26-04-1977 అవ్యక్త మురళి

26-04-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్వతంత్రత బ్రాహ్మణుల జన్మ సిద్ధ అధికారం.

                     సదా స్వతంత్రంగా ఉండేటువంటి, సర్వ ప్రాప్తులకు అధికారిగా, ప్రకృతి మరియు మాయను ఆధీనం చేసుకునే యుక్తి చెప్తూ అవ్యక్త బాప్ దాదా మాట్లాడుతున్నారు -
              మాటలకు అతీతంగా వెళ్ళే స్థితి ప్రియమనిపిస్తుందా లేక మాటలలోకి వచ్చే స్థితి ప్రియమనిపిస్తుందా? మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క శ్రేష్ఠ స్థితిలో స్థితులై ఉన్నారా? మాటలకు అతీతమైన స్థితిలో స్థితులు కాగలుగుతున్నారా? సర్వశక్తివంతుని ప్రతి ఆజ్ఞను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే ధైర్యం అభ్యాసం అయ్యిందా? వ్యర్థ సంకల్పాలను ఒక్క సెకనులో సమాప్తి చేయండి అని బాప్ దాదా ఆజ్ఞాపిస్తే చేయగలరా? మాస్టర్ శక్తిసాగరులై విశ్వానికి శక్తిని మహాదానం చేయండి అని బాప్  దాదా అంటే ఒక్క సెకనులో ఆ స్థితిలో స్థితులై దాతగా కార్యం చేయగలరా? ఆజ్ఞ లభించగానే మాస్టర్ సర్వశక్తివంతులై విశ్వానికి శక్తుల యొక్క దానాన్ని ఇవ్వగలరా? ఇలా
ఎవరెడీయేనా? ఈ స్థితికి రావడానికి ముందు మీకు మీరు ముందుగా అభ్యాసం (రిహార్సలు) చేయండి. ఏ ఆవిష్కరణ అయినా విశ్వం ముందు పెట్టే ముందు స్వయంలో ప్రయోగం చేస్తారు కదా! అలా మీరు కూడా ముందస్తు అభ్యాసం చేస్తున్నారా? ఈ కార్యంలో లేదా అభ్యాసంలో ఎవరు సఫలులు కాగలరు? ఎవరైతే ప్రతి విషయంలో స్వతంత్రంగా ఉంటారో, ఏ రకమైన పరతంత్రత ఉండదో వారే కాగలరు. బాప్ దాదా కూడా స్వతంత్రంగా అయ్యే శిక్షణ ఇస్తూ ఉంటారు. ఈనాటి వాతావరణాన్ని అనుసరించి అందరు స్వతంత్రతను కోరుకుంటున్నారు. అన్నింటికంటే మొదటి స్వతంత్రత - పాత దేహ సంబంధాలతో. ఈ ఒక్క స్వతంత్రత ద్వారా అన్ని స్వతంత్రతలు స్వతహాగానే వస్తాయి. దేహం యొక్క పరతంత్రత అనేక పరతంత్రాలలో వద్దనుకున్నా కానీ ఎలా బంధిస్తుందంటే ఆత్మ అనే ఎగిరే పక్షిని పంజరంలోని పక్షిగా చేసేస్తుంది. స్వయాన్ని చూస్కోండి - స్వతంత్ర పక్షులా లేక పంజరంలోని పక్షిగా ఉన్నారా? పాత దేహం, పాత స్వభావ సంస్కారాలు లేదా ప్రకృతి యొక్క అనేక రకాల ఆకర్షణలకు అనగా వికారాలకు వశం అయ్యే పరంతంత్ర ఆత్మలు కాదు కదా? పరతంత్రత సదా క్రిందికి తీసుకు వచ్చేస్తుంది అంటే దిగిపోయే కళలోకి తీసుకు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగే అనుభూతిని చేసుకోనివ్వదు. ఏదోక బంధనలో బంధించబడిన అలజడి ఆత్మగా అనుభవం చేసుకుంటారు. లక్ష్యం లేకుండా, ఏ రసం లేకుండా నీరస స్థితిని అనుభవం చేసుకుంటారు. ఏ ఒడ్డు లేదా ఏ తోడు స్పష్టంగా కనిపించదు. వేడి అనుభవం అవ్వదు, సంతోషం అనుభవం అవ్వదు, సుడిగుండంలో చిక్కుకుని ఉంటారు. ఏదో పొందాలి, అనుభవం చేసుకోవాలి, ఇలా  కావాలి, కావాలి అంటూ స్వయాన్ని గమ్యానికి సదా దూరంగా అనుభవం చేసుకుంటారు. ఇదే పంజరంలోని పక్షి యొక్క స్థితి (అక్కడ కరెంట్ మాటిమాటికీ పోతుంది) ఇప్పుడు కూడా చూడండి - ప్రకృతి యొక్క బంధన నుండి ముక్తి అయిన ఆత్మ సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోండి. ఏవిధంగా అయితే బాబా సదా స్వతంత్రుడో అదేవిధంగా బాబా సమానంగా అవ్వండి. బాప్ దాదా ఇప్పుడు కూడా పరతంత్రంగా ఉన్న పిల్లలను చూసి ఏమనుకుంటారు? పేరు మాస్టర్ సర్వశక్తివంతులు కానీ పని - పంజరంలోని పక్షిగా అవ్వటమా? ఎవరైతే తమని తాము స్వతంత్రంగా చేసుకోలేరో తమ బలహీనతలతో తామే పడిపోతూ ఉంటారో అటువంటి వారు విశ్వపరివర్తకులుగా ఏవిధంగా అవుతారు? కనుక మీ బంధనాల యొక్క జాబితాను ఎదురుగా ఉంచుకోండి. స్థూలం మరియు సూక్ష్మం అన్నింటినీ బాగా పరిశీలించుకోండి. ఇప్పటికీ కూడా ఏదైనా బంధన మిగిలిపోతే ఇక ఎప్పటికీ బంధన్ముక్తులు కాలేరు. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. సదా ఇదే పాఠాన్ని పక్కా చేసుకోండి. అర్థమైందా?  స్వతంత్రత బ్రాహ్మణ జన్మ యొక్క అధికారం. కనుక మీ జన్మ సిద్ధ అధికారాన్ని మీరు పొందండి. మంచిది.
              బాబా సమానంగా సదా స్వత్రంత ఆత్మలకు, సర్వ ప్రాప్తులకు అధికారులకు, ప్రకృతి మరియు మాయను ఆధీనం చేసుకునేవారికి, సదా అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగే మాస్టర్ సుఖ సాగర పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments