21-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
బేహద్ వైరాగ్యవృత్తియే విశ్వపరివర్తనకు ఆధారం.
విశ్వాన్ని కొత్తగా పరివర్తన చేసేవారు, సర్వాత్మలకు పరమప్రియుడైన శివబాబా, నవ విశ్వనిర్మాణానికి ఆధారమూర్తులైన పిల్లలతో మధుర సంభాషణ చేస్తూ పలికినటువంటి అమూల్య మహావాక్యాలు -
అందరూ కొత్త ప్రపంచం తీసుకురావడానికి నిమిత్తంగా అయ్యారు కదా, కొత్త ప్రపంచం ఎప్పుడు వస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రపంచం ఏ తిధి తారీఖున వస్తుందో తెలిస్తే బాగుండును అని అందరికీ సంకల్పం ఉంది. మరి ఆ తిథి తారీఖు తెలుస్తుందా? త్రికాలదర్శులు కదా కనుక తప్పక తెలియాలి. మూడుకాలాలు తెలిసినవారికి భవిష్యత్తు కూడా వర్తమానం వలె తెలుస్తుంది. అంతేకాదు భవిష్యత్తును తెలుసుకునేటందుకు ఆధారం కూడా వర్తమానమే. కొత్త ప్రపంచంలోకి వచ్చేవారు కూడా బ్రాహ్మణులే. కొత్త ప్రపంచంలోకి ఎవరైతే రానున్నారో వారి వర్తమానం ఆధారంగానే భవిష్యత్తు యొక్క తిథి తారీఖు స్వతహగానే తెలుస్తుంది. కొత్త ప్రపంచం అని అంటున్నారు కదా! మరి కొత్త ప్రపంచానికి అధికారి ఆత్మలలో కూడా కొత్తదనం ఉండాలి కదా! ఏ పాత సంస్కారం లేదా సంకల్పం లేదా మాట లేదా నడవడిక ఉండకూడదు. ఇప్పుడు కూడా పరస్పరంలో నడవడికను చూసి, ఇది వీరి పాత సంస్కారం అని అనుకుంటారు కదా! ఇప్పటి వరకు వీరిలో ఈ పాత సంస్కారం లేదా నడవడిక పోలేదు అంటారు కదా. ఇలా ఏ విషయంలోనూ పాతదనం అనేది ఉండకూడదు. సంకల్పంలో కూడా పాత స్వభావ సంస్కారాలకు వశం అవకూడదు. ఎప్పుడైతే ఎక్కువమందిలో లేదా ముఖ్య ఆత్మల్లో ఇలాంటి నవీనత కనిపిస్తుందో అప్పుడే కొత్త ప్రపంచం యొక్క తిథి, తారీకు స్పష్టం అవుతుంది. ఎవరైతే నిమిత్తమైన ముఖ్య ఆత్మలు ఉన్నారో వారిలో నవీనత మరియు పరివర్తన అనుభవం అవ్వాలి. వారి పరివర్తన ఆధారంగానే విశ్వ పరివర్తన యొక్క తారీఖు ప్రత్యక్షం అవుతుంది. విశ్వపరివర్తనకు ముందు విశ్వంలో ఉన్న సర్వాత్మల్లో వైరాగ్యవృత్తి రావాలి, ఆ వైర్యాగ్యవృత్తి ద్వారానే బాబా పరిచయాన్ని ధారణ చేయగలుగుతారు. ఆత్మలైన మనతండ్రి వచ్చేసారు అని గ్రహిస్తారు. ఎలాగైతే విశ్వ ఆత్మల్లో వైరాగ్యవృత్తియే పరివర్తనకు ఆధారమవుతుందో అదేవిధంగా ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారిలో కూడా సంపూర్ణ పరివర్తనకు ఆధారం బేహద్ వైరాగ్యవృత్తియే అవుతుంది. కనుక సంఘటనలో కూడా బేహద్ వైరాగ్యవృత్తిని తీసుకువచ్చేటందుకు పురుషార్థం చేయండి, ఒకరికొకరు తోడుగా, సహయోగిగా అవ్వండి. ఎప్పుడైతే వైరాగ్యవృత్తి ప్రత్యక్ష రూపంలో ఉంటుందో అప్పుడు పాత స్వభావసంస్కారాలు చాలా త్వరగా మరియు సహజంగా ఆ వైరాగ్యవృత్తి లోపల గుప్తమైపోతాయి. ఏమవుతుందో అని అందరూ ఆలోచిస్తున్నారు కదా, పాతదనం అంతా మరిచిపోతారు. మనిషికి ఎప్పుడైతే హద్దులోని వైరాగ్యం వస్తుందో అప్పుడు పాత ఆకర్షణల యొక్క సంస్కారాలు మరియు స్వభావం మొదలైనవన్నీ సమాప్తం అవ్వడానికి వైరాగ్యవృత్తియే ఆధారమవుతుంది. దీని ద్వారానే మార్పు వస్తుంది. ఇప్పుడు ఇలాంటి భూమిని తయారుచేయండి. బేహద్ వైరాగ్యం యొక్క సంఘటన తయారుచేయండి. వారి తరంగాలు మరియు వాయుమండలం ద్వారా ఇతరాత్మలలో కూడా ఆ సంస్కారం ప్రత్యక్షం అవ్వాలి. ఎలాగైతే సేవాధారుల సంఘటన ఉంటుందో అలాగే బేహద్ వైరాగుల సంఘటన గట్టిగా ఉండాలి. వారిని చూస్తూనే ఇతరాత్మలకు కూడా అలాంటి తరంగాలు రావాలి. ఒకవైపు బేహద్ వైరాగ్యం ఉండాలి. మరోవైపు బాబా సమానంగా బాబా ప్రేమలో లవలీనమై ఉండాలి. అప్పుడే బేహద్ వైరాగ్యం వస్తుంది. అలాంటి వారు ఒక్క సెకెను కూడా మరియు ఒక్క సంకల్పంలో కూడా ఈ లవలీన స్థితి నుండి క్రిందికి రారు. అలాంటి ప్రియమైన తండ్రి యొక్క ప్రియమైన పిల్లల సంఘటన కావాలి. ఆ సంఘటనను ప్రియమైన సంఘటన అంటారు. ఒకవైపు అతి ప్రేమ, రెండవవైపు బేహద్ వైరాగ్యం రెండింటి యొక్క సంఘటన వెనువెంట ఉండాలి మరియు సమానంగా కనిపించాలి. ఇలాంటి సంఘటనను తయారుచేయండి, అప్పుడు తారీఖు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంఘటనయే తారీఖును ప్రసిద్ధం చేస్తుంది.
Comments
Post a Comment