11-09-1971 అవ్యక్త మురళి

* 11-09-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“డబుల్ రిఫైన్డ్ స్టేజ్."

           ఈరోజు మాట్లాడాలా? లేక చూడాలా? చూడటమే మాట్లాడటము కాదా? మాట్లాడవలసిన దానిని నోటితో కాకుండా నయనాల ద్వారా మాట్లాడే అనుభవము ఉందా? అలా వీలవుతుందా? అలా కూడా జరుగుతుందా? ఈనాటి ఈ సభ మాస్టర్ నాలెడ్జ్ ఫుల్, పవర్ ఫుల్, సక్సెస్ ఫుల్, సర్వీసబుల్ లతో కూడుకున్నది. మరి నయనాల ద్వారా తెలుసుకోలేరా? మీ మనసులోని భావన మరియు బుద్దిలోని సంకల్పాలను నయనాల ద్వారా ప్రకటించలేరా? ఇది కూడా చదువులోని పాఠమే కదా! మరి చెప్పండి, ఈరోజు బాప్ దాదా ఏం మాట్లాడాలనుకుంటున్నారు? తెలుసు కదా! మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ లు కదా!

           మరి ఈ పాఠాన్ని చదివేసినట్లయితే ఈ పాఠములోని పరీక్షను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నారా? మహావీరులుగా అయితే ఉండనే ఉన్నారు, ఇది మహావీరుల గ్రూపు కదా! ఇతరుల బ్యాటరీని చార్జ్ చేసే ఇంచార్జ్ లు. వీరందరూ నంబర్ వారీగా పాస్ అయిన గ్రూపు అని బాప్ దాదా చూస్తున్నారు. అనేక విషయాలను, అనేక అనుభవాలను చూస్తూ, పాస్ చేస్తూ చేస్తూ (దాటుతూ దాటుతూ) పాస్ అయిపోలేదా? మూడు ప్రకారాల పాస్ లు ఉన్నాయి. కావున ఈ మూడు రకాల పాస్ అన్న మాటలో పాస్ అయిపోవాలి. ఒకటి-ఏదైనా విషయాన్ని లేక దారిని పాస్(దాటటం) చెయ్యటం. ఇంకొకటి చదువులో పాస్ అవ్వటము మరియు సమీపమునుకూడా పాస్(దగ్గర) అని అంటారు. దగ్గరివారు అనగా సమీపరత్నాలు. మరి మూడు రకాల పాస్ అన్న పదములో పాస్ అయ్యారా? త్రిశూల తిలకము అనగా మూడు రకాల పాస్ అన్న మాటలో పాస్ అవ్వటము. ఈ తిలకము కనిపించటం లేదా? ఈ గ్రూపు మస్తకముపై ఈ త్రిశూల తిలకము మీకు కనిపిస్తుందా? బాప్ దాదాకు నేటి సభ ఎలా కనిపిస్తుందో మీకు తెలుసా? మీ సాక్షాత్కారమైతే తప్పకుండా జరుగుతుంది కదా! ఇప్పుడిప్పుడే మీ సాక్షాత్కారము జరుగుతుందా?(దాదీతో) చూడండి, వీరు సాక్షాత్కారమూర్తులు మరియు మీరు సాక్షీలు. మరి చెప్పండి, వీరి గ్రూపులో ఏ ఒక్క సాక్షాత్కారము జరుగుతూ ఉంది? వీరు(దాదీ) మైక్, మీరు(దీదీ) మైట్ లు. అంతేనా? వీరు శక్తిని ఇస్తారు, వారు మైక్ గా అయ్యి మాట్లాడుతారు. బాప్ దాదాకు ఏ సాక్షాత్కారము జరుగుతూ ఉంది? ఇప్పుడు రెండు కిరీటాలు లేవా? ఒకవేళ ఇప్పుడు డబుల్ కిరీటాలను ధరించనట్లయితే భవిష్యత్తులో కూడా డబుల్ కిరీటాలైతే లభించనే లభించజాలవు. కావున ఈ రోజు డబుల్ కిరీటధారులు, తిలకధారులు, సింహాసనాధికారులు, రాజఋషుల దర్బారును చూస్తున్నారు. ఈ దర్బారు ముందైతే భవిష్య దర్బారు వెలవెలబోతుంది. ఒకవేళ ఇప్పుడిప్పుడే మీ సంగమయుగీ కిరీటము, తిలకము మరియు సింహాసనాయుతమైన పురుషోత్తమైన, మర్యాదా సంపన్నమైన స్వరూపాన్ని మరియు తోడుతోడుగా మీ భవిష్య స్వరూపాన్ని కూడా చూసినట్లయితే రెండింటిలో ఏ రూపము స్పష్టంగా, ఆకర్షణామూర్తంగా, అలౌకికంగా, దివ్యమైనదిగా మరియు ఆత్మికంగా కనిపిస్తుంది? ఇప్పటిదా లేక భవిష్యత్తుదా? ఇప్పుడు పరదా చాటున సిద్ధమవుతున్నారా? స్టేజీపైకి రాలేదా? వర్తమాన సమయంలో స్టేజ్ పై ఏ రూపంలో ఉంటారు? ఇప్పటి మీ స్టేజ్ ఎంతవరకు వచ్చిందని భావిస్తున్నాము? అని మీ స్వరూపాలను సదా సాక్షాత్కారము చేసుకుంటూ మరియు చేయిస్తూ ఉండండి.

           ఒకటేమో ఫైనల్ స్టేజ్. మరి ఫైనల్‌గా ఉన్నారా? ఫైన్ గా ఉన్నారా? రిఫైన్ గా ఉన్నారా? ఈరోజుల్లో రిఫైన్ కూడా డబుల్ రిఫైన్ గా ఉంటుందన్నది తెలుసు. మరి ఇప్పుడు రిఫైన్ గా ఉన్నారా? డబుల్ రిఫైన్ గా అవ్వాలా లేక రిఫైన్ గా అవ్వాలా? ఒకసారి రిఫైన్ అయితే పూర్తి అయింది కదా! ఇప్పుడు డబుల్ రిఫైన్ గా అయ్యేందుకు వచ్చారు. ఫైనల్ డేట్ ఏది? ఒకవేళ ముందే అవ్వనట్లయితే మీ భక్తులు మరియు ప్రజలు మీ సంపూర్ణ స్వరూపపు సాక్షాత్కారమును ఎలా చేస్తారు? లేనట్లయితే మీ చిత్రాలను కూడా వంకరటింకరగా తయారుచేస్తారు. ఒకవేళ మీ సంపూర్ణత యొక్క, ఫైనల్ స్టేజ్ యొక్క సాక్షాత్కారమును చెయ్యనట్లయితే చిత్రాలనుకూడా ఎలా చేస్తారు? చిత్రాలను కూడా రిఫైన్ గా తయారుచెయ్యరు. కావున ముందు నుండే మీ సంపూర్ణ సాక్షాత్కారమును చేయించాలి. ఇప్పుడు మీ భక్తులలో గుణగానమును చేసే సంస్కారమును నింపినట్లయితే ద్వాపరయుగములోకి రావటంతోనే మీ చిత్రాలముందు గుణగానమును చేస్తారు. ఆత్మలందరిలో అన్ని పద్ధతులు, ఆచారవ్యవహారాలకు చెందిన సంస్కారాలనైతే ఇప్పటినుండే నింపాలి కదా, ఇది నింపుకునే సమయము. తరువాత ప్రాక్టికల్ చేసే సమయము. మీ ఆత్మలలో మొత్తము కల్పపు పూజ్య మరియు పూజారీతనముల రెండింటి సంస్కారములను ఇప్పుడు నింపుతున్నారు. ఎంతగా పూజ్యులుగా అవుతారో దాని అనుసారంగా పూజారీతనపు స్థితి కూడా ఆటోమేటిక్ గానే తయారవుతూ ఉంటుంది. కావున ఏవిధంగా మీ ఆత్మలలో మొత్తము కల్పపు సంస్కారమును నింపుతారో అలాగే మీ భక్తులలో కూడా ఇప్పుడే సంస్కారమును నింపుతారు. ఏవిధంగా మీ స్వరూపము ఉంటుందో అలాగే సంస్కారమును కూడా నింపుకుంటారు, కావున ఇప్పుడు త్వరత్వరగా మిమ్మల్ని మీరు ఫైనల్ స్టేజ్ లోకి తీసుకొనిరండి. ఇప్పుడు కూడా ఫైన్(అపరాధరుసుము) పడనంతగా అటువంటి ఫైనల్ స్టేజ్ ను తయారు చేసుకోండి. ఎవరైతే డబుల్  రిఫైన్ గా అయిపోతారో వారికి ఫైన్ పడదు. ఫైనల్ వారికి ఎటువంటి ఫైల్ మిగిలి ఉండదు, కావున ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమాప్తము చెయ్యండి. ఒకవేళ మహావీరులు కూడా ఫైన్ కట్టవలసి వస్తే ఇక వారు మహావీరులైనట్లా? కావుననే ఈ రోజు మాట్లాడేది లేదు, సూచనతోనే అర్థం చేసుకొనే వారు అని వినిపించటం జరిగింది. ఈ గ్రూపు కిరీటము, సింహాసనము కలిగిన గ్రూపు, కావున వారు వినటం ద్వారా ఎలా అర్థం చేసుకుంటారు! ఒకవేళ ఇప్పుడు కూడా చెప్తేనే చేసినట్లయితే, చెప్తే చేసేవారిని మనుష్యులు అని అంటారు. మీరైతే దేవతల కన్నా శ్రేష్ఠమైనవారు. బ్రాహ్మణులు అని అనండి లేక ఫరిస్తాలు అనైనా అనండి. ఫరిస్తాలు సూచన ద్వారానే అర్థం చేసుకుంటారు, భూమి పైన నివసించేవారు చెప్పటం ద్వారా అర్థం చేసుకుంటారు. అచ్ఛా!

           బాప్ దాదా మొత్తము విశ్వము ముందు ఈ గ్రూపును ఎటువంటి గ్రూపుగా భావిస్తున్నారు? ఎలా ఉన్నారో అదే చెప్పాలి. వీరైతే మొత్తము సృష్టికి శరణాగతిని ఇచ్చేవారే కానీ శరణాగతి అయ్యేవారు కారు. బాప్ దాదాల ముందు కూడా శరణాగతి అయ్యేవారు కారు. బాబాను సేవకునిగా చేసేవారు. మరి శరణాగతులుగా అయ్యారా లేక శరణాగతిని ఇచ్చేవారుగా అయ్యారా? మొత్తము సృష్టిలో మహిమాయోగ్యమైన పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీలో ఉన్నాయి. ఈ రోజు బాప్ దాదా సంపూర్ణ రూపాన్ని చూస్తున్నారు. ఎవరైతే ఒక్క సంకల్పమును కూడా అనుమతి లేకుండా చెయ్యరో వారినే ఆజ్ఞాకారులు అని అంటారు. ఈ గ్రూపు ఇందులో పాస్ అయ్యారు కదా! ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆజ్ఞాకారుల స్వరూపంలో స్థిరపరచుకొని అప్పుడు ఏ సంకల్పమునైనా చెయ్యండి. ఇలా ఎవరైతే సంపూర్ణ ఆజ్ఞాకారులుగా ఉంటారో వారే సంపూర్ణ విశ్వాసపాత్రులుగా కూడా ఉంటారు. ఈ గ్రూపు అయితే సంపూర్ణతకు సమీపంగా ఉంది కదా! సంపూర్ణ నమ్మకస్థులు అని ఎవరిని అంటారు? నమ్మకస్థుల ముఖ్య గుణము ఏముంటుంది? వారి ముఖ్య గుణము - తమ ప్రాణము పోయినా సరే, ప్రతి వస్తువును సంభాళిస్తారు. ఏ వస్తువునూ వ్యర్థముగా నష్టపరచరు. ఒకవేళ సంకల్పము, సమయము, మాటలు మరియు కర్మలు ఈ నాలుగింటిలో దేనినైనా వ్యర్థంగా పోగొట్టినట్లయితే లేక నష్టపు ఖాతాలోకి పోయినట్లయితే వారిని సంపూర్ణ విశ్వాసపాత్రులు అని అంటారా? ఎందుకంటే ఎప్పటినుండైతే జన్మ లభించిందో అప్పటినుండి ఆజ్ఞాకారులుగా, నిజాయితీపరులుగా అయ్యారా? ఒక్క చిన్న పైసాలో కూడా నిజాయితీ ఉంటుంది. కావున ఎప్పటినుండైతే జన్మ తీసుకున్నారో అప్పటినుండి మనస్సును అనగా సంకల్పము, సమయము మరియు కర్మలు వేటిని చేసినా వాటిని తండ్రి యొక్క ఈశ్వరీయ సేవార్థము చేస్తాము అన్న ఇటువంటి ప్రతిజ్ఞను చేసారా? సర్వ సమర్పణ అయ్యారా? కావున ఇవన్నీ బాబా యొక్క ఈశ్వరీయ సేవార్థము కొరకు. ఒకవేళ ఈశ్వరీయ సేవకు బదులుగా సంకల్పము లేక సమయము లేక తనువు ద్వారా ఏదైనా వ్యర్థ కార్యము జరిగినట్లయితే వారిని ఏమంటారు? వారిని సంపూర్ణ విశ్వాసపాత్రులు అని అంటారా? ఒకటి లేక ఒక్క క్షణము అన్నది ఏమంత పెద్ద విషయములే అని భావించకండి. ఒకవేళ ఒక్క నయాపైసలో అయినా విశ్వాసపాత్రులుగా అవ్వనట్లయితే వారిని సంపూర్ణ విశ్వాసపాత్రులు అని అనరు. ఈ గ్రూపు అయితే సంపూర్ణ ఆజ్ఞాకారులు, సంపూర్ణ విశ్వాసపాత్రులు కదా - ఇటువంటి సంపూర్ణ విశ్వాసపాత్రులు, ఆజ్ఞాకారులు, నిజాయితీపరుల గ్రూపును ఏమని అంటారు? నమస్తే నమస్తే తరువాత ఏముంటుంది? తండ్రి అయితే సంపూర్ణ ఆజ్ఞాకారి. ఒకరినొకరు చూసుకొని హర్షితులవుతున్నారు కదా! సంగమయుగపు దర్బారుకు వీరే అలంకారము. అచ్ఛా!

Comments