21-01-1972 అవ్యక్త మురళి

 *21-01-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“నిరంతర యోగులుగా అయ్యేందుకు సహజ విధి.”

ఏవిధంగా ఒక్క క్షణంలో స్విచ్‌ను ఆన్‌ చేయడము మరియు ఆఫ్‌ చేయడము జరుగుతుందో అలాగే ఒక్క క్షణంలో శరీరమును ఆధారంగా తీసుకోవడము మళ్ళీ ఒక్క క్షణంలో శరీరం నుండి అతీతంగా అశరీర స్థితిలో స్థితులవ్వడము చేయగలరా? ఇప్పుడిప్పుడే శరీరములోకి వచ్చి మళ్ళీ ఇప్పుడిప్పుడే అశరీరులుగా అయిపోయే అభ్యాసము చేయాలి, దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. అప్పుడు ఇలా అనుభవమవుతుంది - ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎటువంటి వస్త్రమునైనా ధారణ చేయడము లేక చేయకపోవడము మనచేతిలోనే ఉంటుంది. అవసరముంటే ధారణ చేస్తారు, అవసరం లేకపోతే శరీరము నుండి వేరైపోతారు, అటువంటి అనుభవము ఈ శరీరరూపీ వస్త్రముతో ఉండాలి. కర్మచేస్తూ కూడా వస్త్రమును ధారణచేసి కార్యము చేస్తున్నట్లుగా అనుభవమవ్వాలి. కార్యం పూర్తవ్వగానే వస్త్రం నుండి అతీతంగా అయిపోవాలి. శరీరము మరియు ఆత్మ రెండింటి యొక్క అతీతమైన స్థితి నడుస్తూ తిరుగుతూ కూడా అనుభవమవ్వాలి. ఏదైనా అభ్యాసమైపోయినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండాలి. కాని, ఈ అభ్యానము ఎవరికి జరుగగలదు? ఎవరైతే శరీరముతో లేక శారీరిక సంబంధంతో ఉన్న విషయాలు, శరీరము యొక్క ప్రపంచము, సంబంధము లేక అనేక శారీరక వస్తువులు ఏవైతే ఉంటాయో వాటినుండి పూర్తిగా డిటాచ్‌గా ఉంటారో, కొద్దిగా కూడా ఆకర్షణ ఉండదో, అప్పుడే అతీతంగా ఉండగలరు. సూక్ష్మముగా సంకల్పాలలో కూడా తేలికతనం లేకపోతే అతీతంగా అయ్యే అనుభవమును చేసుకోలేరు. కావున ఇప్పుడు మహారధులు ఈ అభ్యాసము చేయాలి, పూర్తిగా అతీతంగా ఉండే అనుభవము ఉండాలి. ఈ స్థితిలో ఉండడం ద్వారా ఇతర ఆత్మలకు కూడా మీ నుండి అతీతంగా ఉన్న అనుభవము కలుగుతుంది. వారు కూడా అనుభూతి చేసుకుంటారు. ఏ విధంగా యోగములో కూర్చునే సమయంలో ఈ డ్రిల్లు చేయించేవారు అతీతమైన స్థితిలో ఉన్నారు అని అనేక ఆత్మలకు అనుభవమవుతుందో అలా నడుస్తూ తిరుగుతూ ఫరిశ్తా స్వరూపం యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. అలా ఇక్కడ కూర్చుంటూ కూడా అనేక ఆత్మలకు మీ సత్యయుగ పరివారానికి సమీపంగా వచ్చే వారెవరైతే ఉంటారో వారందరికీ మీ ఫరిశ్తా రూపము మరియు భవివ్య రాజ్యపదవి రెండూ కలిసి సాక్షాత్కారమవుతాయి. ఏ విధంగా ప్రారంభంలో బ్రహ్మలో సంపూర్ణ స్వరూపమును మరియు శ్రీకృష్ణ రూపమును రెండింటినీ సాక్షాత్కారము చేసుకునేవారో అలా వారికి ఇప్పుడు మీ డబుల్‌ రూపపు సాక్షాత్కారము జరుగుతుంది. ఎలా ఎలా అయితే నెంబర్‌వారీగా ఈ అతీతమైన స్థితిలోకి వస్తూ ఉంటారో అలా మీ‌ యొక్క డబుల్‌ సాక్షాత్కారము కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా అభ్యానమైపోతే అన్నివైపుల నుండి ఈ సమాచారము రావడం ప్రారంభమవుతుంది. ఏ విధంగా ప్రారంభంలో ఇంట్లో కూర్చొని కూడా సమీపంగా వచ్చే అనేక ఆత్మలకు సాక్షాత్కారాలు జరిగేవో, అలా ఇప్పడు కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడ కూర్చొని ఉంటూ కూడా మీ సూక్ష్మ స్వరూపము బేహద్దులో సేవ చేస్తుంది, ఇప్పుడు ఈ సేవయే మిగిలి ఉంది. సాకారంలో అందరూ ఉదాహరణనైతే చూశారు కదా! అన్ని విషయాలు నెంబర్‌వారీగా, డ్రామా అనుసారంగా జరుగనున్నాయి. ఎంతెంతగా స్వయం ఆకారీ ఫరిశ్తా స్వరూపంలో ఉంటారో అంతగా మీ ఫరిశ్తా రూపము సేవ చేస్తుంది. ఆత్మకు మొత్తం విశ్వమును చుట్టివచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? కావున ఇప్పుడు మీ నూక్ష్మ స్వరూపం కూడా సేవ చేస్తుంది. కాని, ఎవరైతే ఈ అతీతమైన స్థితిలో ఉంటారో, స్వయం ఫరిశ్తా రూపంలో స్థితులవుతారో వారిద్వారా అది జరుగుతుంది. ప్రారంభంలో అన్ని సాక్షాత్కారాలు జరిగాయి. ఫరిశ్తా రూపంలోని సంపూర్ణ స్థితి మరియి పురుషార్ధి స్థితి రెండూ వేరువేరుగా సాక్షాత్కారమయ్యేవి. ఏ విధంగా సాకార బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ యొక్క వేరు వేరు సాక్షాత్కారాలు జరిగేవో అలా అనన్యులైన పిల్లల సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. గొడవలు జరిగినప్పుడు సాకార శరీరాల ద్వారా ఏమీ చేయలేరు మరియు ప్రభావము కూడా ఈ సేవ ద్వారానే జరుగుతుంది. ప్రారంభంలో కూడా సాక్షాత్కారాల ద్వారానే ప్రభావం పడింది కదా! పరోక్షమైన మరియు అపరోక్షమైన అనుభవాలు ప్రభావాన్ని కలిగించాయి, అలా అంతిమంలో కూడా ఈ సేవ జరుగనుంది. మీ సంపూర్ణ స్వరూపం యొక్క సాక్షాత్కారము మీ‌కు జరుగుతోందా? ఇప్పుడు శక్తులను పిలువడం ప్రారంభమైంది. ఇప్పుడు పరమాత్మను తక్కువగా పిలుస్తున్నారు మరియు శక్తులను పిలువడం ఎక్కువవుతోంది. కావున ఇటువంటి అభ్యాసమును మధ్యమధ్యలో చేయండి. అలవాటైపోతే ఎంతో ఆనందము కలుగుతుంది. ఒక్క క్షణంలో ఆత్మ శరీరం నుండి అతీతంగా అయిపోతుంది, అభ్యాసమైపోతుంది. ఇప్పడు ఈ అభ్యాసమునే చేయాలి. అచ్చా!

వర్తమాన సమయంలో పురుషార్ధంలో మూడు స్థితులు ఉన్నాయి. ఈ మూడు స్థితులను ప్రతి ఒక్కరూ తమ తమ యథాశక్తిగా దాటుతూ ముందుకు వెళుతున్నారు. ఈ మూడు స్థితులు ఏమిటి? ఒకటి- వర్ణన, రెండవది-.మననము మరియు మూడవది- మగనము. మెజారిటీ వర్ణనలో ఎక్కువగా ఉన్నారు. మననము మరియు మగ్నముగా ఉండడంలో లోటు ఉన్న కారణంగా ఆత్మలలో విల్‌ పవర్‌ తక్కువగా ఉంది. కేవలం వర్ణన చేయడం ద్వారా బాహ్యముఖత యొక్క శక్తి కనిపిస్తుంది, కాని దాని నుండి ప్రభావం పడదు. మననం చేస్తూ ఉంటారు కాని అంతర్ముఖులుగా అయి మననం చేయడంలో లోపము ఉంది. పాయింట్లను మననం చేస్తున్నా కాని ప్రతి పాయింటు ద్వారా మననము అనగా మంథనము చేయడము ద్వారా శక్తి స్వరూపమనే వెన్న వెలువడాలి. దానిద్వారా శక్తి పెరుగుతుంది. ప్లానింగ్‌ చేసినా కాని దానితోపాటు సర్వశక్తుల యొక్క అలంకరణ ఏదైతే జరగాలో అది లేదు. ఏదైనా వస్తువు ఎంత అమూల్యముగా ఉన్నా కాని దానిపైన ఆ విధంగా అలంకరించి ఉంచకపోతే ఆ వస్తువు యొక్క విలువ తెలియజాలదు. అదేవిధంగా జ్ఞానం యొక్క మననము జరుగుతున్నా కాని స్వయములో ఒక్కొక్క పాయింటు ద్వారా ఏ శక్తులైతే నిండాలో వాటిని తక్కువగా నింపుకుంటున్నారు.. కావుననే శ్రమ ఎక్కువగా మరియు రిజల్టు తక్కువగా లభిస్తూ ఉంటుంది. మనస్సులో, ప్లానింగ్‌లో ఉల్లాస ఉత్సాహాలు చాలా బాగుంటాయి. కాని, ప్రాక్టికల్‌ రిజల్టును చూసినట్లయితే మనస్సులో అవినాశీ ఉల్లాస ఉత్సాహాలు ఉండవు. ఏకరసముగా ఏ స్థితి అయితే ఉండాలో అది ఉండదు. ఒక్కొక్క పాయింటును మననము చేయడం ద్వారా తమ ఆత్మలో శక్తి ఎలా నిండుతూ ఉంటుంది అన్న అనుభవంలో చాలామంది అపరిచితులుగా ఉన్నారు. కావున ఈ అంతర్ముఖత, అతీంద్రియ సుఖప్రాప్తి యొక్క అనుభవమును పొందరు. ఎప్పటివరకైతే అతీంద్రియ సుఖము యొక్క, సర్వప్రాప్తుల అనుభూతి ఉండదో అప్పటివరకు అల్పకాలికమైన ఏ వన్తువైనా తనవైపుకు తప్పకుండా ఆకర్షిస్తుంది. కావున వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలలో సర్వశక్తులు నింపుకోవలసిన అవసరము ఉంది, అప్పుడు మగ్న స్థితి ఉంటుంది మరియు విఘ్నాలు తొలగిపోగలవు. ఎప్పుడైతే ఆత్మికత వైపు ఫోర్సు తక్కువగా ఉంటుందో అప్పుడే విఘ్నాల అల వస్తుంది. కావున వర్తమాన సమయంలో శివరాత్రి సేవకు ముందే స్వయములో శక్తిని నింపుకునే ఫోర్సు కావాలి. యోగ కార్యక్రమాలను నిర్వహించినా కాని యోగము ద్వారా శక్తులను అనుభవం చేసుకోవడము, చేయించడము, ఇప్పుడు ఇటువంటి క్లాసుల అవసరము ఉంది. ప్రత్యక్షంగా తమ శక్తి యొక్క ఆధారంతో ఇతరులకు శక్తిని ఇవ్వాలి. కేవలం బయటి సేవల ప్లానులను ఆలోచించకూడదు, అన్నివైపులా పూర్తి దృష్టి ఉండాలి. నిమిత్తులై ఉన్నవారికి మన ఇటువైపు ఉన్న పూలతోట ఈ విషయంలో బలహీనంగా ఉంది అన్న ఆలోచన కలగాలి. ఏ విధంగానైనా తమ పూలతోట బలహీనతలపై కఠినమైన దృష్టిని ఉంచాలి. సమయాన్ని కేటాయించి కూడా బలహీనతలను అంతం చేయాలి. శక్తుల ప్రభావం యొక్క లోపం ఉన్న కారణంగా నడుస్తూ తిరుగుతూ కూడా అన్ని విషయాలలోను డీలాగా అయిపోతారు. కావున వినాశనపు ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతూ మళ్ళి డీలాపడిపోతాయి. ఎప్పుడైతే స్థాపనలో ఫోర్సు ఉండటో అప్పుడు వినాశనంలో ఫోర్సు ఎలా నిండగలదు! ప్రారంభంలో మీకు శక్తిస్వరూపం యొక్క నషా ఎంతగా ఉండేది! మీపై మీకు కఠినమైన దృష్టి ఉండేది. ఈ విఘ్నము ఎంత, మాయ ఎంత! ఎంతటి నషా ఉండేది! ఇప్పుడు మీపై మీకు అంతటి కఠినమైన దృష్టిలేదు. మీ కర్మల గతిపై అటెన్షన్  ఉంచాలి. డ్రామా అనుసారంగా, నెంబర్‌వారీగా అవ్వవలసిందే. ఏదో ఒక కారణంతో నెంబరు వరకు వెళ్ళవలసిందే. అయినా కాని ఫోర్సును నింపే కర్తవ్యము చేయాలి. ఏ విధంగా సాకార బాబాను చూశారో ఇటువంటి అలలు వచ్చే సమయమేదైనా వచ్చినప్పుడు రాత్రింబవళ్ళు శక్తిని ఇచ్చే విశేష సేవను, విశేషమైన ప్లాన్‌లను చేసేవారు. నిర్జల ఆత్మలలో శక్తిని నింపే విశేషమైన అటెన్షన్ ఉండేది. దానిద్వారా అనేక ఆత్మలకు అనుభవం కూడా జరిగేది. రాత్రివేళల్లో కూడా సమయాన్ని కేటాయించి ఆత్మలలో శక్తిని నింపే సేవను చేసేవారు. నింపాలి, కావున ఇప్పుడు విశేషంగా శక్తిని ఇచ్చేసేవను చేయాలి. లైట్‌హౌస్‌గా, మైట్‌హౌన్‌గా అయి ఈ సేవను విశేషంగా చేయాలి, తద్వారా నలువైవులా శక్తి ప్రకాశం యొక్క ప్రభావము వ్యాపిన్తుంది, ఇప్పుడు వీటి అవనరం ఉంది. ఏ విధంగా ఎవరైనా షావుకారు తమ సమీప సంబంధీకులకు సహాయం చేసి ఉన్నతంగా పైకెత్తుతారో అలా వర్తమాన సమయంలో బలహీనఆత్మలు ఎవరైతే సంబంధంలో మరియు సంపర్కంలో ఉన్నారో వారికి విశేషమైన శక్తిని ఇవ్వాలి. అచ్చా!

నిరంతరము దేహపు భావమును మరిచిపోయేందుకు ప్రతిఒక్కరూ యథాశక్తి నెంబర్‌వారీగా, పురుషార్థానుసారంగా కష్టపడుతున్నారు. దేహాభిమానం నుండి అతీతంగా అయి దేహీ అభిమానులుగా అవ్వడమే చదువు యొక్క లక్ష్యము. దేహాభిమానం నుండి విముక్తులయ్యేందుకు ముఖ్యమైన యుక్తి-సదా మీ స్వమానంలో ఉండండి, తద్వారా దేహాభిమానము అంతమైపోతూ ఉంటుంది. స్వమానంలో స్వయం యొక్క భానము కూడా ఉంటుంది అనగా ఆత్మ యొక్క భానము. స్వమానము, నేను ఎవరిని? మీ సంగమయుగపు మరియు భవిష్యత్తు యొక్క అనేక రకాలైన స్వమానాలేవైతే సమయ ప్రతిసమయము అనుభవం చేయించబడ్డాయో వాటిలో నుండి ఏ స్వమానంలోనైనా స్థితులై ఉన్నట్లయితే దేహ అభిమానము అంతమైపోతూ ఉంటుంది. నేను ఉన్నతోన్నతుడనైన బ్రాహ్మణుడను అన్నది కూడా స్వమానమే. మొత్తం విశ్వంలో బ్రహ్మాండము మరియు విశ్వమునకు యజమానులుగా అయ్యే ఆత్మను నేను అన్నది కూడా స్వమానమే. ఏ విధంగా మీకు ప్రారంభంలో నేను స్త్రీని అనే దేహం యొక్క భానము నుండి కూడా అతీతంగా అయ్యే లక్ష్యము ఉండేదో, ఆత్మనైన నేను పురుషుడిని అన్న ఈ పురుష స్వభావంలో ఉంచడం ద్వారా నేను స్త్రీని అనే బాణము నెంబర్‌వారీగా, పురుషార్థానుసారంగా తొలగిపోయిందో అలాగే ఎల్లప్పుడూ మీ బుద్ధి లోపల వర్తమానము లేక భవిష్య స్వమానం యొక్క స్మృతి ఉండాలి, అప్పుడు అభిమానము ఉండదు. కేవలం పదాలు మారడము ద్వారా, స్వమానం ద్వారా స్వభావం కూడా మంచిగా అయిపోతుంది. ఎప్పుడైతే పరస్పరం స్వయం యొక్క భానము ఉండదో అప్పుడే స్వభావాల ఘర్షణ జరుగుతుంది. కావున స్వమానము అనగా స్వయం యొక్క బాణము, దానిద్వారా ఒకటేమో దేహాభిమానము సమాప్తమైపోతుంది మరియు స్వభావంలోకి రారు. అలాగే ఎవరైతే స్వమానంలో స్థితులవుతారో వారికి స్వతహాగానే గౌరవం కూడా లభిస్తుంది. ఈరోజుల్లో ప్రపంచంలో కూడా పదవి ద్వారా గౌరవం లభిస్తుంది కదా! ఎవరైనా ప్రెసిడెంట్‌గా ఉంటే వారికి పదవి ఎక్కువగా ఉన్న కారణంగా స్వమానం కూడా అలాగే లభిస్తుంది. స్వమానం ద్వారానే విశ్వమహారాజులుగా అవుతారు మరియు వారికి విశ్వము గౌరవమునిస్తుంది. కావున కేవలం మీ స్వమానంలో స్థితులై ఉండడం ద్వారా సర్వప్రాప్పులు లభించగలవు. అనేకరకాలైన స్వమానాలనేవైతే వినిపించారో, వాటి అనుభవం ఎవరికైతే ఉంటుందో వారే ఈ స్వమానంలో స్థితులవ్వగలరు. “నేను శివశక్తిని” ఇది కూడా స్వమానమే. ఒకటేమో వినడము, ఇంకొకటి ఆ స్వమాన స్వరూపం యొక్క అనుభవము. కావున అనుభవం యొక్క ఆధారంపై ఒక్క క్షణంలో దేహఅభిమానం నుండి తొలగి స్వమానంలో స్థితులైపోతారు. ఎవరైతే అనుభవీమూర్తులుగా ఉండరో, కేవలం విని అభ్యాసం చేస్తూ ఉంటారో, ఇప్పటివరకు అనుభవజ్ఞులుగా అవ్వలేదో వారి స్టితి ఈవిధంగానే ఉంటుంది. మీ స్వమానవు లిస్టును తయారుచేస్తే అది ఎంతో పెద్దగా ఉంటుంది. ఆ ఒక్కొక్క విషయాన్ని తీసుకొని అనుభవం చేస్తూ ఉన్నట్లయితే మాయ యొక్క చిన్న చిన్న విషయాలలో బలహీనులుగా అవ్వలేరు. మాయ బలహీనంగా చేసేందుకు మొదట దేహాభిమానంలోకి తెస్తుంది. దేహాభిమానంలోకే రాకపోతే ఈ బలహీనత ఎక్కడినుండి వస్తుంది? కావున అందరికీ మీ స్వమానం యొక్క స్మృతిని కలిగించండి మరియు ఆ స్వరూపం యొక్క అనుభవజ్ఞులుగా  తయారుచేయండి. ఏవిధంగా నేను మాస్టర్‌ సర్వశక్తివంతుడిని అని భావిస్తారో, సంకల్పము చేయడం ద్వారా స్థితి తయారవుతుంది కదా! కాని, ఎవరికైతే అనుభవం ఉంటుందో వారికే తయారవుతుంది, అనుభవం లేకపోతే అందులో స్థితులై ఉంటూ అలాగే ఉండిపోతారు, స్థితి తయారవ్వదు మరియు అలసటతో కష్టమైన మార్గము అనుభవం చేసుకుంటారు, ఎలా చేయాలి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాని ఎవరైతే అనుభవి మూర్తులుగా అవుతారో వారు కఠినమైన పరీక్షలు వచ్చే సమయంలో కూడా తమ స్వమానంలో స్థితులై ఉండడం ద్వారా సహజంగానే వాటిని దాటివేయగలుగుతారు. కావున మీ‌ స్వమానం యొక్క స్మృతిని కలిగించే అనుభవీమూర్తులుగా అయ్యే క్లాసులను చేయించండి. ఎవరైతే మీ సమీప సంపర్కములోకి వస్తారో ఆత్మలకు ఈ అనుభవం చేయించే సహయోగమును ఇవ్వండి, ఇప్పుడు ఆత్మలకు ఈ సహయోగము కావాలి. ఏ విధంగా సాకార బాబా ద్వారా అనుభవీమూర్తులుగా అయ్యే సేవ జరుగుతూ ఉండేదో, అలా ఇప్పుడు మీ సమీపంగా ఏ ఆత్మలైతే వస్తారో వారి నిర్బలతను, బలహీనతలను మీ శక్తుల యొక్క సహయోగం ద్వారా వారిని కూడా అనుభవీమూర్తులుగా తయారుచేయండి. ఏ ఆత్మల కొరకైతే నిమిత్తముగా అయ్యారో ఆ ఆత్మల స్వమానపు  స్థితి యొక్క అనుభవాన్ని పరిశీలించుకోండి, వారు అలా లేకపోతే వారిని అలా తయారుచేయాలి. ఈ విషయంలో కష్టపడాలి. రాజధానికి సమీప సంబంధంలోకి వచ్చే ఆత్మలే బలహీనంగా ఉన్నట్లయితే మరి ప్రజలు ఎలా ఉంటారు? ఇటువంటి బలహీన ఆత్మలు సంబంధంలోకి రాజాలరు. ఇప్పుడు మీ రాజధానిని త్వరత్వరగా తయారుచేయాలి. చివరిలోని ప్రజలు చాలా త్వరగా తయారైపోతారు. కాని, రాజ్య సంబంధంలో, సంపర్కంలోకి వచ్చేవారెవరైతే ఉన్నారో వారిని ఇలా తయారుచేయాలి కదా! ఇటువంటి ధ్యానమును ప్రతి ఒక్క స్థానంపై నిమిత్తమై ఉన్న శ్రేష్ఠ ఆత్మలు ఉంచాలి. నా సంపర్కంలోకి వచ్చే ఎటువంటి ఆత్మ అయినా ఈ స్థితి నుండి వంచితమవ్వకూడదు అన్న ధ్యానమును ఉంచాలి. స్వయములో ఏదైనా శక్తిని స్వయమే అనుభవం చేసుకోకపోతే ఇక ఇతరులకు ఏమి శక్తిని ఇవ్వగలరు? ఆత్మలు ఏదైతే కోరుకుంటారో, సమీపంగా వస్తారో, సమయమునిస్తారో, సహయోగులుగా అయి ఉన్నారో అటువంటి ఆత్మలకు ఇప్పుడు  మాతాపితల ద్వారా పాలన లభించజాలదు కావున, నిమిత్తమై ఉన్న అనుభవీ మూర్తుల ద్వారా ఈ పాలన లభించాలి. ఇటువంటి చెకింగ్ చేసుకున్నట్లయితే ఎంతమంది ఆత్మలు ఈ విధంగా శక్తిశాలిగా వెలువడుతారు? సగభాగం వెలువడుతుంది. ఎవరైతే డైరెక్ట్ పాలనను తీసుకున్నారో వారిలో ఎంతో కొంత అనుభవాల సారము నిండి ఉంది. ఇతరులకు ఈ పాలన జరగడం అవసరము. కావున ప్రతి ఒక్క టీచరు తమ క్లాసులో ఈ ధ్యానమును ఉంచాలి. అచ్ఛా!

Comments