19-06-1970 అవ్యక్త మురళి

* 19-06-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

త్రిమూర్తి లైట్స్ సాక్షాత్కారం.

 బ్రాహ్మణులను త్రిమూర్తి శివ వంశీయులు అని అంటారు కదా! త్రిమూర్తి అయిన తండ్రి పిల్లలు స్వయము కూడా త్రిమూర్తులు. తండ్రి ఏవిధంగా త్రిమూర్తియో అలా మీరు కూడా త్రిమూర్తులేనా? మూడు రకాల లైట్స్ సాక్షాత్కారమౌతున్నాయా? బ్రాహ్మణులకు సాక్షాత్కారమయ్యే మూడు రకాల లైట్స్ ఏంటో తెలుసా? మీ నుండి లైట్ సాక్షాత్కారమవుతుంది, అది మీకు తెలుసా? త్రిమూర్తి వంశీ త్రిమూర్తి పిల్లల మూడు రకాల లైట్స్ సాక్షాత్కారమవుతాయి, అవి ఏ లైట్స్ ? ఒకటేమో-నయనాల ద్వారా లైటు సాక్షాత్కారము. కంటి జ్యోతులు అని అంటుంటారు కదా! కండ్లు ఎలా కనిపిస్తాయంటే రెండు కండ్లలో రెండు పెద్ద బల్బులు వెలుగుతున్నట్లుగా ఉంటాయి. రెండవది-మస్తకములోని లైటు. మూడవది-తలపై ప్రకాశ కిరీటము. ఈ మూడు లైట్లూ సాక్షాత్కారమయ్యేందుకు ఇప్పుడు ప్రయత్నము చెయ్యాలి. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వారికి ఈ కండ్లలోని బల్బు కనిపించాలి. అంధకారములో నిజమైన వజ్రము మెరిసినట్లుగా జ్యోతే కనిపించాలి. సెర్చిలైటు ఉంటుంది కదా, అది కూడా చాలా ఫోర్స్(ప్రకాశము)తో ఇంకా మంచిగా వ్యాపింపచేస్తుంది. ఈ విధముగా మస్తకములోని లైటు సాక్షాత్కారముంటుంది. తలపై ఉన్న లైటు కిరీటము గురించైతే తెలుసు కదా! ఈ విధంగా ప్రతి ఒక్కరి నుండి లైటు సాక్షాత్కారమవ్వాలి, అప్పుడే వీరు ఫరిస్తాలలాగా ఉన్నారు అని అంటారు. సాకారములో నయనాలు, మస్తకము మరియు తలపై కిరీటముల సాక్షాత్కారము స్పష్టమవుతుంది. నయనాలను చూస్తూ చూస్తూ లైటును చూస్తారు. మీ లైటును చూసి ఇతరులు కూడా లైటులా అయిపోతారు. వారు మనసు ద్వారా లేక స్థితి ద్వారా ఎంత భారంగా ఉన్నాగానీ రావటంతోనే తేలికగా అయిపోవాలి. అటువంటి స్థితిని ఇప్పుడు పట్టుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని చూసిన ఇతరులందరు కూడా వారి స్థితిని ఇలా తయారుచేసుకోవాలి. ఇప్పటినుండే మీ గాయనము వింటారు. ద్వాపరములోని గాయనము పెద్ద విషయమేమీ కాదు. కానీ ఇటువంటి సాక్షాత్కారమూర్తులుగా, సాక్షాత్ మూర్తులుగా తయారవటం ద్వారా ఇప్పటి మీ గాయనమును వింటారు. మీ ఎదురుగా రావటంతోనే కేవలం లైటే కనిపించాలి, అలా అవ్వాలి. మధువనమే ప్రకాశ ధామముగా అయిపోతుంది. వతనములో ఏవిధంగా మొత్తము లైటే కనిపిస్తుందో అలా ఈ స్థూల వతనము లైట్ హౌస్ గా అయిపోతుంది. మీరు చైతన్య లైట్ హౌస్ లుగా అయినప్పుడు ఈ మధువనము కూడా లైట్ హౌస్ గా అయిపోతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ లో చివరి చదువు యొక్క చివరి సబ్జెక్టు ఇదే. థియరీ కోర్సు సమాప్తమైపోయింది. ఇది ప్రాక్టికల్ కోర్సులోని చివరి సబ్జెక్టు. ఈ లాస్ట్ సబ్జెక్టులో చాలా వేగవంతమైన పురుషార్థము చెయ్యవలసి ఉంటుంది. ఇటువంటి స్థితికే గాయనము ఉంది.

బాప్ దాదాతో ఎప్పుడూ వీడ్కోలు ఉండదు. మాయతో వీడ్కోలు ఉంటుంది. బాప్ దాదాతో అయితే మిలనము ఉంటుంది ఈ కొద్ది సమయపు మిలనము సదా మిలనము చేసుకోవటమునకు నిమిత్తముగా అవుతుంది. తండ్రితో గుణములు మరియు కర్తవ్యములు కలవటమే మిలనము. ఈ ప్రయత్నమునే ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. అచ్ఛా!

సంకల్పాలకు బ్రేకు వేసేందుకు ముఖ్యమైన సాధనము ఏమిటి? తెలుసా? ఏ కార్యము చేస్తున్నా, చేసేముందు ఆలోచించి పిదప కార్యమును ప్రారంభించండి. నేను ఏ కార్యమునైతే చెయ్యటానికి వెళ్తున్నానో అది బాప్ దాదా కార్యమేనా? నేను నిమిత్తమును. కార్యము సమాప్తము చేసినప్పుడు, ఏవిధంగా యజ్ఞమును చేసినప్పుడు సమాప్తి సమయములో ఆహుతిని ఇవ్వటం జరుగుతుందో అదేవిధంగా ఏ కర్తవ్యమునైతే చేసారో, ఏ పరిణామమైతే వెలువడిందో దానిని తండ్రికి సమర్పణ, స్వాహా చేసెయ్యాలి, ఇక వేరే సంకల్పములేవీ ఉండకూడదు. నిమిత్తంగా అయ్యి కార్యమును చేసారు. కార్యము సమాప్తమైనప్పుడు స్వాహా చేసేసారు, ఇంక ఏం సంకల్పాలు కలుగుతాయి? ఏవిధంగా అగ్నిలో ఏదైనా వస్తువు వేసినప్పుడు ఇక దాని నామరూపాల అంశము కూడా ఉండదో అలా ప్రతి విషయపు సమాప్తిలో సమర్పణ స్వాహా చెయ్యాలి, అప్పుడు ఇంక మీ బాధ్యత ఏమీ ఉండదు. ఎవరికైతే అర్పణ చేసారో ఇక బాధ్యులు కూడా వారే అవుతారు. మరిక సంకల్పాలెందుకు? ఏవిధంగా ఇంటి పెద్దలకు ఏ కార్యము చేసినా దానిని పెద్దవారికి వినిపించి ఖాళీ అయిపోతారో అలాగే ఏదైనా కార్యము చేసారు, సమాచారము ఇచ్చారు. అయిపోయింది. ఇక అవ్యక్తరూపుని ఎదురుగా ఉంచుకొని దీనిని చేసి చూడండి. ఎవరు ఎంతగా సహయోగిగా అవుతారో వారికి అదనపు సహయోగమును ఇవ్వవలసి ఉంటుంది. ఏవిధంగా మీ ఆత్మ ఉన్నతి గురించి ఆలోచిస్తారో, అదేవిధంగా శుభ భావన, శుభ చింతక మరియు శుభ చింతన రూపములో అధనపు సహాయమును రెండు రూపాలతో  ఏ ఆత్మకైనా విశేష సహయోగముగా ఇవ్వవచ్చు. ఇవ్వాలి. దీని ద్వారా చాలా సహాయము లభిస్తుంది. పేదవారికి అనుకోకుండా కష్టపడకుండానే ప్రాప్తి లభిస్తే ఎలా ఉంటుందో, అలా ఏ ఆత్మ పట్ల అయినా అదనంగా సహయోగము ఇచ్చినట్లయితే ఆ ఆత్మకు కూడా మాకు విశేషమైన సహయోగము లభించింది అని అనుభవమౌతుంది. సాకారరూపములో కూడా ఏ ఆత్మకైనా అదనపు సహయోగమును ఇచ్చే ఋజువును చేసి చూపించారు కదా! ఆ ఆత్మకు స్వయము కూడా అనుభవమయ్యేది. ఈ సేవను చేసి చూపించాలి. మీరు ఎంతెంతగా సూక్ష్మమౌతూ ఉంటారో అంతగా ఈ సూక్ష్మ సేవ కూడా పెరుగుతూ ఉంటుంది. స్థూలముతో పాటుగా సూక్ష్మ ప్రభావము త్వరగా పడుతుంది, అది కూడా సదాకాలము కొరకు. బాప్ దాదా కూడా విశేషమైన సహయోగమును ఇస్తారు. అదనపు సహాయము అనుభవమవుతుంది. శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ. అచ్ఛా!

బాప్ దాదా పిల్లలపై ఎంతగా అవినాశీ స్నేహమును ఉంచుతారో అంతగా పిల్లలు అవినాశీ స్నేహమును ఉంచుతున్నారా? ఈ అవినాశీ స్నేహము ఒక దారము వంటిది, ఇదే 21 జన్మల బంధనమును జోడిస్తుంది. అదీ తెగిపోని స్నేహముగా ఉండాలి, ఎంతగా దారము పక్కాగా ఉంటుందో అంత ఎక్కువకాలం అది ఉంటుంది. ఈ సంగమయుగములోని సమయము 21 జన్మలను జోడిస్తుంది. ఈ సంగమయుగములోని ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క కర్మ 21 జన్మల బ్యాంకులో జమ అవుతాయి. సంకల్పమును కూడా ఇంతటి అటెన్షన్ ను ఉంచి చెయ్యాలి. ఏదైతే చేస్తానో అదే జమ అవుతుంది. మరి ఎంతగా జమ అవుతుంది! ఒక్క సంకల్పము కూడా వ్యర్థముగా పోకూడదు. ఒక్క సంకల్పమైనా వ్యర్థముగా పోయిందంటే జమలో కట్ అవుతుంది. కావున జమ చేసుకోవాలంటే ఒక్కటి కూడా వ్యర్థముగా ఉండకూడదు. ఎంతగా పురుషార్థము చెయ్యవలసి ఉంటుంది! సమయము సంగతి వదలండి, సంకల్పము కూడా వ్యర్థముగా పోకూడదు. ఇప్పుడు పురుషార్థము ఈ సరిహద్దు వరకు చేరుకుంటూ ఉంది. ఏవిధంగా చదువు రోజు రోజుకూ పెరుగుతూ ఉందో, ఇది కూడా అలాంటిదే. పెద్ద క్లాసులో చదువుకుంటున్నారు కదా. అచ్ఛా!

Comments

  1. ఓంశాంతి, ఇప్పుడు ఏ సేవ చేసి చూపించాలి? సంకల్పాలకి బ్రేక్ వేసే ముఖ్య సాధనం ఏమిటి? త్రిమూర్తి వంశీ త్రిమూర్తి పిల్లల మూడు రకాల లైట్స్ యొక్క సాక్షాత్కారం ఏమిటి? అంతిమ చదువు యొక్క అంతిమ సబ్జెక్ట్ ఏమిటి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete

Post a Comment