27-02-1972 అవ్యక్త మురళి

* 27-02-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "హోలీ హంసలుగా అయినందుకు స్మృతిచిహ్నమే హోలీ."

మీరు సదా బాబా సాంగత్యంలో ఉండే, ఆత్మిక రంగులో ఉండే హోలీ హంస ఆత్మలు. ఎవరైతే సదా హోలీగా ఉంటారో వారి కొరకు సదా హోలీ పండుగే. కావున సదా బాబా స్నేహము, సహయోగము మరియు సర్వశక్తుల రంగులో బాబా సమానంగా ఉండే ఆత్మలు సదాకాలికంగా హోలీని జరుపుకుంటున్నారా లేక అల్పకాలికమైన హోలీని జరుపుకుంటున్నారా? సదా హోలీ జరుపుకునేవారు సదా బాబా తోడుగా మిలనము జరుపుకుంటూ ఉంటారు. సదా అతీంద్రియ సుఖములో లేక అవినాశీ సంతోషంలో ఊగుతు, తేలియాడుతూ ఉంటారు. అటువంటి స్థితిలో ఉండే హోలీ హంసలేనా? జనులు తమను ఉత్సాహంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఉత్సవం కొరకు ఎదురుచూస్తూ ఉంటారు, ఎందుకంటే ఉత్సవాలు వారిని అల్పకాలికమైన ఉత్సాహంలోకి తీసుకువస్తాయి. కాని, శ్రేష్ఠ ఆత్మలైన మీ కొరకు ప్రతిరోజే కాదు, ప్రతిక్షణము ఉత్సవమే అనగా ఉత్సాహమును కలిగించేదే. అవినాశీ అనగా నిరంతరము ఉత్సవమే ఉత్సవము, ఎందుకంటే మీ ఉత్సాహంలో తేడా రాదు. మరి ఇది నిరంతమైపోయింది కదా! కావున హోలీ జరుపుకునేందుకు వచ్చారా లేక హోలీగా అయి హోలియస్ట్ లేక స్వీటెస్ట్ బాబాతో మిలనము జరుపుకునేందుకు వచ్చారా లేక సదా తమ సాంగత్యపు రంగులో ఉండే ఆత్మిక రూపమును చూపించేందుకు వచ్చారా? హోలీనాడు అల్పకాలిక ఆనందంలో నిమగ్నమై ఉంటారు. మరి మీ అవినాశీ ఈశ్వరీయ ఆనందపు స్వరూపమును అనుభవం చేసుకుంటున్నారా? హోలీ ఆనందంలో నిమగ్నమై ఉన్న కారణంగా తమ సంబంధాలు అనగా పెద్దా, చిన్నా అన్న భావమును కూడా మరిచిపోతారు. పరస్పరంలో అందరూ ఒక్కటే అని భావిస్తూ ఆడుతారు. పరస్పరం ఒకరిపై ఒకరికి ఉన్న శత్రుత్వపు సంస్కారాలను అల్పకాలం కొరకు అందరూ మరిచిపోతారు, ఎందుకంటే అంతా మంగళ దివసమును జరుపుకుంటారు. ఈ వినాశీ ఆచార వ్యవహారాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ ఆచారాలను నడిపించేందుకు ఎవరు నిమిత్తులయ్యారు? బ్రాహ్మణులైన మీరు. ఇప్పుడు కూడా ఎప్పుడైతే హోలీ అనగా పవిత్రతా స్థితిలో నిలిచి ఉంటారో లేక బాబా సాంగత్యపు రంగులో రంగరింపబడి ఉంటారో అప్పుడు ఈశ్వరీయ ఆనందంలో ఈ దేహపు భానము లేక భిన్న భిన్న సంబంధాల భావము లేక చిన్నా పెద్దా అన్న భావము నుండి విస్మృతులై ఒకే ఆత్మ స్వరూపపు భావము ఉంటుంది కదా! కావున మీ సదాకాలిక స్థితి యొక్క స్మృతిచిహ్నమే ప్రపంచంలోని వారు ఈ విధంగా జరుపుకుంటున్నారు. మా ప్రత్యక్ష స్థితి యొక్క ప్రమాణపు స్వరూపమును ఈ స్మృతి చిహ్నంగా చూస్తున్నాము అన్న ఇటువంటి నషా లేక సంతోషము ఉంటోందా? స్మృతి చిహ్నమును చూస్తూ మీ కల్పపూర్వము చేసిన కర్మలు గుర్తుకు వస్తున్నాయా లేక వర్తమాన సమయంలో మీరు ప్రత్యక్షంగా చేసిన ఈశ్వరీయ చరిత్రల సాక్షాత్కారమును ఈ స్మృతిచిహ్న దర్పణాల ద్వారా సాక్షాత్కారం చేసుకుంటున్నారా? మీ చరిత్రల స్మృతి చిహ్నాన్ని మీరు చూస్తున్నారు కదా! మీ స్థితి యొక్క వర్ణనను ఇతర ఆత్మల ద్వారా గాయన రూపంలో వింటున్నారు కదా! మీ చైతన్య ఆత్మిక రూపమును చరిత్రల స్మృతి చిహ్నమును కూడా చూస్తున్నారు. వీటన్నింటినీ చూస్తూ, వింటూ ఏమి అనుభవం చేసుకుంటున్నారు? ఇవన్నీ నేనే అని అనుభవం చేసుకుంటున్నారా లేక ఈ సృతిచిహ్నము ఏ విశేష ఆత్మలది అని భావిస్తున్నారా? సాకార రూపంలో తమ భవిష్య స్మృతిచిహ్నమును చూస్తూ సదా ఇది నేను అన్న నషా మరియు సంతోషము ఉండేది, అలాగే మీ అందరికీ కూడా మీ సృతిచిహ్న చిత్రమును చూస్తూ లేక చరిత్రలను వింటూ లేక గాయనమును వింటూ నేనే ఇది అన్న సంతోషము మరియు నషా ఉంటోందా? ఇపుడిప్పుడే మనము ప్రత్యక్ష రూపంలో పాత్రను అనుభవిస్తున్నాము, మళ్ళీ ఇప్పుడిప్పుడే మన పాత్ర యొక్క స్మృతి చిహ్నమును చూస్తున్నాము అన్న స్మృతిలో సదా ఉండాలి. మొత్తం కల్పంలో తమ స్మృతి చిహ్నాలను చూసే ఆత్మలెవరైనా ఉంటారా? తమ స్మృతిచిహ్నాలను చూసే ఆత్మలు మొత్తం కల్పంలో ఎవరైనా ఉన్నారా? చూడడమైతే అందరూ చూస్తారు కాని స్మృతి ఉండదు. ఈ స్మృతిలో తమ స్మృతి చిహ్నాలను చూసే పాత్ర కేవలం ఆత్మలైన మీకు మాత్రమే ఉంది. కావున స్మృతి ద్వారా తమ స్మృతి చిహ్నాలను చూస్తూ ఏమవ్వాలి? (కొంతమంది జవాబు చెప్పారు). విజయులుగా అయితే ఉండనే ఉన్నారు, విజయతిలకము దిద్దబడే ఉంది. గురువుల వద్దకు లేక పండితుల వద్దకు వెళ్ళినప్పుడు వారు మొదట తిలకమును దిద్దుతారు, అలాగే ఇక్కడ కూడా రావడంతోనే, పిల్లలుగా అవ్వడంతోనే మొట్టమొదట స్వస్మృతి ద్వారా సదా విజయులుగా అయ్యే తిలకము బాప్ దాదా ద్వారా దిద్దబడుతుంది. కావుననే పండితులు కూడా తిలకమును దిద్దుతారు. అన్ని ఆచారాలు బ్రాహ్మణుల ద్వారానే ఇప్పుడు కొనసాగుతాయి. బ్రాహ్మణుల తండ్రి అయిన రచయిత తోడుగా ఉన్నారు. పిల్లలూ అన్న పదమే తండ్రిని నిరూపిస్తోంది. బలిహారమయ్యేవారి ఓటమి జరుగజాలదు. స్మృతి సామర్ధ్యతను తీసుకువస్తుంది మరియు సామర్థ్యతలోకి రావడం ద్వారానే కార్యాలు సఫలమవుతాయి లేక సంతోషము, నషా లేక లక్ష్యములను గూర్చి ఏదైతే వినిపించారో అవన్నీ జరుగుతాయి. ఈ విషయాలన్నీ మాయమైపోయిన కారణంగానే నిర్బలత వస్తుంది. విసృతి కారణంగానే అసమర్థత వస్తుంది. కావున స్మృతి ద్వారా, సామర్థ్యత రావడం ద్వారా సిద్ధులన్నీ ప్రాప్తిస్తాయి అనగా అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. స్వసృతిలో ఉండేవారు ఎల్లప్పుడూ ఏ కార్యాలు చేసినా లేక ఏ సంకల్పాలు చేసినా అందులో సదా ఈ కార్యాలు లేక ఈ సంకల్పాలు సిద్ధించే ఉన్నాయి అన్న నిశ్చయము ఉంటుంది. ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారు తమ విజయము లేక సఫలత నిశ్చితమై ఉంది అని భావిస్తూ నడుచుకుంటారు. నిశ్చయముతో ఇటువంటి సఫలత నిశ్చితమై ఉంది అని భావించి నడుచుకునే నిశ్చయబుద్ధి కలవారి స్థితి ఎలా ఉంటుంది? వారి ముఖముపై ఏ విశేషమైన ప్రకాశము కనిపిస్తుంది? నిశ్చయమున్నట్లయితే మన విజయము నిశ్చితమై ఉంటుంది అని నిశ్చయమును గూర్చి వినిపించడం జరిగింది. కాని, వారి ముఖముపై ఏమి కనిపిస్తుంది? విజయము నిశ్చితమై ఉన్నట్లయితే నిశ్చింతగా ఉంటారు కదా! ఏ విషయంలోను చింత యొక్క రేఖ కనిపించదు. ఇటువంటి నిశ్చయబుద్ధి కల విజయులుగా, నిశ్చింతులుగా మరియు సదా నిశ్చితముగా ఉన్నారా? మరి అలా లేకపోతే 100 శాతము నిశ్చయబుద్ధులుగా ఎలా అవుతారు? 100 శాతం నిశ్చయబుద్ధిగలవారు అనగా నిశ్చింత విజయులు మరియు నిశ్చింతులు. 100 శాతము అన్ని విషయాలలోను నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నామా అని మిమ్మల్ని మీరు చూసుకోండి. కేవలం బాబాపై నిశ్చయము ఉండడమును మాత్రమే నిశ్చయబుద్ధి అని అనరు. బాబాపై నిశ్చయబుద్ధి అలాగే దానితో పాటు తమపై తమకు కూడా నిశ్చయబుద్ధి ఉండాలి, అలాగే డ్రామా యొక్క ప్రతి క్షణపు పాత్ర పునరావృతమవుతోంది అన్న విషయంలో కూడా 100 శాతం నిశ్చయబుద్ధి కావాలి, దీనినే నిశ్చయబుద్ధి అని అంటారు. ఏ విధంగా బాబాపై 100 శాతం నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో, ఇందులో సంశయపు విషయమే లేదో అలా స్వయంలో కూడా నేను కూడా ఆ కల్పపూర్వపు ఆత్మను, తండ్రితో పాటు పాత్రను అభినయించే శ్రేష్ఠ ఆత్మను అన్న నిశ్చయము ఉండాలి, అలాగే డ్రామాలో ప్రతి పాత్రను ఇదే స్థితితో ప్రతి పాత్ర శ్రేష్ఠ ఆత్మనైన నా కళ్యాణము కొరకే ఉంది అన్న నిశ్చయము యొక్క స్థితితో చూడాలి. అంతేకాని, కేవలం ఒక్క విషయంలో పాసవ్వడం కాదు, ఎప్పుడైతే ఈ మూడు రకాల నిశ్చయంలో సదా పాసై ఉంటారో అటువంటి నిశ్చయబుద్ధి కలవారే ముక్తి మరియు జీవన్ముక్తులలో బాబా వద్ద ఉంటారు. ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారికి ఎప్పుడూ ప్రశ్న ఉత్పన్నమవ్వదు. ఎందుకు, ఏమిటి అన్న భాష నిశ్చయబుద్ధి కలవారికి ఉండదు. ఎందుకు అన్న ప్రశ్న వెనుక క్యూ ఏర్పడినట్లయితే క్యూలో భక్తులు ఉంటారే కాని జ్ఞానులు కాదు. మీ ముందు క్యూ ఏర్పడుతుంది కదా! క్యూల్లో ఎదురుచూడవలసి ఉంటుంది. ఇప్పుడు ఎదురుచూసే ఘడియలు సమాప్తమయ్యాయి. ఎదురుచూసే ఘడియలు భక్తులవి. జ్ఞానము అనగా ప్రాప్తి యొక్క ఘడియలు, మిలనము యొక్క ఘడియలు. మీరు ఇటువంటి నిశ్చయబుద్దులే కదా! ఇటువంటి నిశ్చయబుద్ధిగల ఆత్మల స్మృతి చిహ్నాలు ఇక్కడే కనిపిస్తాయి. మీ స్మృతి చిహ్నాలను చూశారా? అచలఘర్ చూశారా? ఎవరైతే సదా సర్వసంకల్ప సహితంగా బాప్ దాదాలపై బలిహారమై ఉంటారో వారిముందు మాయ ఎప్పుడూ యుద్ధం చేయజాలదు. ఈ విధంగా మాయ యుద్ధం నుండి సురక్షితులుగా ఉంటారు. పిల్లలుగా అయిపోతే సురక్షితులుగా ఉంటారు. పిల్లలుగా అవ్వకపోతే మాయ నుండి కూడా సురక్షితులుగా ఉండలేరు. మాయ నుండి రక్షించుకునేందుకు యుక్తి చాలా సహజము, పిల్లలుగా అయిపోండి. ఒడిలో కూర్చుంటే సురక్షితులైపోతారు. మొదట సురక్షితులుగా ఉండేందుకు యుక్తిని తెలియజేస్తారు, ఆ తరువాత పంపిస్తారు. సాహసవంతులుగా అయ్యేందుకే పంపిస్తారు కాని ఓడిపోయేందుకు కాదు. ఆట ఆడేందుకు పంపిస్తారు. అలౌకిక జీవితంలో ఉన్నప్పుడు, అలౌకిక కర్మలు చేసేవారైనప్పుడు మరి ఈ అలౌకిక జీవితంలో బొమ్మలు కూడా అన్ని అలౌకికముగానే ఉంటాయి. వాటిని కేవలం ఈ అలౌకిక యుగములోనే అనుభవం చేసుకుంటారు. ఇవి బొమ్మలు, వీటితో ఆడుకోవాలే కాని ఓడిపోకూడదు. ఆరోగ్యము లేక శారీరిక శక్తి కొరకు కూడా ఆడించడం జరుగుతుంది. అలౌకిక యుగములో అలౌకిక తండ్రి ద్వారా ఈ అలౌకిక ఆటలు ఆడించడం జరుగుతాయి అని భావిస్తూ ఆడినట్లయితే భయపడరు, కంగారుపడరు, వ్యాకులత చెందరు, ఓడిపోజాలరు. సదా ఇదే నషాలో ఉండండి. కావున ఇవి ఆడుకునేందుకు అలౌకికమైన బొమ్మలు. ఈ ఈశ్వరీయ నషాలో ఉండడం ద్వారా సహజంగానే దేహ భానము సమాప్తమైపోతుంది. ఈశ్వరీయ నషా నుండి క్రిందకు దిగినప్పుడు దేహాభిమానంలోకి వస్తారు. కావున సదాకాలం కొరకు సాంగత్యము ద్వారా సాంగత్యపు రంగును అంటించుకోండి. ప్రతిక్షణము బాబాతో మిలనము జరుపుతూ ప్రతిరోజూ అమృతవేళ నుండి మస్తకముపై విజయ తిలకము ఏదైతే దిద్దబడిందో దానిని మీ చార్టురూపీ దర్పణంలో చూడండి! ఏ విధంగా అమృతవేళ లేచి శరీరమును సరిచేసుకుంటారో అలాగే మొదట బాబా ద్వారా లభించిన సర్వశక్తులతో ఆత్మను అలంకరించుకోండి. ఎవరైతే అలంకరింపబడి ఉంటారో వారు సంహారీమూర్తులుగా కూడా ఉంటారు. మీరు మొత్తం విశ్వంలోకెల్లా సర్వ శ్రేష్ఠ ఆత్మలు కదా! శ్రేష్ఠ ఆత్మల సింగారము కూడా శ్రేష్ఠముగా ఉంటుంది. మీ జడచిత్రాలు సదా సింగారింపబడి ఉంటాయి. శక్తులు లేక దేవీ చిత్రాలలో సింగారమూర్తులు మరియు సంహారీమూర్తులు ఇరువురూ ఉంటారు. కావున రోజూ అమృతవేళ సాక్షిగా అయి మీ ఆత్మను సింగారించుకోండి. చేసేదీ మీరే మరియు చేయవలసింది కూడా మీరే, అప్పుడిక ఎటువంటి పరిస్థితిలోను వ్యాకులత చెందరు, స్థిరంగా ఉంటారు. ఇటువంటివారినే హోలీ హంసలు అని అంటారు. జనులు హోలీ జరుపుకుంటారు కాని మీరు స్వయం హోలీ హంసలు! ఇటువంటి హోలీహంసలకు హోలియస్ట్ బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments