11-01-1977 అవ్యక్త మురళి

11-01-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్వయం పరివర్తనయే విశ్వ పరివర్తనకి ఆధారం.

                     స్వయం యొక్క పరివర్తనతో విశ్వ పరివర్తన చేసే యుక్తి చెప్తూ అవ్యక్త బాప్ దాదా మాట్లాడుతున్నారు -
                     బాప్ దాదా తన పూల తోటను చూస్తున్నారు మరియు సదా చూస్తూనే ఉంటారు. అమృతవేళ నుండి బాబా పూల తోటను చూస్తారు. ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు ఏ రకంగా, ఎంత సువాసనతో, ఏ రూపం, రంగు కలిగి ఉన్నారు అనేది చూస్తున్నారు. మొగ్గగా ఉన్నారా లేక మొగ్గ నుండి పువ్వులా అయ్యారా? ప్రతీ ఒక్కరి విశేషత ఏమిటి మరియు అవసరం ఏమిటి? సువాసన కలిగిన వారిగా అయితే అయ్యారు. కానీ ఆ సువాసన అవినాశిగా మరియు దూరం వరకు వ్యాపించే విధంగా ఉంటుందా? కొన్ని పూల సువాసన దగ్గరికి వస్తేనే వస్తుంది కానీ దూరం నుండి రాదు.  అలాగే ఇక్కడ కూడా సువాసన కలిగిన వారిగా అయితే అయ్యారు, కానీ బాబాకి సన్ముఖంగా వచ్చినప్పుడు లేదా సేవా నిమిత్తం ఆత్మల ఎదురుగా వెళ్ళినప్పుడు ఆ సువాసన వస్తుంది, కానీ సేవ లేకుండా సాధారణ కర్మ చేస్తూ లేదా శరీర నిర్వహణ చేసుకుంటూ ఆ సువాసన ఉండటం లేదు. కొన్ని కొన్ని పువ్వులు దూరం నుండే ఆకర్షిస్తాయి. రంగు, రూపం ఆధారంగా ఆకర్షిస్తాయి, కానీ సువాసన ద్వారా కాదు. రంగు, రూపం, సువాసన అన్నింటిలో సంపన్నంగా ఉన్న పువ్వులను చాలా కొద్దిగా చూసారు. రంగు, రూపం అంటే తెలివైనవారు, సువాసనతో ఉండేవారు సారయుక్తంగా ఉంటారు. చాలా మంది తెలివైన వారిగా అయితే ఉన్నారు. కానీ సారవంతమైన వారు తక్కువగా ఉన్నారు. తెలివి ఆధారంతో సేవాధారిగా అయితే అయ్యారు, కానీ ఆత్మిక సేవాధారులుగా తక్కువమంది అవుతారు. దీనికి కారణం? ఎలాగైతే బాబా నిరాకారి నుండి సాకారి అయ్యి సేవా పాత్రను అభినయిస్తున్నారో అలాగే పిల్లలు మేము కూడా నిరాకారి నుండి సాకారీగా అయ్యి పాత్రను అభినయిస్తున్నాము అనే మంత్రాన్ని మర్చిపోతున్నారు. నిరాకారి నుండి సాకారి ఈ రెండు స్మృతులు వెనువెంట ఉండటం లేదు. అయితే నిరాకారి అయిపోతున్నారు లేకపోతే సాకారిగా అయిపోతున్నారు. నిరాకారి నుండి సాకారి పాత్రను అభినయిస్తున్నాం అనే మంత్రం సదా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ సాకారి సృష్టి, సాకారి శరీరం అనేది వేదిక లాంటిది. వేదిక మరియు పాత్ర అభినయించేవారు ఇద్దరు వేర్వేరుగా ఉంటారు. పాత్రధారి స్వయాన్ని ఎప్పుడు వేదికగా భావించరు. వేదిక అనేది ఆధారం, పాత్రధారి ఆధారమూర్తి, యజమాని. ఈ శరీరాన్ని వేదికగా భావించినట్లయితే స్వయాన్ని పాత్రధారిగా స్వతహాగానే అనుభవం చేసుకుంటారు. అయితే కారణం ఏమిటి? స్వయాన్ని అతీతంగా చేసుకోవటం రావటంలేదు.
                      నేను విదేశీని అని సదా భావిస్తూ నడవండి. పరాయి దేశంలోకి మరియు పాత శరీరంలోకి విశ్వ కళ్యాణం యొక్క పాత్ర అభినయించటానికి వచ్చాను. మొదటి పాఠం బలహీనంగా ఉన్న కారణంగా తెలివైనవారిగా అయితే అయ్యారు. కానీ సారయుక్తంగా కాలేదు. రంగు, రూపం ఉంది. కానీ సువాసన అవినాశిగా వెదజల్లే విధంగా లేదు. అందువలన బాప్ దాదా ఇప్పుడు మరల రిపీట్ చేయాల్సి వస్తుంది. సెకనులో సహజంగా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. మొదట స్వయాన్ని అడగండి స్వపరివర్తనకి ఎంత సమయం పడుతుంది అని. ఏదైనా స్వభావం, సంస్కారం, మాట, సంపర్కం యథార్థంగా లేకుండా వ్యర్ధంగా ఉంటే దానిని శ్రేష్టంగా తయారు చేసుకోవటంలో ఎంత సమయం పడుతుంది? సూక్ష్మ సంకల్పాలను, సంస్కారాలను ఏది ఆలోచిస్తున్నారో అది చేస్తున్నారా, పరిశిలించుకున్న వెంటనే పరివర్తన చేసుకునే అంత వేగవంతమైన మిషన్ ఉందా?
                        వర్తమాన సమయంలో స్వపరివర్తన అనే మిషన్ చాలా వేగంగా పని చేయాలి. అప్పుడే విశ్వపరివర్తన యొక్క మిషన్ వేగంగా పని చేస్తుంది. ఇప్పుడు స్థాపనకి నిమిత్తంగా అయిన ఆత్మలు ఆలోచించటంలో, చేయటంలో తేడా ఉంది. ఎందుకంటే పాత భక్తి సంస్కారం ప్రత్యక్షం అయిపోతుంది. భక్తిలో కూడా ఆలోచించటం మరియు చెప్పటం చాలా ఉంటాయి. ఇది చేస్తాం, అది చేస్తాం అని చాలా చెప్తారు, కానీ చేసేది తక్కువ. బలిహారం అయిపోతాము అని చెప్తారు, కానీ ఏమీ చేయరు. అనటం నీది అంటారు కానీ నాదిలా భావిస్తారు. అలాగే ఇక్కడ కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఆత్మిక సంభాషణలో కూడా చాలా ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ రోజు నుండి మారిపోయి చూపిస్తాను అని. ఈరోజు ఇది వదిలేసి వెళ్తున్నాను అని. ఈరోజు సంకల్పం చేస్తారు, కానీ చెప్పటంలో, చేయటంలో తేడా వచ్చేస్తుంది. ఆలోచించడం, చేయడంలో తేడా వచ్చేస్తుంది. అందువలనే వినాశనానికి నిమిత్తమైన ఆత్మలు కూడా ఆలోచిస్తున్నారు. కానీ చేయలేకపోతున్నారు. కనుక ఇప్పుడు బాబా సమానంగా అవ్వటానికి ముందు ఈ విషయంలో సమానంగా అవ్వండి. అంటే స్వపరివర్తన అనే మిషన్ యొక్క వేగాన్ని పెంచండి. ఈ తేడాను తొలగించుకునే మంత్రం సాకారి నుండి నిరాకారి పాత్రను అభినయిస్తున్నాను అని అనుకోవాలి. ఈ మంత్రంతో ఆలోచించటం మరియు చేయటంలో ఉన్న తేడాను తొలగించండి. ఇదే ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఏమి చేయాలో అర్థమైందా?
                    స్వపరివర్తన ద్వారానే విశ్వపరివర్తన అవుతుంది. విశ్వపరివర్తన యొక్క తారీఖు గురించి ఆలోచించకండి. స్వపరివర్తన యొక్క సెకను నిర్ణయించుకోండి. స్వయాన్ని సంపన్నం చేసుకుంటే విశ్వపరివర్తన యొక్క కార్యం సంపన్నం అయిపోతుంది. విశ్వపరివర్తనకు గడియారం మీరే. మీకు మీరే చూసుకోండి. బేహద్ రాత్రి సమాప్తి అవ్వటంలో ఎంత సమయం ఉంది అని. సంపూర్ణత యొక్క సూర్యుడు ఉదయించటం అంటే రాత్రి, అంధకారం సమాప్తి అవ్వటం, బాబాని అడుగుతున్నారా? బాబా మిమ్మల్ని అడగాలా? ఆధారమూర్తులు మీరే. మంచిది.
                 ఒక్క సెకనులో పరివర్తన అయ్యే వారికి, ఆలోచించటం, చేయటం సమానంగా చేసేవారికి, నిరంతరం నిరాకారి నుండి సాకారి అనే మంత్రాన్ని స్మృతి స్వరూపంలోకి తీసుకువచ్చే వారికి, సంపన్నంగా అయ్యి విశ్వంలో మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి అంధకారాన్ని సమాప్తి చేసేవారికి, సదా అతీతంగా మరియు బాబాకి ప్రియంగా ఉండే విశేషాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు
మరియు నమస్తే.

Comments

Post a Comment