* 24-06-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“ఎవర్రడీగా అయి అంతిమ సమయమును ఆహ్వానించండి"
స్వయమును బాబా సమానంగా భావిస్తున్నారా? బాబా సమానమైన స్థితికి సమీపంగా స్వయమును అనుభవం చేసుకుంటున్నారా? సమానంగా అవ్వడంలో ఇంకా ఎంత అంతరము మిగిలి ఉంది? చాలా అంతరము ఉందా లేక కొద్ది అంతరము ఉందా? బాబా సమానంగా అవ్వాలి అన్న లక్ష్యము అందరికీ ఉంది మరియు బాబాకు పిల్లలు బాబా కన్నా ఉన్నతముగా అవ్వాలి అన్న లక్ష్యము ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్ లో ఏముంది? బాబా సమానంగా ఎదుర్కొనే శక్తి ఇంకా రాలేదు. నెంబర్ వారీగా, పురుషార్థానుసారంగా ఇంకా తేడా ఉంది. ఒక్కొక్కరిలో ఆ అంతరము ఒక్కోలా ఉంది, అందరిదీ ఒకే విధంగా లేదు, 50 శాతం అంతరము ఎక్కువగా ఉంది! దీనిని ఎంత సమయంలో చెరిపేస్తారు? ఇప్పటివరకు ఇంకా బాబాకు మరియు పిల్లలకు మధ్యలో ఇంత అంతరము ఎందుకు ఉంది? స్వయమును ఎవర్రడీగా భావిస్తున్నారు కదా! ఈ ఎవర్రడీకి అర్థమేమిటి? ఎవర్రడీగా ఉన్నవారు సదా సమయమును ఆహ్వానిస్తారు. కావున ఎవరైతే ఎవర్రడీగా ఉంటారో వారు ఆహ్వానిస్తూ స్వయమును సదా సిద్ధముగా కూడా ఉంచుకుంటారు. అంతిమ సమయమును ఎదుర్కునేందుకు ఇప్పుడు సిద్ధమవ్వాలి కదా! సమయం వచ్చినప్పుడు 50 శాతం సమానత యొక్క ప్రాప్తి ఎలా ఉంటుంది? ఎవర్రడీ అనగా సదా అంతిమ సమయం కొరకు స్వయమును సర్వగుణ సంపన్నంగా తయారుచేసుకునేవారు అని అర్థం. సంపన్నంగా అయితే అవ్వాలి కదా! సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అన్న గాయనం కూడా ఉంది. కావున ఎవర్రడీ అనగా సంపన్నమైన స్థితి ఎలా ప్రాక్టికల్ గా ఉండాలంటే, కేవలం ఒక్క అడుగు వేయడమే ఆలస్యంగా ఉండాలి. ఒక్క అడుగు వేయడంలో ఎంత సమయమైతే పడుతుందో కేవలం అంతే తేడా ఉండాలి. దీనిని 1-2 శాతము అని అంటారు. 1, 2 శాతం ఎక్కడ, 50 శాతం ఎక్కడ! తేడా అయితే ఉంది కదా! ఈ విధంగా ఎవర్రడీగా లేక సర్వగుణ సంపన్నంగా, బాబా సమానంగా అయ్యేందుకు బాప్ దాదా ద్వారా ముఖ్యంగా మూడు విషయాలు ప్రతిఒక్కరికీ లభించాయి. ఈ మూడింటి ప్రాప్తి ఉన్నట్లయితే బాబా సమానంగా అవ్వడంలో ఎటువంటి ఆలస్యము ఉండదు. బాబా ఇచ్చిన ఆ మూడు వస్తువులు ఏమిటి? (శ్రీమతము, సమర్పణ మరియు సేవ). ఇవైతే నడుచుకునే లేక చేసే విషయాలను గూర్చి చెప్పారు. కాని ఇచ్చేది ఏమిటి? సేవ కూడా చేయగలరు, సమర్పణ కూడా అవ్వగలరు, కాని దేని ఆధారంపై అలా అవ్వగలరు? జన్మనైతే తీసుకున్నారు, కాని ఇచ్చింది ఏమిటి? వారసత్వంలో కూడా ముఖ్యంగా ఏ విషయాలను ఇస్తారు? (ప్రతి ఒక్కరూ వినిపించారు). రహస్యమైతే వచ్చేస్తుంది కాని, స్పష్టం చేసేందుకు భిన్న రూపంలో వినిపించడం జరుగుతుంది. మొట్టమొదట ప్రకాశమును ఇస్తారు, రెండవది- శక్తిని ఇస్తారు, మూడవది- దివ్యమైన బుద్ధిని అనగా మూడవ నేత్రాన్ని ఇస్తారు. ఈ మూడూ లేనట్లయితే తీవ్ర పురుషార్థులుగా అయి బాబా సమానంగా అవ్వలేరు. మొదట ఏ ఆత్మలైతే పూర్తిగా అజ్ఞానాంధకారంలోకి వచ్చి చేరుకున్నాయో వారికి ప్రకాశము అనగా లైట్ కావాలి మరియు ఆ ప్రకాశంతోపాటు శక్తి లేకపోతే ఆ లైట్ యొక్క సహాయమును కూడా ఏదైతే తీసుకోవాలో దానిని తీసుకోలేరు. ఈ ప్రకాశము మరియు శక్తితో పాటు అనగా లైట్ మరియు మైట్ తో పాటు మూడవ నేత్రము అనగా డివైన్ ఇన్ సైట్ (దివ్యబుద్ధి) నేదైతే ఇస్తారో దానిద్వారా తమ భూత, భవిష్యత్, వర్తమానాలను, మూడు కాలాలను లేక ఈ మూడు జీవితాలను తెలుసుకోగలరు. ఎప్పుడైతే ఈ మూడూ ప్రాప్తిస్తాయో, అప్పుడే తమ జన్మసిద్ధ అధికారమును పొందగలరు అనగా వారసత్వాన్ని ప్రాప్తించుకోగలరు. కావున మొదట ప్రకాశమును, శక్తిని మరియు దివ్యబుద్ధిని ఇస్తారు. దీనిద్వారానే తమ జన్మసిద్ధ అధికారమును పొందగలుగుతారు మరియు తమ అధికారమును తెలుసుకోగలుగుతారు. రైట్ అనగా అధికారమునకు కూడా రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి - జన్మసిద్ధ అధికారము అనగా వారసత్వము, ఇంకొకటి - రైట్ మరియు రాంగ్ లను గుర్తించే జ్ఞానము లభించింది. కావుననే తండ్రిని ట్రూత్ అనగా సత్యము అని అంటారు. ఎప్పుడైతే ఈ మూడింటినీ ప్రాప్తించుకుంటారో అప్పుడే సత్యమును గుర్తించగలరు. ఒక్కదానిలోనైనా లోపము ఉన్నట్లయితే తప్పు నుండి ఒప్పువైపుకు వెళ్ళలేరు. ఎప్పుడైతే ప్రకాశము ఉంటుందో అప్పుడే మార్గమును దాటగలరు లేకపోతే అంధకారంలో మార్గమును ఎలా దాటగలరు లేక తమ పురుషార్థపు వేగమును ఎలా నిర్ణయించుకోగలరు? ఈ పాత ప్రపంచంలో కూడా ఎప్పుడైతే బ్లాక్ అవుట్ (అంధకారము) గా చేసేస్తారో అప్పుడు వేగమును తగ్గించేస్తారు, అప్పుడు వేగముగా వెళ్ళనివ్వరు. ఎందుకంటే ఆక్సిడెంట్ లవుతాయేమోనన్న భయం ఉంటుంది, కావున అలాగే పూర్తి లైట్లు లేకపోతే వేగమును తీవ్రతరం చేయలేరు, స్పీడు తగ్గిపోతూ ఉంటుంది. అలాగే శక్తి లేకపోతే లైటు ఆధారంపై నడవడం మొదలుపెడతారు కాని, శక్తి లేని కారణంగా ఏ విఘ్నాలైతే ముందుకు వస్తాయో వాటిని ఎదుర్కోలేకపోతారు. కావున స్పీడు తగ్గిపోయిన కారణంగా ఎదుర్కోలేకపోతే ఆగిపోతారు. పదే పదే ఆగిపోయిన కారణంగా కూడా తీవ్రమైన వేగంతో తీవ్ర పురుషార్థమును చేయలేకపోతారు మరియు దివ్యనేత్రము, మూడవ నేత్రము తెరిచి ఉండదు. నడుస్తూ, నడుస్తూ మాయ దానిని మూసివేస్తుంది. ఈ రోజుల్లో గవర్నమెంటు కూడా ఎవరినైనా పట్టుకునేందుకు లేక ఏ గొడవనైనా ఆపేందుకు గ్యాసులు వదులుతారు. దానితో కళ్ళు మూసుకుపోతాయి, కళ్ళల్లోంచి నీరు వస్తున్న కారణంగా చూడలేకపోతారు. ఏదైతే చేయాలనుకుంటారో అది చేయలేకపోతారు. అదేవిధంగా మూడవ నేత్రమేదైతే లభించిందో దానిలో మాయ యొక్క గ్యాసు లేక ధూళి పడినట్లయితే మూడవ నేత్రము ఉంటూ కూడా దేనినైతే చూడాలో దానిని చూడలేకపోతారు. కావున మూడూ అవసరమే. మూడూ సరిగ్గి ఉన్నట్లయితే యథార్థరీతిగా ప్రాప్తించినట్లయితే బాబా ఏదైతే ఇచ్చారో దానిని అదేవిధముగా ధారణ చేస్తూ ఉంటారు. అదే ఆధారంపై నడుస్తూ ఉన్నట్లయితే, ఎప్పుడూ తప్పుడు పనిని లేక అసత్యమైన పనిని చేయలేరు. సదా సరైన మార్గంవైపుకే వెళతారు, తప్పు జరుగజాలదు. ఎందుకంటే మూడవ నేత్రం ద్వారా తప్పొప్పులను తెలిసేసుకుంటారు. ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు తప్పులు చేయరు, కాని మాయ ధూళి పడడంతో దానిని గుర్తించలేరు. కావున సరైనదానిని వదిలి తప్పువైపుకు వెళ్ళిపోతారు. కావున ఎప్పుడైనా ఏదైనా తప్పు పని లేక అసత్య కర్మ జరిగితే లేక సంకల్పమైనా ఉత్పన్నమైతే లేక అసత్యమైన మాటలు వెలువడినట్లయితే అప్పుడు ఈ మూడు విషయాలలోను ఏదో ఒక దానిలో లోటు ఏర్పడిందని అర్థం చేసుకోవాలి. కావుననే జడ్జిమెంట్ ఇవ్వలేరు. ఎప్పటివరకైతే తప్పొప్పులను తెలుసుకోరో అప్పటివరకు సంపూర్ణ జన్మసిద్ధ అధికారమును కూడా తీసుకోలేరు. సరైన కర్మల ద్వారా యథార్థ జన్మసిద్ధ అధికారము లభిస్తుంది. కర్మలు సరిగ్గా లేకపోతే కాసేపు యథార్థముగా, కాసేపు తప్పుగా ఉన్నట్లయితే సంపూర్ణ జన్మసిద్ధ అధికారము కూడా లభించజాలదు. ఎంతగా సత్యమైన సంకల్పాలు మరియు కర్మలను చేయడంలో లోటు ఉంటుందో అంతగానే జన్మసిద్ధ అధికారమును తీసుకోవడంలో కూడా లోటు ఉంటుంది. కావున ఈ మూడు ప్రాప్తులు సదా నిలిచి ఉండాలి. అందుకొరకు ముఖ్యంగా ఏ విషయం అటెన్షన్ ఉంచినట్లయితే చాలా సహజంగా మరియు అందరూ చేయగలుగుతారు? రివైజ్ కోర్సులో కూడా అదే సహజమైన యుక్తి పదే పదే రివైజ్ అవుతోంది. రివైజ్ కోర్సును అటెన్షన్ తో చేస్తున్నారా లేక చదువుతున్నారా? మాకన్నీ తెలుసు అనైతే భావించడం లేదు కదా! మాకు అనీ తెలుసు అని భావిస్తూ రివైజ్ కోర్సును తేలికగా అయితే తీసుకోవడం లేదు కదా! ఈ రోజు పరీక్ష తీసుకుందాము - ఒక్క రోజు కూడా రివైజ్ కోర్సు మురళీని మిస్ చేయనివారు లేక ధారణలలో అటెన్షన్ ను ఇవ్వడం మాననివారు చేతులెత్తండి, రావడము, పోవడంలో ఏ మురళీలైతే మిస్ అవుతాయో వాటిని మళ్ళీ చదువుతారా లేక అవి అలాగే మిస్ అయిపోతున్నాయా? ఇప్పుడైతే జ్ఞానమును తెలిసేసుకున్నాము అనైతే భావించడం లేదు కదా! మీరు తెలుసుకున్నారు, కానీ ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉంది. ఎవరైతే రివైజ్ కోర్సును మంచిగా రివైజ్ చేస్తారో వారు స్వయము ఇలా అనుభవం చేసుకుంటారు. ఆ రివైజ్ కోర్సును చేస్తూ కూడా అది పాతగా అనిపిస్తుందా లేక క్రొత్తగా అనిపిస్తుందా? క్రొత్తవారికైతే ఎన్నో విషయాలు ఉంటాయి, కానీ, ఎవరైతే పాతవారిగా అయిపోయారో వారు మళ్ళీ రివైజ్ కోర్సు నుండి ఏమనుభవం చేసుకుంటారు? క్రొత్తగా అనిపిస్తుందా? ఎందుకంటే డ్రామానుసారంగా రివైజ్ ఎందుకు జరుగుతుంది? ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎందుకు రివైజ్ చేయిస్తారు? అటెన్షన్ తగ్గిపోతుంది, స్మృతి తగ్గిపోతుంది, కావుననే పదే పదే రివైజ్ చేయించడం జరుగుతుంది. అలాగే ఇది కూడా ఎందుకు రివైజ్ చేయించబడుతుందంటే, ఇప్పుడింకా ప్రాక్టికల్ లోకి రాలేదు. ఎంతగా అయితే విన్నారో, ఎంతగా అయితే వినిపిస్తూ ఉంటారో అంతగా ప్రాక్టీకల్ లో శక్తి నిండలేదు. కావుననే పవర్ ఫూల్ గా చేసేందుకు మళ్ళీ ఈ కోర్సు చేయించడం జరుగుతోంది. పాతవారిని శక్తిశాలిగా చేసేందుకు మరియు క్రొత్త వారిని శక్తిశాలిగా చేయడంతో పాటు వారికి హక్కు పూర్తిగా లభించేందుకు కూడా ఈ రివైజ్ కోర్సు కొనసాగుతోంది. కావున ఇప్పుడు ఈ లోటును కూడా నింపేందుకు అటెన్షన్ పదే పదే రివైజ్ చేయాలి. కావున రివైజ్ కోర్సు ద్వారా ఏ సంస్కార స్వభావాలనైతే పరివర్తనలోకి తీసుకురావాలనుకుంటారో అవి పరివర్తన అయిపోతాయి. అచ్ఛా, ఇవైతే మధ్యలో పరీక్షలుగా ఉన్నాయి. ఏ సహజ యుక్తి అయితే రివైజ్ కోర్సులో కూడా అనేకసార్లు రివైజ్ అవుతోందో ఆ సహజ యుక్తి ఏమిటి అని ఇంతకు ముందు కూడా అడిగారు కదా! అదే అమృత వేళ. స్వయముతో మరియు బాబాతో ఆత్మిక సంభాషణ చేయడం లేక అమృత వేళకు మహత్వమును ఇవ్వడము. ఏ విధమైన పేరు ఉందో అదేవిధంగా ఆ వేళకు అటువంంటి వరదానము కూడా లభించింది కదా! ఏ శ్రేష్ఠ కర్మనైనా చేసేటప్పుడు ఈ రోజుల్లోని స్మృతి చిహ్నాలలో కూడా సమయాన్ని చూస్తారు కదా! అలాగే ఇక్కడ కూడా పురుషార్థం కోసం మరియు సహజప్రాప్తి కోసం అన్నింటికన్నా మంచి వేళ ఏమిటి? అమృతవేళ. అమృతవేళ సమయంలో మీ ఆత్మను అమృతంతో నింపేయడం ద్వారా రోజంతా కర్మలు కూడా అదేవిధంగా జరుగుతాయి. ఏవిధంగా ఈవేళ శ్రేష్ఠమైనదో, అమృతము శ్రేష్ఠమైనదో అదేవిధంగా ప్రతి కర్మ మరియు సంకల్పం కూడా రోజంతా శ్రేష్ఠంగా ఉంటుంది. ఈ శ్రేష్ఠమైన వేళను సాధారణ రీతిగా నడిపించేసినట్లయితే రోజంతా సంకల్పాలు మరియు కర్మలు కూడా సాధారణంగానే నడుస్తాయి. కావున ఈ అమృతవేళ రోజంతటి సమయానికి పునాది వేళ లాంటిది అని భావించాలి. పునాదిని బలహీనంగా లేక సాధారణంగా వేసినట్లయితే ఆ పైనున్న నిర్మాణం కూడా దానంతట అదే అదేవిధంగా ఉంటుంది. ఈ కారణంగా ఏ విధంగా పునాది వైపు సదా ధ్యానము ఉంటుందో అలాగే, రోజంతాటి పునాది సమయం అమృతవేళ. దాని మహత్వమును అర్థం చేసుకొని నడుచుకున్నట్లయితే కర్మలు కూడా మహత్వపూర్ణముగా ఉంటాయి. దీనిని బ్రహ్మముహూర్తము అని కూడా ఎందుకు అంటారు? ఇది బ్రహ్మ ముహూర్తమా లేక బ్రహ్మముహూర్తమా? బ్రహ్మా ముహూర్తము అన్నది కూడా సరైనదే ఎందుకంటే అందరూ బ్రహ్మాసమానంగా క్రొత్త రోజును ప్రారంభిస్తారు లేక స్థాపన చేస్తారు, అది కూడా సరైనదే. కాని బ్రహ్మముహూర్తము అర్థము ఏమిటి? ఆ సమయంలోని వాయుమండలము ఎలా ఉంటుందంటే ఆత్మ సహజంగానే బ్రహ్మతత్వనివాసిగా అయ్యే అనుభవమును చేసుకోగలుగుతుంది. వేరే సమయాలలో పురుషార్థము చేసి శబ్దము నుండి, వాయుమండలం నుండి స్వయమును డిటాచ్ చేసుకుంటారు లేక కష్టపడతారు. కాని, ఈ సమయంలో ఈ శ్రమ యొక్క అవసరం ఉండదు. ఏ విధంగా ఇల్లయిన బ్రహ్మము శాంతిధామమో అలాగే అమృతవేళ సమయంలో కూడా సైలెన్స్ దానంతట అదే ఉంటుంది. సైలెన్స్ కారణంగా శాంతస్వరూప స్థితి లేక శాంతిధామ నివాసిగా అయ్యే స్థితిని సహజంగానే ధారణ చేయగలుగుతారు. కావున ఏ శ్రీమతమైతే లభించిందో దానిని బ్రహ్మముహూర్త సమయంలో స్మృతిలోకి తెచ్చినట్లయితే బ్రహ్మా ముహూర్తము లేక అమృతవేళ సమయంలో సృతి కూడా సహజంగానే వచ్చేస్తుంది. చూడండి, చదువు చదువుకునేవారు కూడా చదువును స్మృతిలో ఉంచుకునేందుకు ఈ సమయంలో చదువుకునేందుకు ప్రయత్నిస్తారు, ఎందుకంటే ఈ సమయంలో స్మృతి చాలా సహజంగా ఉంటుంది. కావున తమ స్మృతిని కూడా సమర్థవంతంగా చేసేందుకు లేక స్వతహాగానే స్మృతి స్వరూపులుగా అవ్వాలనుకుంటే అమృతవేళ సహాయం ద్వారా లేక శ్రీమతమును పాలన చేయడం ద్వారా సహజంగానే స్మృతిని సమర్థవంతంగా చేయగలుగుతారు. ఎంతటి విలువైతే ఈ సమయానికి ఉందో అంతటి విలువను ఈ సమయానికి మీరు ఇస్తున్నారా లేక కాసేపు ఇస్తూ కాసేపు ఇవ్వడంలేదా? ఈ విలువరూపీ తరాజు కాసేపు పైకి, కాసేపు క్రిందికి అవుతోందా, ఏమవుతోంది? ఇది చాలా సహజమైన యుక్తి, కేవలం ఈ యుక్తికి అంతటి విలువను ఇవ్వాలి. శ్రీమతము ఏ విధంగా ఉందో అదే అనుసారంగా సమయాన్ని గుర్తించి సమయానుసారంగా కర్తవ్యము చేసినట్లయితే చాలా సహజముగా సర్వప్రాప్తులను పొందగలుగుతారు, ఆపై శ్రమ నుండి విముక్తులైపోతారు. విముక్తులవ్వాలనుకుంటే దానికొరకు ఏ సాధనమైతే కావాలో దానిని ధారణ చేస్తూ ముందుకు వెళ్ళండి. అచ్ఛా!
సదా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ గా అయి నడుచుకునే సర్వ ఆత్మలకు డివైన్ ఇన్ సైట్ (దివ్యదృష్టిని) ఇచ్చే పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment