* 24-10-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"దృష్టి ద్వారా అతీతముగా చేసే విధి"
మీ స్వరూపము, స్వదేశము, స్వధర్మము, తమ శ్రేష్ఠకర్మ, శ్రేష్ఠ స్థితిలో ఉంటూ నడుచుకుంటున్నారా? ఎందుకంటే వర్తమాన సమయంలో ఈ స్వస్థితి యొక్క స్థితి ద్వారానే సర్వ పరిస్థితులన దాటివేయగలుగుతారు అనగా పాస్ విత్ హానర్ గా అవ్వగలుగుతారు. కేవలం ఈ ఒక్క స్వ అన్న పదమును గుర్తుంచుకున్నా స్వస్వరూపము, స్వధర్మము, స్వదేశము దానంతట అదే గుర్తుంటుంది. మరి ఈ ఒక్క స్వ అన్న పదమును గుర్తుంచుకోలేరా? స్వస్వరూపము మరియు స్వధర్మములో స్థితులవుతూ స్వదేశులుగా అవ్వడం సర్వాత్మలకు అవసరం. కావున ఏ కర్తవ్యము కొరకైతే నిమితులయ్యారో లేక ఏ కర్తవ్యము కొరకైతే అవతరించారో ఆ కర్తవ్యమును లేక మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ, ఒప్పుకుంటూ దానిని మరిచిపోగలరా! ఎవరైనా లౌకిక కర్తవ్యమును చేస్తూ, చేస్తూ తమ కర్తవ్యమును ఎప్పుడైనా మరచిపోతారా? డాక్టర్ తమ వైద్యపు కర్తవ్యమును నడుస్తూ తిరుగుతూ, తింటూ తాగుతూ అనేక కార్యాలు చేస్తూ, నా కర్తవ్యము వైద్యం చేయడము అన్నది ఎప్పుడైనా మర్చిపోతాడా! సర్వాత్మలను స్వస్వరూపము, స్వధర్మము యొక్క స్థితిలో స్థితులను చేయడము బ్రాహ్మణులైన మీ యొక్క జన్మ మరియు కర్మ. మరి బ్రాహ్మణులు లేక బ్రహ్మాకుమారీ కుమారులు తమ ఈ కర్తవ్యమును మరిచిపోగలరా? ఇంకొక విషయం ఏమిటంటే ఏదైనా వస్తువు సదాకాలము తోడుగా మరియు సమ్ముఖంగా ఉంటే దానిని ఎప్పుడైనా మరిచిపోగలరా?, అతి సమీపంగా మరియు సదా తోడుగా ఉండే వస్తువు ఏది? ఆత్మకు సదా సమీపంగా మరియు సదా తోడుగా ఉండే వస్తువు ఏది? శరీరము లేక దేహము సదా తోడుగా ఉన్న కారణంగా నిరంతర స్మృతి ఉంటుంది కదా! మరిచిపోవాలనుకున్నా మరిచిపోలేరు అలాగే ఇప్పుడు శ్రేష్ఠాత్మలైన మీకు సదా సమీపంగా మరియు సదా తోడుగా ఉండేవారు ఎవరు? బాప్ దాదా సదా తోడుగా, సదా సమ్ముఖంగా ఉంటారు మరియు ఏ దేహమైతే తోడుగా ఉంటుందో దాన్ని ఎప్పుడూ మర్చిపోరు. కాని, బాబాను ఇంత సమీపంగా ఉంటూ కూడా ఎందుకు మర్చిపోతున్నారు? వర్తమాన సమయంలో ఏమని కంప్లైంట్ చేస్తారు? బాబా స్మృతిని మర్చిపోతున్నారు అని అంటారు. అనేక జన్మల నుండి తోడుగా ఉన్న వస్తువులు, దేహము లేక దైహిక సంబంధాలను మర్చిపోరు, కాని ఎవరితోనైతే సర్వ ఖజానాలు ప్రాప్తమవుతాయో మరియు ఎవరైతే సదా తోడుగా ఉంటారో వారిని ఎందుకు మరిచిపోవాలి? పైకి ఎక్కించేవారు గుర్తుకు రావాలా లేక పడేసేవారు గుర్తుకు రావాలా? దెబ్బ వేసేవారు పొరపాటునైనా గుర్తుకు వచ్చినట్లయితే వారిని ప్రక్కకు తప్పించివేస్తారు కదా! మరి ఎక్కించేవారిని ఎందుకు మర్చిపోతున్నారు? ఎప్పుడైతే బ్రాహ్మణులు తమ స్వస్థితిలో, స్వస్మృతిలో లేక శ్రేష్ఠ స్థితిలో స్థితులై ఉంటారో అప్పుడు అన్యాత్మలను అందులో స్థిరము చేయగలుగుతారు. మీరందరూ ఈ సమయంలో బాబాతో పాటు ఇదే కర్తవ్యము కొరకు నిమిత్తులై ఉన్నారు.
అనేక ఆత్మలకు బహుకాలం నుండి కోరిక లేక ఆశ ఏముంటుంది? నిర్వాణము లేక ముక్తిధామంలోకి వెళ్ళాలనే కోరిక అనేక ఆత్మలకు ఎంతో కాలంగా ఉంటోంది. కావున ఆ ఆత్మలందరికీ బహుకాలం నుండి ఉన్న ఆశను పూర్తి చేసే కర్తవ్య నిమిత్తము బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఉన్నారు. ఎప్పటివరకైతే ఇటువంటి స్థితిని తయారు చేసుకోరో అప్పటివరకు ఈ కర్తవ్యమును ఎలా చేయగలరు? ముక్తి లేక జీవన్ముక్తిని పొందాలనే మీ ఆశను ఇప్పుడు పూర్తి చేసుకోలేకపోతే ఇతరులది ఎలా చేయగలరు? ముక్తి లేక జీవన్ముక్తి యొక్క వాస్తవిక అనుభవము ఏమిటి? దానిని మీరు ముక్తి లేక జీవన్ముక్తిధామంలోనే అనుభవం చేసుకుంటారా? ముక్తిలో అనుభవం చేసుకోవడం నుండి అతీతంగా ఉంటారు మరియు జీవన్ముక్తిలో జీవన బంధన ఎలా ఉంటుంది అన్న దువిధ ఉన్న కారణంగా జీవన్ముక్తిలో ఉన్నాము అన్నది కూడా ఎలా అనుభవం చేసుకుంటారు? కాని బాబా ద్వారా ముక్తి, జీవన్ముక్తుల వారసత్వమేదైతే ప్రాప్తమవుతుందో దానిని ఇప్పుడే అనుభవము చేయగలరు కదా! నిర్వాణ అవస్థ లేక ముక్తి స్థితిని ఇప్పుడే తెలుసుకోగలరు కావున ముక్తి, జీవన్ముక్తుల అనుభవమును ఇప్పుడే చేసుకోవాలి. ఎప్పుడైతే స్వయం ముక్తి, జీవన్ముక్తుల అనుభవజ్ఞులుగా అవుతారో అప్పుడే ఇతర ఆత్మలకు ముక్తిని అనగా మన ఇంటిని మరియు మన రాజ్యములోకి అనగా స్వర్గద్వారములోకి వెళ్ళే పాస్ ను ఇవ్వగలుగుతారు. ఎప్పటివరకైతే బ్రాహ్మణులైన మీరు ఏ ఆత్మకైనా గేట్ పాస్ ను ఇవ్వరో అప్పటివరకు వారు దానిని దాటలేరు. కావున ముక్తి, జీవన్ముక్తి ధామపు గేట్ పాస్ ను తీసుకునేవారి పెద్ద క్యూ మీముందుకు రానున్నది. గేట్ పాస్ ను ఇవ్వడంలో ఆలస్యం అయితే సమయం టూ లేట్ గా అయిపోతుంది. కావున స్వయమును సదా స్వస్వరూపము, స్వధర్మము, స్వదేశిగా భావించడం ద్వారా, సదా ఈ స్థితిలో స్థితులై ఉండడం ద్వారానే ఒక్క క్షణంలో ఏ ఆత్మనైన దృష్టి ద్వారా అతీతంగా చేయగలుగుతారు. మీ కళ్యాణ వృత్తి ద్వారా వారికి స్మృతిని కలిగిస్తూ ప్రతి ఆత్మకు గేట్ పాస్ ను ఇవ్వగలుగుతారు. తపిస్తున్న ఆత్మలు శ్రేష్ఠ ఆత్మలైన మీ ద్వారా ఒక్క క్షణంలో తమ జన్మజన్మల ఆశను పూర్తిచేసుకునే దానమును కోరుకునేందుకు వస్తారు. మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి ఒక్క క్షణపు విధి ద్వారా ఆ ఆత్మలకు సిద్ధిని ప్రాప్తింపజేసేంతటి సర్వశక్తులను జమ చేసుకున్నారా? ఎప్పుడైతే సైన్స్ రచన యొక్క శక్తి దిన ప్రతిదినము కాలముపై అనగా సమయముపై విజయాన్ని పొందుతున్నప్పుడు, ప్రతి కార్యంలోను చాలా కొద్ది సమయపు విధి ద్వారా కార్యం యొక్క సిద్ధిని ప్రాప్తించుకుంటూ ముందుకు వెళుతున్నారు. స్విచ్ ఆన్ చేయగానే కార్యము సిద్ధిస్తుంది. ఇది విధి కదా! మరి మాస్టర్ రచయితలు తమ సైలెన్స్ శక్తితో లేక సర్వశక్తులతో ఒక్క క్షణకాలపు విధి ద్వారా ఎవరికైనా సిద్ధిని అందించలేరా? కావున ఇప్పుడు ఈ శ్రేష్ఠ సేవ యొక్క అవసరం ఉంది. ఇటువంటి సేవాధారులుగా లేక ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వండి.
నయనాల యొక్క ఈశ్వరీయ నషా సేవ చేయాలి, ఎందుకంటే ఆత్మలు అనేక జన్మల నుండి, అనేకరకాలైన సాధనలను చేస్తూ, చేస్తూ అలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు సిద్ధిని కోరుకుంటున్నారే కాని సాధనను కాదు. కావున సిద్ధి అనగా సద్గతి. కావున ఇటువంటి తపిస్తున్న, అలసిపోయి ఉన్న ఆత్మలు లేక దాహార్తితో ఉన్న ఆత్మల దాహమును శ్రేష్ఠ ఆత్మలైన మీరు తప్ప ఇంకెవ్వరు తీర్చగలరు లేక ఇంకెవ్వరు సిద్ధిని ప్రాప్తింపజేయగలరు? మీరు తప్ప ఇంకే ఆత్మలైనా చేయగలరా? అనేకసార్లు చేసి ఉన్న మీ శ్రేష్ఠమైన కర్తవ్యము గుర్తుకు వస్తుందా? ఎంతెంతగా శ్రేష్ఠ స్థితిని తయారుచేసుకుంటూ ముందుకు వెళతారో అంతగా ఆత్మల పిలుపుల ఆలాపములు, ఆత్మలైన మిమ్మల్ని, శక్తులను పిలుస్తున్న ఆలాపములు, తపిస్తున్న ఆత్మల అనాథ ముఖములు, అలసిపోయి ఉన్న ఆత్మల ముఖములు కనిపిస్తూ ఉంటాయి. ఆది స్థాపనా కార్యంలో సాకార బాబా యొక్క అనుభవపు ఉదాహరణను చూశారు కదా! ఆత్మల సేవ చేయకుండా వారు ఆగగలిగారా? సేవ తప్ప ఇంకేదైనా కనిపించేదా? అలాగే ఆత్మలకు సిద్ధిని ప్రాప్తింపజేసే లగనంలో మగనమవ్వండి. అప్పుడిక ఈ చిన్న చిన్న విషయాలలో మీ సమయము మరియు జమ చేసుకునే శక్తులను ఏవైతే పోగొట్టుకుంటారో అవి సురక్షితమవుతాయి లేక జమ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక్క క్షణంలో మీ శక్తి శాలీ వృత్తి ద్వారా బేహద్ ఆత్మల సేవను చేయగలుగుతారో అప్పుడు మీ హద్దులోని చిన్న చిన్న విషయాలలో సమయాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? బేహద్దులో ఉన్నట్లయితే హద్దులోని విషయాలు స్వతహాగానే అంతమైపోతాయి. మీరు హద్దులోని విషయాలలో సమయాన్ని వ్యర్ధం చేసుకొని మళ్ళీ బేహద్దులో నిలవాలనుకుంటారు, కాని ఇప్పుడు ఆ సమయం పోయింది. ఇప్పుడు బేహద్ సేవలో సదా తత్పరులై ఉన్నట్లయితే హద్దులోని విషయాలు వాటంతట అవే తొలగిపోతాయి. ఏ విధంగా మీరు, ఇప్పుడు భక్తిలో సమయాన్ని పాడు చేసుకోవడము అనగా బొమ్మల ఆటలలో సమయాన్ని పాడుచేసుకోవడము, ఎందుకంటే ఇప్పుడు భక్తికాలం సమాప్తమైపోతోంది అని ఇతర ఆత్మలకు చెబుతారు కదా! కావున మళ్ళీ మీరు ఈ హద్దులోని విషయాలరూపీ బొమ్మల ఆటలో సమయాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఇది కూడా బొమ్మల ఆట వంటిదే కదా! ఇందులో ఎటువంటి ప్రాప్తి లేదు, సమయము వ్యర్థమౌతుంది మరియు శక్తి కూడా వ్యర్ధమౌతుంది. కావున ఇప్పుడు బాబా కూడా ఈ బొమ్మల ఆటల సమయము సమాప్తమైపోతోంది అని అంటారు. ఏ విధంగా ఈ రోజుల్లో ఏదైనా క్రొత్త ఫ్యాషన్ వెలువడితే ఆ క్రొత్త ఫ్యాషన్ వెలువడ్డాక కూడా ఎవరైనా పాత ఫ్యాషన్ నే చేస్తున్నట్లయితే వారిని ఏమంటారు? కావున ఈ చిన్న చిన్న విషయాలలో సమయాన్ని పోగొట్టుకోవడం ఇది ఇంతకు ముందటి పాత ఫ్యాషన్, ఇప్పుడు అది చేయకూడదు. ఏ విధంగా ఇప్పటి సమయానుసారంగా హాండ్లింగ్ చేయండి, పాత పద్ధతులలో చేయకండి. ఫలానా వారిది పాత పద్ధతిలోని పాత హాండ్లింగ్, ఇప్పుడు వీరిది క్రొత్త హాండ్లింగ్ అని అంటారు కదా! కావున మీకు మీరు హాండ్లింగ్ ఇవ్వడం కూడా పాత పద్ధతిలో ఉండకూడదు. ఏ విధంగా ఇతరులకు పాత హాండ్లింగ్ ఇవ్వడం సరికాదనిపిస్తోందో, మరి ఇప్పటివరకు స్వయమును పాత హాండ్లింగ్ ఎందుకు నడిపిస్తారు? ఇప్పుడు పరివర్తనా దివసమును జరుపుకోండి. ప్లానింగ్ బుద్ధిగల పార్టీ వచ్చింది కదా! కావున ప్లానింగ్ పార్టీ వారు వారికి క్రొత్త ప్లానును ఇస్తున్నారు. ఏ విధంగా ఆ గవర్నమెంట్ వారు కూడా ఒక్కోసారి ఒక్కొక్క విశేష దివసమును జరుపుకుంటారో అలా మీరు ఇక్కడకు వచ్చారు కాబట్టి మీకు మీరు పాతరీతి విధానాలలో నడిచే పురుషార్థం యొక్క పరివర్తనా దివసమును జరుపుకొండే కాని హద్దులోనిది కాదు, బేహద్దుది జరపండి. మీరు యజ్ఞభూమి అయిన మధువనమునకు వచ్చారు కదా! యజ్ఞంలో అగ్ని ఉంటుంది, అగ్నిలో ఏదైనా వస్తువు పడడం ద్వారా అది చాలా త్వరగా కరిగిపోతుంది. ఎటువంటి స్వరూపమును తయారుచేయాలనుకుంటే దానిని ఆ స్వరూపంగా తయారుచేయగలుగుతారు. కావున ఇక్కడ యజ్ఞంలోకి వచ్చారు, కావున స్వయమును ఎలా తయారుచేసుకోవాలనుకుంటే అలా సహజంగా తయారుచేసుకోవచ్చు. అచ్ఛా! ఓం శాంతి.
Comments
Post a Comment