24-07-1970 అవ్యక్త మురళి

 * 24-07-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బిందురూప స్థితి సహజంగా ఎలా తయారవుతుంది?

అందరూ ఇప్పుడు ఏ స్థితిలో అయితే కూర్చున్నారో ఆ స్థితిని ఏమని అంటారు? వ్యక్తంలో అవ్యక్త స్థితి ఉందా? బాప్ దాదాతో మిలనం చేసుకునేటప్పుడు బిందు రూప స్థితిలో స్థితులు కాగలరా?(ప్రతి ఒక్కరూ తమ తమ ఆలోచనను వినిపించారు) బిందు రూప స్థితి విశేషంగా ఏ సమయంలో తయారవుతుంది? ఏకాంతంలో కూర్చున్నప్పుడా లేక నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా జరుగగలదా? అంతిమ పురుషార్థము స్మృతిదే. అందుకే స్మృతి యొక్క స్థితి మరియు అనుభవాన్ని కూడా బుద్ధిలో స్పష్టముగా అర్థం చేసుకోవాలి. బిందు రూప స్థితి అంటే ఏమిటి మరియు అవ్యక్త స్థితి ఏంటే ఏమిటి, రెండింటి అనుభవం ఏమిటి? ఎందుకంటే రెండు పేర్లు చెప్తున్నామంటే తప్పకుండా అనుభవంలో కూడా తేడా ఉంటుంది కదా! నడుస్తూ తిరుగుతూ బిందు రూప స్థితి ఈ సమయంలో తక్కువ అని కాదు, అసలు లేదు అనే చెప్పాలి. దీనిని కూడా అభ్యాసం చెయ్యాలి. మధ్య మధ్యలో ఒకటి రెండు నిమిషాలు వెచ్చించి ఈ బిందు రూప స్థితిని అభ్యాసం చెయ్యాలి. ఎప్పుడైనా అటువంటి రోజు వచ్చినప్పుడు నడుస్తున్న ట్రాఫిక్ ను కూడా ఆపివేసి మూడు నిమిషాల మౌనాన్ని పాటిస్తారు. జరుగుతున్న కార్యాలను నిలిపివేస్తారు. మీరు కూడా ఏదైనా కార్యం చేస్తున్నా లేక మాట్లాడుతున్నా, మధ్య మధ్యలో ఈ సంకల్పాల ట్రాఫికను స్టాప్ చెయ్యాలి. ఒక్క నిముషమైనా మనసులోని సంకల్పాలను, అవసరమైతే శరీరం ద్వారా జరుగుతున్న కార్యాన్ని మధ్యలో నిలిపేసి అయినా ఈ అభ్యాసాన్ని చెయ్యాలి. ఒకవేళ ఈ అభ్యాసాన్ని చెయ్యకపోతే బిందు రూపము యొక్క పవర్ ఫుల్ స్థితిని ఎలా మరియు ఎప్పుడు తీసుకురాగలరు? అందుకే ఈ అభ్యాసం చెయ్యడం అవసరము. మధ్య మధ్యలో ఈ అభ్యాసాన్ని ప్రాక్టికల్ గా చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు ఈ బిందు రూప స్థితి కష్టంగా అనిపించినా అది ఎంత సరళమైపోతుందంటే, ఇప్పుడు మెజారిటీ పిల్లలకు అవ్యక్త స్థితి సహజమైనట్లుగా అవుతుంది. మొదట్లో అభ్యాసాన్ని ప్రారంభించినప్పుడు వ్యక్తంలో అవ్యక్త స్థితితో ఉండటం కూడా కష్టంగా అనిపించేది. ఇప్పుడు అవ్యక్త స్థితిలో ఉంటూ కార్యం చెయ్యడం ఏవిధముగా సహజమవుతూ ఉందో, అలాగే ఈ బిందు రూప స్థితి కూడా సహజమైపోతుంది. ఇప్పుడు మహారథులు ఈ అభ్యాసాన్ని చెయ్యాలి. అర్థమయిందా?

ఫరిస్తా రూప స్థితి అనగా అవ్యక్త స్థితి ఎవరికైతే సదాకాలం ఉంటుందో వారు బిందు రూపంలో కూడా సహజంగా స్థితులు కాగలరు. ఒకవేళ అవ్యక్త స్థితి లేకపోతే బిందు రూపంలో స్థితులవ్వడం కూడా కష్టంగా అనిపిస్తుంది. కావున ఇప్పుడు ఈ అభ్యాసం కూడా చెయ్యండి. ప్రారంభంలో అవ్యక్త స్థితిని అనుభవం చెయ్యడానికి ఏకాంతంలో కూర్చుని ఎంతగా తమ వ్యక్తిగత పురుషార్థాన్ని చేసేవారు! అలాగే ఈ అంతిమ స్థితి యొక్క పురుషార్థం కోసం కూడా మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి చెయ్యాలి. ఇదే అంతిమ స్థితి యొక్క స్థితి. ఈ స్థితిని చేరుకోవడానికి ఒక్క విషయంపై విశేషమైన శ్రద్ధను ఇవ్వవలసి ఉంటుంది. ఈ రోజుల్లో ఆ ప్రభుత్వం ఎటువంటి స్కీమును తయారు చేస్తుంది? వారి ప్లాన్లు అన్ని విషయాలలో ఎంత వీలైతే అంత పొదుపు జరగాలి అన్న లక్ష్యమును ఉంచినప్పుడు సఫలమవుతాయి. పొదుపు కోసం కూడా యోచన చేస్తారు కదా. సమయము, డబ్బులు, శక్తి అన్నింటిలో పొదుపు జరగాలి అని భావిస్తారు. తక్కువ శక్తితో ఎక్కువ కార్యం జరగాలి. అన్ని విధాలుగా పొదుపు గురించి యోచిస్తారు. అలాగే ఇప్పుడు పాండవ ప్రభుత్వం ఎటువంటి స్కీమును తయారు చెయ్యాలి? బిందు రూపము యొక్క సంపూర్ణ సిద్ధితో నిండిన స్థితిని ప్రాప్తింపజేసుకునేందుకు పురుషార్థం చెయ్యాలి అని వినిపించాము కదా. ఇప్పుడు ఏ విధంగా అయితే నడుస్తున్నారో ఆ విధంగా చూస్తే, అందరూ చాలా బిజీగా ఉంటున్నాము, ఏకాంతానికి సమయము లభించడం లేదు, స్వ మననం కోసం కూడా తక్కువ సమయం లభిస్తుంది అని అంటారు. కానీ సమయము ఎక్కడినుండి వస్తుంది? రోజురోజుకూ సేవకూడా పెరగనుంది. అలాగే సమస్యలు కూడా పెరగనున్నాయి. సంకల్పాల వేగం కూడా రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పుడు ఒక్క క్షణములో పది ఆలోచిస్తే దానికి రెండింతలు, మూడింతల వేగం పెరుగుతుంది. ఎలా అయితే ఈ రోజుల్లో, ఒక్క రోజుకు ఎంతమంది జన్మించారు అని జన సంఖ్య గురించి లేక్కలు వ్రాస్తారు కదా, అలాగే ఇక్కడ ఈ సంకల్పాల వేగం పెరుగుతుంది. ఒక వైపు సంకల్పాలు, మరో వైపు ఈవిల్ స్పిరిట్స్ (భ్రమిస్తున్న ఆత్మలు) కూడా పెరుగుతాయి. కానీ దీని కోసం ఒక విశేషమైన అటెన్షన్ ను ఇవ్వవలసి ఉంటుంది, దీని ద్వారా అన్నిటినీ ఎదుర్కోగలరు. అది ఏమిటంటే - ఏ విషయం జరిగినా దానిని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి రెండు మాటలు గుర్తుంచుకోండి. ఒకటి - అంతరము, రెండు - మంత్రము. ఏ విషయము జరిగినా ఇది యథార్థమా లేక అయథార్థమా అని దాని తేడాను చూడండి. బాప్ దాదా సమానంగా ఉందా లేదా? తండ్రి సమానంగా ఉన్నానా లేనా? ప్రతి సమయంలోని తేడాను పోల్చుకొని చూస్తూ దానికి ఒక్క క్షణంలో నాట్ లేక డాట్ ను పెట్టండి. చెయ్యకూడదు అంటే డాట్(చుక్క) పెడ్తారు, ఒకవేళ చెయ్యాలంటే చెయ్యడం ప్రారంభిస్తారు. నాట్ మరియు డాట్ ను స్మృతిలో పెట్టుకోవాలి. అంతరము మరియు మంత్రము ఈ రెండింటినీ ప్రాక్టికల్ లో ఉంచాలి. రెండింటినీ మర్చిపోకపోతే ఎటువంటి సమస్య లేక భ్రమిస్తున్న ఆత్మలు ఎదుర్కోవు. ఒక్క క్షణంలో సమస్య భస్మమైపోతుంది. ఈవిల్ స్పిరిట్స్ మీ ముందు నిలువజాలవు. కావున ఈ పురుషార్థాన్ని చెయ్యాల్సి  ఉంటుంది. అర్థమయిందా.

(ఈవిల్ స్పిరిట్స్ రూపము ఎలా ఉంటుంది?) వాటి స్పష్టమైన రూపము - ఎవరిలోనైనా ప్రవేశించడము. కానీ ఈవిల్ స్పిరిట్స్ కు గుప్త రూపం కూడా ఉంటుంది. నడుస్తూ నడుస్తూ ఎవరిలోనైనా విశేషంగా ఏదో ఒక చెడు సంస్కారము ప్రభావశాలి రూపంలో కనిపిస్తుంది. దాని ప్రభావంతో వారి బుద్ధిలో ఇప్పుడే ఒక విషయము, ఇప్పుడే మరో విషయము ఉంటుంది. అది కూడా ఫోర్సుగా చెప్తారు. వారి స్థితి కూడా ఒక చోట స్థిరమై ఉండదు. వారు స్వయాన్ని కూడా వ్యాకులపరచుకుంటారు, ఇతరులను కూడా వ్యాకులపరుస్తారు. స్పష్ట రూపంలో ఈవిల్ స్పిరిట్ వచ్చినప్పుడు దానిని గుర్తించి దాని నుండి దూరం కావడం సహజమే.... కానీ మీ ముందుకు అది స్పష్ట రూపంలో తక్కువగా వస్తుంది, గుప్త రూపంలో చాలా వస్తాయి. దీనిని మీరు మీ సాధారణ భాషలో - ఏమయిందో తెలియదు, వారి బుద్ధి పిచ్చిగా ఉంది అని అంటారు. కానీ ఆ సమయంలో వారిలో ఈ ఈవిల్ అనగా చెడు సంస్కారాల ఫోర్సు ఎంతగా ఉంటుందంటే ఈవిల్ స్పిరిట్స్ సమానంగా ఉంటుంది. ఎలా అయితే అవి చాలా విసిగిస్తాయో అలాగే ఇవి కూడా చాలా విసిగిస్తాయి, ఇవి చాలా జరగనున్నాయి. అందుకే ఇప్పుడు సమయపు పొదుపు, సంకల్పాల పొదుపు, తమ శక్తిని పొదుపు చేసుకునే యోచన తయారు చేసుకుని మధ్య మధ్యలో ఈ బిందు రూప స్థితిని పెంచుకోండి అని వినిపించాము. ఎంతగా బిందు రూప స్థితి ఉంటుందో అంతగా ఈవిల్ స్పిరిట్ లేక ఈవిల్ సంస్కారాల ఫోర్సు మీపై దాడి చెయ్యదు. అంతేగాక మీలోని శక్తిరూపమే వారికి ముక్తిని ఇస్తుంది. ఈ సేవ కూడా చెయ్యాలి. ఈవిల్ స్పిరిట్ను కూడా ముక్తము చెయ్యాలి. ఎందుకంటే ఇది అంతిమ సమయంలో కూడా అంతిమ సమయము. కావున ఈవిల్ స్పిరిట్ లేక ఈవిల్ సంస్కారాలు కూడా అతిలోకి వెళ్ళి ఆ తర్వాత అంతమవుతాయి. చెత్త అంతా బయటకు వచ్చి భస్మమవుతుంది. కావున వాటిని ఎదుర్కోవడానికి ఒకవేళ తమ సమస్యతోటే ముక్తులుగా కాకపోతే ఈ సమస్యలను ఎలా ఎదుర్కోగలరు? అందుకే పొదుపు స్కీమును తయారు చెయ్యండి మరియు దానిని ప్రాక్టికల్ లోకి తీసుకురండి అని చెప్పాము. అప్పుడు స్వయాన్ని మరియు సర్వాత్మలను రక్షించగలరు. కేవలం భాషణ చెయ్యడము లేక అర్థం చేయించే సేవను మాత్రమే చెయ్యకండి, ఇప్పుడైతే సేవా రూపము కూడా చాలా సూక్ష్మంగా అవుతుంది. అందుకే మీ సూక్ష్మ స్వరూప స్థితిని పెంచుకోండి. ఇవన్నీ ప్రత్యక్షమై తిరిగి ప్రాయలోపమవ్వనున్నాయి. ప్రాయలోపం అయ్యే ముందు ప్రత్యక్షమై తర్వాత ప్రాయలోపమవుతాయి. సేవ ఎంత పెరుగుతుందంటే, ఒక్కొక్కరూ పదిమంది చేసే కార్యాన్ని చెయ్యవలసి వస్తుంది.

శక్తులకు ఎన్ని భుజాలను చూపిస్తారు! భుజాలు అంటే అంతగా సేవలో సహయోగిగా కావడము. ఇవి శక్తుల భుజాలు కదా అని పాండవులు అనుకుంటారు. మరి పాండవులను ఎలా చూపించారు. తెలుసా? పొడవుగా చూపించారు. ఇది కూడా పాండవులు ఎక్కువ సహయోగిగా అయినందుకు గుర్తు. పెద్ద శరీరము కాదు, పెద్ద బుద్ధి. వీరు ముందుకు పరిగెట్టించడము అంటే శక్తులు ముందు
పరిగెట్టడము. శక్తులను ముందుంచడమే వీరి పరుగుకు గుర్తు, అచ్ఛా!

Comments