27-07-1971 అవ్యక్త మురళి

* 27-07-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“బుద్ధి రూపీ నేత్రమును క్లియర్ గా మరియు పవర్ ఫుల్ గా తయారుచేసుకోండి."

             ఈరోజు భట్టీ చదువు యొక్క పరీక్షా పేపరును వ్రాసి ఇచ్చారా? మళ్ళీ రేపు ఏ పేపరు మొదలవుతుందో తెలుసా? ప్రాక్టికల్ పేపర్లో ఏ ప్రశ్నలు రానున్నాయో వాటిని గూర్చి తెలుసా? ఏయే రకాలైన ప్రశ్నలు వస్తాయి? కల్పపూర్వము ఆత్మలైన మీ ద్వారా ఏమేమి జరిగాయో, ఆ స్మృతి వస్తోందా? (అవును). ఈ స్మృతి వచ్చినప్పుడు ఏయే ప్రశ్నలు వస్తాయన్న స్మృతి రావటం లేదా? మాయ ఎదుర్కోవటమైతే ఎదుర్కుంటుంది, కానీ ఏయే రూపాలలో ఎదిరిస్తుంది అన్నది కూడా తెలుసా లేక తెలియదా? మాస్టర్ జ్ఞాన సంపన్నులై వెళ్తున్నారు కదా! మాస్టర్ జ్ఞానసంపన్నులకు ముందుగానే అన్నీ తెలుస్తాయి. సైన్స్ వారు తమ యంత్రాల ద్వారా ఏదైనా ఘటనను అనగా తుఫానును లేక వర్షమును లేక భూకంపములు మొదలగు విషయాలను ముందుగానే తెలుసుకుంటారో అలా మరి మీరందరు మాస్టర్ జ్ఞానసంపన్నులుగా అవ్వటం ద్వారా ముందుగానే మీ బుద్ధి బలం ద్వారా తెలుసుకోలేరా? రోజురోజుకు ఎంతెంతగా మీ స్మృతి సమర్థతలోకి వస్తూ ఉంటారో అనగా మీ ఆత్మరూపీ నేత్రాన్ని శక్తిశాలిగా తయారుచేసుకుంటూ వెళ్తుంటారో, క్లియర్ గా చేసుకుంటూ ఉంటారో అంతంతగా ఏదైనా విఘ్నము వచ్చేదుంటే... ఈరోజు ఏదో పరీక్ష రానుంది అని మొదటి అనుభవమవుతుంది మరియు ఎంతెంతగా ముందుగానే తెలుస్తూ ఉంటుందో, మొదటి నుండే చురుకుగా ఉన్న కారణంగా విఘ్నాలపై సఫలతను పొందుతారు. ఈ రోజుల్లో గవర్నమెంటుకు శతృవు రాక ముందుగానే తెలుస్తుంది, కావున ముందునుంచే ఏర్పాట్లు చేసుకున్న కారణంగా విజయులుగా అవ్వగలుగుతారు మరియు అకస్మాత్తు ఆక్రమణలు విజయులుగా చెయ్యజాలవు. ఇక్కడ ఒకటేమో త్రికాలదర్శులుగా ఉన్న కారణముగా కల్పపూర్వపు స్మృతిని ఎలా అనుభవము చేస్తారంటే, ఇది నిన్నటి విషయమే అన్నట్లుగా భావిస్తారు మరియు జ్ఞానసంపన్నులుగా అయిన కారణముగా, మూడవది- బుద్ధిరూపీ నేత్రము శక్తిశాలిగా మరియు స్వచ్ఛముగా ఉన్న కారణంగా అన్ని విషయాలను ముందుగానే పట్టుకొంటారు. కావున మూడు రకాలుగా ఒకవేళ అటెన్షన్ ఉన్నట్లయితే మరియు శక్తిశాలి స్థితి ఉన్నట్లయితే రాబోయే విఘ్నాలను ముందుగానే పరిశీలించలేరా? అలాగే ఎంతెంతగా ముందుగానే పరిశీలన మరియు గుర్తించటము ఉంటుందో అప్పుడు ఇక ఎప్పుడూ ఓటమి ఉండదు, సదా విజయులవుతారు. ఏవిధంగా నేత్రాలు సరిగ్గా లేని కారణంగా మరియు సి.ఐ.డిల చెకింగు సరిగా లేని కారణంగా ఒక్కోసారి గవర్నమెంటు కూడా మోసపోతుందో అదేవిధంగా ఎల్లప్పుడూ యథార్ధరీతితో పనిచేస్తున్నాయా అని మీ బుద్ధిరూపీ నేత్రాన్ని కూడా సంభాళన చేసుకోవాలి.

           సి.ఐ.డికి మరో అర్థం ఏమిటి? పరిశీలించటమే సి.ఐ.డి.ల పని. పరిశీలించే సి.ఐ.డి.లు చురుకైనవారుగా ఉంటే ఎప్పుడూ శతృవుతో ఓడిపోజాలరు. కావున ముందునుండే తెలియాలని ఇప్పుడు కూడా ప్రయత్నము చెయ్యండి. వర్షము వచ్చేదుంటే ప్రకృతి ముందు నుండే తప్పక అప్రమత్తం చేస్తుంది. ఒకవేళ నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నట్లయితే ప్రకృతి విఘ్నాల నుండి రక్షింపబడగలరు. ఒకవేళ నాలెడ్జ్ ఫుల్ గా లేనట్లయితే ప్రకృతిలోని భిన్న భిన్నరకాలైన చిన్న చిన్న విషయాలు దుఃఖానికి మరియు అనారోగ్యాలకు నిమిత్తమౌతాయి, వాటికి ఆధీనులుగా అయిపోతారు. కారణమేమిటి? తెలుసుకోవటములో లేక వాటి జ్ఞానములో లోటు. కావున ఎలా ఎలా అయితే స్మృతి శక్తి అనగా సైలెన్స్ శక్తిని తమలో నింపుకుంటూ ఉంటారో, అప్పుడు ఈరోజు ఏదో అయ్యేదుంది అని ముందుగానే తెలుస్తుంది మరియు దినప్రతిదినము అనన్య మహారధులెవరైతే అటెన్షన్ మరియు పరిశీలనలో ఉంటారో, వారు ఈ అనుభవమును చేస్తూ ఉంటారు. జ్వరం వచ్చేదుంటే, దాని లక్షణాలు ముందు నుండే కనిపిస్తాయి. కావున ఇందులో కూడా ఒకవేళ నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నట్లయితే ఏ పరీక్ష అయితే వచ్చేదుంటుందో తప్పకుండా దాని లక్షణాలు ఉంటాయి, కానీ పరిశీలించే శక్తి శక్తిశాలిగా ఉన్నట్లయితే ఎప్పుడూ ఓడిపోజాలరు. జ్యోతిష్కులు కూడా తమ జ్యోతిష్య జ్ఞానము ద్వారా, గ్రహాల జ్ఞానము ద్వారా రాబోయే ఆపదలను తెలుసుకుంటారు. మీ జ్ఞానము ముందు వారి జ్ఞానమైతే గొప్పదేమీ కాదు, తుచ్ఛమైనది అనే అనవచ్చు! మరి తుచ్చమైన జ్ఞానము కలిగినవారే జరగబోయేదానిని తెలుసుకోగలిగినప్పుడు మీ జ్ఞాన శక్తితో, ఇంతటి శ్రేష్టాతి శ్రేష్ఠమైన జ్ఞానముతో మాస్టర్ జ్ఞానసంపన్నులు దీనిని తెలుసుకోలేరా? తెలుసుకోలేనట్లయితే దానికి కారణము - బుద్ధిరూపీ నేత్రము క్లియర్(స్వచ్ఛము)గా లేదు. క్లియర్ గా లేని దానికి కారణము ఏమిటి? కేర్ ఫుల్(జాగ్రత్త)గా లేరు. కేర్ ఫుల్ గా లేని కారణంగా నాలెడ్జ్ ఫుల్ లు కాదు. నాలెడ్జ్ ఫుల్ గా లేని కారణంగా పవర్ ఫుల్ (శక్తిశాలి)గా లేరు. పవర్ ఫుల్ గా లేని కారణంగా విజయప్రాప్తి ఏదైతే జరగాలో అది జరుగదు. మరి మీ నేత్రమును స్వచ్ఛముగా ఉంచుకోవటము కష్టమైన విషయమా? ఈసారి  ఎవరైతే భట్టీలో వచ్చారో వారు మధునము నుండి అనగా వరదానీ భూమి నుండి ఏ వరదానమును తీసుకొని వెళ్తారు? ఒకటి, మీ బుద్ధిరూపీ నేత్రమును క్లియర్ గా మరియు కేర్ ఫుల్ (స్వచ్ఛముగా మరియు జాగ్రత్త)గా  ఉంచుకోవటము మరియు ముందుగానే నాలెడ్జ్ ఫుల్ గా అయ్యి, పరిశీలించగలిగే వరదానమును తీసుకుని  వెళ్ళాలి, దీని ద్వారా ఎప్పుడూ మాయతో ఓడిపోరు. ఎవరికైతే మాయ నుండి ఓటమి ఉండదో వారిపై వినేవారు మరియు చూసేవారు బలిహారమైపోతారు. కావున ప్రవృత్తిలో ఉంటూ మీపై మీ సమీపములోనివారు, దూరముగా ఉన్నవారు బలిహారమైపోయేందుకు యుక్తి - పదే పదే ఓటమి జరుగకూడదు. పదేపదే  ఓటమిని పొందినట్లయితే ఓడిపోయే వారిపై ఎలా బలిహారమవుతారు! కావున అందరినీ తమపై అనగా తండ్రిపై బలిహారము చేయించేందుకు ఎప్పుడూ ఓడిపోకూడదు. హారమును వేసుకొనేందుకు యోగ్యులుగా  అవ్వాలి కానీ ఓడిపోకూడదు. ప్రవృత్తిలో ఉండే పాండవుల కొరకు ఇదే విశేషరూపములో ఉన్న శిక్షణ - ఎప్పుడైతే మీ ప్రవృత్తిలోకి వెళ్తారో అప్పుడు ప్రవృత్తిని ప్రవృత్తిగా భావిస్తారా లేక మరేవిధంగానైనా భావిస్తారా?  ప్రవృత్తివారు అన్న ఈ పేరు మారిపోయింది కదా! ఇప్పుడు మీ ప్రవృత్తిని అథర్ కుమార్ అని అందామా? మీ  ప్రవృత్తిని గురించిన సంకల్పములు కొంచెము కూడా రాకూడదు! (అటువంటి ఆలోచన వచ్చే ప్రశ్నే లేదు) ప్రశ్న అయితే వస్తుంది కానీ ఆలోచన రాకూడదు. మేము ప్రవృత్తిమార్గములోని వారము అన్న మా ఈ  రిజిస్టరును నేటి నుండి సమాప్తము చేసి సేవాధారి అన్న కొత్త రిజిస్టరును పెట్టాము అని అనండి. అలా భావిస్తారా? దీపావళి రోజు పాత ఖాతాలను సమాప్తము చేసి క్రొత్త వాటిని పెడతారు కదా! మరి మీరు కూడా సత్యమైన దీపావళిని జరుపుకున్నారా? దీపమును కూడా అవినాశిగా వెలిగించారా? పాత ప్రవృత్తి యొక్క స్మృతి మరియు పాత సంస్కారాల లెక్కా పత్రాలను కూడా సమాప్తము చేసారా? ఎటువంటి స్మృతియో  అటువంటి సంస్కారము తయారవుతుంది. మరి ఈ ఖాతాలను పూర్తిగా కాల్చేసారా లేక కాస్త ప్రక్కన పెట్టుకున్నారా? ఒకవేళ పక్కన పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా బుద్ధి అందులోకి వెళ్తుంది. కాల్చేసి సమాప్తము చేసేసారా లేక అప్పుడప్పుడు చూసుకోవాలని మనసవుతుందా? కొన్ని కొన్ని వస్తువులు ఎలా ఉంటాయంటే అవంటే భయమనిపిస్తుంది, కావున వాటిని పక్కన పెట్టేందుకు బదులుగా భస్మము చేసేస్తారు. అబద్ధపు  లెక్కలను తయారుచేసేవారు గవర్నమెంటు అంటే భయపడతారు. కావున వాటి గుర్తులు కూడా లభించకుండా ఉండాలని వారు ఆ కాగితాలను కాల్చి భస్మము చేసేస్తారు. ఇదేవిధంగా పాత స్మృతుల ఖాతాలను లేక రిజిస్టర్లను పూర్తిగా కాల్చి సమాప్తము చేసి వెళ్ళాలి. ఒకటేమో పక్కన పెట్టుకోవటము, రెండవది పూర్తిగా కాల్చేయటము. రావణుడిని కేవలము చంపటమే కాకుండా కాల్చేస్తారు కూడా, కావున ఇతడిని కూడా ఒకవేళ కేవలము పక్కగా ఉంచేసినట్లయితే అది కూడా గుర్తుగా మిగిలిపోతుంది. పాత రిజిస్టరు యొక్క చిన్న ముక్కతో కూడా పట్టేసుకుంటుంది. మాయ చాలా చురుకైనది. దాని క్యాచింగ్ పవర్ తక్కువేమీ కాదు. ఏవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్లకు ఏదయినా కాస్త దొరికినా దాని ద్వారా వారు పట్టుకుంటారు. కాస్త  అయినా పక్కన పెట్టినట్లయితే మాయ ఏదో ఒకవిధంగా పట్టుకుంటుంది. కావున కాల్చేసే వెళ్ళాలి.  కుమారులలో జేబుఖర్చుకు డబ్బును పెట్టుకునే సంస్కారము ఉంటుందని వినిపించాము కదా, అలాగే ప్రవృత్తి మార్గములోని వారిలో కూడా అవసరానికి పనికివస్తుందనే ఉద్దేశ్యముతో ఏదో కొంత పక్కన పెట్టే  విశేష సంస్కారము ఉంటుంది. ఎంతటి లక్షాధికారులైనా, ఎంతటి స్నేహులైనా గానీ ఈ సంస్కారము ఉంటుంది. ఇప్పుడు ఈ సంస్కారము ఇక్కడ కూడా పురుషార్థములో విఘ్నరూపమౌతుంది. ఒకవేళ కాస్త అయినా అథికారము చూపించే సంస్కారమును ఉంచుకోనట్లయితే ప్రవృత్తి ఎలా నడుస్తుంది అని  కొందరు భావిస్తారు. లేక ఒకవేళ ఏదో కాస్త లోభ సంస్కారము భిన్న రూపములో అయినా లేనట్లయితే  సంపాదనను ఎలా చేయగలము లేక అహంకార రూపము లేనట్లయితే మనుష్యుల ఎదుట వ్యక్తిత్వము ఎలా  కనిపిస్తుంది అని చాలామంది భావిస్తారు. ఇలాంటిలాంటి కార్యముల కొరకు అనగా అవసరం కొరకు కొద్దో  గొప్పో పాత సంస్కారాల ఖజానాలను దాచి ఉంచుకుంటారు. ఈ సంస్కారములే మోసగిస్తాయి. ఇదే మీ పర్సనాలిటీ కాదు, ఈ పాత సంస్కారాల రూపము ప్రవృత్తిని పాలన చేసే సాధనము కాదు. పాత సంస్కారాల  లోభము రాయల్ రూపములో ఉంటుంది, కానీ ఉన్నదే లోభ అంశముగా.

            ప్రవృత్తి వారు వ్యవహారములో వెళ్ళినట్లయితే అక్కడ కాస్త ఎక్కువ ప్రాప్తి ఉన్నట్లు కనిపిస్తే అక్కడ ఆ ప్రాప్తి  వెనుక ఎంతగా పడిపోతారంటే ఇక వారు ఈ ఈశ్వరీయ సంపాదనను తక్కువ చేసేస్తారు. ఈ వైపు  అటెన్షన్ ను తక్కువ చేసి, ఆవైపు ప్రాప్తి వైపుకు ఎక్కువ అటెన్షన్ ను పెట్టినట్లయితే అది లోభ అంశము కాదా? ఈవిధంగా అవసరము కొరకు ఏదైతే పాత సంస్కారాల ప్రాపర్టీని అనగా ఖజానా నుండి అవసరానికి వాడుకొనేందుకు కాస్త పక్కన పెట్టుకుంటారు, కానీ ఈ సంస్కారమును కూడా సమాప్తి చెయ్యాలి. కాస్త అయినా కూడా మూలమూలలో ఎక్కడైనా పాత సంస్కారము మిగిలి ఉండలేదు కదా అని పరిశీలించుకోవాలి. మోహము కూడా ఉంటుంది. ప్రవృత్తి వైపుకు ఎక్కువ అటెన్షన్ వెళ్ళటము - ఇది కూడా రాయల్ రూపములోని మోహపు అంశము. ఈ అనంతమైన ప్రవృత్తి అయితే 21 జన్మలు తోడుగా నడుస్తుంది మరియు ఈ ప్రవృత్తి కర్మబంధనాలను సమాప్తము చేసే ప్రవృత్తి. కానీ బంధించే ప్రవృత్తి వైపుకు ఎక్కువ అటెన్షన్ ను ఇస్తారు మరియు ఈవైపు తక్కువ అటెన్షన్ ఇస్తారు! మరి ఇది మోహ మమకారాల రాయల్ రూపము కదా? ఈ అంశము వృద్ధిని పొందుతూ పొందుతూ విఘ్నరూపంగా అయ్యి విజయులుగా అవ్వటంలో ఓటమిని చవిచూపిస్తుంది. కావున ప్రవృత్తిలోనివారు స్థూలరూపంలో మహాదానులుగా, మహాజ్ఞానులుగా అయినా గానీ, పక్కకు పెట్టిన ఈ వికారాల వంశపు అంశమును కూడా సమాప్తము చెయ్యాలి. ఈ అటెన్షన్ ను కూడా పెట్టాలి. కోర్సు లభించింది, పాస్ అయ్యాము అని కాదు. ఇప్పుడు ఇక ఇందులో కూడా పాస్ అవ్వాలి. పూర్తిగా కాస్త అయినా కూడా ఏ మూలలోనూ పాత ఖజానా యొక్క గుర్తులు ఉండకూడదు. దీనినే మరజీవ అని అంటారు లేక సర్వంశ త్యాగి లేక సర్వ సమర్పణ లేక ట్రస్టీ లేక యజ్ఞ స్నేహీ లేక సహయోగి... అని అంటారు. ఇదే కోర్సు, కోర్సునైతే టీచర్లు చేయించినాగానీ కోర్సు వెనుక ఫోర్స్ కావాలి. కేవలము కోర్సు చేసి వెళ్ళినట్లయితే కోర్సు ఇక్కడి వరకు మంచిగా ఉంటుంది కానీ పరీక్షను ఇచ్చే సమయంలో కోర్సును మర్చిపోతారు. కోర్సుతో పాటుగా ఫోర్సును కూడా నింపుకొని వెళ్ళినట్లయితే కోర్సు, ఫోర్స్ విజయులుగా చేస్తాయి. ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. కావున ఈ ఫోర్స్ ను నింపుకొని వెళ్ళాలి, అప్పుడే సదా విజయులుగా అవ్వగలరు. కొంచెమైనా గుర్తులు ఉండకూడదు. గుర్తులు ఉన్న కారణంగానే బుద్ధి యొక్క గురి కుదరలేకపోతుంది. అటువంటి ఉన్నతమైన పరీక్షను ఇవ్వాలి. చిన్న చిన్న పరీక్షలలో పాస్ అవ్వటము పెద్ద విషయము కాదు, కానీ సూక్ష్మమైన పేపరులో పాస్ అవ్వటము, ఇదే పాస్ విత్ ఆనర్‌గా అయ్యేందుకు గుర్తు. మరి ఏం చెయ్యాలో ఇప్పుడు అర్థమైందా? మీ పాత ఖాతాలను పూర్తిగా కాల్చేసి వెళ్ళాలి. ఇంతగా ఫోర్స్ ను నింపటము, ఇది కూడా బట్టలను ఉతికిన తరువాత ఇస్త్రీ చెయ్యనట్లయితే ఏవిధంగా వాటికి మెరుపు రాదో, అలాగే కోర్సు తరువాత ఒకవేళ ఫోర్స్ ను నింపనట్లయితే చమత్కారులుగా అయ్యి చమత్కారమును చూపించలేరు. కావున దూరమునుండే మీ ఈశ్వరీయ చమక్(మెరుపు) ఆకర్షితము చేసేటట్లుగా ఇప్పుడు చమత్కారులుగా అయ్యి వెళ్ళాలి, అన్నింటిలోకి ఎక్కువగా తనవైపుకు ఆకర్షితము చేసే వస్తువు ఏది, ఇది దూరము నుండే అనుకోకపోయినా కూడా తనవైపుకు ఆకర్షితము చేసేస్తుంది? (మెరుపు) మెరుపు దేనితో వస్తుంది? మీ ప్రదర్శినిలలో కూడా అన్నింటికంటే ఎక్కువగా ఏది ఆకర్షితము చేస్తుంది? ఒకటి, లైటు తనవైపుకు ఆకర్షితము చేస్తుంది, రెండవది, మైట్ (శక్తి)కూడా ఆకర్షితము చేస్తుంది. అది ఏమైట్(శక్తి)అయినా సరే ఆకర్షిస్తుంది. స్వయములో ఈశ్వరీయ లైట్, లేక స్వయములో బదిలీ చేసుకునే మైట్ ఉన్నా ఆకర్షిస్తారు. కావున పరివర్తన చేసుకునే లైట్ మరియు మైట్ లను మీలో ధారణ చేసుకోవటం ద్వారా ప్రతి ఆత్మను మీవైపుకు ఆకర్షితము చెయ్యగలరు. అచ్ఛా!

Comments