22-01-1971 అవ్యక్త మురళి

* 22-01-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“హృదయసింహాసనాధికారి ఆత్మ గుర్తు."

           ఈ రోజు ఈ సంగఠనను ఏ సంగఠన అని అంటారు? ఈ సంగఠనకు ఏ పేరును పెడదాము? ఈ సంగఠన బ్రాహ్మాబాబా భుజాలు, కావున ఈ సంగఠనను బాప్ దాదాకు సహాయకులు, నమ్మకస్థులు, బాప్ దాదాల హృదయ సింహాసనాధికారులు, మాస్టర్ సర్వ శక్తివంతులు అని అంటాము. ఇప్పుడు అర్థమైందా, ఇన్ని టైటిల్స్ నెంబర్ వారీగా, పురుషార్థము అనుసారంగా ఈ గ్రూపుకు అనేకంగా లభించాయి. ఎవరైతే హృదయసింహాసనాధికారులుగా ఉంటారో వారి గుర్తులు ఏమిటి? టీచర్లు కాబట్టి ప్రశ్నోత్తరాలు చేస్తున్నాము. సింహాసనాధికారుల గుర్తులు ఏమిటి? ఎవరైతే సింహాసనాధికారులగా ఉంటారో వారి గుర్తు - ఒకటి, ఎప్పుడైనా ఎవరైనా సింహాసనంపై కూర్చున్నప్పుడు తిలకము మరియు కిరీటము, ఈ రెండూ సింహాసనమునకు గుర్తుగా ఉంటాయి. ఇదేవిధంగా హృదయసింహాసనముపై విరాజమానమైన ఆత్మల గుర్తు ఇదే. వారి మస్తకముపై ఎల్లప్పుడూ అవినాశీ ఆత్మ స్థితి తిలకము దూరము నుండే ప్రకాశిస్తూ కనిపిస్తుంది. రెండవ విషయము, ఇతర ఆత్మలందరి కల్యాణపు శుభ భావన వారి నయనాలలో మరియు ముఖము నుండి కనిపిస్తుంది. ముఖము నుండి ఇవన్నీ స్పష్టంగా కనిపించాలి, ఇదే గుర్తు. మూడవ విషయము - వారి సంకల్పము, వచనము మరియు కర్మ తండ్రి సమానంగా ఉండాలి. నాలుగవ విషయము - ఏ ఆత్మల సేవనైతే చేస్తారో ఆ ఆత్మలలో స్నేహము, సహయోగము మరియు శక్తి ఈ మూడు గుణాలను ధారణ చేయించే శక్తి వారిలో ఉండాలి. ఈ నాలుగు విషయాలు వారి గుర్తులు. ఈ నాలుగు గుర్తులు ఎంతవరకు కనిపిస్తున్నాయి అని మీ రిజల్టులో ఇప్పుడు పరిశీలించుకోండి. స్వయం ఎలా ఉంటారో అలాగే తమ సమానంగా తయారుచేస్తారు. ఈ రోజు టీచర్సు సంగఠనలో ఉన్నాము కావున దానిని వినిపిస్తున్నాము, ఎవరికైతే మీరు సేవ చేస్తారో లేక చేస్తున్నారో వారిలో ఈ అన్ని విషయాలను నింపాలి. ఇప్పటివరకు ఏ రిజల్టు ఉంది? ప్రతి ఒక్కరూ వారి రిజల్టునైతే చూసుకుంటారు. మెజారిటీ ఏం కనిపిస్తుంది? కొందరిలో స్నేహపు విశేషత, కొందరిలో సహయోగపు విశేషత, కానీ శక్తి రూపపు ధారణ తక్కువగా ఉంది. దీని గుర్తుగా ఏం కనిపిస్తుంది, తెలుసా? శక్తిస్వరూపము తక్కువగా ఉన్న దానికి గుర్తు ఏమిటి? పరిశీలించే శక్తి తక్కువగా ఉన్నదానికి గుర్తు ఏమిటి? ఒక్క విషయాన్ని వినిపించారు - సేవా సఫలత ఉండదు. దాని స్పష్టమైన గుర్తుగా రెండు మాటలలో అది కనిపిస్తుంది. వారి ప్రతి మాటలో ఎందుకు, ఏమిటి, ఎలా? ఇలా ప్రశ్నార్థకాలు చాలా ఉంటాయి. డ్రామా యొక్క ఫుల్ స్టాప్ ను పెట్టడము వారికి చాలా కష్టమౌతుంది. అందుకని స్వయమే ఏమిటి, ఎందుకు అనేవాటి చిక్కులలో చిక్కుకొనిపోతారు. మరొక విషయము - వారు ఎప్పుడూ సమీప ఆత్మగా తయారు చెయ్యలేరు. సంబంధములోకి తీసుకొనివస్తారు కానీ సమీప సంబంధములోకి తీసుకొని రారు. అర్థమైందా! బ్రాహ్మణజీవితపు మర్యాదలేవైతే ఉన్నాయో ఆ అన్ని మర్యాదల స్వరూపంగా తయారు చెయ్యలేరు, ఎందుకంటే స్వయములో శక్తి తక్కువగా ఉన్న కారణంగా అన్ని మర్యాదలను పాలన చెయ్యగలిగినంత శక్తిని ఇతరులలో తీసుకురాలేకపోతారు. ఏదో ఒక మర్యాదరేఖను ఉల్లంఘన చేసేస్తారు. అన్నీ అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోవటంలో లోపం ఉండదు. మర్యాదలను గురించిన వివేకము పూర్తిగా ఉంటుంది, అయినా గానీ మర్యాదలలో నడిచే శక్తి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఎవరికైతే వారు సేవ చేస్తారో వారిలో కూడా శక్తి తక్కువగా ఉన్న కారణంగా హైజంప్ చెయ్యలేకపోతారు. సంస్కారాలను తొలగించుకోవటంలో చాలా సమయాన్ని వ్యర్థం చేస్తారు. ఇప్పుడు ఈ విషయాలతో మీ స్వరూపాన్ని పరిశీలించుకోండి. ఎప్పుడైతే వృక్షము గురించి అన్ని విషయాలలో శ్రద్ధను ఇవ్వటం జరుగుతుందో అప్పుడే చాలా మంచి మరియు మధురమైన ఫలములు రాగలవు. భూమిని దున్నేందులో శ్రద్ధ, బీజాన్ని వెయ్యటంలో, నీటిని పొయ్యటంలో, అన్నీంటిలో ధ్యానమును ఉంచవలసి ఉంటుంది. అటువంటి శ్రేష్ట ఫలాన్ని  తయారుచేసేందుకు సంస్కారాలను తొలగించుకునే శక్తి కావాలి, భూమిని దున్నే శక్తి అంటే ఇదే. అలా స్నేహిగా కూడా తయారుచెయ్యాలి, సహయోగిగా కూడా తయారుచెయ్యాలి మరియు శక్తి స్వరూపంగా కూడా తయారుచెయ్యాలి. ఒకవేళ ఏదైనా ఒక్క దాంట్లో లోవము ఉన్నాగానీ ఏమౌతుంది! హృదయసింహాసనాధికారిగా అవ్వలేరు అని మొదట్లో వినిపించడం జరిగింది కదా! కావున టీచర్లు ఇటువంటి ధ్యానమును ప్రతి ఒక్కరిపై ఉంచాలి.

            మీరు ఎయిమ్ ఆబ్జెక్టు (లక్ష్యమును) వినిపించినప్పుడు ఏమని వినిపిస్తారు? దేవతగా అవ్వాలి అన్న లక్ష్యాన్ని ఇస్తారు. సర్వగుణ సంపన్నులు అన్నది దేవతల మహిమ, కావున ఆ లక్ష్యమును ఉంచాలి. ప్రతి ఒక్క ఆత్మలో సర్వ గుణాలను నింపే ప్రయత్నము చెయ్యాలి. టీచర్లు ప్రతి ఒక్కరి గురించి ఎంతగా శ్రమ పడాలంటే, మాకు నిమిత్తమై ఉన్న టీచరు మాకు ఈ విషయంపై ధ్యానమును పెట్టించలేదు అని ఏ ఆత్మా ఫిర్యాదు చెయ్యకూడదు. వారు చెయ్యనీ, చెయ్యకపోనీ, అది వారి వారి అదృష్టము. కానీ మీరు అందరి గురించి శ్రమ తీసుకోవాలి. లేదంటే ఇప్పటివరకు గల రిజల్టులో కొన్ని ఫిర్యాదులు ఇప్పటివరకు కూడా వస్తూ ఉన్నాయి. ఇది సేవలో లోపము, కావున అన్ని విషయాలలో నింపటం ద్వారా ఆ ఫలము కూడా అటువంటి అర్హమైనదిగా తయారౌతుంది. మీరు ఆలోచించండి, ఎవరైనా చాలా పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు వారి ముందు ఎటువంటి ఫలాన్ని పెడ్తారు? పెద్దదిగా కూడా మరియు మంచిదిగా కూడా ఉంటుంది. సాకారములో కూడా ఏదైనా వస్తువును తెచ్చినప్పుడు ఏం చూసేవారు? కావున ఇప్పుడు బాప్ దాదా ముందు కూడా అటువంటి ఫలాన్ని ఏదైతే తయారుచేస్తారో దానినే ముందుకు తీసుకురాగలరు కావున ఈ ధ్యానమును ఉంచాలి. ఎవరు ఎంతగా స్వయము గుణాలతో సంపన్నంగా ఉంటారో అంతగానే ఇతరులో కూడా నింపగలరు. రచయిత ముఖము ప్రతి ఒక్క రచన ద్వారా కనిపిస్తుంది. సేవ అన్నది మీ కొరకు ఒక దర్పణము(అద్దము)లాంటిది. ఈ దర్పణము ద్వారా మీ లోపలి స్థితిని చూసుకోగలరు. దర్పణములో ఏవిధంగా మీ ముఖము చాలా సహజంగా మరియు స్పష్టంగా కనిపిస్తుందో అలా సేవా దర్పణం ద్వారా మీ ఫీచర్స్ (ముఖము కాదు, చరిత్ర) యొక్క సహజమైన, స్పష్టమైన సాక్షాత్కారము కలుగుతుంది. అది ముఖానికి అద్దము, ఇది చరిత్రకు అద్దము. ప్రతి ఒక్కరికీ మీ సాక్షాత్కారము స్పష్టంగా జరుగుతోందా? జరగాలి. ఒకవేళ ఇప్పటివరకు స్పష్టమైన సాక్షాత్కారము జరగనట్లయితే మిమ్మల్ని సంపూర్ణంగా ఎలా తయారుచేసుకోగలరు? మీలోని బలహీనతలను తెలుసుకొన్నప్పుడే శక్తిని నింపగలరు కావున ఒకవేళ స్వయము యొక్క సాక్షాత్కారములో ఏదైనా స్పష్టీకరణ లేనట్లయితే నిమిత్తమై ఉన్న అక్కయ్యల ద్వారా సహాయము తీసుకొని మీ స్పష్ట సాక్షాత్కారమును చేసే ప్రయత్నము తప్పక చెయ్యాలి. ఇది బాప్ దాదాల పని కాదు. సూచనను ఇవ్వటము బాప్ దాదాల కర్తవ్యము.

             టీచర్ల ఫీచర్స్ ఎలా ఉండాలి? టీచర్లు తమ ఫరిస్తా స్వరూపపు ఫీచర్స్ ద్వారా సేవ చెయ్యవలసి ఉంటుంది. ఇది నా నేచర్(స్వభావము) అన్న మాట టీచర్ల నుండి ఇప్పడిక వెలువడకూడదు. ఇలా అనటము శక్తిహీనతకు గుర్తు. పురుషార్థము అన్న పదమును పురుషార్థము అన్న భావముతో ఉపయోగించరు. కానీ పురుషార్థము అన్న పదమును పురుషార్థము నుండి విడిపించుకొనేందుకు సాధనంగా తయారుచేసారు! కావున ఏదైనా గుమ్మటంలో శబ్దం చేసినప్పుడు అది తిరిగి మీవద్దకు ఏవిధంగా వస్తుందో అలా మీ మాటలు రచన ద్వారా కూడా మీ ముందుకే వస్తాయి. కావున ఇంతటి అటెన్షన్ ను మీ సంకల్పాలపై కూడా ఉంచాలి. అక్కడక్కడి నుంచి ఈ సమాచారములు వస్తాయి, ఏ సమాచారములు? ఈ రోజుల్లో స్టూడెంట్స్ వినటం లేదు, కష్టపడుతున్నాము కానీ ముందుకు వెళ్ళటం లేదు, ఎక్కడివాళ్ళు అక్కడే ఉన్నారు, ఎందుకని ఇటువంటి రిజల్ట్ వస్తోంది? ఇది కూడా మీ స్థితికి ప్రతిఫలమే ఎందుకంటే స్టూడెంట్స్ కూడా నడుస్తూ-నడుస్తూ నిమిత్తంగా ఉన్న టీచర్ల బలహీనతలను గమనించి దాని అడ్వాంటేజ్ (అవకాశాన్ని) తీసుకుంటారు. అచ్ఛా!

Comments