18-07-1971 అవ్యక్త మురళి

* 18-07-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "విల్ పవర్ ద్వారా కంట్రోలింగ్ పవర్"

            స్వయం లోపల విల్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ ఈ రెండు శక్తులను అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే మీ పురుషార్థం కొరకు లేక ఇతర ఆత్మల ఉన్నతి కొరకు ఈ రెండు శక్తులు ఎంతో అవసరము మరియు స్వయంలోనే కంట్రోలింగ్ పవర్ మరియు విల్ పవర్ లేకపోతే ఇతరులకు కూడా వాటిని ఇవ్వగలిగే శక్తి రాజాలదు. ఇతరుల వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ నడవడిక ఏదైతే ఇప్పటివరకు కొనసాగుతూ ఉంటుందో దానిని కంట్రోల్ చేయలేరు, విల్ పవర్ ఉండదు. విల్ పవర్ అనగా సంకల్పాల ద్వారా, వాణి ద్వారా లేక కర్మల ద్వారా ఏదైతే చేశారో వాటన్నింటినీ బాబా ముందు విల్లు చేయండి అనగా అర్పించేయండి. ఏ విధంగా భక్తిమార్గంలో ఏదైతే చేస్తారో, తింటారో, నడుచుకుంటారో అప్పుడు కేవలం నామమాత్రంగా ఈశ్వరార్పణం అని అంటారు. కాని ఇక్కడ ఏదైతే చేశారో దానిని కళ్యాణకారి అయిన బాబా కళ్యాణ కర్తవ్యం పట్ల విల్లు చేశాము అని ఇప్పుడు భావిస్తారు. కావున ఎంతెంతగా ఉన్నదానిని అర్పణ చేస్తూ ఉంటారో అంతగా అర్పణమయ దర్పణముగా అయిపోతారు. దేనినైతే అర్పణ చేస్తారో, ఎవరికోసమైతే అర్పణ చేస్తారో ఆ సాక్షాత్కారము ఇటువంటి అర్పణ ద్వారా అందరికీ స్వతహాగానే కలుగుతుంది. కావున అర్పణ చేసి దర్పణముగా అయ్యే పురుషార్థము ఏమిటంటే - విల్ పవర్ కావాలి మరియు రెండవది - కంట్రోలింగ్ పవర్ కావాలి. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మిమ్మల్ని మీరు అనగా మీ స్థితిని స్థిరం చేసుకోగలగాలి. కూర్చొని మీ స్థితిని స్థిరం చేసుకునేందుకు బాబా స్మృతిలో కూర్చున్నా, అందుకు బదులుగా వ్యర్థ సంకల్పాలు లేక అలజడి స్థితి తయారైపోకూడదు. ఇది కంట్రోలింగ్ పవర్ కాదు. ఒక్క క్షణం కన్నా తక్కువ సమయంలోనే మీ సంకల్పాలను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నిలుపగలగాలి. స్వయం యొక్క స్థితిలో స్థితిని నిలుపుకోలేకపోతే ఇతరులను ఆత్మిక స్థితిలో ఎలా నిలుపగలరు? ఇందుకోసం మీ స్థితి మరియు స్టేటస్ - రెండింటి స్థితీ సదా ఉండాలి, అప్పుడే లక్ష్యపు సిద్ధిని పొందగలుగుతారు. కావున విల్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ ఈ రెండింటి కొరకు ముఖ్యంగా దేనిని గుర్తుంచుకోవాలి? దాని ద్వారా రెండు శక్తులు వచ్చేయాలి. ఈ రెండు శక్తుల పురుషార్థానికి ఒక్కొక్క పదములోనే సాధనాలు ఉన్నాయి. కంట్రోలింగ్ పవర్ కొరకు ఎల్లప్పుడు మహాన్ అంతరము అన్నది ముందు ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్ గానే ఏదైతే శ్రేష్టంగా ఉంటుందో అటువైపుకు బుద్ధి వెళుతుంది మరియు ఏదైతే వ్యర్థముగా అనుభవమవుతుందో అటువైపుకు బుద్ధి ఆటోమేటిక్ గానే వెళ్ళదు. కావున ఏ కర్మలు చేసినా శుద్ధాశుద్ధాలు, సత్యాసత్యాలు, స్మృతి విస్మృతులలో తేడా ఏముంది? వ్యర్థ మరియు సమర్థ సంకల్పాలలో తేడా ఏముంది? అంటూ అన్ని విషయాలలో ఉన్న మహాన్ అంతరమును పరిశీలిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఇతర వైపులలో బుద్ధి ఆటోమేటిక్ గానే కంట్రోలైపోతుంది మరియు విల్ పవర్ పొందేందుకు మహామంత్రము అన్న పదము ఉంది. మహాన్ అంతరము మరియు మహా మంత్రము అన్న ఈ రెండు పదాలను గుర్తుంచుకున్నట్లయితే బుద్ధిని కంట్రోల్ చేసుకునేందుకు కష్టపడవలసిన అవసరం ఉండదు, అది సహజమైపోతుంది. మొదట పరిశీలించండి అనగా అంతరమును గూర్చి ఆలోచించండి, ఆ తరువాత కర్మ చేయండి. ఈ అంతరమును చూడరు, నిర్లక్ష్యంతో నడుస్తూ ఉంటారు. కావుననే కంట్రోలింగ్ పవర్ ఏదైతే రావాలో అది రాదు, కాని మహామంత్రము ద్వారా విల్ పవర్ దానంతట అదే వచ్చేస్తుంది. ఎందుకంటే మహామంత్రము అంటేనే బాబా స్మృతి అనగా బాబా తోడు, బాబా కర్తవ్యము యొక్క తోడు, బాబా గుణాల తోడులో ఎల్లప్పుడు మీ బుద్ధిని స్థిరం చేసుకోవాలి. కావున మహామంత్రము బుద్ధిలో ఉండడం ద్వారా అనగా బుద్ధి కనెక్షన్ పవర్ హౌస్ తో ఉన్న కారణంగా విల్ పవర్ వచ్చేస్తుంది. కావున మహామంత్రము మరియు మహాన్ అంతరము - ఈ రెండింటి స్మృతీ ఉన్నట్లయితే రెండు శక్తులూ సహజంగా రాగలవు. కావున మహామంత్రమును మరియు మహాన్ అంతరమును రెండింటినీ స్మృతిలో ఉంచుకుని జ్ఞాననేత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఎంతటి సఫలత లభిస్తుందో చూడండి! హంస కర్తవ్యము ఏమిటో వినిపించాము కదా! అది ఎల్లప్పుడు గులకరాళ్ళకు మరియు రత్నాలకు ఉన్న మహాన్ అంతరమును గుర్తిస్తుంది. అలాగే బుద్ధిలో సదా మహాన్ అంతరము అన్న పదము గుర్తున్నట్లయితే మహామంత్రము కూడా సహజంగానే గుర్తుకువస్తుంది. ఏదైనా శ్రేష్ఠమైన వస్తువును తెలుసుకున్నట్లయితే క్రింద ఉన్న వస్తువు నుండి స్వతహాగానే దూరమైపోతారు. కాని తేడా తెలియని కారణంగా మంత్రాన్ని కూడా మర్చిపోతారు మరియు జ్ఞాన యంత్రమేదైతే లభించిందో అది పూర్తిగా సఫలమవ్వజాలదు. కావున ఇప్పుడు ఏం చేస్తారు? కేవలం రెండు పదాలను గుర్తుంచుకోవాలి. హంసగా అయి చేస్తూ ఉండండి. అర్థమైందా? ఏవిధంగా బాప్ దాదాల మూడు రూపాలు ముఖ్యమైనవో, సర్వసంబంధాలు ఉన్నా కూడా మూడు సంబంధాలు ముఖ్యంగా ఉన్నాయి కదా! అలాగే రోజంతటిలో మీ ముఖ్యమైన మూడు రూపాలు మీకు గుర్తుండాలి. బాల్యావస్థ, యువావస్థ, వృద్ధావస్థలు ఉంటాయి కదా, ఆ తరువాత మృత్యువు జరుగుతుంది, ఈ చక్రము కొనసాగుతుంది కదా! కావున రోజంతటిలో ఏ మూడు రూపాలు గుర్తున్నట్లయితే స్మృతి కూడా సహజంగా ఉంటుంది మరియు సఫలత కూడా ఎక్కువగా లభిస్తుంది? ఏ విధంగా బాబా యొక్క ఈ మూడు రూపాలను వర్ణన చేస్తారో అలా మీ మూడు రూపాలు ఏమిటి? ఉదయముదయమే అమృతవేళ లేచినప్పుడు, స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు లేక ఆత్మిక సంభాషణ జరుపుతున్నప్పుడు ఆ సమయంలోని రూపము ఎలా ఉంటుంది? బాలకుల నుండి యజమానులుగా ఉండే స్వరూపము. ఆత్మిక సంభాషణ జరిపేటప్పుడు బాలక రూపము గుర్తుంటుంది కదా! మరియు ఎప్పుడైతే స్మృతి యాత్ర యొక్క అనుభవజ్ఞులుగా అయిపోతారో అప్పుడు యజమానత్వపు రూపము ఏర్పడుతుంది. కావున అమృతవేళ బాలకుల నుండి యజమానులుగా అయ్యే రూపము. ఆ తరువాత ఇంకే రూపము ఉంటుంది? ఈశ్వరీయ విద్యార్థి జీవితము. ఆ తరువాత మూడవ రూపము - సేవాధారీ రూపము. ఈ మూడు రూపాలను రోజంతటిలో ధారణ చేస్తూ, కర్తవ్యము చేస్తూ నడుస్తున్నారా? ఈ మూడు రూపాలు ఉంటాయి, మళ్ళీ రాత్రి ఇంకే రూపము ఉంటుంది? అంతిమంలో రాత్రి పడుకునే సమయంలో స్వయమును పరిశీలించుకునే స్థితి ఉంటుంది మరియు దానితో పాటు స్వయమును వాణి నుండి అతీతంగా తీసుకువెళ్ళే స్థితి కూడా ఉంటుంది. ఆ స్థితిలో స్థితులై ఒకరోజును సమాప్తం చేస్తారు మళ్ళీ ఇంకొక రోజు ప్రారంభమౌతుంది. ఈ స్థితి ఎలా ఉండాలంటే నిద్రలో ఈ ప్రపంచపు ఏ విషయము, ఏ శబ్దము, ఏ విధమైన ఆకర్షణా కలుగదో, మంచి నిద్రలో ఉన్నప్పుడు ఏ ఆకర్షణా ఉండదో అలా ఉండాలి. స్వప్నాల విషయము వేరే విషయము. ఈ విధంగా నిదురించే ముందు ఇటువంటి స్థితిని తయారుచేసుకుని ఆ తరువాతే పడుకోవాలి. అంతిమంలో ఆత్మలు ఏ సంస్కారాలనైతే తీసుకువెళతాయో అవి మెర్జ్ అయిపోతాయి, మళ్ళీ అవే సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి. ఇదేవిధంగా ఎప్పుడైతే పగలును సమాప్తం చేస్తారో అప్పుడు సంస్కారాలు అతీతంగా మరియు ప్రియముగా అయిపోతాయి కదా! ఇవే సంస్కారాలతో పడుకోవడం ద్వారా మళ్ళీ మరుసటి రోజు కూడా ఈ సంస్కారాల సహాయము లభిస్తుంది. కావున రాత్రివేళలో రోజును సమాప్తం చేసేటప్పుడు స్మృతి అగ్నితో లేక స్మృతి శక్తితో పాత ఖాతాలను సమాప్తం చేసెయ్యాలి లేక అంతం చేసెయ్యాలి, లెక్కాపత్రాలను తీర్చేసుకోవాలి. ఏ విధంగా వ్యాపారులు కూడా తన లెక్కాచారాలను తీర్చుకోకపోతే ఖాతాలు పెరిగిపోతాయి మరియు ఋణగ్రస్తులుగా  అయిపోతారు. అప్పును భారము అని అంటారు. అదేవిధంగా రోజంతటిలో చేసిన ఖర్మల ఖాతాను మరియు సంకల్పాల ఖాతా ఏదైతే మిగిలి ఉందో దానిని తీర్చేసుకోండి. మరుసటి రోజు కొరకు ఋణం రూపంలో ఏదీ ఉంచుకోకండి లేకపోతే అవి భారము రూపంలో బుద్దిని బలహీనం చేసేస్తుంది. రోజు  మీ లెక్కాచారాలను తీర్చేసుకొని క్రొత్త రోజును, క్రొత్త స్మృతిని ఉంచుకోవాలి. ఈవిధంగా ఎప్పుడైతే మీ  కర్మలు మరియు సంకల్పాల ఖాతాను క్లియర్ గా ఉంచుకుంటారో అప్పుడు సంపూర్ణంగా లేక  సఫలతామూర్తులుగా అయిపోతారు. మీ ఖాతాలనే తీర్చుకోలేకపోతే ఇతరుల కర్మబంధనాలను, ఇతరుల  లెక్కా చారాలను ఎలా తీర్చుకునేలా చేయగలరు? కావున రోజూ రాత్రికి మీ రిజిస్టర్ ను శుభ్రం  చేసుకోవాలి. ఏదైతే జరిగిందో దానిని యోగాగ్నిలో భస్మం చేయండి. ఏ విధంగా ముళ్ళను భస్మం చేసి వాటి నామరూపాలు కూడా లేకుండా చేస్తారో అదేవిధంగా మీ జ్ఞాన శక్తి మరియు స్మృతి శక్తి, విల్ పవర్  మరియు కంట్రోలింగ్ పవర్ తో మీ రిజిష్టర్‌ను రోజూ శుభ్రంగా ఉంచుకోవాలి, జమ అవ్వకూడదు. ఒక్కరోజు చేసిన వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ కర్మల లీకేజ్ కూడా మరుసటిరోజు ఉండకూడదు అనగా ఋణాన్ని ఉంచుకోకూడదు. గతించిందేదో గతించిపోయింది. ఫుల్ స్టాప్. ఈ విధంగా రిజిష్టర్‌ను శుభ్రంగా ఉంచుకునేవారు లేక లెక్కా పత్రాలను తీర్చుకునేవారు సహజంగా సఫలతామూర్తులుగా అవ్వగలుగుతారు. అర్థమైందా? రోజంతటినీ పరిశీలించుకునేవారిగా అవ్వాలి.

            స్వదర్శనచక్రము లోపల ఇది ఒక్క రోజు యొక్క చక్రము. ప్రారంభంలో డ్రిల్లు చేసేటప్పుడు చక్రము లోపలి చక్రములోకి వెళ్ళేవారు, మళ్ళీ లోపలి నుండి బైటకు వచ్చేవారు కదా! మరి ఇది అనంతమైన 5,000 సంవత్సరాల చక్రము మళ్ళీ అందులో చిన్న చిన్న చక్రాలు కూడా ఉన్నాయి. కావున మీ దినచర్య యొక్క ఈ చక్రము ఎల్లప్పుడు క్లియర్ గా ఉండాలి, తికమకపడకూడదు, అప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు. రిజిస్టర్‌ను శుభ్రంగా ఉంచుకోవడం వస్తుంది కదా! ఈ మధ్య సైన్స్ కూడా అటువంటివాటిని కనుగొంటోంది. వ్రాసిన వాటన్నింటినీ ఎలా చెరిపేస్తుందంటే అసలు తెలియనే తెలియదు. మరి సైలెన్స్  శక్తితో మీ రిజిష్టరు రోజూ శుభ్రపరుచుకోలేరా? కావున తండ్రికి ప్రియులుగా లేక ప్రభు ప్రియులుగా  లేక దైవీ లోకము, రెండింటికీ ప్రియులుగా ఎవరు అవ్వగలరు? సత్యత మరియు శుభ్రత కలవారు ప్రభుప్రియులు మరియు లోకప్రియులు కూడా. వారు స్వప్రియులుగా కూడా అవుతారు. సత్యత మరియు స్వచ్ఛతలను అందరూ ఇష్టపడతారు. రిజిస్టర్ ను శుభ్రంగా ఉంచుకోవడం ఇది కూడా స్వచ్ఛతయే కదా! మరియు సత్యమైన హృదయంపై తండ్రి రాజీ అవుతారు అనగా ధైర్యము మరియు స్మృతి ద్వారా సహాయము లభిస్తుంది. అచ్ఛా!

Comments