08-07-1973 అవ్యక్త మురళి

* 08-07-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సమయం యొక్క పిలుపు.

            మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? అందరూ మేళాలో కూర్చున్నారా? ఇది ప్రత్యక్ష మేళ మరియు మిగిలినవన్నీ స్మృతి చిహ్నపు మేళాలు. ఇప్పటి ఈ మధుర మిలనమేళకు గుర్తుగా అనేక స్థానాలలో మరియు అనేక నామాలతో మేళాలను జరుపుకుంటూ వచ్చారు. మేళాలో విశేషంగా కలుసుకోవడం జరుగుతుంది. మేళ అనగా కలుసుకోవడము. ఈ మిలనము అనగా మేళ ఎటువంటిది? ఈ సమయంలోని ముఖ్యమైన మేళ ఆత్మరూపంతో తండ్రి అయిన పరమాత్మతో కలుసుకునే మేళ, అనగా ఆత్మల, పరమాత్మల మేళ, కేవలం ఒక్క సంబంధంతో కాదు సర్వసంబంధాలతో, సర్వసంబంధీకులైన తండ్రితో కలుసుకునే మేళ అనగా ఇది సర్వప్రాప్తుల మేళ. ఒక్క క్షణంలో సర్వసంబంధాలతో, సర్వసంబంధీకుడైన బాబాతో మిలనం జరపడం ద్వారా ప్రాప్తి స్వతహాగానే లభిస్తుంది మరియు మిగిలిన మేళాలన్నీ ఖర్చు చేసేవిగానే ఉంటాయి. కాని, ఈ మేళ సర్వప్రాప్తులను పొందే మేళ మరియు ఇతర మేళాలలో ఏదైనా ప్రాప్తింప చేసుకోవాలనుకున్నా ముందు ఏదైనా ఇచ్చే ప్రాప్తించుకుంటారు. కాని, ఇక్కడ మీరు ఇచ్చేదేమిటి? దేనినైతే మీరు సంభాళించలేరో దానినే మీరు ఇస్తారు కదా! ఎవరైనా ఇక్కడ మంచి వస్తువునేదైనా ఇస్తారా? ఏ వస్తువునైతే మీరు సంభాళించలేరో మీరు వాటినే బాబాకు ఇస్తారు. దీని ద్వారా బాబాను ఎలా చేసేశారు? సేవాధారిగా చేసారు కదా! ఏ విధంగా మీ వస్తువునేదైనా సంభాళించేందుకు ఎవరైనా సేవకుడ్ని పెట్టుకుంటారు కదా! దేనినైతే మీరు నిగ్రహించుకోలేరో దానినే బాబాకు ఇచ్చేస్తారు. బాబాకు ఇంకా ఏమైనా ఇచ్చారా? చెత్తనంతా ఇచ్చి కోటానురెట్ల ప్రాప్తి లభిస్తున్నట్లయితే దానిని ఇవ్వడం అని అంటారా లేక తీసుకోవడం అని అంటారా? దానిని తీసుకోవడం అనే అంటారు కదా! మిగిలిన మేళాలన్నీ ఇచ్చేందుకే ఉంటాయి. కాని, అక్కడ ఏదైనా ఇచ్చి మరి ఇంకేదైనా పొందినట్లయితే అది ఏమంత పెద్ద విషయము! కాని, ఈ మేళా సర్వప్రాప్తులను పొందే మేళ. మీకు ఏది కావాలనుకుంటే అది మరియు ఎంత కావాలనుకుంటే అంత పొందగలరు. కావున ఇటువంటి సర్వప్రాప్తుల మేళాను ఎప్పుడైనా చూశారా? ఇటువంటి మేళాకు మీరందరూ వచ్చారు. కావున మేళాలో ఒకటేమో మిలనము మరియు ఇంకొకటి ఏమిటి? ఇతర మేళాలలో మైలగా అయిపోతారు, కాని ఈ మేళాలో ఎలా అవుతారు? స్వచ్ఛముగా, స్వచ్ఛముగా అయితే అయిపోయారు కదా! లేక మీరు ఇంకా ఇప్పటివరకు కూడా స్వచ్ఛముగా అవుతూనే ఉన్నారా? స్వచ్ఛముగా అయిన తర్వాత ఏమౌతుంది? సింగారము చేయడం జరుగుతుంది మరియు తిలకమును దిద్దడం జరుగుతుంది. ఇప్పుడు సదా స్మృతి తిలకమును స్వయమునకు దిద్దుతున్నారు మరియు దివ్యగుణాలరూపీ నగల ద్వారా మిమ్మల్ని మీరు అలంకరించుకుంటున్నారా? కావున మేళాలో మిలనం కూడా జరిగింది మరియు జరుపుకోవడం కూడా జరిగింది. అలాగే మేళాలో ఆటపాటలు కూడా జరుగుతాయి. మేళ మరియు ఆటలు రెండూ కలిసే జరుగుతాయి. కావున మేళ మరియు ఆటలు ఈ రెండు పదాలను సదా గుర్తుంచుకున్నట్లయితే మీకు ఎటువంటి స్థితి తయారవుతుంది?

           ఎప్పుడైనా స్థితి అలజడి చెందినట్లయితే దానికి కారణము - మేళ అనగా మిలనము నుండి బుద్ధిని ప్రక్కకు తప్పిస్తారు అనగా మేళా నుండి వెళ్ళిపోతారు మరియు దానిని ఆటగా భావించరు. కావున మేళ మరియు ఆట ఈ రెండు పదాలను సదా గుర్తుంచుకోండి. మేళాలో అన్ని విషయాలు వచ్చేస్తాయి. ఇంతకుముందు వినిపించారు కదా! మిలనము ఏయే విషయాలది జరుగుతుంది? మేళ అన్న పదము గుర్తుకు రావడంతో సంస్కారాల మిలనము, బాబా మరియు పిల్లల మిలనము మరియు సర్వసంబంధాలతో సదా ప్రాప్తి యొక్క మిలనము ఇవన్నీ ఈ మేళాలో వచ్చేస్తాయి. ఈ సృష్టి ఒక ఆట వంటిది. ఇది ముఖ్యమైన విషయము. కాని, మాయ యొక్క భిన్న భిన్న పరీక్షలు లేక పరిస్థితులు ఏవైతే వస్తాయో అవి కూడా మీ కొరకు ఒక ఆట వంటివే. ఒకవేళ వీటిని ఒక ఆటగా భావించినట్లయితే ఆటలో ఎప్పుడూ వ్యాకులత చెందరు, నవ్వుకుంటూనే ఉంటారు, పరీక్షలు కూడా ఒక ఆటవంటివే. మూడవ విషయము ఆటగా భావించడం ద్వారా భిన్న భిన్న సంస్కారాల పాత్రలనేవైతే చూస్తారో ఆ పాత్రధారులకు ఈ అనంతమైన ఆటలో ఈ పాత్ర అనగా ఆట రచింపబడి ఉంది అన్న స్మృతితో వారి వల్ల ఎప్పుడూ స్థితిని అలజడి చేసుకోరు, ఎల్లప్పుడూ ఏకరస స్థితి ఉంటుంది. ఇది వెరైటీ పాత్ర అని, ఇది డ్రామా అనగా ఒక ఆట అని స్మృతిలో ఉన్నట్లయితే వెరైటీ ఆటలో పాత్ర లేకుండా ఉండడమన్నది ఎప్పుడైనా జరుగగలదా? దీని పేరే వెరైటీ డ్రామా. ఏ విధంగా హద్దులోని సినిమాలో భిన్న భిన్న నామాలతో భిన్న భిన్న ఆటలు ఉంటాయో, దానికి రక్తసిక్తమైన ఆట అన్న పేరు ఉన్నట్లయితే మరి అందులో ఏదైనా భయంకరమైన లేక బాధాకరమైన దృశ్యమును చూస్తే విచలితులవుతారా? ఎందుకంటే ఈ ఆటయే రక్తసిక్తమైన ఆట అని భావిస్తారు.  మొదటే ఇలా భావిస్తూ దానిని చూస్తారు అలాగే ఏవైనా యుద్ధాలు, పోట్లాటలు, క్రోధపు కథలు  ఉన్నట్లయితే వాటిని చూసి ఏడుస్తారా లేక నవ్వుతారా? తప్పకుండా నవ్వుతారు కదా! ఎందుకంటే, ఇదంతా  ఒక ఆట అని ముందే తెలుసు. అలాగే ఈ అనంతమైన ఆట పేరు వెరైటీ డ్రామా అనగా ఆట. కావున అందులో  వెరైటీ సంస్కారాలు లేక వెరైటీ స్వభావాలు లేక వెరైటీ పరిస్థితులను చూసి ఎప్పుడైనా విచలితులవుతారా లేక  దానిని కూడా సాక్షిగా అయి ఏకరస స్థితిలో స్థితులై చూస్తారా? కావున ఇది ఒక వెరైటీ ఆట అని  భావించినట్లయితే పురుషార్థమును చేయడంలో దేనినైతే కష్టము అని భావిస్తారో అది సహజమైపోదా!

          ఈ రెండు పదాలను మరిపోతారు, మేళాను మర్చిపోతారు మరియు ఆటను కూడా మర్చిపోతారు. అలా మర్చిపోవడం వల్లనే స్వయమును వ్యాకులత పర్చుకుంటారు ఎందుకంటే స్మృతిని అనగా సాక్షితనపు  స్థితిని వదిలివేస్తారు. సీటును వదిలి ఎవరైనా డ్రామాను చూసినట్లయితే వారి పరిస్థితి ఏమౌతుంది?  కావున సీటుపై సెట్ అయి వెరైటీ డ్రామా యొక్క స్మృతిని ఉంచుతూ ఒక్కొక్క పాత్రధారి అభినయించే ప్రతి పాత్రను చూసినట్లయితే ఎల్లప్పుడూ హర్షితంగా ఉంటారు. మీ నోటి నుండి ఓహో, ఓహో అనే  వెలువడుతుంది. ఓహో మధురమైన డ్రామా! ఇది ఎందుకైంది, ఎలా అయింది అన్నది వెలువడదు,  అందుకు బదులుగా ఓహో, ఓహో అనే మీ నోటి నుండి వెలువడుతుంది అనగా సదా సంతోషంలో  తేలియాడుతూ ఉంటారు, సదా స్వయమును మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసుకుంటారు.  ఈ విధంగా స్వయమును ప్రాక్టికల్ గా అనుభవం చేసుకుంటున్నారా?

           మేళాలో బైటకు వెళ్ళినట్లయితే వ్యాకులత చెందుతారు. అలాగే ఎప్పుడైతే చేయి వదిలివేస్తారో  అప్పుడు కూడా వ్యాకులత చెందుతారు అలాగే ఇక్కడ కూడా మీరు బాబా చేతిని వదిలివేస్తారు! చేతిని  వదిలివేయడము యొక్క అర్థాన్ని గూర్చి మీకు తెలుసా? బాబాకు స్థూలమైన చేయి అయితే లేదు. శ్రీమతము చేయి మరియు బుద్ధియోగము తోడు. కావున మేళాలో ఎప్పుడైతే చేయిని మరియు తోడును రెండింటినీ వదిలివేస్తారో అనగా బాబా నుండి ప్రక్కకు తప్పుకుంటారో అప్పుడే వ్యాకులత చెందుతారు.  చేతిని మరియు తోడును వదలనట్లయితే సదా సంతోషంలో ఉంటారు. కావున ఇప్పుడు, ఎల్లప్పుడూ మేళ మరియు ఆటగా భావిస్తూ మీ పాత్రను మరియు ఇతరుల పాత్రను చూడండి. ఇది సహజమైన  విషయము మరియు సాధారణమైన అనగా పాత విషయమే. ఈ పాత విషయమును నిరంతరంగా చేసుకున్నారా లేక అప్పుడప్పుడూ మర్చిపోతూ మరియు అప్పుడప్పుడూ సమయానికి గుర్తు చేసుకుంటున్నారా?  ఆ రెండు విషయాలనైనా నిరంతరంగా గుర్తుంచుకున్నట్లయితే నిరంతర సంతోషంలో మరియు నిరంతర  శక్తిస్వరూపంలో ఉండగల్గుతారు. ఇప్పుడు సమయము చిన్న చిన్న విషయాలలో లేక సాధారణ సంకల్పాల  విఘ్నాలలో పోగొట్టుకునే సమయం కాదు. ఇప్పుడు మాస్టర్ రచయితలుగా అయి మీ భవిష్య ప్రజలు  మరియు భక్తులు ఇరువురికీ మీరు ప్రాప్తించుకున్న శక్తుల ద్వారా వరదానాలను ఇచ్చే సమయము వచ్చి చేరుకుంది. ఇప్పుడు ఇది ఇచ్చే సమయమే కాని స్వయం తీసుకునే సమయం కాదు. ఎవరైనా ఇచ్చే  సమయంలో కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే మరి వారు ఎప్పుడు ఇవ్వగలరు? సత్యయుగంలో ఇస్తారా?  అక్కడ ఏమైనా అవసరం ఉంటుందా? కావున ఇప్పుడే మీ రచనను నిండుగా చేసుకునే సమయం ఇది.  ఇప్పుడు మీ పట్ల సమయాన్ని పోగొట్టుకోవడము లేక మీ పట్ల సర్వశక్తులను వినియోగించకోవడం అందులోనే సర్వశక్తులను అంతం చేయడము అనగా ఏదైతే సంపాదించుకున్నారో దాన్ని పోగొట్టుకోవడం. ఇప్పుడు అలా చేసే సమయం లేదు. ఇంతకుముందు సమయం ఉండేది, సంపాదించుకునేవారు  మరియు తినేవారు. కాని, ఇప్పుడు ఉన్న సమయం ఎటువంటిది? ఏదైతే జమ చేసుకున్నారో దానిని  సర్వఆత్మల కొరకు ఇచ్చే సమయం ఇది. లేకపోతే మీ ప్రజలు, భక్తులు ఈ ప్రాప్తుల నుండి వంచితులుగా  ఉండిపోతారు మరియు వారు బికారులుగానే ఉండిపోతారు. మరి దాత మరియు వరదాతల పిల్లలు  దాతలుగా లేక వరదాతలుగా అవ్వరా? ఏ సమయంలోనైతే సర్వఆత్మలు మీముందు బికారులుగా అయి  తీసుకునేందుకు వస్తారో అప్పుడు దయార్ద్రహృదయుడైన బాబా పిల్లలైన మీరు సర్వాత్మల పట్ల దయను  చూపించరా? ఆ సమయంలో వారిపై మీకు దయ కలుగదా? వారు తపిస్తూ ఉండడం మీరు చూడగలరా? 

           లౌకిక రూపంలో కూడా హద్దులోని రచయిత తమ రచనను దు:ఖితులుగా లేక బాధపడుతున్నట్లుగా చూడలేడు. కావున ఇప్పుడు మీరు కూడా మాస్టర్ రచయితలే కదా! మరి ఇది ఒక్క బాబా పనేనా లేక మీ  పని కూడానా? ఎప్పుడైతే మీరందరూ కూడా మాస్టర్ రచయితలే అయినప్పుడు మరి మాస్టర్ రచయితలు  తమ రచన యొక్క దు:ఖ విలాపమును లేక తపనను ఎప్పుడూ చూస్తూ ఉండలేరు. ఆ సమయములో వారికి ఏదో ఒకటి ఇవ్వవలసి వస్తుంది. ఒకవేళ ఇప్పటినుండే స్టాకు జమ చెయ్యనట్లయితే మరియు సంపాదించినదంతా తింటూ, ఖాళీ చేస్తూ ఉన్నట్లయితే ఇక వారికి ఏం ఇస్తారు? ఇప్పుడు మీ ఖాతాను చూసుకోవాలి. ఇప్పటి సమయానుసారంగా మాస్టర్ రచయితలు ఏ లెక్కను చూడాలి? ఏమేమి పొరపాట్లను చేసాము, ఇదైతే చిన్ననాటి లెక్క, కానీ మాస్టర్ రచయితలు తమ ఏ చార్టును పరిశీలించుకోవాలి? మీరు ప్రతి శక్తినీ మీ ముందు ఉంచుకొని ఈరోజు సర్వ శక్తులలో ఏ శక్తిని మరియు ఎంత శాతములో ఆ శక్తిని జమ చేసుకున్నాను? అనే ఈ లెక్కను చూసుకోవాలి. ఇప్పుడు జమ ఖాతా యొక్క లెక్కను చూడాలి. ఖర్చులకు ఫుల్‌స్టాప్ పెట్టాలి. ఇప్పటివరకు కూడా స్వయము కొరకే ఖర్చు పెడుతూ  ఉంటారా? ఇతరులకు ఇవ్వటము - ఇది ఖర్చు కాదు, ఇదైతే ఒకటి ఇవ్వటము - లక్షను పొందటము వంటిది. ఇది ఖర్చు ఖాతాలోకి రాదు, జమ ఖాతాలో ఉంటుంది. ఎప్పుడైతే మీ విఘ్నాల కొరకు శక్తిని ప్రయోగిస్తారో అప్పుడే అది ఖర్చు అవుతుంది. ఏదైనా విఘ్నము వచ్చినట్లయితే దానిని సమాప్తము చెయ్యటంలో సమయమేదైతే ఖర్చు చేస్తారో లేక జ్ఞానధనమునేదైతే ఖర్చు చేస్తారో, ఈ అన్ని ఖర్చులనూ ఇప్పటినుండే పొదుపు చేసుకోవాలి.

           ఏవిధంగా ఈ ప్రభుత్వము కూడా ఈరోజుల్లో పొదుపు పథకాన్ని తయారుచేస్తుందో, అలా సర్వశక్తివంతమైన ప్రభుత్వము కూడా ఇప్పుడు పొదుపు పథకాలను తయారుచేయండి అని పిల్లలందరికీ ఆర్డర్ చేస్తుంది. ఖర్చులకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఇప్పుడైతే ఇస్తూనే ఉండండి, ఇప్పుడు కూడా తీసుకోవటానికి ఏదైనా ఉందా? ఒకవేళ ఉన్నట్లయితే - తండ్రి పూర్తి వారసత్వమును ఇవ్వలేదు అని దీని ద్వారా నిరూపణ అవుతుంది. కానీ తండ్రి అయితే తనవద్ద ఏమీ ఉంచుకోనేలేదు. వారైతే తీసుకోవటానికి మరేమీ లేనంతగా ఒక్క క్షణములో పూర్తి వారసత్వమును ఇచ్చేస్తారు, మరి ఇప్పుడు పొదుపు చెయ్యటం వచ్చిందా లేక ఖర్చు చేసే అలవాటు అయిపోయిందా? చాలామంది ఎలా ఉంటారంటే, వారికి జమ చెయ్యటము రానే రాదు, జమ చెయ్యనే చెయ్యలేరు, వారు ఇంకా ఎక్కువ ఖర్చు చేస్తూ చేస్తూ వారికి అప్పు తీసుకొనే అలవాటు కూడా ఏర్పడిపోతుంది. ఇక్కడ కూడా ఎప్పుడైతే మీ శక్తిని ఖర్చు చేసేస్తారో అప్పుడు ఫలానా దీదీ, దాదీ లేక బాప్ దాదా కొంచెం ఇవ్వాలి అని అంటారు. అప్పు తీసేసుకుంటారు. మేము ఎవరి పిల్లలము అని మొదట ఆలోచించండి. తరగని ఖజానాలు గల యజమాని పిల్లలము! నషా ఉంది కదా? ఎప్పుడైతే తరగని ఖజానాలకు బాలకుల నుండి యజమానులమో మరి అటువంటివారు మళ్ళీ ఇతరుల నుండి శక్తి అనే అప్పును తీసుకుంటే అటువంటివారిని ఏమనాలి? చాలా తెలివైనవారు! అటువంటి అతి తెలివిగలవారిగా అయితే ఎప్పుడూ అవ్వరు కదా? పొదుపు చేసే యుక్తులు మరియు పొదుపు పథకాలు తెలుసా? పొదుపు చేసేందుకు కూడా అన్నింటికంటే సహజమైన మరియు శ్రేష్టమైన పద్ధతి ఏది, మరియు దీని ద్వారా సర్వ శక్తుల పొదుపును చెయ్యగలరు? బడ్జెట్ ను కూడా ఎలా తయారుచేస్తారు? మొదట తయారుచేసి తరువాతనే పరిశీలిస్తారు కదా? ఎలా తయారుచేస్తారంటే, దీని ద్వారా ఆటోమేటిక్ గా జమ అవుతుందా? అని చూస్తారు. బడ్జెట్ తయారుచెయ్యటము అనగా తమ బుద్ధి, వాణి మరియు కర్మ వీటన్నింటికీ మీ ప్రతి సమయపు ప్రోగ్రామ్ ను ఫిక్స్ చెయ్యాలి.

           ఏవిధంగా, బడ్జెట్ తయారుచేసేటప్పుడు దీనిపై ఇంత ఖర్చు చెయ్యాలి అని అందులో ఫిక్స్ చేస్తారు కదా. దాని అనుసారంగానే ఖర్చు పెడ్తారు, అప్పుడు బడ్జెట్ ప్రమాణంగా కార్యము సఫలమవ్వగలదు. కావున బడ్జెట్ తయారుచెయ్యటము అనగా అమృతవేళ లేచి రోజూ తమ బుద్ధి యొక్క ప్లాన్ ను, వాణిద్వారా ఏమేమి చెయ్యాలి మరియు కర్మద్వారా ఏమేమి చెయ్యాలి, వీటన్నింటినీ ఫిక్స్ చెయ్యండి అనగా మూడు రకాల రోజువారీ డైరీని తయారుచెయ్యండి. కావున ప్రతిరోజూ డైరీ తయారు చెయ్యటం ద్వారా బుద్ధికి చెందిన ఏ కర్తవ్యమును ఫిక్స్ చేసారో వాటిని మళ్ళీ ఈ విధంగా పరిశీలించుకోవాలి - నేను తయారుచేసిన బడ్జెట్ ప్రమాణంగా కార్యమును చేసానా? లేక బడ్జెట్ ఒకటి, ప్లాన్ మరొకటిగా లేదు కదా? కావున మీ సర్వ శక్తులనూ జమ చేసుకొనే సహజ యుక్తి - ప్రతిరోజూ మనసా, వాచ, కర్మణాల ప్లాన్‌ను తయారుచేసుకోండి. బుద్ధిని మొత్తము రోజంతటిలో ఏ కర్తవ్యములో బిజీగా ఉంచుకోవాలి అన్నదానిని కూడా ఒకవేళ అమృతవేళనే ఫిక్స్ చేసుకున్నట్లయితే అప్పుడిక ఇతర వ్యర్థములన్నీ సమాప్తమైపోతాయి. వ్యర్థమును సమాప్తము చేసినట్లయితే సమర్థులుగా అయిపోతారు. వ్యర్థమును సమాప్తము చేసేందుకు ప్లానింగ్ బుద్ధిని తయారుచెయ్యండి. ప్లానింగ్ బుద్ధిని తయారు చెయ్యటం ద్వారానే తమ సర్వ శక్తులను జమ చేసుకోగలరు ఎందుకంటే ఏ శక్తులనైతే ఖర్చు చేసారో వాటన్నింటినీ వ్యర్థంగా ఖర్చు చేసారు. ఒకవేళ వ్యర్థ ఖాతానే సమాప్తమైపోయినట్లయితే పొదుపు అనేది ఆటోమేటిక్ గానే అవుతుంది. వ్యర్థమును సమాప్తము చేసేందుకు డైలీ డైరీని తయారు చెయ్యండి. ఈ రోజు విశేషంగా బుద్ధిలో ఏ సంకల్పమును ఉంచుకొంటాను, లేక ఈరోజు వాణి ద్వారా ఏ కర్తవ్యము చేస్తాను? అని ఈవిధంగా మీ సమయమును  కూడా ఫిక్స్ చేసుకోండి. ఇది ఫిక్స్ అవ్వటం ద్వారా శక్తిని వ్యర్థము చేసే సాధారణ లేక వ్యర్థమాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిగిలిపోతాయి. ఎవరైతే వేస్ట్ (వ్యర్థము) చెయ్యరో వారు బెస్ట్ గా అయిపోతారు. వేస్ట్ చేసేవారు ఎప్పుడూ బెస్ట్ గా అవ్వజాలరు. అన్నింటినీ చూడండి మరియు మీ పొదుపు పథకాన్ని పెంచండి. అప్పుడే మాస్టర్ రచయితలుగా అవ్వగలరు. ఇప్పుడు మాస్టర్ రచయితలుగా అయ్యి రచన యొక్క పాలనను చేసే సమర్థత రాలేదు. మాస్టర్ రచయితలుగా కానట్లయితే ఎవరిగా అవ్వవలసి వస్తుంది?  ఒకవేళ ఎవరికైనా సంభాళించటము రానట్లయితే ఇతరుల సంభాళనలోకి వెళ్ళవలసి ఉంటుంది కదా! మరి అప్పుడు మాస్టర్ రచయితకు బదులుగా రచనగా అవ్వవలసి ఉంటుంది. అవ్వవలసింది అయితే మాస్టర్ రచయితలుగా కదా? మేళా మరియు ఖేల్(ఆట) అన్న రెండు పదాలనేవైతే విన్నారో కేవలము  వీటిని స్మృతిలో ఉంచుకొన్నా కూడా పొదుపు పథకము తయారవుతుంది. వ్యర్థ సంకల్పము, వ్యర్ధ  సమయము మరియు వ్యర్థ శక్తి, ఏదైతే ఖర్చు చేస్తారో అదంతా మిగిలిపోతుంది. ఇందుకొరకు కేవలము మీ నియమాన్ని దృఢంగా ఉంచుకోండి. ఇది చేస్తాము అనైతే ఆలోచిస్తారు, కానీ నియమిత రూపంలో  నియమాన్ని తయారుచేసుకోరు. ఒక మాసము చాలా జోష్ (ఉత్సాహము)లో ఉంటారు మళ్ళీ తరువాత మాయ రావటము ప్రారంభమవుతుంది మరియు మాయ స్పృహ లేకుండా చేసే కార్యమును మొదలుపెడుతుంది. కావున ఏం చెయ్యాల్సి వస్తుంది?

           చూడండి, ఎవరన్నా సృహలోకి రానట్లయితే వారికి ఇంజెక్షన్ తరవాత ఇంజెక్షన్ ఇస్తూనే ఉంటారు. లేక ఏదైనా ఆపరేషన్ చేసేట్లయితే దానిని చూసి ఫీలింగ్ లోకి రాకుండా ఉండేందుకు కూడా ఇంజెక్షన్‌ను ఇస్తూ ఉంటారు. ఇప్పుడు జోష్ బేహోష్ (సృహ లేని) రూపంలోకి వెళ్తూ ఉంది అని ఏ సమయములో అయితే అనుకుంటారో అనగా మాయ జోష్ మొదలైనట్లయితే ఏ ఇంజెక్షన్‌ను వేసుకుంటారు? అటెన్షన్ మరియు చెకింగ్ అయితే ఉండనే ఉన్నాయి. కానీ వాటితోపాటుగా అమృతవేళ పవర్‌ హౌస్ నుండి ఫుల్ పవర్ ను  తీసుకొనే నియమమేదైతే ఉందో దానిని పదే, పదే పరిశీలించుకోండి. ఇదే అతి పెద్ద ఇంజెక్షన్. అమృతవేళ తండ్రితో కనెక్షన్‌ను జోడింపచేసినట్లయితే మొత్తము రోజంతా మాయ చేసే బేహోష్ (సృహలేకుండా ఉండటం) నుండి రక్షింపబడి ఉంటారు. ఈ ఇంజెక్షన్ యొక్క లోటే ఉంది. కనెక్షన్ మంచిగా ఉండాలి. ఏదో లేచి అలా కూర్చోవటము కాదు. లేచైతే కూర్చున్నారు, నియమపాలననైతే చేసారు, కానీ కనెక్షన్ మంచిగా ఉందా అనగా ప్రాప్తుల అనుభవము కలుగుతోందా? ఒకవేళ ఇంజెక్షన్ ఇచ్చినా శక్తి అనుభవము లేదంటే ఇంజెక్షన్ పూర్తిగా పని చెయ్యలేదు అని అనుకుంటారు. ఇదే విధంగా అమృతవేళయొక్క కనెక్షన్ అనగా అన్ని పవర్స్ మరియు అన్ని ప్రాప్తుల అనుభవము కలగటము, ఇది అన్నింటికన్నా పెద్ద ఇంజెక్షన్. అచ్ఛా!

           దినమునకు ఆదికాలమైన అమృతవేళ ఒకవేళ మంచిగా ఉన్నట్లయితే మధ్యకాలము మరియు అంతిమ కాలము కూడా మంచిగా ఉంటుంది. ఆది కాలములో అనుభవము చేసే అభ్యాసము లేనట్లయితే సృష్టి ఆది లేక ఆది కాలములో సర్వ సుఖాల అనుభవమును చెయ్యజాలరు. మొత్తము రోజంతటికి ఇది కాలము, ఈ ఆది కాలమును ఒకవేళ వదిలేసి కొంత సమయము తరువాత లేక కొన్ని గంటల తరువాత లేచినా లేక కూర్చున్నా లేక కనెక్షన్ జోడించినా, ఎంతగా ఇక్కడ ఆలస్యమవుతారో అంతగానే అక్కడ ఆలస్యమవుతారు, ఎందుకంటే బాప్ దాదాతోటి పిల్లల మిలనము, అపాయిమెంట్ సమయమేదైతే ఉందో అందులో మొదటి అవకాశము పిల్లలకు ఉంది. తరువాతనే భక్తుల టర్న్, ఒకవేళ భక్తుల టైమ్ లో కనెక్షన్‌ను జోడించి నట్లయితే పిల్లల వలె వరదానమును పొందజాలరు కావున ఈ కాలమునకు ఆ కాలముతో సంబంధము ఉంది. అన్నింటి కంటే పెద్ద బడ్జెట్ యొక్క మొట్టమొదటి అయిటమ్ అయితే ఇదే - అమృతవేళ అనగా ఆదికాలము. మేము ఆది కాలములో వచ్చేవారమా లేక కొన్ని జన్మల తరువాత వచ్చేవారిమా అని ఆ సమయములో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇక్కడి గంటలు, అక్కడి జన్మలు. ఇక్కడ ఎన్ని తక్కువ గంటలో, అక్కడ అన్ని జన్మలు తక్కువైపోతాయి. అందరూ కూర్చోనైతే కూర్చుంటారు, ఆ సమయములోని దృశ్యాన్ని చూసినట్లయితే చాలా మజా వస్తుంది. ఆ సమయములోని దృశ్యము ఎలా ఉంటుందంటే, జైపూర్‌లో హఠయోగుల మ్యూజియమ్ ఒకటి ఉంది. అందులో భిన్న భిన్న రకాల హఠయోగులును చూపించారు. అమృతవేళ సమయములోని దృశ్యము కూడా అలాగే ఉంటుంది. కొందరు చాలా హఠంతో (బలవంతంగా) నిద్రను కంట్రోల్ చేసుకుంటుంటారు, కొందరు ఏదో తప్పదన్నట్లుగా సమయాన్ని అలా గడుపుతుంటారు, కొందరు తలక్రిందులుగా వేళ్ళాడుతూ ఉంటారు అనగా ఏ కార్యము గురించి అయితే కూర్చున్నారో అది వారి వల్ల కాదు. ఆ హఠయోగులను కూడా కొందరు ఒంటికాలుపై ఉన్నట్లుగా, కొందరు తల క్రిందకు పెట్టి కాళ్లు పైకి పెట్టినట్లుగా, మరికొందరు మరో విధంగా ఉన్నట్లుగా ఇలా రకరకాలుగా చూపిస్తారు. ఇక్కడ కూడా ఆ సమయములోని దృశ్యము అలా ఉంటుంది. కొందరు ఒక క్షణమైతే మంచిగా గడుపుతారు, మళ్ళీ రెండో క్షణానికి చూసినట్లయితే ఒక కాలుపై నిలిస్తే, ఇంకో కాలు వల్ల పడిపోతారు... ఈ రోజు కొంత జమ చేసుకుంటాము అని భావిస్తారు కానీ అలా జరగదు. ఆ దృశ్యము కూడా చూడవలసినది. ఇంకా కొందరు నిద్రపోతూ-నిద్రపోతూ యోగము చేస్తుంటారు. వారు ఏవిధంగా ముళ్ళపై నిద్రిస్తారో అలానే ఇది కూడా, ఇక్కడ శేషశయ్య పైన నిద్రిస్తారు. ఆ సమయము లోని ఇక్కడి ఫోజు కూడా అద్భుతంగా ఉంటుంది, కనుకనే అమృతవేళ మహత్వమును తెలుసుకోవాలి మరియు దానిని తెలుసుకొని జీవితములో తీసుకురావటం ద్వారా గొప్పవారిగా అవ్వగలరు అని వినిపించటము జరిగింది. ఒకవేళ అమృతవేళలో తమ ప్లానును తయారు చేసుకోనట్లయితే ప్రాక్టికల్ లోకి ఇక ఏం తీసుకువస్తారు?

           ఏదైనా లౌకిక కార్యము కూడా పూర్తి ప్లాన్‌ను తయారు చేసుకున్నప్పుడే సఫలమౌతుంది. ఒకవేళ ప్లాన్‌ను తయారు చెయ్యనట్లయితే సఫలత ఉండజాలదు. అదేవిధంగా అమృతవేళ మీ ప్లాన్‌ను ఫిక్స్ చెయ్యనట్లయితే మనసు, వాణి మరియు కర్మ ద్వారా ఏ సఫలత అయితే ఉండాలో దానిని పొందలేకపోతారు. ఇప్పుడు ఈ మహత్వమును తెలుసుకొని గొప్పవారిగా అవ్వండి. ఇక ఇప్పుడు ఏ పురుషార్థము మిగిలి ఉంది అని ఇప్పుడైతే స్పష్టముగా వినిపించాము. అమృతవేళను సరి చేసినట్లయితే అన్నీ సరి అయిపోతాయి. అమృతమును సేవించటము ద్వారా అమరులుగా అయిపోయినట్లుగా అమృతవేళను మంచిగా చేసుకున్నట్లయితే అన్నీ మంచిగా అయిపోతాయి. కావున అమృతవేళను సఫలము చేసుకోవటం ద్వారా 'అమరభవ' అన్న వరదానము లభిస్తుంది. ఇక తరువాత మొత్తము రోజంతటిలో ఎటువంటి విఘ్నములోనూ వాడిపోరు. సదా హర్షితులుగా ఉండటంలో మరియు సదా శక్తిశాలురుగా అవ్వటంలో అమరులుగా ఉంటారు. అమృతవేళలో అమరభవ అన్న వరదానమేదైతే లభిస్తుందో ఒకవేళ దానిని అప్పుడు తీసుకోనట్లయితే మళ్ళీ చాలా శ్రమ పడవలసి ఉంటుంది. శ్రమ పడటము మరియు ఖర్చు పెట్టడము రెండింటినీ చేస్తారు. ఇలా కాకుండా అమరభవ వరదానము ద్వారా శ్రమ మరియు ఖర్చు రెండింటి నుండి విడుదలైపోతారు. అచ్ఛా!             
           
           ఇలా సదా తండ్రితో ఉండేవారు మరియు సదా ప్రతి క్షణము, ప్రతి సంకల్పములో మిలనమును జరిపేవారికి, ఒక్క సంకల్పము మరియు ఒక్క క్షణము కూడా మేళ నుండి వేరుగా అవ్వనివారికి, ఎల్లప్పుడూ సాక్షీ మరియు స్మృతుల సీట్ పై సెట్ అయ్యి ప్రతి సీన్‌ను చూసే ఆటగాళ్ళకు లేక చూసే తీవ్ర పురుషార్థులకు,  ఒక్క క్షణములో సంకల్పము మరియు స్వరూపమును తయారుచేసుకునే వారికి, అనగా ఏ సంకల్పమునైతే చేసారో ఆ స్వరూపులుగా అయ్యే ఇటువంటి తీవ్ర పురుషార్థులకు, అమరభవ వరదానీ పిల్లలకు బాప్ దాదా  ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments