27-05-1972 అవ్యక్త మురళి

 * 27-05-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “రావణుని నుండి విముఖముగా మరియు బాబాకు సమ్ముఖముగా ఉండండి.”

           ఈ సమయంలో ఎవరెవరైతే కూర్చున్నారో వారందరి ఈ సమయపు స్థితిని శ్రేష్ఠ స్థితి అని అనవచ్చా లేక అవ్యక్త స్థితి అని అనవచ్చా? ఈ సమయంలో అందరి యొక్క స్థితి అవ్యక్త స్థితిగా ఉందా లేక ఇప్పుడు కూడా ఎవరైనా వ్యక్తభావంలో స్థితులై ఉన్నారా? ఎవరైనా వ్యక్త స్థితిలో స్థితులై కూర్చున్నట్లయితే అవ్యక్త మిలనము లేక అవ్యక్తమైన వాక్కులను ధారణ చేయలేరు. కావున అవ్యక్త స్థితిలో స్థితులై ఉన్నారా? ఎవరైతే అలా లేరో వారు చేతులెత్తండి? ఈ సమయంలో అవ్యక్త స్థితిలో స్థితులై ఉన్నట్లయితే వ్యక్తభావపు భానము నుండి అతీతముగా ఉన్నట్లయితే మరి అలా ఎందుకు అతీతంగా ఉన్నారు? అందరికీ ఒకే అవ్యక్త స్థితి ఎందుకు తయారైంది మరియు ఎలా తయారైంది? అవ్యక్త బాప్ దాదాల ముందు ఉన్న కారణంగా అందరికీ ఒకేవిధమైన అవ్యక్త స్థితి తయారైపోయింది. కావున అలాగే సదా స్వయమును బాప్ దాదాల ముందు ఉన్నట్లుగా భావిస్తూ నడుచుకున్నట్లయితే మరి ఎటువంటి స్థితి తయారవుతుంది? అవ్యక్తంగా ఉంటుంది కదా! కావున సదా బాప్ దాదాల సమ్ముఖంగా ఉండేందుకు బదులుగా బాప్ దాదాను స్వయం నుండి వేరుగా లేక దూరంగా ఎందుకు భావిస్తూ నడుచుకుంటున్నారు? సీత ఉదాహరణను వినిపిస్తూ ఉంటారు లేక వింటూ ఉంటారు, సీత సదా ఎవరిముందు ఉండేది? రాముని ముందు. సమ్ముఖము అనగా స్థూలముగా సమ్ముఖంలో ఉండడం కాదు, బుద్ధి ద్వారా సదా బాప్ దాదాలకు సమ్ముఖంగా ఉండడము. బాప్ దాదాల సమ్ముఖంగా ఉండడము అనగా మాయా రావణుని నుండి విముఖంగా ఉండడము. మాయకు సమ్ముఖముగా ఉన్నప్పుడు బాబా నుండి బుద్ధి విముఖమైపోతుంది. ఏ సంబంధమైతే అతి ప్రియాతి ప్రియమైన సంబంధమో ఆ సంబంధంగల వారితో స్వతహాగానే సమ్ముఖంగా కూర్చోవడము-లేవడము, తినడము- తాగడము, నడవడము అనగా సదా తోడు అనుభవమవుతుంది. మరి బాప్ దాదాకు సదా సమ్ముఖంగా ఉండలేరా? సదా సమ్ముఖంగా ఉన్నట్లయితే సదా అవ్యక్త స్థితి ఉంటుంది. మరి దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇది కూడా బాల్యపు ఆటలా ఆడుతున్నారా? కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే వారిని తల్లిదండ్రులు ఎంతగా పిలుస్తున్నా, అల్లరిగా ఉన్న కారణంగా అంతగానే దూరంగా పోతూ ఉంటారు. ఇదేమైనా మంచిగా అనిపిస్తుందా? స్వయమును సదా సమ్ముఖంగా భావించడం ద్వారా స్వయమును సదా ఆల్ మైటీ అథారిటీగా అనుభవం చేసుకోగలుగుతారు. ఆల్ మైటీ అథారిటీ ముందు ఇంకే అథారిటీ యుద్ధము చేయజాలదు లేక ఆల్‌ మైటీ అథారిటీవారు ఎప్పుడూ ఓడిపోజాలరు. ఈ రోజుల్లో అల్పకాలికమైన అథారిటీ కలవారు కూడా ఎంత శక్తిశాలిగా ఉంటారు! మరి ఆల్ మైటీ అథారిటీ కలవారు సర్వశక్తివంతులే కదా! సర్వశక్తుల ముందు అల్పకాలికమైన శక్తి కలవారు కూడా శిరస్సు వంచుతారు. వారు యుద్ధం చేయరు, శిరస్సు వంచుతారు. యుద్ధం చేసేందుకు బదులుగా పదే పదే నమస్కారం చేస్తారు. కావున స్వయమును ఆల్‌ మైటీ అథారిటీ కలవారిగా భావిస్తూ ప్రతి అడుగును వేస్తున్నారా? స్వయమును ఆల్ మైటీ అథారిటీగా భావించడము అనగా సర్వశక్తివంతుడైన బాబాను సదా తోడుగా ఉంచుకోవడం. ఈ రోజుల్లోని భక్తిమార్గంవారికి ఏ అథారిటీ ఉంటుంది? శాస్త్రాల అథారిటీ. వారి బుద్ధిలో సదా శాస్త్రాలే ఉంటాయి కదా! ఏ పని చేసినా ముందుకు శాస్త్రాలనే తీసుకువస్తారు. ఈ పనులేవైతే చేస్తున్నామో అవి శాస్త్రాల అనుసారంగానే చేస్తున్నాము అని అంటారు. ఏ విధముగా శాస్త్రాల అథారిటీ కలవారికి బుద్ధిలో శాస్త్రాల అథారిటీ ఉంటుందో అనగా వారి బుద్ధిలో శాస్త్రాలే ఉంటాయో అలా మరి వారి సమ్ముఖంగా శాస్త్రాలు ఉన్నాయి, మీముందు ఎవరున్నారు? ఆల్ మైటీ తండ్రి. కావున వారు ఏదైనా కార్యము చేసేటప్పుడు శాస్త్రాల ఆధారము ఉన్న కారణంగా అథారిటీతో అవే కర్మలను సత్యముగా భావిస్తూ చేస్తారు. ఎంతగా మీరు వారిని తప్పించేందుకు ప్రయత్నం చేసినా కాని వారు ఎప్పుడూ తమ ఆధారమును వదలరు. ఏ విషయంలోనైనా పదే పదే మేము శాస్త్రాల అథారిటీతో మాట్లాడుతున్నాము, శాస్త్రాలు ఎప్పుడూ అసత్యము కాజాలవు, శాస్త్రాలలో ఏవైతే ఉన్నాయో అవే సత్యము అని భావిస్తారు. అంతటి స్థిరమైన నిశ్చయం ఉంటుంది, అలాగే ఆలమైటీ(సర్వశక్తివంతుడైన) తండ్రి అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీతో మనం అన్ని కార్యాలను చేస్తాం. ఇది ఎంతటి స్థిరమైన నిశ్చయంగా ఉండాలంటే దాన్ని ఎవ్వరూ తొలగించజాలకూడదు. అంతటి స్థిరమైన నిశ్చయం ఉందా? ఎల్లప్పుడూ మీ అథారిటీ కూడా గుర్తుండాలి లేక ఇతరుల అథారిటీని చూసినప్పుడు మీ అథారిటీని మరిచిపోతున్నారా? అన్నింటికన్నా శ్రేష్ఠ అథారిటీ ఆధారంపై నడిచేవారే కదా! ఎల్లప్పుడూ ఈ అథారిటీని గుర్తుంచుకున్నట్లయితే పురుషార్థంలో ఎప్పుడూ కష్టమును అనుభవం చేసుకోరు. ఎంత పెద్దకార్యమైనా ఆల్ మైటీ అథారిటీ ఆధారంతో దానిని అతి సహజంగా అనుభవం చేసుకుంటారు. ఏ కర్మనైనా చేసేందుకు ముందు అథారిటీని ముందు ఉంచుకోవడం ద్వారా ఈ కర్మను చేయాలా లేక చేయకూడదా అన్నది చాలా సహజముగా నిర్ణయించగలుగుతారు. మీముందు అథారిటి యొక్క ఆధారము ఉన్న కారణంగా కేవలం వారిని కాపీ చేయాలి. కాపీ చేయడం సహజమా లేక కష్టమా? అవునా, కాదా అన్న జవాబు అథారిటీని మీముందు ఉంచుకోవడం ద్వారా దానంతట అదే మీకు వచ్చేస్తుంది. ఏ విధంగా ఈ రోజుల్లో సైన్స్  కూడా ఎటువంటి మెషినరీని తయారుచేసిందంటే అందులో మీరు ఏ ప్రశ్నను వేసినా జవాబు సహజముగానే లభించేస్తుంది. మిషనరీ ద్వారా ప్రశ్నకు జవాబు వెలువడుతుంది, కావున మెదడును ఉపయోగించడం నుండి విముక్తులైపోతారు. కావున అలాగే ఆల్ మైటీ అథారిటీని ముందు ఉంచుకోవడం ద్వారా ఏ ప్రశ్నలైతే వేస్తారో వాటి జవాబులు ప్రత్యక్షంగా మీకు సహజంగానే లభిస్తాయి. సహజమార్గంగా అనుభవమవుతుంది. ఇటువంటి సహజమైన మరియు శ్రేష్ఠమైన మార్గము లభిస్తూ కూడా ఆ ఆధారము నుండి లాభాన్ని పొందకపోతే దానిని ఏమంటారు? అది వారి బలహీనత, కావున బలహీన ఆత్మగా అయ్యేందుకు బదులుగా శక్తిశాలీ ఆత్మగా అవ్వండి మరియు తయారుచేయండి. స్వయమును ఆల్ మైటీ అథారిటీగా భావించడం ద్వారా మూడు ముఖ్యమైన విషయాలు వాటంతట అవే మీలో ధారణ అయిపోతాయి. ఆ మూడు విషయాలు ఏమిటి?

            బుద్ధి ద్వారా డ్రిల్లు చేసినట్లయితే మీరు విన్న జ్ఞానాన్ని పునశ్చరణ చేసుకుంటారు, ఇది కూడా మంచిదే. దీని ద్వారా శక్తి పెరుగుతుంది. ఏ అథారిటీ వారైనా కాని సాధారణమైన అథారిటీ కలవారిలో కూడా ఒకటేమో నిశ్చయము, రెండవది నషా, మూడవది నిర్ణయత ఉంటాయి. ఈ మూడు విషయాల కారణంగా ఆ అథారిటీ కలవారు అయధార్థముగా ఉన్నా కాని ఎంత దృఢ నిశ్చయబుద్ధి కలవారిగా అయి మాట్లాడతారు మరియు నడుచుకుంటారు! ఎంత నిశ్చయం ఉంటుందో అంతే నిర్భయులుగా అయి నషాతో మాట్లాడుతారు. అలాగే చూడండి, మీరందరూ ఆల్‌ మైటీ అథారిటీ కలవారు, అందరికన్నా శ్రేష్ఠ అథారిటీ కలవారు. కావున మీరు ఎంతటి నషాతో ఉండాలి! మరియు ఎంతటి నిశ్చయముతో మాట్లాడాలి! అలగే నిర్భయత కూడా కావాలి. ఎవరు ఏ విధముగానైనా మిమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నించినా నిర్భయత, నిశ్చయము మరియు నషా ఆధారముపై ఎప్పుడైనా ఓటమిని చవిచూస్తారా? కాదు, సదా విజయులుగా ఉంటారు. విజయులుగా ఉండకపోవడానికి కారణం - ఈ మూడు విషయాలలో ఏదో ఒక లోటు ఉంటుంది, కావుననే విజయులుగా అవ్వలేరు. కావున ఈ మూడు విషయాలను స్వయములో గమనించండి. ఎంతవరకు ప్రతి అడుగును వేయడంలో ఈ విషయాలు ప్రత్యక్షంగా ఉన్నాయి అని గమనించండి. ఒకటేమో - పూర్తి జ్ఞానముపై, బాబాపై నిశ్చయము. ఏ కర్మనైనా చేస్తూ, ఏ మాటలనైనా మాట్లాడుతూ ఈ మూడు అర్హతలూ ఉండాలి. ఆ ప్రత్యక్ష విషయము వేరు! ఎప్పుడైతే ఈ మూడు విషయాలు ప్రతి కర్మ, ప్రతి మాటలోకి వచ్చేస్తాయో అప్పుడే మీ ప్రతి వాక్కు మరియు ప్రతి కర్మా ఆల్‌ మైటీ అథారిటీని ప్రత్యక్షం చేస్తాయి. ఇప్పుడైతే సాధారణమైనవారిగా భావిస్తున్నారు. వీరి అథారిటీ స్వయంగా సర్వశక్తివంతుడైన తండ్రి అన్నది అనుభవం చేసుకోవడం లేదు. ఎప్పుడైతే ఒక్క క్షణము కూడా అథారిటీని వదిలి ఏ కర్మనూ చేయరో లేక ఏ మాటనూ మాట్లాడరో అప్పుడు దీనిని అనుభవం చేసుకోగలరు. అథారిటీని మర్చిపోవడం ద్వారా సాధారణ కర్మలు జరుగుతాయి. కావున ఇతరులను కూడా సాధారణంగా, ఏ విధంగా ఇతరులు ఎంతో కొంత చేస్తూ ఉంటారో అలాగే అనుభవమవుతుంది. వారు వచ్చినా రిజల్టులో ఏమంటారు? మీ విశేషతను వర్ణన చేస్తూ తోడుగా విశేషతతో పాటు సాధారణతను కూడా తప్పకుండా వర్ణన చేస్తూ ఉంటారు. ఇతర సంస్థలలో కూడా అలా ఉంటారు. వారు ఎలా చేస్తున్నారో వీరూ అలా చేస్తున్నారు అని భావిస్తారు. కావున ఇది సాధారణతయే కదా! ఒకటి, రెండు విషయాలు విశేషంగా అనిపిస్తాయి. కాని ప్రతికర్మ, ప్రతివాక్కు విశేషంగా అనిపించాలి. ఇంకెవరితోను పోల్చలేకుండా ఉండాలి. ఆ స్థితి ఇంకా రాలేదు కదా! సర్వశక్తివంతుని కార్యాలు సాధారణంగా ఎలా ఉండగలవు? పరమాత్ముని అథారిటీకి, ఆత్మల అథారిటీకి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉండాలి. ఈ విధంగా స్వయములో అనగా మీ మాటలు మరియు కర్మలలో ఇతర ఆత్మలతో పోలిస్తే రాత్రికి, పగలుకు ఉన్నంత తేడాను అనుభవం చేసుకుంటున్నారా? రాత్రికి పగలుకు ఉన్న తేడా ఎంతగా ఉంటుందంటే, ఇది రాత్రి, ఇది పగలు అని ఎవరికైనా అర్థం చేయించవలసిన అవసరం ఉండదు. ఇది రాత్రి, ఇది పగలు అని దానంతట అదే అర్థం చేసుకుంటారు. మీరు కూడా సర్వశక్తివంతుని అథారిటీ ఆధారంతో ప్రతి కర్మను చేస్తున్నారు, ప్రతి డైరెక్షన్ అనుసారంగా నడుచుకుంటున్నారు. కావున రాత్రికి పగలుకు ఉన్నంత తేడా  కనిపించాలి. ఎంత తేడా ఉండాలంటే, ఎవరైనా ఇక్కడకు రావడంతోనే ఇది సాధారణమైన స్థానంకాదు! వీరి జ్ఞానము సాధారణమైనది కాదు అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి ప్రభావం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మీ అథారిటీని ప్రత్యక్షం చేస్తున్నారని భావించండి. శాస్త్రవాదుల మాటల ద్వారా వీరికి శాస్త్రాల అథారిటీ ఉంది అని ఏవిధముగా కనిపిస్తుందో అలా మీ ప్రతి మాట ద్వారా అథారిటీ ప్రసిద్ధమవ్వాలి. ఫైనల్ స్టేజ్ అయితే ఇదే కదా! మీ మాటల ద్వారా, ముఖం ద్వారా, నడవడిక ద్వారా అన్నింటి ద్వారా అథారిటీ గూర్చి తెలియాలి. ఈనాటి ప్రపంచంలో చిన్న అథారిటీగల ఆఫీసర్లు కూడా తమ కర్తవ్యంలో ఉన్నప్పుడు ఎంత అథారిటీతో వారి కర్మలు కనిపిస్తాయి! నషా ఉంటుంది కదా! అదే నషాతో ప్రతి కర్మను చేస్తారు. వారిది హద్దులోని సాక్షాత్కారాల అథారిటీ, ఇది అలౌకిక అవినాశీ అథారిటీ.

            ఇటువంటి అథారిటీగల తండ్రిని సమ్ముఖంగా ఉంచుకొని అథారిటీతో నడుచుకొనే ఆత్మలకు నమస్తే.

Comments