* 11-05-1977 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంపన్న స్వరూపానికి గుర్తు - శుభచింతన మరియు శుభచింతకులుగా ఉండటం
బాప్ దాదా ఎల్లప్పుడూ పిల్లలను సంపూర్ణ స్వరూపంలో చూస్తారు. పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా, ఆనంద స్వరూపులు, ప్రేమ,
సుఖ, శాంత స్వరూపులు. ప్రతి ఒక్కరి మస్తకము ద్వారా, నయనాల ద్వారా ఏమి కనిపిస్తుంది? ప్రతి ఒక్కరూ గుణాలు మరియు శక్తుల యొక్క బండారంగా ఉన్నారు. స్వయాన్ని కూడా ఈవిధంగా ఎల్లప్పుడూ సంపన్నంగా అనుభవం చేసుకుంటూ నడుస్తున్నారా? సంపన్న స్వరూపము యొక్క గుర్తు సర్వ ఆత్మలకు రెండు విషయాల ద్వారా కనిపిస్తుంది. ఆ రెండు విషయాలు ఏమిటి? ఇటువంటి సంపన్న ఆత్మలు సదా స్వయం ప్రతి శుభచింతనలో ఉంటారు మరియు అన్యాత్మల ప్రతి శుభచింతకులుగా ఉంటారు. కావున శుభచింతన మరియు శుభచింతక స్వరూపము ఈ రెండు గుర్తులు సంపన్న ఆత్మలలో కనిపిస్తాయి. సంపన్న ఆత్మల వద్ద అశుభ చింతన లేక వ్యర్థ చింతన స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఎందుకంటే శుభచింతన యొక్క ఖజానా, సత్యజ్ఞానము ఇటువంటి ఆత్మలలో ఎంతగానో ఉంటాయి. రాయల్ ఫ్యామిలీకి చెందిన పిల్లలు అశుభ చింతన లేక వ్యర్థ చింతన యొక్క రాళ్ళతో లేక మట్టితో ఆడుకోరు.
శుభచింతన కొరకు ఎంతో అపారమైన ఖజానా లభించింది, అది మీకు తెల్సింది కదా! అది అపారమైన ఖజానాయే కదా! శుభచింతన అనగా సమర్థ సంకల్పము. కావున సమర్థము మరియు వ్యర్ధము రెండు కల్సి ఉండలేవు. రాత్రి మరియు పగలు కల్సి ఉండవు. అమృతవేళ లేస్తూనే మరియు కళ్ళు తెరుస్తూనే ఏ శుభ సంకల్పము చేయాలో లేక ఏ చింతన చేయాలో కూడా బాప్ దాదా వినిపించారు. అమృతవేళ శక్తిశాలి అయిన బాబా యొక్క స్నేహ సహితంగా శుభ సంకల్పాలు చేసినప్పుడు దాని ప్రభావము మొత్తం రోజంతటిపైనా పడుతుంది. ఎందుకంటే అమృతవేళ ఆదికాలం, సతో ప్రధాన సమయం. అది బాబా ద్వారా పిల్లలకు లభించే వరదానాలు లేక విశేష సహయోగము యొక్క సమయం. కావున అమృతవేళ యొక్క, మొదటి సంకల్పము యొక్క ఆధారము మొత్తము రోజంతటి యొక్క దినచర్యపై పడుతుంది. బ్రహ్మ సంకల్పముతో సృష్టిని రచించారని అంటారు. సంకల్పానికి అంతటి మహత్వమును చూపించారు. బ్రహ్మ ఆదికాలములో రచనను రచిస్తారు. అలాగే బ్రాహ్మణులైన మీరు ఆదికాలము అనగా అమృతవేళలో ఏవిధమైన సంకల్పాలను రచిస్తారో అదేవిధంగా రోజంతటి దినచర్య రూపీ సృష్టి దానంతటదే జరుగుతూ ఉంటుంది.
బ్రాహ్మణుల యొక్క మొదటి సంకల్పము ఏమిటి? ఆ సమయంలో ఎటువంటి స్థితి ఉంటుంది? బాబా సమానమైన స్థితిలో స్థితులై కల్పుకుంటారు కదా! కళ్ళు తెరవగానే ఏ సంకల్పము కలుగుతుంది? బాబా తప్ప ఇంకెవరైనా కనిపిస్తారా? గుడ్ మార్నింగ్ చేసినప్పుడు పుత్రునిగా భావిస్తూ గుడ్ మార్నింగ్ చేస్తారు కదా! కావున కొడుకు అనగా యజమాని. అలాగే బాబా కూడా పిల్లలకు బదులిస్తారు. యజమానులైన బాలకులగు పిల్లలు, బాబాకు కూడా శిరోకిరీటమైన పిల్లలూ అని అంటారు. కావున మొదటి సంకల్పమే సమర్థవంతమైనది కదా! మొదటి మిలనము బాబాతో జరుగుతుంది మరియు మొదటి మిలనములో బాబా ప్రతిరోజూ సమాన భవ అన్న వరదానాన్ని ఇస్తారు. అందులో సర్వ వరదానాలు ఇమిడి ఉన్నాయి. కావున ఎవరి ప్రారంభమే ఇంత గొప్పగా ఉంటుందో వారి రోజంతా ఇంకెలా ఉంటుంది? అది వ్యర్ధమవ్వగలదా?
కానీ ఈవిధమైన శ్రేష్ఠమైన మిలనాన్ని సదా ఎవరు చేయగల్గుతారు? ఎవరి సంకల్పము మరియు సంసారము(ప్రపంచము) ఒక్క బాబాయే అని ఉంటుందో అటువంటి బాబా యొక్క సమీపమైన పిల్లల యొక్క మిలనము సమీపంగా జరుగుతుంది. లేకపోతే సమీపము యొక్క మిలనము జరుగదు, ఎదురుగా ఉండి మిలనము జరుగుతుంది. పిల్లలందరూ తప్పకుండా మిలనము జరుపుతారు. కానీ, (1) నెంబర్ వన్ పిల్లలు సమాన స్వరూపంతో సమీపంగా అనగా తోడును అనుభవం చేసుకుంటారు. తోడు కూడా ఎంతగా ఉంటుందంటే ఇద్దరు కారు ఒక్కరే అన్నట్లుగా ఉంటుంది. (2) రెండవ నెంబరువారు బాబా యొక్క స్నేహమును, బాబా యొక్క వరదానాలను, బాబా యొక్క మిలనమును సమాన స్వరూపంలో కాక సమానంగా తయారవ్వాలనే శుభ సంకల్పాలు స్వరూపంగా అయి కల్పుకుంటారు. సమ్ముఖము యొక్క అనుభవము అనగా బాబా ద్వారా సర్వప్రాప్తులు కలుగుతున్నాయి అని అనుభవం చేసుకుంటారు. కావున ఫస్ట్ నెంబరు వారు సమానంగా అయి కల్పుకుంటారు, రెండవ నెంబరువారు సమానంగా అవ్వాలి అన్న సంకల్పముతో కల్సుకుంటారు, మూడవ నెంబరువారి యొక్క విషయమే అడగకండి. (3) మూడవ నెంబరు వారి యొక్క లీల విచిత్రంగా ఉంటుంది. కాసేపు పిల్లలుగా అయి కల్పుకుంటారు, మరికాసేపు అడుక్కు నేవారిగా అయిపోతారు. బహురూపులుగా ఉంటారు. కాసేపు ఒక రూపంలో మరికాసేపు ఇంకొక రూపంలో కల్పుకుంటారు. కావున పిల్లలలో కూడా మిలనము జరపడంలో నెంబరువారీగా అయిపోతారు.
కాని ఎవరి సంకల్పమైతే సదా శ్రేష్టంగా ఉంటుందో అనగా బాబా సమానమైన స్వరూపంలో మిలనము జరుగుతుందో వారి అమృతవేళ యొక్క మొదటి సంకల్పము రోజంతటి దినచర్యపై ప్రభావము చూపుతుంది. ఇటువంటి ఆత్మలు నిరంతరము శుభచింతనలో స్వతహాగానే ఉంటారు. రెండవ నెంబరువారు స్వతహాగా అలా ఉండరు. పదే పదే అటన్షన్ ఉంచడం ద్వారా శుభచింతనలో ఉంటారు. మూడవ నెంబరువారు శుభచింతన మరియు వ్యర్థ చింతన ఈ రెండింటి యొక్క యుద్ధములో ఉంటారు. కాసేపు విజయులుగా, కాసేపు నిరుత్సాహులుగా అయిపోతారు. కావున సదా శుభచింతనలో ఉండండి. దాని సాధనము వినిపించాను కదా! అది ఆదికాలము యొక్క సమర్థ సంకల్పము. ఇటువంటి శుభవంతనలో ఉండేవారు, రోజంతటిలో, సంబంధ సంపర్కములలో సమీపంగా వచ్చే ఆత్మల ప్రతీ సదా శుభచింతకులుగా ఉంటారు. ఎటువంటి ఆత్మలు వచ్చినా సతోగుణ ఆత్మ కానీ, తమోగుణ ఆత్మ కానీ సంపర్కములోకి వచ్చినప్పుడు అందరి ప్రతి శుభచింతకులుగా అనగా అపకారులపై కూడా ఉపకారము చేయువారుగా ఉంటారు. ఎప్పుడూ ఏ ఆత్మపైనా ద్వేషము యొక్క భావన ఉండదు. ఎందుకంటే అజ్ఞానానికి వశీభూతులై ఉన్నారు, అనగా తెలివిలేని పిల్లలు అని భావిస్తారు. తెలివిలేని పిల్లలు చేసే ఏ కర్మలపైనా ద్వేషము కలుగదు. ఇంకా ఆ పిల్లలపై దయ లేక స్నేహము కల్గుతుంది. అలాగే శుభచింతకులు సదా స్వయాన్ని విశ్వపరివర్తకులుగా, విశ్వకళ్యాణకారులుగా భావిస్తూ ఆత్మలపై దయార్ద్రహృదయులుగా ఉన్న కారణంగా ద్వేషభావనకు బదులుగా సదా శుభ భావము, శుభ భావనను కలిగి ఉంటారు. ఈ కారణంగానే సదా శుభ చింతకులుగా ఉంటారు. ఇతడు ఇలా ఎందుకు చేసాడు అని ఆలోచించరు. అందుకు బదులుగా ఆ ఆత్మ యొక్క కళ్యాణము ఎలా జరగాలి అని ఆలోచిస్తారు. ఇటువంటి శుభచింతన యొక్క స్థితి సదా ఉంటుందా? శుభచింతన లేకపోతే, శుభ చింతకులుగా కూడా ఉండరు. రెండింటికీ సంబంధం ఉంది. సంపన్నముగా అవ్వాలి అన్న లక్ష్యమును ఉంచేవారు ఈ రెండు లక్షణాలను ధారణ చేయండి. అర్థమైందా? వ్యర్థ సంకల్పాలు నడిచినట్లయితే శుభచింతన యొక్క స్థితి నిలువజాలదు. కావున మీ చైతన్యశక్తిని చూడండి, శుభచింతకులుగా అయ్యే అభ్యాసకులుగా అవ్వండి. ఇవి మీ శక్తులే కదా!
ఎవరైతే సేవ చేస్తారో, అటువంటి సేవాధారుల ప్రతి బాబాకు విశేషమైన స్నేహము ఉంటుంది. ఎందుకంటే వారు త్యాగమూర్తులు కదా! కావున త్యాగము యొక్క భాగ్యము స్వతహాగానే లభిస్తుంది. అది ఎలా లభిస్తుంది, మరియు ఏం లభిస్తుంది అన్నది మీకు తెల్సా? ఒకటేమో కష్టపడి సంపాదించడం మరి ఇంకొకటి ఉన్నట్లుండి ఏదైనా లాటరీ లభిస్తే తమ పురుషార్ధము యొక్క శక్తుల యొక్క లేక సర్వగుణాల యొక్క అనుభూతిని చేసుకోవడం. ఇది అందరూ అనుభవం చేసుకుంటూ ఉంటారు. కానీ విశేష సహయోగము యొక్క ప్రత్యక్ష ఫలము వల్ల నా పురుషార్థము యొక్క స్థితి కన్నా ప్రాప్తి అధికంగా ఉంది అన్న అనుభూతి కలుగుతుంది. ఏ అనుభూతుల యొక్క పురుషార్థ లక్ష్యము ఎంతో సమయంగా ఉంచుతూ వచ్చారో ఆ అనుభూతులు ఈ విధంగా సహజంగా మరియు శక్తిశాలిగా ఉంటాయి. కోరుకోకపోయినా కూడా మనస్సు నుండి ఇది బాబా యొక్క అద్భుతమే అన్న మాట వెలువడుతూ ఉంటుంది. ఇలా జరగగలదు అని మీరు భావించనిది కూడా సాకారంలో అనుభవం చేసుకుంటున్నారు. కావున ఇటువంటి బాబా యొక్క విశేష వరదానముల ప్రాప్తి అనుభవము సహయోగీ ఆత్మలకు కలుగుతుంది. ఇటువంటి అనుభవము జీవితము యొక్క విశేష స్మృతి చిహ్న రూపంగా అయిపోతాయి. అచ్చా!
బాబా యొక్క సదా సహాయోగీ ఆత్మలకు, ప్రతి అడుగులోనూ బాబాను అనుసరిస్తూ, బాబాను ప్రత్యక్షము చేసేవారికి, సదా స్వయము యొక్క గుణాల ప్రాప్తి యొక్క అలలలో తేలియాడుతూ హర్షితముగా ఉండేవారికి, బాబా యొక్క స్నేహములో ఇమిడి ఉండే ఇటువంటి సమాన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్ దాదా: - సదా ఈ కర్మేంద్రియాల నుండి అతీతంగా అనగా స్వయాన్ని యజమాని అయిన ఆత్మగా భావిస్తూ బాబాకు ప్రియమైనవారిగా అవుతూ నడుస్తున్నారా? బాబాకు ప్రియమైనవారు ఎవరు? ఎవరైతే అతీతంగా ఉంటారో వారే ప్రియమైనవారు.
బాబా కూడా సర్వులకు ఎందుకు ప్రియమయ్యారు? ఎందుకంటే అతీతంగా ఉన్నారు. వారు అతీతంగా లేకపోతే మీ వలే జనన మరణాలలోకి వస్తే సర్వులకు ప్రియమైనవారిగా అవ్వజాలరు. కావున మీరు కూడా ఎప్పుడైతే సదా శరీరము యొక్క అభిమానము నుండి అతీతంగా భావిస్తూ నడుస్తారో అప్పుడు బాబాకు ప్రియమైనవారిగా అవ్వగల్గుతారు. అతీతంగా అవ్వకుండా ప్రియమైనవారిగా అవ్వలేరు. ఎవ్వరు ఎంతగా అతీతంగా అనగా ఆత్మిక స్మృతిలో ఉంటారో అంతగా బాబాకు ప్రియమైనవారిగా అవుతారు. కావుననే బాబా నెంబరువారీగా ప్రియస్మృతులను ఇస్తారు కదా! నెంబరు యొక్క ఆధారము అతీతంగా అవ్వడము పైనే ఉంది. మీ నెంబరును అతీతంగా ఉండే స్థితి ద్వారా తెల్సుకోగల్గుతున్నారా? బాబా పిల్లల యొక్క మాలను స్మరిస్తారు. మాలను స్మరించడంలో నెంబరు వన్ లో ఎవరు వస్తారు? ఎవరైతే అతీతంగా లేక సమానంగా ఉంటారో వారే వస్తారు. మేము చివరలో వచ్చాము మమ్మల్ని గూర్చి ఎవరికీ తెలియదు కదా అని భావించకండి. బాబాకు పిల్లలందరినీ గూర్చి తెలుసు. కావున ప్రియముగా అయ్యేందుకు ఆధారము అతీతంగా అవ్వడమే. ఇది పక్కాగా ఉంచుకోండి. ఈ మొదటి పాఠము యొక్క పూర్తి మార్కులు లభించాలి. కావున నడుస్తూ, మాట్లాడుతూ ఏ పని చేస్తున్నా చేయించేవానిగా అయి చేస్తున్నానా అని పరిశీలించుకోండి. ఆత్మ చేయించేది మరియు కర్మేంద్రియాలు చేసేవి. ఈ పాఠమును పక్కా చేసుకోవడం ద్వారా సదా సర్వ ఖజానాల అధికారీ స్వరూపము యొక్క నషా ఉంటుంది. అప్రాప్తి వస్తువనేదే అనుభవమవ్వదు. బాబా లభించగానే సర్వమూ లభించినట్లే. కేవలం నామమాత్రంగా కాదు వారికి సర్వప్రాప్తుల యొక్క అనుభవమూ కలుగుతుంది. సదా సంతోషము, శాంతి, ఆనందములలో మగ్నమై ఉంటారు. లభించేసేంది, పొందేసాము అన్న ఈ నషాయే ఉంటుంది.
సదా మీ అనుభవము యొక్క సీటుపై కూర్చుని ఉంటున్నారా? స్వమానము యొక్క సీటు ఏది? మీరు ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క ఉన్నతమైన పిల్లలు లేక బ్రాహ్మణులు. ఈ సర్వ శ్రేష్ఠ స్వమానంలో సదా స్థితులై ఉంటున్నారా లేక సీటు కదులుతోందా? మాయ సీటును కదిలించేందుకు ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే మీరు స్వయంగా ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క పిల్లలుగా అయ్యారో మరి అప్పుడు ఇది ఎందుకు మర్చిపోవాలి? ఈ బ్రాహ్మణ జన్మ కూడా సహజ జీవతం. జీవితంలోని విషయాలను ఎప్పుడూ మర్చిపోరు, అల్పకాలికమైన విషయాలను మర్చిపోతారు.
శుభచింతన యొక్క ఖజానాను ఏదైతే బాబా ఇస్తారో ఆ ఖజానాను పదే పదే స్మరించాలి అనగా ఉపయోగించాలి. ఉపయోగించడం ద్వారా సంతోషం కలుగుతుంది. శుభచింతనలో ఉండడం కూడా మననమే. మననము ద్వారా సంతోషము రూపీ వెన్న ఏదైతే వెలువడుతుందో అది జీవితమును శక్తిశాలిగా చేసేస్తుంది. మళ్ళీ దానిని ఎవరూ కదిలించలేరు. మాయ కదులుతుందే కానీ వారు స్వయం కదలరు. అంగదుని యొక్క ఉదాహరణ ఎవరిది? మహారథులది. కావున మీరు మహారథులే కదా! ఎప్పుడైతే కల్పపూర్వము కదలలేదో మరి ఇప్పుడు ఎలా కదులుతారు? సదా అచలంగా, అంగద సమానంగా సదా ఏకరస స్థితిలో స్థితులవ్వండి. ఎవరైతే కొద్దిగా కూడా సంకల్పంలో కూడా కదలరో వారే అంగదులు.
సదా శస్త్రధారులుగా అయి మాయను ఎదుర్కొంటూ నడుస్తున్నారా? ఎవరైతే శస్త్రధారులుగా ఉంటారో వారు సదా నిర్భయులుగా ఉంటారు. ఎవరి నుండి? శత్రువు నుండి. పహారా చేసే కాపలాదారుడు శస్త్రధారిగా ఉన్నప్పుడు మరియు అతనికి నేను శత్రువును ప్రారద్రోలేవాడిని అన్న నిశ్చయము ఉన్నప్పుడు, అతడు ఓటమిని చవి చూపించేవాడిగా ఉన్నప్పుడు అతడు ఎంత నిర్భయంగా నడుస్తూ ఉంటాడు. కావున ఇక్కడ కూడా మాయ ఎంతగా ఎదుర్కొన్నాసరే శస్త్రధారులుగా ఉన్నప్పుడు మాయతో ఎప్పుడూ భయపడరు, కంగారుపడరు, ఓటమిని చవిచూడరు. అనగా సదా విజయులుగా ఉంటారు. కావున సర్వ శస్త్రాలు సదా స్థిరంగా ఉంటాయి. ఒక్కటి తగ్గినా కానీ ఓటమి జరగవచ్చు. ఆ శస్త్రములు శక్తులు. కావున సర్వశక్తులరూపీశ స్త్రాలు సదా నిలిచి ఉంటున్నాయా? వాటిని సంభాళించడం మీకు వస్తుందా? పాండవుల యొక్క వీరత్వమును ఎత్తైన పెద్ద రూపంలో చూపించారు. అలాగే శక్తుల యొక్క వీరత్వమును శస్త్రాలతో చూపించారు. పాండవులు సదా ప్రభువుకు తోడుగా ఉండేవారు మరియు తోడు ఉన్న కారణంగా విజయులయ్యారు. మీకు కూడా సదా బాబా యొక్క తోడు అను భవమవుతుంది. ఎప్పుడైతే తోడు యొక్క అనుభవం ఉంటుందో అప్పుడు బాబా యొక్క గుణాలు, బాబా యొక్క శక్తులు మీవవుతాయి. ఏవిధంగా బాబా ఆత్మికంగా ఉన్నారో అలాగే తోడుగా ఉండేవారు కూడా ఆత్మీయతలో ఉంటారు, శరీరమును చూస్తూ కూడా ఆత్మను చూస్తారు.
అమృతవేళ యొక్క అనుభవమును అందరూ చేస్తున్నారా? ఎవరికైనా ఇంట్లో ఉంటూనే లాటరీ లభించినా అతడు దానిని వదిలివేస్తే అతడిని ఏమంటారు? అలాగే ఇక్కడ కూడా ఇంట్లోనే లాటరీ లభిస్తుంది. ఇప్పుడు ఈ లాటరీని తీసుకోకపోతే ఈ రోజులను కూడా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఇవి ప్రాప్తి యొక్క రోజులు. కొద్ది సమయం తర్వాత ఇవే రోజులు పశ్చాత్తాపానికి చెందినవిగా అయిపోతాయి. కావున ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి, స్పీడును పెంచండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ లేదు అన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఈ రోజు అని కూడా కాదు ఇప్పుడు అని భావించండి, దానినే తీవ్ర పురుషార్థము అని కూడా అంటారు.
ఇంటికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నారా? తయారవ్వడము అనగా అన్ని తాళ్ళు తెగిపోయి ఉండాలి. మరి అన్ని తెగిపోయాయా? తాళ్ళన్నీ తెగిపోయి ఉంటే ఇంటికి వెళతారు లేకపోతే జన్మ తీసుకోవల్సి వస్తుంది. సేవలో సమాప్తిని చేసారా? ఎప్పటివరకైతే విశ్వమునకు సందేశమునివ్వలేదో అప్పటివరకూ విశ్వకళ్యాణకారులు అన్న పేరు ఎలా రాగలదు? లేకపోతే భారతము యొక్క కళ్యాణకారులే అవుతారు.
ఏమి జరిగినా సరే శరీరము నుండి సహజముగా వెళ్ళిపోతాము అన్నంత అభ్యాసకులుగా అయ్యారా? ఈ అభ్యాసమును చేసారా? ఏ సంబంధము లేక సంస్కారము యుద్ధము చేయకూడదు. అందరూ వెళ్ళవలసిందే. కానీ కొందరు సహజంగా వెళతారు, కొందరు యుద్ధము చేస్తూ చేస్తూ వెళతారు. వెళ్ళేందుకు తయారుగా ఉన్నారు, అది సరే! కానీ సహజంగా వెళ్ళేందుకు తయారుగా ఉన్నారా? డైరెక్టుగా వెళతారా లేక వయా ధర్మరాజపురి వెళతారా? ధర్మరాజపురి కస్టమ్స్ పురి వంటిది. ఏదైనా మీతోపాటు ఉండిపోతే కస్టమ్స్ లో ఆగవల్సి ఉంటుంది. కావున వెళ్ళడంతోపాటు ఈ ఏర్పాట్లు కూడా కావాలి. కస్టమ్స్ క్లియర్ గా ఉందా, లేదా అని పరిశీలించాలి. పాస్ పోర్టు మొదలైనవన్నీ పరిశీలించుకోండి, బాగ్ బ్యాగేజీ నంతటినీ పరిశీలించుకోండి. అచ్ఛా! ఓంశాంతి..
Comments
Post a Comment