూపము ఉన్నా కూడా మీ కల్యాణపు విషయాన్ని వెలికితీయాలి. రూపము అకల్యాణముదిగా ఉన్నా, ఓటమి లేక గ్లానిదిగా ఉన్నాగానీ.... స్థితిని పైకి క్రిందకు చేసేందుకు ఈ మూడు కారణాలూ ఉంటాయి, కావున ఒకవేళ రూపము ఇదే కనిపించినా గానీ ఆ అకల్యాణ రూపమును కల్యాణకారీ రూపములోకి ట్రాన్స్ ఫర్ చేసే శక్తి లేక గ్లానిని కూడా ఉన్నతిరూపంగా భావించి ధారణ చేసే శక్తి లేక ఓటమి నుండి కూడా ముందు కొరకు వేయి రెట్లు విజయులుగా అయ్యే ధైర్యము, ఉల్లాసము మరియు యుక్తిని వెలువరించే శక్తి ఒకవేళ మీ వద్ద ఉన్నట్లయితే ఎప్పుడూ ముఖము మరియు గుణములలో వాటి ప్రభావము పడదు. మరి అందుకు రహస్యము ఏమై ఉంటుంది? ఏ విషయమునైనా లేక సమస్యనైనా ట్రాన్స్ ఫర్ చేసి ట్రాన్స్ పరెంట్ (పారదర్శకం)గా అవ్వాలి మరియు అపకారులకు కూడా ఉపకారులుగా అవ్వాలి. ఏవిధంగా సంస్కారాల సమానత కారణంగా కొందరు సఖులుగా అయిపోతారు కదా! అలా నిందను చేసేవారిని కూడా ఆ స్నేహము మరియు సహయోగపు దృష్టితో చూడాలి. సంస్కారాల సమానత కలిగిన సఖులు మరియు గ్లాని చేసేవారు ఇరువురి పట్ల లోపల స్నేహము మరియు సహయోగములో అంతరము ఉండకూడదు. దీనినే అపకారులపై ఉపకారపు దృష్టి మరియు విశ్వకల్యాణకారిగా అవ్వటము అని అంటారు. ఇటువంటి స్థితి ఇప్పుడు తయారైనట్లయితే సంపూర్ణతకు సమీపంగా ఉన్నామని భావించండి. ఎవరి సంస్కారాలు కలిస్తే వారిని సహచరులుగా చేసుకుంటాము, ఇతరులను దూరంగా పెట్టాము అని భావించకూడదు. కఠిన సంస్కారము కలిగినవారినైనాగానీ వారిని కూడా మీ శుభచింతక స్థితి ఆధారముతో ట్రాన్స్ ఫర్ చేసి సమీపంగా తీసుకురండి. హోప్ లెస్ కేసును మంచిగా చేసినప్పుడే పేరు ప్రసిద్ధమౌతుంది. మంచివారిని మంచిగా చెయ్యటము లేక మంచివారితో మంచివారుగా అయ్యి నడవటము - ఇదేమంత పెద్ద విషయము కాదు. మీ శ్రేష్ఠ స్మృతి మరియు వృత్తి ద్వారా అలాంటి వారిని కూడా మార్చి చూపించటమే పెద్ద విషయము. చూడండి, హోమియోపతిలోని చాలా చిన్న చిన్న మాత్రలు ఎంత పెద్ద రోగాన్ని అంతం చెయ్యకలవు! మరి మాస్టర్ సర్వశక్తివంతులు తమ వృత్తి మరియు దృష్టి ద్వారా ఎవరి కఠినమైన సంస్కారమనే రోగానైనా అంతం చెయ్యలేరా? ఒకవేళ ఎవరి సంస్కారమునైనా మార్చలేకపోయినా లేక సమాప్తము చెయ్యలేకపోయినా మరి అది మాస్టర్ రచయితనైన నా కన్నా రచన శక్తి ఎక్కువగా పని చేస్తోందని భావించండి. చిన్న మాత్ర రోగాన్ని అంతము చెయ్యగలదని ఉదాహరణ చెప్పినట్లుగా, రోగాన్ని ఎలా పోగొట్టాలి అని ఆ మందు అయితే అనదు కదా! మరి మీ రచనలో శక్తి ఉంది కానీ మాస్టర్ రచయితలైన మీలో శక్తి లేదా?

           ట్రాన్స్ ఫర్ అవ్వాలి మరియు ట్రాన్స్ ఫర్ చెయ్యాలి(మారాలి, మార్చాలి) అన్న లక్ష్యమునే ఎల్లప్పుడూ ఉంచండి. వీరు మారితే మేము మారిపోతాము అని అనకండి, నేను మారాలి మరియు నేనే చెయ్యాలి. ఎవరైతే ఇటువంటి ధైర్యమును ఉంచేవారుగా అవుతారో వారే విశ్వ మహారాజులుగా అవ్వగలరు. కావున విశ్వ మహారాజులుగా అవ్వాలనుకున్నట్లయితే భవిష్య విశ్వములోకి వచ్చే దైవీ పరివారపు ఆత్మలందరిపై అనగా విశ్వ రాజ్య అధికారిగా అయ్యే ఈ చిన్నని పరివారమేదైతే ఉందో, ఆ ఆత్మలందరిపై ఇప్పటి నుండే  స్నేహముతో కూడిన రాజ్యము చెయ్యాలి. ఆర్డర్లు వెయ్యకూడదు, ఇప్పటి నుండే విశ్వ మహారాజులుగా అవ్వకూడదు. ఇప్పుడైతే విశ్వ సేవాధారిగా అవ్వాలి. స్నేహమును ఇవ్వటము కూడా భవిష్యత్తు కొరకు జమ చేసుకోవటము. మా భవిష్య ఖాతాలో ఈ స్నేహమును ఎంతగా జమ చేసుకున్నాము అన్నదానిని కూడా చూసుకోవాలి. జ్ఞానమును ఇవ్వటము సరళము, కానీ విశ్వ మహారాజులుగా అయ్యేందుకు కేవలము జ్ఞానదాతలుగా అవ్వకండి, ఇందుకొరకు స్నేహదానము అనగా సహయోగమును ఇవ్వాలి. ఎక్కడ స్నేహము ఉంటుందో అక్కడ సహయోగము తప్పకుండా ఉంటుంది. ఒకవేళ ఈ హైజంపును చేసేసినట్లయితే అన్ని విషయాలలో సహజంగానే శ్రేష్ఠంగా అయిపోతారు.

           అచ్ఛా, ఇప్పుడు భట్టీ చేసినవారు తమను ట్రాన్స్ ఫర్ చేసుకున్నారా? ఎంతగా ట్రాన్స్ ఫర్ చేసుకుని ఉన్నారో అంతగానే ప్రతి ఒక్కరి ముఖము ట్రాన్స్ లైట్ చిత్రం లాగా కనిపిస్తుంది. ట్రాన్స్ లైట్ చిత్రము దూరము నుండే స్పష్టంగా కనిపిస్తుంది. మరి అలా అన్ని విషయాలలో స్పష్టంగా మరియు శ్రేష్ఠంగా అయ్యారా? (అవుతాము) ఎప్పటివరకు అవుతారు? 5 సంవత్సరాలకా? ఎప్పటివరకు అవుతామని ప్రతిజ్ఞ చేసారు? ఎటువంటి సమస్యలు వచ్చినాగానీ, అనుకోని ఎటువంటి విషయాలు వచ్చినా కూడా అచలంగా, దృఢంగా, ఏకరసంగా ఉండే విధముగా అటువంటి శక్తిని మీలో నింపుకున్నారా? అలా మీలో అంతటి శక్తిని నింపుకున్నారా? ఇలా కూడా జరుగుతుంది అన్నది మాకు తెలియనే తెలియదు అని అనవద్దు. ఇది క్రొత్త విషయము, అందుకనే ఫెయిల్ అయిపోయాము అని అనవద్దు. భట్టీ చేసి వెళ్ళినప్పుడు మీలో నవీనతను తీసుకువస్తారు, కావున మాయ కూడా పరీక్షను తీసుకొనేందుకు క్రొత్త క్రొత్త విషయాలను ఎదురుగా తీసుకువస్తుంది. కావున మంచిరీతిలో మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా, మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి వెళ్ళినట్లయితే దూరము నుండే మాయ చేసే యుద్ధమును గుర్తించి సమాప్తము చేసేయ్యండి, అటువంటి సర్వశక్తివంతులుగా అయ్యారా? ఏమిటి, ఎందుకు అనే భాషను సమాప్తము చేసారా? ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి... ఇది సమాప్తము. కేవలము మూడు మాసాల పరీక్ష కాదు, ఇప్పుడైతే అంతిమము వరకు ఉండే ప్రతిజ్ఞను చెయ్యాలి. ఇదైతే గ్యారంటీ విషయమైపోయింది కదా! తమ యథాశక్తితో ప్రతి ఒక్కరూ ఏ ప్రయత్నమైతే చేసారో దానిని చాలా మంచిగా చేసారు. ఇప్పుడిక చాలా మంచిగా అయి చూపించాలి. ఏవిధముగా ఈ నషా ఉందో, అలా ప్రవృత్తిలో ఉంటూ కూడా ఈ నషాను నిలిపి ఉంచుకోవాలి. ఈ గ్రూపుకు ఏ ముద్ర ఉంది? ఎవ్వరూ మిమ్మల్ని మార్చలేరు, కానీ మీరు అందరినీ మార్చి చూపించాలి. ఏ పరిస్థితి లేక ఏ వాయుమండలము మనల్ని మార్చకూడదు కానీ మనము పరిస్థితులను, వాయుమండలమును, వృత్తులను, సంస్కారాలను మార్చి చూపించాలి, ఇటువంటి దృఢమైన ముద్రను వేయించుకోవాలి. భట్టీ యొక్క ట్రేడ్ మార్క్ ను అవినాశిగా వేయించుకొని వెళ్లాలి. మీ ట్రేడ్ మార్క్ ను మర్చిపోవద్దు. ఒకవేళ భట్టీ ధారణల స్మృతిని తోడు తోడుగా ఉంచుకున్నట్లయితే సఫలత ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అచ్ఛా!

Comments