18-03-1971 అవ్యక్త మురళి

 * 18-03-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“విజయులుగా అయ్యేందుకు సంగ్రహము మరియు సంగ్రామముల శక్తి అవసరము."

            ఈరోజు బాబాను విశేషంగా భట్టీలోని వారి కొరకు పిలిచారు. భట్టీలోని వారు ఏయే ధారణలను చేసారు అన్నదానిని చూస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా రెండు విషయాల ధారణలను ఈ సాకార చిత్రము ద్వారా చూస్తున్నారు. ఎంతవరకు ప్రతి ఒక్కరూ తమ యధాశక్తితో ధారణ చేసారు అని రెండు శక్తుల ధారణలను చూస్తున్నారు.

            ఏ రెండు శక్తులను చూస్తున్నారు? ఒకటి సంగ్రహము చేసే శక్తి, రెండు సంగ్రామము చేసే శక్తి. సంగ్రహము చేసే శక్తి కూడా అతి ఆవశ్యకము. కావున భట్టీలో జ్ఞానరత్నాల ధారణలేవైతే లభించాయో వాటిని బుద్ధిలో సంగ్రహము చేసి ఉంచాలి మరియు ఈ సంగ్రహము చెయ్యటం ద్వారానే లోకసంగ్రహము చెయ్యగలరు. కావున సంగ్రహము చేసే శక్తి, మరియు సంగ్రామము చేసే శక్తి రెండూ అవసరము. రెండు శక్తులనూ ధారణ చేసారా? రెండింటిలో ఏ ఒక్కటి తక్కువ ఉన్నాగానీ లోపము కలిగినవారు ఎప్పుడూ సదా విజయులుగా అవ్వజాలరు. ఎవరిలో ఎంతగా సంగ్రహము చేసే శక్తి ఉంటుందో అంతగానే సంగ్రామము చేసేందుకు కూడా శక్తి ఉంటుంది. రెండు శక్తులనూ ధారణ చేసేందుకు భట్టీలోకి వచ్చారు. మరి శక్తి స్వరూపులుగా అయ్యారా? భట్టీలో ఏ వరదానమును ప్రాప్తి చేసుకున్నారు? పుత్రవాన్ భవ, ధనవాన్ భవ అని భక్తిమార్గములో వరదానమును ఇస్తారు కదా! కానీ ఈ భట్టీ నుండి ముఖ్యమైన ఏ వరదానము లభించింది? శిక్షకులుగా అయ్యారా లేక మాస్టర్ వరదాతగా కూడా అయ్యారా? 'శక్తివాన్ భవ' అన్న మొదటి వరదానము లభించింది, రెండవ వరదానంగా 'ఎల్లప్పుడూ అవ్యక్త ఏకరస స్థితి' అన్నది లభించింది. ఈ రెండు వరదానాలలో రెండు విషయాలూ ఇమిడి ఉన్నాయి. ఈ రెండు వరదానాలను ప్రాప్తి చేసుకొని సంపత్తివంతులుగా తయారై మీ ప్రాక్టికల్ ప్రమాణమును చూపించేందుకు వెళ్ళాలి. ఇంటికి వెళ్తున్నాము లేదా మా స్థానాలకు వెళ్తున్నాము అని భావించడము కాదు. కానీ ఏ శక్తులు లేక వరదానాలను తీసుకున్నారో వాటిని ప్రత్యక్షం చేసేందుకు విశ్వ నాటకరంగము పైకి వెళ్తున్నాము, అని భావించాలి. స్టేజ్ పైన ఉన్న నటులకు ఏ ముఖ్యమైన విషయాలు ధ్యానములో ఉంటాయి? అటెన్షన్ మరియు ఎక్యురసీ(ఖచ్చితముగా చేయడం) ఈ రెండు విషయాలు గుర్తుంటాయి. అలాగే మీరు కూడా స్టేజ్ పైన ఏక్ట్ చేసి బాప్ దాదాను ప్రత్యక్షము చేసేందుకు వెళ్తున్నారు కావున ఈ రెండు విషయాలనూ గుర్తు ఉంచుకోవాలి. ప్రతి క్షణము, ప్రతి సంకల్పములో అటెన్షన్ మరియు ఎక్యురసీ. ఇవి లేనట్లయితే బాప్ దాదాను ప్రత్యక్షము చేసే శ్రేష్ఠ పాత్రను పోషించలేరు. మరి ఏం చేసేందుకు వెళ్తున్నారో ఇప్పుడు అర్థమైందా! బాప్ దాదాను ప్రత్యక్షము చేసే పాత్రను అభినయించటానికి వెళ్తున్నారు. ఈ లక్ష్యమును పెట్టుకొని వెళ్ళాలి. ఏ కర్మను చేస్తున్నాగానీ మొదటగా ఈ కర్మ ద్వారా బాప్ దాదా ప్రత్యక్షత జరుగుతుందా? అని గమనించండి. కేవలము వాణి ద్వారా ప్రత్యక్షము చెయ్యాలి అని కూడా కాదు. కానీ అన్నివేళలా ప్రతి కర్మ ద్వారా ప్రత్యక్షము చెయ్యాలి. ఎలా ప్రత్యక్షము చెయ్యాలంటే ఆత్మలందరి నోటి నుండి వీరు ఒక్కొక్కరు సాక్షాత్ బాబా సమానులు అన్న మాట వెలువడాలి. మీ ప్రతి కర్మ దర్పణంగా అవ్వాలి. ఈ దర్పణము(అద్దము) ద్వారా బాప్ దాదాల గుణాలు మరియు కర్తవ్యముల దివ్యరూపము మరియు ఆత్మికతల సాక్షాత్కారము కనిపించాలి. కానీ దర్పణమును ఎవరు తయారు చెయ్యగలరు? ఎవరైతే కేవలము సంకల్పాలనే కాకుండా దేహ అభిమానమును కూడా అర్పణ చేస్తారో వారే దర్పణంగా అవ్వగలరు. ఎవరైతే  దేహాభిమానమును అర్పణ చేస్తారో వారి ప్రతి కర్మ దర్పణమౌతుంది. ఏవిధంగా ఏదైనా వస్తువును అర్పణ చేసిన తరువాత అలా అర్పణ చేసిన వస్తువును మళ్ళీ తమదిగా భావించబడదు. అలా ఈ దేహ భానమును కూడా అర్పణము చెయ్యటం ద్వారా నాదీ అన్నది తొలగిపోతుంది, కావున ఆకర్షణ కూడా తొలగిపోతుంది. అలా సమర్పణ అయ్యారా? అలా  సమర్పణ అయినవారి గుర్తు ఏమిటి? ఒకటి సదా యోగయుక్తము, రెండు సదా బంధనముక్తము. ఎవరైతే యోగయుక్తులుగా ఉంటారో వారు తప్పకుండా బంధనముక్తులుగా కూడా ఉంటారు. యోగయుక్తమునకు అర్థమే దేహ ఆకర్షణల బంధనము నుండి కూడా ముక్తము. ఎప్పుడైతే దేహ బంధనము నుండి ముక్తులైపోతారో అప్పుడు సర్వ బంధనముక్తులుగా అవ్వనే అవుతారు. కావున సమర్పణ అనగా సదా యోగయుక్తము మరియు సర్వ బంధనముక్తము. మీ ఈ గుర్తును సదా స్థిరంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఏ విధముగా అయినా బంధనయుక్తంగా ఉన్నా వారు యోగయుక్తులు అని పిలవబడరు. ఎవరైతే యోగయుక్తులుగా ఉంటారో వారి ప్రతి సంకల్పము, ప్రతి కర్మ యోగయుక్తముగా ఉంటుంది, ఇది వారి లక్షణము, ఎందుకంటే అన్నిరకాల యుక్తులేవైతే లభించాయో ఆ యుక్తుల ధారణ కారణంగా యుక్తియుక్తముగా మరియు యోగయుక్తముగా ఉంటారు. పరిశీలనకు గుర్తు ఏమిటో అర్థమైందా! మేము ఎంతవరకు చేరుకున్నాము అన్నదాని ద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు. కావుననే సంగ్రహము మరియు సంగ్రామము, ఈ రెండు శక్తులను నింపుకొని వెళ్ళాలి. రిజల్టు ఏం చూసారు? సర్టిఫికేట్ లభించిందా? ఒకటి మీతో మీరు సంతృప్తులుగా అయ్యే సర్టిఫికేట్ తీసుకోవాలి, రెండు సర్వులను సంతృప్తపరిచే సర్టిఫికేట్ తీసుకోవాలి, మూడవది సంపూర్ణ సమర్పణులుగా అయ్యేందుకు సర్టిఫికేట్.

            సమర్పణ అంటే ఆబూలోకి వచ్చి కూర్చోవాలని కాదు. సమర్పణ అయ్యేందుకు కూడా సర్టిఫికేట్ తీసుకోవాలి. నాలుగవది జ్ఞాన యుక్తులు ఏవైతే లభించాయో వాటిని సంగ్రహపరిచే శక్తి యొక్క సర్టిఫికేట్ ను కూడా తీసుకోవాలి, ఈ నాలుగు సర్టిఫికేట్ లను మీ టీచరు నుండి తీసుకొని వెళ్ళాలి. ఒక విషయములో ఈ గ్రూపుకు 100 మార్కులు కూడా లభించాయి. అది ఏ విషయము? పురుషార్థములో అమాయకత్వము 100 శాతము ఉంది. పురుషార్థములో అమాయకత్వమే నిర్లక్ష్యము మరియు ఒక విశేష గుణము కూడా. అది ఏదంటే తమలో పరివర్తన తీసుకురావాలనే తీవ్రమైన కోరిక తప్పకుండా ఉంది. కావున బాప్ దాదా ఈ గ్రూపును ఆశావాదుల గ్రూపుగా భావిస్తారు. కానీ ఎప్పుడైతే ఎల్లప్పుడూ నమ్రచిత్తులుగా అయ్యి నడుస్తారో అప్పుడే ఆశలను పూర్తి చెయ్యగలరు. ఆశావాదుల క్వాలిటీ వారు, కానీ ఏ క్వాలిటీస్ అయితే లభించాయో వాటిని ధారణ చేస్తూ నడిచినట్లయితే ప్రత్యక్ష ప్రమాణమును ఇవ్వగలరు. అర్థమైందా!

            జ్ఞాన సాజ్ (రాగము)ను వినటంలో మరియు రాజ్ (రహస్యము)ను వినటంలో బాగున్నారు, కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? రాజ యుక్తులుగా అవ్వాలి. యోగము బాగుంది, కానీ యోగయుక్తంగా అవ్వాలి. బంధనముక్తంగా అయ్యే కోరిక ఉంది, కానీ మొదటగా దేహ అభిమానమనే బంధనాన్ని తొలగించుకోవాలి. అప్పుడిక సర్వ బంధనముక్తంగా మీరే అయిపోతారు. అర్థమైందా! ఇప్పుడు ఈ ప్రయత్నమును చెయ్యాలి. ఋజువు చూపే వారిగా మరియు సుపుత్రులుగా అవ్వాలి. శక్తివంతులుగా మరియు సంపత్తివంతులుగా అయ్యారా? ప్రతి ఒక్కరూ తమతో తాము ప్రతిజ్ఞ కూడా చేసారు. ఏ ప్రతిజ్ఞ అయితే చెయ్యటం జరిగిందో దానిని పూర్తి చేసేందుకు అవసరమైన పవర్(శక్తి)ని కూడా తప్పకుండా ప్రోగు చేసుకుంటారు. ఎంతగా సహించవల్సివచ్చినా గానీ, ఎదుర్కోవలసివచ్చినా గానీ ప్రతిజ్ఞనైతే పూర్తి చెయ్యవలసిందే. అటువంటి ప్రతిజ్ఞను చేసారా? మొత్తము విశ్వములోని ఆత్మలందరూ కలిసి ప్రతిజ్ఞ నుండి తొలగించటానికి ప్రయత్నము చేసినా కూడా మీరు ప్రతిజ్ఞ నుండి తొలగిపోరు. కానీ ఎదుర్కొని సంపూర్ణంగా అయ్యే చూపిస్తారు. ఇటువంటి ప్రతిజ్ఞ చేసేవారి స్మృతిచిహ్నముగా అచల్ ఘర్ తయారై ఉంది. కావున ఏవిధంగా మా సృతిచిహ్నము ఉందో ఆ విధంగా ఇప్పుడు తయారవ్వాల్సిందే అన్నదానిని ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలి. ఇదైతే సహజమే కదా! స్థూల లక్షణమును గుర్తు ఉంచుకోవటం ద్వారా నషా మరియు నిషానా(గురి) గుర్తు ఉంటాయి. మొత్తము ప్రపంచము నుండి ఎన్నుకోబడిన విశేష ఆత్మలము మేము' అన్నదానిని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎంతటి విశేష ఆత్మలుగా ఉంటారో అంతగా వారి ప్రతి కర్మలో విశేషత ఉంటుంది. విశేష ఆత్మలు కదా. తక్కువైన వారు కాదు!

            మధువన నివాసులందరూ స్వయమును ప్రాక్టికల్ విశేష ఆత్మలుగా చూపించి మీ ఈ గ్రూపు పేరును ప్రసిద్ధము చెయ్యాలి. తక్కువ చెప్తాము, కానీ చేసి చూపిస్తాము అన్న లక్ష్యమునే ఉంచాలి. మీ ఈ గ్రూపు యొక్క ఈ విశేషతను చూస్తాము. స్టేజ్ పైకి వెళ్ళి మీరు ఎటువంటి పాత్రను పోషించాలంటే, దానిని చూసి అందరూ వన్స్ మోర్ అని కూడా అనాలి. అర్థమైందా! మీ నిమిత్త టీచరు మీ గ్రూపుకు పదేపదే నిమంత్రణ ఇవ్వాలి. ఇతర గ్రూపులకు మీరొక ఉదాహరణగా అయ్యి చూపించాలి. ఎవరైనా మంచి కర్మ చేసి వెళ్ళినట్లయితే అది పదేపదే గుర్తుకొస్తుంది. కావున ఈ గ్రూపు కూడా అలా అద్భుతమును చేసి చూపించాలి. అచ్ఛా!

Comments