11-10-1975 అవ్యక్త మురళి

11-10-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్వయంపై రాజ్యం చేసేవారే విశ్వమహారాజులు.

                      దేహం యొక్క సర్వ సంబంధాలు మరియు సంపర్కాల నుండి నష్టోమోహులుగా చేసేటువంటి, హీరో పాత్ర అభినయించే పిల్లలతో విశ్వరాజ్యభాగ్యాన్ని ఇచ్చేటువంటి, సదా జీరో శివబాబా మాట్లాడుతున్నారు -
                     ఈరోజు సర్వశ్రేష్ట పాత్రధారి శ్రేష్ట ఆత్మల యొక్క సభను చూస్తున్నారు. బాప్ దాదా కూడా ప్రతి ఒక హీరో పాత్రధారి యొక్క అలౌకిక పాత్ర చూసి హర్షిస్తున్నారు. హీరో పాత్ర అభినయించేటందుకు ముందు స్వయాన్ని జీరోగా భావించాలి. జీరోగా భావించటం ద్వారానే హీరో పాత్ర అభినయించగలరు. రోజంతటిలో స్వయాన్ని చూసుకోవాలి - ఎంత సమాయం నేను జీరో రూపంలో స్థితులై ఉన్నాను అంటే హీరో అయ్యి పాత్ర అభినయించాను మరియు ఎంత సమయం దేహధారిగా అంటే సాధారణ పాత్ర అభినయించాను? అని.
                     హీరో పాత్ర అభినయించేటందుకు విశేషంగా రెండు శక్తులు కావాలి. అవి ఏమిటి? ఒకటి రూలింగ్ పవర్ (పరిపాలించేశక్తి), రెండు కంట్రోలింగ్ పవర్ (అదుపులో ఉంచుకునే శక్తి). ఈ రెండింటి ఆధారంగానే సదా శ్రేష్ట పాత్రను అభినయించగలరు. కంట్రోలింగ్ పవర్ అనేది స్వయం యొక్క సంకల్పం స్వభావం, సంస్కారం, సమయం, సంపర్కం మరియు సంబంధంలో ఉండాలి. ఏ సమయంలో ఏ సంకల్పం చేయాలో ఆ సమయంలో అదే సంకల్పం ప్రత్యక్షం చేయాలి. సమయం కూడా ఏ కర్తవ్యంలో ఏవిధంగా ఉపయోగించాలో ఆవిధంగానే  ఉపయోగించాలి. ఎలా అయితే ఏదైనా స్థూల వస్తువు లేదా ఖజానా ఎక్కడ ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగిస్తారు కదా! అదేవిధంగా సమయ రూపి ఖజానాను ఎక్కడ ఎంత ఉపయోగించాలో అంత మరియు అక్కడే ఉపయోగించగలుగుతున్నారా? అలాగే ఏ సమయంలో ఏ స్వభావ సంస్కారాలు ఉండాలో అవే ఉండాలి. ఎక్కడ ప్రేమ స్వరూపంగా ఉండే స్వభావం లేదా సంస్కారం ఉండాలో ఆ సమయంలో ప్రేమ స్వరూపం యొక్క సంస్కారం ప్రత్యక్షం అవ్వాలి. ఎప్పుడు నియమపూర్వకంగా ఉండాలో అప్పుడు నియమపూర్వకంగా ఉండాలి. అంటే ప్రేమ స్వరూపం మరియు నియమ స్వరూపం రెండు సంస్కారాలు సమయం మరియు సేవాప్రమాణంగా మనవిగా చేసుకునే శక్తి ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వినాశకారిగా అవ్వాలి, విరాఠరూపం అంటే శక్తి రూపం ధారణ చేయాలి మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నేహి లేదా శీతలా రూపాన్ని ధారణ చేయాలి. అంటే ఎప్పుడు ఏవిధమైన గుణమూర్తిని ధారణ చేయాలంటే ఆవిధమైన గుణమూర్తిగా అవ్వాలి. ప్రేమమూర్తిగా అవ్వవలసిన సమయంలో శాంతిమూర్తిగా అవ్వటం మరియు జ్ఞానమూర్తిగా అవ్వవలసిన సమయంలో యోగమూర్తిగా అవ్వటం ఇలా ఉండకూడదు.
                        ఎలా అయితే స్థూల సాధనాలను లేదా శక్తులను అధికారిగా అయ్యి ఉపయోగిస్తున్నారో అలాగే సర్వ గుణాలను కూడా అధికారి అయ్యి ఉపయోగించండి. అదేవిధంగా మీ సంబంధం మరియు సంపర్కం మీ దేహం మరియు ఇతర దేహధారులతో ఎప్పుడు కావాలంటే అప్పుడు జోడించండి మరియు ఎప్పుడు అతీతం అయిపోవాలంటే అప్పుడు అతీతంగా, ఉపరామ్ గా అయిపోండి. దేహ సంబంధాలు లేదా సంపర్కం అనుకోనప్పటికీ తగుల్కుంటుంది అని అనకండి. ఇప్పుడిప్పుడే దేహం మరియు దేహ సంబంధీకులతో అతీతం అయిపోవాలి అని సంకల్పం రాగానే ఒక సెకనులో అతీతం అయిపోండి అంటే సంకల్పం చేస్తూనే స్వరూపంగా అయిపోండి. ఇక దేహ సంబంధాలు ఆకర్షించకూడదు. అలాగే దేహ సంబంధీకులతో లేదా సర్వ దేహధారులతో నష్టోమోహ అవ్వాలనుకుంటే సంకల్పంలో కూడా మోహం రాకూడదు. బలహీనతతో లేదా శ్రమతో లేదా భయంతో అంటే దైవీ పరివారం ఏమంటారో లేదా బాప్ దాదా ఏమంటారో లేదా ప్రజలు ఏమంటారో అనే ఈ లోకమర్యాదకు లేదా భయానికి వశమై తొలగించుకున్నారు. లేదా మాటలో, కర్మలో లేదా సంబంధ, సంపర్కంలో కంట్రోల్ చేసుకున్నారు కానీ సంకల్పంలో, సంబంధంలో లేదా సంపర్కాలలో ఆకర్షిస్తుంది. అంటే దీనిని కూడా కంట్రోలింగ్ పవర్ అని అనరు. ఈ సంబంధ, సంపర్కాలలో కూడా నష్టోమోహ అంటే ఉపరామ్ గా అవ్వాలి. స్వయాన్ని కూడా కంట్రోల్ చేసుకునే కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఇలా కంట్రోలింగ్ పవర్ ఉన్నవారు ఇప్పుడు కూడా మరియు భవిష్యత్తులో కూడా రూలింగ్ పవర్స్ తీసుకోగలరు. వర్తమాన రూలింగ్ పవర్ ఆధారంగాన రాజ్యాధికారిగా అవుతారు. నేను రాజుగా అవుతానా లేదా ప్రజలుగా అవుతానా అని తెలుసుకోవాలంటే జ్ఞానమనే దర్పణంలో ఈ రెండు శక్తులను స్వయంలో చూసుకోండి. జ్ఞానమనే దర్పణం అందరి దగ్గర ఉంది కదా? ఎంత జ్ఞానం తక్కువగా ఉంటుందో అంత దర్పణం శక్తిశాలిగా అంటే స్పష్టంగా ఉండదు మరియు నేనెవరు మరియు ఏవిధంగా అవుతాను? అని స్వయానికి స్వయం కూడా స్పష్టంగా చూసుకోలేరు. నేను ఏమి అవుతాను? అని బాబాని కూడా అడగవలసిన అవసరం ఉండదు. స్వయానికి స్వయమే దర్పణంలో చూసుకుని తెలుసుకోవచ్చు. ఏ కర్మేంద్రియాలకు వశీభూతం అవ్వటం లేదు కదా? మీ లోపలకు భూతాలను ఆహ్వానం చేస్తున్నారా? ఈ పంచ వికారాలే భూతాలు. భూతాలను ఆహ్వానిస్తున్నారు అంటే బాబా నుండి వేరయిపోతునట్లే ఎందుకంటే ఎక్కడ భూతాలు ఉంటాయో అక్కడ భగవంతుడు ఉండరు.
                          రోజంతటిలో ఎన్ని సార్లు బాబాతో అలుగుతున్నారు? అలిగినప్పుడే బాబాని వేరు చేస్తున్నారు మరియు మనస్సులో మనస్సులోనే ఏడుస్తున్నారు కూడా! బయటికి ఏడవటం కాదు కానీ మనస్సుతో ఏడవటమనేది చాలా భయానకమైనది. బయటి కన్నీళ్ళు అయితే నీటితో ముఖం కడుక్కుంటే పోతాయి. కానీ మనస్సు యొక్క కన్నీళ్ళు పోవడానికి బాబాకి సన్ముఖంగా రాకుండా మరియు బాబా తోడు తీసుకోకుండా తొలగిపోవు. ఏదైనా కర్మేంద్రియానికి వశీభూతం అవ్వటం అంటే రూలింగ్ పవర్ లేనట్లే. దీని ద్వారా స్వయంపై రాజ్యం చేయలేరు. ఇక అటువంటి వారు సృష్టిపై ఎలా రాజ్యం చేస్తారు? స్వయానికి స్వయం రాజుగా అవ్వటం లేదు, స్వయమే రాజుగా కాలేనప్పుడు విశ్వం ఎలా రాజుగా అంగీకరిస్తుంది? స్వయంపై ప్రజల రాజ్యం అంటే కర్మేంద్రియాలే  ప్రజలు వీటి రాజ్యం ఉంటే స్వయం ప్రజలుగా అయ్యేవారిగా భావించండి. కర్మేంద్రియాలపై రాజ్యం అంటే ప్రజలపై రాజ్యాధికారిగా ఉంటే విశ్వమహారాజు అయ్యేవారిగా భావించండి. కొన్ని కర్మేంద్రియాలపై రాజుగా మరియు కొన్నింటిపై లేకుండా ఉంటే, అంటే పూర్తి ప్రజలపై రాజ్యం చేయకపోతే వారు మహారాజుగా లేదా రాజుగా అవుతారా? విశ్వమహారాజుగా అవుతారా? ఎప్పుడు అవ్వలేరు. ఎవరైతే జ్ఞానధనాన్ని లేదా స్థూలధనాన్ని సేవార్ధం ఉపయోగిస్తున్నారు కానీ ప్రజలపై రాజ్యం చేయటం లేదు. అంటే వారిలో రూలింగ్ పవర్ లేదు అంటే వారు షావుకారులుగా అయ్యేవారిగా భావించండి. మాటి మాటికి ఏదోక కర్మేంద్రియాలకు లేదా దేహధారులకు లేదా దేహ సంపర్కాలకు దాసీ అవుతున్నారు లేదా ఉదాసీనంగా అవుతున్నారు అంటే దాస, దాసీలుగా అయ్యేవారు అని భావించండి. కర్మల గుహ్యగతి అర్ధమైందా? ఇప్పుడు ఇంకా బాబాని అడుగుతాము అంటారా లేదా స్వయానికి స్వయమే జడ్జ్ అయిపోయారా? జడ్జ్ మెంట్ చేసే శక్తి అయితే వచ్చింది కదా? రెండు శక్తులు మీలో ఎంత వరకు ధారణ అయ్యాయి? అని పరిశీలన చేసుకోండి. మంచిది.
                   స్వయాన్ని దర్పణంలో చూసుకునేవారికి, సదా బాబాకి సన్ముఖంగా ఉండేవారికి, స్వేచ్చతో దేహం మరియు దేహ సంబంధ, సంపర్కంలోకి వచ్చేవారికి, సదా స్వయం యొక్క స్వమానంలో ఉండేవారికి, మరియు సదా నిర్మాణ కర్తవ్యంలో తత్పరులై ఉండేవారికి, ఇలా బాబా సమానమైన శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments