* 15-04-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“త్రిమూర్తీ తండ్రి పిల్లల త్రిమూర్తీ కర్తవ్యము.”
త్రిమూర్తీ తండ్రి పిల్లలైన మీరందరూ కూడా త్రిమూర్తులేనా? త్రిమూర్తులుగా అయ్యి మూడు కార్యాలనూ చేస్తున్నారా? ఈ సమయములో రెండు కర్తవ్యాలను చేస్తారా లేక మూడింటిని చేస్తారా? ఏ కర్తవ్యాన్ని చేస్తారు లేక మూడు కర్తవ్యాలనూ తోడుతోడుగా చేస్తున్నారా? త్రిమూర్తులుగా అయితే అయ్యారు కదా? త్రిమూర్తులుగా ఏవిధంగా అయ్యారో అలాగే త్రికాలదర్శులుగా కూడా అయ్యారా? ప్రతి కర్మ లేక ప్రతి సంకల్పపు ఉత్పత్తి ఏదైతే ఉందో దానిని త్రికాలదర్శులుగా అయ్యి పిదప సంకల్పాన్ని కర్మలోకి తీసుకువస్తారా? ఎల్లప్పుడూ మూడు కార్యాలూ తప్పకుండా తోడుతోడుగా నడుస్తాయి. ఎందుకంటే ఒకవేళ పాత సంస్కారము లేక స్వభావము లేక వ్యర్థ సంకల్పాల వినాశనమే చెయ్యనట్లయితే క్రొత్త రచన ఎలా జరుగుతుంది? ఒకవేళ నూతన రచనను చేసి దాని పాలనను చెయ్యనట్లయితే ప్రాక్టికల్ గా ఎలా కనిపిస్తుంది? కావున త్రిమూర్తి తండ్రి యొక్క త్రిమూర్తి పిల్లలు మూడు కర్తవ్యాలను తోడుతోడుగా చేస్తున్నారా? వికర్మలు మరియు వ్యర్థ సంకల్పాలను వినాశనము చేస్తున్నారా? దీనినైతే ఇప్పుడు ఇంకా ఎక్కువ వేగముతో చెయ్యవలసి ఉంటుంది. కేవలము మీ వ్యర్థ సంకల్పాలు మరియు వికర్మలను భస్మము చెయ్యటమే కాదు, కానీ మీరైతే విశ్వ కల్యాణకారులు, కావున మొత్తము విశ్వములోని వికర్మల భారమును తేలిక చెయ్యటము మరియు అనేక ఆత్మల వ్యర్థ సంకల్పాలను తొలగించటము - ఇది శక్తుల కర్తవ్యము. కావున వర్తమాన సమయములో ఈ వినాశ కర్తవ్యమును మరియు తోడుతోడుగా నూతన శుద్ధ సంకల్పాల స్థాపనా కర్తవ్యము, ఈ రెండూ కూడా ఫుల్ ఫోర్స్ లో నడవాలి. ఏదైనా చాలా పవర్‌ఫుల్ మిషనరీ ఉన్నట్లయితే క్షణకాలములో ఆ వస్తువు రూపము, రంగు, గుణము, కర్తవ్యము మొదలగునవన్నీ మారిపోతాయి. మిషన్లో పడటము, మారిపోవటము. అలా ఇప్పుడు వినాశనము మరియు స్థాపనా కర్తవ్యము కూడా తీవ్రముగా అవ్వనున్నది. ఏ విధముగా మిషనరీలో పడడంతోనే వస్తువు రూపము, రంగు మారిపోతుందో, అలాగే ఈ ఆత్మిక మిషనరీలో మీ ముందుకు ఏ ఆత్మలు వస్తాయో వారి సంకల్పాలు, స్వరూపము, గుణాలు, మరియు కర్తవ్యాలు మారిపోతాయి. కేవలము ఆత్మలవే కాకుండా పంచతత్త్వాల గుణము మరియు కర్తవ్యము కూడా మారిపోనున్నాయి. అటువంటి మిషనరీ ఇప్పుడు ప్రాక్టికల్ గా నడవనుంది, కావుననే వినాశనము మరియు స్థాపన రెండు కర్తవ్యాలూ తోడుతోడుగా నడుస్తూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకా తీవ్రంగా నడవనుంది. ఏవిధంగా మహాదానుల వద్ద భిక్షగాళ్ళ గుంపు ఉంటుందో అలా మీ అందరి ముందు కూడా బికారుల గుంపు ఏర్పడేది ఉంది. మీ వద్ద ప్రదర్శనీలలో గుంపు మూగినప్పుడు ఏం చేస్తారు? క్యూ పద్ధతిని పెట్టి, క్లుప్తంగా కేవలము సందేశాన్ని ఇస్తారు. రచన యొక్క జ్ఞానాన్ని ఇవ్వలేరు, కేవలము రచయిత అయిన తండ్రి పరిచయాన్ని మరియు సందేశాన్ని మాత్రమే ఇవ్వగలరు. అలాగే బికారుల గుంపు ఉన్నప్పుడు కేవలము ఈ సందేశాన్ని మాత్రమే ఇస్తారు. కానీ ఆ ఒక్క క్షణములో ఇచ్చే సందేశము శక్తిశాలిగా ఉంటుంది, ఆ సందేశము ఆ ఆత్మలలో సంస్కారము రూపంలో ఇమిడిపోతుంది. సర్వధర్మాల ఆత్మలు కూడా ఈ యాచనను యాచించేందుకు వస్తారు. క్రీస్తు కూడా యాచించే రూపంలో ఉన్నారు అని అంటారు కదా! కావున ధర్మపితలు కూడా ఆ రూపంలో మీ ముందుకు వస్తారు. వారికి ఏ భిక్షను ఇస్తారు? ఇదే సందేశమును ఇవ్వాలి. ఎంతటి శక్తిశాలి సందేశంగా ఉండాలంటే, ఈ సందేశపు శక్తిశాలీ సంస్కారము ద్వారా ధర్మస్థాపన చేసేందుకు నిమిత్తులుగా అవుతారు. ఆ సంస్కారము అవినాశిగా అయిపోతుంది ఎందుకంటే మీకు కూడా అంతిమ సంపూర్ణ స్థితి సమయములో అవినాశీ సంస్కారము ఉంటుంది. ఇప్పుడు సంస్కారమును అవినాశీగా తయారుచేసుకుంటూ ఉన్నారు, ఇప్పుడు ఎవరికైనా సందేశాన్ని ఇచ్చినా మరియు శ్రమ చేసినా కూడా అది సదాకాలము కొరకు ఉండదు. కొంత సమయము ఉంటుంది మళ్లీ తరువాత ఢీలా అయిపోతుంది. కానీ అంతిమ సమయములో మీ సంస్కారమే అవినాశీగా అయిపోతుంది. కావున అవినాశీ సంస్కార శక్తి ఉన్న కారణంగా వారికి కూడా ఎటువంటి శిక్షణ మరియు సందేశాన్ని ఇస్తారంటే, దాని ద్వారా వారి సంస్కారము కూడా అవినాశిగా అయిపోతుంది. మరైతే ఇప్పుడు ఏ పురుషార్థమును చెయ్యవలసి ఉంటుంది? సంస్కారాలను మార్చుకోవలసిందే, కానీ అవినాశీ ముద్రను వెయ్యండి. గవర్నమెంటు వారి ముద్ర వేస్తారు కదా! ఎవ్వరూ తియ్యలేని విధంగా సీల్ చేసేస్తారు. అదేవిధంగా మాయ అర్థకల్పము వరకు తియ్యలేనంతగా సీల్ వెయ్యండి. కావున అవినాశీ సంస్కారాలను తయారుచేసుకొనే తీవ్ర పురుషార్థమును చెయ్యాలి. ఎప్పుడైతే మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి సంకల్పమును కర్మలోకి తీసుకువస్తారో అప్పుడే ఇది జరుగుతుంది. ఏ సంకల్పము ఉత్పన్నమైనా, సంకల్పాన్ని పరిశీలించుకోండి. మాస్టర్ త్రికాలదర్మీ స్టేజ్ పై ఉన్నానా? ఒకవేళ ఆ స్టేజ్ పై స్థితులై కర్మ చేసినట్లయితే ఏ కర్మా వ్యర్థమవ్వదు, వికర్మ మాటే ఉండదు. ఇప్పుడు వికర్మల ఖాతా నుండి పైకి వచ్చారు. వికల్పము కూడా సమాప్తము, వికర్మ కూడా సమాప్తము. ఇప్పుడు ఇది వ్యర్థ కర్మ మరియు వ్యర్థ సంకల్పముల విషయము. ఈ వ్యర్థమును మార్చి సమర్థ సంకల్పము మరియు సమర్థ కార్యమును చెయ్యాలి. దీనినే సంపూర్ణ స్థితి అని అంటారు, మరి ఇప్పుడు మహాదానులుగా అయ్యారా?
ఎన్ని రకాల దానాన్ని చేస్తారు? డబుల్ దానులా లేక ట్రిపుల్ దానులా లేక ట్రిపుల్ కన్నా(మూడు కన్నా) ఎక్కువనా? (ప్రతి ఒక్కరూ వారి వారి ఆలోచనను వినిపించారు) ముఖ్యంగా మూడు దానాలను చెప్పారు, జ్ఞాన దానాన్ని కూడా చేస్తారు, యోగము ద్వారా శక్తుల దానాన్ని కూడా చేస్తున్నారు మరియు మూడవ దానము - కర్మ ద్వారా గుణాల దానము. కావున ఒకటేమో మనసు ద్వారా దానము, రెండవది వాచ ద్వారా దానము మరియు మూడవది కర్మ ద్వారా దానము. మనసు ద్వారా సర్వశక్తుల దానము, వాణి ద్వారా జ్ఞాన దానము, కర్మ ద్వారా సర్వగుణాల దానము. కావున ఎల్లప్పుడూ రోజు ప్రారంభమవుతున్నప్పుడు మొదటగా ఈ ప్లానును తయారుచేసుకోండి - ఈరోజు ఈ మూడు దానాలూ ఏయే రూపముతో చెయ్యాలి మరియు రోజు సమాప్తమైన తరువాత మేము మహాదానులుగా అయ్యామా? మూడు రకాల దానాలనూ చేసామా? అని పరిశీలించుకోండి. ఎందుకంటే మూడు రకాల దానాలకూ వాటి వాటి ప్రారబ్ధము మరియు ప్రాప్తి ఉన్నాయి. ఏవిధంగా భక్తి మార్గములో కూడా ఎవరెవరు ఏ విధమైన దానాన్ని చేస్తారో వారికి ఆ విధమైన ప్రాప్తి లభిస్తుంది, అలాగే ఎవరైతే ఈ మహాన్ జీవితంలో ఎంతగా మరియు ఎలాంటి దానము చేస్తారో అంతగానే, అలాంటి భవిష్యత్తే తయారౌతుంది. కేవలము భవిష్యత్తే కాకుండా ప్రత్యక్ష ఫలము కూడా లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా వాణి దానము గానీ లేక కర్మ దానము గానీ చెయ్యకుండా కేవలము మనసా దానము చేసినట్లయితే వారికి ప్రత్యక్ష ఫలము ఇంకోవిధంగా లభిస్తుంది. ఇప్పుడు మీరు కర్మ ఫిలాసఫీని మంచిగా తెలుసుకున్నారు కదా! మూడు దానాల ప్రాప్తి వాటి వాటిది. ఎవరైతే మూడు దానాలనూ చేస్తారో వారికి మూడు ఫలాలూ(ఫలితాలు) ప్రత్యక్ష రూపములో లభిస్తాయి. మీకు కర్మల గతి తెలుసు కదా! మనసా దానానికి గల ప్రత్యక్ష ఫలము ఏమిటో చెప్పండి. మనసు ద్వారా మహాదానిగా అయ్యే వారికి ప్రత్యక్ష ఫలంగా ఈ ప్రాప్తి లభిస్తుంది - ఒకటి, వారు తమ మనస్సుపై అనగా సంకల్పాలపై ఒక్క క్షణములో విజయులుగా అవుతారు, అనగా సంకల్పాలపై విజయులుగా అయ్యేందుకు శక్తి లభిస్తుంది మరియు ఎవరైనా చంచలమైన సంకల్పాలు కలిగినవారైనా గానీ, అనగా ఒక్క క్షణము కూడా వారి మనస్సు ఒక్క సంకల్పముపై స్థిరంగా ఉండలేకపోతే, అటువంటి చంచల సంకల్పాలు కలిగినవారిని కూడా తమ విజయము యొక్క శక్తితో అల్పకాలము కొరకు శాంతిగా చేస్తారు మరియు చంచలము నుండి అచలముగా చేసేస్తారు. ఎవరైనా దుఃఖముతో బాధపడుతున్నవారిని ఇంజెక్షన్ ద్వారా స్పృహ లేకుండా చేస్తారో, వారి దుఃఖపు చంచలత సమాప్తమైపోతుందో, అలాగే మనసు ద్వారా మహాదానులుగా అయ్యేవారు తమ దృష్టి, వృత్తి మరియు స్మృతుల శక్తి ద్వారా అలాగే వారిని శాంతిని పొందిన అనుభవజ్ఞులుగా తయారు చెయ్యగలరు కానీ అది అల్పకాలము కొరకే ఉంటుంది, ఎందుకంటే వారికి తమ పురుషార్థము ఉండదు. కానీ మహాదానీ యొక్క శక్తి ప్రభావముతో కొద్ది సమయము కొరకు వారు అనుభవము చెయ్యగలరు. కావున ఎవరైతే మనసు యొక్క మహాదానిగా ఉంటారో వారి సంకల్పములో ఎంతటి శక్తి ఉంటుందంటే వారు ఏ సంకల్పమును చేస్తే దాని సిద్ధి లభించేస్తుంది. కావున మనసా మహాదాని సంకల్పాల సిద్ధిని ప్రాప్తి చేసుకొనే వారిగా అవుతారు. సంకల్పాలను ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టగలరు. సంకల్పాలకు వశమవ్వరు, కానీ సంకల్పాలు వారి వశమవుతాయి. సంకల్పాల రచననేదైతే రచిస్తారో, దానిని రచించనూ గలరు. సంకల్పాలను ఎప్పుడు వినాశనము చేసుకోవాలనుకుంటే అప్పుడు వినాశనము చెయ్యగలరు. కావున అటువంటి మహాదానిలో సంకల్పాలను రచించే, సంకల్పాలను వినాశనము చేసే మరియు సంకల్పాను పాలన చేసే మూడు శక్తులూ ఉంటాయి. కావున ఇదే మనస్సు యొక్క మహాదానము. మాస్టర్ సర్వశక్తివంతుని ప్రత్యక్ష స్వరూపము కనిపిస్తుందని భావించండి. అర్థమైందా!
వారు మాస్టర్ సర్వ శక్తివంతులుగా అయ్యారు మరియు ఎవరైతే వాచా మహాదానులో వారికి ఏం లభిస్తుంది? వారు మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ లు. వారి ఒక్కొక్క మాటకు కూడా చాలా విలువ ఉంటుంది. ఒక్క రత్నము విలువ అనేక రత్నాల కంటే అధికంగా ఉంటుంది. వాచ ద్వారా మీరు రత్నాల దానమును చేస్తారు కదా! కావున ఎవరైతే జ్ఞానరత్నాల దానమును చేస్తారో వారి ఒక్కొక్క రత్నము ఎంతటి విలువైనదిగా అవుతుందంటే, వారి ఒక్కొక్క మాటను వినేందుకు అనేక ఆత్మలు దాహార్తితో ఉంటాయి. వారి ఒక్క మాట అనేక ఆత్మల దాహాన్ని తీర్చేదిగా తయారవుతుంది. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్, వాల్యుబుల్ (విలువైనవారిగా) మరియు మూడవది - సెన్సిబుల్ (సారముగలవారిగా) అవుతారు. వారి ఒక్కొక్క మాటలో సెన్స్ (వివేకము) నిండి ఉంటుంది. సెన్స్ అనగా సారము లేకుండా ఏ మాటా ఉండదు. ఎవరైనా అటువంటి సెన్స్ తో మాట్లాడినట్లయితే వీరైతే చాలా సెన్సిబుల్ గా ఉన్నారు అని అంటారు కదా! వాణి ద్వారా వారి సెన్స్ తెలుస్తుంది. కావున రెండు విధాలుగానూ సెన్సిబుల్ గా తయారవుతారు. ఇది లక్షణము మరి ఏ ప్రాప్తి లభిస్తుంది? వాచాదానిగా అయ్యేవారికి విశేష ప్రాప్తిగా ఒకటేమో సంతోషము ఉంటుంది, ఎందుకంటే ధనాన్ని చూసి సంతోషిస్తారు కదా! రెండవది వారు ఎప్పుడూ అసంతుష్టులుగా అవ్వరు, ఎందుకంటే ఖజానా నిండుగా ఉన్న కారణంగా, ఎటువంటి అప్రాప్తి వస్తువు లేని కారణంగా ఎల్లప్పుడూ సంతుష్టంగా మరియు హర్షితంగా ఉంటారు. వారి ఒక్కొక్క మాట బాణము సమానంగా అనిపిస్తుంది. ఎవరికి ఏది చెప్తే అది వారికి గురి కుదిరిపోతుంది. వారి మాట ప్రభావశాలిగా ఉంటుంది. వాణిని దానము చెయ్యటం ద్వారా వాణిలో చాలా గుణాలు వచ్చేస్తాయి. స్థితిలో సహజంగానే సంతోషపు ప్రాప్తి ఉంటుంది. ప్రాప్తిని పొందేందుకు పురుషార్థము చెయ్యరు, కానీ స్వతహాగానే ప్రాప్తించేస్తుంది. ఏదైనా గని నుండి వస్తువు వెలువడినట్లయితే అది తరగనంతగా ఉంటుంది కదా! అలాగే లోపల నుండి సంతోషము స్వతహాగనే వెలువడుతూ ఉంటుంది. ఇది వరదాన రూపంలో ప్రాప్తిస్తుంది. సంతోషము కొరకు పురుషార్థము చెయ్యలేదు. వాణి ద్వారా దానము చెసేందుకే పురుషార్థము చేసారు, కానీ ప్రాప్తిగా సంతోషము లభిస్తుంది.
కర్మణ ద్వారా గుణాల దానము చేస్తే ఎటువంటి మూర్తిగా అవుతారు? ఫరిస్తా. కర్మల దానము అనగా గుణాలను దానము చెయ్యటం ద్వారా వారి నడవడిక మరియు ముఖము రెండూ ఫరిస్తాలాగా కనిపిస్తాయి. రెండు రకాల లైట్ లభిస్తుంది అనగా ప్రకాశమయంగా కూడా ఉంటారు మరియు తేలికతనము కూడా ఉంటుంది. ఏ అడుగును వేసినా తేలికగా ఉంటుంది, భారమును అనుభవము చెయ్యరు. ఏదో శక్తి నడిపిస్తోంది అని అనుభవము చేసుకుంటారు. ప్రతి కర్మలో సహాయమును అనుభవము చేసుకుంటారు. ప్రతి కర్మలో సర్వుల ద్వారా ప్రాప్తించిన వరదానాలను అనుభవము చేసుకుంటారు. రెండవది, ప్రతి కర్మ ద్వారా మహాదానిగా అయ్యేవారు సర్వుల ఆశీర్వాదములకు పాత్రులుగా అయిన కారణంగా వారి జీవితంలో సర్వ వరదానాల ప్రాప్తిని అనుభవము చేస్తారు. కష్టముగా కాదు, కానీ వరదానాల రూపంలో. కావున కర్మలో దానము చేసేవారు ఒకటేమో ఫరిస్తా రూపులుగా కనిపిస్తారు, రెండవది సర్వ వరదానాల మూర్తులుగా తమను అనుభవము చేసుకుంటారు. కావున, ఏ రకమైన దానము చేసేందులోనైనా తక్కువగా అయితే చెయ్యటం లేదు కదా? మూడు దానాలనూ చేస్తున్నానా? అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మూడింటి లెక్కను అయితే ఏదో ఒక రూపంతో పూర్తి చెయ్యాలి. అందుకొరకు పద్ధతి, ఛాన్సును వెదకండి. ఛాన్సు లభిస్తే చేస్తాము అని భావించడం కాదు. ఛాన్సు తీసుకోవాలి గానీ ఛాన్సు లభించాలని అనుకోకూడదు. అటువంటి మహాదానులుగా అవ్వటం ద్వారా లైట్ మరియు మైట్ (ప్రకాశము, శక్తి)ల వలయము కనిపిస్తుంది. మీ మస్తిష్కము నుండి ప్రకాశపు వలయము కనిపిస్తుంది మరియు నడవడిక ద్వారా, వాణి ద్వారా జ్ఞానరూపీ శక్తి వలయము కనిపిస్తుంది అనగా బీజము కనిపిస్తుంది. మాస్టర్ బీజరూపులు కదా! అటువంటి ప్రకాశము మరియు శక్తుల వలయముతో కనిపించేవారు సాక్షాత్ మరియు సాక్షాత్కారమూర్తులుగా అయిపోతారు. అర్థమైందా!
ఇక్కడ, ఈ హాలులో ప్రకాశము మరియు శక్తితో రెండు కిరీటాలూ కనిపించే చిత్రమేదైనా ఉందా? (కొందరు లక్ష్మీనారాయణుల చిత్రమంటే, కొందరు బ్రహ్మ చిత్రమని అన్నారు) చూడండి, చిత్రమును చూడటం ద్వారా ముఖము కూడా అలా మారిపోతుంది. కావున మీరు కూడా అలా చైతన్య చిత్రాలుగా అవ్వండి, మిమ్మల్ని చూడటంతోనే అందరి చరిత్ర మరియు దృష్టి-వృత్తి మారిపోవాలి. అలా అవ్వాలి మరియు అవుతూ కూడా ఉన్నారు. వరదాన భూమిలోకి రావటము అనగా వరదానానికి అధికారిగా అవ్వటము. యాత్ర చేస్తారు కదా, ఎందుకు వెళ్తారు? (పాపాలను తొలగించుకొనేందుకు) ఆ భూమిలో ఆ విశేషత ఉంది కాబట్టే వెళ్తారు. ఈ భూమిలో మరి ఏ విశేషత ఉంది? ఉన్నదే వరదానాల భూమిగా, అక్కడ వరదానాల ప్రాప్తి అయితే ఉండనే ఉంది. స్వయము నుండే వరదానము లభిస్తుంది కదా, అడిగే అవసరము లేదు. కావున ఈ రోజు నుండి అడగటము సమాప్తము. స్వయమును అధికారులుగా భావించండి. అచ్ఛా!
Comments
Post a Comment