18-07-1972 అవ్యక్త మురళి

* 18-07-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“బలహీనతల సమాప్తి సమారోహమును చేసేవారే తీవ్ర పురుషార్థులు”

           స్వయమును ఎవర్రడీగా భావిస్తున్నారా? ఎవరైతే ఎవర్రడీగా ఉంటారో వారి ప్రాక్టికల్ స్వరూపము ఎవర్ హ్యాపీగా ఉంటుంది. ఏ విధమైన పరిస్థితిరూపీ పరీక్ష కాని, ప్రాకృతికమైన ఆపదల ద్వారా వచ్చే పరీక్షలు కాని, ఏ విధమైన శారీరక కర్మభోగమురూపీ పరీక్ష వచ్చినా కానీ అన్నిరకాల పరీక్షలలోను పూర్తి మార్కులతో, మంచి మార్కులతో పాసవుతారు. స్వయమును ఈ విధంగా ఎవర్రడీగా భావిస్తున్నారా? ఎవర్రడీకి చిహ్నమైన ఎవర్ హ్యాపీ స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? ఏ ఘడియలో ఏ పరీక్ష వచ్చినా సిద్ధముగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నారా? అలా ఎవర్రడీగా ఉన్నారా? శ్రేష్ఠ ఆత్మలైన మీకొరకు మీద్వారా నెంబర్ వారీగా వారసత్వాన్ని పొందే ఇతర ఆత్మలెవరైతే ఉన్నారో వారికొరకు ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. సమయపు వేగము తీవ్రముగా ఉంది. ఏ విధంగా సమయము ఎవరికొరకు ఆగదో, నడుస్తూనే ఉంటుందో అలాగే స్వయము కూడా మాయ యొక్క ఎటువంటి అవరోధము కారణంగానైనా ఆగిపోవడం లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మాయ యొక్క సూక్ష్మమైన లేక స్థూలమైన విఘ్నాలు ఏవైతే వస్తాయో లేక మాయ యొక్క యుద్ధాలేవైతే జరుగుతాయో వాటిని ఎదుర్కోవడంలో ఒక్క క్షణములో తమ శ్రేష్ఠ స్వమానంలో స్థితుల్లో ఉన్నట్లయితే మాయరూపీ శత్రువుపై గురి కూడా సరిగ్గా ఉంటుంది. శ్రేష్ఠమైన నషా లేకపోతే గురి ఏర్పడని కారణంగా వ్యాకులత చెందుతారు. ఇప్పుడు అటువంటి వ్యాకులత ఉంటుందా? ఇప్పటివరకు కూడా ఏదో ఒకరకమైన వ్యాకులత ఉన్నట్లయితే ఇతర ఆత్మల వ్యాకులతను ఎలా అంతం చేయగలరు? ఇలా వ్యాకులతను అంతం చేసేవారిగా ఉన్నారా లేక స్వయమే వ్యాకులత చెందుతూ ఉంటారా? భట్టీలేవైతే చేస్తారో వాటి సమాప్తి సమారోహము లేక పరివర్తన సమారోహమును జరుపుకుంటారు. అలాగే ఈ బేహద్ భట్టీ ఏదైతే కొనసాగుతుందో అందులో బలహీనతల యొక్క సమాప్తి సమారోహము లేక పరివర్తన సమారోహమును ఎప్పుడు జరుపుకుంటారు? దీని తారీఖునేదైనా ఫిక్స్ చేశారా? (డ్రామా చేయిస్తుంది). డ్రామా అయితే సర్వాత్మలను పురాతన ప్రపంచం నుండి సమాప్తి సమారోహము చేయిస్తుంది. కాని, తీవ్ర పురుషార్థులగు  శ్రేష్ఠ ఆత్మలైన మీరు ముందే బలహీనతల సమాప్తి సమారోహమును జరుపుకోవాలి అంతేకాని మీరు కూడా ఇతర ఆత్మలతో పాటు చివరిలో చేయడం కాదు. ఏ విధంగా ఇతర సెమినార్లు మొదలైనవి చేస్తారో, వాటి డేట్ ను ఫిక్స్ చేస్తారో దాని అనుసారంగానే ఏర్పాట్లు చేస్తారో మరియు ఆ కార్యమును సఫలం చేసి సంపన్నం చేస్తారో అలా ఈ లోపాలను అంతం చేసే సెమినార్ తారీఖును నిర్ణయించలేరా? ఈ సెమినార్ జరగడం సంభవమేనా? ఏవిధంగా ఏదైనా యజ్ఞమును రచించేటప్పుడు మధ్య మధ్యలో ఆహుతులను వేస్తూనే ఉన్నా, అంతిమంలో అన్నింటినీ కలిపి సంపూర్ణ ఆహుతిని వేస్తారు. మరి అదేవిధంగా అందరూ పరస్పరంలో కలిసి సంపూర్ణ ఆహుతిని వేయగలరా? సర్వబలహీనతలను స్వాహా చేయలేరా? ఎప్పటివరకైతే అందరూ కలిసి సంపూర్ణ ఆహుతిని వేయరో, అప్పటివరకు మొత్తం విశ్వపు వాయుమండలము లేక సర్వాత్మల వృత్తులు లేక వైబ్రేషన్లు ఎలా పరివర్తన అవుతాయి మరియు మీరందరూ విశ్వపరివర్తన యొక్క లేక విశ్వనవనిర్మాణపు బాధ్యతనేదైతే తీసుకున్నారో అది ఎలా పూర్తవుతుంది? కావున మీ బాధ్యతలను పూర్తిచేసేందుకు లేక మీ కార్యమును పూర్తిగా సంపన్నం చేసేందుకు సంపూర్ణ ఆహుతిని వేయవలసిందే. ఈ విధంగా స్వయమును ఎవర్రడీగా చేసేందుకు ఎటువంటి యుక్తిని ధారణ చేసినట్లయితే సహజముగానే బలహీనతల నుండి ముక్తులైపోతారు? యుక్తులైతే ఎన్నో లభించాయి. అయినా ఈ రోజు ఇంకొక యుక్తిని తెలియజేస్తున్నారు.

                  అందరికన్నా ఎక్కువగా ఎవరి స్మృతి చిహ్నాలు తయారవుతాయి? అనేకరకాల సృతిచిహ్నాలు ఎవరివి తయారవుతాయి బాబావా లేక పిల్లలవా? బాబా స్మృతి చిహ్నమైతే ఒకే రూపంలో తయారవుతుంది. కాని, మీ సృతి చిహ్నాలు అనగా శ్రేష్ఠ ఆత్మల స్మృతి చిహ్నాలు అనేక రూపాలు మరియు ఆచార వ్యవహారాల అనుసారంగా తయారై ఉన్నాయి. శ్రేష్ఠ ఆత్మలైన మీ భిన్న భిన్న కర్మల స్మృతి చిహ్నాలు కూడా తయార ఉన్నాయి. కావున బాబా కన్నా కూడా ఎక్కువగా అనేకరకాలైన స్మృతి చిహ్నాలు తయారై ఉన్నాయి. అది ఎలా? మీ ప్రత్యక్ష శ్రేష్ఠ కర్మల యొక్క, శ్రేష్ఠ స్థితి యొక్క స్మృతి చిహ్నాలే తయారయ్యాయి కదా! కావున ఏ సంకల్పాలు లేక కర్మలనైతే చేస్తారో లేక వచనాలనైతే మాట్లాడతారో ఆ ప్రతి వచనమును మరియు కర్మను, మా స్మృతి చిహ్నము తయారయ్యే విధంగా ఉన్నాయా అని పరిశీలించుకోండి. ఏ కర్మలనైతే స్మృతిలో ఉంటూ చేస్తారో అవే స్మృతి చిహ్నాలుగా అవుతాయి. ఏదైనా వస్తువును పాతేటప్పుడు, జెండాను పాతడానికి దాని పునాదిని వేసేటప్పుడు, దీన్ని మంచిగా పాతాలి అని అంటారు కదా! అలాగే స్మృతిలో చేసే పనులు సదాకాలికంగా స్మృతి చిహ్నాలుగా అయిపోతాయి. ప్రపంచం ముందు ఏదైనా వస్తువును పెట్టేటప్పుడు దానిని ఎంత సుందరంగా మరియు స్పష్టంగా తయారుచేస్తారు! సాధారణమైన వస్తువును ఎవ్వరిముందూ ఉంచరు. ఏదైనా విశేషత ఉంటే అప్పుడే దానిని ఎవరి ముందైనా ఉంచుతారు. ఇప్పటి మీ ప్రతి కర్మ లేక ప్రతి వాక్యము విశ్వము ముందు స్మృతిచిహ్న రూపంలో రానున్నాయి. ఇటువంటి అటెన్షన్‌ను ఉంచుతూ లేక ఇటువంటి స్మృతిని ఉంచుతూ ప్రతి కర్మను లేక మాటను మాట్లాడండి, అవి స్మృతి చిహ్నముగా అయ్యేందుకు యోగ్యంగా ఉండాలి. స్మృతి చిహ్నముగా తయారయ్యేందుకు యోగ్యంగా లేకపోతే ఆ కర్మలు చేయకండి. ఏ వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థమైన మాటలు లేక సాధారణ కర్మలేవైతే జరుగుతాయో వాటి స్మృతి చిహ్నాలు తయారవుతాయా? అన్నది సదా గుర్తుంచుకోండి. స్మృతి చిహ్నాలను తయారు చేసేందుకు స్మృతిలో ఉంటూ ప్రతి కర్మనూ చేయండి. సాకార బాబాను చూశారు కదా! వారు ప్రతి కర్మనూ స్మృతిలో ఉంటూ చేశారు, కావుననే ఆ కర్మలు నేడు మీ అందరి హృదయాలలో స్మృతి చిహ్నాలుగా అయిపోయాయి కదా! అలాగే మీ కర్మలను కూడా విశ్వం ముందు స్మృతి చిహ్న రూపాలుగా చేయండి, ఇదైతే సహజమే కదా! ఈ అనేకరకాలైన స్మృతి చిహ్నాలు మనకు చెందినవే అన్న నిశ్చయము ఉంది, కావున చేసిన, అనేకసార్లు చేసి ఉన్న శ్రేష్ఠకర్మలు లేక స్మృతిచిహ్న స్వరూపాలను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయడంలో ఏమైనా కష్టమనిపిస్తుందా? కల్పకల్పము చేసినవాటిని కేవలం రిపీట్ చేయాలి. కావున మాస్టర్ త్రికాలదర్శులుగా అయి మీ కల్పపూర్వపు స్మృతి చిహ్నాలను మీ ముందు ఉంచుకొని మళ్ళీ కేవలం రిపీట్ చేయండి. ఈ స్మృతి యొక్క పురుషార్థంలో సదా ఉంటూ వచ్చారు, మరి ఇప్పుడు కష్టమేముంది? మాయ ఇప్పటివరకు కూడా ఈ స్మృతిలో తాళం వేస్తోందా? ఎప్పుడైతే తాళం వేసేస్తుందో మరి అది ఎలా తయారుచేసేస్తుంది? బే-తాళ(తాళంచెవి లేకుండా). అందరి తాళాలు తెరిచేవారు కూడా తాళంచెవి లేనివారిగా అయిపోతారు. ఈ స్మృతికి తాళం ఎందుకు వేయబడుతుంది? తమ అదృష్టము(భాగ్యము)ను మర్చిపోతారు. కావుననే తాళం పడిపోతుంది. అదృష్టమును చూసుకున్నట్లయితే ఎప్పుడూ తాళం పడజాలదు. కావున అదృష్టానికి తాళంచెవి ఏమిటి? మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించండి. మీరు లవ్లీగా కూడా ఉన్నారు మరియు లక్కీగా కూడా ఉన్నారు. ఒకవేళ అదృష్టాన్ని మరిచిపోయి కేవలం లవ్లీగా అయిపోయినా అసంపూర్ణంగా మిగిలిపోతారు. లవ్లీగాను ఉన్నాను మరియు లక్కీగాను ఉన్నాను. ఈ రెండూ సృతిలో ఉండడం ద్వారా ఎప్పుడూ మాయ యొక్క తాళము వేయబడజాలదు. కావున మీ కల్పపూర్వపు స్మృతి చిహ్నాలను మళ్ళీ స్మృతిలో ఉంచుకొని రిపీట్ చేయండి. ఏవైనా స్మృతి చిహ్నాలను యుక్తియుక్తముగా తయారుచేయకపోతే అటువంటి స్మృతి చిహ్నాలను చూసి వీటిని యుక్తీయుక్తముగా తయారుచేయలేదు అన్న సంకల్పము కలుగుతుంది. దేవీలు లేక శక్తుల చిత్రాలను యుక్తీయుక్తముగా తయారుచేయకపోతే వాటిని చూస్తూ కూడా ఇవి సరిగ్గా లేవు అని అందరికీ సంకల్పం కలుగుతుంది. అలాగే మీ కర్మలను చూసుకోండి. మీ ప్రతి సమయం యొక్క రూపమును లేక నషాను ఈ సమయంలో నా రూపము మరియు నషా యొక్క స్మృతి చిహ్నము ఎలా తయారవుతుంది అని పరిశీలించుకోండి. యుక్తీయుక్తమైన స్మృతిచిహ్నము తయారవుతుందా? ఎప్పుడైతే యుక్తీయుక్తమైన స్మృతిచిహ్న చిత్రము తయారవుతుందో అప్పుడు ఆ చిత్రానికి కూడా ఎంతటి విలువ ఉంటుంది! కావున మా అన్ని సమయాలలోని అన్ని చిత్రాలకు విలువ ఉందా అని పరిశీలించుకోండి. అలా లేకపోతే స్మృతిచిహ్న చిత్రము కూడా విలువైనదిగా తయారవ్వజాలదు. అర్థమైందా? మీ ప్రతి సంకల్పమునకు చరిత్ర రూపంలో స్మృతి చిహ్నాలు తయారయ్యే ఇటువంటి సమయము సమీపంగా వచ్చేసింది. మీ ఒక్కొక్క మాట సర్వాత్మల నోటి నుండి గాయనమవుతుంది. కావున స్వయమును ఇటువంటి పూజ్యనీయులుగా మరియు గాయన యోగ్యులుగా భావిస్తూ ప్రతి కర్మను చేయండి. అచ్ఛా!

              ప్రతి కర్మను స్మృతిలో ఉంటూ సదా స్మృతి చిహ్నముగా తయారుచేసే లవ్లీ మరియు లక్కీ సితారలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.                          

Comments