* 09-04-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“అవ్యక్త స్థితిలో సర్వ గుణాల అనుభవము.”
శబ్దము నుండి దూరంగా ఉండే స్థితి ప్రియంగా అనిపిస్తుందా లేక శబ్దములో ఉండే స్థితి ప్రియమనిపిస్తుందా? ఏ స్థితి ఎక్కువ ప్రియమనిపిస్తుంది? రెండు స్థితులు కలిసి ఉండగలవా? దాని అనుభవము ఉందా? ఈ అనుభవము చేసుకునే సమయములో ఏ గుణము ప్రత్యక్ష రూపములో కనిపిస్తుంది?(అతీతము మరియు ప్రియము) ఈ స్థితి ఎటువంటిదంటే బీజములో ఏవిధంగా మొత్తము వృక్షము ఇమిడి ఉంటుందో అలాగే ఈ అవ్యక్త స్థితిలో సంగమయుగపు విశేష గుణాల మహిమనేదైతే చేస్తారో ఆ సర్వ విశేష గుణాలు ఆ సమయములో అనుభవములోకి వస్తాయి. ఎందుకంటే మీరు మాస్టర్ బీజరూపులు కూడా, జ్ఞానసంపన్నులు కూడా. కావున కేవలము శాంతియే కాకుండా శాంతితో పాటుగా జ్ఞానము, అతీంద్రియ సుఖము, ప్రేమ, ఆనందము, శక్తి మొదలగు సర్వ ముఖ్య గుణాల అనుభవము ఉంటుంది. కేవలం మీరే కాకుండా అన్య ఆత్మలు కూడా ఇటువంటి స్థితిలో స్థితులై ఉండే ఆత్మల ముఖము ద్వారా ఈ సర్వ గుణాలను అనుభవము చేస్తారు. సాకారరూపములో కూడా ఏమి అనుభవము చేసుకున్నారు? ఒకే సమయములో సర్వ గుణాలు అనుభవములోకి వస్తాయి. ఎందుకంటే ఒక్క గుణంలో అన్ని గుణాలూ ఇమిడి ఉంటాయి. ఏవిధంగా అజ్ఞానతలో ఒక వికారముతో పాటు సర్వ వికారాలకు గాఢమైన సంబంధము ఉంటుందో అలాగే ఒక గుణముతో పాటు ముఖ్య గుణాలకు కూడా గాఢమైన సంబంధము ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నా స్థితి జ్ఞానస్వరూపంగా ఉంది అని చెప్పినట్లయితే జ్ఞాన స్వరూపముతో పాటు ఇతర గుణాలు కూడా అందులో తప్పకుండా ఇమిడి ఉంటాయి. దీనిని ఒక్క మాటలో ఏ స్టేజ్ అని అంటారు? మాస్టర్ సర్వశక్తివంతులు. ఇటువంటి స్థితిలో సర్వశక్తుల ధారణ ఉన్నట్లయితే అటువంటి స్థితిని తయారు చెయ్యటము - ఇదే సమానత, సంపూర్ణతా స్థితి. ఇటువంటి స్థితిలో స్థితులై సేవ చేస్తారా? సేవ చేసే సమయంలో స్టేజ్ పైకి వచ్చినట్లయితే మొదట ఈ స్టేజ్ పై (స్థితిలో) ఉపస్థితులై తరువాత అప్పుడు ఈ స్థూల స్టేజ్ పైకి రండి. దీనితో ఏం అనుభవమౌతుంది? సంగఠన మధ్యలో ఉంటూ కూడా అలౌకిక ఆత్మలుగా కనిపిస్తారు. ఇప్పుడు సాధారణ స్వరూపముతో పాటుగా స్థితి కూడా సాధారణంగా కనిపిస్తోంది, కానీ సాధారణ రూపంలో ఉంటూ అసాధారణ స్థితి లేక అలౌకిక స్థితి ఉండటం ద్వారా సంగఠన మధ్యలో అల్లాకు చెందినవారిగా కనిపిస్తారు. ప్రారంభములో కూడా ఇటువంటి స్థితితో కూడిన నషా ఉండేది కదా! ఏవిధంగా సితారల సంగఠనలో విశేష సితార ఉన్నట్లయితే దాని మెరుపు, ప్రకాశము దూరానికి కూడా అతీతంగా మరియు ప్రియంగా అనిపిస్తుందో, కావున సితారలైన మీరు కూడా సాధారణ ఆత్మల నడుమ ఒక విశేష ఆత్మగా కనిపించండి. ఏదైనా అసాధారణ వస్తువు ఎదురుగా వచ్చినట్లయితే అనుకోకపోయిన కూడా అందరి అటెన్షన్ ఆవైపుకు పోతుంది. కావున అటువంటి స్థితిలో స్థితులై స్టేజ్ పైకి వెళ్ళినట్లయితే లోకుల దృష్టి మీవైపుకు స్వతహాగనే వెళ్తుంది. స్టేజ్ సెక్రటరీ మీ పరిచయమును ఇవ్వకపోయినా కానీ, మీ స్థితి స్వయమే పరిచయమును ఇవ్వాలి. వజ్రము ధూళిలో దాగి ఉన్నాగానీ తన పరిచయమును స్వయం ఇవ్వదా? కావున సంగమయుగములో వజ్ర సమానమైన జీవితము మీ పరిచయమును స్వయమే ఇవ్వగలదు. ఇప్పటివరకు గల రిజల్టు ఏమిటి, తెలుసా? ఇప్పుడు దేని సమానంగా అయ్యారు? భాషణ మొదలగునవి ఏవైతే చేస్తారో వాటి రిజల్టుగా ఏం కనిపిస్తుంది? వర్తమాన సమయములో ఎవరినైతే నెంబర్ వన్ ప్రజ అని అంటారో వారు కూడా తక్కువగా వెలువడుతారు. సాధారణ ప్రజలు ఎక్కువగా వెలువడుతున్నారు. ఎందుకంటే సాధారణ రూపముతో పాటు స్థితి కూడా చాలా సమయము సాధారణంగా తయారవుతుంది. ఇప్పుడు సాధారణ రూపంలో అసాధారణ స్థితి అనుభవమును స్వయం కూడా చెయ్యండి మరియు ఇతరులకు కూడా ఆ అనుభవమును చేయించండి. బాహ్యముఖతలోకి వచ్చే సమయంలో అంతర్ముఖతా స్థితిని కూడా తోడుతోడుగా ఉంచుకోవటము, ఇది జరగదు. అంతర్ముఖులుగా అన్నా అవుతారు లేదా బాహ్యర్ముఖులుగా అన్నా అవుతారు కానీ అంతర్ముఖులుగా అయ్యి మళ్ళీ బాహ్యముఖత లోకి రావటము ఈ అభ్యాసము కొరకు తమపై తాము వ్యక్తిగత అటెన్షనను ఉంచుకొనే ఆవశ్యకత ఉంది. బాహ్యర్ముఖతా ఆకర్షణ అంతర్ముఖ స్థితి కన్నా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణము - ఎల్లప్పుడూ తమ శ్రేష్ఠ స్వరూపము మరియు శ్రేష్ఠ నషాలో స్థితులై ఉండరు! కావుననే స్థితి శక్తిశాలీగా ఉండదు.
నాలెడ్జ్ ఫుల్ తో పాటుగా పవర్‌ఫుల్ గా కూడా అయ్యి జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే అనేక ఆత్మలను అనుభవజ్ఞులుగా తయారు చెయ్యగలరు. ఇప్పుడు వినిపించేవారు చాలామంది ఉన్నారు, కానీ అనుభవము చేయించేవారు తక్కువగా ఉన్నారు. వినిపించేవారు అనేకమందైతే ఉండనే ఉన్నారు, కానీ అనుభవమును చేయించేవారు కేవలము మీరే. కావున సేవ చేసే సమయంలో ఈ లక్ష్యమును కూడా ఉంచాలి - జ్ఞానదానముతో పాటుగా మీ మరియు తండ్రి గుణాల దానమును కూడా చెయ్యాలి. గుణాల దానమును కేవలము మీరు తప్ప ఇతరులెవ్వరూ చెయ్యజాలరు. కావున స్వయమే సర్వ గుణాల అనుభవ స్వరూపంగా ఉన్నట్లయితే అన్య ఆత్మలను కూడా అనుభవజ్ఞులుగా తయారు చెయ్యగలరు. కమలపుష్ప సమానంగా అయ్యారా? మీ జీవిత చిత్రమునే చూపించారా లేక ఇతర మహారధుల జీవిత చిత్రమా? మా చిత్రము అనే అంటారు కదా! చిత్రాలను ఎందుకు తయారుచెయ్యటం జరుగుతుంది? చరిత్రకే చిత్రము తయారౌతుంది. కావున అటువంటి చరిత్రవంతులు కాబట్టే చిత్రాలు తయారుచేసారు కదా! ఈ ఒక్క చిత్రమును స్మృతిలో ఉంచుకొని ప్రతి కర్మలోకి వచ్చినట్లయితే ఎల్లప్పుడూ ఇతర అన్ని విషయాలలో అలిప్తులు(అతీతులు)గా ఉంటారు. ఇలా అల్పకాలము కొరకు ఉంటుంటారు! ఎలాంటి వాతావరణమైనా, ఎలాంటి వాయుమండలము ఉన్నా కానీ కేవలము ఈ చిత్రాన్ని గుర్తు ఉంచుకొన్నట్లయితే వాయుమండలము నుండి అతీతంగా ఉంటారు. ఇప్పుడు వాయుమండలపు ప్రభావము చాలా దూరం పడుతుంది. మేము పంచతత్వాలను కూడా పావనంగా తయారుచేసేవారము, పరివర్తనలోకి తీసుకువచ్చేవారము అని లక్ష్యమైతే చాలా ఉన్నతంగా ఉంది. మరి వారు వాయుమండలమునకు ఎప్పుడన్నా వశం అవ్వగలరా? మీరు పరివర్తన చేసేవారే గానీ ప్రకృతి ఆకర్షణలోకి వచ్చి పరివర్తనలోకి వచ్చేవారు కాదు. మళ్ళీ కమలపుష్ప సమానంగా సదాకాలము ఉండగలరు.
ఈరోజు ఈ గ్రూపుది ఏ రోజు? ఇప్పుడు థియరీ పూర్తి అయిపోయింది. ప్రాక్టికల్ పరీక్షను ఇవ్వటానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ గ్రూపు ఇతర అన్ని గ్రూపుల కంటే విశేషంగా ఏ కార్యమును చేసి, చూపిస్తారు? ఎంత సమయములో మరియు ఎంతమంది వారసులను తయారు చేసి తీసుకువస్తారు? కొద్ది సమయములోనే అనేకులను తయారుచేస్తారు. వీరు ప్రతిజ్ఞలనైతే చాలా చేసారు. ప్రతిజ్ఞలకు ఒక ఫంక్షనే చేసేస్తారు. ఎన్ని ప్రతిజ్ఞలను చేస్తారో వాటన్నింటినీ నిలబెట్టుకొనేందుకు కేవలము ఒకే నియమాన్ని గుర్తు ఉంచుకోవాలి. అది ఏ నియమము? (జీవించి ఉంటూ మరణించటము) పదే పదే జీవించి ఉండి కూడా మరణించటము అన్నది ఉంటుందా? బాప్ దాదా ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిపై అన్ని రకాల ఆశలను ఉంచుతారు. కానీ ఆశలను పూర్తి చేసేవారు నెంబర్ వారీగా తమ షోను చూపిస్తారు. కావున ఈ గ్రూపు ముఖ్యంగా ఒక ప్రతిజ్ఞను గుర్తు ఉంచుకోవాలి. మొత్తము కోర్సు సారము ఏమిటి? చిత్రాలలో కూడా ముఖ్యమైన చిత్రంగా, బాప్ దాదాను ప్రత్యక్షము చెయ్యగల చిత్రంగా దేనిని ప్రాక్టికల్ లో చూపిస్తారు? అన్ని శిక్షణల సారాన్ని వినిపించండి. అప్పుడిక ఏ కర్మలోనైనా కూడా, చూడటము-లెయ్యటము-కూర్చోవటము-నడవటము మరియు నిద్రించటంలో కూడా ఫరిస్తాతనము కనిపిస్తుంది. అన్ని కర్మలలో అలౌకికత ఉండాలి, కర్మలో మరియు సంస్కారాలలో ఎటువంటి లౌకికతా ఉండకూడదు, అలా పరివర్తన చేసారా? సర్వోత్తమ పురుషార్థుల లక్షణములు కూడా విశేషంగా ఉంటాయి. వారి ఆలోచన, మాట, పని మూడూ కూడా సమానంగా ఉంటాయి, ఇది చెయ్యకూడదు అని, ఆలోచించటమైతే ఆలోచించాము కానీ చేసేసాము - అని ఇలా వారు ఎప్పుడూ అనరు. ఇలా కాదు. ఆలోచించటము, మాట్లాడటము, చెయ్యటము ఈ మూడూ ఒకే విధంగా మరియు తండ్రి సమానంగా ఉండాలి. అటువంటి శ్రేష్ఠ పురుషార్థులుగా అయ్యారా? అచ్ఛా!
ఈ గ్రూపు ఎంత పెద్దదో అంతగానే శక్తిశాలీ స్వరూపులుగా అయ్యి నలువైపులా వ్యాపించినట్లయితే అప్పుడిక శక్తుల జయజయ నాదాలను ప్రసిద్ధము చెయ్యగలరు. సంస్కారాలకు అధీనముగా కూడా అవ్వకూడదు. ఎవరి స్నేహమునకు కూడా అధీనులు కాకూడదు. వాయుమండలమునకు కూడా అధీనులుగా కాకూడదు. అర్థమైందా! ఏం చెయ్యాలి, నిస్సహాయురాలిని...... ఇప్పుడు ఇలాంటి మాటలు నోటి నుండే కాదు మనస్సులో ఆలోచనరూపంలో కూడా రాకూడదు. ఏ వ్యక్తి అయినా లేక వాయుమండలమైనా అసహాయులుగా చేసినా గానీ మీరైతే అసహాయులుగా అవ్వకూడదు కానీ దృఢవంతులుగా అవ్వాలి, అర్థమైందా! అప్పుడిక ఈ కంప్లైంట్ (ఫిర్యాదు) రాదు. మీ పురుషార్థమునకు చెందిన కంప్లైంట్ ను భట్టీ మొదట ఎవరైనా ఇచ్చారా? అది ఏ కంప్లైంట్? నిర్బలత కారణంగా సాంగత్యదోషములోకి రావటము, ఈ కంప్లైట్ ను కంప్లీట్ చేసి వెళ్తున్నారా? ఎవ్వరూ అటువంటి సాంగత్యములోకి రాజాలరు. ఏదైనా ఈశ్వరీయరూపంలో మాయ తన సహచరునిగా చేసుకున్నట్లయితే? చూడండి, మీ ప్రతిజ్ఞలను గుర్తు ఉంచుకోవాలి. ఒక్కరే ఉన్నారు, ఒక్కరికి చెందినవారుగా ఉంటాము, ఒక్కరి మతముపై నడుస్తాము అన్న మీ నినాదమును ఎల్లప్పుడూ దృఢంగా ఉంచుకోవాలి. ఈశ్వరీయ రూపంతో మాయ ఎదురుగా ఎలా వస్తుందంటే, దానిని గమనించేందుకు చాలా పరిశీలన అవసరమౌతుంది. పరిశీలనా శక్తిని ధారణ చేసి వెళ్తున్నారా? ఎల్లప్పుడూ దీనిని అవినాశిగా ఉంచుకోవాలి. ఇప్పుడు రిజల్టును చూస్తాము. అల్పకాలికమైన రిజల్టును చూపించవద్దు. సదాకాలముది మరియు సంపూర్ణమైన రిజల్టును చూపించాలి. ఈ గ్రూపు ప్రతిజ్ఞలను కూడా చేసారు, ధైర్యమును కూడా ఉంచారు, కానీ ఆ ప్రతిజ్ఞల నుండి తొలగించేందుకు మాయ మిమ్మల్ని బలవంతం చేసినట్లయితే అప్పుడేం చేస్తారు? ప్రతిజ్ఞలనైతే చాలా మంచిగా చేసారు, కానీ ఎవరైనా బలవంతం చేసేసినట్లయితే అప్పుడిక ఏం చేస్తారు? ఎవరైతే స్వయమే బలహీనులుగా అయిపోతారో వారు యుద్ధాన్నేం చెయ్యగలరు?
సత్యము అని దేనినంటారు తెలుసా? ఏదైనా విషయము ఒకవేళ సంకల్పములోకి వచ్చినా గానీ ఆ సంకల్పమును కూడా దాచి పెట్టకూడదు, దీనినే సత్యము అని అంటారు. ఒకవేళ పురుషార్థము చేసి సఫలతను పొందినా కూడా మీ సఫలత మరియు ఓటమి రెండింటి సమాచారమును స్పష్టంగా వినిపించాలి. ఇదే సత్యము, సత్యమైనవారు తమ ప్రతిజ్ఞలను పూర్తి చెయ్యగలరు. అచ్ఛా!
Comments
Post a Comment