08-06-1973 అవ్యక్త మురళి

* 08-06-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సర్వశ్రేష్ఠ శక్తి పరిశీలనా శక్తి”

           సర్వశక్తులలో విశేష శక్తిని గూర్చి మీకు తెలుసా? స్వయమును మాస్టర్ సర్వశక్తివంతులుగా అయితే భావిస్తున్నారు కదా! సర్వశక్తులలోకి సర్వశ్రేష్ఠమైన శక్తి ఏది? ఏ విధంగా చదువులో అనేక సబ్జెక్టులు ఉన్నా కాని వాటిలో ఒకటి విశేషంగా ఉంటుంది, అలాగే సర్వశక్తులూ అవసరమే. కాని, ఈ శక్తులలోకెల్లా అన్నింటికన్నా శ్రేష్ఠమైన శక్తి ఏది? అది ఎంతో అవసరము, అది లేకుండా మహారథులుగా లేక మహావీరులుగా అవ్వడం కష్టము. నిజానికి అన్నీ అవసరమే. ఒకదానికి మరొకదానితో సంబంధం ఉంటుంది. అయినా కాని సర్వశక్తులను సమీపంగా తీసుకువచ్చే నెంబర్ వన్ శక్తి ఏది? (పరిశీలనా శక్తి).

           సెల్ఫ్ రియలైజేషన్ (ఆత్మపరిశీలన) చేసుకోవడం కూడా పరిశీలనా శక్తియే. సెల్ఫ్ రియలైజేషన్ అంటేనే తమనుతాము పరిశీలించుకోవడము లేక తెలుసుకోవడము. ఎప్పుడైతే మొదట బాబాను గుర్తించగలరో అప్పుడే వారిని తెలుసుకోగలరు. ఎప్పుడైతే వారిని గుర్తిస్తారో అప్పుడే వారికి సమీపంగా రాగలుగుతారు లేక సమానంగా అవ్వగలుగుతారు. పరిశీలించే శక్తి నెంబర్ వన్ శక్తి. ఈ పరిశీలించడమునే సామాన్య పదాలలో గుర్తించడము అని అంటారు. మొట్టమొదటి జ్ఞానపు ఆధారము బాబాను గుర్తించడము. ఈ విషయం యొక్క కర్తవ్యము జరుగుతోంది అని గుర్తించడము. మొదట పరిశీలించే శక్తి అవసరము. పరిశీలించే శక్తిని నాలెడ్జ్ ఫుల్ స్థితి అని అంటారు.

           పరిశీలించే శక్తి యొక్క విస్తారం ఏమిటి మరియు దాని నుండి ఏయే ప్రాప్తులు లభిస్తాయి? ఈ విషయంపై పరస్పరం చర్చించుకోవచ్చు. పరస్పరంలో సమానమైనవారు ఆడుతుంటే ఆ ఆటలో ఆనందం కలుగుతుంది. ఆ ఆటలలో కలుసుకోవడం కూడా జరిగిపోతుంది. ఈ ఆటలో కూడా పరస్పరం ఆడుతూ ఆడుతూ స్నేహితులుగా అయిపోతారు. అదేమో స్థూలమైన ఆట. ఇక్కడ కూడా ఆటలలో ఆత్మల సామీప్యత యొక్క మిలనము జరుగుతుంది. ఆత్మల సంస్కార స్వభావాల మిలనము జరుగుతుంది. ఆట ఆడే సహచరులు చాలా పక్కాగా ఉంటారు. జీవితాంతం వరకు తమ తోడును నిర్వర్తిస్తారు. ఆత్మిక ఆటతో పాటు అంతిమం వరకు పరస్పరంలో కలుసుకుంటూ ఉంటారు, కావుననే ఈ మిలనానికి గుర్తుగా 'మాల' తయారుచేయబడి ఉంది. అన్ని విషయాలలో ఎప్పుడైతే అంతిమంలో పరస్పరము సమీపంగా అయిపోతారో, మిలనము జరుగుతుందో అప్పుడు మణి మణితో కలిసి మాలగా తయారవుతుంది. ఈ మిలనానికి గుర్తు మాల. అచ్ఛా!

Comments