* 11-07-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“విశ్వకళ్యాణకారిగా అవ్వడానికి ముఖ్య ధారణలు.”
ఈనాటి ఈ సంగఠనను ఎటువంటి సంగఠన అని అందాము? గుజరాత్ సంగఠన అని అందామా? స్వయాన్ని గుజరాత్ వారిగా భావించడం లేదు కదా? ఎలా అయితే తండ్రి అనంతమైన యజమానిగా ఉన్నారో అలాగే మీరు కూడా నిమిత్తులుగా ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ వాస్తవానికి విశ్వ కళ్యాణకారులే. దృష్టి, వృత్తి మరియు స్మృతిలో కూడా విశ్వ కళ్యాణకారి భావన సదా ఉంటుందా లేక గుజరాత్ కళ్యాణ భావన ఉంటుందా? గుజరాత్ లో ఉన్నప్పటికీ లక్ష్యమైతే విశ్వ కళ్యాణమే కదా? అనంతమైన సేవలో ఉన్నారు కదా? ఇదైతే నిమిత్తంగా ఒక బాధ్యతను ఇవ్వడం జరిగింది, ఆ బాధ్యతను నిమిత్తమై చేస్తున్నారు. కానీ ఏ నషా ఉంటుంది? మేము విశ్వ కళ్యాణకారులము అనే వర్ణన చేస్తారు కదా. విశ్వాన్ని పరివర్తన చెయ్యాలి. ఏ సేవ చేసినా లేక సేవా సాధనాలను తయారుచేసినా కానీ అందులో కూడా విశ్వము అన్న పదాన్ని వ్రాస్తారు కదా, విశ్వ నవ నిర్మాణం చేసేవారు. విశ్వ పరివర్తన జరుగుతూ ఉంటుంది. ఒక ప్రదేశంలో శబ్దం చేస్తే అది నలు వైపుల వ్యాపిస్తుంది కదా. అలాగే మీరు ఒక స్థానంలో సందేశాన్ని వినిపిస్తే అది నలు వైపుల వ్యాపిస్తుంది కదా. కావున విశ్వ కళ్యాణకారులుగా అవ్వడానికి ముఖ్యంగా రెండు ధారణలు అవసరము. ఈ రెండు ధారణలతో హద్దులో ఉంటూ కూడా అనంతమైన క్యాణకారులుగా అవ్వగలరు. ఒకవేళ ఈ ధారణలు లేనట్లయితే వారి శబ్దం, వారి దృష్టి అనంతమైన విశ్వం వైపు చేరుకోదు. విశ్వ కళ్యాణకారిగా అవ్వడానికి కావలసిన రెండు ధారణలు ఏమిటి? ఏ రెండు ధారణల ఆధారంగా మీరు విశ్వ కళ్యాణ కార్యాన్ని చేస్తున్నారు? విశ్వ కళ్యాణం పట్ల మీకున్న శుభ భావనకు ప్రత్యక్ష ఫలితం తప్పకుండా లభిస్తుంది. భావనకు ఫలితము భక్తి మార్గంలో కూడా లభించింది, కానీ అది అల్పకాలము, ఇది సదాకాలము. ఆ ప్రత్యక్ష ఫలితం యొక్క ప్రాప్తి కోసం ముఖ్యంగా ఏ రెండు ధారణలు కావాలి? ధారణ లేనిదే స్వ మరియు సేవ యొక్క ఉన్నతి జరుగజాలదు. అది చేస్తున్నారు మరియు చెయ్యవలసిందే. చేస్తాము అని కూడా అనవద్దు. చేయ్యాల్సిందే. ముఖ్యమైన రెండు ధారణలు ఈశ్వరీయ రుహాబ్ (ఆత్మిక నషా) మరియు రెహమ్ (దయ). ఒకవేళ రుహాబ్ మరియు రెహమ్ రెండూ కలిసి ఉన్నట్లయితే మరియు సమానంగా ఉన్నట్లయితే ఈ రెండు గుణాల సమానతతో ఆత్మికత యొక్క స్థితి తయారవుతుంది, దీనినే ఆత్మికత లేక ఆత్మిక స్థితి అని అనడం జరుగుతుంది. రుహాబ్ కూడా పూర్తిగా ఉండాలి మరియు రెహమ్ కూడా పూర్తిగా ఉండాలి. ఇప్పుడు రుహాబ్ ను వదిలి కేవలం రెహమ్ లోకి వస్తుంటారు లేక రెహమ్ ను వదిలి రుహాబ్ లోకి మాత్రమే వస్తుంటారు, అందుకే రెండింటి సమానత ద్వారా తయారయ్యే ఆత్మిక స్థితిలో లోపం ఏర్పడుతుంది. అందుకే సదా ఏ కర్తవ్యం చేస్తున్నా కానీ, నోటి ద్వారా మాటలను వర్ణించినా కానీ ముందుగా రుహాబ్ మరియు రెహమ్(నషా మరియు దయ) రెండూ సమానంగా ఉన్నాయా అని పరిశీలించుకోండి. రెండింటినీ సమానంగా చేసినప్పుడు ఒకటి - తమ స్వమానాన్ని స్వయం నిలుపుకోగలరు, రెండు - సర్వాత్మల ద్వారా కూడా స్వమాన ప్రాప్తి లభిస్తుంది. స్వమానాన్ని వదిలి మాన్(కీర్తి) కోరికను పెట్టుకోవడం ద్వారా సఫలత లభించదు. మాన్ కోరికను వదిలి స్వమానములో స్థితులైనట్లయితే మాన్ నీడవలె మీ వెనుక వస్తుంది. భక్తులు అంధశ్రద్ధా వశంగా అయినా కూడా తమ దేవతలు మరియు దేవీల వెనుక ఎంతగా పరుగు తీస్తారు. అలా చైతన్యరూపంలో స్వమానములో స్థితులైన ఆత్మల వెనుక సర్వ ఆత్మలు కీర్తి కొరకు వస్తారు, పరుగెత్తుతారు. భక్తుల పరుగులను చూసారా? మీ స్మృతిచిహ్నము జడచిత్రాలు. వాటిలో కూడ చిత్రకారుడు ముఖ్యంగా ఈ ధారణనే నింపుతాడు, ఒకవైపు శక్తుల రుహాబ్ ను కూడా ఫుల్ ఫోర్స్ లో చూపిస్తారు మరియు తోడుతోడుగా దయను కూడా చూపిస్తారు. ఒకటే చిత్రంలో రెండు భావాలూ ప్రకటితమవుతాయి కదా! ఇలా ఎందుకు తయారుచేసారు? ఎందుకంటే ప్రాక్టికల్ లో మీరు రుహాబ్ మరియు దయాహృదయులుగా అయ్యారు. కావున జడ చిత్రాలలో కూడా ఈ ముఖ్య ధారణలనే చూపిస్తారు. కావున మీరు కూడా ఎప్పుడైతే సేవలో ఉంటారోసేవలో ప్రత్యక్షఫలమునకు ఆధారము ఈ రెండు ముఖ్య ధారణలపై ఉంది. దయాహృదయులుగా తప్పక అవ్వాలి, కానీ ఏ ఆధారముతో మరియు ఎప్పుడు? ఇది కూడా చూడాలి. రుహాబ్ ను ఉంచటం తప్పనిసరి. కానీ ఎలా మరియు ఏ పద్దతితో ప్రత్యక్షము చెయ్యాలి, ఇది కూడా చూడాలి. రుహాబ్ అన్నది. ఎవరైనా వర్ణిస్తేనో లేక చూపించటం ద్వారానో కనిపించదు, రుహాబ్ దృష్టి-వృత్తి ద్వారా స్వయమే తన సాక్షాత్కారమును చేయిస్తుంది. ఒకవేళ దాని వర్ణన చేసినట్లయితే రుహాబ్ మారిపోయి రోబ్ అధికార దర్పముగా కనిపిస్తుంది. కావున రోబ్ ను చూపించవద్దు. రుహాబ్ లో ఉండాలి.
రోబ్ ను కూడా అహంకారము లేక క్రోధము యొక్క వంశావళి అని అంటారు కావున రోబ్ ను చూపించకూడదు, కానీ రుహాబ్ లో తప్పక ఉండాలి. దయాహృదయముతో పాటు ఎంతెంతగా రుహాబ్ లో ఉంటారో అంతగా రోబ్ సమాప్తమయిపోతుంది. ఎవరు ఎటువంటి ఆత్మలైనా గానీ, దర్పము చూపించేవారు అయినా కూడా రుహాబ్ మరియు దయాహృదయులుగా అవ్వటం ద్వారా రోబ్ లోకి ఎప్పుడూ రారు. అంతేకానీ పరిస్థితులు అలా ఉన్నాయి అని లేక అటువంటి మాటలు వారు మాట్లాడరు కాబట్టి ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని కాదు. చెయ్యాల్సి వచ్చింది, ఇవైతే జరుగుతూనే ఉంటాయి, ఇప్పుడైతే సంపూర్ణంగా అవ్వలేదు. ఈ మాటలు లేక ఇటువంటి భాష ఈ సంగఠనలో ఉండకూడదు. ఎందుకంటే మీరు సేవకు నిమిత్తులు. అందుకే ఈ సంగఠనను మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ మరియు సర్వీసబుల్, సక్సెస్ ఫుల్ (సఫలత) సంగఠన అని అంటారు. విజయాన్ని సాధించేవారు ఎటువంటి కారణాలను వివరించరు. వారు కారణాన్ని నివారణలోకి పరివర్తన చేస్తారు. కారణాన్ని ముందుంచరు. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ మరియు సక్సెస్ ఫుల్ ఆత్మలు ఒక కారణం చేత సక్సెస్ ఫుల్ గా అవ్వకుండా ఉంటారా? ఎవరైతే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా మరియు సక్సెస్ ఫుల్ గా ఉంటారో వారు తమకున్న జ్ఞాన శక్తితో కారణాన్ని నివారణలోకి పరివర్తన చేస్తారు, అప్పుడు కారణమన్నది సమాప్తమవుతుంది. నిమిత్తమైన వారికి విశేషంగా తమ ప్రతి సంకల్పంపై కూడా అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే నిమిత్తమైన ఆత్మల పైననే అందరి దృష్టి ఉంటుంది. ఒకవేళ నిమిత్తమైనవారే ఇటువంటి కారణాలు చెప్తూ ఉంటే మిమ్మల్ని చూసి ముందుకు నడిచేవారు మీకు ఏమని సమాధానమిస్తారు? ఈ కారణం చేత మేము రాలేము, నడవలేము అని అంటారు. స్వయమే కారణాలను చెప్పేవారైతే ఇతరుల కారణాలకు నివారణను ఎలా ఇవ్వగలరు? ఎందుకంటే అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. ఎలా అయితే ఇక్కడ రోజు రోజుకీ నాలెడ్జ్ ఫుల్ గా అవుతూ ఉన్నారో అలాగే ప్రపంచం వారు కూడా విజ్ఞాన శక్తితో, విజ్ఞాన రీతిలో నాలెడ్జ్ ఫుల్ గా అవుతున్నారు. వారు మీ సంకల్పాలను కూడా మీ మస్తకం ద్వారా, నయనాలు మరియు ముఖం ద్వారా కూడా పరిశీలించేస్తారు. ఎలా అయితే ఇక్కడ జ్ఞాన శక్తి నిండుతూ ఉంటుందో అలాగే అక్కడ కూడా విజ్ఞాన శక్తి తక్కువగా లేదు, రెండింటి ఫోర్సు ఉంది. ఒకవేళ నిమిత్తమైనవారిలో ఏదైనా లోపం ఉన్నట్లయితే అది దాగదు. అందుకే నిమిత్తమైన మీరు అంతే విశేషంగా మీ సంకల్పములు, వాణి మరియు కర్మలపై అటెన్షన్ ఉంచాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అటెన్షన్ లేకపోతే మీ ముఖంలోని రేఖలు టెన్షన్ గా కనిపిస్తాయి. ఎలా అయితే రేఖలను చూసి వీరు ఏయే భాగ్యాలను పొందగలరు అని తెలుసుకుంటారో, అలాగే ఇది కూడా. అటెన్షన్ తక్కువగా ఉన్నట్లయితే ముఖంపై టెన్షన్ రేఖలు కనిపిస్తాయి. ఆ మాయ యొక్క జ్ఞానము గలవారు కూడా పూర్తిగా తెలుసుకుంటారు, వారు కూడా తక్కువేమీ కాదు. ఒక్కోసారి అలసత్వంతో మిమ్మల్ని మీరే పరిశీలించకపోవచ్చు కానీ వారు మాత్రం ఈ విషయంలో మీ కన్నా వేగంగా ఉన్నారు, ఎందుకంటే వారి పనే ఇది. కావున నిమిత్తమైనవారు ఇంతటి బాధ్యతను తీసుకోవలసి ఉంటుంది. ఏ విషయమైనా కష్టంగా అనిపిస్తుంది అంటే తప్పకుండా ఏదో లోపము ఉంది అని అర్థము. స్వయంపై నిశ్చయ బుద్ధులుగా ఉండటంలో ఒక్కోసారి లోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎలా అయితే బాబాపై 100 శాతం నిశ్చయం ఉందో అలా - ఒకవైపు నిశ్చయబుద్దిగల మీరు ఉండి, మరో వైపు విశ్వంలోని ఆత్మలందరూ ఉన్నా కానీ ఇందులో నిశ్చయంలో చలించకూడదు. అలాగే దైవీ లేక ఈశ్వరీయ ఆత్మల ద్వారా లేక ప్రపంచంలోని ఆత్మల ద్వారా చలింపజేసే కారణాలు ఏవైనా వచ్చినా కానీ స్వయం పైన కూడా నిశ్చయబుద్ధిలో లోపం రాకూడదు. అందుకే రుహాబ్ పాటు రెహమ్ (నషాతో పాటు దయ) కూడా ఉండాలి. కేవలం రుహాబ్ మాత్రమే సరిపోదు. రెహమ్ కూడా కావాలి.
నిశ్చయ బుద్ధిగా అయి కళ్యాణ భావనను ఉంచుకున్నట్లయితే దృష్టి మరియు వృత్తి రెండూ మారిపోతాయి. ఎటువంటి క్రోధి ఆత్మ అయినా, ఎదిరించే ఆత్మ అయినా కానీ, అవమానించేవారైనా కానీ, నిందిచే వారైనా కానీ, ప్రతి ఒక్కరి పట్ల కళ్యాణ భావన ఉన్నట్లయితే రోబ్ పరివర్తన చెంది రెహమ్ గా అవుతుంది. అప్పుడు రిజల్టు ఎలా ఉంటుంది? వారిని కదిలించగలరా? శుభ కళ్యాణముతో నిండిన భావన వారికి సంస్కారాలను మార్చే ఫలితాన్ని చూపించింది. ఇది తప్పకుండా జరుగుతుంది - కొన్ని విత్తనాల నుండి ప్రత్యక్ష ఫలితం వెంటనే వస్తుంది, మరికొన్ని విత్తనాల నుండి వెంటనే ప్రత్యక్ష ఫలితం రాదు, కొంత సమయం పడుతుంది. ఫలితం రావడమే లేదు అని ఇందులో అధైర్యపడవలసిన విషయమే లేదు. అన్ని ఫలాలు వెంటనే లభించవు. కొన్ని విత్తనాలు సహజంగా వర్షం కురిసినప్పుడే ఫలాలను ఇస్తాయి. నీరు అందించడం ద్వారా ఇవ్వవు. ఇది కూడా డ్రామాలోని విధి. ఇప్పుడు మీరు వేసే అవినాశి విత్తు నుండి కొన్ని ప్రత్యక్ష ఫలితాలు కనిపిస్తాయి. మరికొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, డ్రామాలోని దృశ్యం మారవలసి ఉన్నప్పుడు అటువంటి నాచురల్ వాయుమండలం, వాతావరణం ఆ బీజం నుండి ఫలితాన్ని బయటకు తీసుకువస్తుంది. వినాశనమైతే జరిగేదుంది - ఇది గ్యారంటీ. బీజమే అవినాశి అయినప్పుడు అందులో నుండి ఫలం రాకుండా ఉండటమన్నది జరుగదు, కాకపోతే కొన్ని వెంటనే వస్తాయి, మరికొన్ని ఆలస్యంగా వస్తాయి మరి ఇప్పుడు ఎలా వస్తాయి? అవి ఫలాలను కూడా చివరలోనే ఇస్తాయి అందుకే ఎప్పుడైనా కానీ సేవ చేసేటప్పుడు మేము చేసిందంతా వ్యర్థంగా పోయిందే అని ఆలోచించకండి. నంబరువారీగా సమయానుసారంగా ఫలాలు కనిపిస్తూ ఉంటాయి.
ఇది సక్సెస్ ఫుల్ గ్రూపు, నాలెడ్జ్ ఫుల్ మరియు సర్వీసబుల్ గ్రూపు. ఈ ముద్ర ఉంది. మీ ఈ ట్రేడ్ మార్క్ ను సదా చూసుకుంటూ ఉండండి. త్రిమూర్తి ముద్ర పడింది కదా. దీనిని స్మృతిలో పెట్టుకుని సేవలోని ప్రతి అడుగును పదమాల (అపారమైన)సంపాదనలోకి పరివర్తన చేసుకుంటూ నడుచుకోండి. ప్రతి సంకల్పంతో పదమాల సంపాదన జమ చేసుకుంటున్నానా అని పరిశీలించుకోండి. ప్రతి మాటతో, ప్రతి కర్మతో, ప్రతి అడుగుతో పదమాల సంపాదన చేసుకున్నానా? లేకపోతే ప్రతి అడుగులో పదమాలు అన్న నానుడి ఎందుకు ఉంది? పదమ్ అని కమల పుష్పాన్ని కూడా అంటారు. కావున పద్మము సమానంగా అయి నడుచుకున్నట్లయితే ప్రతి సంకల్పం మరియు ప్రతి అడుగులో కోటానురెట్ల సంపాదనను చేసుకోగలరు. ఒక్క సంకల్పం కూడా సంపాదన లేకుండా జరగకూడదు. ఇప్పుడు ఇది ఇంతటి అటెన్షన్ ను పెట్టే సమయము. ఒక్క అడుగు కూడా పదమాల సంపాదన లేకుండా ఉండకూడదు. నిమిత్తమైన గ్రూపు కదా. కిరీటధారులుగా అయితే అవ్వవలసిందే. తమ బాధ్యతా కిరీటాన్ని ఎంతెంతగా ధారణ చేస్తారో అంతంతగా ఇతరుల బాధ్యత అనే కిరీటాన్ని కూడా ధారణ చెయ్యగలరు. అందరి దృష్టి నిమిత్త టిచర్లు అయిన మీ మీదనే ఉంది. ఎదురుగా ఉదాహరణగా ఉన్నది మీరే కదా! అందుకే ఎక్కువ బాధ్యత మీపైనే ఉన్నది. మీరందరూ ఒక దర్పణంలా వారి ఎదుట ఉన్నారు. మీ జ్ఞాన స్థితి యొక్క దర్పణంతో వారి స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించే దర్పణం మీరు. కావున ఎంతగా దర్పణం శక్తిశాలిగా ఉంటుందో అంతగా సాక్షాత్కారం స్పష్టంగా ఉంటుంది, వారి స్మృతి అంతే శక్తిశాలిగా ఉంటుంది. మరి మీ ముందుకు ఎవరు వచ్చినా కానీ వారు తమ సాక్షాత్కారాన్ని స్పష్టంగా చేసుకుని ఆ స్మృతిని మరువలేనంతగా మీరు దర్పణంలా ఉన్నారా? మీ దేహ సాక్షాత్కారం అయ్యాక మీరు దానిని మర్చిపోగలరా?దేహము అవినాశిగా స్మృతిలో ఉండగలిగినప్పుడు ఈ స్వరూపాన్ని కూడా వారు మర్చిపోలేని విధంగా సాక్షాత్కారం చేయించండి. పవర్ ఫుల్ దర్పణంలా అవ్వడానికి ముఖ్యమైన ధారణలు ఏమిటి? ఎంతెంతగా స్వయం అర్పణమయంగా ఉంటారో అంతగా దర్పణం పవర్ ఫుల్ గా ఉంటుంది. వాస్తవానికైతే అందరూ అర్పణమయులుగానే ఉన్నారు, కానీ చేసే సంకల్పం కూడా, వేసే అడుగు కూడా ముందుగా బాబా ఎదుట అర్పించాలి. భోగ్ పెట్టేటప్పుడు బాబాకు అర్పిస్తారు కదా, అప్పుడు అందులో శక్తి నిండుతుంది. ఇది కూడా అలాగే, ప్రతి సంకల్పం, ప్రతి అడుగు బాబాకు అర్పించండి. ఏదైతే చేసారో, ఏదైతే ఆలోచించారో అందులో తండ్రి స్మృతి అనగా తండ్రి కర్తవ్యాల స్మృతి. ఎంతగా అర్పణమయ సంస్కారాలు ఉంటాయో అంతగా దర్పణం పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతి సంకల్పం నిమిత్తమై చేస్తే, నిమిత్తము అంటే అర్పణ. నమ్రచిత్తులుగా ఉండేవారు వంగుతారు. ఎంతగా సంస్కారాలలో, సంకల్పాలలో వంగుతారో అంతగా విశ్వం మీ ముందు వంగుతుంది. వంగడము అంటే వంగేట్లు చేసుకోవడము. సంస్కారాలలో కూడా వంగాలి. ఇతరులు కొంతైనా మా ముందు వంగాలి కదా అన్న సంకల్పాన్ని కూడా రానివ్వద్దు, మనం వంగితే అందరూ వంగుతారు. సత్యమైన సేవాధారులు అందరి ముందు వంగినప్పుడే కదా సేవ చేస్తారు. చిన్నవారు ప్రియమైన వారిగా ఉంటారు, అందుకే స్వయాన్ని గారాల పిల్లలుగా భావించండి. సర్వులకు స్నేహీలుగా ఉండండి. పెద్ద వారి కన్నా చెప్తాము కానీ, చిన్నవారినైతే వదిలేస్తాము. కానీ స్వయంలో ఎటువంటి లోపాన్నీ పెట్టుకోకండి. అందరికన్నా ముందుకు వెళ్ళే లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోండి. ముందుకు వెళ్తూ కూడా ముందుకు పంపించేవారి పట్ల గౌరవాన్ని వీడకండి. ముందుకు పంపించే వారి పట్ల గౌరవాన్ని ఉంచినట్లయితే వారు కూడా మీ పట్ల గౌరవాన్ని ఉంచుతారు. మీరు ఎలా చేస్తారో మిమ్మల్ని చూసి ఇతరులు చేస్తారు.
హ్యాండ్స్ అనగా విశాల బుద్ధి కలిగినవారు, ఎందులో నష్టముంది, ఎందులో లాభముంది అని వారు అన్ని వైపుల చూస్తారు. అందరూ విశాలబుద్ధి, త్రినేత్రి మరియు త్రికాలదర్శిగా ఉన్నారా? ఏ కర్మనైనా ముందు చూసి తర్వాత చేయండి. అప్పుడు, ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు అని ఎప్పుడూ అనరు. చెకింగ్ తక్కువైనప్పుడు ఇలా జరుగుతుంది. త్రికాలదర్శిగా ఉండేవారు, ఇలా అనుకోలేదు కానీ జరిగిపోయింది అని మాట్లాడరు. మాస్టర్ సర్వశక్తిమంతులు ఒకటి అనుకొని దానిని చెయ్యలేకపోవడము అన్నది జరుగుతుందా? ఇప్పుడు ఈ భాషను సమాప్తం చెయ్యండి. శక్తులు కదా! శక్తుల కర్మ మరియు సంకల్పం సమానంగా ఉంటాయి. సంకల్పం ఒకటి మరియు కర్మ మరొకటిగా ఉండటమంటే ఇది శక్తి లోపమే. అచ్ఛా!
Comments
Post a Comment