20-09-1971 అవ్యక్త మురళి

* 20-09-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “ఆత్మిక స్నేహులుగా అవ్వండి"

           వ్యక్తము నుండి అవ్యక్తముగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? మీరు ఎవరినైనా అజ్ఞాని నుండి జ్ఞానిగా ఎంత సమయంలో చేయగలరు? ఇప్పటి స్థితి అనుసారంగా ఎంత సమయంలో అలా తయారుచేయగలరు? మీ గురించి ఏమని భావిస్తున్నారు, ఎంత సమయంలో తయారుచేయగలరు? తయారయ్యేవారి విషయం వేరు కాని తయారయ్యేవారు బాగుంటే వారిని మీరు మీ శక్తి అనుసారంగా ఎంత సమయంలో తయారుచేయగలరు? ఇప్పుడు మీ స్పీడును గూర్చి అయితే మీకు తెలుస్తుంది కదా! సమయానుసారంగా ఇప్పుడు అజ్ఞానులను జ్ఞానులుగా తయారుచేసేందుకు కొంత సమయం పడుతుంది. అది కూడా ఎందుకంటే తయారుచేసేవారు తమను తాము అవ్యక్త రూపంగా తయారుచేసుకునేందుకు ఇప్పటివరకు ఇంకా ఎంతో సమయమును తీసుకుంటున్నారు. ఎంతెంతగా తయారు చేసేవారు స్వయమును ఒక్క క్షణంలో వ్యక్తం నుండి అవ్యక్త రూపంలో స్థితులయ్యే అభ్యాసకులుగా అవుతూ ఉంటారో అంతంతగానే తయారయ్యేవారిని కూడా అంతే త్వరగా తయారుచేయగలరు? కొందరు దేవతా ధర్మపు ఆత్మలు కాకపోయినా కాని ఒక్క క్షణంలో ఎవరికైనా ముక్తిని లేక జీవన్ముక్తిని ప్రాప్తింపజేసే వరదానమును ఇచ్చేందుకు నిమిత్తులుగా అయిపోతారు. సర్వాత్మలకు ముక్తి వరదానము బ్రాహ్మణులైన మీ ద్వారానే ప్రాప్తమవుతుంది. ఏ విధంగా ఏదైనా మిషనులో ఏదైనా వస్తువును వేసినప్పుడు ఎటువైపుకు వెళ్ళవలసిన వస్తువు ఆ రూపంగా తయారై అటువైపుకు దానంతట అదే ఒక్క క్షణంలో తయారై వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ బైటకు వస్తూ ఉంటుంది. మిషను స్పీడు వేగంగా ఉన్న కారణంగా ఒక్క క్షణంలో ఎటువైపుది అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది ఏ రూపాన్ని తీసుకోవలసి ఉంటుందో అది ఆ రూపాన్ని తీసుకుంటూ ఉంటుంది, అలాగే ఈ ఆత్మిక మిషనరీ కూడా ఏమైనా తక్కువా? ఈ మిషనరీ ద్వారా మీరు ముక్తి వారికి ముక్తిని, జీవన్ముక్తి వారికి జీవన్ముక్తిని ఇచ్చే వరదానమును ఇవ్వలేరా? మీరు మహాదానులు, మహాజ్ఞానులు, మహాయోగులు కూడా. ఒక్క క్షణంలో మీ జన్మసిద్ధ అధికారమును ప్రాప్తించుకోగలరు అని వ్రాస్తారు, మరి మీరు ఏదో అలా నామమాత్రంగా వ్రాస్తున్నారా లేక చెబుతున్నారా? ఇది యథార్థమైన విషయము, కావుననే మీరు అలా వ్రాస్తున్నారు మరియు చెబుతున్నారు కదా! కావున ఒక్క క్షణంలో ఆత్మకు ముక్తి లేక జీవన్ముక్తి మార్గమును నేర్పించగలరా లేక వరదానమును ఇవ్వగలరా? వరదానమును ప్రాప్తింపజేసుకోవడం, స్వయమును వరదానం ద్వారా సంపన్నంగా చేసుకోవడం వేరే విషయం. కాని మీరైతే వరదానాలను ఇవ్వగలరు కదా! ఒక్క క్షణంలో మీరు వరదానీ మూర్తులుగా అవ్వగలరు కదా! స్వయమును ఒక్క క్షణంలో వ్యక్తం నుండి అవ్యక్తంగా చేసుకోగలరా? ఎంత సమయం అలా చేసుకోగలరు? అల్పకాలికంగా అలా చేసుకోగలుగుతున్నారు. ఆ కారణంగానే తయారయ్యేవారికి కూడా అల్పకాలపు నషా, అల్పకాలపు సంతోషము కలుగుతుంది. వారూ అల్పకాలికంగానే పరివర్తనలోకి వస్తారు. ఏ విధంగా తయారుచేసే మాస్టర్ రచయితలు ఏ విధంగా ఉంటారో అలాగే రచన కూడా అలాగే ఇప్పటివరకు తయారవుతోంది. ఏ విధంగా మీరు బాబాతో అల్పకాలికంగా ఆత్మిక సంభాషణ చేస్తారో, మిలనము యొక్క, మగనము యొక్క, గుణాల యొక్క, స్వరూపం యొక్క అనుభవం చేసుకుంటారో అలాగే రచన కూడా అల్పకాలికంగా మీ మహిమను చేస్తుంది. అల్పకాలికంగా కలుసుకునే, తిరిగే సంబంధమును ఉంచుతారు, స్వయం కూడా అల్పకాలికంగానే అనుభవం చేసుకుంటారు, గుణగానం చేస్తారు లేక అప్పుడప్పుడు ఈ ప్రాప్తించిన అనుభవమును కూడా వర్ణనచేస్తారు, దీనికి కారణము ఏమిటి? మీటింగులో అనేక కారణాలను అంతంచేసే ప్రోగ్రామును తయారుచేసారా? ఈ కారణమును నివారణ చేసినట్లయితే మిగిలిన కారణాలన్నీ అసలు లేనట్లుగనే అంతమైపోతాయి. కావున మూల కారణము ఇదే. సదా బాబా స్నేహము మరియు సహయోగంలో ఉండడం ద్వారా సర్వాత్మలు మీ స్నేహంలో స్వతహాగా సహయోగులుగా అయిపోతారు. ఈ రోజుల్లో ఆత్మలకు సర్వ అల్పకాలిక సుఖశాంతుల సాధనాలు ఉన్నాయి కాని సత్యమైన స్నేహము లేదు. ఆత్మలు స్నేహపు ఆకలితో ఉన్నారు. అన్నము మరియు ధనము శారీరక తృప్తికి సాధనాలైతే ఆత్మిక స్నేహము ద్వారానే ఆత్మ యొక్క తృప్తి జరుగగలదు. అది కూడా అవినాశిగా ఉండాలి. కావున స్నేహులే స్నేహ దానమును ఇవ్వగలరు. స్వయమూ సదా స్నేహులుగా లేకపోతే అన్యాత్మలకు కూడా స్నేహమును సదాకాలికంగా ఇవ్వలేరు. సదా స్నేహులుగా అవ్వడం ద్వారా స్నేహులు స్నేహంలోకి వచ్చి స్నేహుల కోసం సర్వస్వమును త్యాగం చేస్తారు లేక అర్పణ చేసేస్తారు. స్నేహులు దేనినైనా సమర్పణ చేసేందుకు కష్టపడవలసిన అవసరం కాని, ఆలోచించవలసిన అవసరం కాని ఉండదు. కావున ఇన్ని విషయాలనేవైతే వింటారో, అనేక మర్యాదలు లేక నియమాలను వింటూ వింటూ ఇన్ని విషయాలన్నింటినీ చేయవలసి వస్తుంది అని భావిస్తారు, కాని వీటన్నింటినీ చేసేందుకు అన్నింటికన్నా సహజ యుక్తి లేక సర్వ బలహీనతల నుండి ముక్తిగా అయ్యేందుకు యుక్తి - సదా స్నేహులుగా అవ్వండి. ఎవరిపైనైతే స్నేహము ఉంటుందో ఆ స్నేహితుల నిరంతర సాంగత్యం ద్వారా ఆత్మికత యొక్క రంగు సహజంగానే అంటుకుంటుంది.

            ఒక్కొక్క మర్యాదను జీవితంలోకి తీసుకువచ్చే ప్రయత్నము చేసినట్లయితే ఒక్కోచోట కష్టంగా, ఒక్కో చోట సహజంగా అనిపిస్తుంది. ఇదే అభ్యాసంలో లేక ఇదే బలహీనతను బాగు చేసుకోవడంలో సమయమంతా గతించిపోతుంది. కావున ఇప్పుడు ఒక్క క్షణంలో మర్యాదా పురుషోత్తములుగా అవ్వండి. అలా ఎలా అవుతారు? కేవలం సదా స్నేహులుగా అవ్వడం ద్వారా. బాబాకు సదా స్నేహులుగా అవ్వడం ద్వారా, బాబా ద్వారా సదా సహయోగం ప్రాప్తమవ్వడం ద్వారా కష్టమైన విషయం కూడా సహజమైపోతుంది. ఎవరైతే సదా స్నేహులుగా ఉంటారో వారి స్మృతిలో కూడా సదా స్నేహమే ఉంటుంది. వారి ముఖము ద్వారా సదా స్నేహమూర్తి ప్రత్యక్షముగా కనిపిస్తుంది. ఏ విధంగా లౌకికరీతిలో కూడా ఏ ఆత్మ అయినా ఇంకొక ఆత్మ స్నేహంలో ఉంటే, చూసేవారు, తన స్నేహంలో మైమరచిపోయి ఉన్నాయి అని అనుభవం చేసుకుంటారు. అలాంటప్పుడు మరి ఆత్మిక స్నేహంలో నిమగ్నమై ఉన్న ఆత్మల ముఖము ద్వారా స్నేహీమూర్తిని ప్రత్యక్షం చేయలేరా? వారి హృదయము లేక మోహము సదా ఆ స్నేహితునిపై నిమగ్నమై ఉంటుంది. కావున ఒకేవైపు ఆకర్షణ ఉన్న కారణంగా అనేకవైపుల ఉన్న ఆకర్షణ సహజంగానే సమాప్తమైపోతుంది. ఇతరులను వదలండి, అసలు తమపై తమకు ఉన్న ఆకర్షణ అనగా దేహఅభిమానము నుండి, స్వస్మృతి నుండి కూడా ఎల్లప్పుడూ స్నేహులు దూరంగా ఉంటారు. మరి సహజ యుక్తి లేక విధి ఉన్నప్పుడు మరి ఆ సహజ యుక్తి మరియు విధి ద్వారా మీ స్టేజిలోను మరియు స్పీడ్ లోను వృద్ధిని తీసుకురాలేరా? ఒక్క సర్వశక్తివంతుని స్నేహులుగా ఉన్న కారణంగా సదా స్నేహులు సర్వాత్మల స్నేహులుగా స్వతహాగా అయిపోతారు. ఈ రహస్యమును తెలుసుకోవడం ద్వారా రహస్యమును ఎరిగినవారిగా, యోగయుక్తంగా లేక దివ్యగుణాలతో యుక్తియుక్తముగా అయిన కారణంగా ఈ రహస్యమును ఎరిగిన ఆత్మలు సర్మాత్మలను తమతో సహజంగా రాజీపర్చుకోగలరు. ఎప్పుడైతే రహస్యము తెలుసుకున్నవారిగా అవ్వరో అప్పుడు ఎవ్వరినీ రాజీపర్చలేరు. వారి ముఖము లేక మాటల ద్వారా వారి మనస్సులోని భావాన్ని తెలుసుకున్నట్లయితే వారిని సహజంగానే రాజీపర్చగలుగుతారు. కాని అక్కడక్కడా ముఖమును చూసుకుంటూ, వారి మాటలను వింటూ కూడా వారి మనస్సులోని భావం యొక్క రహస్యమును తెలుసుకోని కారణంగా ఇతరులను అసంతుష్టులుగా చేస్తారు లేక  స్వయం అసంతుష్టులుగా అవుతారు. కావున సదా స్నేహుల యొక్క రహస్యమును తెలుసుకొని రాజయుక్తంగా అవ్వండి. అచ్ఛా - భవిష్యత్తులో విశ్వాధిపతులుగా అవ్వాలి, ఇదైతే తెలుసు కదా! కాని ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు విశ్వాధిపతులుగా ఉన్నారా లేక సేవాధారులుగా ఉన్నారా? అచ్ఛా!

Comments