20-05-1971 అవ్యక్త మురళి

 * 20-05-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“విధాత మరియు వరదాతత్వపు స్థితి”

           విధాత మరియు వరదాత - ఈ రెండు గుణాలనూ మీలో అనుభవము చేసుకుంటున్నారా? తండ్రి ఏవిధంగా విధాత మరియు వరదాత కూడానో అలా స్వయాన్ని కూడా రెండు రకాల ప్రాప్తి స్వరూపులుగా భావిస్తున్నారా? ఎంతెంతగా వరదాతగా అవుతూ ఉంటారో అంతగానే వరదాతగా అయ్యి వరదానాలను ఇచ్చే శక్తి ఎక్కువవుతూ ఉంటుంది కావున రెండింటి అనుభవమూ ఉందా లేక కేవలము ఇప్పుడు విధాత పాత్రనే ఉండి, అంతిమంలో వరదాత పాత్ర ఉంటుందా? ఏమనుకుంటున్నారు? (రెండు పాత్రలూ ఇప్పుడు జరుగుతున్నాయని ఒకరు అన్నారు, ఇప్పుడు ఒక పాత్ర జరుగుతోందని ఇంకొకరు అన్నారు) వరదానాలను ఏ ఆత్మకు ఇస్తారు మరియు వరదాతగా ఎవరి కొరకు అవుతారు? ఒకటేమో జ్ఞానాన్ని ఇవ్వటము, ఇంకొకటి వరదాన రూపములో ఇవ్వటము. మరి మీరు విధాతలా లేక వరదాతలా? వరదానాన్ని ఎవరికి ఇస్తారు? విధాతగా అనగా జ్ఞానాన్ని ఇచ్చేవారుగా అయితే అవుతునే ఉంటారు. కానీ ఒక్కోచోట విధాతతో పాటు వరదాతగా కూడా అవ్వవలసి ఉంటుంది. అది ఎప్పుడు? కొందరు ఆత్మలు ధైర్యహీనులుగా, నిర్బలులుగా ఉన్నా కానీ వారు ఇచ్ఛుకులుగా ఉంటారు, మేము ఏదైనా కొంత ప్రాప్తి చేసుకోవాలి అన్న కోరిక కలవారిగా ఉంటారు. అటువంటి ఆత్మల కొరకు జ్ఞానదాతలుగా అవ్వటంతో పాటు మీరు విశేషరూపంలో ఆ ఆత్మకు బలాన్ని ఇచ్చేందుకొరకు శుభ భావనను ఉంచుతారు లేక శుభచింతకులుగా అవుతారు, కావున విధాతతో పాటుగా వరదాతగా కూడా అవుతారు. అదనపు బలాన్ని మీ వైపు నుండి వారికి వరదానరూపంలో ఇస్తారు. కావున వరదానమును కూడా ఇవ్వవలసి ఉంటుంది మరియు దాతగా కూడా అవ్వవలసి ఉంటుంది కావున రెండు రకాల వారుగా అవుతారు. ఈ అనుభవమును ఎప్పుడు చేసారు? భక్తి మార్గములో సాక్షాత్కారము ద్వారా వరదానము ప్రాప్తిస్తుంది, ఎందుకంటే ఆ ఆత్మలు జ్ఞాన ధారణ చెయ్యలేనంత నిర్బలులుగా ఉంటారు, స్వయం పురుషార్థులుగా అవ్వలేరు కావున వరదానాల కోరికను పెట్టుకుంటారు మరియు వరదానరూపంలో వారికి ఏదో కొంత ప్రాప్తిస్తుంది. ఈవిధంగా ఏ బలహీనపు ఆత్మ అయినా మీ ఎదురుగా వచ్చినప్పుడు ఆ ఆత్మల కోరికను చూసి దయ, జాలి గల భావన వస్తుంది. దయాహృదయులై మీ అన్ని శక్తుల సహాయమును ఇచ్చి వారిని పైకి లేపాలి, ఇదే వరదానరూపము. ఇప్పుడు చెప్పండి, రెండూ ఉన్నాయా లేక ఒక్కటి ఉందా? కొందరు ఆత్మల కొరకు మీరు విశేషంగా ప్రోగ్రామును కూడా పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే వారి శక్తితో వారు ధారణను చెయ్యలేరు. శక్తి వరదానమును ఇచ్చే శివ శక్తులు మీరు, కావున జ్ఞానపు విధాతత్వపు సేవ అన్నది ఇప్పుడు ఎక్కువగా జరగాలి అని వినిపించటము జరిగింది. అంతిమంలో జ్ఞానాన్ని ఇచ్చే సేవ తక్కువైపోతుంది, వరదానమును ఇచ్చే సేవ ఎక్కువైతుంది కావున అంతిమ సమయములో వరదానాన్ని తీసుకొనే ఆత్మలలో అదే సంస్కారము మర్జ్ అయిపోతుంది మరియు మర్జ్ అయి ఉన్న అదే సంస్కారము ద్వాపరములో భక్తుల రూపములో ఇమర్జ్ అవుతుంది. కావున ఇప్పుడు జ్ఞానసేవ అనగా జ్ఞాన దాత యొక్క సేవ ఉంది తరువాత వరదాతది ఉంటుంది. అర్థమైందా! మళ్ళీ ఇంత సమయము కూడా ఉండదు, ఆత్మలో అంత శక్తి ఉండదు కావున వరదాతగా అయ్యి వరదానాన్ని ఇచ్చే సేవ జరుగుతుంది. ఇప్పుడు ఈ సేవ తక్కువగా చేస్తుంటారు, మళ్లీ ఎక్కువగా చెయ్యవలసి ఉంటుంది. ఇప్పుడు వారసులుగా తయారుచేసే సేవ ఉంది, తరువాత కేవలము ప్రజలను మాత్రమే తయారుచేసే సేవ ఉంటుంది. కానీ కొద్ది సమయములో ఇంతమంది ప్రజలను తయారుచేసుకొనేందుకు, వరదాతమూర్తులుగా తయారయ్యేందుకు ముఖ్యంగా ఏ అటెన్షన్ ను పెట్టవలసి ఉంటుంది? వరదాతమూర్తిగా అయ్యి కొద్ది సమయములో అనేక ఆత్మలకు వరదానమును ఇవ్వగలగాలి, అందుకొరకు ఏం చెయ్యవలసి ఉంటుంది? వరదాతగా అయ్యేందుకు ముఖ్య పురుషార్థముగా దీనినే చెయ్యవలసి ఉంటుంది, బలిహారమవుతాను అని భక్తి మార్గములో పదే పదే ఏదైతే గాయనము చేసారో ఆ గాయనము ఒకవేళ ప్రాక్టికల్‌గా చేసినట్లయితే ఎవరిపైనైతే బలిహారమవుతారో వారు మీకు కూడా సర్వ వరదానములను ఇచ్చి వరదాతమూర్తిగా తయారుచేస్తారు. కావున ప్రతి సమయము, ప్రతి కర్మలో, ప్రతి సంకల్పములో 'బలిహారమవుతాను' అన్న వచనమునేదైతే తీసుకున్నానో దానిని పాలన చేస్తున్నానా అన్న దాని గురించి ఆలోచించండి. తండ్రి వరదాత మూర్తులు కదా! మీరందరూ కూడా తండ్రి సమానంగా వరదాత మూర్తిగా అవుతారు. మరి అంతగా చెకింగ్ చేస్తారా? ఇతరుల పట్ల ఒక్క సంకల్పము కూడా ఉండకూడదు, ఏ సంకల్పమును చేసినా అందులో తండ్రి పట్ల బలిహారముండాలి, బలిహారమయ్యే రహస్యము నిండి ఉండాలి. ఇటువంటి పరిశీలన చేసుకుంటూ ఉన్నట్లయితే ఇక మాయ ఎదుర్కొనేందుకు సాహసము కూడా చెయ్యకపోగా పదే పదే సమస్కారము చేసి వీడ్కోలు తీసుకుంటుంది. అర్థమైందా!

           కావున అలా తయారయ్యేందుకు అంతటి పరిశీలన అవసరము. రెండవ విషయము, వరదానీమూర్తిగా అయ్యేందుకు ఇతరులకు ఇవ్వగలిగినంతగా అంత స్టాక్ జమ చేసానా అని సర్వ శక్తులను మీలో పరిశీలించుకోవాలి.

           ఒకవేళ జమనే చేసుకోలేదంటే ఇక ఇతరులకేం ఇస్తారు? కావున వరదానీ మూర్తిగా అయ్యేందుకు ఇతరులకు ఇవ్వగలిగినంతగా సర్వ శక్తులను మీలో జమ చేసుకోవలసి ఉంటుంది. అంతటి జమ ఖాతా ఉందా? లేక సంపాదించారు మరియు తిన్నారు... ఇటువంటి రిజల్టు ఉందా? మొదటిది - సంపాదించటము మరియు తినటము. రెండవది - జమ చేసుకోవటము, మూడవది - స్వయాన్ని నడిపించుకోగలిగినంతగా కూడా సంపాదించలేకపోతారు. ఇతరుల సహాయమును తీసుకొని స్వయాన్ని నడిపించుకోవలసి వస్తుంది. మరి మూడవ స్టేజ్ మరియు రెండవ స్టేజ్ లను దాటివేసారా? అదైతే సంపాదించటము మరియు తినటము మరియు మొదటి స్టేజ్ జమ చెయ్యటము. ప్రతిరోజూ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ను చూసుకుంటున్నారా? చాలా పేదవారు యాచించేందుకు వచ్చినట్లయితే వచ్చిన వారందరికీ ఇవ్వగలిగినంతగా జమ చేసుకోవలసి ఉంటుంది. జమ చెయ్యటము నేర్చుకున్నారా? ఎంత జమ చేసుకున్నారు? ఖాతాతోనే తెలుస్తుంది కదా! మీ ఖాతాను చూసుకున్నారా? జమనంతా తీసేసుకొని తింటూ ఉండేవారు కూడా ఉంటారు, తెలియనే తెలియదు. మళ్ళీ అకస్మాత్తుగా ఖాతాను చూసుకున్నట్లయితే ఏమైందన్న సంగతి అప్పుడు అర్థమౌతుంది! అలాంటివారైతే ఇక్కడ లేనే లేరు. అచ్ఛా!

           జమ చేసుకొన్న ఖాతాదారుల విశేష గుణము లేక కర్తవ్యముగా ఏం కనిపిస్తుంది? ఎవరివద్దనైతే జమఖాతా ఉంటుందో వారి ముఖము ద్వారా వర్తమాన నషా మరియు భవిష్య నషా స్పష్టంగా కనిపిస్తుంది అనగా వారి నయనాలు మరియు మస్తకము నుండి ఈశ్వరీయ నషా మరియు నారాయణీ నషా సర్వ ఆత్మలకు స్పష్టంగా కనిపిస్తుంది. జమ చేసుకొనేవారి గుర్తుగా ఇది కనిపిస్తుంది. వారి ముఖమే సేవాయోగ్యముగా ఉంటుంది. ముఖమే సేవను చేస్తూ ఉంటుంది. ఎవరి వద్దనైనా ఎక్కువగానీ లేక తక్కువగానీ జమ ఉన్నట్లయితే అదికూడా వారి ముఖము ద్వారా కనిపిస్తుంది. కావున జమ చేసుకొన్న ముఖము లేక మూర్తి నుండి కూడా తెలుస్తుంది. జడ చిత్రాలను తయారు చేసినప్పుడు వాటిలో కూడా కొన్ని జడ చిత్రాల నుండి అనుభవము కలిగేటట్లుగా కొన్ని చిహ్నాలను చూపిస్తారు. అవైతే మాట్లాడవు కానీ ముఖము లేక మూర్తి నుండి అనుభవమవుతుంది. అలాగే మీ ఈ ముఖము ప్రతి సంకల్పము, ప్రతి కర్మను స్పష్టము చేస్తుంది. కావున 'నా ముఖము నుండి ఏ ఆత్మకైనా నషా మరియు లక్ష్యము కనిపిస్తున్నాయా?' అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏవిధంగా ఏదైనా ఉన్నత కులమునకు చెందిన వారు ఒకవేళ పేదవారిగా అయిపోయినా గానీ వారిలోని ప్రకాశము మరియు నషాలే వీరు ఏదో ఉన్నత కులానికి చెందినవారు అన్నదానిని తెలుపుతాయి. అలాగే ఎవరైతే ఎల్లప్పుడూ ఖజానాలతో నిండుగా సంపన్నంగా ఉంటారో వారి ముఖము నుండి ఎప్పుడూ దాగి ఉండజాలవు. మీ వద్ద దర్పణము ఉందా? ఎల్లప్పుడూ దానిని తోడుగా ఉంచుకుంటారా? ప్రతి సమయమూ దర్పణాన్ని చూస్తూ ఉంటారా? కొందరు ఎలా ఉంటారంటే, వారికి పదే పదే దర్పణాన్ని చూసుకొనే ఆవశ్యకత కూడా ఉండదు. మరి మీరు క్షణక్షణమూ చూసుకుంటారా లేక చూసుకొనే ఆవశ్యకతనే ఉండదా? ఎప్పటివరకైతే మీ పరిశీలన సహజ అభ్యాసమైపోదో అప్పటివరకు పదే పదే పరిశీలించుకోవలసి ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా ఎలా తయారవుతారంటే ఇక పదే పదే చూసుకొనే అవసరమే ఉండదు. ఎల్లప్పుడూ అలంకరింపబడే ఉంటారు. ఎప్పటివరకైతే ఎల్లప్పుడూ అలంకరింపబడి ఉండే ఈ అలవాటు కలుగుతుందో అప్పటివరకు పదే పదే మిమ్మల్ని మీరు చూసుకోవటము మరియు తయారుచేసుకోవటము ఉంటుంది. ఇప్పుడు మాయ ఏ విధంగానైనా, ఏ రీతితోనైనా నా అలంకారమును పాడు చేయజాలదు అని రెండు-నాలుగుసార్లు ఎప్పుడైతే చూసుకుంటారో ఇక మరల పదే పదే చూసుకొనే అవసరము ఉండదు. మరల అప్పుడిక మీ సాక్షాత్కారము ఇతరుల ద్వారా మీకు కలుగుతూ ఉంటుంది. ఇతరులు స్వయం వర్ణన చేస్తారు, గుణగానమును చేస్తారు. అచ్ఛా!

           అందరూ విజయీరత్నాలేనా? విజయీరత్నాలుగా అయితే ఉన్నారు, కానీ విజయమాలను ఎంతగా మీ మెడలో వేసుకొన్నారు అన్నదానిని కూడా చూడవలసి ఉంటుంది. ఈ విజయమాల దినప్రతిదినము పెరుగుతూ ఉంటుంది. కావున పెరుగుతూ ఉందా మరియు ఎంతవరకు పెరిగింది అన్నదానిని కూడా చూడవలసి ఉంటుంది. మరి ఇంత పెద్ద మాలను మీ మెడలో వేసుకొన్నారా? ఈ రోజు నా విజయమాలలో ఎన్ని విజయీరత్నాలు పెరిగాయి? అన్నదానిని కూడా పరిశీలించుకోండి. అచ్ఛా!

           దృష్టి ద్వారా సృష్టి మారుతుంది - ఇది కూడా ఇప్పటి సామెత. ఎంతటి తమోగుణీ లేక రజోగుణీ ఆత్మలు వచ్చినా కూడా, మీ సతోగుణీ దృష్టి ద్వారా వారి సృష్టి, వారి స్థితి మారిపోవాలి, వారి వృత్తి మారిపోవాలి. ముందుముందు చాలామంది ఆత్మలు ఇటువంటి అనుభవమును చేస్తారు. మూడులోకాల సాక్షాత్కారమును చేయించారు అన్న స్మృతిచిహ్నమునేదైతే చూపించారో అలాగే ఇది కూడా ఇప్పటి గాయనము. మీ ఎదుటకు రావటంతోనే మీ దృష్టి ద్వారా వారికి మూడు లోకాలేంటి, మొత్తము జీవితగాథ అంతా తెలిసిపోతుంది. మొదట్లో స్థాపనా సమయంలో జ్ఞాన సేవ ఇంతగా ఉండేది కాదు, దృష్టితోనే పూర్తి సంతృప్తులుగా చేసేసేవారు. అలా అంతిమసమయంలో కూడా జ్ఞాన సేవ చేసే అవకాశము లభించదు. ఆదిలో ఏదైతే ఉండేదో అదే అంతిమంలో మీ ద్వారా జరగాలి. ఏవిధంగా వృక్షపు మొదటి బీజము ప్రత్యక్ష రూపంలో ఉంటుందో, మధ్యలో ఆ బీజము మర్జ్ అయిపోయి మళ్ళీ చివర్లో అదే బీజము ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుందో అలా ఆది ఆత్మలైన మీలో కూడా మొదటి పునాది ఏదైతే పడిందో అదే సేవ అంతిమంలో కూడా అలాగే జరగాలి. అచ్ఛా!

Comments