04-12-1972 అవ్యక్త మురళి

* 04-12-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"మహావీర్ ఆత్మల ఆత్మిక డ్రిల్"

           ఈ సమయంలో అందరూ ఎక్కడ కూర్చున్నారు? సాకార ప్రపంచములో కూర్చున్నారా లేక ఆకార ప్రపంచములో కూర్చున్నారా? ఆకారీ ప్రపంచములో, ఈ సాకార ప్రపంచపు ఆకర్షణ నుండి దూరంగా స్వయమును అనుభవము చేసుకుంటారా, ఆకారీ రూపములో స్థితులవుతూ సాకార ప్రపంచపు ఎటువంటి ఆకర్షణ అయినా తన వైపుకు ఆకర్షితము చెయ్యటం లేదు కదా? సాకార ప్రపంచములోని భిన్న భిన్న రకాలైన ఆకర్షణల నుండి ఒక్క క్షణములో స్వయమును అతీతముగా మరియు తండ్రికి ప్రియముగా తయారుచేసుకోగలరా? కర్మ చేస్తూ కూడా కర్మబంధనము నుండి దూరముగా, బంధనయుక్తము నుండి బంధనముక్త స్థితిని అనుభవము చేసుకుంటున్నారా? ఆత్మిక మహావీరులు-మహావీరుణులు అయిన మీరు ఇప్పుడిప్పుడే శరీరము నుండి దూరంగా అశరీరీ, ఆత్మ-అభిమానీ, బంధనముక్తముగా, యోగయుక్తముగా అయిపోండి అని డైరెక్షన్ లభించినట్లయితే క్షణకాలములో స్థితులవ్వగలరా? ఏవిధంగా హఠయోగులు తమ శ్వాసను ఎంత సమయము కావాలంటే అంత సమయము ఆపగలరో మరి సహజయోగులు, స్వతహాయోగులు, సదా యోగులు, కర్మయోగులు, శ్రేష్ఠయోగులు అయిన మీరు మీ సంకల్పాలను, శ్వాసను ప్రాణేశ్వరుడైన తండ్రి జ్ఞానము ఆధారముతో ఏ సంకల్పమును, ఎటువంటి సంకల్పమును ఎంత సమయము కావాలంటే అంత సమయము అదే సంకల్పములో స్థితి చెయ్యగలరా? ఇప్పుడిప్పుడే శుద్ధ సంకల్పములో రమించటము, ఇప్పుడిప్పుడే ఒకే సంకల్పములో స్థితులవ్వటము - ఈ అభ్యాసము సహజంగా చెయ్యగలరా? ఏవిధంగా స్థూలంగా నడుస్తూ నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఆగగలరు కదా. అచల్-అడోల్ (స్థిరము-దృఢము)ల గాయనము ఏదైతే ఉందో అది ఎవరికి ఉంది? మహావీరులు-మహావీరిణులు అయిన మీరు శ్రీమతముపై నడిచే శ్రేష్ఠ ఆత్మలు కదా! శ్రీమతము తప్ప మిగిలిన అన్ని మతాలు సమాప్తమైపోయాయి కదా. ఏదైనా ఇతర మతము యుద్ధమేమీ చెయ్యటం లేదు కదా? మన్మతము కూడా యుద్ధము చెయ్యకూడదు. శాస్త్రవాదుల మతము, గురువుల మతము, కలియుగ సంబంధీకుల మతము - ఇవైతే సమాప్తమైపోయాయి. కానీ మన్మతము అనగా మీ అల్పజ్ఞ ఆత్మ సంస్కారాల అనుసారంగా సంకల్పము ఉత్పన్నమౌతుంది మరియు ఆ సంకల్పమును వాణి మరియు కర్మ వరకు కూడా తీసుకువస్తారు, మరి దీనినేమంటారు? దీనిని శ్రీమతమని అంటారా? లేక వ్యర్థ సంకల్పాల ఉత్పత్తిని శ్రీమతమని అంటారా? కావున శ్రీమతముపై నడిచేవారు ఒక్క సంకల్పమును కూడా మన్మతము లేక ఆత్మల మతముపై అనగా పరమతముపై చెయ్యజాలరు. స్థితి యొక్క వేగము తీవ్రంగా లేని కారణంగా శ్రీమతములో ఏదో ఒకటి మన్మతము లేక పరమతము కలుస్తుంది. ఏవిధంగా స్థూలమైన కారును నడిపించేటప్పుడు, పెట్రోల్ లో ఒకవేళ కాస్తయినా చెత్త కలిసినట్లయితే, రిఫైన్ గా లేనట్లయితే అది స్పీడ్ ను అందుకోదు. అలాగే ఇక్కడ కూడా స్పీడ్ పెరగదు. ఎక్కడా మిక్స్ (కల్తీ) అయితే జరగటం లేదు కదా అని పరిశీలన చేసుకోండి మరియు చేయించండి. ఈ మిక్స్, ఫిక్స్ అవనివ్వదు, క్రిందకు-మీదకు అవుతూ ఉంటుంది. శ్రేష్ఠ ఆత్మలు, పద్దమాపదమ భాగ్యశాలీ ఆత్మలు ఒక్క అడుగును కూడా పదమాల సంపాదన లేకుండా పోగొట్టరు. ఆత్మిక డ్రిల్లు వస్తుంది కదా! ఇప్పుడిప్పుడే నిరాకారీ, ఇప్పుడిప్పుడే ఆకారీ, ఇప్పుడిప్పుడే సాకారీ కర్మయోగి. ఆలస్యమవ్వకూడదు. ఏవిధంగా ఈ సాకారీ రూపము మీదో, అలాగే నిరాకారీ, ఆకారీ రూపము కూడా మీవే కదా! మీ వస్తువును స్వీకరించటంలో ఆలస్యమెందుకు? ఇతరుల వస్తువును తీసుకోవటానికి కొంత సమయము పడ్తుంది, ఆలోచన నడుస్తుంది, కానీ ఇదైతే మీ అసలైన స్వరూపమే. ఏవిధంగా స్థూలమైన డ్రెస్ ను కర్తవ్య ప్రమాణంగా ధరిస్తారో మరియు తీసేస్తారో, అలాగే ఈ సాకారీ దేహరూపీ వస్త్రమును కర్తవ్యప్రమాణంగా ధరిస్తారు మరియు అతీతంగా అయిపోతారు. కానీ స్థూల డ్రెస్ కూడా ఒకవేళ బిగుతుగా ఉన్నట్లయితే సులభంగా వదలదు, అలాగే ఒకవేళ ఆత్మ యొక్క ఈ దేహరూపీ వస్త్రము దేహపు, ప్రపంచపు, మాయ ఆకర్షణలో బిగుతుగా ఉన్నట్లయితే అనగా లాగుతూ ఉన్నట్లయితే సహజంగా తొలగిపోదు అనగా సహజంగా అతీతంగా అవ్వజాలరు. సమయము పడుతుంది, అలసట కలుగుతుంది. ఏ కార్యమైనా సంభవము కానప్పుడు అలసట లేక వ్యాకులత ఉండనే ఉంటాయి. వ్యాకులత ఒకచోట స్థిరంగా ఉండనివ్వదు. మరి ఈ భక్తి యొక్క భ్రమించటము ఎందుకు మొదలైంది? ఆత్మ ఈ శరీరరూపీ వస్త్రమును ధరించటంలో మరియు అతీతంగా అవ్వటంలో అసమర్థమైపోయింది. ఈ దేహభానము తనవైపుకు లాగుతుంది, అప్పుడు వ్యాకులపడి భ్రమించటము మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు శ్రేష్ఠ ఆత్మలైన మీరందరూ ఈ శరీర  ఆకర్షణ నుండి దూరంగా ఒక్క క్షణములో స్థితులవ్వగలరా? అటువంటి అభ్యాసము ఉందా?  అభ్యాసము యొక్క పరీక్షా సమయము ఎప్పుడుంటుంది? కర్మభోగపు జోరు ఎక్కువగా ఉన్నప్పుడు. కర్మేంద్రియాలు పూర్తిగా కర్మభోగమునకు వశమై తమవైపుకు ఆకర్షితము చెయ్యటము... దీనినే చాలా ఎక్కువ నెప్పి అని అంటారు. చాలా నెప్పిగా ఉంది అని అంటారు కదా, కావున స్వల్పమైన దానిని మరచిపోయారు. కానీ ఇది టగ్ ఆఫ్ వార్ జరిగే సమయము, ఇటువంటి సమయములో కర్మభోగమును కర్మయోగములోకి పరివర్తన చేసేవారు, సాక్షులుగా అయ్యి కర్మేంద్రియాలను భోగింపచేసేవారుగా అవుతారు, వారినే అష్టరత్నాలు అని అంటారు, వారు అటువంటి సమయములో విజయులుగా అయ్యి చూపిస్తారు ఎందుకంటే అష్టరత్నాలలో ఎల్లప్పుడూ అష్ట శక్తులు స్థిరంగా ఉంటాయి, అటువంటి అష్టరత్నాలే భక్తులకు అల్పకాలపు శక్తుల వరదానాలను ఇచ్చే ఇష్టులుగా అవుతారు.

           ఇటువంటి అష్ట భుజధారులు అనగా అష్ట శక్తి నంపన్నులు, శక్తి రూపపు మహావీరులు-మహావీరిణులకు, ఒక్క క్షణములో సంకల్పమును కంట్రోల్ చేసే సర్వ శ్రేష్ఠ ఆత్మలకు, సర్వ ఆత్మలకు తండ్రి పరిచయమును ఇప్పించే ఆత్మలకు, తప్పిపోయిన ఆత్మలను తండ్రితో కలిపించే ఆత్మలకు, దప్పికగొన్న ఆత్మలను సదాకాలము కొరకు తృప్తులుగా చేసే ఆత్మలకు, బంధనముక్త-యోగయుక్త-యుక్తియుక్త- జీవనముక్త ఆత్మలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

           మేళ అనగా మిలనము. ఇక్కడ అంతిమ మిలనము ఏది? సంగమమునకు చెందిన విషయమును వినిపించండి. కర్మాతీత స్థితి కూడా మొదట మిలనము జరిగినప్పుడే ఉంటుంది. బాబా సంస్కారములు బాబా గుణములు, బాబా కర్తవ్యపు స్పీడ్ మరియు బాబా అవ్యక్త నిరాకారీ స్థితియొక్క స్టేజ్ - అన్నింటిలో సమానత యొక్క మేళ జరుగుతుంది... ఆత్మలు ఎప్పుడైతే తండ్రి సమానతా మేళాను జరుపుకుంటాయో అప్పుడు జయజయకారాలు జరుగుతాయి, వినాశనమునకు సమీపంగా వస్తారు. బాబా సమానతయే వినాశనమును సమీపంగా తీసుకువస్తుంది. మేళా జరిగిన తరువాత ఏముంటుంది? అతి శాంతి. కావున ఆత్మలు కూడా మేళాను జరుపుకుంటాయి, మళ్ళీ వానప్రస్థములోకి వెళ్ళిపోతాయి. వానప్రస్థముఅని అన్నా అనండి లేక కర్మాతీతతము అని అన్నా అనండి, కానీ మొదటైతే ఈ మేళ ఉంటుంది. అచ్ఛా!

Comments