09-12-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మహావీర్ అనగా విశేష ఆత్మల యొక్క విశేషతలు.
విశేష పురుషార్థంతో విశేష అనుభవీగా తయారుచేసే విశేషాత్మలతో శివబాబా మాట్లాడుతున్నారు -
ఇది మహారథీ అనగా మహావీరుల సంఘటన. మహావీర్ అనగా విశేషాత్మ. ఇలాంటి మహావీర్ విశేషాత్మల యొక్క సంఘటన యొక్క విశేషత ఏమి ఉంటుంది? వర్తమాన సమయంలో విశేషాత్మలకు ఇదే విశేషత ఉండాలి. అది ఏమిటంటే ఒకే సమయంలో అందరూ ఏకరసంగా ఒకే స్థితిలో స్థితులైపోవాలి. అనగా ఎంత సవయం ఏ స్థితిలో ఉండాలంటే అంత సమయం ఆ స్థితిలో సంఘటిత రూపంలో స్థితులైపోవాలి. సంఘటిత రూపంలో అందరి సంకల్పమనే వ్రేలు ఒకటిగా ఉండాలి. ఎప్పటి వరకు సంఘటనగా ఇలాంటి అభ్యాసం ఉండదో అప్పటి వరకు సిద్ధి లభించదు. సంఘటనలోనే అలజడి ఉన్నట్టయితే సిద్ధిలో కూడా అలజడి జరుగుతుంది. సిద్ది అంటే ఏమిటో తెలుసు కాని అది స్వరూపంలోకి రావడం లేదు. ఆజ్ఞ లభించగానే రెడీగా ఉండాలి. విశేషంగా నిమితమైన విశేషాత్మలు ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఐదు నిమిషాలు వ్యర్థ సంకల్పాలన్నింటినీ పూర్తిగా సమాప్తము చేసి శక్తిశాలి బీజరూప స్థితిలో ఏకరసంగా స్థితులవ్వండి అని ఆజ్ఞాపిస్తే ఆ విధంగా ఉండే అభ్యాసం ఉందా? అలా కాకుండా కొందరు మననం చేసే స్థితిలో, కొందరు ఆత్మిక సంభాషణ చేస్తున్నట్లు, కొందరు అవ్యక్త స్థితిలో ఇలా ఉండకూడదు. ఆజ్ఞ ఏమిటి బీజ రూప స్థితిలో స్థితులవ్వమని, కానీ ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. అంటే ఆజ్ఞను పాటించలేనట్లే కదా. ఈ అభ్యాసం ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే మొదట వ్యర్ధ సంకల్పాలు సమాప్తం అయిపోతాయో అప్పుడు వ్యర్థ సంకల్పాల వలనే అలజడి జరుగుతుంది. కనుక ఈ వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేసుకునేటందుకు మరియు మీ సంఘటనను శక్తిశాలిగా, ఏకమతంగా తయారుచేసుకునేటందుకు ఏ శక్తి కావాలి? దాని ద్వారా సంఘటన శక్తిశాలిగా మరియు ఏకమతంగా అయిపోవాలి మరియు వ్యర్థ సంకల్పాలు కూడా సమాప్తం అయిపోవాలి.
దీనికొరకు ఒకటి నిశ్చయం, రెండు ఇముడ్చుకునే శక్తి కావాలి. సంఘటన జోడించడానికి కారణం నమ్మకం. ఎవరైనా ఏదైనా చేశారు, పొరపాటే చేశారు, కాని సంఘటన అనుసారంగా లేదా తమ సంస్కారం అనుసారం లేదా సమయప్రమాణంగా వారు ఏదైతే చేశారో దాంట్లో కూడా తప్పక భావార్థం ఉంటుంది. సంఘటిత రూపంలో ఎక్కడ సేవ ఉంటుందో అక్కడ వారి యొక్క సంస్కారాలను కూడా దయాహృదయ దృష్టితో చూస్తూ సంస్కారాలను ఎదురుగా పెట్టుకోకుండా దీంట్లో కూడా ఏదో కళ్యాణం ఉంటుంది. వీరితో కలిసి నడవడంలో కూడా కళ్యాణం ఉంటుంది అనే నమ్మకం సంఘటనలో ఒకరిపట్ల ఒకరికి ఉండాలి. అప్పుడే సఫలత లభిస్తుంది. అంతేకానీ ముందునుండే వ్యర్థ సంకల్పాలను నడిపించకూడదు. ఎవరికైనా మీ పొరపాటు తెలిసిందనుకోండి దానిని మీకు మీరు వ్యాపింపచేసుకోరు కదా! ఇముడ్చుకుంటారు కదా! ఇతరులు ఎవరైనా వ్యాపింపచేస్తే అది చెడుగా అనిపిస్తుంది కదా! అదే విధంగా ఇతరుల పొరపాటు కూడా మీ పొరపాటుగా భావించి దానిని వ్యాపింపచేయకూడదు. వ్యర్థ సంకల్పాలు నడిపించకూడదు. దానిని కూడా మీలో ఇముడ్చుకోవాలి. దీనినే ఒకరిపై ఒకరికి నమ్మకం అని అంటారు మరియు స్నేహశక్తితో దానిని సరిచేయాలి. లౌకిక పద్దతిలో కూడా ఇంటి విషయాలను బయటపెట్టుకోరు. లేకపోతే ఆ ఇంటికే నష్టం జరుగుతుంది. అదేవిధంగా సంఘటనలో మీతోపాటు ఉండేవారు ఏమైనా చేసినా కానీ దాంట్లో కూడా తప్పక రహస్యం ఉంటుంది. ఒకవేళ వారు పొరపాటే చేసినా కూడా దానిని పరివర్తన చేయాలి. ఇలా రెండు రకాలైన నమ్మకాలు పెట్టుకుని ఒకరికొకరు సంప్రదింపుల్లోకి రావడం వలన, నడవడం వలన సంఘటనలో సఫలత లభిస్తుంది. కనుక ఈ విషయంలో ఇముడ్చుకునే శక్తి చాలా కావాలి. వ్యర్ధ సంకల్పాలను ఇముడ్చుకోవాలి. గడిచిపోయిన సంస్కారాలను ఎప్పుడూ కూడా వర్తమాన సమయంతో బేరీజు వేయకూడదు. అంటే గతాన్ని వర్తమానం చేయకూడదు. గతాన్ని వర్తమానంలో కలపడం వలనే సంకల్పాల యొక్క వరుస పెద్దదైపోతుంది. ఎప్పటి వరకు ఈ వ్యర్థ సంకల్పాల యొక్క వరుస ఉంటుందో అప్పటివరకు సంఘటిత రూపంలో ఏకరస స్థితిలో స్థితులు కాలేరు.
ఇతరుల పొరపాటును మీ పొరపాటుగా భావించండి. ఇదే సంఘటనను గట్టిగా చేసుకోవడం అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు, పరివర్తన చేయాలనే నమ్మకం. లేదా కల్యాణం చేయాలనే నమ్మకం. ఎలాగైతే ఆత్మజ్ఞానుల యొక్క సిద్ధి గురించి మహిమ ఉంటుందో అలాగే సంఘటనగా మీ అందరికీ ఒకే సంకల్పం ఉండాలి. సంఘటన రూపంలో ఒకే సంకల్పం యొక్క శక్తి లేని కారణంగా ఎలాగైతే శక్తి వ్యర్ధం అవుతుందో అలాగే రిజల్టు కూడా వ్యర్థంగా వస్తుంది. దీంట్లో ఇముడ్చుకునే శక్తి తప్పకుండా కావాలి. చూశారు మరియు విన్నారు. ఆ విషయాన్ని పూర్తిగా ఇముడ్చుకుని అదే ఆత్మిక దృష్టితో మరియు కళ్యాణభావనతో ఉండాలి. అజ్ఞానుల కొరకు చెబుతారు కదా అపకారులకి ఉపకారం చేయండి అని. అదేవిధంగా సంఘటనలో కూడా ఒకరిపట్ల ఒకరికి దయాభావన ఉండాలి. ఇప్పుడు దయాభావన తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం తక్కువగా ఉంటుంది. ఇలాంటి శక్తిశాలి సంఘటన ఉండడం ద్వారానే సిద్ది లభిస్తుంది. ఇప్పుడు మీరు సిద్ధిని ఆహ్వానిస్తున్నారు కాని అప్పుడు మీ ఎదురుగా సిద్ధి స్వయమే వంగుతుంది. ఏవిధంగా అయితే సత్యయుగంలో ప్రకృతి దాసి అయిపోతుందో అదే విధంగా సిద్ధి మీ ఎదురుగా తనకు తానే వంగుతుంది. సిద్ది మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. శ్రేష్ట జ్ఞానం, శక్తిశాలి స్థితి ఉంటే సిద్ధి అనేది గొప్ప విషయమా? అల్పకాలికమైన వారికే సిద్ధి ప్రాప్తిస్తున్నప్పుడు సదాకాలిక స్థితిలో సిద్ధి ప్రాప్తించకపోవడం అనేది జరగనే జరగదు. ఈ విధంగా సంఘటనా శక్తి కావాలి. ఒకరు ఒకటి చెప్పారు, రెండోవారు దానిని స్వీకరించారు. ఎదుర్కొనే శక్తి బ్రాహ్మణ పరివారంలో ఉపయోగించకూడదు. ఎదుర్కొనే శక్తిని మాయ ముందు ఉపయోగించాలి. పరివారంతో ఎదుర్కొనే శక్తిని ప్రయోగిస్తే సంఘటన శక్తిశాలిగా ఉండదు. ఏ విషయమైనా నచ్చకపోయినా కానీ ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఎవరియొక్క సంకల్పాలను లేదా మాటలను ఆ సమయంలోనే కట్ చేయకూడదు. అందువలన ఇప్పటి నుంచి ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. సాకార బాబాని చూశారు కదా! అథారిటి ఉన్నా కానీ తండ్రి ముందు పిల్లలు చిన్నవారు రచన అయినా కానీ పిల్లలతో గౌరవంగా మాట్లాడేవారు. ఎప్పుడూ ఎవరినీ ఏమీ అనలేదు, అధికారం ఉన్నా కానీ అధికారాన్ని చూపించలేదు. మరైతే పరస్పరంలో సోదరీ సోదరుల సంబంధంతో మీరేవిధంగా ఉండాలి? సంఘటిత రూపంలో బ్రాహ్మణుల పిల్లలైన మీ యొక్క భాష కూడా అవ్యక్త భావంతో ఉండాలి. ఫరిస్తాలు లేదా ఆత్మ ఆత్మతో మాట్లాడుతున్నట్టుండాలి. ఎవరిద్వారా అయినా విన్న పొరపాటును సంకల్పంలో కూడా స్వీకరించకండి మరియు స్వీకరింప చేయకండి. ఇలాంటి స్థితి ఎప్పుడు తయారవుతుందో అప్పుడే బాప్ దాదాకు సంఘటన పట్ల ఏదైతే శుభకామన ఉందో అది ప్రత్యక్షంగా జరుగుతుంది. ఒకటైనా శక్తిశాలి సంఘటన ఉంటే ఒకరినుండి ఒకరు 108 మాల యొక్క సంఘటన ఒకటిగా అయిపోతుంది. ఒకే మతమనే తాడు మరియు సంస్కారాల సమీపత ఉండాలి. అప్పుడే మాల అందంగా ఉంటుంది. పూసలు వేర్వేరుగా ఉంటే, దారం దూరం దూరంగా ఉంటే మాల అందంగా ఉండదు కదా!
ఇప్పుడు ప్రత్యక్షతా సంవత్సరం జరుపుకునే ముందు మొదట స్వయంలో లేదా నిమిత్తమైన సేవాధారుల సంఘటన రూపంలో ఈ శక్తి ప్రత్యక్షంగా కనిపించాలి. ఒకవేళ స్వయంలోనే శక్తి యొక్క ప్రత్యక్షత జరగకపోతే బాబాని ప్రత్యక్షత చేయడంలో ఎంత సఫలత మీరు కోరుకుంటున్నారో అంత లభించదు. డ్రామానుసారం జరగాల్సిందే, అదైతే అలాగే జరుగుతుంది. కానీ నిమిత్తంగా అయినవారికి నిమిత్తంగా అయినందుకు ఫలం కనిపించాలి, అది కనిపించదు. డ్రామా చేయిస్తుంది అందువలన సంఘటిత రూపంలో ఒక విశేష పురుషార్థం మరియు స్మృతియాత్ర యొక్క కార్యక్రమం పెట్టుకోవాలి. విశేష పురుషార్థం అనగా విశేష అనుభవాలను పరస్పరం పంచుకోవాలి. ఇలా పాండవుల యొక్క సంఘటన తయారవ్వాలి. ఇలా విశేష యోగం యొక్క ప్రోగ్రాం జరుగుతుంటే అప్పుడు చూడండి. వినాశీ జ్వాల యొక్క రెక్కలు ఎలా విచ్చుకుంటాయో, యోగాగ్ని ద్వారానే వినాశనాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అది వినాశన జ్వాల ఇది యోగజ్వాల. జ్వాలతోనే జ్వాల ప్రజ్వరిల్లుతుంది. మీ యొక్క యోగం సాధారణంగా ఉంటే వినాశనజ్వాల కూడా సాధారణంగానే ఉంటుంది. సంఘటన శక్తిశాలిగా ఉండాలి. ఏ పదార్ధమైనా తయారయ్యేటప్పుడు దాంట్లో నీరు, నెయ్యి, ఉప్పు ఇలా అన్ని వస్తువులు కావాలి కదా! ఏది లేకపోయినా పదార్థం తయారవ్వదు. అదే విధంగా ప్రతి ఒక్కరిలో తమతమ విశేషత ఉంటుంది. కానీ ఇక్కడ సర్వుల విశేషత యొక్క సంఘటన కావాలి. ఎందుకంటే సమయం కూడా ఇప్పుడు చాలెంజ్ చేస్తుంది. మంచిది.
Comments
Post a Comment