26-10-1971 అవ్యక్త మురళి

* 26-10-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"కర్మలకు ఆధారము వృత్తి"

          ఈరోజు ఇది ప్రవృత్తిలో ఉండే పాండవసైన్యం వారి భట్టీ ప్రారంభోత్సవము. స్వయమును పాండవులుగా భావిస్తున్నారా? నిరంతరము మీ పాండవ స్వరూపము స్మృతిలో ఉంటోందా లేక అప్పుడప్పుడు స్వయమును పాండవులుగా భావిస్తూ అప్పుడప్పుడు ప్రవృత్తివారిగా భావిస్తున్నారా? నిరంతరము స్వయమును పాండవులుగా అనగా మార్గదర్శకులుగా భావించడం ద్వారా సదా యాత్ర మరియు గమ్యస్థానము తప్ప ఇంకే స్మృతి అయినా ఉండగలదా? ఇంకేదైనా సృతి ఉన్నట్లయితే దానికి కారణము - మీ పాండవ స్వరూపాన్ని మరిచిపోతారు. స్మృతి అనగా వృత్తి మారడం ద్వారా కర్మ కూడా మారిపోతుంది. కర్మకు ఆధారము వృత్తి(ఆలోచనాసరళి). ప్రవృత్తి వృత్తి ద్వారానే పవిత్రముగా, అపవిత్రముగా అవుతుంది. కావున పాండవ సైన్యము వృత్తిని సదా ఒక్క బాబాతో జోడిస్తూ ఉన్నట్లయితే వృత్తి ద్వారా తమ ఉన్నతిలో వృద్ధిని పొందగలుగుతారు. వృద్ధికి కారణము - వృత్తి. వృత్తిలో ఏమి చేయాలి? వృత్తి ఉన్నతంగా ఉన్నట్లయితే ప్రవృత్తి ఉన్నతంగా ఉంటుంది. కావున వృత్తిలో ఏమి ఉంచడం ద్వారా సహజంగా వృద్ధి జరుగగలదు? వృత్తిలో సదా ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అన్నది ఉండాలి. ఒక్క బాబాతోనే సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తులు కలుగుతాయి. ఇది సదా వృత్తిలో ఉండడం ద్వారా దృష్టిలో ఆత్మిక స్వరూపము అనగా సోదర దృష్టి సదా ఉంటుంది. ఎప్పుడైతే ఒక్క బాబా నుండి సర్వసంబంధాల ప్రాప్తి యొక్క విస్మృతి జరుగుతుందో అప్పుడే వృత్తి చంచలమవుతుంది. ఎప్పుడైతే ఒక్క బాబా తప్ప మరే ఇతర సంబంధము ఉండదో వృత్తి చంచలమెందుకవుతుంది? ఉన్నతమైన వృత్తి ఉండడం ద్వారా చంచల వృత్తి ఏర్పడజాలదు. వృత్తిని శ్రేష్ఠంగా చేసుకున్నట్లయితే ప్రవృత్తి దానంతట అదే శ్రేష్ఠంగా ఉంటుంది. కావున మీ వృత్తిని శ్రేష్ఠంగా చేసుకోండి, అప్పుడు ఈ ప్రవృత్తియే ప్రగతికి కారణంగా అయిపోతుంది మరియు ప్రగతి ద్వారా గతి, సద్గతులను సహజంగానే పొందగలుగుతారు. అప్పుడిక ఈ ప్రవృత్తి క్రింద పడేందుకు సాధనమవ్వదు, కావున ప్రవృత్తి మార్గంలో ఉండేవారు ప్రగతి కొరకు వృత్తిని సరిచేసుకోవాలి, అప్పుడిక ఈ వృత్తి చంచలత యొక్క ఫిర్యాదు సమాప్తమైపోతుంది. స్మృతి లేక వృత్తిలో సదా మీ నిర్వాణధామము మరియు నిర్వాణ స్థితి ఉండాలి మరియు చరిత్రలో నిర్మానత ఉండాలి.

           కావున నిర్మాణము, నిర్మానత మరియు నిర్వాణము ఈ మూడూ స్మృతిలో ఉండడం ద్వారా చరిత్ర, కర్తవ్యము మరియు స్థితి ఈ మూడూ ఈ స్మృతి ద్వారా సమర్ధవంతంగా అయిపోతాయి అనగా స్మృతిలో సామర్థ్యత వచ్చేస్తుంది. ఎక్కడైతే సామర్థ్యత ఉంటుందో అక్కడ మూడింటిలోను విస్తృతి రాజాలదు. కావున విస్మృతిని అంతం చేసేందుకు ఈ సమర్థ స్మృతిని ఉంచండి, ఇది చాలా సహజము కదా! చరిత్రలో నిర్మానత ఉన్నట్లయితే విశ్వనిర్మాణ కర్తవ్యము కూడా దానంతట అదే కొనసాగుతుంది. నిర్మానత అనగా నిరహంకారత, కావున నిర్మానతలో దేహ అహంకారము స్వతహాగానే అంతమైపోతుంది. ఇటువంటి నిర్మాన స్థితిలో ఉండేవారు సదా నిర్వాణ స్థితిలో ఉంటూ కూడా వాణిలోకి వస్తారు కావున వాణి కూడా యథార్థంగా మరియు శక్తిశాలిగా ఉంటుంది. కావున ఏ వస్తువు అయినా ఎంత శక్తిశాలిగా ఉంటుందో అంతగానే దాని క్వాంటిటి తక్కువగా ఉంటుంది మరియు దాని క్వాలిటి అధికంగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే నిర్మాన స్థితిలో స్థితులై వాణిలోకి వస్తారో అప్పుడు వాణిలో కూడా పదాలు తక్కువగా, అధిక శక్తిశాలిగా ఉంటాయి. ఇప్పుడు విస్తారమును అధికము చేయవలసి ఉంటుంది. కాని, ఎంతెంతగా శక్తిశాలి స్థితిని తయారుచేసుకుంటూ ఉంటారో అంతంతగా మీ ఒక్కొక్క మాటలోను వేలాది పదాల రహస్యము ఇమిడి ఉంటుంది, దాని ద్వారా వ్యర్ధమైన వాణి దానంతట అదే సమాప్తమైపోతుంది. ఏ విధంగా మొత్తం జ్ఞానసారమంతా చిన్న బ్యాడ్జిలో ఇమిడిపోయి ఉందో, పూర్తి సాగరమంతా ఈ ఒక్క చిత్రములో సారరూపంలో ఇమిడిపోయి ఉందో అలా మీ ఒక్క మాట కూడా సర్వ రహస్యాలతో నిండినదిగా వెలువడుతుంది. కావున ఈ విధంగా వాణిలో కూడా శక్తిని నింపాలి. ఎప్పుడైతే వృత్తి మరియు వాణి శక్తిశాలిగా అయిపోతాయో అప్పుడు కర్మలు కూడా సదా యథార్థంగా మరియు శక్తిశాలిగా ఉంటాయి.

           ఇక్కడకు బ్యాటరీని చార్జి చేసేందుకు వచ్చారు, బ్యాటరీని చార్జి చేసుకునేందుకు సదా స్వయమును విశ్వనిర్మాణము చేసేందుకు ఇన్ చార్జిగా భావించండి. సదా స్వయమును ఈ సృష్టి కర్తవ్యమునకు ఇన్ చార్జిగా భావించినట్లయితే బ్యాటరీ సదా చార్జ్ అయి ఉంటుంది. ఈ చార్జి నుండి స్వయమును విస్మృతిలోకి తీసుకువెళ్ళినట్లయితే అప్పుడు బ్యాటరీ డిస్ చార్జ్ అవుతుంది. కావున సదా స్వయమును మీ ఈ కర్తవ్యంలో ఇన్ చార్జిగా భావించండి మరియు మీ బ్యాటరీ చార్జ్ యొక్క చార్ట్ ను పదే పదే పరిశీలించుకున్నట్లయితే ఎప్పుడూ సంకల్పము లేక కర్మలలో లేక ఆత్మక స్థితిలో డిస్ చార్జ్ అవ్వరు. అప్పుడిక ఈ ఫిర్యాదు కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా ఒక ఫిర్యాదే కదా! అందరిలోను ఎక్కువగా ఈ ఫిర్యాదే ఉంది. దీనికి కారణము - స్వయమును సదా ఈ శ్రేష్ఠ కర్మ యొక్క ఇన్ చార్జ్ గా భావించరు. “ఏ కర్మనైతే నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు." ఈ స్లోగన్ అయితే ఉండనే ఉంది, కాని దీనిని ఇంకా గుహ్యరీతిలో ఎలా ధారణ చేయాలో అర్థం చేసుకున్నారా? ఈ పాండవుల భట్టీ కొరకు ఈ గుహ్య స్లోగన్ ఎంతో అవసరము. అదేమిటి? ఏ విధంగా “ఏ కర్మనైతే నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు" అన్న స్లోగన్ నేదైతే వినిపిస్తారో అదేవిధంగా నిమిత్తమై ఉన్న ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంటుందో అలాంటి వాయుమండలమే తయారవుతుంది. “నా వృత్తి ఎలా ఉంటుందో వాయుమండలము అలా ఉంటుంది." కావున వాయుమండలమును పరివర్తనలోకి తీసుకువచ్చేది వృత్తి. కర్మ కన్నా వృత్తి సూక్ష్మమైనది. ఇప్పుడు కేవలం కర్మపై ధ్యానమునివ్వడం కాదు కాని వృత్తి ద్వారా వాయుమండలమును తయారుచేసే ఇన్ చార్జిని కూడా నేనే. వాయుమండలమును ఎవరు సతో ప్రధానంగా తయారుచేస్తారు? మీరందరూ నిమిత్తులు కదా! ఈ స్లోగన్ సదా స్మృతిలో ఉన్నట్లయితే మరి వృత్తి చంచలమౌతుందా? పిల్లలు కూడా ఎప్పుడు చంచలంగా ఉంటారు? ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడు చంచలంగా ఉంటారు. ఎప్పుడైతే వృత్తిలో ఇంత పెద్ద కార్యపు స్మృతి తక్కువగా ఉంటుందో అప్పుడు వృత్తి కూడా చంచలమౌతుంది. ఎవరైనా అతి చంచలంగా ఉండే పిల్లలు బిజీగా ఉంటూ కూడా చంచలత్వాన్ని వదలకపోతే మరి దానికి ఇంకే సాధనము అవసరము? వృత్తిని స్మృతిలో లేక జ్ఞానములో బిజీగా ఉంచేందుకు ప్రయత్నము కూడా చేస్తున్నాము, అయినా కూడా చంచలమైపోతోంది అని ఇప్పటివరకు ఫిర్యాదు ఉంది, మరి ఇటువంటివారిని ఏం చేయాలి? ఏ విధంగా చంచలంగా ఉండే పిల్లలను ఏదో ఒక విధంగా, ఏదో ఒక బంధనలో బంధించే ప్రయత్నం చేస్తారో, అలా స్థూల బంధనము ద్వారా అయినా లేక వాణి ద్వారా ఏదో ఒక ప్రాప్తి యొక్క ఆధారమునయినా ఇచ్చి పిల్లలను తమ స్నేహములో బంధిస్తారు. అదేవిధంగా బుద్ధిని లేక సంకల్పమును కూడా ఏదో ఒక బంధనంలో బంధించవలసి ఉంటుంది, అది ఏ బంధనము? బుద్ధి ఎటు వెళ్ళినా ముందు దానిని పరిశీలించండి. పరిశీలించిన తరువాత ఎటువైపుకైతే సంకల్పము లేక వృత్తి వెళుతుందో ఆ లౌకిక లేక దేహధారీ వృత్తిని పరివర్తన చేస్తూ ఆ దేహధారి లేక లౌకిక వస్తువు యొక్క పోలికతో అలౌకిక లేక అవినాశీ వస్తువు యొక్క స్మృతిలోకి తీసుకురండి. ఏ విధంగా ఎవరైనా దేహధారిలో వృత్తి చంచలమైనప్పుడు ఏ సంబంధంలోనైతే చంచలమవుతుందో అదే సంబంధం యొక్క ప్రత్యక్ష అనుభవమును అవినాశీ బాబా ద్వారా పొందండి. ప్రవృత్తి యొక్క సంబంధంలో వృత్తి చంచలమవుతే ఈ సంబంధం యొక్క అలౌకిక అనుభవమును సర్వసంబంధాలను నిర్వర్తించే బాబా  నుండి ప్రాప్తించుకోండి. కావున ఎప్పుడైతే ప్రాప్తి లభిస్తుందో అప్పుడు చంచలత యొక్క విస్మృతి జరుగుతుంది. అర్థమైందా? సర్వసంబంధాలు, సర్వప్రాప్తులు ఒక్క బాబా ద్వారా లభించినట్లయితే ఇతర  వైపులకు బుద్ది చంచలమౌతుందా? కావున తమ చంచల వృత్తిని సర్వసంబంధాల బంధనలో ఒక్క బాబాతో జోడించినట్లయితే సర్వ చంచలత్వము సహజంగానే సమాప్తమైపోతుంది. ఇదే అన్నింటికన్నా అతిపెద్ద బంధనము. ఇంకే సంబంధము లేక ప్రాప్తి యొక్క సాధనము కనిపించకపోతే మరి ఇక వృత్తి ఎటువైపుకు వెళుతుంది? సీతకు రేఖ లోపల కూర్చోవాలి అన్న ఆజ్ఞ ఉంది, అదేవిధంగా ప్రతి అడుగువేస్తూ, ప్రతి సంకల్పం చేస్తూ బాబా ఆజ్ఞ రేఖ లోపల ఉన్నాను అని భావించండి, స్వయమును ఇటువంటి బంధనలో బంధించుకోండి. ఎప్పుడైతే సంకల్పంలో కూడా ఆజ్ఞ యొక్క రేఖ నుండి బైటపడరో అప్పుడిక వ్యర్ధమైన విషయాలు యుద్ధం చేస్తాయి. కావున సదా ఆజ్ఞ యొక్క రేఖ లోపల ఉన్నట్లయితే సదా సురక్షితంగా ఉంటారు, ఏ విధమైన రావణ సంస్కారము యుద్ధం చేయదు, అలాగే సమయ ప్రతి సమయము మీ సమయము ఇటువంటి విషయాలలో అంతం చేసుకునేందుకు వ్యర్థం చేసుకోరు. యుద్ధమూ జరుగదు, అలాగే పదే పదే వ్యర్థముగా సమయమూ పోదు. కావున ఇప్పుడు మీ ఆజ్ఞను సదా గుర్తుంచుకోండి. ఇటువంటి ఆజ్ఞాకారులుగా అయ్యేందుకే భట్టీలోకి వచ్చారు కదా! ఒక్క సంకల్పము కూడా ఆజ్ఞ లేకుండా జరగని విధంగా ఇటువంటి అభ్యాసము చేయండి. ఇటువంటి ఆజ్ఞాకారీ స్థితి యొక్క తిలకము సదా స్మృతిలో నిలిచి ఉండాలి. ఈ తిలకమును దిద్దండి, ఆ తరువాత ఫస్ట్ నెంబర్ లోకి ఎవరు వస్తారో చూద్దాము. ఈ తిలకమును ధారణ చేయడంలో ఫస్ట్ ప్రైజ్ ను తీసుకునేవారెవరో చూద్దాము. అచ్ఛా!

Comments