15-09-1974 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
పురుషార్ధం యొక్క అంతిమ లక్ష్యం - అవ్యక్తఫరిస్తా స్థితి.
విఘ్నవినాశకులు, జ్ఞానసూర్యుడు, పతిత పావనుడైన బాప్ దాదా సంగమయుగీ బ్రాహ్మణ పిల్లలతో ఉచ్చరించిన మహావాక్యాలు -
ఇప్పుడు పిల్లలైన మీకు అంతిమస్థితి తయారు చేసుకునేటందుకు అంతిమ పురుషార్థం నడుస్తుంది. మహారథీ పిల్లలు ఎవరైతే నిమిత్తం అయ్యారో వారు తమ పురుషార్థం యొక్క వేగంలో కూడా అందరి ముందు నిమిత్తంగా అవ్వాలి. శ్రేష్ట పురుషార్థం ఏమి ఉంటుంది? వారు ఎవరిని చూసి అనుసరిస్తారు? ఎలా అయితే సాకారంలో పురుషార్థం ఎలా చేయాలి మరియు పురుషార్థం అని దేనిని అంటారు? ఆదిలో పురుషార్థం యొక్క సింబల్ (గుర్తు) అంటే సాకార బ్రహ్మబాబాను చూస్తూ అందరు ముందుకు వెళ్ళేవారు. కానీ ఈ సమయంలో సాకారంలో సింబల్ ఎవరు? మహారథీలు. ఇతరాత్మలకు పురుషార్ధానికి సింబల్ అయ్యేవిధంగా మహారథీల పురుషార్థం నడుస్తుందా. అంతిమ పురుషార్ధం ఏమిటో తెలుసా? ఎలా అయితే ఆదిలో దేహభిమానం తొలగించడానికి నేను చతుర్భుజిని అనే స్మృతితో పురుషార్థం చేయించేవారు. దీని ద్వారా స్త్రీని అనే దేహభిమానం, బలహీనత అన్నీ తొలగిపోయాయి మరియు నిర్భయంగా మరియు శక్తిశాలిగా అయిపోయారు. ఆదిలో దేహభిమానం తొలగించేటందుకు నేను చతుర్భుజిని అనే ప్రత్యక్ష పురుషార్ధం నడిచింది కదా? నడుస్తూ,తిరుగుతూ, మాట్లాడుతూ నేను నారీ కాదు, నేను చతుర్భుజిని అనే నషా ఉండేది కదా, అంటే ఆ రెండు సంస్కారాలు మరియు రెండు శక్తులు కలిసాయి. కనుక రెండు కార్యాలు మనం చేయగలుగుతున్నాము. అలాగే అంతిమ లక్ష్యం ఏమి స్మృతిలో ఉండాలి. దీని ద్వారా స్వతహగానే ఆ లక్షణాలు వచ్చేయాలి.
పురుషార్ధం కొరకు అంతిమ లక్ష్యం ఏమిటి? అవ్యక్త ఫరిస్తాగా అవ్వాలి. అవ్యక్తరూపం ఏమిటి? ఫరిస్తా స్థితి. దానిలో కూడా లైట్ రూపం ఎదురుగా కనిపించాలి ఇదే మీ లక్ష్యం. అది ఎదురుగా పెట్టుకోవటం ద్వారా లైట్ కార్బ్ లో నా ఆకారం ఉంది అని అనుభవం అవ్వాలి. వతనంలో అవ్యక్తరూపం చూస్తున్నప్పుడు అవ్యక్తం మరియు వ్యక్తంలో ఏమి తేడా చూస్తున్నారు? వ్యక్తం పంచతత్వాల కార్బ్ లో ఉంటుంది మరియు అవ్యక్తం లైట్ కార్బ్ లో ఉంటుంది. లైట్ రూపం నలువైపుల లైటే, లైట్ కనిపిస్తుంది. లైట్ కార్బ్ లో ఈ ఆకారం కనిపిస్తుంది. ఎలా అయితే సూర్యుడిని చూస్తున్నప్పుడు నలువైపుల వ్యాపించి ఉన్న సూర్య కిరణాల యొక్క లైట్ మధ్యలో సూర్యుని రూపం కనిపిస్తుంది. సూర్యుని లైట్ అయితే ఉంటుంది కానీ సూర్యుని నలువైపుల కూడా లైట్ నీడ రూపంలో వ్యాపించి కనిపిస్తుంది మరియు ఆ లైట్ లో విశేషమైన లైట్ కనిపిస్తుంది. అలాగే నేను ఆత్మ, జ్యోతిరూపాన్ని ఈ లక్ష్యమైతే ఉంది. కానీ నేను ఆకారంలో కూడా కార్బ్ లో ఉన్నాను. ఇలా నలువైపుల మీ స్వరూపం లైట్‌గా కనిపించాలి మరియు లైట్ మధ్యలో ఆ స్మృతి ఉండాలి మరియు ఆ స్వరూపం కనిపించాలి. అప్పుడే అనుభవం అవుతుంది. ఎలా అయితే అద్దంలో చూసుకుంటే రూపం స్పష్టంగా కనిపిస్తుందో, అలాగే ఙ్ఞానమనే దర్పణంలో మీ యొక్క ఈ రూపం స్పష్టంగా కనిపించాలి, మరియు అనుభవం అవ్వాలి. నడుస్తూ, తిరుగుతూ, మాట్లాడుతూ నేను లైట్ రూపాన్ని, నేను ఫరిస్తా నడుస్తున్నాను మరియు నేను ఫరిస్తాను మాట్లాడుతున్నాను అనే అనుభవం అవ్వాలి. ఇలా మీ స్మృతి మరియు స్థితి యొక్క ప్రభావం ఇతరులపై పడుతుంది.
కర్తవ్యం చేస్తూ నేను ఫరిస్తాను కార్యర్థం నిమిత్తంగా ఈ భూమిపై పాదం పెడుతున్నాను. కానీ నేను అవ్యక్తదేశవాసిని అనే ఈ స్మృతిని ఇప్పుడు ఎక్కువగా పెంచుకోండి. నేను ఈ కార్యార్ధం అవతరించాను, అంటే నేను కార్యార్ధం వతనం నుండి భూమి పైకి వచ్చాను. వ్యవహరం పూర్తి కాగానే మరలా తిరిగి వతనానికి వెళ్ళిపోవాలి. ఎలా అయితే బాబా వచ్చినప్పుడు బాప్ దాదాలకు మేము వతనం నుండి కర్తవ్య నిమిత్తం వచ్చాము, మరలా తిరిగి వెళ్ళిపోవాలి అనే స్మృతి ఉంటుంది కదా! అలాగే మీ అందరికి కూడా నేను అవతారాన్ని అంటే అవతరించాను అనే స్మృతిని పెంచుకోవాలి. నేను మరజీవిగా అవుతున్నాను, ఇప్పుడు నేను బ్రాహ్మణుడిని మరలా నేను దేవతగా అవుతాను అనే ఈ స్మృతి కూడా వాస్తవానికి స్థూలరూపం. ఈ స్థితి కూడా సాకారి. ఇప్పుడు మీ స్థితి ఆకారిగా ఉండాలి, ఎందుకంటే ఆకారి నుండి నిరాకారిగా సహజంగానే అయిపోతారు. ఎలా అయితే బాబా కూడా సాకారి నుండి ఆకారిగా అయ్యారో ఆకారి నుండి మరలా నిరాకారిగా మరియు మరలా సాకారిగా అవుతారు.
ఇప్పుడు మీరు కూడా అవ్యక్త వతనవాసి స్థితి వరకు చేరుకోవాలి, అప్పుడే మీరు వెంట వెళ్ళగలరు. ఇప్పుడు ఈ సాకార రూపం నుండి అవ్యక్తరూపం యొక్క పాత్ర ఎందుకు వచ్చింది? అందరిని అవ్యక్త స్థితిలో స్థితులు చేసేటందుకు, ఎందుకంటే ఇప్పటి వరకు ఆ స్థితి వరకు చేసుకోలేదు. ఇప్పుడు ఈ అంతిమ పురుషార్థం మిగిలి ఉంది. దీని ద్వారానే సాక్షాత్కారాలు జరుగుతాయి. నేను శ్రేష్టాత్మను, నేను బ్రాహ్మణాత్మను మరియు నేను శక్తిని అనే సాకార స్వరూపం యొక్క పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ స్మృతిలో మీకు నషా మరియు సంతోషం అనుభవం అవుతుంది. కానీ ఎప్పటి వరకు ఈ అవ్యక్త స్వరూపంలో, లైట్ కార్బ్ లో స్వయాన్ని అనుభవం చేసుకోరో అప్పటి వరకు ఇతరులకు మీ యొక్క సాక్షాత్కారం అవ్వదు. ఎందుకంటే భక్తులకు దైవీ స్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుంది. అది నడుస్తూ, తిరుగుతూ లైట్ స్వరూపం యొక్క కార్బ్ లో ఉండటం ద్వారానే జరుగుతుంది. లైట్ లేకుండా సాక్షాత్కారం కూడా అవ్వదు. స్వయం ఎప్పుడైతే లైట్ రూపంలో స్థితులవుతారో మీ యొక్క లైట్ ప్రభావంతోనే వారికి సాక్షాత్కారం అవుతుంది. ఎలా అయితే శాస్త్రాలలో కంసుడు కుమారీని చంపితే ఆమె ఎగిరిపోయింది, సాక్షాత్త్ రూపధారి అయిపోయింది మరియు మరలా ఆకాశవాణి వినిపించింది అని చెప్తారు కదా! అలాగే మీ సాక్షాత్కారం జరిగినప్పుడు కూడా దేవీ ద్వారా ఆకాశవాణి వినిపిస్తుంది అని అనుభవం అవుతుంది. అది వినడానికి కోరికతో ఉంటారు, ఈ దేవీ లేదా శక్తి నా కోసం ఏమి ఆకాశవాణి వినిపిస్తుంది అని. మీలో ఇప్పుడు ఈ నవీనత కనిపించాలి. సాధారణ మాటలు వినిపించకూడదు, పై నుండి ఆకాశవాణి వినిపిస్తుంది అనే అనుభవం అవ్వాలి. అందువలనే ఇప్పుడు జ్వాలాముఖిగా అయ్యే సమయం. ఇప్పుడు మీ యొక్క గోపికస్థితి యొక్క పాత్ర సమాప్తి అయిపోయింది. మహారథీలు ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వారు ఈ విధంగా సేవ చేసే పాత్ర కూడా స్వతహగా మారుతూ ఉంటుంది. మొదట మీరు ఉపన్యాసం చెప్పేవారు మరియు కోర్స్ చెప్పేవారు ఇప్పుడు చైర్మెన్ రూపంలో కొద్దిగానే మాట్లాడుతున్నారు. కోర్స్ కూడా మీ యొక్క సహయోగులతో చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ సమయంలో అందరిని ఆకర్షితం చేయటం, ధైర్యం మరియు ఉల్లాసంలోకి తీసుకురావటం, ఈ సేవ మిగిలి ఉంది. తేడా వస్తుంది కదా? దీని కంటే ముందుకి ఇప్పుడు ఆకాశవాణి రూపంలో అనుభవం అవుతుంది. వీరు ఎవరో అవతారాలు సాధారణ శరీరధారులు కాదు అని. అవతారాలు ప్రత్యక్షం అయ్యారు. సాక్షాత్కారంలో దేవి ప్రత్యక్షం అయ్యారు మహవాక్యాలు చెప్పారు, మరియు ప్రాయలోపం అయిపోయారు అని అనుభవం చేసుకుంటారు కదా! ఇప్పటి స్థితి మరియు పురుషార్ధం యొక్క లక్ష్యం కూడా ఇదే ఉండాలి.
స్థూల వ్యవహరాలలో కూడా అతీతం అయిపోతూ ఉండాలి. సైగతో వినాలి, సలహ ఇవ్వాలి మరియు మరలా అవ్యక్త వతనవాసి అయిపోవాలి. సాకారంలో బ్రహ్మబాబాను చూసారు కదా, అనుభవం చేసుకున్నారు. క్రిందికి వచ్చి సలహ ఇచ్చేవారు, చేప్పేవారు మరలా పైకి వెళ్ళిపోయేవారు. ఆది మరియు అంతిమం యొక్క వ్యవహరంలో రాత్రికి, పగలుకి ఉన్నంత తేడా కనిపించాలి. ఇప్పుడు బాధ్యతలు మరింత పెరుగుతాయి. బాధ్యతలు తక్కువైతే ఫరిస్తాగా అవుతాము అని అనకండి. బాధ్యతలు మరియు సేవ యొక్క విస్తారం నలువైపుల మరింత పెరుగుతుంది. ఇప్పుడు విదేశం యొక్క సేవ కూడా పెరిగింది కదా, మరియు ఇంకా విస్తారం అయ్యింది కదా? అలాగే రకరకాలైన సేవలు ఏవైతే జరుగుతున్నాయో అవి తప్పకుండా పెరుగుతాయి. శాస్త్రాలలో విశ్వం యొక్క అన్ని రకాల ఆత్మలను ఉద్దరించినట్లుగా మహిమ ఉంది కదా? ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడైతే ఒక్కరు ఒక స్థానంలోనే కూర్చున్నారు, కానీ తర్వాత పది-పది స్థానాలు సంభాళించవలసి ఉంటుంది. ఒక స్థానంలో కూర్చునే సమయం ఉండదు. ఇప్పుడు 6-8 నెలలు ఒకే స్థానంలో కూర్చుంటున్నారు, కానీ తర్వాత లైట్‌హౌస్ లా నలువైపుల సేవ చేస్తూ ఉంటారు.
ఎవరైతే ముఖ్యమైన నిమిత్త ఆత్మలు ఉంటారో, సేవాధారులు ఉంటారో మరియు రాజ్యభాగ్యం యొక్క సింహసనం పొందే ఆత్మలు ఉంటారో, అటువంటి అనన్య రత్నాలు లైట్‌హౌస్ లా తిరుగుతూ నలువైపుల లైట్ ఇస్తూ ఉంటారు. లైట్ హౌస్ యొక్క ప్రత్యక్ష రూపం కూడా కావాలి కదా? ఒకరు అనేకులకు లైట్ ఇస్తారు. బేహద్ విశ్వయజమానులు ఒక స్థానం యొక్క హద్దు, బాధ్యతకు అధికారులుగా ఉండరు. వారికి నిమిత్తమాత్రంగా భలే ఒక స్థానం ఉంటుంది, లైట్‌హౌస్ కి కూడా నిమిత్తంగా ఒక స్థానం ఉంటుంది కదా, కానీ సేవ కేవలం ఒక స్థానానికే చేయరు. నలువైపుల లైట్ వ్యాపింపచేస్తూ ఉంటారు. ఇలా స్థానం అనేది భలే ఒకటే ఉంటుంది, కాని మీలో ఉన్న విశేషతలు మరియు శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి లాభం నలువైపుల ఉండాలి. ఇప్పటి వరకు కేవలం ఒక స్థానంలోనే మీ విశేషత యొక్క లాభం ఉంది. సూర్యుడు ఒక స్థానానికే వెలుగు ఇస్తాడా ఏమిటి? మీ యొక్క శక్తి రూపి కిరణాలు కూడా నలువైపుల వ్యాపించాలి కదా! లేకపోతే కనుక మాస్టర్ సర్వశక్తివాన్ మరియు జ్ఞానసితారగా మీరు ఎలా ప్రసిద్ధం అవుతారు? మాస్టర్ ఙ్ఞానసూర్యులు అంటే బాబా సమానం. సితారగా ఉంటూ కూడా బాబా సమాన స్థితిలో ఉండాలి. ఇదైతే అష్టరత్నాలే పొందుతారు కదా? ఒకవేళ ఏదైనా సితార ఒక స్థానంలోనే తన ప్రకాశాన్ని వ్యాపింపచేస్తుంది మరియు వెలుగుతూ తన స్థానంలోనే వెలుగుని ఇస్తూ ఉంటే వారిని మాస్టర్ జ్ఞానసూర్యులు మరియు బాబా సమానం అని అనరు. ఎప్పటి వరకు వారు బాబా సమానస్థితి వరకు రారో అప్పటి వరకు బాబా సమానమైన సింహసనాన్ని తీసుకోలేరు. కనుక సేవ పెరిగే విధంగా మీ స్థితిని తయారుచేసుకోండి.
చక్రధారిగా అవ్వటం ద్వారానే చక్రవర్తి రాజాగా అవుతారు. ఇక్కడ చక్రధారి, అక్కడ చక్రవర్తి, దీనిలో లైట్ యొక్క చక్రం కూడా ఉండాలి మరియు సేవలో ప్రకాశాన్ని వ్యాపింపచేసే చక్రం కూడా ఉండాలి. అప్పుడే చక్రధారి అని అంటారు. ఇటువంటి చక్రధారులే చక్రవర్తిగా అవుతారు. ఎలా అయితే ఈ కళ్ళకు లైట్ కనిపిస్తుందో అలాగే నడుస్తూ, తిరుగుతూ ప్రతి ఒక్కరికి లైట్ చక్రం కనిపిస్తుంది. ఇది నిజమేనా, నేనే చూస్తున్నానా? అని ఆశ్చర్యపోతారు. మీ యొక్క లైట్ రూపం మరియు లైట్ కిరీటం సాధారణం అయిపోతుంది, నడుస్తూ, తిరుగుతూ అందరికి కనిపిస్తుంది. వీరే లైట్ కిరీటధారులు. సాకారంలో బ్రహ్మబాబాలో లైట్ యొక్క అనుభవం సాధారణ విషయంగా ఉండేది. అందరికి అదే రూపంతో కనిపించేవారు. ఈ కళ్ళతో చూస్తున్నట్లుగానే మీకు అనుభవం అవుతుంది. చూస్తూ, చూస్తూ స్వయం మాయం అయిపోతారు. నేను ఎక్కడ ఉన్నాను, ఏమి చూస్తున్నాను అని అనిపిస్తుంది. ఎలా అయితే సాకారం ద్వారా అనుభవం చేసుకున్నారు కదా - స్వయానికి స్వయమే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపించేది నా పాదం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందా లేదా మూలవతనంలో ఉందా లేదా సూక్ష్మవతనంలో ఉందా? అని. ఎలా అయితే సాకార బాబా ద్వారా మీకు అనుభవం అయ్యేదో అలాగే మీ ద్వారా అందరికి అనుభవం అవుతుంది. అప్పుడే సమాన స్థితిలోకి వస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే మద్య, మధ్యలో ఈ స్వరూపం యొక్క స్మృతిని తెచ్చుకుంటారో అప్పుడే జరుగుతుంది. సాకార బాబా కూడా గుప్త పురుషార్ధం చేసారు. అలాగే మీరు కూడా ఈ గుప్త పురుషార్థం మరియు గుప్త శ్రమ చేయాలి. ఇంత ధ్యాస ఉందా? అలజడిలో ఉంటూ కూడా ధ్యాసలో ఉండాలి.
ఇప్పుడింకా రాత్రి మరియు పగలు విశ్రాంతి తీసుకునే సమయం లభిస్తుంది. కానీ తర్వాత ఈ విశాంత్రి తీసుకోవటం కూడా సమాప్తి అయిపోతుంది. కానీ ఎంతగా అవ్యక్త లైట్ రూపంలో అవుతారో అంతగా శరీరానికి అతీతంగా అయ్యే అభ్యాసం అయిన కారణంగా రెండు, నాలుగు నిమిషాల అశరీరీగా అయితే నాలుగు గంటలు విశ్రాంతి తీసుకున్నట్లు అనుభవం అవుతుంది. ఇప్పుడు ఎలాంటి సమయం వస్తుందంటే నిద్రకు బదులు నాలుగు, ఐదు నిమిషాలు అశరీరీ అయితే ఎలా అయితే నిద్రతో శరీరానికి ఆహరం లభిస్తుందో అలాగే మీకు కూడా ఆహరం లభిస్తుంది. శరీరం అయితే పాతగానే ఉంటుంది, పాత కర్మలఖాతా ఉంటుంది కానీ, దీనిలో ఇది ఎడిషన్ గా ఉంటుంది. లైట్ స్వరూపం స్మృతిని గట్టిగా చేసుకోవటం ద్వారా కర్మలఖాతా ముక్తి చేసుకోవటంలో కూడా లైట్ రూపంగా అయిపోతుంది. ఎలా అయితే ఇంజక్షన్ చేయించుకోవటం ద్వారా 5 నిమిషాలలో తేడా వస్తుందో అలాగే నిద్రకు మాత్ర వేసుకోవటం ద్వారా అలజడి సమాప్తి అయిపోతుందో, అలాగే మీరు కూడా మేము నిద్ర యొక్క ఆహరం తీసుకుంటున్నాము అని అనుకోవాలి. ఇటువంటి స్థితి కోసమే ఈ అభ్యాసం అవసరం.
అమృతవేళ కూడా ఈ అభ్యాసం చేయాలి. మేము అవతరించాము అనే స్మృతిలో ఉండాలి. అప్పుడప్పుడు నేను అశరీరీని మరియు పరంధామ నివాసిని లేదా అవ్యక్త రూపంలో అవతరించాను అని మరియు అప్పుడప్పుడు నిరాకారిగా బావించండి. ఈ మూడు స్థితులలో ఎలాంటి అభ్యాసం ఉండాలంటే ఒక గది నుండి వేరే గదిలోకి వెళ్తున్నట్లుగా అనుభవం అవ్వాలి. అమృతవేళ విశేషంగా అశరీరీ భవ యొక్క వరదానం తీసుకోవాలి. ఇప్పుడు విశేషంగా ఇది అనుభవం చేసుకోవాలి. మంచిది, ఎక్కేకళ అన్నింటికి ఆధారం. ఎక్కేకళ యొక్క ప్రత్యక్ష స్వరూపం ఏమి ఉంటుంది? దానిలో సర్వుల ఉద్దరణ జరుగుతుంది. దీని ద్వారానే మీ ఎక్కేకళ యొక్క పురుషార్ధాన్ని చూసుకోగలరు. సర్వుల ఉద్దరణ జరుగుతుంది అంటే ఎక్కేకళలో ఉన్నట్లు సిద్ధి అవుతుంది. వాస్తవానికి ఇదే ధర్మామీటర్.
మీకు ఆదిలో శీతలదేవి యొక్క పాత్ర ఉండేది. ఇప్పుడు జ్వాలాదేవి యొక్క పాత్ర ఉండాలి, మొదట స్నేహంతో సమీప సంబంధంలోకి వచ్చారు. ఇప్పుడు శక్తిస్వరూపంగా అవ్వాలి. ఇప్పుడు కేవలం గుణాలు మరియు స్నేహం యొక్క ప్రభావం లేదా జ్ఞానం యొక్క ప్రభావం ఉంది. కానీ వీరు సాధారణ శక్తులు కాదు అని సాక్షాత్కారమూర్తిగా అనుభవం చేసుకోవాలి. ఎలా అయితే సూర్యుని కిరణాలు వ్యాపిస్తాయో అలాగే మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో శక్తులు లేదా విశేషతల రూపి కిరణాలు నలువైపుల వ్యాపిస్తూ అనుభవం చేసుకోవాలి. నేను విఘ్న వినాశకుడిని అనే ఈ స్మృతి యొక్క సీటుపై స్థితులై వ్యవహరం నడిపిస్తే విఘ్నం ఎదురుగా కూడా రాదు. మంచిది.
Comments
Post a Comment