16-06-1972 అవ్యక్త మురళి

* 16-06-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "హర్షితంగా ఉండడమే బ్రాహ్మణ జీవితపు విశేష సంస్కారము”

హర్షితముగా ఉండేందుకు సహజమైన యుక్తి ఏమిటి? సదా హర్షితముగా ఉండేందుకు స్మృతి చిహ్నం రూపములో ఉన్న చిత్రమేమిటి? అందులో విశేషంగా హర్షితముఖమునే చూపించారు. విష్ణువు నిదురిస్తున్న చిత్రమును చూపిస్తారు. జ్ఞానమును స్మరిస్తూ హర్షిస్తున్నారు. విశేషంగా హర్షితమయ్యే చిత్రమునే స్మృతిచిహ్న రూపంలో చూపించారు. విష్ణువు అనగా యుగళ రూపము. మీరు కూడా విష్ణు స్వరూపమే కదా! నరుని నుండి నారాయణునిగా లేక నారి నుండి లక్ష్మిగా మీరే అవుతారా లేక కేవలం బాబా అవుతారా? నరుడు మరియు నారి ఇరువురూ ఏ జ్ఞానమునైతే స్మరిస్తారో వారు ఇలా హర్షితముగా ఉంటారు. కావున హర్షితముగా అయ్యే సాధనము ఏమిటి? జ్ఞానమును స్మరించడం. ఎవరు ఎంతగా జ్ఞానమును స్మరిస్తారో వారు అంతగానే హర్షితముగా ఉంటారు. జ్ఞానస్మరణ జరగకపోవడానికి కారణం ఏమిటి? వ్యర్థ స్మరణలలోకి వెళ్ళిపోతారు. వ్యర్థ స్మరణ జరిగితే జ్ఞానస్మరణ జరగదు. బుద్ధిని సదా జ్ఞానస్మరణలో ఉంచుకున్నట్లయితే సదా హర్షితముగా ఉంటారు. వ్యర్థ స్మరణయే జరుగదు. జ్ఞాన స్మరణ చేసేందుకు, ఎల్లప్పుడూ హర్షితంగా ఉండేందుకు ఎన్నో ఖజానాలు లభించాయి. ఈ రోజుల్లో ఎవరైనా గొప్ప ధనవంతులు ఉంటే, వారివద్ద లెక్కలేనంత ధనం ఉంది అని అంటారు. అలాగే జ్ఞాన ఖజానాలేవైతే లభించాయో వాటిని లెక్కించగలరా? ఇంతగా లెక్కలేనంతగా ఉంటూ కూడా వాటిని ఎందుకు వదిలేస్తారు? ఏదైనా లోపం కారణంగానే అది లేకుండా ఉండడము సంభవమవుతుంది. కానీ, లోపం లేకుండా కూడా ఆ వస్తువు లేకుండా ఉండటమన్నది జరుగకూడదు కదా! జ్ఞాన ఖజానా ద్వారా ఆ విషయాలు ఎక్కువ మంచిగా అనిపిస్తాయి. ఎందుకు? ఇది ఎంతోకాలము అలవాటైపోయింది, కావుననే వద్దనుకుంటున్నా కూడా వచ్చేస్తుంది అని భావిస్తారు కదా! కావున ఇప్పుడు జ్ఞానస్మరణ చేస్తూ ఎంతకాలమైంది? సంగమయుగపు ఒక్క సంవత్సరం కూడా ఎంతకాలానికి సమానం? సంగమ యుగంలోని ఒక్క సంవత్సరం కూడా ఎంతో పెద్దది. ఈ లెక్కలో చూస్తే ఇది బహుకాలపు విషయమే కదా! ఏ విధంగా అవి బహుకాలపు సంస్కారాలుగా ఉన్న కారణంగా వద్దనుకుంటున్నా కూడా స్మృతిలోకి వచ్చేస్తాయో, అలాగే ఈ బహుకాలపు స్మృతి కూడా సహజంగా ఎందుకు ఉండదు? క్రొత్త విషయము లేక తాజా విషయము ఇంకా ఎక్కువగా స్మృతిలో ఉండాలి, ఎందుకంటే ఇది వర్తమానానికి సంబంధించిన విషయం కదా! అదైతే గతము, ఇది వర్తమానానికి సంబంధించిన విషయం, మరి గతం ఎందుకు గుర్తుకు వస్తుంది? ఎప్పుడైతే గతం గుర్తుకువస్తుందో అప్పుడు దానితోపాటు దీనివల్ల లభించే ప్రాప్తి ఏమిటి అన్నది కూడా గుర్తుకువస్తుందా? దానిద్వారా ఎటువంటి ప్రాప్తి సుఖవంతంగా ఉండదు, అయినా దానిని ఎందుకు గుర్తుచేస్తారు? రిజల్టు ముందు ఉంటూ కూడా ఎందుకు స్మృతి చేస్తారు? ఇది వ్యర్థం అని కూడా భావిస్తారు. వ్యర్థం యొక్క పరిణామము కూడా వ్యర్థంగానే ఉంటుంది కదా! వ్యర్థ పరిణామమును గూర్చి అర్థం చేసుకుంటూ కూడా ప్రాక్టీకల్ లోకి దానిని తీసుకువస్తున్నట్లయితే దానిని ఏమంటారు? నిర్బలత. అర్థం  చేసుకుంటూ కూడా చేయలేకపోవడమును నిర్బలత అని అంటారు. మీరిప్పటివరకు నిర్బలులుగా ఉన్నారా? అథారిటీగా ఉన్నవారి గుర్తులు ఏమిటి? వారిలో విల్ పవర్ ఉంటుంది, వారు ఏం చేయాలనుకుంటే అది చేయగలరు, చేయించగలరు. కావుననే వారిని అథారిటీ అని అంటారు. బాబా ఇచ్చిన అథారిటీని ఇంకా ప్రాప్తించుకోలేదా? మీరు మాస్టర్ ఆల్మైటీ అథారిటీగా ఉన్నారా? ఆల్మైటీ అనగా సర్వశక్తివంతుడు. ఎవరివద్దనైతే సర్వశక్తుల అథారిటీ వుందో వారు అర్థం చేసుకుంటూ కూడా చేయలేకపోతే వారిని ఆల్మైటీ అథారిటీ అని అంటారా? నేను ఎవరిని అన్నది మర్చిపోతున్నారా? ఇది స్వయం యొక్క పొజిషన్ కదా! మిమ్మల్ని మీరు మర్చిపోతారా? నిజమైనదానిని మర్చిపోయి నకిలీ దాని వైపుకు వచ్చేస్తారు. ఈ రోజుల్లో తమ ముఖాన్ని కూడా కృత్రిమంగా చేసుకునే ఫ్యాషన్ ఉంది. ఏదో ఒక సింగారము చేసుకుంటారు, దాని ద్వారా యథార్థమైన రూపము దాగిపోతుంది. దీనిని కృత్రిమమైన అసురీ సింగారము అని అంటారు. నిజానికి భారతవాసీయులు అన్ని ధర్మాల ఆత్మలతో పోల్చి చూస్తే సతోగుణులే. కాని, తమ నకిలీ రూపాన్ని తయారుచేసుకొని కృత్రిమమైన నడవడికను మరియు అలంకారాలను ఏర్పరచుకొని దిన ప్రతిదినము స్వయమును అసురులుగా చేసేసుకుంటూ ఉన్నారు. మీరు వాస్తవికతను మరిచిపోకండి. వాస్తవికతను మరిచిపోవడం ద్వారానే అసురీ సంస్కారాలు వస్తాయి. లౌకిక రూపంలో కూడా ఎవరైతే చాలా శక్తివంతంగా ఉంటారో వారిముందుకు వెళ్లే ధైర్యమును కూడా ఎవరూ ఉంచరు. మీరు ఆల్మైటీ అథారిటీ యొక్క పొజిషన్ లో ఉన్నట్లయితే అసురీ సంస్కారాలకు లేక వ్యర్థ సంస్కారాలకు మీ ముందుకు వచ్చే ధైర్యం ఉండగలదా? మీ పొజిషన్ నుండి మీరు ఎందుకు క్రిందకు దిగుతారు?  సంగమయుగపు వాస్తవిక సంస్కారము - సదా జ్ఞానమును ఇవ్వడము మరియు తీసుకోవడం, వారికి సదా జ్ఞానము స్మృతిలో ఉంటుంది మరియు సదా హర్షితంగా ఉంటారు. బ్రాహ్మణ జీవితం విశేష సంస్కారము - హర్షితంగా ఉండడము, మరి దాని నుండి దూరంగా ఎందుకు వెళతారు? తమ వస్తువును ఎప్పుడైనా వదిలివేస్తారా? ఇది సంగమయుగపు తమ వస్తువు కదా! అవగుణాలు మాయకు సంబంధించినవి, వాటిని సాంగత్య దోషంతో తీసుకున్నారు, దైవీ గుణాలు మీకు సంబంధించినవి. మీరు మీ వాటిని వదిలివేస్తున్నారు. సంభాళించడం రాదా? ఇంటిని సంభాళించడం వచ్చా? హద్దులోని పిల్లలను, అన్నింటినీ సంభాళించడం వస్తుంది కాని అనంతమైనదానిని సంభాళించడం రాదా? హద్దులోని దానిని పూర్తిగా వదిలేసారా లేక కొద్ది కొద్ది గా ఉందా? ఏ విధంగా రావణుడికి సీత వీపు చూపించినట్లుగా చూపిస్తారో అలాగే హద్దులోని వాటికి మీరు వీపు చూపించారా? మళ్లీ వాటి ముందుకు వెళ్లరు కదా! లేక అక్కడికి వెళ్ళాక, ఏం చేయాలి అని అంటారు? ఇప్పుడు అనంతమైన ఇంట్లో అనంతమైన నషా ఉంది, మళ్ళీ హద్దులోని ఇంటికి వెళ్ళడంతో హద్దులోని నషా ఏర్పడుతుంది. ఇప్పుడు ఉల్లాస ఉత్సాహాలేవైతే ఉన్నాయో అవి హద్దులోకయితే  వచ్చేయవు కదా! ఏ విధంగా ఇప్పుడు బేహద్ ఉల్లాస ఉత్సవాలు ఉన్నాయో, అందులో కొద్దిగా కూడా తేడా రాదు కదా! హద్దులోని వాటికి వీడ్కోలు చెప్పేసారా లేక ఇప్పుడు కూడా కొద్దికొద్దిగా దానిని పెంచి పోషిస్తూ ఉంటారా? ఈ అలౌకిక జన్మ దేనికొరకు ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇది ఏమైనా హద్దుల్లోని కార్యాల కోసం ఉందా? అలౌకిక జన్మను ఎందుకు తీసుకున్నారు? ఏ కార్యము కొరకైతే అలౌకిక జన్మను తీసుకున్నారో కార్యమును చేయకపోతే ఇక అది దేనికొరకు? తండ్రి పిల్లలుగా ఉంటూ తండ్రి పరిచయమును తెలుసుకోకపోతే పిల్లలుగా ఎందుకు ఉన్నట్లు అని జనులతో అంటారు కదా! అలాగే అనంతమైన తండ్రికి చెందిన అనంతమైన పిల్లలుగా అయిపోయారు, ఒప్పుకున్నారు, తెలుసుకున్నారు అయినా అనంతమైన కార్యంలోకి రాకపోతే అదేమి అలౌకిక జన్మ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అలౌకిక జన్మలోనే లౌకిక కార్యంలో నిమగ్నమైపోతే, కలిగే లాభమేమిటి? మీ జన్మను మరియు సమయం యొక్క మహత్వమును తెలుసుకోండి, అప్పుడే మహాన్ కర్తవ్యమును చేస్తారు. గ్యాసు బెలూన్లుగా అవ్వకూడదు. అది చాలా మంచిగా ఉబ్బుతుంది మరియు ఎగురుతుంది కూడా, కానీ అలా అల్పకాలికంగానే ఉండగలదు. కావున మీరు ఇటువంటి గ్యాసు బెలూన్లుగా అయితే లేరు కదా! అచ్ఛా!

Comments