* 24-05-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“పొజిషన్లో ఉండటం ద్వారా అపోజిషన్ సమాప్తి."
సర్వ ఆత్మల సుఖ-శాంతి కర్తలుగా అయ్యారా? ఎందుకంటే మీరు దుఃఖహర్త-సుఖకర్తకు అల్లారుముద్దు బిడ్డలు, కావున తండ్రి కర్తవ్యము ఏదైతే ఉందో అదే పిల్లల కర్తవ్యము. ఎవరైతే విశ్వకల్యాణ కర్తలో మరియు సుఖకర్తలో వారి వద్దకు ఎప్పుడూ దు:ఖపు అల స్వప్నములో కూడా మరియు సంకల్పములో కూడా రాజాలదు. మరి అటువంటి స్థితిని తయారుచేస్తున్నారా లేక ఈ స్థితిలోనే స్థితులై ఉంటారా? ఎప్పటి నుండైతే నూతన జన్మను తీసుకొన్నారో, బాప్ దాదాకు ప్రియమైన పిల్లలుగా అయ్యారో, అటువంటి సర్వశక్తివంతుని సంతానము వద్దకు ఏవిధమైన సంతాపము రాజాలదు. ఎప్పటివరకైతే సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ఉండదో మరియు వారి సంతానముగా ప్రాక్టికల్ లో తయారవ్వరో అంతవరకు ఈ సంతాపము అనగా దుఃఖపు అల ఉంటుంది. మీరు సుఖసాగరుడైన తండ్రి సంతానము, కావున దుఃఖపు అల అంటే ఏమిటో కూడా తెలియనంతటి అపరిచితులుగా ఉంటారు, సుఖపు అలలలో తేలియాడుతూ ఉంటారు. మాయ అపోజిషన్ ఎందుకు ఉంటుంది? అపోజిషన్‌కు నివారణ చాలా సహజము. అపోజిషన్ అన్న పదము నుండి కేవలము 'అ' అన్న అక్షరమును తొలగించండి, అప్పుడది ఏమైపోతుంది? పొజిషన్లో ఉండటం ద్వారా అపోజిషన్ ఉంటుందా? ఒకవేళ తమ పొజిషన్లో స్థితులై ఉన్నట్లయితే మాయ అపోజిషన్ ఉండదు. కేవలము ఒక్క అక్షరాన్ని కట్ చేసెయ్యాలి. మీ పొజిషన్లో ఉండటము - ఇదే స్మృతియాత్ర. ఎవరిని, ఎవరికి చెందినవాడిని, ఇందులో స్థితులై ఉండటము - ఇదే సృతియాత్ర. ఇదేమన్నా కష్టమా? ఎవరు ఎలాంటివారో అలా స్వయాన్ని భావించుకోవటంలో కష్టమేమన్నా ఉంటుందా? మీరు అసలైనదానిని మర్చిపోయారు, అందులో స్థితులై ఉండేందుకే శిక్షణ లభించింది. మరి అసలైన రూపములో ఉండటము కష్టమనిపిస్తుందా లేక నకిలీ రూపములో ఉండటము కష్టమనిపిస్తుందా? హోలీ లేక దసరా రోజులలో చిన్న పిల్లలు ఆర్టిఫిషియల్ ముసుగులను ధరిస్తారు, ఈ నకిలీ ముసుగులను తొలగించి అసలైన రూపములో ఉండండి అని వారికి చెప్పినట్లయితే అదేమన్నా కష్టమనిపిస్తుందా? ఎంత సమయము పడుతుంది? మీరు కూడా ఈ ఆటను ఆడారు కదా! ఏయే ముసుగులను ధరించారు? ఒక్కోసారి కోతిది, ఒక్కోసారి అసురులది, ఒక్కోసారి రావణుడిది. ఎన్ని నకిలీ ముసుగులను ధరించారు! ఇప్పుడు బాబా ఏం చెబుతున్నారు? ఆ నకిలీ ముసుగులను తొలగించండి. ఇందులో ఏం కష్టముంది? కావున ఎల్లప్పుడూ మా అసలైన స్వరూపము, అసలైన ధర్మము, అసలైన కర్మ ఏవి? అన్న ఈ నషాలో ఉండండి. అసలైన జ్ఞానానికి మేము మాస్టర్ జ్ఞానసంపన్నులము, ఈ నషా తక్కువగా ఉందా? ఈ నషా ఎల్లప్పుడూ ఉన్నట్లయితే ఎలా తయారౌతారు? ఎవరైతే తయారౌతారో వారి స్మృతిచిహ్నము ఏది? అచల్ ఘర్. ఎల్లప్పుడూ ఆ నషాలో ఉండటం ద్వారా స్థిరంగా, దృఢంగా తయారౌతారు. అప్పుడిక మాయ సంకల్పరూపములో కూడా కదిలించజాలదు. అలా అచలంగా తయారవుతారు. రావణ సంప్రదాయము కాలు కదిలించేందుకు ప్రయత్నించింది కానీ కాస్త కూడా కదిలించలేకపోయింది అని స్మృతి చిహ్నము ఉంది కదా! ఇది మా సృతి చిహ్నము అన్న నషా ఉంటుందా లేక ఇది పెద్దపెద్ద మహారధుల స్మృతిచిహ్నమని భావిస్తారా? ఇది మా స్మృతి చిహ్నము, ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వటం ద్వారా విజయము తప్పక ప్రాప్తిస్తుంది. ఇది ఎవరో వేరే మహారథిది, మేమైతే కేవలం పురుషార్థులము అని ఇలా ఎప్పుడూ ఆలోచించవద్దు. ఒకవేళ నిశ్చయములోనే, స్వరూపపు స్మృతిలోనే బలహీనత ఉన్నట్లయితే కర్మలో కూడా ఆ బలహీనత తప్పక వస్తుంది. కావున ఎల్లప్పుడూ ప్రతి సంకల్పము నిశ్చయబుద్ధి కలదిగా ఉండాలి. కర్మ చెయ్యటానికి ముందు ఇటువంటి నిశ్చయాన్ని చెయ్యండి - మా విజయమైతే తప్పక ఉండనే ఉంది, అనేక కల్పములు విజయులుగా అయ్యారు. ఎప్పుడైతే అనేక కల్పాలు, అనేకసార్లు విజయులుగా అయ్యి విజయమాలలో తిరిగేవారిగా, పూజనయోగ్యులుగా అయినప్పుడు ఇప్పుడు దానిని రిపీట్ చెయ్యలేరా? తయారైయున్న ఆ కర్మనే మళ్ళీ రిపీట్ చెయ్యాలి. తయారైయున్న........ అని అందుకే అంటారు. తయారై ఉంది, కానీ ఇప్పుడు మరల దానిని రిపీట్ చేసి 'తయారైయున్న' అన్న నానుడిని పూర్తి చెయ్యాలి. నేను ఇదే, లేక నేను చెయ్యాల్సిందే, నేను చెయ్యగలను అన్న నిశ్చయము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ నషా ఎక్కుతుంది. నిశ్చయము లేనట్లయితే నషా కూడా ఎక్కదు మరియు నిశ్చయము ఉన్నట్లయితే నషా స్థితి అనే సాగరములో తేలియాడుతూ ఉంటారు. ఇటువంటి స్థితి యొక్క అనుభవీ మూర్తులుగా ఎప్పుడైతే అవుతారో అప్పుడు మీ మూర్తి నుండి నేర్పించేవారి ముఖము కనిపిస్తుంది. కావున తండ్రి మరియు శిక్షకుని ముఖమును మీ మూర్తి ద్వారా ప్రత్యక్షము చేయించే అనుభవీ మూర్తులు మీరు. అలా తయారయ్యారా లేక తయారవుతూ ఉన్నారా? సఫలతా సితారలా లేక ఆశా సితారలా? సఫలత అయితే జన్మసిద్ధ అధికారము, ఎందుకంటే సర్వ శక్తివంతులు అని అంటారు కదా! మరి అసఫలతకు కారణము శక్తిహీనత, శక్తి తక్కువ ఉన్న కారణంగా మాయతోటి ఓడిపోతారు. సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే సర్వశక్తివంతుని పిల్లలైన కారణంగా సఫలత జన్మసిద్ధ అధికారమై పోతుంది. కావున ప్రతి క్షణములో సఫలత నిండి ఉండాలి. అసఫలతా రోజులు సమాప్తమైపోయాయి, ఇప్పుడు సఫలత మా నినాదాము - దీనిని స్మృతిలో పెట్టుకోండి.
ఇది చాలా సహజమైన, సరళమైన మార్గము. క్షణములో స్వయమును నకిలీ నుండి అసలైనవారిగా తయారుచేసుకోగలరా? ఇంతటి సరళమైన మార్గము ఎప్పుడైనా లభించగలదా? ఎప్పుడూ లభించదా? ఎందుకు మాయకు అధీనులుగా అవుతారు? ఎందుకంటే ఆల్ మైటీ అథారిటీ పిల్లలము అన్నదానిని మర్చిపోతారు. ఈ రోజుల్లో చిన్నపెద్ద అథారిటీలలో ఉండేవారు ఎంతటి నషాలో ఉంటారు! మరి ఆల్ మైటీ అథారిటీ కలిగిన మీరు ఎంతటి నషాలో ఉండాలి? ఎవరైతే స్వయమును శాస్త్రాలకు అథారిటీగా భావించే శాస్త్రవాదులుగా ఉంటారో వారు కూడా ఎంత నషాలో, ఎంతగా తప్పుడు జ్ఞానపు నిశ్చయములో ఉంటారు! ఎవరు వినిపించారు, ఎవరు చూసారు, అన్నదేమీ తెలియదు, అయినప్పటికీ శాస్త్రాల అథారిటీగా భావించుకున్న కారణంగా తమ ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోరు. మరి మీది అందరికంటే శ్రేష్ఠమైన అథారిటీ. ఇటువంటి అథారిటీతో ఎవరి ఎదురుగా వెళ్ళినా గానీ అందరూ తలలు వంచుతారు. మీరు తల వంచజాలరు. కావున మీ అథారిటీని స్థిరంగా ఉంచుకోండి. మీరు విశ్వాన్ని వంచేవారు. ఎవరైతే విశ్వాన్ని వంచేవారుగా ఉంటారో వారు ఎవ్వరి ముందూ తల వంచజాలరు. ఆ అథారిటీ యొక్క నషాతో ఏ ఆత్మకైనా కల్యాణము చెయ్యగలరు. అటువంటి నషాను ఎప్పుడూ మరువకూడదు. చాలాకాలము నుండి నిర్దోషులుగా అవ్వటం ద్వారా భవిష్యత్తులో చాలా సమయము రాజ్యభాగ్యమును ప్రాప్తి చేసుకొంటారు. ఒకవేళ అల్పకాలము ఈ నషాలో ఉన్నట్లయితే రాజ్యభాగ్యము కూడా అల్పకాలము కొరకే ప్రాప్తిస్తుంది. సదాకాలమునకు వారసులుగా అయ్యేందుకే ఇక్కడకు వచ్చారు. కానీ అల్పకాలమునకు కాదు. కేవలము రెండు విషయాలను తోడుతోడుగా గుర్తు ఉంచుకోండి. విషయము ఒక్కటే, మాటలు భిన్న భిన్నమైనవి. పూర్తి సహజాతిసహజంగా రెండు విషయాలను సరళమైన మాటలలో ఏమని నేర్పిస్తారు? ఇలా రెండు రెండు మాటలు తోడుగా గుర్తు ఉన్నట్లయితే స్థితి ఎప్పుడూ క్రిందకు పైకి కాజాలదు. శివబాబా మరియు రాజ్యభాగ్యము గుర్తు ఉన్నట్లయితే స్థితి ఎప్పుడూ క్రిందకు పైకి అవ్వదు. విషయము రెండు మాటలదే. అజ్ఞానీ పిల్లలెవరికైనా కూడా బాబా మరియు రాజ్యమును గుర్తు పెట్టుకోండి అని చెప్పినట్లయితే మర్చిపోతారా? మాస్టర్ సర్వశక్తివంతులైన మీరు మర్చిపోగలరా? ఏ సమయంలో అయితే విస్మృతి స్థితి ఉంటుందో ఆ సమయంలో మాస్టర్ సర్వశక్తివంతుడనైన నేను - బాబాను మరియు రాజ్యమును మర్చిపోయానా! అని మీతో మీరు మాట్లాడుకోండి. ఇటువంటి మాటలు మాట్లాడుకోవటం ద్వారా శక్తినేదైతే పోగొట్టుకోన్నారో మళ్ళీ దాని స్మృతి వచ్చేస్తుంది. కేవలము మననము మరియు వర్ణనములోనే ఉందంతా. మొదట మననము చెయ్యండి తరువాత వర్ణన చెయ్యండి. మననము చేసుకున్న విషయాలను వర్ణన చెయ్యటము సహజమౌతుంది. కావున మననము చేస్తూ మరియు వర్ణన చేస్తూ ముందుకు నడవండి. ఇవి కూడా రెండు విషయాలు అయ్యాయి. మననము చేస్తూ-చేస్తూ ఉంటే మగ్న అవస్థ ఆటోమేటిక్ గానే తయారైపోతుంది. ఎవరికైతే మననము చెయ్యటము తెలియదో వారు మగ్న అవస్థ యొక్క అనుభూతిని కూడా చెయ్యలేరు. కిరీటము మరియు సింహాసనాధికారులుగా ఇప్పుడు తయారయ్యారా లేక భవిష్యత్తులో తయారవుతారా? ఇప్పుడైతే కిరీటము మరియు సింహాసనము లేవు కదా! బికారులా? సంగమయుగపు సింహాసనము గురించి తెలియదా? మొత్తము కల్పములో అన్నింటికంటే శ్రేష్ఠమైన సింహాసనమును గురించి తెలియదా? బాప్ దాదా హృదయరూపీ సింహాసనాధికారులుగా అవ్వలేదా? గుర్తు ఉన్నప్పుడే కూర్చుంటారు. సింహాసనము ఉన్నట్లయితే కిరీటము కూడా ఉంటుంది. కిరీటము లేకుండా సింహాసనమైతే ఉండనే ఉండదు. ఏ కిరీటమును ధరించటం ద్వారా సింహాసనాధికారులుగా అవుతారు? బాప్ దాదా సంగమయుగములోనే కిరీటము మరియు సింహాసనాధికారులుగా తయారుచేస్తారు. ఈ కిరీటము మరియు సింహాసనపు ఆధారముతోనే భవిష్య కిరీటము, సింహాసనము లభిస్తాయి. ఇప్పుడు ధరించనట్లయితే భవిష్యత్తులో ఎలా ధరిస్తారు! ఆధారమైతే సంగమయుగమే కదా! కిరీటమును కూడా ధరించవలసి ఉంటుంది, తిలకాన్ని కూడా దిద్దుకోవలసి ఉంటుంది మరియు సింహాసనాధికారులుగా కూడా అవ్వవలసి ఉంటుంది. తిలకము ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందా లేక అప్పుడప్పుడూ చెదిరిపోతుందా? కిరీటము, తిలకము, మరియు సింహాసనము - ఈ మూడూ సంగమయుగపు అతి పెద్ద ప్రాప్తులు. ఈ ప్రాప్తి ముందు భవిష్యరాజ్యము అసలేమీ లెక్కలేనిది. ఎవరైతే సంగమయుగపు కిరీటము, సింహాసనమును తీసుకోలేదో వారు ఏమీ తీసుకోలేనట్లు. విశ్వకల్యాణపు బాధ్యత అనే కిరీటము. ఎప్పటివరకైతే ఈ కిరీటము ధరించరో అప్పటివరకు తండ్రి హృదయరూపీ సింహాసనము పైన విరాజమానమవ్వలేరు. మీ హక్కును తీసుకొని వెళ్ళాలి, లేకపోతే చాలా కష్టమౌతుంది. మధువనములో కిరీటము మరియు సింహాసనమునకు అధికారులుగా అయ్యి వెళ్ళాలి. ధైర్యవంతులుగా, నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యారు, కనుకనే మీ పట్టాభిషేకమును చేసుకొనేందుకు మధువనములోకి వచ్చారు. కిరీటము లేకుండా వెళ్ళవద్దు. బాప్ దాదా సింహాసనము ఎంత పెద్దదంటే, ఎంతమంది కావాలంటే అంతమంది అందులో విరాజమానమవ్వవచ్చు. స్థూలమైన ఆ సింహాసనముపైనైతే అందరూ కూర్చోలేరు, కానీ ఈ సింహాసనము ఇంత పెద్దది! అతి పెద్ద తండ్రి పిల్లలు, అతి పెద్ద సింహాసనాధికారులుగా అవుతారు. అచ్ఛా!
Comments
Post a Comment