10-05-1972 అవ్యక్త మురళి

* 10-05-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“స్వమానములో ఉండటం ద్వారా ఆజ్ఞా పాలన."

         స్వమాన్ మరియు ఫర్ మాన్(స్వమానము మరియు ఆజ్ఞ) రెండింటిలోనూ ఉండటానికి మరియు నడవటానికి మిమ్మల్ని మీరు ధైర్యవంతులుగా భావిస్తున్నారా? స్వమానములో కూడా సదా స్థితులై ఉండాలి మరియు తోడుతోడుగా ఆజ్ఞపై కూడా నడుస్తూ ఉండాలి - ఈ రెండు విషయాలలో మంచిగా ఉన్నట్లు మిమ్మల్ని మీరు భావిస్తున్నారా? ఒకవేళ స్వమానములో స్థితులై ఉండనట్లయితే ఆజ్ఞపై నడవటములో కూడా ఏదో ఒక లోపము కలుగుతుంది. కావున రెండు విషయాలలో మిమ్మల్ని మీరు యథార్థ రూపములో స్థిరము చేసుకుంటూ సదా అటువంటి స్థితిని తయారుచేసుకోవాలి. వర్తమాన పురుషోత్తమ సంగమయుగములో బ్రాహ్మణులైన మీ ఉన్నతోన్నతమైన స్వమానము ఏదైతే ఉందో అందులో స్థితులవ్వాలి. ఈ ఒక్క శ్రేష్ఠ స్వమానములో స్థితులవ్వటం ద్వారా భిన్న భిన్న రకాల దేహ అభిమానము స్వతహాగనే మరియు సహజముగానే సమాప్తమైపోతుంది. అక్కడక్కడా సేవ చేస్తూ చేస్తూ లేక తమ పురుషార్థములో నడుస్తూ నడుస్తూ ఒక్క అక్షరమునకు చెందిన చాలా చిన్న పొరపాటు చేసేస్తారు, దాని వల్లనే మళ్ళీ అన్ని పొరపాట్లు జరిగిపోతాయి. అన్ని పొరపాట్లకు బీజము ఒక్క అక్షర లోపము. ఆ అక్షరము ఏది? స్వమానము నుండి స్వ అన్న అక్షరాన్ని తీసేస్తారు, స్వమానమును మర్చిపోతారు. మానము(కీర్తి కాంక్ష)లోకి రావటం ద్వారా ఫర్ మాన్(ఆజ్ఞ)ను మర్చిపోతారు. స్వమానములో స్థితులవ్వండి అన్నది ఆజ్ఞ. మరి మాన్ లోకి రావటం ద్వారా ఫర్ మాన్ అంతమైపోయింది కదా. ఈ ఒక్క అక్షరము యొక్క పొరపాటు ద్వారా అనేక పొరపాట్లు జరుగుతాయి, మళ్ళీ మాన్ లోకి వచ్చి మాట్లాడటము, నడవటము, చెయ్యటము అన్నీ మారిపోతాయి. కేవలము ఒక్క అక్షరము కట్ అయినందువలన వాస్తవిక స్థితి ఏదైతే ఉందో దాని నుండి కట్ అయిపోతారు. ఇటువంటి స్థితిలోకి వచ్చిన కారణంగా పురుషార్థము లేక సేవనేదైతే చేస్తారో దాని రిజల్టుగా శ్రమ ఎక్కువ మరియు ప్రత్యక్షఫలము తక్కువగా వెలువడుతుంది. సఫలతామూర్తులుగా అవ్వాలని ఏదైతే కోరుకుంటారో అలా తయారవ్వలేరు మరియు సఫలతామూర్తులుగా అవ్వని కారణంగా లేక సఫలత ప్రాప్తి కాని కారణంగా దాని రిజల్టు ఎలా ఉంటుంది? శ్రమను చాలా చేస్తారు కావున నడుస్తూ నడుస్తూ అలసిపోతారు. ఉల్లాసము తక్కువ అవుతూ అవుతూ సోమరితనములోకి వచ్చేస్తారు మరియు ఎక్కడైతే సోమరితనము వస్తుందో అక్కడ దాని ఇతర సహచరులు అనేకము వచ్చేస్తాయి. సోమరితనము తన సహచరులందరి సహితంగా వస్తుంది, ఒంటరిగా రాదు. ఏవిధంగా తండ్రి కూడా ఒక్కరుగా రారో, తన పిల్లల సహితంగా ప్రత్యక్షమౌతారో, అలాగే ఈ వికారాలు కూడా ఒంటరిగా రావు, సహచరులతోటి వస్తాయి, మళ్ళీ వికారాల ప్రవేశత ఉన్న కారణంగా, అనేక ఆజ్ఞలను ఉల్లంఘన చేసిన కారణంగా స్థితి ఏమవుతుంది? ఏదో ఒక విషయములో కోరిక ఉండిపోతుంది. కేవలము ఒక్క అక్షరమును కట్ చేసిన కారణంగా స్వయమూ సంతుష్టంగా ఉండరు, ఇతరులనూ సంతుష్టంగా చెయ్యలేకపోతారు. కావున మీ ఉన్నతి కొరకు ఏ ప్రయత్నమునైనా చేసినప్పుడు లేక సేవకు సంబంధించి ఏదైనా ప్లాన్‌ను తయారుచేసి ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చినప్పుడుగానీ ప్లాన్ తయారుచేసే సమయములో మరియు ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చే సమయములో కూడా మొదట మీ స్వమానపు స్థితిలో స్థితులవ్వండి, అప్పుడు మళ్ళీ ఏ ప్లాన్‌నైనా తయారుచేయండి మరియు ప్రాక్టికల్ లోకి తీసుకురండి. స్థితిని వదిలి ప్లాన్ ను తయారు చేయకండి. ఒకవేళ స్థితిని వదిలి ప్లాన్ ను తయారు చేసినట్లయితే ఏమవుతుంది? అందులో ఎటువంటి శక్తి ఉండదు. శక్తి లేకుండా  ఆ ప్లాన్‌కు ప్రాక్టికల్ లో ఏం ప్రభావము ఉంటుంది?

               సేవనైతే చాలా ఎక్కువగా చేస్తారు, చాలా విస్తారము చేస్తారు కానీ బీజరూప స్థితిని వదిలివేస్తారు. విస్తారములోకి వెళ్ళటం ద్వారా సారాన్ని తీసేస్తారు. కావున ఇప్పుడు సారాన్ని తీసెయ్యకండి, విస్తారమును ఇముడ్చుకోవటము అనగా సార స్వరూపులుగా అవ్వటము రాదు అని అర్థము. క్వాంటిటీ(సంఖ్య)లోకి వెళ్ళిపోతారు కానీ క్వాలిటీ(సారము) వెలువడదు. మీ స్థితిలో కూడా సంకల్పాల క్వాంటిటీ ఉంది, కావున సేవా రిజల్టులో కూడా క్వాంటిటీ ఉంది, క్వాలిటీ లేదు. మొత్తము వృక్షమురూపీ విస్తారములో ఒక్క బీజమే శక్తిశాలి అయినది కదా! ఎక్కువ సంఖ్యలో, క్వాలిటీవారు ఒక్కరు ఉన్నా, వారు విస్తారములో బీజరూప సమానులు అని భావించడం కాదు. క్వాలిటీ సేవ చేస్తున్నారా? విస్తారములోకి వెళ్ళటం ద్వారా మరియు ఇతరుల కల్యాణము చేస్తూ చేస్తూ మీ కల్యాణమునైతే మర్చిపోవటం లేదు కదా? ఎప్పుడైతే ఇతరుల పట్ల ఎక్కువ అటెన్షన్‌ను ఇస్తుంటారో అప్పుడు మీ లోపల ఏ టెన్షన్ అయితే నడుస్తుంటుందో దానిని చూడరు. మొదట మీ టెన్షన్ పైన అటెన్షన్ ను ఇవ్వండి, అప్పుడే విశ్వములో అనేక రకాల టెన్షన్స్ ఏవైతే ఉన్నాయోవాటిని పోగొట్టగలరు. మొదట మిమ్మల్ని మీరు చూసుకోండి. మొదట మీ సర్వీస్(సేవ), మీ సేవను చేసుకున్నట్లయితే ఇతరుల సేవ స్వతహాగనే జరిగిపోతుంది. మీ సర్వీసను వదిలి ఇతరుల సర్వీస్ లో నిమగ్నమవ్వటం ద్వారా సమయము మరియు సంకల్పములు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ కారణంగా ఏదైతే జమ అవ్వవలసి ఉందో దానిని జమ చేసుకోలేరు. జమ అవ్వని కారణంగా ఆ నషా, ఆ సంతోషము ఉండవు. ఇప్పుడిప్పుడే సంపాదించారు మరియు ఇప్పుడిప్పుడే తిన్నట్లయితే అది అల్పకాలికమునకు చెందిన దౌతుంది మరియు ఏదైతే జమ అయి ఉంటుందో అది సదా తోడు ఉంటుంది. కావున ఇప్పుడు జమ చెయ్యటమును నేర్చుకోండి. కేవలము ఈ ఒక్క జన్మకే కాకుండా 21 జన్మల కొరకు జమ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడిప్పుడే సంపాదించి ఇప్పుడిప్పుడే తినేస్తే భవిష్యత్తు కోసం ఏమి తయారవుతుంది? ఇప్పుడిప్పుడే సంపాదించారు మరియు ఇప్పుడిప్పుడే పంచేసారు. ఇలా కాదు, తిన్న తరువాత ఇముడ్చుకోవటము కూడా కావాలి తరువాత పంచటము కూడా ఉండాలి. సంపాదించి దానిని పంచేస్తే మీలో శక్తి ఉండదు, కేవలం సంతోషము ఉంటుంది. ఏదైతే లభంచిందో దానిని పంచేస్తారు, దానము చేసిన సంతోషము ఉంటుంది,కానీ వారిలో స్వయములో ఇముడ్చుకునే శక్తి ఉండదు. సంతోషముతో పాటు శక్తి కూడా కావాలి. శక్తిలేని కారణంగా నిర్విఘ్నముగా అవ్వలేరు, విఘ్నాలను దాటలేకపోతారు. చిన్న చిన్న విఘ్నాలు లగనమునకు అవరోధాన్ని కలిగిస్తూ ఉంటాయి కావున ఇముడ్చుకొనే శక్తిని ధారణ చెయ్యాలి.

             ఏవిధంగా సంతోషపు మెరుపు ముఖముపై కనిపిస్తుందో అలా శక్తి యొక్క మెరుపు కూడా కనిపించాలి. చాలా సరళచిత్తులుగా అవ్వండి, కానీ ఎంతటి సరళచిత్తులో అంతగానే సహనశీలురుగా ఉన్నారా? లేక సహనశీలత కూడా సరళతయేనా? సరళతతో పాటు ఇముడ్చుకొనే శక్తి, సహనముచేసే శక్తి కూడా కావాలి. ఒకవేళ ఇముడ్చుకొనే శక్తి మరియు సహనము చేసే శక్తి లేనట్లయితే సరళత చాలా భోలారూపమును ధారణ చేస్తుంది మరియు అప్పుడప్పుడు భోలాతనము చాలా ఎక్కువగా నష్టపరుస్తుంది. కావున అటువంటి సరళచిత్తులుగా కూడా కాకూడదు. తండ్రిని కూడా భోలానాధుడు అని అంటారు కదా! కానీ ఎదుర్కోలేనంతటి భోలాతనము కాదు. భోలానాధునితో పాటు ఆల్‌ మైటీ అథారిటీ కూడా కదా! కేవలము భోలానాధుడు కాదు, ఇక్కడ శక్తిస్వరూపమును మరిచి కేవలము అమాయకంగా అయినట్లయితే మాయ యొక్క దెబ్బ తగులుతుంది. వర్తమాన సమయములో భోలాతనము కారణంగా మాయ యొక్క దెబ్బ ఎక్కువగా తగులుతూ ఉంది. మాయ ఎదుర్కొనేందుకు ముందే నమస్కారము చేసేలా, ఎదుర్కోలేకపోయేటట్లుగా  అంతటి శక్తి స్వరూపులుగా అవ్వాలి. చాలా సావధానంగా, జాగ్రత్తగా, తెలివైనవారిగా ఉండాలి. మీ వృత్తి(ఆలోచనలు) మరియు వాయుమండలమును పరిశీలించుకోండి. ఏ వాయుమండలమైనా మా వృత్తిని బలహీనంగా అయితే చెయ్యటం లేదు కదా? అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వాయుమండలము ఎటువంటిదైనాగానీ స్వయములోని శక్తి శాలీ వృత్తి వాయుమండలమును పరివర్తనలోకి తీసుకురాగలదు. ఒకవేళ వృత్తిపైన వాయుమండలపు ప్రభావము వచ్చినట్లయితే అదే భోలాతనము. నేనైతే సరిగ్గానే ఉన్నాను కానీ వాయుమండలపు ప్రభావము పడింది అని కూడా భావించకూడదు. ఎంతటి వికారీ వాయుమండలము ఉన్నాగానీ స్వయము యొక్క వృత్తి నిర్వికారిగా ఉండాలి. మేము పతితపావనులము, పతితులను పావనంగా చేసేవారము అని అంటున్నప్పుడు, ఆత్మలను పావనంగా చెయ్యగలిగినప్పుడు వాయుమండలమును పతితము నుండి పావనంగా చెయ్యలేరా? పావనంగా చేసేవారు వాయుమండలమునకు వశీభూతులవ్వరు. కానీ వాయుమండలము వృత్తి పైన ప్రభావము వేసినట్లయితే అదే బలహీనత.

            నేను స్వయములోని నా శక్తిశాలీ వృతి ద్వారా ఎటువంటి అపవిత్రమైన మరియు బలహీనమైన వాయుమండలమునైనా తొలగిస్తాను అని ప్రతి ఒక్కరూ భావించాలి. మీరు తొలగించేవారే కానీ వశమయ్యేవారు కాదు. ఎటువంటి పతిత వాయుమండలమును వర్ణన కూడా చెయ్యకూడదు. వర్ణన చేసినట్లయితే, సామెత కూడా ఉంది కదా - పాపాన్ని చూసేవారికి కూడా పాపము కలుగుతుంది. ఒకవేళ ఏదైనా బలహీన మరియు పతిత వాయుమండలమును వర్ణన చేసినా, అది కూడా పాపమే. ఎందుకంటే ఆ సమయములో తండ్రిని మర్చిపోతారు. ఎక్కడైతే తండ్రిని మర్చిపోతారో అక్కడ తప్పకుండా పాపము ఉంటుంది. తండ్రి స్మృతి ఉన్నట్లయితే పాపము జరగజాలదు, కావున వర్ణన కూడా చెయ్యకూడదు. తండ్రి ఆజ్ఞ ఇదైనప్పుడు నోటి నుండి జ్ఞానరత్నాలు తప్ప ఇతరమైన ఒక్క మాట కూడా వ్యర్ధముగా రాకూడదు. వాయుమండలమును వర్ణన చెయ్యటము - ఇది కూడా వ్యర్థమే అవుతుంది కదా! ఎక్కడైతే వ్యర్థము ఉంటుందో అక్కడ సమర్థ స్మృతి ఉండదు. సమర్థ స్మృతిలో ఉండి ఏ మాటలనైనా మాట్లాడినట్లయితే వ్యర్థముగా మాట్లాడరు, జ్ఞానరత్నాలనే మాట్లాడుతారు. కావున వృత్తిని, మాటలను కూడా పరిశీలించుకోండి. కర్మ చేసేసాను, పశ్చాత్తాపమును పొందాను, క్షమాపణ అడిగాను, ఇక పనైపోయింది అని కూడా కొంతమంది భావిస్తారు, కానీ అలా కాదు. ఎవరు ఎంతగా క్షమాపణను అడిగినా కానీ ఏదైనా పాపకర్మగానీ లేక వ్యర్థ కర్మగానీ జరిగినట్లయితే దాని చిహ్నాలు తొలగిపోవు. గుర్తు పడనే పడుతుంది. రిజస్టర్ సత్యముగా-స్వచ్ఛముగా ఉండదు. కావున అయిపోయింది, క్షమాపణ పొందేసాను....... అని కూడా అనకూడదు. ఈ విధానాన్ని కూడా అనుసరించకూడదు. సంకల్పములో, వృత్తిలో, స్మృతిలో కూడా ఎటువంటి పాప సంకల్పము రాకూడదు, ఇదే మీ కర్తవ్యము. అటువంటి వారినే బ్రాహ్మణులు అనగా పవిత్రులు అని అంటారు. ఒకవేళ వృత్తి, స్మృతి లేక సంకల్పములో ఎటువంటి అపవిత్రత ఉన్నా బ్రాహ్మణత్వపు స్థితిలో స్థితులవ్వజాలరు, కేవలము పిలవబడేవారుగా మాత్రమే ఉంటారు. కావున అడుగు అడుగులో అప్రమత్తులుగా ఉండండి. సంతోషముతో పాటు శక్తులను కూడా తోడుగా ఉంచుకోవాలి. విశేషతలతో పాటు ఒకవేళ బలహీనతలు కూడా ఉన్నట్లయితే ఒక్క బలహీనత అనేక విశేషతలను సమాప్తము చేసేస్తుంది. కావున మీ విశేషతలను ప్రత్యక్షము చేసేందుకు బలహీనతను సమాప్తము చేసెయ్యండి. అర్థమైందా?

              సేవ మధ్యలో ఒకవేళ డిస్ సర్వీస్ అయినట్లయితే డిస్ సర్వీస్ ప్రత్యక్షమైపోతుంది. ఎంత అమృతమున్నాగానీ ఒక్క విషబిందువు పడటం ద్వారా అమృతము విషముగా అయిపోతుంది. ఎంతైనా సర్వీస్ చెయ్యండి, కానీ ఒక్క చిన్నని పొరపాటు డిస్ సర్వీస్ కు కారణమయిపోతుంది, సర్వీసును సమాప్తము చేసేస్తుంది. కావున మీపైన మరియు మీ సర్వీస్ పైన చాలా అటెన్షన్‌ను ఉంచండి. ముందు చెయ్యాలి తరువాత చెప్పాలి. చెప్పటము సహజమౌతుంది కానీ చెయ్యటంలో శ్రమ ఉంది. శ్రమకు ఫలితము మంచిగా ఉంటుంది, కేవలము చెప్పేదాని ఫలము మంచిగా ఉండదు. కావున ముందు చెయ్యండి తరువాత చెప్పండి. అప్పుడు చూడండి, ఎటువంటి క్వాలిటీ కలిగినవారి సేవ జరుగుతుందో! మీ క్వాలిటీని చూడండి. అర్థమైందా? వృత్తి మరియు వాయుమండలమును శక్తిశాలిగా తయారుచేసుకోండి. బ్రాహ్మణులైన మీ జన్మ ఉన్నదే తయారవ్వటానికి మరియు తయారుచెయ్యటానికి, కేవలము తయారవ్వటానికి కాదు. చదువుకునేందుకు మరియు చదివించుటకొరకే ఉంది. విశ్వ కల్యాణకారులు కదా?తండ్రి ఏవిధంగా కల్యాణకారులో, తోడుగా మీరు కూడా సహాయకులుగా ఉన్నారు, కావున నా వృత్తి అయితే బాగుంది, ఈ వాయుమండలము ఇలా చేసేసింది అని కూడా ఆలోచించకూడదు. ఒకవేళ మీ వృత్తి మంచిగా ఉంది కానీ, దాని ప్రభావము వాయుమండలముపై లేదు అని అంటే శక్తిశాలీ వృత్తి లేనట్లు. శక్తిశాలీ వస్తువు యొక్క ప్రభావము చుట్టుప్రక్కల తప్పకుండా పడుతుంది, అది దాగి ఉండజాలదు. కావున మీ వృత్తిని కూడా పరిశీలించుకొనేందుకు వాయుమండలముపై నా వృత్తి ప్రభావము ఎలా ఉంది? అని పరిశీలించుకోండి. వాయుమండలము వేరే రకముగా కనిపిస్తున్నట్లయితే మీ వృత్తిలో బలహీనత ఉందని భావించాలి. ఆ బలహీనతను తొలగించాలి. ఈ రోజుల్లో నలువైపులా ఉన్న సేవా రిజల్టులో విశేషంగా ఏం కనిపిస్తుంది?

           వాయిద్యాన్ని మ్రోగించటంలో చాలా తెలివైనవారుగా అయిపోయారు కానీ వాయిద్యాన్ని మ్రోగించటంతో, నిగూఢమైన రహస్యమునుండి జారిపోతారు. అవ్వాల్సింది రాజయుక్తంగా(రహస్యమునెరిగినవారిగా) కానీ అయ్యింది వాయిద్యమును పట్టుకునేవారిగా, వాయిద్యము మరియు రహస్యము రెండూ తోడుతోడుగా, సమానంగా ఉండాలి. ఒకవేళ ఒక విషయము చాలా ఎక్కువ ఫోర్స్ లో ఉండి, రెండవ విషయము గుప్తముగా ఉన్నట్లయితే రిజల్టు కూడా గుప్తముగా ఉండిపోతుంది. సాజ్ (వాయిద్యము)ను వాయించటంలో అయితే అందరూ చాలా తెలివైనవారుగా అయిపోయారు, కానీ రాజయుక్తము(రహస్యమునెరిగినవారు)గా కూడా అవ్వాలి. కావున ఇప్పుడు రాజయుక్తులుగా అవ్వండి, యోగయుక్తులుగా అవ్వండి. అచ్ఛా! ఇలా రాజయుక్త, యోగయుక్త, యుక్తియుక్తముగా నడిచేవారికి నమస్తే.

Comments