28-07-1972 అవ్యక్త మురళి

*28-07-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“అపవిత్రతను మరియు వియోగమును సంహారము చేసే శక్తులే అసుర సంహారిణులు"

           మీరు రావడంతోనే బాబా ద్వారా ముఖ్యమైన ఏ రెండు వరదానాలు లభించాయి? ఆ ముఖ్యమైన రెండు వరదానాలను గూర్చి మీకు తెలుసా? మొట్టమొదట రావడంతోనే “యోగీభవ మరియు పవిత్రభవ" అన్న వరదానము లభించింది. ప్రపంచంలోని వారికి కూడా ఒక్క క్షణంలో ఇన్ని సంవత్సరాల జ్ఞాన సారము ఈ రెండు పదాలలోనే వినిపిస్తారు కదా! పురుషార్థపు లక్ష్యము లేక ప్రాప్తి కూడా ఇదే కదా! లేక సంపూర్ణ స్థితి లేక సిద్ధి యొక్క ప్రాప్తి కూడా ఇదే. కావున మొట్టమొదట రావడం ద్వారా ఏ వరదానాలైతే లభించాయో లేక స్మృతిని కలిగించారో, ఆత్మలైన మీ అందరి వాస్తవిక స్వరూపము ఇదేనన్న స్మృతిని కలిగించారో... ఆ మొట్టమొదటి స్మృతిని లేక వరదానమును పొందుతూ జీవితంలో ఆ రెండు విషయాలను ధారణ చేసేసారా? అనగా యోగీభవ మరియు పవిత్రభవ, ఇటువంటి జీవితం తయారైందా లేక ఇప్పుడింకా తయారుచేసుకుంటున్నారా? ధారణామూర్తులుగా అయిపోయారా లేక ఇప్పుడు ధారణ చేస్తున్నారా? నిజానికి ఇది చాలా సాధారణమైన విషయమే కదా! రోజంతటిలో అనేకసార్లు ఈ రెండు విషయాలను వర్ణన చేస్తారు. మరి ఈ రెండు విషయాలు ధారణ అయిపోయాయా లేక అవుతున్నాయా? యోగీ స్థితిలో కొద్దిగా వియోగము ఉన్నా, భోగులు అనైతే అనరు కదా! మిగిలినవి ఈ రెండు స్థితులు. కావున మాయ ఎప్పుడు యోగి నుండి వియోగిగా చేసేస్తుంది? యోగిగా ఉండడంతో పాటు వియోగము కూడా ఉన్నట్లయితే వారిని ఎక్కడైనా యోగి అని అంటారా? పవిత్రతలో కొద్దిగా అపవిత్రత ఉన్నా, దానిని ఏమంటారు అని మీరు స్వయమే ఇతరులకు చెబుతారు కదా! మీరు ఇప్పటికీ వియోగులుగా ఉన్నారా లేక వియోగులుగా అయిపోతారా? చక్రవర్తీ రాజులుగా అయ్యే సంస్కారము ఉన్న కారణంగా రెండింటిలోనూ చుట్టి వస్తున్నారా? కాసేపు యోగంలో, కాసేపు వియోగంలో లేరు కదా! మీరు విశ్వంలోని సర్వాత్మలను ఈ చక్రం నుండి బైటకు తీసేవారే కదా లేక బాబా తీసేవారు మరియు మీరు చక్రమును చుట్టేవారా? ఎవరైతే స్వయం ఈ వలయాల నుండి బైటకు తీస్తారో వారే స్వయం చక్రంలో తిరుగుతారా? మరి అందరినీ బైటకు ఎలా తీస్తారు? ఏ విధంగా భక్తిమార్గంలోని అనేకరకాలైన వ్యర్థ వలయాల నుండి బైటకు వచ్చారో, అప్పుడే మీ నిశ్చయము మరియు నషా యొక్క ఆధారంపై ఈ భక్తి యొక్క వలయాల నుండి విముక్తులవ్వండి అని ఛాలెంజ్ చేస్తారో, అలాగే అది తనువు ద్వారా చక్రములో తిరగడము మరియు ఇది మనస్సు ద్వారా చక్రములో తిరగడము. కావున తనువు ద్వారా చక్రములో తిరగడమును ఇప్పుడు వదిలివేసారు. కాని, మనస్సు ద్వారా చక్రములో తిరగడము ఇప్పుడు వదలలేదా? కాసేపు వియోగులుగా, కాసేపు యోగులుగా....అలా మనస్సు ద్వారానే చక్రములో తిరుగుతారు. ఇప్పటివరకు కూడా మాయలో ఇంతటి శక్తి మిగిలి ఉందా? అది మాస్టర్ సర్వశక్తివంతులను కూడా ఈ చక్రాలలోకి తీసుకురాగలదా? ఇప్పటివరకు మాయను ఇంతటి శక్తిశాలిగా చూస్తూ మాయను మూర్ఛితము చేయడము లేక మాయకు ఓటమిని కలిగించడము రాదా? ఇప్పటివరకు అది నాపైన యుద్ధం చేస్తోంది అని గమనిస్తున్నారు. ఇప్పుడైతే శక్తిసేన మరియు పాండవసేన అయిన మీరు ఇతర ఆత్మలపై మాయ యొక్క యుద్ధమును చూస్తూ దయార్ద్ర హృదయులుగా అయి  దయచూపించే సమయము ఆసన్నమైంది. మరి ఇప్పటివరకు మీపై మీరు కూడా దయ చూపించుకోలేదా? ఇప్పుడు శక్తుల యొక్క శక్తి అన్యాత్మల సేవపట్ల కర్తవ్యంలో వినియోగించాలి. ఇప్పుడు మీపట్ల మీరు శక్తిని ఉపయోగించే సమయము లేదు. ఇప్పుడు శక్తుల కర్తవ్యము - విశ్వకళ్యాణము. విశ్వకళ్యాణకారులుగా గాయనం చేయబడుతున్నారా లేక స్వకళ్యాణులా? మీ పేరు ఏమిటి మరియు మీ పని ఏమిటి? పేరు ఒకటి, పని మరొకటా? లౌకిక రూపంలో కూడా ఎప్పుడైతే ఏమీ తెలియని బాల్యంలో బాధ్యతలు ఉండవో అప్పుడు సమయమును లేక శక్తులను లేక ధనమును తమకొరకే వినియోగిస్తారు. కాని ఎప్పుడైతే హద్దులోని రచయితలుగా అయిపోతారో అప్పుడు శక్తులు మరియు సమయమేదైతే ఉంటుందో దానిని రచన కొరకు వినియోగిస్తారు. కావున ఇప్పుడు మీరు ఎవరు? ఇప్పుడు మాస్టర్ రచయితలుగా, జగన్మాతలుగా అవ్వలేదా? విశ్వ ఉద్ధారమూర్తులుగా అవ్వలేదా? విశ్వ ఆధారమూర్తులుగా అవ్వలేదా? ఏ విధంగా శక్తులకు క్షణకాలపు దృష్టితో అసుర సంహారము చేస్తారు అన్న గాయనం ఉందో మరి ఆ విధంగా అసురీ సంస్కారాలు లేక అపవిత్రతను ఒక్క క్షణంలో సంహారము చేయలేదా? లేక ఇతరులపట్ల సంహరిణిగా ఉంటూ స్వయంపట్ల లేకుండా ఉన్నారా? ఇప్పుడు మాయ మిమ్మల్ని ఎదుర్కొన్నా కాని దాని పరిస్థితి ఏమవ్వాలి? ఏ విధంగా ముట్టుకుంటే ముడుచుకుపోయే మొక్కను చూశారు కదా! ఎవరైనా మనుష్యులు కొద్దిగా చేయి తగిలించినా, అది శక్తిహీనంగా అయిపోతుంది, అందుకు దానికి సమయం పట్టదు. కావున మీ యొక్క కేవలం క్షణకాలపు శుద్ధసంకల్పాల శక్తితో మాయ ముడుచుకుపోయే మొక్కలా మూర్ఛితమైపోవాలి, ఇటువంటి స్థితి ఇంకా తయారవ్వలేదా? విశ్వకళ్యాణము కోసమే ఇంకొద్ది సమయం మిగిలి ఉంది, అని ఇప్పుడు భావించండి. లేకపోతే విశ్వంలోని ఆత్మలు మీరు ఇన్ని సంవత్సరాలలో ఇంత పాలనను తీసుకున్నారు అని ఫిర్యాదు చేస్తారు. కాని మేము ఇంకా యోగీభవగా, పవిత్రభవగా అవుతున్నాము అని అంటున్నారు మరియు మాతో ఇప్పుడు కొద్ది సమయంలో వారసత్వాన్ని తీసుకోండి అని చెబుతున్నారే! అని అంటారు. మీ ఫిర్యాదును మీకే ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మేము అవుతున్నాము లేక అవుతాము, చేస్తాము... అన్న ఈ భాషను కూడా మార్చాలి. ఇప్పుడు మాస్టర్ రచయితలుగా అవ్వండి, విశ్వకళ్యాణకారులుగా అవ్వండి. ఇప్పుడు మీ పురుషార్థంలో సమయాన్ని వినియోగించే సమయం పూర్తయిపోయింది, ఇప్పుడిక ఇతరులచే పురుషార్థమును చేయంచడంలో సమయాన్ని వెచ్చించండి. దినప్రతిదినము పైకి ఎక్కే కళలోకి వెళుతున్నాము అని అంటారు. కావున పైకి ఎక్కే కళ అనగా సర్వులు లాభాన్వితులవ్వడము. ఇదే లక్ష్యమును ప్రతిక్షణము స్మృతిలో ఉంచుకోండి. ఏ సమయమునైతే స్వయం పట్ల వినియోగిస్తారో దానిని ఇతరుల సేవలో వినియోగించినట్లయితే మీ సేవ దానంతట అదే జరిగిపోతుంది. మీ అభ్యున్నతి కొరకు పాత విధానాలలో మార్పును తీసుకురండి. ఏ విధంగా సమయం మారుతూ ఉంటుందో, సమస్యలు మారుతూ ఉంటాయో, ప్రకృతి యొక్క రూపము, రంగులు మారుతూ ఉంటాయో అలా ఇప్పుడు స్వయమును కూడా పరివర్తనలోకి తీసుకురండి. అదే విధంగా, అదే ఆచారంగా, అదే వేగము, అదే భాష, అవే మాటలు ఇప్పుడు మారిపోవాలి. మీరు స్వయమునే మార్చుకోకపోతే ప్రపంచాన్ని ఎలా మార్చగలరు? ఏ విధంగా తమోగుణము అతిలోకి వెళుతోంది అని అనుభవం అవుతుందో అలా అంతగా మీరు అతీంద్రియ సుఖంలో ఉండండి. ఆ అతి పతనము వైపుకు మరియు మీరు ఉన్నతం వైపుకు! వారిది దిగజారే కళ, మీది పైకి ఎక్కే కళ! ఇప్పుడు సుఖమును అతీంద్రియ సుఖంలోకి తీసుకురావాలి. అతీంద్రియ సుఖమును గూర్చి గోపగోపికలను అడగండి అన్నది అంతిమ స్థితి యొక్క గాయనము. సుఖము అతిలోకి వెళ్ళడం ద్వారా దు:ఖపు అలతో కూడుకున్న సంకల్పాలు కూడా అంతమైపోతాయి. కావున ఇప్పుడు చేస్తాములే, అవుతాములే అని అనకండి. మీరు స్వయం అవుతూ ఇతరులను కూడా తయారుచేస్తున్నారు. ఇప్పుడు కేవలం సేవ కొరకే ఈ పాత ప్రపంచంలో కూర్చున్నారు, లేకపోతే ఏ విధంగా బాబా అవ్యక్తమయ్యారో అలా మిమ్మల్ని కూడా తమతో పాటు తీసుకువెళ్ళిపోయేవారు. కాని, శక్తుల యొక్క బాధ్యత. అంతిమ కర్తవ్యపు పాత్ర రచింపబడి ఉంది. కేవలం ఈ ఒక్క పాత్ర కొరకు బాబా అవ్యక్త వతనంలోను మరియు మీరు వ్యక్తంలోను ఉన్నారు. వ్యక్తభావంలో చిక్కుకొని ఉన్న ఆత్మలకు ఈ వ్యర్థభావం నుండి విడిపించే కర్తవ్యము ఆత్మలైన మీదే. కావున ఏ కర్తవ్యము కొరకైతే ఈ స్థూల వతనంలో ఎప్పటివరకైతే ఉన్నారో ఆ కర్తవ్యమును పాలన చేయడంలో నిమగ్నమైపోండి. అప్పటివరకు బాబా కూడా మీ అందరినీ సూక్ష్మవతనంలోకి ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఇంటికైతే కలిసివెళ్ళాలి కదా! మీరు లేకుండా బాబా కూడా ఒంటరిగా ఇంటికి వెళ్ళలేరు. కావున ఇప్పుడు త్వరత్వరగా ఈ స్థూలవతనం యొక్క కర్తవ్యమును పాలన చేయండి, ఆ తర్వాత కలిసి ఇంటికి వెళదాము లేక మన రాజ్యంలో రాజ్యము చేద్దాము. ఇప్పుడు అవ్యక్తవతనంలో ఎంతకాలము ఆహ్వానిస్తూ ఉంటారు? కావున బాబా సమానంగా అవ్వండి. బాబా విశ్వకళ్యాణకారిగా అవ్వడం ద్వారా తమనుతాము సంపన్నంగా చేసుకోలేదా? చేసుకున్నారు కదా! కావున ఏ విధంగా బాబా ప్రతి సంకల్పమును, ప్రతి కర్మను పిల్లల పట్ల లేక విశ్వంలోని ఆత్మల పట్ల వినియోగించారో అలాగే బాబాను అనుసరించండి. అచ్ఛా!

                            ఈ విధంగా ప్రతి సంకల్పమును, ప్రతి కర్మను విశ్వకళ్యాణార్థము వినియోగించేవారికి, బాబా సమానంగా అయ్యే పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments