* 09-10-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"శక్తిశాలీ వృత్తి ద్వారా సేవలో వృద్ధి"
ఈరోజు ఈ సంగఠన ఏ లక్ష్యంతో ఒక చోటకు చేరుకున్నారు? సంఘటితులవ్వడంలో ప్రాప్తి అయితే జరుగుతుంది. కాని పరస్పరం కలుసుకోవడంలో కూడా ఏ లక్ష్యమును ఉంచారు? ఏదైనా క్రొత్త ప్లానును ఆలోచించారా? ఎందుకంటే ఈ సంఘటన సర్వశ్రేష్ఠ ఆత్మలు లేక సమీప ఆత్మల సంగఠన. అందరి దృష్టి సమీపమైన మరియు సర్వశ్రేష్ఠమైన ఆత్మల వైపు ఉంది. కావున శ్రేష్ఠ ఆత్మలు సేవలో లేక తమ సమూహంలో శ్రేష్ఠతను మరియు నవీనతను ఎలా తీసుకురావాలి అన్నది ఆలోచించాలి. నవీనత అని దేనిని అంటారు? నవీనత అనగా ఎటువంటి సహజమైన మరియు శక్తి శాలీ ప్లానును తయారుచేయాలంటే, ఆ ప్లానులోని శక్తి ద్వారా ఆత్మలను ఆకర్షించాలి. ఎటువంటి ప్లానును తయారుచేయాలంటే దూరం నుండే ఆత్మలకు ఆకర్షణ కలగాలి. ఏ విధంగా దీపపు పురుగులకు దీపము ఆకర్షణ ఎంత దూరముగా ఉన్నా ఆకర్షించేస్తుందో లేక ఏదైనా తీవ్రమైన అగ్ని ప్రజ్వలితమైనప్పుడు దూరం నుండే దాని సెగ అనుభవమవుతుందో, ఇక్కడ ఏదో అగ్ని ఉంది అని అర్థం చేసుకోగలరో లేక ఏదైనా చాలా చల్లని వస్తువు ఉన్నప్పుడు దూరం నుండే దాని శీతలత యొక్క అనుభవము మరియు ఆకర్షణ కలుగుతుందో అదేవిధంగా మీ రూపమును మరియు సేవ యొక్క రూపురేఖలను దూరం నుండే ఆకర్షణ కలుగుతూ ఆత్మలు సమీపంగా వస్తూ ఉండే విధంగా తయారుచేయండి. ఏదైనా వస్తువు వాయుమండలంలో వ్యాపించిపోతే మొత్తం వాయుమండలంలో చాలా దూరం వరకు దాని ప్రభావము వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా ఇంతమంది సహజ యోగులు లేక శ్రేష్ఠ ఆత్మలు తమ వాయుమండలమును ఎలా తయారుచేయాలంటే ఆ చుట్టుప్రక్కల వాయుమండలము ఆత్మికత కారణంగా ఆత్మలను తనవైపుకు ఆకర్షించాలి.
వాయుమండలము తయారుచేసేందుకు ముఖ్యమైన యుక్తి ఏమిటి? వాయుమండలము ఎలా తయారవ్వగలదు? వృత్తి ద్వారా వాయుమండలమును తయారుచేయాలి. ఎవరి లోపలికైనా, ఎవరి పట్ల అయినా ఏదైనా విషయం వచ్చేస్తే మీరేమంటారు? వాయుమండలంలో నా గురించి ఈ విషయం ఉంది అని అంటారు కదా! వాయుమండలానికి పునాది వృత్తి. కావున వృత్తులను ఎప్పటివరకైతే శక్తిశాలిగా తయారుచేసుకోరో అప్పటివరకు వాయుమండలంలో ఆత్మికత లేక సేవలో ఏ వృద్ధినైతే కోరుకుంటారో అది జరుగజాలదు. బీజము శక్తిశాలిగా ఉన్నట్లయితే వృక్షం కూడా శక్తిశాలిగా ఉంటుంది. కావున బీజము వృత్తి, దాని ద్వారానే మీ యొక్క లేక సేవ యొక్క వృద్ధిని చేయగలరు. వృద్ధికి ఆధారము వృత్తి మరియు వృత్తిలో ఏమి నింపుకోవడం ద్వారా వృత్తి శక్తిశాలిగా అవ్వగలదు. కావున ఆ ఒక్క విషయం ఏమిటంటే - వృత్తిలో ప్రతి ఆత్మ పట్లా దయ లేక కళ్యాణ వృత్తి ఉండాలి. తద్వారా ఆత్మల పట్ల ఈ వృత్తి ఉన్న కారణంగా ఆ ఆత్మలకు మీ యొక్క దయ లేక కళ్యాణపు వైబ్రేషన్లు చేరుకుంటాయి. రేడియోలో శబ్దం ఎలా వస్తుంది? వాయుమండలంలో వైబ్రేషన్లు ఏవైతే ఉంటాయో వాటిని అవి క్యాచ్ చేస్తాయి. వైర్ లెస్ ద్వారా వైబ్రేషన్లను అందుకుంటాయి. కావున ఇవన్నీ సైన్స్ ద్వారా పరస్పర శబ్దాలను అందుకోగలుగుతాయి లేక వినగలుగుతాయి. అదేమో వైర్ లెస్ ద్వారా మరియు ఇదేమో ఆత్మిక శక్తి ద్వారా. ఇది కూడా వృత్తి శక్తిశాలిగా ఉన్నట్లయితే వృత్తి ద్వారా వైబ్రేషన్లవైతే ఉంటాయో అవి ఆ ఆత్మకు రేడియో స్విచ్ తెరవడం ద్వారా ఏ విధంగా శబ్దము స్పష్టంగా వినిపిస్తుందో అలా స్పష్టముగా అనుభవమవుతుంది. ఈ రోజుల్లో టెలివిజన్ ద్వారా కూడా దృశ్యాలను, శబ్దాన్ని స్పష్టముగా తెలుసుకోగలరు. అలాగే ఇప్పుడు వృత్తుల ద్వారా చాలా సేవలు చేయగలరు. ఏ విధంగా టెలివిజన్ లేక రేడియో స్టేషన్ ఒకే స్థానంలో ఉంటూ కూడా ఎక్కడెక్కడికో అది చేరుకుంటుంది, అలాగే వృత్తిలో ఎంతటి శక్తి ఉండాలంటే ఎక్కడ కూర్చున్నా కాని ఎంత శక్తిశాలీ స్థితి ఉంటుందో అంతగా దూరదూరాల వరకు చేరుకుంటుంది. అదేవిధంగా ఏ ఆత్మ యొక్క వృత్తి ఎంత శక్తిశాలిగా ఉంటుందో అంతగా ఒక స్థానంపై నలువైపులా వృత్తి ద్వారా ఆత్మలను ఆకర్షితం చేస్తుంది, ఇప్పుడు ఈ సేవ కావాలి. వాణి మరియు వృత్తి రెండూ కలిసి ఉండాలి. వృత్తి ద్వారా సేవ చేసినప్పుడు వాణి ఉండడం లేదు మరియు ఎప్పుడైతే వాణి ద్వారా సేవ చేస్తారో అప్పుడు వృత్తి యొక్క శక్తి తక్కువగా ఉంటోంది, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ నిజానికి ఎలా ఉండాలి? ఈ రోజుల్లో ఏవిధముగా సినిమా మరియు టీవీలలో దృశ్యాలు మరియు శబ్దాలు రెండూ కలిసి ఉంటాయో, ఈ రెండు కార్యాలు కలిసి జరుగుతాయి కదా! అలాగే ఇందులో కూడా అభ్యాసము ఉన్నట్లయితే వృత్తి మరియు వాణి, రెండూ కలిసి సేవ జరగాలి. ఎక్కువగా వాణిలోకి వస్తున్న కారణముగా వృత్తి ద్వారా వాయుమండలాన్ని ఎంత శక్తివంతముగా చేయగలరో అది చేయలేకపోతున్నారు. కేవలం వాణి ఉన్నకారణముగా ఎంత సేపయితే సమ్ముఖముగా లేక సమీపముగా ఉంటారో అంత సేపే దాని శక్తి పని చేస్తుంది. వృత్తి వాణి కన్నా సూక్ష్మమైనది కదా! కావున సూక్ష్మమైన దాని ప్రభావము ఎక్కువగా పడుతుంది, స్థూలమైనదాని ప్రభావము తక్కువగా పడుతుంది. కావున సూక్ష్మమైన శక్తి ఉండాలి మరియు స్థూలమైన శక్తి ఉండాలి. రెండు శక్తుల ద్వారా వృత్తి ఏర్పడాలి ఇటువంటి విశేషత ఏదైనా కనిపించాలి.
ఇప్పుడు మహాన్ అంతరము కనిపించడం లేదు, ఒకే స్టేజిపై రెండు రకాల ఆత్మలు కలిసి ఉన్నప్పుడు జనులకు మహాన్ అంతరము కనిపిస్తుంది. సాక్షిగా అయి చూసినట్లయితే మహాన్ అంతరము కనిపిస్తోందా? ఏ విధంగా చాలా శక్తివంతమైన వస్తువు ఏదైనా ఉంటే దానిపై ఇతర వస్తువుల ప్రభావం పడదు, అలాగే ఇక్కడ కూడా స్థూలమైన స్టేజి పైన మీ సూక్ష్మమైన శక్తిశాలీ స్థితి ఉన్నట్లయితే ఇతరులు ఎంత శక్తిశాలిగా మాట్లాడినా కాని వాయుమండలంలో వారి ప్రభావం పడజాలదు. స్మృతిచిహ్నరూపాలలో స్థూల యుద్ధాలలో ఒకవైపు నుండి బాణం వస్తూ ఉంటే దారిలోనే అది ఖండింపబడినట్లుగా చూపిస్తారు. ఈ వృత్తి ద్వారానే వాయుమండలమును శక్తిశాలిగా చేయగలుగుతారు. ఇప్పుడు అక్కడక్కడ తమ స్థితిలో లోపం ఉన్న కారణంగా తమ స్టేజిపై ఇతర ఆత్మల ప్రభావము వాయుమండలంపై పడుతోంది. ఎందుకు? కారణం ఏమిటి? వృత్తి ద్వారా ఆత్మికతతో కూడుకున్న ముట్టడిని చేయలేకపోతున్నారు. ఏ విధంగా ఏ ఆత్మనైనా పట్టుకోవలసి ఉంటే ఎటువంటి ముట్టడిని చేస్తారంటే ఇంక అక్కడినుండి బయటపడలేరు. అలా వృత్తి ద్వారా ఆత్మికత యొక్క ముట్టడిని వాయుమండలంలో చేసినట్లయితే ఏ ఆత్మా ఆత్మిక ఆకర్షణ నుండి బైటకు వెళ్ళలేరు. ఇప్పుడు ఇటువంటి సర్వీసు కావాలి ఎందుకంటే ఆ అద్భుతమును చూసేందుకు ఎదురు చూస్తున్నారు కదా! కావున ఎవరైనా అద్భుతమును చేసి చూపించాలని అందరూ భావిస్తూ ఉంటారు. కాని ఇక్కడ అద్భుతానికి బదులుగా అద్భుతమైన కార్యమును చూపించాలి. వారిది రిద్ధి-సిద్ధి ద్వారా చేసే అద్భుతము మరియు మీది వృత్తి ద్వారా అద్భుతమును చూపించడము. ఇప్పుడు ఏదైనా అద్భుతకార్యమును చూపిద్దాము. వారికి విశేషత యొక్క అనుభవము తప్పకుండా కలగాలి. ఆత్మలకు అల్పకాలికమైన ప్రభావము అక్కడక్కడ పడుతూ ఉంటుంది. వీరు ఎలా చేస్తున్నారు, వీరు ఎలా మాట్లాడుతున్నారు అని నోట్ చేసుకుంటూ ఉంటారు, ఆ కారణంగా తమ అథారిటీ యొక్క ఫోర్స్ ఏదైతే ఉండాలో అది ఇతర వైపులకు దృష్టి వెళ్ళడం ద్వారా బలహీనమైపోతుంది ఎందుకంటే ఇది కూడా పెద్ద సూక్ష్మ నియమమే. వృత్తిలో, వినడంలో, చూడడంలో, ఆలోచించడంలో ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు అని ప్రతిజ్ఞ చేశారు. ఆత్మల ప్రభావమును బుద్ధిలో ఉంచుకుంటూ లేక ఆత్మల ప్రభావమును చూస్తూ చేయడము, ఇది కూడా సూక్ష్మంలో లింక్ ను తెంచేసుకోవడమే. ఏ విధంగా ప్రారంభంలో మస్త్ ఫకీర్ రమతా యోగులుగా ఉండేవారో, తమ జ్ఞానపు శక్తిని ప్రత్యక్షం చేయడంలో సమర్థులుగా ఉండేవారో, ఆ సామర్థ్యత ఉన్న కారణంగా ఫస్ట్ రచన కూడా సమర్థంగా జరిగింది మరి ఇప్పటి రచన ప్రారంభంలోని రచనలాగా సమర్థంగా ఉందా? ఎన్ని ఉత్సాహాలు కలిగినా కాని, మొదటి రచన ఏదైతే సమర్థంగా ఉండేదో ఇప్పుడు అది లేదు. జ్ఞానము యొక్క అనుభవజ్ఞులుగా మీరు దినప్రతిదినము అవుతున్నారు కాని శక్తిశాలి స్థితి ఏదైతే ప్రారంభంలో ఉండేదో అది ఉందా? ఆ నిర్బయత ఉందా? ఆ అథారిటీతో కూడిన మాటలు ప్రారంభంలో ఉన్న విధంగా ఇప్పుడుఉన్నాయా?
ఏ విధంగా అప్పుడప్పుడు ఏదైనా విషయాన్ని ఎక్కువగా రిఫైన్ చేసినప్పుడు, రిఫైన్ అయిపోతుంది కాని బలహీనముగా అయిపోతుంది. కాని, ఈనాటి వస్తువులు రిఫైన్ గా ఉన్నాకాని శక్తి ఉందా? అలాగే ఇక్కడ కూడా జ్ఞానం యొక్క రూపము రిఫైన్ అయిపోయింది, టాక్ట్ (నైపుణ్యము) రిఫైన్ అయిపోయింది కాని ఫోర్స్ తక్కువగా ఉంది. ప్రారంభంలోని విషయాలను స్మృతిలోకి తెచ్చినట్లయితే అప్పుడు నషా ఎంత ఎక్కువగా ఉండేది! జ్ఞానపు ఆకర్షణ ఉండేది కాదు కాని మస్తకము మరియు నయనాలలో ఆకర్షణ ఉండేది. నయనాల ద్వారా వీరెవరో అల్లాకు చెందినవారు వచ్చారు అని అందరూ అనుభవం చేసుకునేవారు. ఇప్పుడు మిక్స్ గా ఉన్న కారణంగా మిక్సుడ్ గా కనిపిస్తున్నారు. చాలా ఎక్కువగా మిక్స్ అయిపోయినది అల్పకాలికంగా ఎంతో రుచిని ఇస్తుంది, కాని అందులో శక్తి ఉండదు. చట్ని ఎంత రుచిగా ఉంటుంది! కాని అందులో శక్తి ఉంటుందా? కేవలం అల్పకాలికంగా నాలికను రుచితో ఆకర్షిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఎక్కువగా మిక్స్ చేయడం ద్వారా అల్పకాలికంగా వినడంలో చాలా మంచిగా అనిపిస్తుంది. కాని, అందులో శక్తి ఉండదు. శక్తివంతమైన వస్తువు లోపల ఎనర్జీని పెంచుతుంది మరియు ఈ ఎనర్జీ సదాకాలికంగా తోడుగా ఉంటుంది. అదేవిధంగా అథారిటీ మరియు ఒరిజినాలిటీతో కూడుకున్న మాటలు సదాకాలం కొరకు శక్తి రూపంగా చేసేస్తాయి మరియు ఎవరైతే రమణీక రూపము లేక మిక్స్ రూపము చేస్తారో వారు కేవలం అల్పకాలికంగా రుచిలోకి తెచ్చుకుంటారు. ఆత్మలను ఈ విధంగా రుచి చూడడంలోకి తీసుకురావాలా లేక శక్తిని నింపాలా? ఏమి చేయాలి? శక్తి అయితే వారిని సదాకాలికంగా ఆకర్షిస్తూ ఉంటుంది. రుచి ఇప్పుడు ఉంటుంది మళ్ళీ ఇంకేదైనా విషయమును వినినట్లయితే ఆ వైపు రుచి ఉన్న కారణంగా అది అక్కడే అంతమైపోతుంది. కావున ఇప్పుడు ఈ విధంగా రమతా యోగులుగా అవ్వండి, ఇటువంటి అనుభవం కలగాలి. ఏ విధంగా ఎవరైనా పెద్ద పెద్ద మహాత్ములు చాలాకాలం గుహలో ఉన్న తరువాత సేవ చేసేందుకు సృష్టి పైకి వస్తారో, అలా ఎప్పుడైతే స్టేజి పైకి వస్తారో అప్పుడు ఈ ఆత్మలు ఎంతోకాలము అంతర్ముఖత, ఆత్మికత యొక్క గుహ నుండి వెలువడి సేవ చేసేందుకు వచ్చారు అని అనుభవమవ్వాలి, తపస్వీ రూపం కనిపించాలి. అనంతమైన వైరాగ్యపు రేఖలు మీ ముఖంపై కనిపించాలి. ఎవరికైనా కొద్దిగా వైరాగ్యము ఉన్నా వీరు వైరాగులుగా ఉన్నారని వారి ప్రకాశము నిరూపిస్తుంది కదా! కావున అనంతమైన వైరాగ్య వృత్తి కనిపించాలి. ఎప్పుడైతే స్టేజి పైకి సేవ కొరకు వస్తారో మీ ముఖము ప్రొజెక్టర్ మిషన్ల అనుభవమవ్వాలి, అందులో స్లయిడ్ లు మారిపోతూ ఉంటాయి, ఎంత అటెన్షనుతో చూస్తే అంతగా ఆ దృశ్యము స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఎప్పుడైతే సేవ యొక్క స్టేజి పైకి వస్తారో అప్పుడు ఒక్కొక్కరి ముఖము ప్రొజెక్టర్ షోలా కనిపించాలి. దయాహృదయం యొక్క గుణము ముఖం ద్వారా కనిపించాలి. మీరు అనంతమైన వైరాగులు, కావున అనంతమైన వైరాగ్యపు రేఖలు మీ ముఖము ద్వారా కనిపించాలి. మీరు ఆల్ మైటీ అథారిటీ ద్వారా నిమిత్తమై ఉన్నారు, కావున అథారిటీ యొక్క రూపము కనిపించాలి. ఏ విధంగా అందులో కూడా సైలెన్స్ ను నింపుకుంటారో, ఆ తరువాత ఒక్కొక్కటీ స్పష్టంగా కనిపిస్తుందో, అలాగే ఆత్మలో సర్వగుణాలు లేక సర్వ శక్తుల సంస్కారాలేవైతే నిండి ఉన్నాయో ఆ ఒక్కొక్క సంస్కారము ముఖము ద్వారా స్పష్టంగా కనిపించాలి. దీనినే సేవ అని అంటారు. ఏ విధంగా సాకారరూపుని ఉదాహరణను చూశారో, ముఖం ద్వారా సర్వగుణాలను ప్రత్యక్షంగా సాక్షాత్కారం చేయించారో అలా బాబాను అనుసరించండి. ఎటువంటి అథారిటీ కలవారు వచ్చినా కాని, ఎటువంటి మూడ్ వారు వచ్చినా కాని గుణాల పర్సనాలిటీ, ఆత్మికత యొక్క పర్సనాలిటీ, సర్వశక్తుల పర్సనాలిటీ ముందు ఏంచేయగలరు? వంగిపోతారు. తమ ప్రభావాన్ని చూపలేరు. ఈ వృత్తి ద్వారా వాయుమండలమును శక్తిశాలిగా తయారు చేసిన కారణంగా వారి వృత్తి, వారి లోపలి వైబ్రేషన్లు మారిపోతాయి. అందరి ముఖము ద్వారా వృత్తి శక్తి యొక్క వర్ణన జరిగేది కదా! కావున వృత్తి మరియు వాణి యొక్క అథారిటీల ప్రత్యక్ష ప్రమాణమును చూశారు. మరి వారిని అనుసరించాలి కదా! ఇప్పుడు స్నేహరూపంలో అయితే పాసైపోయారు, ఇప్పుడిక ఎందులో పాసవ్వాలి? ఎందుకంటే అంతిమ స్వరూపమే శక్తితో కూడుకున్న స్వరూపము. కావున ఏ ఆత్మ మీ వద్దకు వచ్చినా, మొదట జగన్మాత యొక్క స్నేహరూపమును ధారణ చేస్తారు మరియు ఎప్పుడైతే వారు నడవడం మొదలుపెడతారో మరియు మాయను ఎదుర్కోవలసి వస్తుందో అప్పుడు దానిని ఎదుర్కోవడంలో మహాయోగులుగా అయ్యేందుకు శక్తిరూపాన్ని కూడా ధారణ చేయవలసి ఉంటుంది.
ఎక్కడైతే నిమిత్తంగా అయి ఉన్న ఆత్మలు కేవలం స్నేహరూపంగా ఉంటారో వారి రచనల్లో కూడా సమస్యలను ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉంటుంది. యజ్ఞానికి, దైవీ పరివారానికి స్నేహులుగా, సహయోగులుగా అయితే ఉంటారు కాని ఎదుర్కోలేరు. కారణం ఏమిటి? రచయిత యొక్క ప్రభావము రచనపై పడుతుంది. ఇప్పుడు ఏ ఆత్మలైతే ముందుకు వెళుతూ వెళుతూ ఎక్కడివరకైతే చేరుకున్నారో వారిని అంతకన్నా ముందుకు తీసుకువెళ్ళేందుకు విశేష ఆత్మలు విశేషంగా ఏం చేయాలి? ఏ ఆత్మల కొరకైతే నిమిత్తంగా అయ్యారో ఆ ఆత్మలలో కూడా శక్తిరూపం ద్వారా శక్తిని నింపే అవసరం ఉంది. వర్తమాన సమయంలోని మెజారిటీ ఆత్మలలో ఎటువంటి స్థితి కనిపిస్తోంది? వెనుకకీ వెళ్ళరు, ముందుకూ వెళ్ళరు అలాగే వేళ్ళాడుతూ కూడా ఉండరు. కాని, ముందుకు దూకేందుకు శక్తి లేదు. ఎక్సట్రా ఫోర్స్ కావాలి. రాకెట్లో ఫోర్స్ నింపి అంత పైకి పంపిస్తారు కదా! కావున ఇప్పుడు ఆత్మలకు పాలన కావాలి. తమ యథాశక్తితో పైకి ఎగురలేరు. విశేష ఆత్మలలో విశేష శక్తిని నింపి హైజంప్ చేయించాలి. కోరుకుంటారు, పురుషార్థం కూడా చేస్తారు, కాని ఇప్పుడు ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ ను ఎలా ఇవ్వగలరు? ఎప్పుడైతే మొదట స్వయములో తమను తాము ముందుకు తీసుకువెళ్ళగలగడమే కాక శక్తిదానమును కూడా ఇవ్వగలిగేంతటి ఫోర్స్ ఉంటుందో అప్పుడు ఇవ్వగలరు. ఏ విధంగా జ్ఞానదానమును చేస్తారో అలా ఇప్పుడు శక్తి యొక్క బలం కావాలి. ఇప్పుడు ఇక వరదాత స్వరూపపు కర్తవ్యమును చేయాలి. జ్ఞానదాతగా అయి ఎంతో చేశారు, ఇప్పుడు ఇక శక్తుల యొక్క వరదాతగా అవ్వాలి. శక్తుల ముందు ఎల్లప్పుడు వరాలు కోరుకుంటూ ఉంటారు. శక్తుల ద్వారా సిద్ధులు ఎలా లభిస్తాయి? ఇప్పుడు ఏ సేవను చేయాలి? వరదాతలుగా అయి సర్వశక్తులను మీరు నిమిత్తమై ఉన్న రచనకు వరదానమును ఇవ్వాలి. విశేష ఆత్మలు ఎవరైతే నిమిత్తమయ్యారో వారే ఈ సేవను ఎక్కువగా చేయగలరు. ఈ గ్రూపు విశేష ఆత్మలది కదా! మైకుగా తయారవ్వడం చాలా సహజము, మైకులు ఎంతోమంది తయారవుతారు, కాని మైట్ అనగా శక్తిని నింపేవారు మీరే ఇదే మీ సేవ, ఇప్పుడు దీని అవసరం ఉంది. ఇప్పుడు మీ పురుషార్థంలోనే ఉండే సమయం లేదు. ఇప్పుడు మీ పురుషార్థం ద్వారా ప్రత్యక్షమై ప్రభావమును చూపించే సమయమిది మరియు ఆ ప్రభావమే ఆత్మలను ఆటోమేటిక్ గా ఆకర్షిస్తుంది. అచ్ఛా!
పాండవుల గాయనము ఏమిటి? గుప్తంగా ఉన్న తరువాత ప్రత్యక్షమయ్యారు కదా! ఇప్పుడు ప్రత్యక్షమవ్వాలి. ఏ విధంగా స్థూలమైన స్టేజీపై ప్రత్యక్షమవుతున్నారో అలా ఇప్పుడు మీ సూక్ష్మ స్టేజీని ప్రత్యక్షం చేయండి. గర్జన యొక్క రచనను చేయండి. బలహీన రచనను చేసినట్లయితే. ఆ బలహీన రచనను సంబాళించడంలో కూడా సమయం పడుతుంది. శక్తిశాలీ రచన ఉండడం ద్వారా సహయోగులుగా అవుతారు. ఇప్పుడు సింహనాదం చేయాలి. దేవీ పూజలో కూడా ఇటువంటి సింహనాదానికే పూజ జరుగుతుంది. ఈ శక్తి యొక్క గుర్తు సృతిచిహ్న రూపంలో ఉంది. గట్టి గట్టిగా అరుస్తారు. తమ లోపల ఉన్న శక్తిని ఈ విధంగా ప్రసిద్ధం చేస్తారు. దేవీల పూజ మౌనంగా జరుగదు, ఎంతో చప్పుళ్ళతో జరుగుతుంది. కావున ఇప్పుడు శక్తులు తమ సిద్ధాంతాలను నిరూపించేందుకు గర్జించాలి, సింహనాదం చేయాలి, అప్పుడు సిద్ధిని పొందుతారు. సాధారణ ఆత్మలు కూడా తమ సిద్ధాంతాలను నిరూపించేందుకు ఎంతగా పురుషార్థం చేస్తారు! మరి మీకు మీ సిద్ధాంతాలను నిరూపించేందుకు ఎంతటి నషా కావాలి. కాని మీరు వాయుమండలం ప్రభావంలోకి వచ్చేస్తారు. ఆదిలోని పాత్రను మళ్ళీ అంతిమంలో గుహ్యంగా మరియు గోపనీయంగా పునరావృతం చేయాలి. సాధారణమైన అద్భుతాలను చూపేవారికి నషా ఎంత ఎక్కువగా ఉంటుందో చూడండి! అది కేవలం అల్పకాలికమైనదని వారికి తెలుసు. అయినా కాని, ఎంతటి నషాను ఉంచుతారు! కాని సత్యమైన నషా కలవారు ఎంతటి అద్భుతాన్ని చూపించవచ్చు! వీరి ముందు అసలు వారి నషా ఎంత? ఇప్పుడు ఏ చివరి కోర్సు మిగిలి ఉంది? ఫోర్సు రూపంగా అవ్వాలి. ఇప్పుడు జగన్మాతలుగా ఎంతో ఎక్కువగా అయిపోయారు, ఇప్పుడిక శక్తిరూపం ద్వారా స్టేజీ పైకి రావాలి. శక్తులు అసురీ సంస్కారాలను ఒక్క దెబ్బతో అంతం చేసేస్తారు మరియు స్నేహీరూపంలో ఉన్న మాత మెల్లమెల్లగా ప్రేమతో పాలన చేస్తుంది. ఇంతకుముందు దాని అవసరం ఉండేది, కాని ఇప్పుడు శక్తిరూపంగా అయి అసురీ సంస్కారాలను ఒక్క దెబ్బతో అంతం చేయాలి. వారు బలి చేసే ముందు మొదట అలంకరిస్తారు, అందుకు సమయం పడుతుంది. కాని నిజంగా బలిచేసేటప్పుడు అది ఒక్క క్షణంలో పూర్తవుతుంది. అలాగే ఇప్పటివరకు మీరు ఎంతో సింగారము చేశారు, ఇప్పుడిక ఒక్క దెబ్బతో వాయుమండలం నుండి కూడా అసురీ సంస్కారాలను అంతంచేసే ఫోర్స్ కావాలి. దయార్ద్రహృదయంతో పాటు శక్తిరూపం యొక్క నషా కూడా కావాలి. కేవలం దయార్ద్రహృదయంగా కూడా ఉండకూడదు. ఎంతగా అతి నషాలో ఉంటారో అంతగానే అతి దయార్ద్రహృదయులుగాను ఉండాలి. మీ మాటల్లో కూడా దయార్ద్రహృదయపు భావన ఉండాలి. ఇప్పుడు ఇది అటువంటి సేవకు సమయం. దృష్టి ద్వారా అతీతంగా చేస్తారు. అన్న గాయనమేదైతే ఉందో అది ఎవరి గాయనము? శక్తుల చిత్రాలలో ఎల్లప్పుడూ నయనాల శోభను మీరు చూస్తారు. ఇంకేదీ ఇంత ఆకర్షణతో ఉండదు. నయనాల ద్వారానే అన్ని భావాలను ప్రసిద్ధం చేస్తారు కావున నయనాల ద్వారా అతీతంగా చేయడమనే సేవ కూడా శక్తులదే గాయనం చేయబడుతుంది. నయనాలలో ఆకర్షణ ఉండాలి, నయనాలలో అత్మికత ఉండాలి, నయనాలలో నషా ఉండాలి, నయనాలలో దయార్ద్రహృదయం ఉండాలి, ఇటువంటి ప్లానును తయారుచేయాలి.
మధువనం నుండి విశేష ఆత్మలు ఎవరైతే వెళతారో వారి రచనకు, ఈ శక్తిసేన తమలో శక్తిని ప్రత్యక్షం చేసుకునే ప్రభావమును నింపుకొని వచ్చారు అని అనుభవమవ్వాలి. ప్రభావశాలీ నడవడికను, ప్రభావశాలీ వృత్తిని అనుభవం చేసుకోవాలి. మీపై మొత్తం దైవీపరివారం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంది. ఈ ప్రోగ్రాం తరువాత ఆత్మలైన మాలో లేక సేవలో మంచి అభివృద్ధి ఉంటుంది అని అందరూ భావిస్తూ ఉంటారు. అలాగే సాధారణంగానే ప్రోగ్రాంను సమాప్తం చేసినట్లయితే అందరూ ఆలోచించడం మొదలుపెడతారు. ఈ విశేష ఆత్మల సంఘటన ఏ అద్భుతమును చూపిస్తుంది అని అందరి దృష్టిలో ఉంది, కావున అంతే ధ్యానమును ఇవ్వవలసి ఉంటుంది.
ఒకటేమో - సేవలో నవీనత, ఇంకొకటి - నిమిత్తంగా అయి ఉన్న ఆత్మలలో నవీనత కనిపించాలి. ఎందుకంటే సేవ యొక్క ఆధారమంతా విశేష ఆత్మలపైనే ఉంది. ఏ విధంగా సైన్స్ వారు శక్తిశాలీ ఇన్వెన్షన్లను కనుగొంటున్నారో అలాగే ఈ శక్తి గ్రూపు కూడా శక్తిశాలీ సైలెన్స్ యొక్క శ్రేష్ఠమైన శస్త్రమును తయారుచేసి చూపిస్తారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. పరస్పరం కేవలం కలుసుకోవడం కాదు, కలిసి ఏదైనా శక్తిశాలీ శస్త్రమును తయారుచేయాలి. ఏదైతే చాలా శక్తిశాలిగా ఉంటుందో అది అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. అలాగే ఈ సంఘటన కూడా అండర్ గ్రౌండ్ లో ఉంది. అంతర్ముఖతలోకి, లోపలికి వెళ్ళి ఆలోచించాలి, ఏదైనా అద్భుతమును చేసి చూపించాలి. సాధారణమైన సంఘటననైతే అందరూ చేస్తూనే ఉంటారు, మీరు కూడా సాధారణమైన విషయాలనే చేసినట్లయితే అద్భుతమును ఎవరు చేస్తారు? ఇటువంటి శస్త్రాలను తయారుచేయండి. కావుననే శక్తులకు శస్త్రాలను తప్పకుండా చూపిస్తారు. ఇప్పుడిక సంహారీలుగా అవ్వండి. మీ సంస్కారాలపై కూడా సంహారీలుగా మరియు ఆత్మల తమోగుణీ సంస్కారాలపై కూడా సంహారీలుగా అవ్వండి శంకరుని పాత్రను ప్రత్యక్షంగా అభినయించాలి. కాని, శక్తులే సంహారీ పాత్రను అభినయిస్తారు, శంకరుడు అభినయించడు. శక్తులు సంహారీ రూపాన్ని ధారణ చేయాలి, దాని ద్వారా సంహారం చేయాలి. కర్తవ్యం చేశారు, ఇప్పుడు ఈ రూపాన్ని చూపించండి. ఈ రూపాన్ని ధారణ చేయడం ద్వారా రిజల్టు ఏమౌతుంది? మీ రచనకు దినప్రతిదినము ఎక్సాట్రా లిఫ్ట్ లభిస్తోంది అని మీ రచన అనుభవం చేసుకుంటుంది. యథాశక్తి తమ ఫోర్స్ నైతే ఉపయోగిస్తారు. ఇక తమ కృషితో ముందుకు వెళ్ళలేరు, ఇప్పుడిక వారికి వరదానం యొక్క లిఫ్ట్ కావాలి. ఈనాటి వరకు ఏ విషయాలైతే కష్టమనిపించాయో అవన్నీ మీ యొక్క ఈ శక్తిశాలీ సేవ ద్వారా వారి నోటి నుండి కష్టము అన్న పదము సమాప్తమైపోవాలి. అన్ని విషయాలలోను సహజము అని అనుభవం చేసుకోవాలి. మీ రచనలలో ఎప్పుడైతే దీనిని చూస్తారో అప్పుడు సంహారీ రూపంగా అయ్యాము అని భావించండి, రిజల్టు స్పష్టంగా కనిపించాలి అప్పుడిక తుఫాను తుఫాను లాగా కాకుండా కానుకగా అనిపిస్తుంది. ఇటువంటి రూపము మారిపోతుంది, అప్పుడు మీ వాస్తవికమైన స్టేజ్ యొక్క సాక్షాత్కారమును చేయిస్తున్నాము అని భావించండి.
అన్ని ధారణల విషయాలలోనూ ముఖ్యమైన ఏ ధారణను అందరికీ ఇస్తారు? అవ్యక్తంగా అయ్యేందుకు కూడా ఏ పాయింటును ఇస్తారు? బాబాను స్మృతి చేసేందుకు, లేక ఆత్మిక సంభాషణను చేసేందుకు కూడా ఉత్సాహము ఎలా కలుగుతుంది? దాని కొరకు ముఖ్యమైన విషయము - సత్యత మరియు స్వచ్ఛత. పరస్పర భావాలను స్వచ్ఛతతో తెలుసుకోవడం ఎంతో అవసరం. విశేష ఆత్మలకొరకు సత్యత మరియు స్వచ్ఛత అన్న పదాల అర్థం కూడా గుహ్యమైనదే. పరస్పర హృదయాలలో పూర్తిగా స్వచ్ఛత ఉండాలి. ఏదైనా శుభ్రమైన వస్తువు ఉన్నప్పుడు అందులో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా! అలాగే పరస్పర భావనలు మరియు భావాలు, స్వభావాలు స్పష్టంగా కనిపించాలి. ఎక్కడైతే సత్యత-స్వచ్ఛత ఉంటాయో అక్కడ సామీప్యత ఉంటుంది. ఏ విధంగా బాప్ దాదాకు సమీపంగా ఉన్నారో అలా రాజ్యం కేవలం ఒక్కరిద్దరితో నడవదు కదా! పరస్పరంలో కూడా సంబంధాలలోకి రావాలి. అక్కడ కూడా పరస్పరం సమీప సంబంధాలలోకి ఎలా వస్తారు? ఇక్కడ హృదయాలు సమీపంగా ఉన్నప్పుడు ఇక్కడి హృదయాలలోని సామీప్యత అక్కడ కూడా సామీప్యతను తీసుకువస్తుంది. పరస్పర స్వభావాలు, మనస్సు యొక్క భావాలు రెండింటిలోను సామీప్యత కావాలి. స్వభావాల భిన్నత కారణంగానే సామీప్యత ఉండదు. ఎవరైనా రమణీకంగా ఉంటే సామీప్యత ఉంటుంది, మరెవరైనా అఫీషియల్ గా ఉంటే ఆ సామీప్యత ఉండదు. కాని ఇక్కడైతే సర్వగుణ సంపన్నంగా, 16 కళా సంపూర్ణంగా అవ్వాలి కదా! ఈ కళలు కూడా ఎందుకు తక్కువగా ఉండాలి. మీ వాస్తవిక సంస్కారం అఫీషియల్ గా ఉండేదే అయినా సమయము, సమూహము రమణీయతను తీసుకువస్తుంది. కావున స్వభావాన్ని కలుపుకునే కళ కూడా ఉండాలి, అలాగే 16 కళా సంపన్నంగా అవ్వగలరు. కావున మనస్సు యొక్క భావాలను కూడా కలుపుకోవాలి మరియు స్వభావాలను కూడా కలుపుకోవాలి, అప్పుడే సమీపంగా వస్తారు. ఇప్పుడు భిన్నత అనుభవమవుతోంది. ఒక్కొక్కరి ఒరిజినల్ స్వభావములు ఇప్పుడు వేరువేరుగా కనిపిస్తున్నాయి, ఇది సంపూర్ణతకు గుర్తు కాదు, అన్ని కళలను నింపుకోవాలి. ఫలానావారి స్వభావం సీరియస్ గా ఉంది అంటే కళ తక్కువగా ఉందని అర్థం చేసుకోండి. ఫలానావారితో ఇది మాట్లాడలేము - ఇది కూడా కళలోని లోపమే. కావున 16 కళా సంపూర్ణులు అనగా సంపూర్ణ స్థితి ఏదైతే ఉందో దాని అన్ని కళలు స్వభావంలో ఉండాలి. వారినే 16 కళా సంపూర్ణులు అని అంటారు. ఈ సమూహములో స్వభావాలను మరియు భావాలను సమీపంగా తీసుకురావాలి. ఇది నా స్వభావము, ఇది నా భావము కాదు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా! కావున ఈ మనస్సు యొక్క భావనలు కూడా పరస్పరంలో కలవాలి కదా? సంపూర్ణత ఒక్కటే అయినప్పుడు భావము మరియు స్వభావాలు కూడా కలవాలి. వీరంతా ఒకే అచ్చులోంచి వెలువడ్డవారు, ఒకే భాషను మాట్లాడుతారు, ఒకే విధంగా ఉంటారు అన్నది ప్రసిద్ధమై ఉంది కదా! అలాగే ఇప్పుడు ఇది కూడా ప్రసిద్ధంగా కనిపించాలి.
సర్వశ్రేష్ఠ ఆత్మల మనస్సు యొక్క భావనలు మరియు స్వభావాలు ఒకే అచ్చులోంచి వెలువడినట్లుగా ఉండాలి, అలా కనిపించాలి. సత్యత మరియు స్వచ్ఛతలకు ఎటువంటి సాధారణ అర్థమును తీసుకోకండి. ఎంతటి స్వచ్ఛత ఉంటుందో అంతటి తేలికతనం కూడా ఉంటుంది. ఎంతగా తేలికగా ఉంటారో అంతగా పరస్పరం సమీపంగా వస్తారు మరియు ఇతరులను కూడా తేలికగా చేయగలుగుతారు. తేలికతనం ఉన్న కారణంగా వారి ముఖంపై ప్రకాశము కనిపిస్తుంది. కావున ఇప్పుడు ఈ మార్పును తీసుకురండి. ప్రారంభంలో మీ ముఖము ద్వారా సాక్షాత్కారాలు అధికంగా జరిగేవి, ప్రకాశము కనిపించేది. ప్రారంభ సేవపు స్మృతిని తీసుకురండి. ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి, దేవీ రూపాన్ని అనుభవం చేసుకునేవారు. ఇప్పుడు వక్తలుగా అనిపిస్తున్నారు, జ్ఞానవంతులుగా అనిపిస్తున్నారు కాని శక్తివంతులుగా అనిపించడం లేదు. ఇప్పుడు దీనిని ఈ సంఘటనలో నింపుకోవాలి. ఏ విధంగా ఇప్పుడు వీరిరువురిని (దాది దీదిలను) నిమిత్తులుగా అందరూ అనుభవం చేసుకుంటున్నారో అలా పూర్తిగా అదేవిధంగా కనిపించాలి. వీరు ఇరువురు కాదు, ఒక్కరిగానే కనిపిస్తున్నారు అని అందరూ దీన్ని ప్రత్యక్షంగా అనుభవం చేసుకుంటారు. పరస్పరం సమీపంగా వస్తూ వస్తూ సమానంగా అవుతూ ఉంటారు. కావున ఏ విధంగా వీరిరువురూ ఒక్కరిగా కనిపిస్తారో అలాగే వీరందరూ ఒక్కరుగా కనిపించాలి, అప్పుడే మాల తయారైంది అని అనవచ్చు. స్నేహమనే దారము సిద్ధంగా ఉన్నట్లయితే మణులు సహజంగానే స్మరింపబడతాయి. స్నేహపు దారము ద్వారా ముత్యాలు అతి సమీపంగా ఉంటాయి అప్పుడే మాల తయారవుతుంది. సామీప్యతయే మాలను తయారుచేస్తుంది. కావున స్నేహమనే దారము సిద్ధమైంది, కాని ఇప్పుడు మణులు పరస్పరం సమీపంగా మనస్సు యొక్క భావనలను మరియు స్వభావాలను కలుపుకోవాలి, అప్పుడు మాల ప్రత్యక్షంగా కనిపిస్తుంది, ఇది తప్పకుండా చేయాలి. ఇటువంటి అద్భుతమును చేసి చూపించాలి.
ఎంత దూరదూరాల నుండి, ఎక్కడెక్కడి నుండో సేవను వదిలి వచ్చారు కదా, దాని ప్రమాణమును తప్పకుండా చూపించాలి. దూరం నుండి నడుస్తూ వచ్చారు, దూరాన్ని అంతం చేసేందుకు వచ్చారు, అర్థమైందా? సర్వశ్రేష్ఠ ఆత్మలతో బాప్ దాదా కూడా ఉన్నారు కదా! ఏ సమీప ఆత్మలతో బాప్ దాదా తోడుగా ఉన్నారో అటువంటి గ్రూపు కొరకు అందరూ ఎప్పుడు ఈ సంఘటన తమ ప్రభావాన్ని చూపిస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. విశేష ఆత్మల సాధారణ కర్తవ్యము కూడా విశేషంగా భావింపబడుతుంది. సాధారణ రీతిలో పరస్పరంలో కూర్చున్నా కూడా అందరూ ఆ విశేషతతో చూస్తారు. ఇప్పుడు ఏదైనా నవీనత అనుభవమయ్యే విధంగా అటువంటి శక్తి ఏదైనా లభించాలి అని అందరూ కోరుకుంటారు.
అందరికీ ఫోర్సును ఇచ్చే నిమిత్త ఆత్మలు మీరు. వారిని అవ్యక్త స్థితిలో ఎలా పైకి ఎక్కించాలంటే ఈ ధరణి యొక్క చిన్న చిన్న విషయాల ఆకర్షణ వారిని ఆకర్షించజాలకూడదు, మాయాప్రూఫ్ గా తయారుచేయండి. మాయాప్రూఫ్ గా తయారుచేసే ప్రూఫ్ ను చూపించండి. మీరు ప్రూఫే కదా! విజయీ రత్నాలు ఎలా ఉంటారు అన్నదానికి మీరు ప్రూఫ్ (ప్రమాణము). కావున ఎవరైతే ప్రూఫ్ గా ఉన్నారో వారందరూ మాయా ప్రూఫ్ అవ్వాలి. కావున ఈ సంఘటన యొక్క ముద్ర ఎలా ఉంటుంది? 16 కళా సంపూర్ణంగా అవ్వాలి. ఒక్క కళ కూడా తక్కువగా ఉండకూడదు. మంచి బంగారము సహజంగానే మోల్డ్ అవుతుంది. కళ లేని కారణంగా మోల్డ్ అవ్వలేరు(మలుచుకోలేరు). మీరు 100 శాతము బంగారంగానే ఉన్నారు, కావున సర్వ విశేషతలను నింపుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరికీ వారి వారి విశేషతలు ఉంటాయి. ఏదైతే విశేష కార్యము జరిగినప్పుడు దాని కొరకు విశేష ఆత్మలు గుర్తుకు వస్తారు. కాని ఇప్పుడు ఏదైనా కార్యము జరిగినప్పుడు సర్వ విశేష ఆత్మల స్మృతి కలగాలి. కావున పరస్పరం సహయోగమును ఇవ్వండి మరియు తీసుకోండి. ఎప్పుడైతే ఈ విధంగా బీజరూపపు గ్రూప్ గా అవుతారో అప్పుడు బీజము ద్వారా వృక్షము దానంతట అదే వెలువడుతుంది. ఈ సంగఠన బీజరూపపు సంగఠన కదా! ఈ సృష్టికి బీజరూపులు కారు కాని తమ రచన యొక్క బీజరూపులుగా అయితే ఉన్నారు కదా! కావున బీజరూపపు సంగఠన 16 కళా సంపూర్ణంగా అయిపోతే వృక్షం కూడా అలాగే వెలువడుతుంది. చిన్న లోపము కారణంగా తక్కువగా ఉండేందుకు ఇప్పుడు ఇది సమయం కాదు. లోపము ఉండిపోయిందంటే నెంబర్ లో కూడా తక్కువగానే ఉండిపోతారు. చిన్న చిన్న లోపాల కారణంగా ఈ సంగఠనను తక్కువ నెంబర్ లోకి తీసుకురాకూడదు.
కావున సత్యమైన దీపావళిని జరపండి. పాత సంస్కారాలు, పాత సంకల్పాలు, పాత భావనలు, పాత స్వభావాలు అన్నింటినీ అంతం చేసి సంపూర్ణత యొక్క, సర్వ విశేషతల యొక్క ఖాతాను ప్రారంభించి వెళ్ళాలి. దీపావళిని మొదట ఎప్పుడైతే విశేష ఆత్మలు జరుపుకుంటారో అప్పుడు మళ్ళీ ఇతరులు కూడా జరుపుకుంటారు. ఈ భట్టీ అంతా టీచర్ లదే. ప్రతి ఒక్కరి ఫీచర్ ద్వారా ఈ ఫ్యూచర్ కనిపించాలి, అప్పుడేమౌతుంది? భవిష్యత్తు వర్తమానమైపోతుంది. అచ్ఛా!
Comments
Post a Comment