19-09-1972 అవ్యక్త మురళి

* 19-09-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"బలహీనతలను సమాప్తం చేసేందుకు సాధనం దృఢత్వము"

           అందరూ అచలమైన, స్థిరమైన, అటలమైన స్థితిలో ఉన్నారా? మహావీరుల స్థితి ఏదైతే గాయనం చేయబడ్డదో ఆ కల్పపూర్వపు గాయనము లేక వర్ణన చేయబడిన స్థితిలో స్థితులై ఉన్నారా లేక మీ అంతిమ సాక్షి స్వరూపపు హర్షిత ముఖపు, అతీతమైన మరియు అతీప్రియమైన స్థితికి సమీపంగా వస్తున్నారా లేక ఆ స్థితి ఇప్పుడు దూరంగా ఉందా? ఏ వస్తువైతే సమీపంగా వస్తుందో దాని లక్షణాలు లేక చిహ్నాలు ఏవో ఒకటి కనిపిస్తూ ఉంటాయి. కావున మీరు ఏమి అనుభవం చేసుకుంటున్నారు? ఆ అంతిమ స్థితి సమీపంగా వస్తోందా? సమీపం కన్నా ఎక్కువగా ఇంకే స్థితి ఉంటుంది? బాబాకు సమీపంగా వస్తున్నారు కదా? ఏమి అనుభవం చేసుకుంటున్నారు? సమీపంగా వెళుతున్నారు కదా? నడుస్తూ నడుస్తూ ఆగిపోవడం లేదు కదా? ఏవైనా పరిస్థితులను చూసి ఆగిపోవడం లేదు కదా? పైకి ఎక్కే కళను అనుభవం చేసుకుంటున్నారా? ఆగిపోయే కళ అయితే లేదు కదా? స్థూల యాత్రకు వెళ్ళినప్పుడు కూడా నడుస్తూనే ఉంటారు, ఆగిపోరు. ఇది కూడా ఆత్మిక యాత్రయే కదా! అలాగే ఇందులో కూడా ఆగిపోకూడదు. అలసట లేకుండా స్థిరముగా, అచలముగా అయి ముందుకు నడుస్తూ ఉండాలి, అప్పుడు గమ్యస్థానానికి చేరుకుంటారు. ఈ లక్ష్యాన్ని ఉంచారు కదా? లక్ష్యము దృఢంగా ఉన్నట్లయితే లక్షణాలు కూడా వచ్చేస్తాయి. దృఢత్వం ద్వారా బలహీనతలు సమాప్తమైపోతాయి. దృఢత్వం లేకపోతే అనేక బలహీనతలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కావున స్వయమును మహావీరులుగా భావిస్తున్నారు కదా! మహావీరులు ఎప్పుడూ ఏ బలహీనతను బలహీనతగా భావించరు ఒక్క క్షణంలో దృఢత్వం యొక్క ఆధారంతో ఆ బలహీనతను సమాప్తం చేసేస్తారు. అలాగే అంగద సమానంగా మీ బుద్ధిరూపీ పాదమును ఒక్క బాబా స్మృతిలో స్థిరం చేయాలి, తద్వారా దానిని ఎవరూ చలింపజేయజాలకూడదు. కల్పపూర్వము  కూడా ఇలాగే అయ్యారు కదా! మీకు గుర్తుకు వస్తోందా! కల్పపూర్వం కూడా ఇలాగే అయినప్పుడు అదే పాత్రను మళ్ళీ పునరావృతం చేయడంలో కష్టమేముంది? అనేకసార్లు చేసిన పాత్రను రిపీట్ చేయడం ఏమన్నా కష్టమా? కావున మీరు చాలా చాలా కోటానురెట్ల భాగ్యవంతులు. విశ్వం లోపల ఉన్న ఇంతమందిలో బాబాను తెలుసుకొని తమ జన్మసిద్ధ అధికారమును పొందేవారు ఎంత కొద్దిమంది ఉన్నారు? లెక్కలేనంతమంది లేరు, లెక్కించదగినవారే ఉన్నారు. ఆ కొద్దిమందిలోను మీరు కూడా ఉన్నారు కదా? మరి మీరు కోటానురెట్ల భాగ్యశాలులు కారా? ఇప్పుడు ప్రపంచము అజ్ఞాన నిద్రలో పడుకొని ఉంది మరియు అనేకమందిలో ఉన్న కొద్దిమంది ఆత్మలైన మీరు బాబా యొక్క అధికారులుగా అవుతున్నారు. ఎప్పుడైతే వారందరూ మేలుకుంటారో, మేము కూడా ఎంతో కొంత తీసుకొని వెళ్ళాలి అని ప్రయత్నిస్తారో అప్పుడు మరి ఏం జరుగుతుంది? తీసుకోగలుగుతారా? ఎప్పుడైతే లేట్ అయిపోతారో అప్పుడు ఏం తీసుకోగల్గుతారు? ఆ సమయంలో ఆత్మలైన మీ అందరికీ కూడా తమ శ్రేష్ఠ భాగ్యము ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారమవుతుంది. ఇప్పుడైతే గుప్తంగా ఉంది కదా! ఇప్పుడైతే వారికి గుప్తముగా ఉన్న తండ్రిని గూర్చి తెలియదు అలాగే శ్రేష్ఠ ఆత్మలైన మిమ్మల్ని గూర్చి కూడా తెలియదు, సాధారణంగా భావిస్తారు. కాని, వారు తెలుసుకునే సమయం దూరంగా ఏమీ లేదు. తపిస్తారు, ఏడుస్తారు, పశ్చాత్తాపపడతారు అయినా పొందలేరు. ఆ సమయంలో మీకు స్వయంపై ఎంతటి నషా ఉంటుంది! మేము ముందే గుర్తించి అధికారులుగా అయిపోయాము అని భావిస్తారు, ఇటువంటి సంతోషంలో ఉండాలి. ఏమి దొరికింది మరియు ఎవరు దొరికారు మరియు ఏమేమి జరుగనున్నది... ఇవన్నీ తెలిసి ఉంటూ కూడా సదా అతీంద్రియ సుఖంలో ఊగుతూ ఉండాలి. అప్పుడప్పుడూ పరీక్షలు కదిలించేస్తున్నాయి అన్న స్థితి ఉందా? కదలనైతే కదలడం లేదు కదా, వ్యాకులత చెందడం లేదు కదా, లేక ఒకరి నుండి ఒకరు వింటూ అలజడి చెందే అల వస్తోందా? మళ్ళీ మిమ్మల్ని మీరు సరిచేసేసుకుంటున్నారా? రిజల్ట్ ఎలా ఉందని భావిస్తున్నారు? మధువన నివాసుల రిజల్ట్ ఏమిటి?

           మధువన నివాసులు లైట్ హౌస్ లే కదా? లైట్ హౌస్ ఉన్నతంగా ఉంటుంది మరియు దారిని చూపించేదిగా ఉంటుంది. మధువనం యొక్క డైరెక్షన్ అనుసారంగా అందరూ నడుస్తున్నారు. మరి లైట్ హౌస్ లే కదా! మరియు ఇది ఉన్నతమైన స్థితియే కదా! ఉన్నతమైన పని అని ఏవిధంగా బాబాను గూర్చి అంటారో అలాగే మధువనం అనగా ఉన్నతమైన ధామము కావున పేరు మరియు కార్యము కూడా ఉన్నతంగా ఉంటాయి కదా! ఆ పేరు కూడా మధువనము. మధురత మరియు అనంతమైన వైరాగ్యవృత్తి మధువన నివాసుల గుర్తు కదా! ఒకవైపు మధురత, ఇంకొకవైపు అంతే అనంతమైన వైరాగ్యవృత్తి. వైరాగ్యవృత్తి ద్వారా కేవలం గంభీరమూర్తులుగా ఉంటారు. వాస్తవికమైన గంభీరతలో రమణీకత ఇమిడి ఉంది. అజ్ఞానులు కూడా గంభీర రూపంలో ఉంటే పూర్తిగా గంభీరంగా ఉంటారు. రమణీకత యొక్క నామరూపాలు కూడా ఉండవు. కాని యథార్థ గంభీరత యొక్క గుణము రమణీకతా గుణసంపన్నంగా ఉంటుంది. ఏ విధంగా జనులకు కూడా ఆత్మ అయిన మనము శాంతరూపము అని అర్థం చేయిస్తారో కాని కేవలం శాంతరూపము కాదు ఆ శాంత స్వరూపంలో ఆనందము, ప్రేమ, జ్ఞానము అన్నీ ఇమిడి ఉన్నాయి. కావున ఇటువంటి బేహద్ వైరాగ్యవృత్తి కలవారు మరియు దానితో పాటు మధురత కూడా. ఇదే విశేషత ,మధువన నివాసులది కూడా, కావున బేహద్ వైరాగ్యవృత్తిలో ఉండేవారు ఎప్పుడైనా కంగారు పడతారా, అలజడి చెందగలరా? వారు చలించగలరా? వారు ఎంత జోరుగా చలింపజేసినా కాని బేహద్ వైరాగ్యవృత్తి కలవారు నష్టోమోహా స్మృతి స్వరూపులుగా ఉంటారు. మరి మీరు నష్టోమోహా స్మృతి స్వరూపులుగా ఉన్నారా లేక చూసినప్పుడు కొద్దిగా, ఎంతో కొంత అంశమాత్రమైనా స్నేహమనండి లేక మోహమనండి ఉత్పన్నమవుతుందా? కాని స్నేహం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? అదైతే మీకు తెలుసు కదా! ఎవరిపైనైతే స్నేహం ఉంటుందో వారిపై సహయోగులుగా అయిపోవలసి ఉంటుంది. కాని ఏదో ఆచారవ్యవహారంగా స్నేహరూపాన్ని ప్రకటించడమును స్నేహం అంటారా లేక మోహం అంటారా? మరి ఇందులో మధువన నివాసులు పాసయ్యారా? మధువనం యొక్క వాయుమండలము, మధువన నివాసుల వృత్తి, వైబ్రేషన్లు లైట్ హౌస్ గా ఉన్న కారణంగా నలువైపులా ఒక్క క్షణంలో వ్యాపిస్తాయి. కావున ఈ విధంగా నిమిత్తులుగా భావిస్తూ ప్రతి కర్మను చేస్తున్నారా లేక ఇటువంటి సమయంలో చిన్నపిల్లలుగా అయిపోతారా? రిజల్టు ఏమిటి? ఇదైతే ఇప్పుడు ఏమీ కాదు, ఇంకా భవిష్యత్తులో ఎంతో జరిగేదుంది. అకస్మాత్తుగా జరిగిపోయింది కావుననే కొద్దిగా జరిగింది అని మీరు భావిస్తారు. కాని పరీక్షలైతే అకస్మాత్తుగానే వస్తాయి. పరీక్షలేవీ చెప్పి రావు. ఇటువంటి పరీక్షలు రానున్నాయని ఇంతకుముందు చెప్పే ఉన్నారు. కాని ఆ సమయంలో అకస్మాత్తుగా జరుగుతాయి. కాని అకస్మాత్తుగా జరిగే పరీక్షల్లో కొద్దిగా సంకల్పమాత్రంగా కూడా చలించినట్లయితే అంగద సమానంగా అయినట్లా? ఇప్పటికి ఇంకా ఆ చివరి స్థితి రాలేదా? సమీపంగా కన్నా దగ్గరగా ఉండే స్థితి ఏమిటి అని ఇంతకుముందు అడిగారు కదా! అది సమ్ముఖంగా కనిపించడము. సమీపంగా వస్తూ వస్తూ అదే వస్తువు సమ్ముఖమైపోతుంది. కావున సమీపంగా అనుభవం చేసుకుంటున్నారా లేక పూర్తిగా ఆ స్థితి సమ్ముఖంగా కనిపిస్తోందా? ఈ రోజు ఇది ఉంది, రేపు ఇంకొకవిధంగా అయిపోతుంది. ఈ విధంగా సమ్ముఖంగా అనుభవమవుతోందా? ఏవిధంగా సాకారంలో అనుభవంలో చూశారు కదా! భవిష్య స్వరూపము మరియు అంతిమ సంపూర్ణ స్వరూపము సదా సమ్ముఖంగా స్పష్టరూపంలో ఉండేది కదా! కావున బాబాను అనుసరించండి. ఏవిధంగా బాబా ముందు సంపూర్ణ స్థితి లేక భవిష్యత్ స్థితి సదా తమ ముందు ఉండేదో, అలాగే అనుభవమవుతోందా లేక ఏమో తెలియదు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు అని అనుభవమవుతోందా? అది ఎక్కడ స్పష్టమవుతుంది? ఎనౌన్స్ మెంట్ అయితే అవ్వదు కదా! మహావీర పురుషార్థులెవరైతే ఉంటారో వారి బుద్ధిలో సదా తమ పట్ల స్పష్టంగా ఉంటుంది. స్పష్టంగా కనిపిస్తోందా లేక కొద్దిగా మధ్యలో తెర ఏదైనా అడ్డుగా ఉందా? ఈ రోజుల్లో ట్రాన్స్ పరెంట్ తెరలు కూడా ఉంటాయి కదా! అంతా కనిపిస్తూనే ఉంటుంది కాని తెర అయితే ఉంటుంది. స్పష్టంగా కనిపించడానికి మరియు తెర లోపల ఉండి చూడడానికి తేడా అయితే ఉంటుంది కదా! అలాగే మీ పురుషార్థం అనుసారంగా ట్రాన్స్ పరెంట్ రూపంలో ఇటువంటి తెర అయితే ఏమీ లేదు కదా! అంతా స్పష్టంగానే ఉంది కదా!

           కావున మధువన నివాసులు స్థిరంగా అయితే ఉన్నారు కదా! లేక ఇది ఏమిటి అన్న సంకల్పం ఏదైనా ఉందా? ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నలైతే లేవు కదా! ఏ పాత్రలైతే కొనసాగుతాయో ఆ పాత్రలన్నింటిలోనూ ఎన్నో గుహ్యమైన రహస్యాలు ఇమిడి ఉంటాయి. ఆ రహస్యాలు ఏమిటి? సమయపు సూచనను ఇచ్చేందుకు మధ్యమధ్యలో గంట మ్రోగించి మేల్కొల్పుతారు, కావుననే మీ జడచిత్రాల ముందు గంట మ్రోగిస్తారు. గంట మ్రోగించి మేల్కొల్పుతారు అలాగే గంట మ్రోగించి పడుకోబెడతారు కూడా. అలాగే సమయం యొక్క సూచన కూడా గంట మ్రోగిస్తుంది, ఎందుకంటే ఏవిధంగా శాస్త్రవాదులు ఎంతో ఎక్కువ సమయమును తెలియజేస్తూ అందర్నీ పడుకోబెట్టారు, ఎంతో అజ్ఞాన నిద్రలో అందర్నీ నిదురింపజేశారు, ఎందుకంటే ఇంకా ఎంతో సమయం ఉంది అని భావిస్తారు. కావున ఇక్కడ మళ్ళీ దైవీపరివారపు ఆత్మలెవరైతే ఉన్నారో వారిని నడుస్తూ నడుస్తూ మాయ అనేకరకాల రూపాలు, రంగులు, ఆచారవ్యవహారాల ద్వారా నిర్లక్ష్యులుగా చేసి సమయపు పరిచయం నుండి దూరంగా పురుషార్థపు నిర్లక్ష్యంలో నిదురింపజేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా, ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు వారు విశ్రాంతిగా ఉంటారు. బాధ్యత ఉన్నప్పుడు మేము సమయానికి లేవాలి, ఇది చేయాలి అంటూ అటెన్షన్ ఉంటుంది. ఎటువంటి బాధ్యతా లేనప్పుడు నిర్లక్ష్యులుగా పడుకుంటారు, కావున అది కూడా నిర్లక్ష్యంగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా, ఎవరైనా నిర్లక్ష్యులుగా అయి తేలిక పురుషార్థపు నిద్రరూపీ నషాలో నిమగ్నమైపోతే అప్పుడు ఏం చేయవలసి ఉంటుంది? వారిని కదిలించవలసి ఉంటుంది. వారు లేవాలంటే చలింపజేయవలసి ఉంటుంది. ఎలా, ఎలా అయితే నిద్ర ఉంటుందో అలా, అలా చేయడం జరుగుతుంది. చాలా గాఢమైన నిద్రలో ఉంటే వారిని ఊపవలసి ఉంటుంది. కాని, ఎవరికైనా కాస్త తేలికపాటి నిద్ర ఉంటే వారిని కొద్దిగా కదిలించినా లేచిపోతారు. ఇప్పుడింకా కదిలించలేదు, కొద్దిగా అలజడి ఏర్పడింది. వేరే వస్తువులను నిమిత్తంగా ఉంచి వారిని కదిలిస్తే జాగృతి జరుగుతుంది. ఇది కూడా డ్రామాలో నిమిత్తంగా అయిన సూచనా స్వరూప నిమిత్త ఆత్మలెవరైతే ఉన్నారో వారిని కాస్త కదిలించారు. అలజడిపరిస్తే అందరూ లేచిపోయారు, ఎందుకంటే తేలికపాటి నిదురలోనే ఉన్నారు కదా! మేల్కొనడమైతే మేల్కొన్నారు కాని మేల్కొనడంతో పాటు రెడీగా అయితే అవ్వలేదు కదా! అలా జరుగుతుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా మేల్కొల్పితే వారు ఏమైంది అని కంగారుపడతారు. కావున కొందరు యథార్థరూపంగా మేల్కొంటారు మరికొందరు కంగారు పడ్డ తర్వాత స్పృహలోకి వస్తారు. కాని నిజానికి ఇది జరుగకూడదు. కొద్దిగా కూడా ముఖంపై వ్యాకులత యొక్క రూపురేఖలు రాకూడదు. మాటల్లో తేడా వచ్చినా, ముఖంపై కూడా మార్పు వచ్చినా, మరి దానిని పాసవ్వడం అని అంటారా? నిజానికి ఇదైతే అసలు ఏమీ కాదు, ఇంకా ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పరీక్షలు రానున్నాయి. పరీక్షలు చాలాకాలంగా ఉన్నట్లయితే చదువులో నిర్లక్ష్యం వచ్చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే పరీక్షా రోజులు సమీపంగా వచ్చేస్తాయో అప్పుడు ధ్యానమును ఉంచుతారు. కావున నిజానికి ఇప్పుడు జరిగింది ఏమీలేదు. కాని ఇప్పుడు ఎటువంటి పరీక్షలు రానున్నాయంటే, అవి మీ స్వప్నంలో కాని, సంకల్పంలో కాని ఉండి ఉండవు. ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే, హద్దులోని డ్రామాను సాక్షిగా చూసినట్లుగా అవి బాధాకరం ఉన్నా లేక నవ్వు కలిగించేవిగా ఉన్నా రెండు పాత్రలను సాక్షిగా అయిచూస్తారు. వాటి మధ్య తేడా అయితే ఉండదు ఎందుకంటే వాటిని డ్రామాగా భావిస్తారు. కావున ఇటువంటి ఏకరస స్థితి ఉండాలి. రమణీకమైన పాత్ర ఉన్నా లేక స్నేహీ ఆత్మ యొక్క గంభీరమైన పాత్ర ఉన్నా సాక్షిగా అయి చూడండి. సాక్షీదృష్ట స్థితి ఉండాలి. వ్యాకులత చెందే లేక యుద్ధంచేసే స్థితి ఉండకూడదు. కొందరు వ్యాకులత కూడా చెందరు. యుద్ధంలోనే నిమగ్నమై ఉంటారు. తప్పకుండా ఏదో ఒక కల్యాణమే జరుగుతుంది, కాని సాక్షీదృష్ట స్థితి అయితే పూర్తిగా వేరు. దీనినే ఏకరస స్థితి అని అంటారు. ఎప్పుడైతే ఒక్క బాబా స్మృతిలోనే సదా మగ్నమై ఉంటారో అప్పుడే అది జరుగుతుంది. బాబా మరియు వారసత్వము - మూడోదేమీ ఉండకూడదు. ఇంకే విషయమైనా వింటూ, చూస్తూ లేక ఏ సంబంధ సంపర్కంలోకైనా వస్తూ సాక్షిగా అయి పాత్రను అభినయిస్తున్నట్లుగా భావిస్తారు. బుద్ధి ఆ లగనంలోనే మగనమై ఉండాలి. దీని కొరకు తమను తాము పరిశీలించుకునేందుకే ఈ పరీక్షలు వస్తాయి లేకపోతే అది ఎలా తెలుస్తుంది? ప్రతి ఒక్కరికీ తమ స్థితిని పరిశీలించుకునేందుకు థర్మామీటర్లు లభిస్తాయి. దాని ద్వారా తమ స్థితిని స్వయమే పరిశీలించుకోగల్గుతారు. ఎవరికైనా చెప్పవలసిన అవసరం లేదు, వ్యాకులత చెందనక్కరలేదు. లోతులలోకి వెళ్ళినట్లయితే వ్యాకులత చెందడం ఆగిపోతుంది. లోతులలోకి వెళ్ళని కారణంగానే మీరు వ్యాకులత చెందుతారు.

           ఆరోగ్యం కారణంగా దీదీ, దాదీ ఇరువురూ బాంబే హాస్పిటల్‌లో చేరారు. అదే సమయంలో బాప్ దాదా మధువనంలో విచ్చేశారు.

           మధువన నివాసులను విశేషంగా కలుసుకునేందుకు వచ్చారు. అందులోను శ్రేష్ఠ భాగ్యశాలులుగా ఉన్నారు కదా! ఇతరులు కార్యక్రమము అనుసారముగా వస్తారు కానీ మీరు ఎటువంటి ప్రోగ్రాము లేకుండానే ప్రాప్తించుకుంటారు. మరి అది విశేషతయే కదా! మధువనంలోకి బాప్ దాదా విశేషంగా పరుగు పరుగున వస్తారు. రిజల్టయితే బాగుంది. అదైతే కొద్దిపాటి అలజడి మాత్రమే. ఆ కొద్దిపాటి దానిని అర్థం చేసుకున్నారు కదా! ఇప్పుడు దీనిని కూడా ఇక తీసేయండి. కొద్దిగా లోపం ఉన్నా అది ఫెయిల్ చేసేస్తుంది. చివరి ఫైనల్ పేపర్ లో కొద్దిగా మచ్చ ఏర్పడినా, ఫెయిలైపోతారు. కావున పరిపక్వంగా అయ్యేందుకు మొదటే పరీక్షలు వస్తాయి. మిగిలిన ఇప్పటి రిజల్టు చాలా బాగుంది. అందరూ పరస్పర స్నేహులుగా, సహయోగులుగా మంచిగా ఉన్నారు. సూక్ష్మసేవ యొక్క మిషనరీ ఇప్పుడు ప్రారంభమవుతుంది అని ఇంతకుముందు వినిపించారు కదా! కావున మధువన నివాసుల ద్వారా విశేషంగా సూక్ష్మసేవ యొక్క మిషనరీ ఇప్పుడు ప్రారంభమైపోయింది. ఇతర సేవా కేంద్రాలలో కూడా సూక్ష్మసేవ అయితే ప్రారంభమైంది, అయినా వర్తమాన సమయపు రిజల్ట్ అనుసారంగా ఈ సేవలో నెంబర్ వన్‌గా మధువన నివాసులే ఉన్నారు కావున మీకు అభినందనలు. ఏ విధంగా ఇప్పటివరకు స్నేహము మరియు సహయోగం యొక్క ప్రమాణమును ఇస్తున్నారో అదే ప్రమాణము ఔషధి రూపంలో ఎక్కడికి చేర్చాలనుకుంటే అక్కడికి చేరుతోంది. ఇది మీ శక్తిశాలీ ఔషధి కదా! ఎంతెంతగా మీ శక్తిశాలీ ఔషధి చేరుకుంటూ ఉంటుందో అలా అలా ఆరోగ్యవంతంగా అవుతూ ఉంటారు. ఇంతకన్నా శక్తి శాలీ ఔషధిని పంపుతూ ఉన్నట్లయితే ఒక్క వారంలో కూడా సరి అవ్వగలరు. తీవ్రంగా వెళ్ళే మార్జిన్ అయితే ఉంది. ఇటువంటి మంచి రిజల్టును చూస్తూ లైట్ హౌస్ యొక్క ప్రకాశం నలువైపులా చేరుకుంటోంది. దాని ద్వారా ఇతర స్థానాలలో కూడా లైట్ హౌస్ యొక్క ప్రభావం పడుతోంది. అచ్ఛా!

           ఈ విధంగా సదా పరస్సరంలో ఐకమత్యము మరియు శ్రేష్ఠ గతితో నడిచేవారికి, సదా ఒక్కరి స్మృతిలో ఉండేవారికి, పాండవ సైన్యము మరియు శక్తి సైన్యమునకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments