28-02-1972 అవ్యక్త మురళి

* 28-02-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"సమయమును గూర్చి ఎదురుచూడకుండా ఎవర్రడీగా ఉండేవారే సత్యమైన పురుషార్థులు."

ఏ విధంగా పరీక్షా సమయం సమీపంగా వస్తోందో అంతగా మీ సంపూర్ణ స్థితి యొక్క సాక్షాత్కారము లేక అనుభవము ప్రత్యక్ష రూపంలో జరుగుతోందా? ఏ విధంగా నెంబర్ వన్ ఆత్మ తన సంపూర్ణ స్థితిని నడుస్తూ, తిరుగుతూ ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకునేవారో అలా మీరు కూడా మీ సంపూర్ణ స్థితిని పూర్తిగా సమీపంగా మరియు స్పష్టంగా అనుభవం చేసుకుంటున్నారా? ఏ విధంగా పురుషార్ధీ బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ ఈ రెండు స్థితులు స్పష్టంగా ఉండేవో అలాగే మీకు మీ సంపూర్ణ స్థితి అంతే స్పష్టంగా మరియు సమీపంగా అనుభవమవుతోందా? ఇప్పుడిప్పుడే ఈ స్థితి ఉంది, మళ్ళీ ఇంకాసేపట్లో ఆ స్థితి ఏర్పడుతుంది అన్నది అనుభవమవుతోందా? ఏ విధంగా సాకారంలో భవిష్య స్వరూపం కూడా ఇప్పుడిప్పుడే అనుభవమయ్యేది కదా! ఎంతగా కార్యంలో తత్పరులై ఉన్నా కాని, ఆ స్థితి వరకు చేరుకుంటున్నాము అన్నట్లు తమముందు ఎల్లప్పుడూ సంపూర్ణ స్థితి ఉండాలి. ఎప్పుడైతే మీరు సంపూర్ణ స్థితిని సమీపంగా తీసుకువస్తారో అంతగానే సమయం కూడా సమీపంగా వస్తుంది. సమయము మిమ్మల్ని సమీపంగా తీసుకువస్తుందా లేక మీరు సమయాన్ని సమీపంగా తీసుకువస్తారా? ఏమౌతుంది? అటువైపు నుండి సమయం సమీపంగా వస్తుంది, ఇటువైపు నుండి మీరు సమీపంగా వస్తారు, ఇరువురూ కలుసుకుంటారు. సమయం ఎప్పుడు వచ్చినా కాని స్వయమును ఎల్లప్పుడు సంపూర్ణ స్థితికి సమీపంగా తీసుకువచ్చేందుకు పురుషార్థంలో ఎలా సిద్ధంగా ఉంచుకోవాలంటే, సమయమును గూర్చి మీరు ఎదురుచూడవలసిన అవసరముండకూడదు. పురుషార్థులు ఎల్లప్పుడూ ఎవర్రడీగా ఉండాలి, ఎవరూ ఎదురుచూడవలసిన అవసరం ఉండకూడదు, మీ పూర్తి ఏర్పాట్లు జరగాలి. మనం సమయాన్ని సమీపంగా తీసుకువస్తామే కాని సమయం మనల్ని సమీపంగా తీసుకురాదు. ఈ నషా ఉండాలి. ఎంతగా మీముందు సంపూర్ణ స్థితి సమీపంగా వస్తుందో అంతగానే విశ్వంలోని ఆత్మలముందు మీ అంతిమ కర్మాతీత స్థితి యొక్క సాక్షాత్కారము స్పష్టమవుతూ ఉంటుంది. దీని ద్వారా సాక్షాత్కారమూర్తులుగా అయి విశ్వం ముందు సాక్షాత్కారాలు చేయించే సమయం సమీపంగా ఉందా లేదా అన్నది జడ్జ్ చేయగలరు. సమయము చాలా త్వరత్వరగా పరుగులు తీస్తోంది. సమయపు వేగము చాలా వేగంగా ఉన్నట్లు అనుభవమవుతోంది కదా! ఈ లెక్కలో మీ సంపూర్ణ స్థితి కూడా స్పష్టంగా మరియు సమీపంగా ఉండాలి. స్థూలంలో కూడా స్టేజీ ఉన్నప్పుడు, ముందు చూడగానే దీనిపైకి చేరుకోవాలి అని భావిస్తారు. అదేవిధంగా సంపూర్ణ స్టేజ్ (స్థితి) కూడా అంతే సహజంగా అనుభవమవ్వాలి. నిజానికి ఇది ఒక్క క్షణపు విషయమే. ఇప్పుడు క్షణంలో సమీపంగా తీసుకువచ్చే స్కీమును తయారుచేయండి లేక ప్లానును తయారుచేయండి. ప్లానును తయారుచేయడంలో కూడా సమయం పడుతుంది. కాని, ఆ స్టేజిపై ఉపస్థితులైనట్లయితే సమయం పట్టదు. ప్రత్యక్షత సమీపంగా వస్తోంది అనైతే అర్థం చేసుకుంటున్నారు కదా! వాయుమండలము మరియు వృత్తులు పరివర్తనలోకి వస్తున్నాయి. దీనిద్వారా కూడా ప్రత్యక్షత యొక్క సమయము ఎంత త్వరత్వరగా ముందుకు వస్తోందో అర్థం చేసుకోవాలి. కష్టమైన విషయము సరళమైపోతుంది. సంకల్పాలు కూడా సిద్ధిస్తూ ఉన్నాయి. నిర్భయత మరియు సంకల్పాలలో దృఢత - ఇవి సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నందుకు గుర్తు. ఈ రెండూ కనిపిస్తున్నాయి కదా! సంకల్పాలతో పాటు మీ రిజల్ట్ కూడా స్పష్టంగా కనిపించాలి. దీనితోపాటు ఫలము యొక్క ప్రాప్తి కూడా స్పష్టంగా కనిపించాలి. ఇది సంకల్పము, ఇది దాని రిజల్ట్, ఇది కర్మ, ఇది దాని ఫలము... అన్నట్లు అనుభవమవుతోందా? దీనినే ప్రత్యక్ష ఫలము అని అంటారు.

ఏ విధంగా బాబా యొక్క మూడు రూపాలు ప్రసిద్ధమై ఉన్నాయో అలా మీ మూడు రూపాల సాక్షాత్కారము జరుగుతూ ఉంటుందా?ఏవిధంగా బాబాకు తమ మూడు రూపాల స్మృతి ఉంటుందో అలాగే నడుస్తూ తిరుగుతూ మేము మాస్టర్ త్రిమూర్తులము అన్నమీ మూడు రూపాల స్మృతి ఉండాలి. మూడు కర్తవ్యాలు కలిసి జరగాలి. స్థాపన కర్తవ్యము చేసే సమయము వేరు, వినాశ కర్తవ్యము చేసే సమయము వేరు అని కాదు. అలా కాదు, కొత్త రచనను రచిస్తూ ఉంటారు మరియు పాతదానిని వినాశనం చేస్తూ ఉంటారు, ఆసురీ సంస్కారాలు లేక ఏ బలహీనతలైతే ఉన్నాయో వాటి వినాశనమును కూడా తోడుగా చేస్తూ ఉండాలి. కొత్త సంస్కారాలను తీసుకువస్తున్నారు. పాత సంస్కారాలను అంతం చేస్తున్నారు. కావున సంపూర్ణమైన మరియు శక్తిరూపమైన వినాశకారీ రూపము లేని కారణంగా సఫలత లభించడం లేదు. రెండూ తోడుగా వుండడం ద్వారా సఫలత లభించగలదు. ఈ రెండు రూపాలు గుర్తుండడం ద్వారా దేవతా రూపము దానంతట అదే గుర్తుకు వస్తుంది. ఈ రెండు రూపాల స్మృతినే ఫైనల్ పురుషార్థపు స్థితి అని అంటారు. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణ రూపము, ఇప్పుడిప్పుడే శక్తి రూపము. ఏ సమయంలో ఏ రూపం యొక్క అవసరం ఉంటుందో ఆ సమయంలో అటువంటి రూపమును ధారణ చేసి కర్తవ్యంలో నిమగ్నమైపోవాలి, ఇటువంటి అభ్యాసము కావాలి. ఎప్పుడైతే ఒక్క క్షణంలో దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసము ఉంటుందో, తమ బుద్ధిని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎప్పుడైతే నిమగ్నము చేయగలుగుతారో అప్పుడే ఈ అభ్యాసము జరుగగలదు. ఈ అభ్యాసము ఎంతో అవసరము. ఇటువంటి అభ్యాసకులు అన్ని కార్యాలలోను సఫలురవుతారు. ఎవరిలోనైతే స్వయమును మలచుకునే శక్తి ఉంటుందో వారే నిజమైన బంగారము వంటివారు. ఏ విధంగా స్థూల కర్మేంద్రియాలను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మలచుకోగలరో, అలా ఉపయోగించుకోలేకపోతే దానిని జబ్బుగా భావిస్తారో, అలాగే బుద్ధిని కూడా సహజంగానే మలచుకోగలగాలి, అంతేకాని బుద్ధి మనల్ని మలవడం కాదు. అలాగే సంపూర్ణ స్థితి యొక్క స్మృతిచిహ్నము కూడా గానం చేయబడ్డది. దినప్రతిదినము స్వయములో పరివర్తన యొక్క అనుభవం కూడా కలుగుతుంది కదా! సంస్కారాలు, స్వభావాలు లేక లోపాలను చూసినప్పుడు క్రిందకు వచ్చేస్తారు. కావున ఇప్పుడు దినప్రతిదినము ఈ పరివర్తనను తీసుకురావాలి. ఎవరి స్వభావ సంస్కారాలనైనా చూస్తూ, తెలుసుకుంటూ అటువైపుకు బుద్ధియోగము వెళ్ళకూడదు. ఇంకా ఆ ఆత్మపై శుభభావన ఉండాలి. ఒకవైపున విని, ఇంకొకవైపు నుండి అంతం చేయాలి. అచ్ఛా!

Comments