24-10-1975 అవ్యక్త మురళి

24-10-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ప్రతి ఒక్క బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు చైతన్య సాలిగ్రామానికి మందిరం.

                   దృష్టి మరియు వృత్తిని పవిత్రంగా తయారుచేసి, స్వచ్ఛమైన బ్రాహ్మణులుగా తయారయ్యే యుక్తులు చెబుతూ బాప్ దాదా మాట్లాడుతున్నారు -
                  స్వయాన్ని కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు బాబాకి ప్రియంగా అనుభవం చేసుకుంటున్నారా? కమలపుష్పం తేలికగా ఉంటుంది. అందువలన నీటిలో ఉంటూ కూడా నీటికి అతీతంగా ఉంటుంది, ప్రవృత్తిలో ఉంటూ స్వయం నివృత్తిగా ఉంటుంది. అదేవిధంగా మీరందరూ కూడా లౌకిక లేదా అలౌకిక ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తి అనగా అతీతంగా ఉంటున్నారా? నివృత్తిగా ఉండేటందుకు విశేషంగా మీ వృత్తిని పరిశీలించుకోండి. ఎలాంటి వృత్తియో అలాంటి ప్రవృత్తి తయారవుతుంది. ఎలాంటి వృత్తి కలిగి ఉండాలి? ఆత్మికవృత్తి. ఈ వృత్తి ద్వారా ప్రవృత్తిలో కూడా ఆత్మీయత నిండుతుంది. అనగా ప్రవృత్తిలో ఆత్మీయత కారణంగా తాకట్టుగా భావించి నడుస్తారు. నాది అనే భావం సహజంగానే సమాప్తం అయిపోతుంది. తాకట్టు పెట్టిన వస్తువు పై ఎప్పుడూ నాది అనే భావం ఉండదు. నాది అనే భావంలోనే మోహం మరియు దాంతోపాటు ఇతర వికారాల యొక్క ప్రవేశం జరుగుతుంది. నాది అనేది సమాప్తం అయిపోవడం అనగా వికారాల నుండి ముక్తి అయిపోవడం. నిర్వికారి అనగా పవిత్రంగా అవ్వడం. దీని ద్వారానే ప్రవృత్తి కూడా పవిత్ర ప్రవృత్తి అయిపోతుంది. వికారాలు పోవడం అనగా శ్రేష్టంగా తయారవడం. ఈవిధంగా వికారాన్ని పోగొట్టుకున్న శ్రేష్ఠ ఆత్మగా స్వయాన్ని  అనుభవం చేసుకుంటున్నారా? ప్రవృత్తిని పవిత్ర ప్రవృత్తిగా తయారుచేసుకున్నారా? అన్నింటికంటే మొదటి ప్రవృత్తి - మీ దేహం యొక్క ప్రవృత్తి. ఆ తరువాత దేహసంబంధాల యొక్క ప్రవృత్తి. మొదటి ప్రవృత్తి అనగా దేహం యొక్క ప్రతి కర్మేంద్రియాన్ని పవిత్రంగా తయారుచేసుకోవాలి. ఎంతవరకు దేహం యొక్క ప్రవృత్తిని పవిత్రంగా తయారుచేసుకోరో అంతవరకు దేహసంబంధాల ప్రవృతి హద్దులోనిదైనా బేహద్దుదైనా రెండింటినీ కూడా పవిత్ర ప్రవృత్తిగా తయారుచేసుకోలేరు. బ్రహ్మకుమారీ కుమారుల ప్రవృత్తి ఎలాంటిది? హద్దులలోని సంబంధాల ప్రవృత్తి ఎలాగైతే ఉంటుందో అలాగే బ్రహ్మకుమారీ కుమారుల సంబంధంతో విశ్వంలోని ఆత్మలందరితో సాకారీగా సోదరీసోదరుల సంబంధం ఉంటుంది. మీది ఎంత పెద్ద బేహద్ ప్రవృత్తి కానీ మొదట దేహం యొక్క ప్రవృత్తిని తయారుచేసుకోవాలి అప్పుడు బేహద్ ప్రవృత్తిని కూడా తయారుచేయగలరు. అందువలనే ఇంటి నుండి ఉద్దరణ ప్రారంభించండి అని అంటారు. మొదట మీ దేహం యొక్క ప్రవృత్తి అనగా మీ ఇంటిని పవిత్రంగా తయారుచేసుకునే సేవ చేయాలి ఆ తరువాత బేహద్ సేవ చేయాలి. కనుక మొదట మిమ్మల్ని మీరు అడగండి. మీ శరీరరూపీ ఇంటిని పవిత్రంగా తయారుచేసుకున్నారా? సంకల్పాన్ని, బుద్ధిని, నయనాలను మరియు నోటిని ఆత్మికంగా అనగా పవిత్రంగా తయారుచేసుకున్నారా? దీపావళికి ఇంటిలో ప్రతిమూల శుభ్రం చేస్తారు, ఒక్కమూల కూడా వదలరు, అంత ధ్యాస పెడతారు. అదేవిధంగా ప్రతి కర్మేంద్రియాన్ని స్వచ్చంగా తయారుచేసుకుని ఆత్మరూపీ దీపాన్ని సదాకాలికంగా వెలిగించారా? ఇలాంటి ఆత్మిక దీపావళిని జరుపుకున్నారా లేక ఇప్పుడు జరుపుకోవాలా? అందరి దీపము అఖండంగా వెలుగుతూ ఉంది కదా? ఇల్లు మందిరంగా అవుతుందనే మహిమ ఉంది కదా! ఆవిధంగా మీ దేహరూపీ ఇంటిని మందిరంగా తయారుచేసుకున్నారా? ఎప్పుడైతే ఇంటింటినీ మందిరంగా తయారుచేస్తారో అప్పుడే విశ్వం కూడా చైతన్య దేవతల యొక్క చైతన్య నివాసస్థానం అనగా మందిరంగా తయారుచేస్తారు. ఎంతమంది బ్రాహ్మణులున్నారో వారు ప్రతి ఒక్కరు చైతన్యశక్తికి మందిరం. ఈ విధంగా మందిరంగా భావించి దేహన్ని శుద్ధంగా పవిత్రంగా తయారుచేసుకున్నారా? ఇప్పటి పురుషార్ధం యొక్క సమయ ప్రమాణంగా లేదా విశ్వం యొక్క సంపన్న పరివర్తన యొక్క సమయ ప్రమాణంగా ఈ సమయంలో ఏ కర్మేంద్రియం ద్వారా కూడా ప్రకృతికి లేదా వికారాలకు వశీభూతం అవకూడదు. ఎలాగైతే మందిరంలో భూతాలు ప్రవేశించవో అలాగే ప్రతి ఒక్కరు ఇంటిని మందిరంగా చేసుకున్నారా? ఎక్కడ అశుద్ధత ఉంటుందో అక్కడే వికారాలు లేదా భూతాలు ప్రవేశిస్తాయి. చైతన్య సాలిగ్రామ మందిరంలో లేదా చైతన్య శక్తిస్వరూపం యొక్క మందిరంలో అసురీ సంహారిణి యొక్క మందిరంలో అసురీ సంకల్పాలు లేదా అసురీ సంస్కారాలు ఎప్పుడూ ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశిస్తున్నాయి అంటే ఏదో ఒక రకమైన ఆశుద్ధత అనగా అస్వచ్చత ఉంది. ఈ విధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - ఎక్కడైనా ఏ రకమైన అశుద్దత మిగిలిపోయి ఉందా? ఉంటే ఇప్పుడే సమాప్తి చేసుకోండి. అనగా స్వచ్చమైన దీపావళి జరుపుకోండి. ఎప్పుడైతే ఇలాంటి పవిత్ర ప్రవృత్తిని తయారుచేసుకుంటారో అప్పుడే విశ్వ పరివర్తన అవుతుంది.
                       ఇక్కడ మధువనానికి కూడా ఆత్మికయాత్ర చేయడానికి వచ్చారు. ఈ ఆత్మికయాత్రలో మీ బలహీనతలను వదిలి వెళ్ళాలి. మధువనమే పరివర్తనా భూమి, పరివర్తనా భూమికి వచ్చి పరివర్తన చేసుకోకపోతే ఈ పరివర్తనా భూమి యొక్క లాభం ఏమి పొందినట్టు? కేవలం పరివర్తనా భూమిలోనే పరివర్తన తీసుకురావడం కాదు సదాకాలిక పరివర్తనను తీసుకురావాలి. మధువనాన్ని మహాయజ్ఞం లేదా రాజస్వ అశ్వమేధ యజ్ఞం అని అంటారు, మరి యజ్ఞంలో ఆహుతి చేస్తారు కదా! ఈ మహాయజ్ఞంలో మహా ఆహుతి చేసి వెళ్తున్నారా? లేక చేసిన ఆహుతిని తిరిగి తీసుకువెళున్నారా? పేరు ఎలాగైతే ఇస్తున్నారో పనికూడా అలాగే చేస్తున్నారా లేదా. పేరు మహాయజ్ఞం పరివర్తనా భూమి మరియు వరదాన భూమి ఎలాంటి పేరుయో అలాంటి కార్యం చేయండి. ఇక్కడ ఏదైతే ప్రతిజ్ఞ చేసుకుని వెళ్తున్నారో దానిని నిలబెట్టుకోండి లేక నిలబెట్టుకోవడం కష్టమనిపిస్తుందా? ఇలా నిలుపుకోవడంలో మూడురకాలైన ఆత్మలు తయారవుతున్నారు. కొందరు నిలుపుకోవడంలో స్వచ్ఛమైన దీపపు పురుగు వలే స్వయాన్ని బాబాపై బలిహరం చేసుకుంటున్నారు. అనగా బాబా ఆజ్ఞకు బలి అయిపోతున్నారు. మరికొందరు నిలుపుకోవడంలో భక్తులయిపోతున్నారు. అనగా బాబా నుండి సరిపడినంత శక్తిని తీసుకుంటూ ఉంటారు అంటే అడుగుతూ ఉంటారు. సహనశక్తి ఇవ్వండి అప్పుడు నిలుపుకుంటాను. ఎదుర్కొనే శక్తిని ఇవ్వండి అప్పుడు నిలుపుకుంటాను. ఇలా భిక్షమడుగుతూ ఉంటారు అనగా భక్తులైపోతుంటారు. మరికొందరు మోసకారులుగా కూడా అయిపోతున్నారు. చెప్పేది మరియు రాసేది ఒకటి, కానీ చేసేది మరొకటి బాబా ముందు కూడా మోసం చేస్తున్నారు. తమ పొరపాటును దాచుకునే మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసకారులు కూడా ఉన్నారు. కొంతమందిలో నిలుపుకునే శక్తి లేనే లేదు కానీ తమను తాము రక్షించుకునేటందుకు సాకులు తయారుచేస్తున్నారు. అనగా తమ బలహీనత దాచుకుని ఇతరుల సాకులు తయారుచేసి చెబుతున్నారు. ఫలానా సంబంధీకులు ఈవిధంగా ఉన్నారు. అందువలనే ఇలా జరుగుతుంది లేదా వాయుమండలం మరియు వాతావరణం ఆవిధంగా ఉంది అందుకే ఇలా జరుగుతుంది పరిస్థితులు అలా ఉన్నాయంటున్నారు. ఇలా సాకులు తయారుచేస్తూ ఉంటారు. ఇలా నిలుపుకోవడంలో ఇన్ని రకాలైనవారున్నారు. అందరూ ఒకటే చెబుతారు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. బాబా ఏమి చెబితే మరియు ఏమి చేయిస్తే అదే చేస్తామంటారు. కానీ చేయడంలో మరియు ప్రత్యక్షంలోకి రావడంలో అనేక రకాలుగా అయిపోతున్నారు. అందువలన ఇప్పటివరకు సాధారణంగా భావించి ఏదైతే చేశారో అది జరిగిపోయిందేదో జరిగిపోయింది అనగా మీపై మీరు దయ చూపించుకోండి. ఈ భూమి యొక్క గొప్పతనాన్ని కూడా మంచిగా తెలుసుకోండి. ఈ భూమిని సాధారణభూమిగా భావించకూడదు. గొప్ప స్థానానికి వస్తున్నారు, మిమ్మల్ని గొప్పగా తయారుచేసుకునేటందుకు. కనుక మీరు గొప్పగా తయారవ్వడమే గొప్పతనాన్ని తెలుసుకోవడం. అర్ధమైందా!
                     ఈవిధంగా సమయ ప్రమాణంగా స్వయాన్ని పరివర్తన చేసుకునేవారికి, విశ్వపరివర్తనకు నిమిత్తంగా అయినవారికి, బాబాతో ప్రీతి యొక్క రీతిని నిలుపుకునేవారికి, బాబాని సదా తమతోడుగా చేసుకునేవారికి మరియు సదా కమలపుష్ప సమానంగా సాక్షిగా ఉండేవారికి, ఈ విధమైన సదా స్నేహి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments